అదానీ నిర్వహించే బొగ్గు గనుల కోసం మరో అటవీ ప్రాంతాన్ని క్లియర్ చేయడానికి సిద్ధమవుతున్న పోలీసులు, అదానీ ఉద్యోగులు కలిసి హస్‌దేవ్ అడవుల గ్రామాలపై మరోసారి దాడి చేశారు. స్థానిక అధికారులు స్థానిక ప్రజల నుండి మైనింగ్ కోసం అధికారిక సమ్మతిని పొందటానికి ప్రయత్నించినప్పుడు గందరగోళం గందరగోళ స్థితి ఏర్పడింది. అధికారులు పదే పదే కేకలు వేయడంతో పథకం బెడిసికొట్టింది. మరోవైపు, సమీపంలోని ప్రతిపాదిత బొగ్గు గనిపై పని తాత్కాలికంగా నిలిపివేశారు; ఈ ప్రాంతంలోని ఆదివాసీ నివాసితుల ఫిర్యాదును రాష్ట్ర కమిషన్ వింటుంది.

  • అదానీ యాజమాన్యంలోని పార్సా ఈస్ట్ కెంటే బసాన్ బొగ్గు గని – విస్తరణకు ఆమోదం.
  • మైనింగ్ కోసం అదానీ అభివృద్ధి చేస్తున్న పార్సా బొగ్గు బ్లాక్.
  • మధ్య భారతదేశంలోని ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని హస్‌దేవ్ అరణ్యలో నివసిస్తున్న ఆదివాసీలు మంచి, చెడు వార్తల కలయికను ఎదుర్కొంటున్నారు.

ఒకవైపు, ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర షెడ్యూల్డ్ ట్రైబ్స్ (ఎస్టీ) కమిషన్ తాత్కాలిక ఉత్తర్వు జారీచేయడంతో పర్సా బొగ్గు బ్లాక్‌లో బొగ్గు గనిని తాత్కాలికంగా నిలిపివేయడం వారు సంబరాలు జరుపుకునే  కారణం. ఆదివాసీ  సముదాయాల హక్కులను పరిరక్షించేందుకు రాజ్యాంగబద్ధంగా అధికారం పొందిన స్వతంత్ర సంస్థ అయిన ఎస్టీ కమిషన్ స్థానిక సాముదాయిక సంస్థ తన ముందు పెట్టిన ఫిర్యాదుపై విచారణ జరిపి ఈ ఉత్తర్వును జారీ చేసింది.

పర్సా బొగ్గు ప్రాజెక్టును హస్‌దేవ్ అరణ్య బచావో సంఘర్ష్ సమితి (హస్‌దేవ్ అరణ్య సంరక్షణ కోసం పోరాట కమిటీ -హెచ్‌ఎబిఎస్‌ఎస్) చాలాకాలంగా వ్యతిరేకిస్తోంది. ఈ బ్లాకును త్రవ్వించే హక్కును పొందిన రాజస్థాన్ ప్రభుత్వం అభివృద్ధి-నిర్వహణ కోసం అదానీ గ్రూప్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఆరు గ్రామాల సభల సమ్మతి గనుల త్రవ్వకానికి ముందు చట్టబద్ధమైన అవసరం. ఆరు గ్రామాల నివాసితులు గనుల తవ్వకానికి  అనుమతించడానికి సమ్మతించారని చూపించే గ్రామ సభల తీర్మానాలు కల్పితమైనవి; ఎస్‌టి కమిషన్‌కు హెచ్‌ఎబిఎస్‌ఎస్ యిచ్చిన ఫిర్యాదులో, తప్పుడు తీర్మానాలను రద్దు చేయాలని; సంబంధిత ప్రభుత్వ విభాగాలు, పోలీసులు దర్యాప్తు చేయాలని హెచ్‌ఎబిఎస్‌ఎస్ డిమాండ్ చేసింది. మే 31న, కమిషన్ తన తదుపరి విచారణ వరకు తీర్మానాల అమలును తాత్కాలికంగా ‘రద్దు చేసింది’.

