స్టాన్ స్వామి మరణం చాలా ఆందోళన కలిగించే సమస్యలను లేవనెత్తుతోది

ఫాదర్ స్టాన్‌స్వామి కస్టడీ మరణం గురించి  వివిధ ప్రతిస్పందనలు వచ్చాయి. ఆదివాసీల, పీడిత ప్రజల హక్కుల కోసం పనిచేసే ఎనభై ఏళ్ళ వయసున్న సామాజిక కార్యకర్త కార్యకలాపాల గురించి తెలిసిన వారు అతను మరణానికి ఎంతో బాధపడుతున్నారు. చట్టాన్ని అమలుచేసే యంత్రాంగం, జైలు పరిపాలనా అతని పట్ల వ్యవహరించిన కఠినమైన, అమానవీయ ప్రవర్తన సంబంధీకులకు ఎంతో వేదన కలిగించింది.

కానీ ప్రాసిక్యూషన్ చేసిన “గంభీర, తీవ్రమైన” ఆరోపణలమీద ఆధారపడి నిర్దిష్ట న్యాయస్థానం తీవ్ర అనారోగ్యంతో ఉన్న జీసట్ ప్రీస్ట్‌‌కి బెయిల్ నిరాకరించడమనేది మరింత వేదన కలిగించే విషయం.

దేశ, విదేశాల నుంచి- అంతర్జాతీయ సంస్థల నుండి కూడా తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంటున్న ప్రభుత్వం, స్వామికున్న రాజ్యాంగ హక్కులను నిరాకరించలేదని, అతని నేరాలు తీవ్ర స్వభావాన్ని కలిగి వున్నాయి కాబట్టి కోర్టు బెయిల్ నిరాకరించిందని సమర్థించుకోంటోంది.

ఈ రెండు విభిన్న అభిప్రాయాలతో పాటు, తీవ్ర మితవాదానికి  సంబంధించిన అంతర్జాల యోధుల మూక, ఫాదర్ స్టాన్ స్వామి మరణానికి సంతోషిస్తూ, ఏ మాత్రం సంకోచం లేకుండా అతని మరణం వల్ల “పీడ విరగడైంది ” అనీ, అంతకంటే దారుణమైన, ముద్రించలేని పదజాలాన్ని ఉపయోగించింది.

ఏమైనప్పటికీ , ఒక విషయం మాత్రం చాలా స్పష్టంగా ఉంది. చాలా మంది తటస్థ వ్యక్తులకు మరొక “విచారణ ఖైదీ” మరణిస్తే ఇంత అల్లకల్లోలమవడానికి గల కారణం ఏమిటో  తెలియదు. వారు, చారిత్రక నేపథ్యం గురించి లేదా స్పష్టంగా నివారించగల మరణమూ, సంబంధిత వివాదానికి దారితీసిన రాజకీయ అంతర్లీనాల గురించి ఏ మాత్రం తెలియని చిద్విలాసులు.

అందువల్ల, “ఎల్గర్ పరిషత్ కేసు”ను సరైన దృక్పథంలో చూడడానికి, ఫాదర్ స్టాన్‌స్వామి దురదృష్టకర మరణం గురించి చర్చించడానికి, మన రాజ్యాంగంలో ఒక సాధారణ పౌరుడి హక్కుల గురించి తలెత్తే ప్రశ్నలు, న్యాయవ్యవస్థతో సహా, ఈ వ్యవస్థలో అవి ఎంతవరకు భద్రంగా వున్నాయి అనే విషయాల్ని చర్చించడం అవసరం.

ఒక భారతీయ (హిందూ అని చదవాలి) శక్తి, ఒక ఆక్రమణదారుడు లేదా ఒక విస్తరణా విదేశీ శక్తి మధ్య జరిగే ప్రతి పోరాటాన్ని మాతృభూమిని రక్షించే పోరాటంగా, గొప్ప జాతీయతా ప్రదర్శనగా చూపించడం ఇటీవల ఒక ఫ్యాషన్‌గా మారింది.

