ఎబివిపి హింస,వర్శిటీ యాజమాన్యం మౌనం ఒక విద్యార్థి ప్రాణాన్ని తీసింది.
మే 17 రాత్రి, ఎబివిపి అనుబంధ విద్యార్థులు మరియు స్టూడెంట్స్ యూనియన్ సభ్యులు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎఫ్-హాస్టల్ ముందు గుంపుగా చేరారు. ఒక విద్యార్థి ల్యాప్‌టాప్‌లు దొంగిలించాడనే ఆరోపణలపై వెంటనే చర్య తీసుకోవాలనేదే ఈ గుంపు సమీకరణానికి చెప్పిన కారణం.అయితే, ఆ గుంపు త్వరలోనే అత్యంత మూక దాడి స్వభావంతో మారి,ఆ విద్యార్థిని తమ అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించింది. అక్కడికి పరిస్థితిని అదుపు చేయడానికి వచ్చిన ఒక దళిత అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ (ASO) పై కూడా దాడి చేసి, అందరి ముందూ దూషణలు చేస్తూ అవమానించారు.
విద్యార్థిపై జరిగిన అవమానం మరియు మానసిక వేధింపులు: మయుఖ్ కుండు ఎంఏ ఫైనాన్షియల్ ఎకనామిక్స్ మొదటి సంవత్సరం విద్యార్థి. పశ్చిమ బెంగాల్ నుంచి ఈ విశ్వవిద్యాలయానికి వచ్చిన అతని చదువుకోవాలనే ఆశ ,తన భవిష్యత్తును నిర్మించుకోవాలనే చాలా సాధారణమైనది. కానీ 2026 మే 19న, అతను వర్శిటీలోని బఫెలో సరస్సులో మృతదేహంగా కనబడ్డాడు.ఈ యూనివర్సిటీ క్యాంపస్‌లో ఎదగాల్సిన ఒక విద్యార్థిని మనం కోల్పోయాం.తమ కుమారుడిని విశ్వవిద్యాలయానికి పంపి,ఎవరూ వినకూడని దుర్వార్త విన్న అతని కుటుంబానికి మా గాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం.ఈ నష్టం ఈ క్యాంపస్‌ను తమ ఇల్లుగా భావించే మన అందరిదీ.అయితే, ఈ మరణాన్ని చుట్టుముట్టిన నిజాలను మౌనంగా వదిలేయలేం.
మయూక్ మృతికి రెండు రోజుల ముందు,అతను ల్యాప్‌టాప్‌లు దొంగిలించాడని ఆరోపిస్తూ ఒక గుంపు ఎఫ్-హాస్టల్ బయట చేరింది.ఈ విషయంలో వర్శిటీ యాజమాన్యంను ఆశ్రయించడం గానీ, చట్టబద్ధమైన విధానాన్ని అనుసరించడం గానీ చేయకుండా,ఎబివిపి మరియు యూనియన్ సభ్యులు మద్యం మత్తులో ఉన్న గుంపును సమీకరించి, చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంది. వారు భద్రతా సిబ్బందిపై ఒత్తిడి తెచ్చి మయుఖ్ను తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. పరీక్షల సమయంలో రాత్రి వేళ సాధారణ విద్యార్థుల రాకపోకలను అడ్డుకుంటూ రోడ్డును బ్లాక్ చేశారు. అంతేకాక, మయుఖ్ చివరిసారిగా కనిపించడానికి గంట ముందు, కొందరు ఎబివిపి సభ్యులు అతడిని తమ గదికి తీసుకెళ్లి ల్యాప్‌టాప్ దొంగతనాన్ని ఒప్పుకోవాలని బలవంతంచేస్తూ కొట్టారని ఆరోపణలు ఉన్నాయి.
రోడ్డుపై జరిగిన అవమానం:
మే 17 రాత్రి, పరిస్థితిని అదుపు చేయడానికి పలువురు యూనివర్శిటీ భద్రతా సిబ్బంది మరియు ఒక ASO అక్కడికి చేరుకున్నారు. ఆ ASO ప్రజలను శాంతియుతంగా ఉండాలని, పిర్యాదు కోసం సరైన విధానాన్ని అనుసరించాలని కోరారు. అయితే ఆ గుంపు ఆయనను కూడా వదల్లేదు.ఆ అధికారి దళితుడు మరియు తెలుగు నేపథ్యానికి చెందిన వ్యక్తి కావడంతో ఆ ASOను విశ్వవిద్యాలయ ప్రధాన రోడ్డుపైనే దూషణలతో అవమానించారు. ఆయన విద్యార్హతలను ఎగతాళి చేశారు. తెలుగు లో మాట్లాడుతున్నందుకు “హిందీ ఎందుకు మాట్లాడలేవు?” అని ప్రశ్నించారు. చివరికి ఆ ASO రోడ్డుపైనే కన్నీళ్లు పెట్టుకున్నారు.
