అక్టోబర్‌ 4,2024. రాత్రి పడుకోబోయే ముందు వాట్సాప్‌ ఓపెన్‌ చేస్తే ఓ జర్నలిస్టు మిత్రుడి నుండి మెసెజ్‌ దర్శనమిచ్చింది “అబుజ్‌మాడ్‌ ఎన్‌కౌంటర్‌ గురించి ఏమైనా వివరాలున్నాయా..?” అంటూ. అతనో మీడియా సంస్థలో పనిచేస్తున్నా విషయం కన్ఫర్మ్‌ కోసం అప్పుడప్పుడు అడుగుతూ వుంటాడు. విప్లవ రాజకీయాల పట్ల సానుభూతిగా ఉంటూ, ఆ రాజకీయాలను దగ్గరి నుండి గమనిస్తుంటాను అనే కారణంతో కొంత మంది జర్నలిస్టు మిత్రులు ఏదైనా సమాచారం కోసం అప్పుడప్పుడు అడుగుతూ వుంటారు. అతని మెసెజ్‌ చూసే వరకూ అబూజ్‌మాడ్‌లో ఎన్‌కౌంటర్‌ జరిగింది అనే విషయమే తెలియపోవడంతో వాట్సాప్‌ గ్రూపుల్లో ఏదైనా సమాచారం దొరుకుతుందేమో అని ఒక్కొక్కటిగా వెతుకుతూపోయాను. “అబూజ్‌మాడ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌” అనే వార్త తప్ప పెద్దగా సమాచారం ఎక్కడా దొరకలేదు. జాతీయ ఛానళ్లో పనిచేస్తున్న ఒకరిద్దరిని అడిగి చూస్తే “భారీస్థాయిలో నక్సల్‌ హతమైయినట్లు సమాచారం ఉంది కానీ పూర్తి సమాచారం అందలేదన్నట్లు” అటువైపు నుండి సమాధానం.

ఏమైనా సమాచారం దొరుకుతుందేమోనని ఆ రాత్రంత్రా ఇంగ్లీషు, తెలుగు, హిందీ, ప్రాంతీయ ఛానళ్లలు వెతుకుతూపోయాను, అంతటా ఓకేవార్త, బహుశా పోలీసులు పంపించిన వార్త కావచ్చు అదే అంతటా కనిపిస్తూ వుంది.  ఒక వార్త సంస్థ చనిపోయిన మావోయిస్టులు 26 అంటే, ఇంకోటి 28 అంటుంది, మరోకటి 30మందికి పైగా అంటు రాసుకొచ్చింది. బహుశా పోలీసులకు కూడా ఎంతమంది అనే విషయం తేలనట్లుంది అందుకే స్పష్టత లేదు. తెలవారితే తప్ప పూర్తి సమాచారం దొరికే అవకాశం లేకపోవడంతో ఆ రాత్రంతా భారంగా గడిపా.

చాలా కాలంగా ఏదైన ఎన్‌కౌంటర్‌ వార్త వినగానే ఆదోరకమైన ఆందోళన మొదలవుతోంది. ఆ రాజకీయ విశ్వాసాల పట్ల అభిమానం కారణంగా అలా జరగడానికి వీలులేదు కానీ చాలా కాలంగా తెలిసిన వ్యక్తులు, భాగా పరిచయం ఉన్న వ్యక్తులు అప్పటి దాక ఐక్యసంఘటనల్లో కలిసిపనిచేసిన వ్యక్తులు, దోపిడిలేని సమాజాన్ని కాంక్షించి విప్లవోద్యమ బాట పట్టి అమరులుగా తిరిగివస్తున్నది చూస్తుండటం ఓ కారణం అనుకోవచ్చు.