మరోవైపు, అదానీ నడుపుతున్న పీకేబీ బొగ్గు గని విస్తరణకోసం అడవులను నాశనం కాబోయే స్థితిని ఎదుర్కోడానికి హస్‌దేవ్ గ్రామస్తులు సిద్ధమవుతున్నారు. స్థానిక మీడియా ప్రకారం, మూడో దఫా చెట్లను నరికివేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. జూన్ 7న ప్రారంభం కావాల్సిన ఈ చర్య జరగలేదు. కానీ కొద్దికాలంలోనే జరగక తప్పదు. చెట్లను నరికివేయడానికి గుర్తుగా వేసిన నారింజ రంగు చిహ్నాలను ఆదివాసీలు ఇటీవల కనుగొన్నారు.

పుండుపై కారం చల్లినట్లుగా జూన్ 19న గ్రామ మండలి సమావేశం (గ్రామసభ) నిర్వహించి, భూస్వాములు, ఇతర గ్రామస్తులు ఈ పనులు చేపట్టడానికి సమ్మతినిచ్చినట్లు అధికారులు తెలిపారు. స్థానికులు ఉద్యమించకుండా నిరోధించేందుకు పోలీసులు గ్రామాన్ని దిగ్బంధించారు. అయితే, గ్రామస్తులు అధికారులను, గనిని వ్యతిరేకించినట్లు బిగ్గరగా చెప్పడంతో, ఆ సమావేశం తరచుగా గందరగోళంగా మారింది. రాష్ట్ర అధికారులు, అదానీ గ్రూపు లక్ష్యాలను సాధించడంలో ఈ సమావేశం విఫలమయినప్పటికీ , రాష్ట్ర ముఖ్యమంత్రి విష్ణు దేవో సాయి మాత్రం దాదాపు 200 హెక్టార్ల అటవీ నిర్మూలనకు సమ్మతి లభించిందని అబద్ధపు ప్రకటన చేశాడు.

పార్సా ఈస్ట్ కెంటే బేసిన్ (పిఇకెబి) బొగ్గు గని రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందినది మరియు 2013 నుండి అదానీ గ్రూప్ సంస్థ నిర్వహిస్తోంది.

యాత్ర, సామరస్యం, తలక్రిందులు:

ఆదివాసీల ఆరునెలల కష్టకాలం తర్వాత ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. 2023 డిసెంబర్‌లో జరిగిన ఎన్నికల తరవాత ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ప్రభుత్వం మారింది. ముఖ్యమంత్రి భుపేష్ బాఘెల్ నేతృత్వంలోని మునుపటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని బిజెపిచేతిలో ఘోరంగా ఓడిపోయింది. రాష్ట్రానికి బిజెపి కొత్త ముఖ్యమంత్రిగా విష్ణుదేవ్ సాయి ఎన్నికయ్యారు.

కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వ చివరి 18 నెలల పాలనలో ఎన్నికల ఫలితంగా పీకేబీ గనుల కోసం చేపట్టిన చెట్ల నరికివేతపై వాస్తవంగా ఉపశమనం లభించింది. 2022 ఏప్రిల్, అంతకు ముందు 2021 అక్టోబర్ నాడు, హస్‌దేవ్‌ను కాపాడే ఉద్యమానికి రెండు ముఖ్యమైన ఘటనలు జరిగాయి.

2021 అక్టోబర్‌లో, హెచ్‌ఎబిఎస్‌ఎస్ కార్యకర్తలు మొత్తం అటవీప్రాంతం నుండి ఆదివాసీలను సంఘటితం చేసి 300 కిలోమీటర్ల దూరంలో వున్న రాష్ట్ర రాజధాని రాయ్‌పూర్ వరకు  పాదయాత్ర జరిపారు. 1995 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో లెమ్రూ ఎలిఫెంట్ రిజర్వ్ ను ప్రభుత్వం ప్రకటించేలా చేయడానికి ఈ కవాతు సహాయపడింది. 2020లో అదానీవాచ్ ప్రచురించిన మ్యాప్‌లో సరిహద్దులను చూపించారు.