చారిత్రక వాస్తవాలు చాలా వేరుగా వున్నాయి. ఇటీవలి కాలం వరకు భారతదేశం సుదీర్ఘ కాలంగా వున్న లేదా ఇటీవల వచ్చిన అనేక రాజ్యాలతో కూడిన ఒక ఉపఖండం. వాటి మధ్య జరిగిన యుద్ధాలు చాలా మటుకు తమ సరిహద్దులను కాపాడుకోవడానికి లేదా విస్తరించడానికి జరిగాయి కానీ, ఉనికిలో లేని ‘భారత మాత’ భావన కోసం కాదు. అందుకని, ఒక హిందూ రాజు ఇంకో రాజుతో పోరాడినప్పుడు, మతానికి ఎలాంటి పాత్ర వుండదు, అనేక మంది ముస్లిం రాజుల విషయంలో కూడా వాస్తవం యిదే.

ఇలాంటి స్థితిలో భీమా-కోరెగావ్ ప్రాంతంలోని దళితులు, అణగారిన కులాలు, అంటరానివారు, స్థానీయ ఆదివాసులను దారుణంగా హింసించే మత దురహంకార బ్రాహ్మణులైన మహారాష్ట్రలోని పేష్వాలకు వ్యతిరేకంగా ఆయుధాలు చేపట్టారు. బ్రిటీష్ రాజ్యం తమ ప్రణాళిక కొనసాగింపుగా, దళితులకు మద్దతునిచ్చింది. 1818 జనవరి 1 న కొరెగావ్‌లో జరిగిన యుద్ధంలో, పేష్వా బాజీ రావు II ఓడిపోయాడు, ఆ తరువాత బ్రిటిష్ వారు అక్కడ విజయస్తంభం నిర్మించారు.

పీడకులైన పీష్వాలకు వ్యతిరేకంగా విజయం సాధించడం దళితులకు గర్వకారణం. అందువల్ల, ప్రతి సంవత్సరం ప్రధానంగా మహర్ కులానికి చెందిన దళితులు జనవరి 1 వ తేదీన పీష్వాల వ్యతిరేక విజయ దినంగా జరుపుకుంటారు.

మొత్తం విషయానికి విచిత్రమైన మలుపు నిచ్చిన కొన్ని తీవ్రవాద హిందూ సమూహాలు ముందుకు రానంత వరకు ఇలా ఎన్నో ఏళ్లుగా జరుగుతోంది. హిందువులైన పీష్వాలు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడారు కాబట్టి, వారి ఓటమిని వేడుకగా జరుపుకోవడం దేశ వ్యతిరేక చర్య అవుతుందనేది వారి కథనం. తమను హింసిస్తున్న (భారతీయులే అయిన) పీష్వాలతో, దళితులు పోరాడుతున్నారనే విషయం వారికి పట్టదు. ఇందుకు బ్రిటిష్ వారు సహాయం చేశారు.

ఎప్పటి లాగానే 2018 జనవరి 1న వేలాది మంది దళితులు వేడుకలు జరుపుకునేందుకు భీమా-కోరెగావ్‌లో సమావేశమయ్యారు, ఈ వేడుకలను నిరసించడానికి తరలివచ్చిన రాడికల్ హిందూ సమూహాలు దళితులపై రాళ్ళు రువ్వడంతో, హింసాత్మకంగా పరిణమించిన ఘర్షణలో ఒక దళిత యువకుడు మరణించగా, మరికొందరు గాయపడ్డారు.

మర్నాడు అంటే 2018 జనవరి 2 న పింప్రి పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లో సమస్త్ హిందూ అఘాడి, శివ్ ప్రతిష్టాన్ హిందూస్తాన్ అనే రెండు సంస్థల నాయకులను హింస ప్రేరేపణకు కారణంగా పేర్కొన్నారు. అభియోగాలు మోపిన నాయకులలో ఒకరు మాజీ ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త. ఆ దశలో మావోయిస్టులకు అల్లర్లతో ఏ విధమైన సంబంధం వున్నట్టు చెప్పలేదు.

