(ఇటీవల విడుదలైన  పాణి  నవల ‘అనేకవైపుల’కు రాసిన ముందుమాటలోంచి కొన్ని భాగాలు)

అనేక ఉద్వేగాలతో పాణి రాసిన ‘అనేక వైపుల’ నవల చదవడమంటే నేర్చుకోవడమే. జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో యుద్ధాలు, అంతర్యుద్ధాలు తీవ్రమవుతున్న వాతావరణం ఇది. సామ్రాజ్యవాదం ప్రపంచవ్యాప్తంగా పీడిత ప్రజల మీద క్రూరమైన అణచివేత ప్రయోగిస్తున్నది. ప్రజా ప్రతిఘటన కూడా వీరోచితంగా సాగుతున్నది. మన దేశంలో యాభై సంవత్సరాలుగా ప్రజలు అన్ని రకాల దోపిడీ పీడనలకు వ్యతిరేకంగా పోరాడుతూ యుద్ధరంగంలో ఉన్నారు. అనేక రకాల అణచివేతలకు దాటుకొని ముందుకు పోతున్నారు.

ఇటువంటి ఉద్రిక్త ఉద్విగ్న హింసాత్మక వాతావరణంలో ఈ నవల రూపొందింది.

‘చదవడం అంటే నేర్చుకోవడమే. అమలు పరచడమంటే నేర్చుకోవడమే. అందులోనూ నేర్చుకోవడానికి అతి ముఖ్యమైన పద్ధతి యుద్ధం ద్వారానే యుద్ధ నైపుణ్యాన్ని నేర్చుకోవడం. పాఠశాలకు వెళ్లడానికి వీలు లేని వాళ్లు యుద్ధంలో పాల్గొని యుద్ధం చేయడం ద్వారా యుద్ధ నైపుణ్యాన్ని నేర్చుకోగలుగుతారు. అది ముందుగా నేర్చుకొని ఆ తర్వాత నిర్వహించేది కాదు. నిర్వహిస్తూ నేర్చుకోవాల్సింది.  నిర్వహించడమంటేనే నేర్చుకోవడం’ అని మావో అంటాడు.   

ఈ నవల ఒక నిర్దిష్ట కాలాన్ని తీసుకొని రాసినప్పటికీ, భవిష్యత్‌ నిర్మాణం మీద కేంద్రీకరించింది.   ‘అనేక వైపుల’ ఈ దశ రాయలసీమ ఉద్యమంలో భాగంగా రాయలసీమ జెండా రూపొందించుకోవాలనే ఒక ఆలోచనతో 2014 ఆగస్టులో ఆరంభమవుతుంది.

ఆ సమయంలో సాధన అనే కార్యకర్త రాయలసీమ ఉద్యమంలోకి వస్తుంది. కర్నూలు పట్టణంలోని ఒక దళిత వాడలో సరోజ అనే విప్లవకార్యకర్త కూతురుగా పుట్టి, ఆ తర్వాత మరో రెండు కుటుంబాల్లో పెరిగి పెద్దగై, తన తల్లి పుట్టి పెరిగిన గడ్డమీదికి వెళ్లి తన మూలాలను తెలుసుకునే ప్రయాణం ఆరంభిస్తుంది. సాధన ఏడెనిమిదేళ్ల వయసు ఉన్నప్పుడే కన్నతల్లి నల్లమల విప్లవోద్యమం నుంచి దండకారణ్యం వెళ్లి అక్కడి పోరాటంలో అమరురాలైంది.

సాధన రాయలసీమ ఉద్యమ కార్యకర్తగా తన చుట్టూ ఆవరించి ఉన్న సమాజాన్ని అధ్యయనం చేయడం ప్రారంభిస్తుంది.  రాయలసీమ సామాజిక శక్తుల సంక్లిష్ట చిక్కుముళ్లతో సహా నూతన ప్రజాస్వామిక విప్లవ ఉద్యమంలోని గత వర్తమానాల మధ్య చిక్కుకపోయిన అనేక సమస్యలను మానవ సంబంధాల, అనుభవాల ఉద్వేగపూరిత జీవితాన్ని పాణి పొరలు పొరలుగా చిత్రించాడు. 

