ఈ నవల తొలి పుటలో పరిశోధనల చరిత్రకెక్కని నవల అంటూ ఈ నవలను సేకరించి ముద్రించిన తెలకపల్లి రవి చెప్పుకున్నారు. నిజమే చరిత్రకెక్కని, చరిత్రలో చోటివ్వని అనేక విషయాలు కర్నూలు సాహిత్య చరిత్రలో ఉన్నాయి. కర్నూలు జిల్లా సాహిత్య చరిత్రను పరిశీలించినట్లైతే ప్రపంచంలోనే తొలి తెలుగుపదం ‘అన్‌ధిర లోహము’ అనగా ఆంధ్రలోకము అనే పదం కర్నూలు జిల్లా కన్నమడకలలో లభించినది.ఇది అత్యంత ప్రాచీన శాసనంగా గుర్తించారు. తొలి తెలుగుపదం ‘నాగబు’ అని నిర్ధారించినప్పటికీ అంతకుముందే ‘ఆంధ్రలోకము’ అనే పదమున్నప్పటికీ సాహిత్యకారులు, చరిత్రకారులు సమాజక్షేత్రంలోకి తీసుకెళ్ళలేకపోయారు. ఆ పదం కర్నూలుజిల్లాలో లభించడం అరుదున విషయం.  ప్రపంచానికి బౌద్ధ సిద్ధాంతాలను ప్రవచించిన సిద్ధ నాగార్జునుడు, శైవత్వాన్ని బోధించిన ఆదిశంకరులు కర్నూలు జిల్లా శ్రీశైలంలో నివసించారు. జానుతెలుగు, వస్తుకవిత అనే పదాలను సృష్టించిన నన్నేచోడుడు మన శ్రీశైలనివాసి మల్లికార్జున పండితుడికి తన కుమారసంభవ కావ్యం ఇచ్చాడు. నన్నేచోడుడు కూడా పూర్వం మన కర్నూలు జిల్లాలో భాగమైన ఒరయూరు వాసి.

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మంత్రాలయం రాఘవేంద్ర స్వామి క్రీ.శ. 1601-1671 మద్యకాలంలో జీవించారు. 47 గ్రంథాలను రచించిన ఈయన పూర్వనామం ‘వేంకటేశ’. స్వస్థలం తమిళనాడులోని కంచీపురం అయినప్పటికీ స్థిర నివాసం జిల్లాలోని మంత్రాలయమే. ఈయన రచనలు పరిమళ, చంద్రికా ప్రకాశ, న్యాయముక్తావళి, దశోపనిషత్‌ ఖండార్థ, భావదీపిక, దశ ప్రకరణటీకి, తంత్రదీపికా, అణుభాస్య, ఈశావాస్య వివృత్థి, భేద బోధిని, పాదావళీట్పిణం, ప్రాతః సంకల్పగద్య, పురుష సక్తటీక, ఆంభ్రణి సూక్త, మంత్రార్థ సంగ్రహ, భాట్టసంగ్రహ, రామకృష్ణ చరిత్ర మంజరి తదితర రచనలు చేశారు.

కర్నూలు జిల్లా గడివేముల మండలం బిలకలగూడూరుకు చెందిన వేంకటలక్షమ్మ, తెన్నరంగయ్యల కుమారుడు నరహరి గోపాల కృష్ణమశెట్టి గొప్పకవి, పండితుడు, సాహితీవేత్త. ఈయన కాలం 1833`1888. మద్రాసులో జన్మించినప్పటికీ జన్మప్రాంతం పై మమకారంతో డిప్యూటి కలెక్టర్‌గా ఈ ప్రాంతానికి వచ్చాడు. కర్నూలు జిల్లా చరిత్రను ఆంగ్లంలోను, తెలుగులోను రచించిన మొదటి వ్యక్తి. అంతేకాక ఇప్పటివరకు తెలుగు సాహిత్య చరిత్రలో తొలి నవల కందుకూరి వీరేశలింగం పంతులు రాసిన రాజశేఖర చరిత్ర అనుకుంటున్నప్పటికీ, ఈయన రాసిన రంగరాజు చరిత్ర (సోనాబాయి చరిత్ర) మొదటి నవల. డిస్ట్రిక్ట్‌ మాన్యువల్‌ రచించిన తొలి భారతీయుడు కూడా ఈయనే. A Manual of Kurnool District in the Madras Presidency అనే పేరుతో కుంఫీనీ ప్రభుత్వం ఈ గ్రంథాన్ని ప్రచురించింది. ఈయన కుంఫీని ప్రభుత్వంలో ప్యాపిలి డిప్యూటి కలెక్టర్‌గా పనిచేశారు. ప్రసిద్ధ వ్యాకరణ కర్త పరవస్తు చిన్నయసూరి రచించిన Manual of Hindu Law తెలుగు అనువాదానికి చిన్నయసూరి శెట్టిగారి సహాయం పొందాడంటే ఈయన రచనా పటిమ అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో మరొక చారిత్రక నవల బయల్పడిరది. ఆ వివరాలు చూద్దాం..