పని జరుగుతున్న అదానీ గ్రూప్ పిఇకెబి గని, దాని ప్రతిపాదిత బొగ్గు గనులను ఈ ఏనుగు అభయారణ్యం  మినహాయించినప్పటికీ, అటవీ ప్రాంతంలో గుర్తించిన 30 బొగ్గు బ్లాకులలో 25 దాని సరిహద్దు, దాని బఫర్ జోన్ (రిజర్వ్ యొక్క సరిహద్దు రేఖ నుండి 10 కిలోమీటర్ల వ్యాసార్థం) లో ఉన్నాయి. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు ఇప్పటికే కేటాయించిన రెండు బొగ్గు బ్లాకులను, ప్రైవేటు వాణిజ్య బొగ్గు గనుల తవ్వక సంస్థలకు వేలం వేయడానికి ప్రభుత్వం జాబితా చేసిన అనేక బొగ్గు బ్లాకులను ఇందులో చేర్చారు. ఈ నిక్షేపాలు, వాటి పైన ఉన్న అడవులు, గ్రామాలు ప్రస్తుతానికి గనుల తవ్వకం ఆగింది.

2022 మార్చిలో భూపేష్ బాఘెల్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పిఇకెబి గని రెండో దశను ముందుకు తీసుకెళ్లి, పక్కనే ఉన్న పర్సా బొగ్గు బ్లాకుకు అనుమతులు ఇచ్చినప్పుడు చెప్పుకోదగైన పరిణామం సంభవించింది. రాజస్థాన్ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌తో బాగెల్ సమావేశం తరువాత, హస్‌దేవ్ గనుల నుండి బొగ్గు ప్రవాహాన్ని పెంచాలని బాగెల్‌పై ఒత్తిడి తెచ్చారు. ఈ అంశాన్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట మీద వెనక్కు తగ్గినట్లుగా రాష్ట్రంలో ప్రజలు భావించారు. గ్రామ సభల “సమ్మతి” తీర్మానాలను రద్దు చేయాలని, దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తూ 2021 లో హెచ్‌ఎబిఎస్‌ఎస్ కార్యకర్తలు బాగెల్, రాష్ట్ర అప్పటి గవర్నర్ అనుసుయ ఉయికేలను కలుసుకున్నారు. ముఖ్యమంత్రి, గవర్నర్ ఇద్దరూ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినప్పటికీ, వారు తమ మాటమీద నిలబడకుండా, అదానీ బొగ్గు గనుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చారు.

2022 ఏప్రిల్ 12 న, రాష్ట్ర ప్రభుత్వం మొదటగా దర్యాప్తు ప్రారంభించడానికి బదులుగా, పెర్సా బొగ్గు బ్లాక్ కోసం అటవీ హక్కుల చట్టం కింద తుది ఆమోదం ఇచ్చింది. ఏప్రిల్ 23 న, పిఇకెబి రెండవ దశ కోసం చెట్లను నరికివేసేందుకు అదానీ గ్రూప్ కార్మికులకు భద్రత కల్పించడానికి ప్రభుత్వం పోలీసు దళాలను పంపింది. కొన్ని రోజుల పాటు చెట్లను నరికివేసిన తరువాత, హెచ్‌ఎబిఎస్‌ఎస్ కార్యకర్తలు, స్థానిక నివాసితులు అక్షరాలా చెట్లను కౌగిలించుకునే కేంపెయిన్ ద్వారా దానిని ఆపగలిగారు. 2022 జూన్‌లో, పిఇకెబి గని రెండవ దశ,  ప్రక్కనే ఉన్న పార్సా, కెంటే ఎక్స్టెన్షన్ విస్తరణ  బొగ్గు బ్లాకుల ప్రారంభాన్ని నిలిపివేసినట్లు ప్రభుత్వం పత్రికలకు తెలిపింది.బాఘెల్ ప్రభుత్వం ముగియడం, బీజేపీ అధికారంలోకి రావడం వరకూ ఈ ఉద్రిక్తత కొనసాగింది.

చెట్లను నరికివేత, పోలీసుల అణచివేత, గృహదహనాలు:

కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయక ముందే, రెండో దఫా చెట్లను నరికివేసింది. 2023 డిసెంబరు 21-23 తేదీల మధ్య హెచ్‌ఎబిఎస్‌ఎస్ నాయకులను పోలీసులు అక్రమంగా అదుపులోకి తీసుకున్నారని, చెట్లు నరికివేసే కార్యక్రమం జరిగిన ప్రదేశానికి నిరసనకారులు చేరుకోకుండా నిరోధించడానికి పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించారని వారు ఆరోపించారు.

