కారల్ మార్క్స్  రచన ఇటీవల తెలుగు అనువాదమైంది. 1844 ఆర్థిక, తాత్విక రాత ప్రతులు.

1932లో జర్మనీలో వెలువడిన ఈ పుస్తకం తెలుగులో సమగ్రంగా రావడం ఇదే మొదటిసారి. పీకాక్ ప్రచురించిన రాత ప్రతులు సమగ్రం కాదు. మార్క్స్ తన ఇరవై నాల్గవ ఏట యవ్వనకాలంలో తన ముందు తరపు తాత్విక రచయితల నుండి అనుభవ సారం నుండి తనని తాను రూపొందించుకున్నాడు. కారల్  తర్వాత రచనలకు ఆర్థిక, తాత్విక రాత పతులు బీజం వేశాయి.దాదాపు నూరేళ్ల తర్వాత తెలుగులో వచ్చిన రచనకు ప్రాసంగిత ఏమిటి?  యువ మార్క్స్ గా ఉన్నప్పుడు  అధ్యయనం చేసిన అంశాలు తన చుట్టూ ఉన్న భౌతిక ఆవరణ ఇవన్నీ మార్క్స్ ను  మరింత దృఢంగా చేసాయి.. సమాజపు తలంలో వున్న  అనేక అంశాలకు సమాధానాన్ని అన్వేషించే క్రమంలో మార్క్స్ తొలి తలంపు ఆర్థిక తాత్విక రాతప్రతులు.

కారల్ మార్క్స్ తొలి రచన అనే నిర్ధారణ చేసే ముందు ఈ రచన వెనుక ఉన్న తపనను అర్థం చేసుకోవచ్చు. యువ మార్క్స్ తదనంతర కాలంలో రూపొందడానికి కావలిసిన భావజాల సామాగ్రిని సిద్ధం చేసుకున్నాడు. తనముందటి తరం   ఆలోచనలలోని కొన్ని ఖాళీలు కారల్ మార్క్స్ అధ్యయన అంశమైంది. ప్రపంచాన్ని, దాని మనుగడను వెతికే అన్వేషణలో తన స్థానాన్ని నిర్ధారణ చేసుకున్నాడు. నిర్ధారణ అనే మాటకు అనేక తాత్వికార్ధాలున్నాయి. ఇంతవరకు చేసిన నిర్ధారణకు పరిమితి ఉందనే గ్రహింపు కలిగింది. ఈ గ్రహింపు కాలక్రమణికలో తన యొక్క ముద్రను  విస్తృతి  చేసుకోవడానికి ఆలంబనైంది. ఇక్కడే తన ముందటి తరపు ఆలోచన స్రవంతుల నుండి కారల్  మరి కాస్త దారి  చేసుకోగలిగాడు.

మార్క్స్  తదనంతర  రచనకు పునాది ఆర్థిక, తాత్విక  రాత ప్రతులు. ఇందులో ఏముంది. కొన్ని వేల పుస్తకాల సారాంశాన్ని  మార్క్సిజం రూపంలో ఒడిసి పట్టుకున్నాడు.  మార్క్స్ రాసుకున్న నోట్స్ కు ఉన్న ప్రాధాన్యత ఏమిటి? నేటి తరం అధ్యయన అంశంగా మాట్లాడుతున్నప్పుడు మార్క్స్ వేసుకున్న దారిని  నూట ఎనభై ఏళ్ల తర్వాత అంచనా వేయాలి. మార్క్స్ రచనలను ఆర్థిక, తాత్విక రాత ప్రతుల  నుండి తూకం వేయాలి.ఈ తూకంలో కొన్ని సమాధానాలు దొరకవచ్చు. ఈ పుస్తకం విడి,విడి అంశం కాదు.ఈ పుస్తక అధ్యయనంలో అనేక అంశాలు ఇమిడి ఉన్నాయనేది అవగతమౌతుంది.

