పీడిత ప్రజల  ఆకాంక్షల అణచివేసేందుకు, తమ దోపిడీ సజావుగా కొనసాగేందుకు పాలకులు తొలి నుండి ఆయుధాలను ప్రయోగించడం మనం చూస్తున్నదే. అయితే, ప్రజాస్వామ్య, రాజ్యాంగ ముసుగులో అదే పనిజేస్తూ, మధ్య తరగతి బుద్ధిజీవులను నమ్మించేందుకు, పాలకులకు చట్టాలు ఉపయోగపడుతాయి.

అయితే, ఆ రాజ్యాంగాన్ని రాసుకున్నదెవరు? ఆ చట్టాలను చేస్తున్నదెవరు?, వాటిని వాఖ్యానించేదెవరు?అనేది విశ్లేషిస్తే, వారు పాలకవర్గాల బంట్లేనని తేలుతుంది.  ఎన్నికల ద్వారా అధికారం చేపట్టిన ప్రభువులు ఎవరి సేవలో తరిస్తారో నాటి హిట్లర్ నుండి నేటి మోదీ వరకు, అటూ, ఇటూ తేడాతో అన్ని రాజకీయపార్టీలు మనకు విశదం చేశాయి. చట్టాలు సంపన్నులకు చుట్టాలని శివసాగర్‌ ఊరికే అనలేదు మరి.  అర్బన్‌  నక్సలైట్‌ అనేపదాన్ని మొదట సృష్టించిన వ్యక్తి వివాదాస్పద హిందూత్వవాది, సినీ నిర్మాత వివేక్‌ అగ్నిహోత్రి. 1917లో ‘‘స్వరాజ్య’’ అనే మేగజైన్‌లో వాడాడు. ఆ తర్వాత 2022లో పోలీసు అధికారులతో సూరజ్‌ ఖండ్‌లో నిర్వహించిన చింతన్‌శిబిర్‌లో మోదీ వాడాడు.  ఆ విధంగా ఆదివాసీల, దళితుల, ఇతర నిర్వాసితుల హక్కులకై కలాన్ని, గళాన్ని వినియోగిస్తున్న రచయితల, మేధావుల గొంతు నొక్కేందుకు పాలకులు ఈ ముద్రను వినియోగిస్తున్నారు.

మహారాష్ట్ర ప్రభుత్వం భీమా-కారేగావ్‌ కేసులో రచయితల, మేధావుల, హక్కుల కార్యకర్తలను నిర్బంధించేందుకు వారిపై అర్బన్‌ నక్సల్‌ ముద్ర  వేసింది. అయితే, ఆ  పదానికి సరైన నిర్వచనమేమిటో ఇంతవరకు ప్రభువులవారు సెలవివ్వలేదు. అయినా ప్రజాపక్షపాత రచయితల, మేధావుల కలాలను, గళాలను  బంధించాలని అనుకోవడం పాలకుల భ్రమేనని చరిత్ర చెబుతున్న సత్యం.

ఇంత వరకు చేసిన మీసా, నాసాలాంటి చట్టాలు ఎంత అమానుషమైనవైనా, నిరంకుశమైనవైనా ప్రజాపోరాటాలను ఆపలేకపోయాయి. అయినా, పాలకులు నిర్బంధాలతో ప్రజల ఆకాంక్షలను అణచివేయలేక పోతున్నాయి.

 ‘‘సత్యాన్నిచాటిచెప్పే రచయితలను నిర్బంధించగలరేమోగానీ, సాక్ష్యంగా బతికే ప్రపంచాన్ని ఏం చేయగలరు’’ అన్నారు వివి.

ఈ జూలై11న, మహారాష్ట్ర ప్రభుత్వం పట్టణ ప్రాంతాలలో నక్సలిజం కట్టడికై అసెంబ్లీలో ఒక నూతన బిల్లు, మహారాష్ట్ర పబ్లిక్‌ సెక్యూరిటీ బిల్లును ప్రవేశపెట్టింది. ఈ బిల్లును ప్రవేశపెడుతూ ప్రభుత్వం దానికి కారణాలుగా ఇప్పుడు నక్సలిజం కేవలం కొన్ని రాష్ట్రాలలో మారుమూల ప్రాంతాలకే పరిమితం కావడం లేదని, అది పట్టణ ప్రాంతాలకూ వ్యాప్తిచెందుతూ వస్తున్నదని, పట్టణ, నగర ప్రాంతాలలో నక్సల్‌  సానుభూతిపరులు, సంస్థలూ నక్సలైట్లకు వసతి కల్పిస్త్తూ, వారి వ్యూహ రచనలకూ తోడ్పడున్నాయని, ఆ కార్యకలాపాలను అరికట్టేందుకు ఈ చట్టం అవసరమని ప్రభుత్వం చెబుతున్నది.

అంతేకాదు, నక్సల్‌ ప్రమాదాన్ని అరికట్టేందుకు చత్తీస్‌ఘడ్‌, తెలంగాణా, ఒడిస్సా రాష్ట్రాలు అనేక చట్టాలు జేసాయని, నక్సల్‌ అనుబంధ సంస్థలంటూ 48 సంస్థలను నిషేధించాయని తన ప్రతిపాదనను ప్రభుత్వం సమర్థించుకుంది. అయినా ప్రజా  ఉద్యమాలను అవి అణచలేకపోయాయనే వాస్తవం మహారాష్ట్ర ప్రభుత్వం గ్రహించకపోవడం దాని అవివేకం.