ఇది మారుతున్న ప్రపంచం. దీన్ని సమస్త మానవ సంబంధాల్లో చూసి ఎట్లా మారుతున్నదో, ఇంకా ఎట్లా మారడానికి అవకాశం ఉన్నదో చెప్పడమే ఈ నవల సారాంశం.   స్తబ్దతకు లోనైన సమాజంలో జరిగే ఘర్షణకు చైతన్యవంతమైన ఆచరణ కావాలి. అలాంటి ఆచరణ వల్లనే మానవ సంబంధాలు పాత భూస్వామిక విలువల నుంచి కొత్త ప్రజాస్వామిక సంబంధాల్లోకి చేరుతాయి. అప్పుడు జరిగే సంఘర్షణను పాణి సమర్థవంతంగా చిత్రించాడు. అలాగే పితృస్వామికి సామాజిక సంబంధాలలో నుంచి కొత్తగా మారుతున్న స్త్రీ పురుష సంబంధాలను, వాటి వెనుక ఉండే సంఘర్షణలను చిత్రించాడు. ఈ క్రమంలో తాత్కాలిక స్తబ్దతకు లోనైనా సమాజంలోని ఒత్తిడి కదలికను తీసుకొస్తూనే ఉంటుంది. అట్లాగే సమాజంలో మరో చోట జరుగుతున్న నూతన ప్రపంచ నిర్మాణ ప్రయత్నం కూడా మొత్తంగా మానవ సంబంధాలను ప్రభావితం చేస్తుంటుంది. దాన్ని కూడా ఈ నవల పొడవునా పాణి చిత్రించాడు. ఈ రెండు ప్రపంచాల భాష, వ్యక్తీకరణ వేరు. ఈ తేడాను జాగ్రత్తగా పట్టుకొని స్థలకాలాలకు, పాత్రలకు తగినట్లు రాశాడు. చాలా మామూలు మనుషులు విప్లవంలోకి వెళ్లాక కొత్త మనుషులుగా ఎట్ల మారేదీ ఒక్కో పాత్రను రచయిత చాలా జాగ్రత్తగా నిర్మించాడు. 

 అనేకవైపుల నవల యుద్ధం కేంద్రంగా నడిచింది. ఈ యుద్ధానికి దోహదం చేసే వివిధ రంగాల ప్రజా పోరాటాలు, అనేక పోరాట రూపాలు, ఐక్య సంఘటనల ప్రాధాన్యాన్ని జైలు నుంచి విడుదలై వచ్చిన ప్రధాన్‌ తిరిగి మైదాన ప్రాంత ఉద్యమంలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తాడు. అస్తిత్వ ఉద్యమాల్లో వచ్చిన మార్పులను గ్రహించి, వాటిని అధ్యయనం చేసి, అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి ప్రభావం, సామ్రాజ్యవాద దేశాల్లోని సంక్షోభం, దేశంలోని హిందుత్వ ఫాసిజం కలిసి నడుస్తున్న మంద్రస్థాయి యుద్ధానికి వ్యతిరేకంగా క్షేత్రస్థాయి ప్రజా ఆకాంక్షలకు ఎక్కడికక్కడ తగిన పోరాట రూపం ఇవ్వాలనుకుంటాడు. అప్పటి దాకా ఆయన గడిరచిన ఉద్యమ అనుభవాలను, అవగాహనలను అన్నీ కలిసి మైదాన ప్రాంతంలో వివిధ సెక్షన్ల ప్రజా పోరాటాల నిర్మాణం గురించి చాలా ప్రయత్నం చేస్తాడు. యుద్ధంలో తట్టుకొని నిలబడ్డానికి అవసరమైన అన్ని నిర్మాణాలను, పోరాటాలను సిద్ధం చేయాలి. ఇవన్నీ యుద్ధంలో నేరుగానో, పరోక్షంగానో సహకరించాలి. ప్రధాన్‌ అనేక వైపుల వ్యక్తమవుతున్న సంఘర్షణలకు వాస్తవ రూపం ఇవ్వడానికి ప్రయత్నించాడు. నిర్బంధం వల్ల చెల్లాచెదరైపోయిన వ్యక్తులను సమీకరించే పనిలోకి దిగుతాడు. 