యువ మార్క్స్ చేసిన పరిశోధన క్రమంలో  రాత ప్రతులను అధ్యయనం చేయాలి. భవిష్యత్తు మార్క్స్ కు అనేక రూపాలు, వైవిధ్యాలు ఇందులో చోటు చేసుకున్నాయి. ప్రధానంగా పరాధీనత, పరాయికరణ ఈ రెండు అంశాలు సమస్త మానవాళిలోకి ఎలా ప్రవేశించగలిగాయి. మానవుని పరిణామ క్రమంలో శ్రమ విలువ ఎప్పుడు స్థిరీకరించబడిందో ఆనాటి నుండి పరాయికరణ అనే అంశం మానవాళి ముందుకు వచ్చింది. వర్తమానంలో కూడా మానవ పరాయికరణను మరింత నిర్దిష్టంగా అంచనా వేయవచ్చు. మార్క్స్ తన ముందటి తరం  తాత్వికుల బోధనల నుండి బయలుదేరి పరాయికరణలో శ్రమదోపిడి, శ్రమవిలువ దాగి ఉందనే  నిర్ధారణకు వచ్చాడు. యువ మార్క్స్ లో ఈ పరిణితి  ఎక్కడినుండి వచ్చింది. అప్పటికే యూరప్ సమాజపు బీదరికపు  అంచుల దగ్గర మార్క్స్ నిలబడి ఉన్నారు. సమాజపు చలనంలో శ్రమ కేంద్రంగా ఉన్నప్పటికీ అత్యంత పేదరికం స్థితిని మార్క్స్ మేధో పరిణితితో అంచనా వేయగలిగాడు.

మార్క్స్ కు తన ముందటి తత్వవేత్తలకు స్పష్టమైన తేడా ఉన్నది. ఒకానొక వాస్తవిక వెనుక దాగిన స్వీయాత్మక  అనుభవంతో మార్క్స్  బయలుదేరాడు.ఈ దారిలో మార్క్స్ ఆగి ఆలోచించాల్సిన సమయం దగ్గర నిలబడ్డాడు.శ్రమ  దగ్గర తన ఆలోచనలను మిళితం చేశాడు.ఒక స్థిర బిందువు దగ్గర నిలబడి శ్రమ తాలూకా అనేక పాయలను అంచనా వేసాడు. అంతిమ నిర్ధారణకు చేరుకోవడానికి మార్స్ కు అనేక ఊతకర్రలు దొరికాయి. ఇక్కడి నుండి మార్క్స్ తనని తాను నిర్దేశించుకున్నాడు.  మానవ శ్రమ శాస్త్రాన్ని నూతన మానవుడిగా అంచనా వేయడంలో మార్క్స్  చేసిన మేధో కృషి ఇవాళ ప్రపంచం ముందున్నది. ఏదో స్థాయిలో మార్క్స్ ను  కుదించవచ్చు. అక్కరకు రాని సిద్ధాంతంగా ఆవలకు నెట్టవచ్చు. మానవాచరణలో మార్క్స్  చూపిన దోవ అంతిమ పరిష్కారం అనే  దశలోనే మార్క్సిజం ప్రాసంగిత   ఉన్నది.

శ్రమ అంటే మనిషి. శ్రమకు సబంధించిన సాధన సంపత్తిలో మానవ అంశ ఏమీలేదు –  పెకర్ ధియరీ పోస్టల్. కార్మికుడు సృష్టించే వస్తువు  ఒక ప్రతికూల వస్తువుగా అతనితో తలపడుతుంది. అంటే మానవ పరిణామ క్రమంలో  మానవ శ్రామికీకరణ ఉన్నది అనేది స్పష్టం.

