మోగించండి విజయ ఢంకాలనీ ఊదండి బూరకొమ్ముల్నీ
కిటికీలను, దర్వాజలనూబద్దలు కొట్టీ
మొరటు శక్తితో
చర్చిల్లోకి ప్రవేశించండీ
సమావేశాల భగ్నం చేయండీ
స్కూ ళ్ళల్లోకి ప్రవేశించండీ
పండితులను పారద్రోలండీ
పెళ్లి కొడుకునూ విడువొద్దూ
వధువుతో ఆనందించే వీల్లేదు
పొలం దున్నుతూ, ఫలం ఏరుతూ రైతులు సైతం శాంతికి దూరం
ప్రఛండ బాహువుల భీకర శబ్దం దిక్కులన్నీ చెదరగొట్టగా మోగించండీ, మోగించండీ
విజయ డంకా మోగించండీ
వెన్నులోన చలి పుట్టించే
కొమ్మును సైతం వూదండీ
పట్టణాలలో, జన సంచారాల మీదుగా
వీధుల్లో, వాహన శబ్దాల మీదుగా మోగించండీ, మోగించండీ
నిద్రించేందుకు పరుపులు సిద్ధమా తీసేయండెవడూ నిద్రించొద్దూ వ్యాపారస్తుల బేర సారాలొద్దూ
బ్రోకర్లు స్టాక్ మార్కెట్ దారుల దందా లొద్దూ
వాచాలుడు వాగుతున్నాడా
గాయకుడు పాడుతున్నాడా
లాయర్లు వాదిస్తున్నారా
వీల్లేదు, వీల్లేదు
దడ దడ దడ ధణ ధణ ధణ శబ్దాలతో
మారుమాటల్లేకుండా, ముహో గ్రంగా
డంకామోగించండీ, కొమ్మునూదండీ
చర్చల్లేవ్, రాజీ ల్లేవ్
మందలింపులసలే లేవు
పిరికివాళ్లు మనకసలే వద్దు
ఏడ్చేవాళ్ళు ప్రార్థించే వాళ్లను
పక్కకు తోసేయండి
యువకులవేడే
ముసలి ముదుగులను విస్మరించండి
చిన్నపిల్లల హాహాకారాలు
కన్నతల్లుల వీడ్కోలు
కనబడవద్దూ వినబడవద్దూ
పాడే కట్టెలు సైతం
శవాలను వొణికించాలి
స్మశానం ఉలిక్కిపడాలి
మోగించండి, మోగించండి మహోన్నతంగా, మహోగ్రంగా మోగించండీ
గుండెల్నిండా ఊపిరి ఉంచుకు
బారు కొమ్ములనూదండీ
*
Beat! Beat! Drums!
By Walt Whitman
Related