2018 జనవరి 8న పూణే పోలీసులు కొంతమంది దళిత, ఆదివాసీల హక్కుల కోసం పనిచేస్తున్న కార్యకర్తలపై ఎఫ్ఐఆర్ దాఖలు చేసినప్పుడు ఈ కేసు తలకిందులైపోయి ఒక విధంగా భారత దేశ వ్యాప్త పరిమాణాన్ని సంతరించుకొంది. 2017 డిసెంబర్ 31న పూణేలో ఎల్గర్ పరిషత్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఫాదర్ స్టాన్‌స్వామి, గౌతమ్ నవలఖా, ఢిల్లీ యూనివర్శిటీ అసోసియేట్ ప్రొఫెసర్ హనీ బాబుతో సహా చాలా మంది పాల్గొని, మర్నాడు భీమా కోరేగావ్ దగ్గర మూక హింసను ప్రేరేపించే కుట్రకు ప్రణాళిక వేశారని ఆరోపించారు. ఈ కేసును తరువాత నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చేపట్టింది.

తరువాత ఈ ప్రారంభ ఆరోపణని నిందితులు ప్రధానిని హత్య చేసే కుట్రలో కూడా పాల్గొన్నారని మార్చారు, చివరగా వారందరికీ  రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని బలవంతంగా కూలదోయడానికి కుట్ర చేస్తున్న నిషేధిత మావోయిస్టు సంస్థతో (వీరిని నక్సల్స్ అని కూడా పిలుస్తారు) సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు.

2020 అక్టోబర్ 8నాడు, రాంచిలో తన ఇంట్లో వున్న ఫాదర్‌స్టాన్ స్వామిని పైన పేర్కొన్న ఆరోపణలపై పూణేకు తీసుకెళ్లిన NIA తమ అదుపులో ఉంచుకొని, దిగువ కోర్టు నుండి బెయిల్ పొందడం అసాధ్యమయ్యే క్రూరమైన UAPA కింద కేసు పెట్టింది. ప్రీస్ట్, కార్యకర్త, ఎనభయ్యేళ్ళ వృద్ధుడైన ఫాదర్ స్టాన్‌స్వామికి అనేక సార్లు బెయిల్ నిరాకరించారు.

ఆసక్తికరమైన విషయమేమంటే , మూడేళ్ళు గడిచినా కూడా కోర్టు అభియోగాలను రూపొందించలేకపోయింది కాబట్టి ఈ కేసు విచారణ ఇంకా ప్రారంభం కానేలేదు.

జైలులో ఫాదర్ స్టాన్‌స్వామి తన పట్ల జరిగిన అమానవీయ వ్యవహారాన్ని భరించలేక చివరకు, హైకోర్టు జోక్యం చేసుకున్నాక ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరి, చికిత్స పొందుతూ మరణించాడు. ఇది అందరికీ తెలిసిన విషయమే కాబట్టి  పునరావృతం చేయాల్సిన అవసరం లేదు.

84 ఏళ్ల, అనారోగ్యంతో ఉన్న వ్యక్తిపై ఇటువంటి విపరీతమైన ఆరోపణలు ఎందుకు చేసారు? అతను  ప్రధానిని హత్య చేయడానికి కుట్ర చేసిన భయంకరమైన ఉగ్రవాది అని ఊహించగలమా?

బలహీనమైన శరీరంతో ఉన్న మనిషి ఉక్కు సంకల్పంతో జార్ఖండ్ ఆదివాసుల హక్కులను కాపాడటానికి చేసిన సుదీర్ఘ పోరాటంలోనే ఆ ప్రశ్నకు సమాధానం ఉంది. అయితే, ఆ క్రమంలో ఏ విధంగానైనా అణచివేయడానికి అవకాశం కోసం చూస్తున్న చాలా శక్తివంతమైన శత్రువులను తయారు చేసుకున్నాడు. చివరికి, వారు విజయం సాధించారు!

స్టాన్‌స్వామి మరణం మొత్తం న్యాయ నిర్వహణా వ్యవస్థకు సంబంధించిన అనేక ఆందోళన కలిగించే ప్రశ్నలను లేవనెత్తుతుంది. పోలీసులు ఒక సంఘటనను వడితిప్పి, నేరస్థులపై కాకుండా బాధితులపైనే కేసు పెట్టిన సందర్భం  యిదొక్కటే కాదు.