దీనిని సమం చేయడం ఎలా?  కేవలం ఇది  మార్క్స్ ఊహ మాత్రమేనా!లేదా ఈ ఊహ వెనుక సైద్దాంతిక  క్రమం ఉన్నదా! శ్రమ ద్వారా కార్మికుడు చేసిన ఉత్పత్తి పెట్టుబడిగా మార్పు చెందిన దశలో కార్మికుని స్థితి ఏమిటి? కనీస వేతనం అందని వేతనజీవి తన చుట్టూ ఉన్న భౌతిక ప్రపంచాన్ని అనేక దశలుగా విస్తృత పరుస్తున్నప్పుడు తనకి తాను ఉత్పత్తి రహిత మానవునిగా ఎలా మిగులుతున్నాడు.మార్క్స్ ను  వేధించిన ప్రశ్నలు ఇవి. ఆ తర్వాత కాలంలో కార్మిక వర్గానికి  భావజాలమైంది. ఇంకా మార్క్స్  ముందుకు వెళ్లి పరాయికరణ, మానవతావాదపు ఆలోచనలను దాటాడు. కాలం గడుస్తున్న కొలది వాస్తవిక శ్రమైక మానవుడు రూపు దిద్దుకోవడం మార్క్స్అంతరంగ ఘర్షణకు కారణమైంది.కార్మికుడు సృష్టించే వస్తువు  ఒక ప్రతికూల పరాయి వస్తువుగా కార్మికులతో తలపడుతుంది.

కార్మికుడు,తలపడటం, పరాయికరణ అనే అంశాలలో కార్మికుడు మాత్రమే వాస్తవం. కార్మికుడు పరాయికరణను ఎప్పుడైతే తన శ్రమ ఉత్పత్తి నుండి దూరం జరిగాడో ఆ వస్తువుతో తలపడటం ఒకానొక  మానసిక ఘర్షణ.

ఒక సమాజంలో అత్యధికులు బాధలు పడేటట్లయితే ఆ సమాజ జీవనం సంతోషంగా ఉండజాలదు – ఆడమ్ స్మిత్. ఈ భావనలో మొత్తం ప్రజలంతా సంతోషంగా ఉండడానికి ఏకారణాలు దోహదం చేస్తాయి . ఆనందం, సంతోషానికి సూత్రీకరణలేమిటి? కేవలం ఆర్థికపరమైన  వెసులుబాటు ఆనంద కేంద్రంగా ఉంటుందా. సాంస్కృతిక ,మానవీయ స్పందనలు, భౌతికతలం  నుండి ఉద్భవించే హృదయ స్పందనలు ఆనంద సమయాల్ని నిర్ణయిస్తాయా. అయితే మార్క్స్ ఈ భావనలకు సమాధానం శ్రమ విలువలోనే ఉందనే వాస్తవాన్ని విశదీకరిస్తాడు. అయితే కాలగమనంలో మార్క్స్ పరాయికరణ అనే అంశాన్ని దాటి,మరింత అన్వేషకుడుగా మారాడు..

రాజకీయ అర్థశాస్త్రం శ్రమ వియుక్తీకరణకు సంబంధించిన నియమాలను రూపొందించడం మాత్రమే చేసింది అనే ప్రశ్న ముందుకు వస్తుంది. ఇక్కడ మార్క్స్ మేధో పరిణామాన్ని ఎలా చూడాలి? రాత ప్రతులలో ఇంగ్లీష్ రాజకీయ అర్థశాస్త్రం జర్మన్ సంప్రదాయక తత్వశాస్త్రం ఫ్రెంచి  సోషలిజాల సమ్మిళితంగా రాతపతులను అధ్యయనం  చేయాలి.కేవలం శ్రమ విభజన దగ్గరే మార్క్స్ ఆగలేదు. సమస్త మానవాళి వియుక్తీకరణ ప్రధానం. 1844 ఆర్థిక,తాత్విక రాతప్రతులు మేధో జ్ఞానానికి మాత్రమే సంబంధించినవి కాదు. మార్క్స్  వేసుకున్న దారి  వర్తమాన, భవిష్యత్తు ప్రపంచాన్ని విశ్లేషిస్తుంది. మానవాళి జీవన సంక్షోభానికి మాత్రమే పరిమితం కాదు. ప్రపంచం ఎదుర్కొంటున్న ఆర్థిక, రాజకీయ, సంస్కృతి వెనుక దాగిన శ్రమ విలువ ప్రధానం.

