భారత ప్రభుత్వ ఇంటెలిజెన్స్ సంస్థలు భీమా కోరెగాన్ కేసులో వ్యవహరించినట్టుగానే ఈ శాన్య రాష్ట్రాల్లో కూడా అసమ్మతిని అణచివేయడానికి దారులు వెతుకుతున్నాయి. విద్యార్థి నాయకులను, మానవ హక్కుల కార్యకర్తలను భీమా కోరెగాన్ కేసులో లాగానే కుట్రకేసుల్లో ఇరికిస్తున్నాయి. దేశంలోని వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న వారంతా సీపీఐ(మావోయిస్టు)ల కోసం పనిచేస్తున్నారని, ‘ఉత్తర ప్రాంతీయ కమిటీ ని ’ (నార్తన్ రీజినల్ బ్యూరో) ఏర్పాటు చేయాలని భావిస్తున్నారని ఎన్ ఐ ఏ ఆరోపిస్తోంది. రైతుల కోసం, అట్టడుగు వర్గాల వారి కోసం, విస్థాపన సమస్యకు గురైన వారి కోసం పనిచేస్తున్న వారిని భారత ప్రభుత్వం అరెస్టు చేసింది. సీపిఐ (మావోయిస్టు) తరపున వీళ్ళు ‘ఉత్తర ప్రాంతీయ కమిటీ ’ ఏర్పాటు కోసం పనిచేస్తున్నారని ఆరోపిస్తూ ఉత్తర భారత దేశంలో ఈ ఏడాది ఆగస్టు 30 వతేదీన పౌర సమాజంపై మరొక దాడి చేసింది. వాస్తవానికి ఉత్తర ప్రదేశ్ , హర్యానా, పంజాబ్ లలో పీడనకు, దోపిడీకి గురవుతున్న విస్తృత ప్రజాబాహుళ్య విముక్తి కోసం పోరాడుతున్న హక్కుల కార్యకర్తలపై ఎన్ఐఏ కేసులు పెడుతూ, వారిని భయభ్రాంతులకు గురిచేసింది. రైతుల ఆందోళనలో కీలకంగా పనిచేసిన పంజాబ్ రాష్ట్రం భటిండాలో ఉంటున్న రైతు నాయకుడు సుఖ్విందర్ కౌర్ ఇంటిపైన ఎన్ఐఏ దాడి చేసింది. ఢిల్లీలోని షంభు సరిహద్దులో జరిగుతున్న రైతుల నిరసనోద్యమంలో ఆమె కీలకమైన నాయకురాలు. ఆమె ఇంటి పైన ఎన్ఐఏ అనేక గంటలపాటు చేసిన దాడిలో ఆమె పుస్తకాలను పరిశీలించి, ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకుంది. ఆమె పైన ఎన్ఐఏ ఈ వేధింపులను మానుకోవాలని కోరుతూ, ఆ సమయంలో రైతులు ఆమె ఇంటి ముందు పెద్ద ఎత్తున ధర్నా చేశారు. అదే సమయంలో చండీఘడ్ లోని మానవ హక్కుల కార్యకర్త, న్యాయవాది మన్ దీప్ సింగ్, అజయ్ కుమార్ ఇళ్ళ పైన కూడా ఎన్ఐఏ దాడులు చేసింది. దేశ వ్యాపితంగా, ముఖ్యంగా పంజాబ్ లో అనేక మంది రాజకీయ ఖైదీలను విడుదల చేయించడానికి ఈ న్యాయవాదులు పనిచేస్తున్నారు. ఈ రాజకీయ ఖైదీలు, మరి కొందరువ్యక్తులు నిషేధిత మావోయిస్టు పార్టీ సభ్యులని లేనిపోని ముద్రవేసింది. వీరంతా హక్కుల కోసం పనిచేస్తున్న మానవ హక్కుల కార్యకర్తలు, రైతు నాయకులు. వీరిని తప్పుడు కేసుల్లో ఇరికించి జైల్లో పెట్టారు. వీరిపైన తప్పుడు కేసులు పెట్టి భయభ్రాంతులకు గురిచేయడం ద్వారా రాజకీయ ఖైదీలు న్యాయవాదులను నియమించుకునే అవకాశం లేకుండా ప్రభుత్వం చేయదలిచింది. న్యాయ విచారణ కోరే హక్కు లేకుండా చేయడానికి, వారికి మద్దతుగా కేసులు వాదించకుండా ఉండడానికి భయపట్టే తన చర్యల ద్వారా సంకేతాలను పంపిస్తోంది.