తెలంగాణ ఉద్యమ కాలంలో తరచూ కనిపిస్తూ, వివిధ సందర్భాల్లో కలిసి కార్యక్రమాల్లో పాల్గొన్న వివేక్‌, శృతి, ప్రజాకళామండలి ప్రభాకర్‌  వంటి వ్యక్తులు ఉద్యమబాట పట్టి అమరులుగా తిరిగి వచ్చిన జ్ఞాపకాలు ఇంకా మెళిపెడుతున్నప్పుడు ఇలాంటి ఎన్‌కౌంటర్‌ వార్తలు ఆందోళన కలిగించడం సహజమే కదా?. కాస్తో కూస్తో పరిచయం ఉన్న వ్యక్తుల మరణమే ఇంతలా ఆందోళన కలిగిస్తే ఆ వక్తులతో బంధాన్ని ఏర్పరుచుకున్న ఆ ఉద్యమ పార్టీకి, వాళ్ల సహచరులకు, ఆ కుంటుంబ సభ్యులకు ఆ మరణవార్త ఎంతటి ఆశనీపాతం..?

కాంకేర్‌ అడవుల్లో 28 మంది మావోయిస్టులను హత్యచేసిన ఘటన మరవక ముందే మరో భారీ నష్టం కలగడం ప్రజా ఉద్యమానికి తీరని నష్టం. కాంకేర్‌ ఎన్‌కౌంటర్‌ తర్వాత బస్తర్‌కు నిజనిర్ధారణ కోసం నాతో పాటు మరో నలుగురం వెళ్లినప్పుడు ఎంతోమంది ఆదివాసీలను మావోయిస్టుల పేరుతో బూటకపు ఎన్‌కౌంటర్లకు పాల్పడుతున్నారో కళ్లారా చూసి వచ్చిన జ్ఞాపకం మరువక ముందే మరో ఎన్‌కౌంటర్‌ వార్త వినాల్సి రావడం ఈ ఆందోళనకు మరోకారణం. పైగా మావోయిస్టులకు కంచుకోటగా వుండే అబూజ్‌మాడ్‌ వంటి ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్‌ జరిగిందని తెలియడంతో ఆందోళనతో పాటూ ఆనేక ప్రశ్నలు రేకేత్తాయి.

అక్టోబర్‌ 5వ తేదీన పత్రికలన్నీ అబూజ్‌మాడ్‌ మారణకాండ గురించి వార్తను మోసుకొచ్చాయి. మరణించిన మావోయిస్టుల శవాలతో పాటూ వారి వివరాలు, వారి తలలపై వున్న వెల ప్రచురించాయి. పేపర్‌ ముందేసుకొని వివరాల కోసం అక్షరాల వెంట కళ్లు పరిగెడుతుంటే దండకారణ్య కమిటీ సభ్యురాలు నితి  అలియాస్‌ ఉర్మిళ అనే పేరు కనిపించగానే  ఒక్కసారిగా ఒళ్లంతా చల్లబడ్డట్లు అయిపోయింది. ఇంకెవరున్నారో అంటూ కళ్లు వెతుకుతున్నాయి కానీ మైండ్‌ పనిచేయడం లేదు.

అబూజ్‌మాడ్‌ అనే పేరు నేను మొదటి సారి విన్నది బహుశా ‘నితి’ ద్వారానే. ఒకరకంగా నితి  –  అబూజ్‌మాడ్‌ అనే రెండు పేర్లను ఒకేసారి విన్నానేమో..!

మావోయిస్టులకు కంచుకోటలా ఉండే అబూజ్‌మాడ్‌ గురించి అక్కడి మనుషుల గురించి గత పదిహేనేళ్లుగా వింటూ, చదువుతూ వస్తున్నా మాడ్‌కు సంబంధించిన మొదటి జ్ఞాపకం మాత్రం ఎప్పటికీ చెదిరిపోదు.