ఆయన చేపట్టిన పనిని భరించలేక రాజ్యం ఆయన్ను హత్య చేస్తుంది. ఈ నేపథ్యంలో సాధన, సుధ దండకారణ్యంలో ఉన్న నాయకత్వాన్ని కలవడానికి వెళతారు. అక్కడ సాధన కన్నతండ్రి ఉంటాడు. ఆ సందర్భంగా ప్రధాన్‌ ఎంచుకున్న పనిని ముందుకు తీసికెళ్లాలనే నిర్ధారణకు వస్తారు. అప్పుడు రఘును కూతురు అడుగుతుంది. ‘‘నాన్నా నేను ఎప్పుడైనా గుర్తు వస్తానా?’’ అని. దానికి అతను అంటాడు. ‘‘జ్ఞాపకాలు, తలపోతలు, భావోద్వేగాలు, ఏవీ సొంతానికి మిగలని దశకు విప్లవం తీసికెళుతున్నది. అదే దాని అద్భుతశక్తి’’ అంటాడు. ఎంతో కాలంగా చూడాలని అనుకున్న తండ్రి ఇప్పుడు తన ఒక్కదానికే ఈ మాటలు చెబుతున్నట్లు సాధనకు అనిపించదు. ఆయన ప్రేమ, యుద్ధం విశ్వజనీనమైనవని అర్థం అవుతుంది.

ఆ సందర్భంలో రఘు మాట్లాడుతూ ‘‘ఈ రోజు నీవూ నేనూ ఈ కారడవిలో ఇట్లా మాట్లాడుకుంటున్నాం కదా. తండ్రీ కూతుళ్లం కదా. ఎవరో కన్నారు. మరెవరో బాల్యాన్ని సంరక్షించారు. ఇంకెవరో పెంచి పోషించారు. తిరిగి తిరిగి అటూ ఇటూ లక్షల బలగాలు మోహరించిన ఈ యుద్ధ క్షేత్రంలోకి ఇప్పుడిలా నీవు వచ్చావు. ఈ దేశ విప్లవం గురించి, దాని భవిష్యత్తు గురించి మాట్లాడుకుంటున్నాం చూడు. ఇదెంత అద్భుతమైనది? ఇప్పుడు ఇది ఈ దేశంలో చాలా మామూలు విషయం. విప్లవం అంతగా ఎదిగింది’’ అంటాడు.

చాలా విస్తృతమైన ఈ నవల సారమంతా రఘు చెప్పిన ఈ మాటల్లో ఉన్నది. ఒక అద్భుతమైన విషయం మామూలు విషయంగా సాధన అనుభవంలోకి రావడంలో ఉన్నది. దీంతో ఆమె తనలోని స్వీయాత్మక ఉద్వేగాల నుంచి బైట పడుతుంది. విప్లవాన్ని, తనను తాను తెలుసుకోవాలని రాయలసీమ ఉద్యమంలోకి వెళ్లిన సాధనకు స్వీయాత్మకతను రద్దు చేసుకున్నప్పుడే తాను ఏమిటో తెలుస్తుందని అర్థమవుతుంది. అప్పుడే ఈ ప్రపంచాన్ని మార్చే విప్లవోద్యమం కూడా అర్థమవుతుందని తెలుస్తుంది.

