అతనిప్పుడు మాటాడుతున్నాడు
ఒరిగిపోయాడన్న ప్రతిసారి
మాటాడుతూనే వున్నాడు

దేశమంతా అతన్ని
ప్రతిబింబిస్తూనే వుంది
శత్రువూ మాటాడుతున్నాడు
తనవారూ మాటాడుతున్నారు
నలుగురు కలిసిన చోట
అతనే సంభాషణవుతున్నాడు

అన్నం ముద్దలో అతని
వెన్నెల వంటి ముఖం కనిపిస్తూ
అడవి అంతా అతను అల్లుకుపోయిన
తోవంతా కబుర్లలో అతనిప్పుడు
మాటాడుతున్నాడు

అతని చుట్టూ
ముళ్లపొదను నాటిన ప్రతిసారీ
మరల అతను మోదుగ పూల
వనంలో ఎర్రని దేహంతో
పుష్పిస్తూనే మనతో
మాటాడుతున్నాడు

నువ్వలిసి సేదదీరుతానన్న
కాలంలో నీ అలసటను
తన భుజానెత్తుకొని
కాళ్ళ సత్తువగా మారుతూనే వున్నాడు

ఎండలో వానలో చలిలో
రుతువులన్నిటా అతను
ముందు నడుస్తూనే వున్నాడు

గాయపడ్డ సమయంలో
తను నిన్ను హత్తుకొని
ఆకాశమంత హామీగా
మారుతూ మాటాడుతున్నాడు

అతనిప్పుడు మాటాడుతున్నాడు
వింటున్నావా??

(అమరుడు కామ్రేడ్ సుధకు ప్రేమతో)

Leave a Reply