మాడ్‌ అటవీ ప్రాంతంలో నిర్మించతలపెట్టిన ఆర్మీ ట్రైనింగ్ క్యాంపు నిర్మాణాన్ని విరమించుకోవాలని కోరుతూ ఐదు గురు సీఏఎఫ్‌ (CAF) కు చెందిన జవాన్లను, ఒక పౌరుడిని మావోయిస్టు పార్టీ 2010లో కిడ్నాప్‌ చేసింది. 2010 జనవరి 24వ తేదీన డ్యూటీ నుండి సెలవుల్లో ఇంటికి తిరిగి వెళుతున్న క్రమంలో ఒక బస్సులో నుండి కిడ్నాప్‌ చేసి తీసుకెళ్లారు. ఆ కిడ్నాప్‌కు నాయకత్వం వహించింది 30 ఏళ్ల ఆదివాసీ మహిళా మావోయిస్టు నితి  అలియాస్‌ ఉర్మిళ..!

ఆ మరుసటి రోజు ఒక పౌరుడిని విడుదల చేసినప్పటికీ తమ 11 డిమాండ్లను నెరవేర్చితే తప్ప తమ చెరలో బంధీలుగా ఉన్న జవాన్లను విడిచిపెట్టే ప్రశక్తే లేదని నితి  పేరుతో మీడియాకు ప్రకటన విడుదల చేశారు. ఆ కిడ్నాప్‌కు సంబంధించిన వార్త, మాడ్ గురించి, అక్కడి పరిస్థితుల గురించిన సమాచారం వారం రోజుల పాటూ నిత్యం జాతీయ వార్తల్లో ఏదో మేరకు వస్తుండేది. మావోల డిమాండ్స్‌ నెరవేరి ఆ జవాన్లు విడుదలయ్యారో లేదో తెలియదు కానీ ఆ తర్వాత ఆ వార్త మాత్రం ఎక్కడా కనిపించలేదు. కానీ ఒక ఆదివాసీ మహిళా రాజ్యానికి ఎదురునిలిచి సవాళు విసరడం మామూలు విషయం కాదు కదా..!?

ఆ తర్వాతా ఓ మూడు నెలలకు అనుకుంటాను గౌతమ్‌ నవలఖా (Goutam Navlakha) EPW లో రాసినా ‘Days and Nights in the Heartland” ద్వారా మరో మారు ‘ నితి’ గురించి తెలుసుకోవడం.

దాదాపు 16 రోజుల పాటు ఆయన, యాన్ మిర్డాల్ దండకారణ్యంలో ‘మాడ్ ‘ తదితర ప్రాంతాలను అధ్యయనం చేసి అక్కడి పార్టీని, ఏరియా బాధ్యులని కలిసి మాట్లాడి అనేక విషయాలను అందులో రాశారు (యాన్ మిర్డాల్ తన వయసు రిత్య, మొకాళ్ళ నొప్పి కారణంగా మాడ్ కు వెళ్ళలేకపోయాడు). తర్వాత అదే పేరుతో ఒక పుస్తకాన్ని కూడా రాశాడు. ఆ సందర్భంగా మాడ్ ఏరియాకు నాయకురాలుగా వున్న నితి గురించి గౌతమ్‌ నవలఖా అక్కడక్కడా ప్రస్తావిస్తూ వచ్చాడు.

మాడ్ ప్రాంతంలో ఆదివాసీలకు జనతన సర్కార్ ద్వారా అందుతున్న విద్యా, వైద్యం గురించి, జనతన సర్కార్ బడ్జెట్ ను ఏ ఏ రంగాలకు ఎలా పంచుతుంది అనే విషయాన్ని ”నితి ‘ ద్వారా చెప్పే ప్రయత్నం చేశాడు గౌతం.

మాడ్ లో భూమిని దున్ని వ్యవసాయం చేయడం అంటే దేవుడి శాపానికి గురవుతామని భావించే ఆదివాసీ సమాజంలో వాళ్ళను క్రమంగా వ్యవసాయం వైపు మళ్లించడం, ఏ చిన్న అనారోగ్యం సంభవించిన తాంత్రికులను ఆశ్రయించే ఆదివాసీలను ఆధునిక వైద్యం అందించడం వంటి అంశాలను గౌతం నవ్లాక్ తో పంచుకుంది నితి .