“అధికారికంగా 20 వేల చెట్లను నరికివేసినప్పటికీ, సంఖ్య యింకా చాలా ఎక్కువగానే వుంటుంది” అని హెచ్‌ఎబిఎస్‌ఎస్ సహ-సభ్యుడు అలోక్ శుక్లా అన్నారు.

పార్సా బొగ్గు బ్లాకు పరిధిలో ఉన్న ఆరు గ్రామాల్లో ఒకటైన సల్హి గ్రామ నివాసి, హెచ్ఏబీఎస్ఎస్ కు చెందిన ఆదివాసీనాయకులలో ఒకరైన రామ్ లాల్ కరియం మాట్లాడుతూ “సూర్యోదయానికి ముందే పోలీసులు నా ఇంటికి వచ్చారు, రాత్రిపూట వేసుకొనే దుస్తుల్లోనే నన్ను అరెస్టు చేశారు.

హెచ్ఏబీఎస్ఎస్‌కు చెందిన మరో ఆదివాసీ నాయకురాలు సునీతా పోర్టే కూడా ఈ ఘటన నుంచి తాను తప్పించుకొన్నట్టు వివరించారు.  “మా నిరసన స్థలానికి వెళ్తున్నప్పుడు , పోలీసులు నా ఇంటికి వచ్చారని ఒక సహచరుడు నన్ను హెచ్చరించాడు. పోలీసులు, అదానీ గ్రూపు డబ్బులు యిచ్చిన మైనింగ్ మద్దతుదారులు అడవుల్లోనూ, చెట్లను నరికివేసే ప్రాంతానికి దారితీసే రోడ్లు అన్నింటి మీదా వున్నారు. ఏదో ఒకవిధంగా, నేను అడవుల గుండా ఒక దారి కనుక్కుని అరెస్టు కాకుండా తప్పించుకున్నాను.

పోలీసుల బృందం ఆ ప్రాంతానికి చేరుకున్నట్లు తెలుసుకున్న శుక్లా తన ఇంటి నుంచి నాలుగు నుంచి ఐదు గంటల ప్రయాణదూరంలో వున్న హస్‌దేవ్‌కు వెళ్లడానికి ప్రయత్నించాడు. పోలీసులుగా చెప్పుకునే సివిల్ దుస్తుల్లో ఉన్న వ్యక్తులు అతన్ని దారిలో ఆపారు. ఈ ‘పోలీసులు’ శుక్లాను, అతని సహచరుడిని రోడ్డు పక్కన గంటల తరబడి నిర్బంధించారు.

 “వారు మమ్మల్ని ఇంటికి తీసుకెళ్తామని చెప్పారు, కానీ వారు మమ్మల్ని ఇంటికి తీసుకెళ్లలేదు లేదా కోర్టులో హాజరుపరచలేదు” అన్నారు శుక్లా.

శుక్లా సహచరుడు ఒక రహస్య ఫోన్ కాల్ చేయడంతో విషయం బయటపడింది. ఒక అత్యవసర విజ్ఞప్తి ప్రచారమై అతని గురించి అడుగుతూ స్థానిక పోలీసులకు ఫోన్ కాల్స్ రావడం మొదలైంది. కొన్ని గంటల తరువాత, శుక్లా, అతని సహచరుడిని విడుదలచేసారు. తనను కిడ్నాప్ చేశారని, అయితే తనను కిడ్నాప్ చేసిన వారు నిజంగా పోలీసులేనా కాదా అనే దానిపై ఈ నాటికీ స్పష్టత లేదు అంటారు ఆయన.

కంపెనీ కార్మికులు హస్‌దేవ్‌లో చెట్లను నరికివేయడంలో నిమగ్నమై ఉన్నప్పుడు స్థానికులు మూడు రోజుల పాటు పోలీసుల అణచివేతకు గురయ్యారు..

“పోలీసులు మమ్మల్ని మూడు రోజుల పాటు మా ఇళ్లలో బంధించారు” అని హరిహర్ పూర్ గ్రామ నివాసి మునేశ్వర్ పోర్టే (ఇది పార్సా బొగ్గు బ్లాక్ పరిధిలో ఉంది) అన్నారు.  పోలీసులు, కంపెనీ మద్దతుదారులు తప్ప వీధుల్లో ఎవరూ లేరు.