మనిషి, పకృతి,మతం వీ టి పట్ల యువ మార్క్స్  పరిశీలనలు గమనించదగినవి.తర్వాత కాలంలో ఈ ప్రాధాన్యతా  విషయాలు ఎలా రూపుదిద్దుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇవాళ పర్యావరణం గురించి చర్చ జరుగుతున్నది. సహజ వనరుల దోపిడి అక్కడున్న మూలవాసులను విస్తాపన చేసే అంశాలు చాలా వేగంగా జరుగుతున్నాయి.  సామ్రాజ్యవాద సంస్కృతి లో భాగంగా  సహజ వనరులను దళారీలకు అమ్ముకునే దశ  కనబడుతుంది. దళారీలు  నిర్వహించే పాత్ర పర్యావరణంను సరుకు చేయడం.  రెండోవైపు మతం గురించి చేసిన విశ్లేషణ నిజానికి రాత ప్రతులలో  మతం గురించిన విశ్లేషణకు  పరిమితి ఉన్నప్పటికీ  యువమార్క్స్ చేసిన విశ్లేషణ  మానవాళికి  సంబంధించినది. వర్తమాన స్థితి ఒక ఉన్మాదం మానవుని దాటి ఏదిశకు  చేరుకుందో ప్రపంచం ముందు ఉన్నది. ఆర్ధికాంశం మార్క్స్ దృష్టిలో కేంద్ర అంశమైనా,పరిణితి చెందిన మానవస్వభావం నుండి మార్క్స్ అంతిమంగా విముక్తి మానవున్ని  కలగన్నాడు .

నిరీశ్వరవాదం, కమ్యూనిజం రెండు పలాయినవాదం గాని, అనిర్ధిష్టం కాదు. మనిషి సృష్టించిన వస్తుగత తత్త్వం నుండి జనించిన మానవ శక్తులను  కోల్పోవడం కాదు.అవి దారిద్యం కారణంగా  అసహజ ఆదిమ నిరాడంబరతకు దిశగా  తిరోగమించడం కాదు.

మార్క్స్ మతం, ప్రకృతి, మానవుడు వీటన్నిటి పట్ల ఉండాల్సిన సారాంశాన్ని  మరింత ధ్రువీకరించారు, దృఢపరిచాడు.1844 ఆర్థిక, తాత్విక రాత ప్రతులును  యువ మార్క్స్ గా  ఉన్నప్పుడు రాసింది. పరిశీలనలో కాలగమనంలో మార్క్స్ అనేక కొత్తదారులను కనుగొన్నాడు. వీటన్నటి బీజం యువ మార్క్స్ లోనే ఉన్నాయి.1844 ఆర్ధిక, తాత్విక రాతప్రతులను ఇవాళ్టి అధ్యయన అంశంగా ఎందుకు ఉండాలి. నూట ఎనభై ఏళ్ల క్రితం నాటి ఈరచనకు వున్న పరిణామం ఏమిటి.మార్క్సిజం   పట్ల ఆసక్తి , అధ్యయనం చేయాలని భావించే నూతన తరం రాత ప్రతులను తప్పకుండా చదవాలి. పెట్టుబడిదారి సమాజపు వెనుక దాగిన రాజ్య దళారీ

పాత్రను మరింతగా అర్థం చేసుకోవడానికి మార్క్స్ రచనలను చదివే క్రమంలో 1844 ఆర్థిక, తాత్విక రాత ప్రతులు దారిదీపం.

Leave a Reply