ఈ కేసులో కూడా కొన్ని మితవాద ఉగ్రవాద సంస్థలపైన పింప్రి పోలీసులు దాఖలు చేసిన అసలు ఎఫ్‌ఐఆర్ ఏమైందో ఎవరికీ తెలీదు. ఈ సంస్థల నాయకులెవరినైనా అరెస్టు చేసారా అంటే, ఊహించినట్లుగానే, ‘లేదు’ అనేదే సమాధానం.

నిందితులపై చేసిన ఆరోపణలను మార్చడం, జోడించడం చూస్తే వాటి వాస్తవిక ప్రాతిపదిక పట్ల ఎవరికైనా సందేహం కలగక మానదు. దళితులకు, ఇతరులకు మధ్య హింసను ప్రేరేపించడం నుండి, ప్రధానమంత్రిని హత్య చేయడానికి కుట్రను చేయడం నుంచి, మావోయిస్టులతో సంబంధాలుండడం వరకు అన్ని రకాల ఆరోపణలను నిందితులపై గుప్పించడాన్ని చూస్తే వారు ఎంత ప్రమాదకరమైనవారోనని చెప్పడానికి మాత్రమే అనిపిస్తోంది.

మూడేళ్ళయినా, యింకా అభియోగాలు రూపొందించలేదు!

“నిందితులపై ఆరోపణలు తీవ్రంగా ఉన్నందువల్ల” సంబంధిత కోర్టు స్వామి బెయిల్ దరఖాస్తులను తిరస్కరించింది. అయితే నిందితుడికి బెయిల్ నిరాకరించడానికి ఈ కారణం సరిపోతుందా? స్వామి సహ నిందితుల్లో ఒకరైన వరవరరావుకి (81) ఆరోగ్యం బాగా క్షీణించడంతో బెయిల్ దొరికింది.

దేశ వ్యతిరేక కార్యకలాపాల కోసం విచారించాలనుకునే నిందితుడిపై ప్రాసిక్యూషన్ “తీవ్రమైన” ఆరోపణలను మోపుతుంది అనేది స్పష్టం. ఎటువంటి అభియోగాలు మోపకుండా చాలా కాలం గడిచిపోయిన తరువాత కూడా, అటువంటి నిందితుడికి బెయిల్ మంజూరు చేయడం వల్ల, ప్రాసిక్యూషన్ కేసుకి ఏదైనా హాని కలుగుతుందా అనే విషయాన్ని కోర్టు పరిగణించాలి.

స్టాన్ స్వామి మరణంతో దేశ మనస్సాక్షి తగినంతగా కదిలిందో లేదో కానీ, న్యాయస్థానంలో రుజువు కోసం ఎదురుచూస్తున్న ఆరోపణలతో పాటు, పేదలను అణచివేయడానికి అధికారంలో వున్నవారు  ఉపయోగించే నిరంకుశ వ్యవస్థకు ఎదురుగా నిలబడే ధైర్యం చేయడమనే ఏకైక నేరం చేసిన వ్యక్తి రాజ్యాంగ హక్కులను పరిరక్షించడంలో మన వ్యవస్థ వైఫల్యాన్నిమాత్రం ఇది ఖచ్చితంగా వెలుగులోకి తెస్తుంది.

కస్టడీలో ఉన్నప్పుడు స్టాన్‌స్వామి మరణించడం వల్ల న్యాయవ్యవస్థతో సహా దేశంలోని మొత్తం న్యాయ నిర్వహణావ్యవస్థపైనే అతి పెద్ద మరక పడింది.

ఈ ప్రభుత్వం నుండి ఏమీ ఆశించలేకపోయినప్పటికీ, రాజ్యాంగం, చట్ట పాలనపై ప్రజల్లో సడలిన విశ్వాసాన్ని పునరుద్ధరించడానికి న్యాయవ్యవస్థ ఏమైనా చేస్తుందో లేదో  వేచి చూడాలి.

(సందీప్ మిత్రా విశ్రాంత ఇండియన్ ఫారిన్ సర్వీస్ ఉద్యోగి.

అనువాదం : కె. పద్మ )

Leave a Reply