తర్వాత, హైదరాబాద్ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ కార్యాలయం 2026 మే 18న (లేఖ.నం.UH/REG/S-9/2026/7702) ఒక హెచ్చరిక నోటీసు విడుదల చేసింది. అది సంఘటన జరిగిన దాదాపు 16 గంటల తరువాత వచ్చింది. ఆ నోటీసులో ఇలా పేర్కొన్నారు: “యూనివర్శిటీ ప్రాంగణంలో బెదిరింపులు, తప్పుగా వ్యవహారించడం, ముప్పులు, యూనివర్శిటీ అధికారుల/భద్రతా సిబ్బంది పనులకు ఆటంకం కల్పించడం, మద్యం సేవించడం మరియు క్రమశిక్షణా ఉల్లంఘనలు జరుగుతున్నాయని తీవ్ర ఆందోళనతో గమనించబడింది.”అని పేర్కొన్నారు.
ఈ నోటీసులో హింస, బెదిరింపులు, అధికారుల విధుల్లో జోక్యం, ఆస్తుల ధ్వంసం, వివక్షాత్మక వ్యాఖ్యలు జరిగినట్లు స్పష్టంగా ఉన్నప్పటికీ — ఆ గుంపు ఎవరు? ఎందుకు చేరారు? రోడ్డును ఎందుకు బ్లాక్ చేశారు? ఒక దళిత భద్రతా అధికారిని ఎందుకు అవమానించారు? క్యాంపస్‌లో భయ వాతావరణం ఎందుకు ఏర్పడింది? అనే ప్రశ్నలకు సమాధానం లేదు.
ఈ నెలలోనే ఎబివిపి గూండాలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అనేక హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారు. మే 4న థియేటర్ విభాగం నిర్వహించిన అకడమిక్ కార్యక్రమాన్ని అడ్డుకుని విద్యార్థులపై దాడి చేశారు. మే 16న మెస్ నియమాలను పాటించినందుకు వర్శిటీలోని J&K మెస్ సెక్రటరీపై దాడి చేశారు. మే 17న ఎలాంటి ఆధారాలు లేకుండానే ఎఫ్-హాస్టల్ ముందు గుంపుగా చేరి మాబ్ న్యాయం అమలు చేయాలని ప్రయత్నించారు.
హెచ్‌సీయూలో మూక న్యాయం పెరుగుదల:
ఒక అమాయక విద్యార్థిని భయభ్రాంతులకు గురి చేసి చనిపోయేలా చేయడానికి ఈ గూండాలకు ఈ హక్కు ఎవరు ఇచ్చారు? మయుఖ్ దోషి అని తీర్పు చెప్పే అధికారం వారికి ఎవరు ఇచ్చారు? ఫిర్యాదులు సంబంధిత అధికారుల వద్దకు వెళ్లకుండా పోతే, నేరస్తులు శిక్ష లేకుండా తిరుగుతుంటే, పరిపాలన యాజమాన్యం నిరంతరం మౌనంగా ఉంటే — విద్యార్థులను రక్షించే వ్యవస్థలు కూలిపోవడం తప్ప మరో దారి లేదు.అధికారులు చేయాల్సిన పనిని మే 17 రాత్రి మాదిరిగానే మూక గుంపులు భర్తీ చేస్తాయి. మద్యం మత్తులో ఉన్న కొందరు తామే అధికారం అనుకున్నారు. తామే విచారణాధికారులు, న్యాయాధికారులు, శిక్ష విధించే వాళ్లు అనుకున్నారు. ఎందుకంటే ఈ క్యాంపస్‌లో ఇప్పటివరకు వాళ్లకు ఎవరూ అడ్డుగా నిలవలేదు.