ఉత్తర ప్రదేశ్ లోని అల్హాబాద్ లో అందరికి తెలిసిన ఇంక్విలాబ్ ఛాత్రమోర్చా అనే విద్యార్థి సంఘం పైన ఎన్ఐఏ దృష్టి సారించింది. ఇంక్విలాబ్ ఛాత్రమోర్చా కు చెందిన విద్యార్థి నాయకుడు దేవేంద్ర ఆజాద్ ఇంటిపైన ఎన్ఐఏ దాడి చేసింది. ఉత్తర్ ప్రదేశ్ లోని ఆగ్రాకు చెందిన దేవంద్ర ఆజాద్ రాజనీతి శాస్త్రంలో ఎంఏ పూర్తి చేసి, ప్రస్తుతం అలహాబా ద్ నాగరిక సమాజ్ కార్యవర్గ సభ్యుడుగా ఉన్నారు. మరో ముగ్గురితో కలిసి ఉంటున్న అతని గదిపైన ఎన్ఐఏ దాడి చేసింది. సమాజంలో ప్రజాస్వామికీకరణ కోసం పనిచేస్తున్న విద్యార్థి సంఘాన్ని భారత ప్రభుత్వం ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్ లో ఎన్ఐఏ ను ఉపయోగించుకుని భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఎన్ఐఏ దాడులకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఉత్తర్ ప్రదేశ్ వారణాసిలోని భగత్ సింగ్ ఛాత్ర ఏక్తా మంచ్ పైన కూడా గతంలో ఎన్ఐఏ దాడులతో భయభ్రాంతులకు గురిచేసింది. ఈ సంస్థతో పాటు దేవంద్ర ఆజాద్ పైన కూడా ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టింది. భారత ప్రభుత్వం మావోయి జాన్ని నేరంగా పరిగణిస్తోంది. ఇలా నేరంగా పరిగణించడం భావప్రకటనా స్వేచ్చ అనే ప్రజాస్వామిక హక్కుకు భంగకరం. మావోఇజం గురించి ప్రచారం చేసిన వారిని, అదేమిటో తెలియని వాళ్ళ పైన కూడా, ప్రభుత్వం పట్ల నిరసన తెలిపే వారందరిపైన మావో ఇస్టులనే ముద్ర వేస్తున్నారు. దేవేంద్ర ఆజాద్ విషయంలో కూడా ఇదే జరిగింది. ప్రజాస్వామిక సమాజం కోసం పనిచేస్తున్న దేవేంద్ర ఆజాద్ ను మానసికంగా వేధించారు. అతని నుంచి అనేక పుస్తకాలతో పాటు దస్తక్ అనే పత్రికను కూడా స్వాధీనం చేసుకున్నారు. వార్తా పత్రికలో రాయడంలో భాగంగా లడక్ లోని సోనామ్ వాంగ్ చుక్ లో ని ఉద్యమం గురించి కూడా అతనా పత్రికలో రాశాడు. ఆదాని చర్యలను విమర్శిస్తూ రాసిన చిన్న పుస్తకాన్ని కూడా అతని పుస్తకాల నుంచి స్వాధీనం చేసుకున్నారు. అక్కడి నుంచి ‘మసాలా’ న్యూస్ పేపర్ ను కూడా స్వాధీనం చేసుకోవడం గమనార్హం. రాజ్యానికి వ్యతిరేకంగా ఏ గొంతు వినిపించినా, ఆ సాహిత్యాన్ని మావోయిష్టు దిగా ముద్రవేస్తున్నారు.
హర్యానాలోని సోనిపేటలో ఉన్న మానవహక్కుల కార్యకర్త , న్యాయవాది పంకజ్ త్యాగి ని కూడా ఇలాగే చేశారు. ఎన్ ఐ ఏ అధికారులు తెల్లవారుజామున 5 గంటలకు అతని ఇంటిపైన దాడి చేసి, మూడు గంటలపాటు గాలింపు చర్చలు చేపట్టి, అతన్ని అదుపులోకి తీసుకుని సోనిపేట పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్ళారు. తరువాత పంకజ్ త్యాగిని విడుదల చేసినప్పటికీ, దేవేంద్ర ఆజాద్ తో పాటు ప్రశ్నించడానికి అతన్ని కూడా తీసుకెళ్ళడాన్ని గమనిస్తే, ఎన్ఐఏ కొందరిని వేధించడమే ధ్యేయంగా పెట్టుకుందని స్పష్టమవుతోంది.
