ముందుగా పాఠకులకు విజ్ఞప్తి. మీరు చదవబోతున్నది పాణి నవల ‘అనేక వైపుల’పై విమర్శ  కాదు, కనీసం సమీక్ష కాదు. ఇది కేవలం ఒక సామాన్య పాఠకుని  హృదయ స్పందన మాత్రమే. ఎన్నడూ ఏ పుస్తకాన్ని పూర్తయ్యంత వరకు ఒకే మారు చదివే అలవాటు లేని నన్ను, ఈ నవల దాన్ని పూర్తి చేసేంతవరకు మరో పుస్తకాన్నే కాదు, కంప్యూటర్‌ జీవిగా బతికే నన్ను దానికీ దూరం చేసింది. అంత లావు నవల ఎలా చదువుతానా? అనుకున్న నన్ను దానికి కట్టిపడేసాడు పాణి. దానికి కేవల ఆ నవల శిల్పం కారణం కాదు. అందులోని సారమే నన్ను కట్టి పడేసింది. దానికి  రెండు కారణాలుండవచ్చు. రాయలసీమ కేంద్రంగా నడవడం, ఆ అస్తిత్వ ఉద్యమంలో ఒక కార్యకర్తగా నేను కొనసాగుతూ ఉండటం, అది విప్లవంతో పెనవేసుకపోవడం. నేను దానికి సానుభూతిపరుడ్ని కావడం.

అనేక వైపులు నవలలో రచయిత సమాజాన్నే గాక, దాన్ని మార్చే విప్లవోద్యమాన్ని అనేక వైపుల నుండే కాదు, అన్ని వైపులా నుండి, అన్ని కోణాల నుండి చూసాడు. కేవలం చూడటమే కాదు, పరిశీలించాడు, విశ్లేషించాడు కూడా. సమాజంలో ఘర్షణ పడుతున్న భిన్న దృక్పథాలను, విప్లవోద్యమాన్నే కాదు, అందులో ఒక పార్శ్వమయిన భిన్న అస్తిత్వ వుద్యమాలనూ ఎలా చూడాలో పాణి చెబుతాడు. ఇది చాలమందికి, ముఖ్యంగా అస్తిత్వ ఉద్యమాల్లో బలంగా పని చేస్తున్న జెన్నీ లాంటి వారికి మింగుడపడక పోవచ్చు.

సాధన పాత్ర అంత త్వరగా అర్థం కాదు. ఆమె పరిణితి, ఆలోచనా ధోరణి, ప్రాపంచిక దృక్పథం చాలా విశాలమైనవి. ఆమెకు ఎలా అది అలవడిరదో ఆశ్యర్యం కలుగుతుంది. విప్లవకారుల బిడ్డగా,  ఉద్యమంలో అమరురాలయిన తల్లికి కూతురిగా  విప్లవం పట్ల, జరుగుతున్న పోరాటాల పట్ల ఆమెకు   శాస్త్రీయ  దృష్టి ఉంటుంది. అందులోనూ ప్రజా ఉద్యమాలు పెద్దగా లేని కాలంలో, నోరు విప్పితే అర్బన్‌ నక్సల్‌ అనే ముద్ర వేస్తున్న  కాలంలో ఆమెకు చుట్టూరా వున్న సమాజం పట్ల అంత స్పష్టత ఎలా వచ్చింది?  అస్తిత్వ  ప్రభావం నుండి ఎలా తప్పించుకోగలిగింది? ఈమెను ఒక ఆదర్శనీయమైన పాత్రగా, నేటి యువత అనుసరించాల్సిన పాత్రగా భావించవచ్చు. నాకైతే, ఆమె అభిప్రాయాల్లో, ఆచరణలో రచయితే  కనిపించాడు.