ఆ తర్వాత కొంత కాలానికి అరుంధతి రాయ్‌ రాసిన ‘‘వాకింగ్‌ విత్‌ కామ్రేడ్‌’’ ద్వారా నితి  గురించి మరింత సమాచారం తెలిసింది. (గౌతం నావ్లాక్ కన్న అరుంధతీ రాయ్ ముందుగా దండకారణ్యానికి వెళ్లివచ్చింది). బీజాపూర్‌ జిల్లాలోని గంగలూర్‌ ఏరియా పరిధిలోని ఇర్మగుండ గ్రామానికి చెందిన నితి  మొదట్లో దక్షిణ బస్తర్‌లోని కాంత్రికారి మహిళా సంఘటన్‌లో పనిచేసి, 1997 నుండి పార్టీలో కొనసాగుతూ పాలకుల దృష్టిలో మోస్ట్‌వాంటెడ్‌గా మారిపోయింది. అరుంధతీ రాయ్‌  నితి ని సంబంధించిన ఆసక్తి కరమైన వివరాలు తన పుస్తకంలో నమోదు చేసింది.

‘‘2007లో ఇన్నార్‌ అనే గ్రామంలో నితి  ఉందని తెలిసి ఆమెను హతమార్చేందుకు 700 మంది బలగాలు ఆ గ్రామాన్ని చుట్టుముట్టారంటే అర్థం చేసుకోవచ్చు ఆమె ఎంత మోస్ట్‌ వాంటెడ్‌ అనేది’’ అంటుంది అరుంధతీ రాయ్.

సాధారణ ఆదివాసీ మహిళగా ఉన్న ఊర్మిళ తన గ్రామానికి వచ్చే దళాన్ని గమనిస్తూ, దళానికి చేదోడువాదోడుగా వుంటూ, మహిళా సంఘంలో పనిచేస్తూ..క్రమంగా పార్టీలో చేతి ‘నితి ’గా మారిన క్రమాన్ని, అస్తిత్వమున్న మహిళగా తనను తానూ ఎలా నిలదొక్కుకుందో ‘పెళ్లి’ కథలో (2019) తాయమ్మ కరుణ అద్భుతంగా చిత్రీకరించింది.

ఒకనాడు పెళ్లిగోల నుండి తప్పించుకోవడానికి దళాల వెంట తిరిగిన ‘నితి’, లక్షలాది మంది గుమిగూడిన ‘భుంకాల్‌ సభలో ఏకే47ని భూజాన వేసుకొని మాట్లాడున్న దృశ్యాన్ని వర్ణిస్తున్నప్పుడు ఆది చవివే ప్రతి ఒక్కరిలో ఓ చెరగని ముద్రని వేస్తుంది. చాలా కాలంగా భుంకాల్‌ సభలో నితి  మాట్లాడిన ఆ దృశ్యం నన్ను వెంటాడింది.

సల్వాజుడుం వ్యవస్థాపకుడు, ఆదివాసీ దోపిడీ దారుడైన మహేంద్ర కర్మను 2013లో మావోయిస్టు పార్టీ హత్యచేసినప్పుడు మహిళా మావోయిస్టులు కసితీరా మహేంద్ర కర్మను 78 కత్తిపోట్లు పొడిచి హత్యచేసారని పత్రికలు ఏకరువు పెట్టాయి..ఆ మహిళలో ఊర్మిళ అలియాస్ నితి  వంటి కరుడు గట్టిన మహిళా మావోయిస్టులున్నారని నాటి బస్తర్ ఐజీ ఆర్.పి కల్లూరి కన్నెర చేసాడు.