 “ఉద్యమ నాయకులు పోలీసుల కస్టడీలో ఉండడంతో, మిగతా వారంతా బయటకు రావడానికి భయపడ్డారు.”

శుక్లా ఆ సమయంలో పట్టణాన్ని వాస్తవిక “సైనిక శిబిరం” గా అభివర్ణించారు.

మూడు నెలల తర్వాత మరోసారి భయపెట్టే బల ప్రదర్శన జరిగింది. 2024 మార్చిలో హోలీ పండుగ రాత్రి, హరిహర్‌పూర్ గ్రామంలో, పిఇకెబి గని గుంతనుండి 200 మీటర్ల దూరంలో ఉన్న హెచ్‌ఎబిఎస్‌ఎస్ నిరసన స్థలాన్ని అర్ధరాత్రిలో కాల్చివేసారు. ఇది కంపెనీ మద్దతుదారులు మాత్రమే చేసివుంటారని హెచ్‌ఎబిఎస్‌ఎస్ సభ్యులు ఆరోపించారు;  పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో అలాగే చెప్పారు.

“వారు మా గ్రామాలకు వచ్చే రోడ్లపై తిరుగుతూ, నిరంతరం మమ్మల్ని బెదిరిస్తున్నారు, భయపెడుతున్నారు” అని మునేశ్వర్ పోర్టే అన్నారు.

అదానీ గ్రూపు నుంచి నెలకు 10,000 రూపాయలు (అమెరికన్ డాలర్లు) లభిస్తున్నాయని హెచ్‌ఎబిఎస్‌ఎస్ సభ్యులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం నిర్మూలించబడిన కేటే గ్రామ నివాసి అయిన హెచ్‌ఎబిఎస్‌ఎస్ సభ్యుడు శివప్రసాద్ కుస్రో మాట్లాడుతూ, కంపెనీకి మద్దతుగా, ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేయడానికి తనకు ఈ ‘వేతనం’ ఇచ్చారని చెప్పారు. పిఇకెబి గనుల కోసం కొనుగోలు చేసిన తన భూమికి సంబంధించి ఆయనకు ఇంకా పరిహారం రావాల్సి ఉంది. ఉద్యమం నుంచి తప్పుకుని, గనుల తవ్వకానికి అనుకూలంగా మాట్లాడితే పూర్తి పరిహారం చెల్లిస్తామన్నారని  ఆయన ఆరోపించారు.

కొన్ని తీసుకునేవారు కొద్దిమందే ఉన్నారు. “మన ఉద్యమానికి ముఖంగా ఉన్న ప్రముఖ నాయకులలో ఒకరు ఇప్పుడు అదానీ గ్రూపుకు తనను తాను అమ్ముకున్నాడు” అని మునేశ్వర్ పోర్టే అన్నారు.  “అది అర్థం చేసుకోవఛ్చు; తన వృద్ధ్యాప్యం, తన కుటుంబం [సంక్షేమం] గురించి ఆలోచించి ఉండచ్చు.”

ఈ రిపోర్టర్ 2024 ఏప్రిల్ మధ్యలో హస్‌దేవ్‌కు వెళ్లినప్పుడు, హెచ్‌ఎబిఎస్‌ఎస్ నిరసన ప్రదేశాన్ని పునర్నిర్మించే పనిలో ఉంది. 2022 ఆరంభం నుండి వారు ఆ ప్రదేశంలో నిరవధిక నిరసనలో ఉన్నారు, గ్రామ సభ సమ్మతి తీర్మానాలను రద్దు చేయాలని, దర్యాప్తు చేయాలని కోరుతున్నారు. హస్‌దేవ్‌లో మైనింగ్ జరిగే అవకాశం ఉన్నంత వరకు నిరసన కొనసాగిస్తామని అంటున్నారు.