ఈనవలను కర్నూలు సాహితీ సవంతి విశేషకానుకగా ప్రచురించింది. సేకరణ కూర్పు తెలకపల్లిరవి చేశారు. ఈ నవల ప్రత్యేకతన ఆయన తన ముందు మాటలో వివరించారో చూద్దాం..

‘‘కర్నూలు డిప్యూటీ కలెక్టరుగా పనిచేసిన నరహరి గోపాలకృష్ణ చెట్టి 1872లో వెలువరించిన శ్రీరంగరాజ చరిత్రము మొదటి నవల కాగా 1878లో గా కందుకూరి వీరేశలింగం ప్రచురించిన రాజశేఖర చరిత్ర రెండవ నవల. తెలంగాణలో ఇంకా ముందే చారిత్రిక నవలలు వచ్చాయని మిత్రులు పేర్కొంటున్నారు. తెలుగు నవలా వికాసం గురించి ఇంకా చాలా సమాచారం, ఆధారాలు, భిన్నాభిప్రాయాలు వున్నా ఇక్కడ ఆ వివరాల్లోకి పోవడం లేదు. బెంగాలీ సమాజ సంసృతులతో రచనలు చేయాలని వైస్రాయ్‌ మేయె ఇచ్చిన పిలుపే తెలుగులో గోపాలకృష్ణ శెట్టికి కూడా ప్రేరణ అయింది. అందుకే బెంగాలీలో మిగిలిన చోట్ల కన్నా వేగంగా జరిగింది. విశేషమేమంటే వివిధ దేశీయ భాషలలో తొలి తరంలో చాలామంది రచయితలు అపరాధ పరిశోధక డిటెక్టివ్‌ కథలతోనే ప్రారంభించడం. 1874లోనే అనంతపురం జిల్లాకు చెందిన గడియారం రామాశాస్త్రులు ‘పేటికాంతరశవం’ తొలి అపరాధ పరిశోధక నవల వెలువడినట్టు తెలుస్తున్నది. డిటెక్టివ్‌ నవలలు కొత్త రచయితలను ఆకర్షించడంవూహించదగిందే. ఇదో విధంగా కొత్త వాణిజ్య సమాజపు వక్రమార్గాల నేర స్వభావాల ప్రభావం కూడాననాలి. చతురిక రచయిత రామచంద్రరావు ముందుమాటలో ఆ ప్రస్తానవ చేశారు కూడా.

డిటెక్టివ్‌ సాహిత్యంలో అగ్రగణ్యుడు షెర్లాక్పోమ్స్‌ డిటెక్టివ్‌ కథలతో బెంగాలీలో పాంచ్కడీదేవ్‌ వంటివారు ఓ వూపు వూపారు. తెలుగు సాహిత్యంలో చెరగని ముద్ర వేసిన మహాకవి శ్రీశ్రీ కూడా మొదట పాంచ్కడీదేవ్‌ నవలల ప్రభావం, గురించే మాట్లాడతారు. 1917లో ఈ రచయిత రామచంద్రరావు నేరుగా షెర్లాక్‌ హోమ్స్కు అనుసరణ (అడాప్టేషన్‌) అని స్పష్టంగా చెప్పి స్వేచ్చ తీసుకున్నారు. ఈ చిన్న నవల మొత్తంలో అనుకరణ కన్నా దేశీయతనే అత్యధికంగా కనిపిస్తుంది. కథనానికి అనుసరించిన శిల్పంలో కూడా కృత్రిమత్వానికి చోటివ్వలేదు. భాష పరంగా గ్రాంధికం కావడం వల్ల, అప్పటికి ఇప్పటికి పదాల వినియోగంలో వచ్చిన మార్పువల్ల కొంత ఆలోచించాల్సిన అగత్యమేర్పడుతుంది. అదే సమయంలో ఇంగ్లీషు ప్రభావాలను పదాలను పోకడలను కూడా కొంత చెప్పడానికి రచయిత ప్రయత్నించారు. ఈ రెండు కారణాలు కొంత సమస్యగా కనిపించినా అప్పటి పరిస్థితులను కూడా మన కళ్లకుకడతాయి. దీన్ని వ్యవహారభాషలో మార్చాలని సూచన వచ్చినా అప్పటి ఆలోచనలు తెలియాలనే చరిత్ర కోణంతో ఆ పనిచేయలేదని చెప్పాల్సి వుంది.