నితి  గురించి ఈ విషయాలన్నీ తెలుసుకుంటున్నప్పుడు, చదువుతున్నప్పుడు నితి  ఎలా వుండొచ్చు అని చాలా కాలంగా ఆలోచిస్తూ వచ్చాను. కానీ మొన్నీ మధ్య తంగళాన్ సినిమాలో తన కాళ్ళకింది నేల కోసం ‘ఆరతి’ ఆరాటాన్ని చూస్తున్నప్పుడు..ఆ నేలని, ఆ నేల కింది సహజ సంపదను రక్షించుకోవడానికి దోపిడీ దారులతో, వాళ్లకు సహకరించే సొంత వాళ్ళతో పోరాడే విధానాన్ని చూస్తున్నప్పుడు ‘ఆరతి’ లో ‘ నితి ’ కనిపించింది.

ఆరతి లాంటి దండకారణ్య నితి ల పొట్ట చీల్చితే తప్ప వాళ్ళ కాళ్ళకింది సంపదను దక్కించుకోమని భావించిన భారత పాలకవర్గాలు నితి  లాంటి వాళ్ళను హత్యచేస్తున్నారు. రక్తం చిందిన ప్రతి సారి ఆరతి పదే పదే పుట్టుకొచ్చినట్లుగా దండకారణ్య నేలనుండి నితి లు పుట్టుకొస్తూనే ఉంటారు.

గౌతం నవ్లాఖా, యాన్ మిర్దాల్ దండకారణ్య పర్యటన ముగించుకొని గెరిల్లాకు వీడ్కోలు చెప్పి తిరిగిస్తున్నప్పుడు “దాదా ఈ రోజు మీరందరూ వెళ్లిపోతున్నందుకు మాకు బాధగా ఉంది. మేము మళ్ళీ కామ్రేడ్ యాన్ మిర్డాల్ ని కలవలేమని చర్చించుకున్నాము. కానీ నువ్వు మళ్ళీ వస్తావు కదా?” అని నవ్లాఖాను ఆర్తిగా అర్ధించిన ‘ నితి ’ ఇవాళ అమరురాలైంది.. ఆమెను తీర్చిదిద్దిన దండకారణ్యం మాత్రం ఇంకా పోరాడుతూనే వుంది.

(అబూజ్ అంటే అర్ధం కానిది అని. బ్రిటిష్ పరిపాలన కాలం నుండి కూడా ఏవరు అక్కడికి వెళ్లలేకపోవడంతో ఆ ప్రాంతాన్ని అబూజ్ మాడ్ గా వ్యవహరించడం జరుగింది. అక్కడి స్థానిక ప్రజలు దానిని మాడ్ అనే పిలుస్తున్నారు. అక్కడి ప్రజలు అబూజ్ మాడ్ గా పిలవడాన్ని వ్యతిరేకిస్తున్నారు. అది ప్రభుత్వం పెట్టిన పేరు మాత్రమే. కానీ గత 30 ఏళ్లుగా అక్కడ రామకృష్ణ మిషన్ నిర్వహణలో 5 విశాల హిందూ పాఠశాలలు పని చేస్తున్నాయి. ఇప్పుడు అక్కడ మారుమూలకి కూడా రహదారి సౌకర్యం ఉంది. పదుల సంఖ్యలో సైనిక క్యాంపులు ఉన్నాయి. తాజాగా విప్లవోద్యమాన్ని నిర్మూలించే పేరుతో మాడ్ లో సైనిక కేంద్రం ఏర్పాటు కోసం 1,34,000 ఎకరాలు భూమిని స్వాధీనం చేసుకోవడం కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం చేస్తుంది. దీనిని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. )    

2 thoughts on “అబూజ్‌మాడ్‌ ‘ఆరతి’

  1. కామ్రేడ్ ఊర్మిళకు జోహార్లు. తన అమరత్వం తీరని లోటు.

Leave a Reply