 విప్లవానికి కులం, మతం,  ప్రాంతం, లింగ విబేధాలు లేవు. వాటి ఆస్తిత్వాలను గుర్తిస్తుంది. వాటి ప్రజాస్వామిక డిమాండ్లకు మద్దతు తెలుపుతుంది. అవి నెరవేరడానికి పని చేస్తుంది. వాటి పరిమితులను తెలియజేస్తూ వాటిని తనలో  కలుపుకొని అందరి ఆకాంక్షలను తీరుస్తుంది. విప్లవం తల్లి లాంటిది. భిన్న ఆలోచనలు, ఆకాంక్షలు గల  తన బిడ్డలందరినీ అక్కున చేర్చుకుంటుంది. వారి తప్పొప్పులను   సరిజేయడానికి ప్రయత్నిస్తుంది. మందలిస్తుంది. లాలిస్తుంది. ఎవరినీ తక్కువగా చూడదు. ఎక్కువుగా చూడదు. అందరి ఆకాంక్షలు తీరే   దారి చూపుతుంది. తానూ వెంట నడుస్తుంది, అందరినీ నడిపిస్తుంది. దీన్ని మనం సాధన పాత్రలో చూడవచ్చు. విప్లవంలో అమరురాలైన   సరోజకు ఎంతో, పెంచిన సుధకూ, విజయలక్ష్మికీ అంతే. ఆమె అందరి బిడ్డ. ఆమె విప్లవ ప్రతీక.

మరో ఆకర్షణీయమైన పాత్ర ప్రధాన్‌. ఒక విధంగా ఆయన విప్లవోద్యమానికి ప్రతీక అని చెప్పవచ్చు. ఆయన తీక్షణ, సునిసిత దృష్టికి కనిపించని అంశం లేదు. విప్లవోద్యమ ఆటుపోట్లను అనుభవించిన వ్యక్తిగా ఆయన సమాజ విశ్లేషణ చాలా శాస్త్రీయమైనది. మాట నెమ్మదేగాని  అభిప్రాయ వ్యక్తీకరణలో ఎలాంటి శషబిషలు వుండవు. తనను తానూ స్వీయ విమర్శకు గురిచేసుకోవడమే గాక, తానూ భాగమైన విప్లవోద్యమపు పొరపాట్లను నిస్సంకోచంగా వ్యక్తం చేయగల నికార్సయిన విప్లవకారుడు.  ‘మన వ్యూహంలో భాగంగా ప్రజా యుద్ధాన్ని తీవ్రతరం చేశామనే సంగతి మధ్యతరగతికి చెప్పి ఒప్పించడంలో ఫెయిల్‌ అయ్యాం.. నిర్భంధాన్ని నిలువరించే స్థాయిలో ప్రజాస్వామిక పోరాటాల నిర్మించాలి.. ఇందులో మనం ఘోరంగా ఫెయిల్‌ అయ్యాం (పేజీ 672) అంటాడు.  ఇంకో చోట ఆయనను ఉద్దేశించి జమీల్‌ అంటాడు. ‘అందమైన పోగులు ఎన్ని వున్నా అల్లే వాళ్లు కావాలి. తెగిపోయిన దారాలని అతికేసేవాళ్లు కావాలి. చిక్కుముళ్ళు పడకుండా చూసే వాళ్ళు, గజిబిజిగా అల్లుకుంటే తీసే వాళ్లు కావాలి అని (పేజి 762) అంటాడు.

సమాజంలో వివిధ రంగాలలో, సమూహాలలో విప్లవ సానుభూతిపరులున్నారు. వారికి ఉద్యమం పట్ల, తమ దుస్థితికి కారణాల పట్ల స్పష్టత లేదు. వారందరినీ సమీకరించి దిశానిర్దేశం చేస్తూ సంఘటిత ఉద్యమాలకు సిద్ధం చేయగల ఆర్గనైజర్‌ కావాలి. ప్రధాన్‌ ఆ ప్రయత్నంలోనే వున్నారు. అయితే సాధన  చెప్పినట్టు లభ్యమవుతున్న ఉపకరణాలు సానబెట్టి వినియోగించడం ఒక ఎత్తయితే, ఉపకరణాలనే తయారు చేసుకోవడం నేటి ఆవశ్యకత.  ‘నీవు చెప్పిన పని అవసరమైనదే, కానీ అది రొటీన్‌. ఇప్పుడు ఆ దారపుపోగుల తయారీయే ఎక్కడికక్కడి కుటీరపరిశ్రమలుగా మారవలసి వున్నది. దానికవసరమైన కాటన్‌ పండిరచాల్సి వున్నది.