చతురికలో కేవలం గూఢచర్యమే గాక పోటాపోటీ గూఢచర్యం (కౌంటర్‌ ఎస్పినోజ్‌) ఆసక్తి అదనపు ఆకర్షణ. అయితే అది కొసమెరుపులా చివరి వరకూ అర్థం కాదు. రాజుల కాలం అయినా కోర్టులు పోలీసులు దావాలు, విందు వినోదాల వంటి ఆధునిక నగరజీవిత లక్షణాలు గోచరిస్తాయి. ఒకరిని గురించి మరొకరు ఎలా ఆలోచించాలి. ఎలా పసిగట్టాలి తమ ప్రయోజనాలను గట్టిగా కాపాడుకోవాలి ఇవన్నీ నవీనకాలానికి ఏమాత్రం తీసిపోని రీతిలో నడుస్తాయి. నవల శీర్షిక చతురిక అన్నట్టే ఆమె చాతుర్యంతో పాటు వ్యక్తిత్వం గల మహిళఅనీ తెలుస్తుంది. ఇది చదివాక కొంతవరకూ తెలుగు వారికి మధురవాణి గుర్తుకు వస్తే పొరబాటేమీ లేదు. కాకుంటే ఇది చిన్న నవలిక గనక పెద్ద విస్తరణకు అవకాశం లేకపోయింది. అంత పరిధీ లేదు. పాత కాలపు రచనల్లో కీలక పాత్రధారిణులు వేశ్యలు కావడం యాదృచ్చికమేమీ కాదు. ఆనాటికి ఆ మాత్రం తెగువ చొరవకు అవకాశముండేది వారికేనని చెప్పనవసరం లేదు.’’ అంటూ రాసుకొచ్చారు.

5 అధ్యాయాలుగల ఈ చిన్న నవల మొదటి అధ్యాయం మినహయిస్తే మిగతా నాల్గు అధ్యాయాలు నాటకీయశైలిలోనే సాగుతాయి. 13వ శతాబ్ధానికి చెందిన తిక్కన మహాభారాతాన్ని నాటకీయశైలిలో రాశాడు. అంతేకాకుండా ఏ పరభాషా పదానికి చోటివ్వకుండా అచ్చతెలుగులో రాశాడు. ఈ చతురిక నవలలో ఉ.రామచంద్రరావు ఆయన శైలినే అనుసరించాడని చెప్పవచ్చు. ఉదాహరణకు..

విజ్ఞానసాగర… ‘‘అయ్యా! దయచేసి ఈ యాసనమున లంకరింపుడు. వీరు నామిత్రుడును, సహకారియునగు వసుసేనుడను ధన్మంత్రిగారు. ఇతను నాకపుడపుడు నావ్యవహారములలో సహాయ మొనర్చుచుండును. నేను తమ్ము నెవరినిగా నెరుంగవలెను?’’

కొత్త మనిషి…’’మీరలు నన్ను దత్త మండలము నెల్లూరు జిల్లాలలోని నొక జమీందారీ వంశీకుడని తెలియనగు. ఈతడు తమకు నిజముగా నాప్త మిత్రుడనియు, మిగుల రహస్యమైనట్టియు, ముఖ్య మైనట్టియు విషయములను ఇతని సమక్షమున నిశ్శంకగా మాటలాడ వచ్చునను నమ్మిక గల పెద్దమనుష్యు డనియు నమ్ముచున్నాను. లేనిచో, నేను తమతో నేకాంతముగా మాట లాడవలెనని కోరుచున్నాను.’’

అప్పటికి వ్యవహారిక భాషోద్యమ ప్రభావం కర్నూలు ప్రాంతంలో పెద్దగా లేదనే విషయం ఈ నవలను బట్టి అర్థమౌతుంది. ఈ నవల చదివాక ఆనాటి దేశకాల పరిస్థితులు తెలుస్తాయి. మరీముఖ్యంగా 1917నాటికే కర్నూలులో యస్‌వి రాఘవయ్య అనే వ్యక్తి శ్రీచంద్రమౌళీశ్వర ముద్రాక్షరాలయం నడుపబడుతుందని అర్థమవుతున్నది. 1927లో కర్నూలు జిల్లా పత్తికొండలో వనం శంకరశర్మ సరస్వతి ప్రెస్‌ నడిపారు.స్వాతంత్య్రద్యమంలో పాల్గొంటూ రచనలు చేయడం వనం శంకరశర్మ గారికే సాధ్యమైంది. రచనల్లోనూ వస్తు శిల్ప వైవిధ్యాన్ని, భావ సౌందర్యాన్ని ప్రదర్శిస్తూ రచనలు చేశారు. అయితే పద్యసాహిత్యాన్ని విరివిగా రాశారు. గాంధీ అహింస ఉద్యమానికి ప్రభావితులై రచనలు చేశారు.ఆయన రాసిన  మహాత్మగాంధీ శతకములో…పుట్టినది దేశ మెద్దియెల/పెట్టినదే భాష గాని ప్రీతిగదానిన్‌/కట్టిడిగ నేర్పజేయుచు/జెట్టివిగా దేలితివి సుశీల! మహాత్మా..ఈ శతకంలోని ప్రతి పద్యంలో మహాత్మగాంధీని భిన్నంగా ఒక్కో పద్యంలో ఒక్కో విధంగా సంబోధించారు. ఈ కావ్యంలో మకుటమే  గొప్ప ప్రయోగంగా కనిపిస్తుంది. ఈ శతకం రాసినందుకు 1967లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వనం శంకరశర్మగారిని సత్కరించింది. 1925లోనే రామరాజు చరిత్ర, రాకా చరిత్ర, మృత్యుంజయ చరిత్ర, హరికథలు ఒకే సంపుటిలో ప్రచురించారు. కేశవదాసు చరిత్రను హరికథగా రచించారు. 1934లో జ్యోతిష్య విజ్ఞాన ఫల చంద్రికను రచించారు. 1936లో సంసారయాత్ర అనే సాంఫీుక నాటకాన్ని రచించారు. శ్రీరసిక జన వినోదిని నాట్యమండలిని స్థాపించారు.