మయుఖ్కు జరిగిన ఘటనకు కారణమైన ఈ గుంపు ఈ క్యాంపస్‌కు కొత్తది కాదు. నెలలుగా ఇనుపరాడ్లతో విద్యార్థులపై దాడులు, యూనియన్ పనితీరును ప్రశ్నించిన వారిపై దాడులు, పెద్ద శబ్దాలపై అభ్యంతరం చెప్పిన వారిపై దాడులు, విభాగం అనుమతించిన నాటకాన్ని ఆపడానికి దాడులు, మెస్ సెక్రటరీలపై దాడులు — ఇవన్నీ కొనసాగుతున్నాయి. అయినా బాధితులు ఫిర్యాదు చేసినప్పుడల్లా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు మయుఖ్ మరణానికి తమ బాధ్యతను దాచేందుకు అతనిపై అపప్రధలు సృష్టించే స్థాయికి దిగజారారు.
వర్శిటీ యాజమాన్యం నిర్లక్ష్యం మరియు బాధ్యతారాహిత్యం:
ఈ వర్శిటీలో జరుగుతున్న హింసలో పరిపాలన యాజమాన్యం పాత్రను విస్మరించలేం. ఒకే గుంపు పదేపదే హింసకు పాల్పడుతున్నా వారిపై పరిపాలన పరమైన చర్య తీసుకోలేదు. అంతేకాక, ఇటీవల జరిగిన అధికారిక కార్యక్రమంలో వారిని రిజిస్ట్రార్ వారిని ప్రోత్సహించారు. దాడులకు గురైన విద్యార్థులు క్యాంపస్‌లో భయంతో జీవిస్తుండగా, ఈ గూండాలను వర్శిటీ యాజమాన్యమే గౌరవించింది.
దళిత ASOపై జరిగిన అవమానాన్ని,దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఆయనకు మా సంఘీభావం తెలియజేస్తున్నాము. మే 17 రాత్రి మయుఖ్ కుండును లక్ష్యంగా చేసుకున్న గుంపును, అతని గదిని చట్టవిరుద్ధంగా తనిఖీ చేసిన వారిని, అతనిని విద్యార్థుల ముందు అవమానించిన వారిని, అతనిపై దాడి చేసిన వారిని — మరియు మయుఖ్ ఒంటరిగా ఆ మానసిక భారాన్ని మోసేలా వదిలేసిన వారిని కఠినంగా శిక్షించాలి.
విద్యార్థులు మరియు సిబ్బందిని రక్షించడంలో విఫలమైన హైదరాబాద్ విశ్వవిద్యాలయ అధికారుల వైఖరిని కూడా మేము ఖండిస్తున్నాము. దశాబ్దకాలంగా కొనసాగుతున్న మౌనం, నిర్లక్ష్యం, హింసకు పరోక్ష రక్షణ — ఇవే మయుఖ్ ప్రాణాన్ని బలి తీసుకున్న పరిస్థితులను సృష్టించాయి.ఇనుపరాడ్లతో తిరగడం, అర్ధరాత్రి దాడులు చేయడం, విద్యార్థుల ముందు అవమానాలు చేయడం, మద్యం మత్తులో దాడులు చేయడం— ఇవన్నీ ఒక ప్రముఖ విద్యాసంస్థలో సాధారణంగా మారిపోవడాన్ని మేము ఖండిస్తున్నాము.
మా డిమాండ్లు:
• 2026 మే 17 ఘటనలు మరియు మయుఖ్ మరణంపై సమగ్ర దర్యాప్తు కోసం స్వతంత్ర ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఏర్పాటు చేయాలి.
• ASOపై జరిగిన ప్రజా అవమానానికి బాధ్యులపై తక్షణ చర్య తీసుకోవాలి.
• నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి.
• మయుఖ్ కుటుంబానికి న్యాయమైన పరిహారం ప్రకటించాలి.
• రిజిస్ట్రార్ మరియు వైస్-చాన్సలర్ తమ నిర్లక్ష్యానికి,బాధ్యతారాహిత్యానికి జవాబు చెప్పాలి. విద్యార్థులు మరియు సిబ్బందిని రక్షించడంలో పరిపాలన విఫలమైందని బహిరంగంగా అంగీకరించి, క్షమాపణ చెప్పి, ఇటువంటి ఘటనలు మళ్లీ జరగకుండా తీసుకునే చర్యలను ప్రకటించాలి.
ASA | AISA | BRSV | BSF | DSU | FRATERNITY | MSF | PDSU | SFI | TSF