అంతకన్నా ముందుగా నేలను సాగుచేయవలసి వున్నది. మనం పండిరచే పంటకు తగినట్లుగా భూమిని సారవంతం చేయవలసి వున్నది’ అంటూ సాధన నూతన ఆర్ధిక విధానాల   తర్వాత యువత ఎలా మానసికంగా తయారైందో, సమిష్టితత్వం విడిచి వ్యక్తివాదంలో కూరుకపోయిందో, వాళ్లను కదిలించగల అవకాశాలేమిటో, ఈ పరిస్థితిలో విప్లవోద్యమం ఎలా మరల పునాది నుండి పనులు ప్రారంభించాల్సిన అవసరం ఉన్నదో  తెలుపుతుంది.

ఇక్కడే సాధారణ కార్యకర్తలు చతికిలపడతారు. పరిస్థితులు అనుకూలంగా లేవని, అవి అనుకూలంగా మారాక మళ్ళీ ఆచరణలోకి వెళ్దామని అనుకుంటారు. దాంతో నిష్క్రియాపరులవుతారు. అయితే, ప్రధాన్‌లాంటి సీనియర్‌ కార్యకర్తల ఆలోచనలు వేరే వుంటాయి. నిత్య ఆచరణే మనకు దారి చూపిస్తుందంటారు. పరిస్థితులు  బాగాలేనిమాట నిజమే. దానిమీద సరైన అంచనా ఉండాల్సిందే. కానీ, ‘అదే మనందరి ఆలోచనలను మందగింప జేస్తుంది.. అంటాడు. ఆలోచనలు వాటికవే నిలువనీటిలా మారిపోయే ప్రమాదం ఎప్పుడూ ఉండేదే. ప్రాక్టీస్‌లో ఉన్న వాళ్లకు ఈ ఇబ్బంది లేదని భ్రమ పడతాం. పరిస్థితులపై  మన అంచనా మన క్రియాశీలతను పెంచుతుందా? లేక నిస్సహాయతను పెంచుతుందా? అనేది తేల్చుకోవాలి. రాజకీయాలపట్ల చిత్తశుద్ధి ఉన్నంత మాత్రాన లాభం లేదు. పనిచేస్తూనే కాసింత మానసిక విరామం తీసుకొని ఆలోచించాలి. అప్పుడు ఈ గడ్డుకాలాన్ని ఛేదించుకొని ముందుకు వెళ్ళే కాలిబాట దొరుకుతుంది’ అంటాడు ప్రధాన్‌. నిజమే కదా! గుడ్డి ఆచరణ మాత్రం సరిపోదు. ఆచరణ నుండి పొందిన అనుభవాల్ని విశ్లేషించాలి. తప్పొప్పులను సవరించుకొని భవిష్యత్‌ మార్గాన్ని నిర్దేశించుకోవాలి. ఎంత పరిణితి చెందిన పరిశీలన ప్రధాన్‌ది!

విప్లవోద్యమం అంటే కేవలం కొంతమంది సాయుధ పోరాటకారులది కాదని, అన్ని రంగాల్లోని  అన్ని సమూహాలలోని పీడితులదనే  వాస్తవాన్ని  విప్లవోద్యమం ఎప్పుడో పరిగణలోకి తీసుకుంది. అసలు విప్లవమంటేనే  నేటి దోపిడీ వ్యవస్థను సమూలంగా పెకిలించి ఎలాంటి దోపిడీ, పీడన, అసమానతలు లేని సమాజ నిర్మాణం. ఆ పోరాట క్రమంలో కొంతమేరకు సమాజం మార్పు తేగలిగింది. అన్ని సమూహాలలోని పీడితులు చేతనైనంత భాగమవుతున్నారు. తమ న్యాయమైన హక్కుల కోసం గొంతెత్తుతున్నారు. అయితే అవన్నీ పాక్షిక విజయాలే.