1938లో భక్త పుండరీక 5 అంకాల నాటకాన్ని 1939లో దేశభక్తి, జగన్మాయ అనే సాంఫీుక నాటకాలను రచించారు. 1938లో అప్పుల తిప్పలు అను ఏకాంకిక నాటికను కరుణరసాత్మకంగా రాశారు. ఈ నాటికలో అప్పులిచ్చిన వాడు, నప్పుతెచ్చిన వాడు/నెన్నడైనను గాని హితులు గారు/తప్పులెన్నో జేసి ముప్పులు బలుపొంది/

తిప్పలలో మునింగి దిరుగుచుండ్రు… అంటూ అద్భుత భావమున్న పద్యాన్ని రాశారు. గాంధీజీ ఆశయాలైన మద్యపాన నిషేదము, హరిజనోదరణ, స్త్రీ స్వాతంత్య్రము మొదలైన ఇతి వృత్తాలను నాటకాలుగా రచించి ప్రదర్శించి ప్రజల్ని చైతన్య పరిచారు. బుర్రకథలను, హరికథలను ‘‘ఊరురా తిరిగి ప్రదర్శించారు.

కర్నూలు ‘రామదాసు’ నటకాన్ని తిలకించేందుకు వెళ్ళిన వనంశంకరశర్మ గారికి అనుకోకుండా నటించే అవకాశం వచ్చింది. ఆ నాటకంలో కళాప్రపూర్ణ బళ్ళారిరాఘవ రామదాసు పాత్రలో నటించాల్సి ఉంది. అనివార్య కారణాల వల్ల ఆయన రాకపోయేసరికి, ఆ పాత్రను వనం శంకరశర్మ నటించి బంగారు పతకాన్ని అందుకున్నారు. శ్రావ్యమైన గాత్రం, చక్కని శరీర సౌష్టవం, పరిపూర్ణమైన హావభావాల అభినయ కౌశలం ఆయన సొంతం. భక్త పుండరీక, సంసార యాత్ర అనే నాటకాల్లో నటించి మెప్పించారు.

దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు ప్రేరణతో స్వాతంత్య్ర మహోద్యమ యజ్ఞానికి చిరు సమిధగా ఐంద్రావతి పత్రికను కర్నూలు జిల్లా పత్తికొండ స్థాపించి తన స్థాపించిన స్వంత ప్రెస్సులో ముద్రించి 9 సంవత్సరములు నడిపారు. భగత్‌సింగ్‌ తుది ఘడియల అంత్యోపన్యాసమును ఐంద్రావతి లో ప్రచురించినందున బ్రిటీష్‌ ప్రభుత్వం కోపంతో రగిలిపోయి ఈ పత్రికపై అప్పట్లోనే 2 వేల రూపాయల భారీ జరిమానా విధించింది. దీంతో ఆత్మ గౌరవం దెబ్బతిని పత్రిక ఆపేశారు. దాన్ని తిరిగి కొన్నాళ్ళకు శారద పేరుతో కర్నూలు నుండి పునరుద్ధరించి 9 నెలలు నడిపారు. దీన్ని కూడా అప్పటి ప్రభుత్వం నిషేదించింది. స్వాతంత్య్రం సిద్ధించాక 1954లో టంగుటూరి ప్రకాశం పంతులు ప్రోత్సహంతో ‘హితవాది’ అనేపేరుతో పత్రికను  అంతిమ శ్వాస విడిచే వరకూ అనగా 08.03.1976 వరకూ నడిపారు. ఈ ఆధారాలను బట్టి కర్నూలు జిల్లాలో ముద్రణాలయాలుకు శతాబ్దకాల చరిత్ర ఉన్నట్టే..

Leave a Reply