నవలలోకి ప్రధాన్‌, రఘు, మోహన్‌ అనే విప్లవ నాయకుల ప్రవేశంతో ‘అనేక వైపుల’ అనే మాటకు ఉన్న అర్థం పాఠకులకు మరింతగా తెలుస్తుంది. అనేక వైపుల విప్లవోద్యమ పరిణతి, పరిమాణాత్మక మార్పు గుణాత్మక మార్పుగా మారడం, ఒక గెంతులోకి మారడం గురించి, దానికి ఉన్న అవకాశాల గురించి చెప్పడం ఈ నవల ప్రత్యేకత. అది అన్ని రకాల సంప్రదాయక ముగింపులన్నా పూర్తి కొత్తది. ఈ చైతన్యంతో సాధన తన కార్యరంగంలోకి తిరిగి వెళుతుంది.

సంప్రదాయక ముస్లిం కుటుంబానికి చెందిన సుల్తానా కొడుకు గెరిల్లా సైన్యానికి నాయకురాలిగా ఉన్న హిడ్మెను వివాహం చేసుకుంటాడు. ఆయన అమరుడయ్యాక హిడ్మె అరెస్టయి విడుదవుతుంది. అప్పుడు ఆమె రసూల్‌ తల్లిని చూడాలని అనుకుంటుంది. ఆ కలయికలో సుల్తానా అన్ని సంప్రదాయాలను దాటి ఒక ఆదివాసీ పిల్లను తన కోడలుగా భావిస్తుంది. ఇది విప్లవోద్యమం వల్లనే సాధ్యమైంది. నవల చివరలో సదాశివం చనిపోయినప్పుడు సాధన ‘భౌతికంగా ఆయన చరిత్రతో ఉండడు. చరిత్ర కొనసాగుతూనే ఉంటుంది. అందులో నీవూ, నేనూ, మనందరం ఉంటాం’ అంటుంది.

‘అనేక వైపుల’ నవల మన స్థల కాలాల వర్తమాన చిత్రణ మాత్రమే కాదు. రూపొందుతున్న భవిష్యత్‌ చరిత్ర. భవిష్యత్‌ గురించి గతితార్కికంగా చిత్రించిన నవల. అందువల్ల తీవ్రమైన భావోద్వేగాలతో నవల నడిచింది. అక్కడి నుంచి మానవ ఆచరణ మీద కేంద్రీకరించింది. ఉద్వేగాలు`ఆచరణ`సిద్ధాంత జ్ఞానం అనే క్రమంలో  మనుషుల మధ్య, మనుషులకు ` వ్యవస్థకు ఉన్న అనేక సంఘర్షణలు ఈ నవలను ముందుకు నడిపించాయి. ఉన్న స్థితిని చెప్పడం కాకుండా రూపొందుతున్న క్రమాలను అనేక వైపుల చెప్పడం ఈ నవల ప్రత్యేకత. అందులోని ప్రయాస, దు:ఖం మనల్ని నిలువనీయవు. వీటన్నిటితోపాటు లోతైన తాత్విక రాజకీయ పరిశీలనలు ఉన్నాయి. వాస్తవికతను సమస్త చలనాల్లో గ్రహించే ప్రయత్నం చేసింది. వీటన్నిటి వల్ల కొత్త శిల్పంతో ఈ నవల నిర్మాణమైంది. ఇది మరే ఇతర నవలా శిల్పాన్ని పోలినది కాదు. అనేక వైపుల రూపొందుతున్న విప్లవోద్యమ ఆచరణ శిల్పం ఇది. అనేక వైపుల నుంచి వ్యక్తులు సమూహాలుగా మారే జీవన క్రమాల్లోని కళాత్మక శిల్పం ఇది. సన్నివేశాల ఎత్తుగడ, ముగింపు పూర్తిగా మన విప్లవోద్యమ స్థలకాలాలకు సంబంధించినవి. మొత్తంగా ఇలాంటి శిల్పాన్ని మనం రష్యన్‌ నవలల్లో మాత్రమే చూడగలం. ఇది మన విప్లవోద్యమంలో నాలుగో తరం నవల.