మారుతున్న సమాజంలో కొత్తగా ఏర్పడిన వర్గాల సమీకరణ ఎంత అవసరమో విప్లవోద్యమానికి స్పష్టత ఉందని  ప్రధాన్‌  మాటల్లో మనకు తెలుస్తుంది. ‘మనం ఆరోజుల్లో కార్మిక, కర్షక, విద్యార్థి, మేధావి ఐక్యత అన్నాం చూడు. ఇప్పుడు కారణాలేమైనా మునుపటిలా లేవు. ఆ లిస్టులోకి కొత్తవి చాలా వచ్చి చేరాయి. దళితులూ, ముస్లింలు, సాఫ్ట్‌ వేర్‌ కార్మికులు, నిరుద్యోగ విద్యావంతులు.. ఇంకా చాలా మంది. వీళ్ళంతా కలువకపోతే విప్లవం విజయవంతం కాదు.. అంటూ ప్రాధాన్‌ పై సమూహాలన్నిటినీ  సంఘటితం చేయాలంటాడు. అందుకు వారు జీవితావసరాల కోసం చేస్తున్న ఉద్యమాలలో విప్లవకారులు పరోక్షంగా, విప్లవ సానుభూతిపరులు ప్రత్యక్షంగా భాగస్వాములు కావాలంటాడు  ప్రధాన్‌.

భిన్న సమూహాల అసంతృప్తిని పెంచుతూ, వారి ప్రజాస్వామిక నిరసనల క్రూరంగా అణచివేస్తూ, శత్రువే విప్లవానికి అనుకూలమైన  వాతావరణాన్ని  సృష్టిస్తున్నాడని, అయితే ఆ సమూహాలకు  విప్లవోద్యమం చేరువగాకుండా అనేక అవరోధాలను కలుగచేస్తున్నాడని వాటిని అధిగామించాల్సిన అవసరం ఉందని కూడా  ప్రధాన్‌ చెబుతాడు.

ఇట్లా   సమకాలీన సమాజ  సమస్యలనూ, వాటి పరిష్కారానికి విప్లవోద్యమం చేస్తున్న ఆలోచనలనూ, ప్రయత్నాలనూ ఈ నవల వివరిస్తుంది.   సారాంశంగా..ఈ నవల-విప్లవోద్యమానికి ఎన్ని కోణాలు, ఎన్ని తలాలున్నాయో మన ముందుంచింది. జీవనదిలా నిత్యం మనలో గలగలా పారుతూ, అన్నిటినీ కలుపుకొని, చెత్తను దులుపుకొని, ముందుకు సాగుతూనే వుంటుంది విప్లవం.  ఒక్కొక్కసారి వడివడిగా, మహోధృతంగా, మరొక్కసారి నెమ్మదిగా,  ఇంకోసారి పూర్తిగా కదలనట్టుగా కనపడుతూ అయినా ముందుకే, అవసరాలబట్టి, పరిస్థితులనుబట్టి నడక మార్చుకుంటూ – అయినా తన గమ్యం వైపే పయనిస్తున్నది. విప్లవం అనేక రూపాల్లో సాగుతూ ఉంటుంది.   రూపం మారుతున్నదేమో గానీ, దాని స్వభావం, సారం, లక్ష్యం మారదు. సమాజంలోని విభిన్న వ్యక్తుల అంతః సంఘర్షణలను, లోన దాచుకున్న స్వేచ్చా, సమానత్వ ఆకాంక్షలను, ప్రేమ, ద్వేషం లాంటి సహజాతాలను తనలో సంలీనంచేసుకొని వారి కలలకు వాస్తవ రూపమిచ్చే సాధనమే విప్లవోద్యమం. ఈ పయనంలో ఎన్ని పూలు రాలాలో, మరిన్ని మొగ్గలు వికసించి  పరిమళాలు వెదజల్లాయో? ఎంత విషాదమో, ఎంత ఆనందమో? ఎన్ని కన్నీళ్ళో? ఎన్ని ఆనంద భాష్పాలో?