అడవిని కాపాడటం నుండి వారి ఇళ్లను కాపాడటం వరకు:

మునేశ్వర్ పోర్టే, సునీతా పోర్టే, రామ్ లాల్ కరీయం వంటి వారు ఇప్పుడు ఉద్యమంలో ముందంజలో ఉన్న నాయకులలో ఉన్నారు, వారి ప్రస్తుత పరిస్థితికి విషాదకరమైన వైచిత్రంతో కూడుకొని ఉంది. వీరందరూ తమ యవ్వన ప్రారంభ దశలో, ఇరవైల ప్రారంభంలో ఒక దశాబ్దం క్రితం, హస్‌దేవ్ అడవి మొత్తం ప్రమాదంలో ఉన్నప్పుడు ఉద్యమంలో చేరారు. గని సమీపంలో ఉన్న కారణంగా ప్రజల జీవన నాణ్యత ఎలా క్షీణించిందో ప్రత్యక్షంగా చూసిన వారు, పిఇకెబి గనుల సమీపంలో నివసిస్తున్న కార్యకర్తలుగా,  చాలా నిబద్ధతతో ఉన్నారు.

“పిఇకెబి గనుల కారణంగా కేటే గ్రామస్తులు నిరాశ్రయులయ్యారని, వారి పరిస్థితి ఏంటో మేం చూశాం” అని మునేశ్వర్ అన్నారు.

రామ్ లాల్ కరియామ్ గనుల వల్ల వారి పర్యావరణం ఎంతగా దెబ్బతిందో వివరించారు. “గనుల నుండి వచ్చే కాలుష్యం మా పంటలను ప్రభావితం చేసింది. అడవులు తరిగిపోవడంతో  గనుల చుట్టూ తిరగాల్సి ఉంటుంది కాబట్టి ఏనుగులు తరచూ మా గ్రామాలలోకి ప్రవేశిస్తాయి. మేమందరం నీళ్ళు వాడుకునే సల్హి నది నల్లగా మారి ఆపై ఎండిపోయింది. పిఇకెబి గుంతలోకి నీరు చొరబడడంతో భూగర్భ జలాల స్థాయి తగ్గింది.

ఈ రిపోర్టర్ హస్‌దేవ్‌లో ఉన్న రాత్రి, ఒక ఏనుగు హరిహరపూర్ గ్రామంలోని ఒక ఇంటిలోకి ప్రవేశించి, ఒక మహిళని గాయపరచి విషమస్థితిలోకి నెట్టింది.

అదానీ గ్రూప్ అభివృద్ధికని ఇచ్చిన వాగ్దానాలు వేటినీ నెరవేర్చలేదు.

“వాళ్లు మాకు నీళ్ళ పైపులు, ఆసుపత్రులు, పాఠశాలలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు” అని శివ ప్రసాద్ కుస్రో అన్నారు. “ఒక పాఠశాలను నిర్మించారు కాని వారు చాలా మంది స్థానికులను తమ పిల్లలను అక్కడకు పంపించడానికి అనుమతించరు. వారి మద్దతుదారుల పిల్లలకు మాత్రమే ప్రవేశానికి అనుమతినిస్తారు; చాలా మంది విద్యార్థులు వారి ఉద్యోగుల పిల్లలు. వారు ఎన్నడూ ఆసుపత్రిని నిర్మించలేదు. ప్రభుత్వం సంవత్సరాల క్రితం నిర్మించిన స్థానిక ఆరోగ్య కేంద్రంలో వారి లోగోతో ఒక బోర్డును అతికించారు. ఇక్కడ పైపుల ద్వారా నీటి సరఫరా లేదు. స్థానికులు అందరూ నీటి కోసం బావులు త్రవ్విస్తారు.”

ఈ దృశ్యాన్ని ప్రత్యక్షంగా చూసిన ఈ కార్యకర్తలు లెమ్రూ ఏనుగుల అభయారణ్యాన్నిప్రకటించేలా ప్రభుత్వాన్ని ఒప్పించిన ఉద్యమానికి నాయకత్వం వహించడానికి ప్రేరణ పొందారు. ఏనుగుల అభయారణ్యాన్ని నోటిఫై చేయాలని ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వాన్ని ఒప్పించిన తరువాత, బొగ్గు బ్లాకుల నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని ఈ ఉద్యమం ప్రభుత్వాన్ని ఒత్తిడి చేసింది. ఈ ఉద్యమం విజయవంతమైంది. అక్టోబర్ 2023లో, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వ అభ్యర్థన మేరకు, కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ రిజర్వ్ లోపల, దాని తూర్పు, దక్షిణ శివార్ల వెలుపల ఉన్న వాటితో సహా 40 బొగ్గు బ్లాకుల నోటిఫికేషన్ రద్దు చేసినట్లు ప్రకటించింది.