అందువల్ల ఇది అందరూ తప్పక చదవాల్సిన నవల. ముఖ్యంగా విప్లవోద్యమంలోకి వస్తున్న అయిదో తరం అధ్యయనం చేయాల్సిన నవల.

One thought on “స్వీయాత్మకత నుంచి సమిష్టి ఆచరణలోకి

  1. మా సత్యం
    పాణి రాసిన
    ‘అనేకవైపులా’
    భారతదేశ దోపిడీ పరిపాలకులకు వ్యతిరేకంగా, కార్పొరేట్ సమూహాలకి, హిందూత్వ మతోన్మాదాన్ని ప్రతిఘటిస్తూ,వర్గ రహిత సమాజ నిర్మితికై తమ అమూల్య ప్రాణాలను తృణప్రాయంగా అర్పిస్తున్న విముక్తి పోరాటాల యుగంలో క్రియాశీల సామాజిక కర్తవ్యంతో అత్యంత భయంకరంగా ‘ఆపరేషన్ కగార్’ అమలవుతున్న పరిస్థితిలో కొత్త చూపుతో పాణి గతి తార్కిక చారిత్రక భౌతిక వాద కోణంలో వాస్తవిక సంఘటనలతో పాటు
    కల్పానికతను మిళితం చేస్తూ రచించిన
    ‘అనేక వైపులా’నవల చారిత్రక అవసరం.
    ప్రతి ఒక్కరూ చదివి చదివించాల్సిన నవల.
    రాజ్యహింసను, సమకాలపు ఆశల్ని, నిరాశల్ని,విప్లవ నేపథ్యాన్ని,అమరుల త్యాగాన్ని కూడా చిత్రీకరిస్తుంది.
    ప్రపంచ నవలా సాహిత్యం లో
    ‘అనేక వైపులా’నవల ఒక మలుపు.
    ఈ సందర్భంగా చరిత్రకారుడు
    ఇ.హెచ్.కార్ అన్న మాటలు గుర్తు చేసుకుంటూ
    “చరిత్రను చదవడానికి ముందు చరిత్రకారుణి గురించి తెలుసుకోండి; చరిత్రకారుణి గురించి తెలుసుకోవడానికి ముందు అతడు జీవించిన చారిత్రక రాజకీయ వాతావరణాన్ని అధ్యయనం చేయండి”.
    అన్న మాటలు పాణి కి చాలా దగ్గరగా వర్తిస్తాయి.
    పాణి పాత్రికేయుడే కాదు చరిత్రకారుడు,
    విమర్శకుడు, పరిశోధకుడు,ఉద్యమ కార్యకర్త కూడా.
    విశ్వజనీయమైన దృక్పథముతో అనేకవైపులా ప్రపంచ నవలా చరిత్రలో ఒక భాగంగా సమగ్ర రూపంతో గ్రంథస్తం చేయడానికి ప్రయత్నం చేశారు.
    పాణి తనకు తాను “ఎందుకు” అన్న ప్రశ్నను నిరంతరం వేసుకుంటూ కొత్త విషయాలను గురించి,
    సంఘటనల గురించి ప్రశ్నించుకుంటూ, సమాధానాలను సమకూర్చుకుంటూ ఆలోచనను విస్తృతం చేసుకుంటూ గమ్యం “ఎక్కడికి” అన్న ప్రశ్న కూడా ఇమిడి ఉంది.
    నవలలోని పాత్రలు మన ముందు సజీవంగా కదలాడుతూ ఉంటాయి, పాఠకులను ఉద్విగ్నతకు, ఆవేదనకులోను చేస్తూ వెక్కివెక్కి ఏడిపించేస్తాయి.
    ఇందులోని వాస్తవికత ఒకసారి కల్పనను అధిగమిస్తుంది; మరోసారి వాస్తవాన్ని కల్పనలను మిళితం చేస్తుంది.;
    కథనంలో సహజ వర్ణనకు ప్రధాన స్థానం కల్పించారు.

Leave a Reply