ఈ నవలలో   జగతి,   జెన్నీ,   రమణ,  చందన్‌, వెంకటరెడ్డి, నాగి రెడ్డి, కొండారెడ్డి, బిస్మిల్‌, సుదర్శన్‌, సదాశివం,  రజాక్‌, సుల్తానా.. తదితర పాత్రలు ఇప్పుడు మన కళ్ళముందు జీవిస్తున్న వారే. ఎందరో భిన్న వ్యక్తులు, భిన్న ఆకాంక్షల సమాహారం విప్లవం. ఈ పాయలన్నీ చివరకు సాధన అనే నదిలో చేరాల్సిందే. తమ ఆకాంక్షల నెరవేర్చుకునేందుకు ఆమెతో పయనించాల్సిందే. దిశానిర్దేశం జేసే ప్రధాన్‌ ఉండనే ఉన్నాడు. ఒకరు విప్లవం ఆశించే  నేటి యువతకు ప్రతినిధి. మరొకరు ఉద్యమ అనుభవాలతో తలపండిన వారు. ఇలాంటి నవల రాయడం విప్లవంలో తాదాత్మత చెందిన పాణి లాంటి వారికే సాధ్యం. విప్లవోద్యమ క్రమంలో పొందిన బాధలు, ఆనందాలు, జయాప జయాలు, ఆశనిరాశల నడుమ విప్లవం పట్ల నిబద్ధత, విజయంపై  నమ్మకం ఉన్నవాళ్లకే ఇది సాధ్యం. ఆ నవల  మనల్ని కన్నీళ్లు పెట్టిస్తుంది..అదే సమయంలో భవిష్యత్తుపై ఆశనూ కలిపిస్తుంది. నిరాశ, నిస్పృహల్లో  కూరుకున్నవారికి ఉత్సాహం కలిగిస్తుంది.   దిగాలుపడి కూర్చున్న వారికి చేయందించి నిటారుగా నిలబెడుతుంది. ముందుకు నడవమని ప్రోత్సహిస్తుంది.

ఇక.. కనిపించీ, కనిపించని, వ్యక్తావ్యక్త నల్లమల గురించి:

నల్లమలా, నల్లమలా!  ఇప్పటికీ, గోచరాగోచరంగా మా ముందుకు వచ్చి ఎన్ని కన్నీళ్ళు కార్పిస్తున్నావు తల్లీ. మద్దూరు, వేంపెంట దళితులపై దాడులు.. తప్పయింది సామీ అంటూ కాళ్ళా వేళ్లా పడే దళితులకు దిక్కారస్వరాన్నిచ్చింది నీవే కదా! భూస్వామ్యానికి, పితృస్వామ్యానికి బలైపోతూ, కట్టు బానిసలుగా ఉండిన దళిత మహిళల నిరసన కంఠానివి  నీవే కదా! నీవు ఇంత చేస్తే పాలక వర్గాలు ఎలా సహిస్తాయనుకున్నావు తల్లీ.  మద్దూరు దళిత మహిళలపై   దమనకాండను నిరసించింది, దానికి వ్యతిరేకంగా అన్ని ప్రజాస్వామిక శక్తులనూ కూడగట్టిందీ నీవే కదా! వేంపెంటలో దళితులపై అగ్రకుల భూస్వాముల దాడులకు వ్యతిరేకంగా, మే నెల మిట్ట మధ్యాహ్నపు టెండలో అర్ధనగ్న ప్రదర్శనలు చేయగల చేవ, సాహసం నీవిచ్చిందే గదమ్మా! ఎన్నన్ని  చెప్పను తల్లీ! రైతు కూలీల కోసం, ధాన్యపు, విత్తన సహకార సంస్థలు ఏర్పాటు చేసుకోడానికి నీవు ఇచ్చిన విశ్వాసం,  ఆత్మ స్థైర్యం  ప్రజలు మరిచిపోరులే తల్లీ! నీవు ఇప్పుడు మా దగ్గర లేవు. నీ జ్ఞాపకాలు మమ్మల్ని వీడవు. ఇలాంటి నవలలు నిన్ను మేం మరచిపోకుండా మాయని గాయంతో సలుపుతూనే వుంటాయి.  

   పాణీ, ఎందుకయ్యా మాపై ఇంత కక్ష?  ఏదో ప్రభుత్వ ఫించన్‌ తీసుకుంటూ సంసారపు ఊబిలో, నూతిలో కప్పలాగా జీవిస్తున్న మాకు గతాన్ని జ్ఞాపకం తెస్తూ,  మేం చేయాల్సిన పనులు జ్ఞాపకం జేస్తూ,  మాలాంటి వారిని కదపాలనేగా కదా నీ ఆశ. నిరాశా సంద్రంలో కొట్టుకపోతున్న మాకు, మార్పుపై ఆశ కల్పించి మరలా ఆచరణకు సిద్ధం చేయాలనుకోవడమే కదా నీ ఉద్దేశం.  నీవు ప్రధాన్‌వు కావొచ్చు, సాధనవూ కావచ్చు. మేం కనీసం చందన్‌, జేన్నీలమైనా  కావాలేమో కదా!

Leave a Reply