అంతర్జాతీయ గుర్తింపు:

2024 మే లో, హస్‌దేవ్ అడవిలో ఎక్కువ భాగాన్ని రక్షించడానికి దారితీసిన ఉద్యమానికి నేతగా గుర్తించిన అలోక్ శుక్లాకు “గ్రీన్ నోబెల్” బహుమతిగా పరిగణించే “గోల్డ్మన్ ఎన్విరాన్మెంటల్ ప్రైజ్” ను ప్రదానం చేశారు.

అయితే, ఈ ఉద్యమం సాధించిన ఈ విజయం, అదానీ పీఈకేబీ బొగ్గు గని సమీపంలో నివసిస్తున్న కార్యకర్తలకు యింకా చేదుగానే ఉంది. ఈ అటవీ భాగం ఇప్పటికీ రక్షణ లేకుండా ఉంది. పార్సా, కెంటే విస్తరణ బొగ్గు బ్లాకులను రాజస్థాన్ ప్రభుత్వానికి కేటాయించి, అభివృద్ధి, నిర్వహణ కోసం అదానీ గ్రూప్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. మిగిలిన అటవీ ప్రాంతాలలో వారు తమ విజయోత్సవాన్ని  జరుపుకొంటుంటే, వారు తమ ఇళ్ల నుండి బహిష్కరణకుగురయ్యే అంచున పోరాడుతున్నారు. మరిన్ని చెట్లను నరికివేయడం తప్పనిసరి కాబోతోంది.

“ఎన్నికల అనంతరం చెట్లను నరికివేయడాన్ని వ్యతిరేకించడానికి ప్రజలను సమీకరించడానికి మేము సన్నద్ధమవుతున్నాం” అని సునీతా పోర్టే అన్నారు.

ఎస్‌టి కమిషన్ తీర్పు ఒక ఆశను రేకెత్తిస్తోంది:

ఈ అవార్డు ఉద్యమంలోని ఆదివాసీలందరికీ సంబంధించినది, మిగిలిన అడవిని రక్షించే ప్రయత్నాలను ఇది ప్రోత్సహిస్తుందని ఆశిస్తున్నాను’ అని శుక్లా అన్నారు.

“ఈ గనులను అదానీ గ్రూప్ లాభం కోసం మాత్రమే ఉపయోగిస్తోంది” అని శుక్లా అన్నారు. రాజస్థాన్ బొగ్గు డిమాండ్‌ను తీర్చడానికి కొత్త గనుల అవసరం లేదని ప్రభుత్వం సుప్రీంకోర్టుకు ఇచ్చిన అఫిడవిట్లో తెలిపింది.

భారతదేశ సార్వత్రిక ఎన్నికల ఫలితం హస్‌దేవ్‌లో పరిస్థితులపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. మోదీ ప్రభుత్వం తన మూడో పదవీకాలాన్ని బలహీన స్థితిలోనే ప్రారంభించింది. బిజెపి పార్లమెంటులో తన మెజారిటీని కోల్పోయి, సంకీర్ణ భాగస్వాములపై ఆధారపడింది. దీనికి ప్రతిస్పందనగా జూన్ 4న అదానీ గ్రూప్ పబ్లిక్ లిస్టెడ్ కంపెనీల షేర్లు భారతదేశ స్టాక్ మార్కెట్లలో గణనీయంగా పడిపోయాయి.

అదానీ గ్రూప్ బొగ్గు గనుల నుండి హస్‌దేవ్ అడవులను కాపాడాలని కోరుకునే వారి స్థితిని ఈ ఫలితాలు ఖచ్చితంగా బలోపేతం చేస్తాయి.

రచయిత న్యూ ఢిల్లీ లో నివసిస్తున్న ఒక స్వతంత్ర జర్నలిస్ట్.

తెలుగు: ఉదయిని

https://www.adaniwatch.org/hasdeo_tribal_people_brace_for_more_conflict_over_adani_coal_mine

Leave a Reply