వీరంతా మావోయిస్టులకు లేదా ఓజీడబ్లు లకు రహస్యంగా పనిచేస్తున్న కార్యకర్తలుగా ముద్రవేశారు. ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రజాస్వామిక హక్కుల కార్యకర్తలకు కూడా భారత ప్రభుత్వం గతంలో వీటిని అంటగట్టి దాడి చేసింది. ఒకరినొకరు కనీసం చూసుకోను కూడా చూసుకోని ఈ కార్యకర్తలంతా కలిసి ఉత్తర భారత ప్రాంతీయ కమిటీ ని ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తున్నట్టు ఆరోపించారు. ఢిల్లీ, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ లలో మావోయిస్టుల మనుగడ కోసం వీరంతా కలిసి పనిచేస్తున్నారని అరెస్టు చేయడానికి ఎన్ ఐ ఏ ఒక కట్టుకథను అల్లింది. ఎవరైనా సరే భారత ప్రభుత్వం పట్ల అసమ్మతితో ఉంటే, వారందరినీ అరెస్టు చేయడానికి సిద్ధమవుతోందని దీని వల్ల స్పష్టమవుతోంది. విద్యార్థి సంఘ నాయకులకు, హక్కుల కార్యకర్తలకు ‘ఉత్తర భారత ప్రాంతీయ కమిటీ ’ కేసుతో భారత ప్రభుత్వం ముడిపెట్టింది. పీయూసీఎల్ తరపున పనిచేస్తున్న సీమా ఆజాద్, మనిషా ఆజాద్ వంటి హక్కుల కార్యకర్తలకు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడని ముద్రవేసిన ప్రమోద్ మిశ్రాతో సంబంధాలున్నాయని ఆరోపించారు. ఈ ప్రజాస్వామిక హక్కుల కార్యకర్తలకు కులవ్యతిరేక కార్యకర్త బిందా తో, విస్థాపన వ్యతిరేక కార్యకర్త రోహిత్ కు సంబంధాలుండడం అసంభవం. వీరంతా ఒకదానికొకటి సంబంధం లేని సంస్థల్లో, భిన్న రంగాల్లో పనిచేస్తున్న వారు.
రాజ్యహింసకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ, మావోయిస్టులని ముద్ర వేసి వేధించే ప్రభుత్వం చర్యలను ఖండించాలి. కట్టుకథలతో పెట్టే ఎఫ్ .ఐ. ఆర్ లను ఉపసంహరించుకోవాలని, ప్రశ్నించడం పేరుతో కార్యకర్తలను వేధించడం మానుకోవాలని కోరుతున్నాం. ‘ఉత్తర ప్రాంతీయ కమిటీ ’ని ఏర్పాటు చేస్తున్నారనే పేరుతో, మావోయిస్టు పార్టీకి క్షేత్ర స్థాయి కార్యకర్తలుగా పనిచేస్తున్నరనే ఆరోపణలతో కార్యకర్తలను అరెస్టు చేసి వేధించడానికి ముగింపు పలకాలని కోరుతున్నాం.
నిర్వహణ బృందం
(ఏఐఆర్ఎస్ ఓ, ఏఐఎస్ఏ, ఏఐఎస్ ఎఫ్, ఏపీసీ ఆర్, ఏ ఎస్ ఏ, బీఏ పీఎస్ ఏ బీఏబీయూ, బీఏ ఎస్ ఎఫ్, బీఎస్ఎం, బీమా ఆర్మీ, బీఎస్ సీఈఎం, సీఈఎం, కలెక్టివ్, సీఆర్ పీపీ, సీఎస్ ఎం సీటీఎఫ్, డీఐఎస్ ఎస్ సీ, డీఎస్ యు, డీటీఎఫ్, ఫోరం ఎగైనెస్ట్ రిప్రెషన్ తెలంగాణ, ఫ్రెటర్నిటీ, ఐఏపీఎల్, ఇన్నోసెన్స్ నెట్ వర్క్, కర్ణాటక జనశక్తి, ఎల్ఏఏ, మజ్దూర్ అధికార్ సంఘటన్, మజ్దూర్ పత్రిక, ఎన్ ఏ పీఎం, నజారియా, నిషాంత్ నాట్యమంచ్, నౌరుజ్, ఎన్ టీయూఐ, పీపుల్స్ వాచ్, రిహాయ్ మంచ్, సమాజ్ వాది జనపరిషద్, సమాజ్ వాది లోక్ మంచ్, బహుజన్ సమాజ్ వాది మంచ్, ఎస్ ఎఫ్ ఐ, యునైటెడ్ పీస్ అలయన్స్, డబ్త్యు ఎస్ ఎస్, వై4ఎస్)
తెలుగు : రాఘవ