ఈ బిల్లులోని ప్రధాన ప్రతిపాదనలు ఏ సంస్థనైనా అనుమానితసంస్థగా పేర్కొంటూ నిషేధించడానికి ఈబిల్లు ప్రభుత్వానికి విశేష అధికారమిస్తుంది. ఇక, వ్యక్తులను ఈకింది కారణాలపై శిక్షించవచ్చు.1) ‘‘నిషేధితసంస్థ’’ సభ్యులుగావుండటం. 2)సభ్యులుగాకపోయినా, నిషేధిత సంస్థకు నిధులు సమకూర్చడం. 3)నిషేధిత సంస్థ నిర్వహణ, లేక నిర్వహణలో సహాయకారిగా వుండటం. 4) నిషేధిత కార్యక్రమాలలో పాల్గొనడం.

పైన పేర్కొన్న నాలుగు నేరాలకు శిక్ష-అపరాధ రుసుం రూ.2లక్షల నుండి 5లక్షల వరకు వేయడమే గాక, 2 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల వరకు వుంటుంది. అంతేగాక, చట్టవ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొంటే, మరింత కఠినమైన శిక్ష ఏడేళ్ళ జైలు శిక్ష అనుభవించడంతో పాటు  ఐదు లక్షల రూపాయలు ఫైన్‌ చెల్లించాలి. ఇక, ఈ నేరానికి బెయిల్‌ వుండదు. వారంట్‌ ఇవ్వాల్సిన అవసరం లేదు.

ఉపాకు, మహారాష్ట్ర బిల్లుకు మధ్య తేడాలు:

నక్సలిజానికి వ్యతిరేకంగా వినియోగించిన అతిక్రూరమైన ఉగ్రవాద వ్యతిరేక చట్టం ఉపా. సంస్థలను చట్టవ్యతిరేక సంస్థలుగా ప్రకటించే అధికారాన్ని ప్రభుత్వానికి ఉపా చట్టం కూడా కలిగిస్తుంది. సంస్థలును చట్టవ్యతిరేకమైనవిగా ప్రకటించేందుకు ఉపా, మహారాష్ట్ర చట్టాలు, రెండూ ఒకేవిధమైన విధివిధానాలు కలిగి వున్నాయి. ఉపా చట్టం కింద, ప్రభుత్వ అధికార ప్రకటనకు, హైకోర్టు  జడ్జి అధ్యక్షతన ఒక ట్రిబ్యూనల్‌ ఆమోదముద్ర వేయాలి. మహారాష్ట్ర చట్టం ప్రకారం హైకోర్టు న్యాయమూర్తి అర్హతలుగల ముగ్గురితో ఏర్పాటు జేసిన ఒక సలహాకమిటీ ఏర్పాటు జేస్తారు. ఆ కమిటీ రాష్ట్రప్రభుత్వపు నిర్ణయాన్ని అంగీకరించాలి.

మహారాష్ట్ర బిల్లు ప్రకారం చట్టవ్యతిరేక కార్యకలాపాలు అంటే ఏమిటి?:

ఉపా చట్టంలాగా ఈ బిల్లు కూడా ‘‘చట్టవ్యతిరేక కార్యకలాపాల’’ నేవాటినన్నింటినీ నేరమయం(షతీఱఎఱఅaశ్రీఱంవ) చేస్తాయి. కానీ ఆ కార్యకలాపలంటే ఏమిటి అనేది ఉపా, మహారాష్ట్ర బిల్లులో భిన్నంగా వున్నాయి. ఉపా ప్రకారం చట్టవ్యతిరేక కార్యకలాపాలంటే- భారతదేశం నుండి ఒక ప్రాంతం విడిపోవడం అని నిర్వచనం వుంది. భారతదేశ సార్వభౌమత్వాన్ని, దేశసమగ్రతను నిరాకరించడం, ప్రశ్నించడం, విఘాతం కలిగించడం లేక, అలా చేసే ఉద్దేశ్యం కలిగి వుండటం. చట్టవ్యతిరేక కార్యకలాపాలంటే ఏమిటో గత కొన్ని సంవత్సరాలుగా కోర్టులు నిర్వచిస్తునే వున్నాయి. వాటిని వాఖ్యానించడంలో కొన్ని న్యాయపరమైన ప్రమాణాలున్నాయి. అయితే, మహారాష్ట్ర చట్టంపై నిర్వచనం కింద చేర్చే కార్యకలాపాలు ఆ ప్రమాణాలను చాలా తగ్గించింది. ఉపా కింద కేసు నమోదు చేయాలంటే కేంద్రం లేక, రాష్ట్రానికి చెందిన అధికారి అనుమతి కావాలనీ, అందువల్ల ఉపా కింద నిందితులను విచారించడానికి అడ్డంకిగ ాఉంటుందని ఆ ప్రభుత్వ అధికారుల అభిప్రాయం. ఈ ప్రతిపాదన కిందపై అనుమతి జిల్లా మేజిస్ట్రేట్‌ లేక పోలీసు కమీషనర్‌ ఇవ్వవచ్చు. దాంతో నేరవిచారణ సులభతరం, వేగవంతం అవుతుందంటారు ప్రభుత్వఅధికారులు..

ఈ బిల్లు అత్యంత అమానుషమైనది.  ఏ సంస్థనైనా ప్రభుత్వం గెజెట్‌ ప్రకటన ద్వారా అర్బన్‌ నక్సల్‌గా ప్రకటించవచ్చు. ఎటువంటి విచారణ లేకుండానే నిందితులను వారి ఇంటి నుండి వెళ్ళగొట్టడం, అతని బ్యాంక్‌ అకౌంట్లను స్వాధీనం చేసుకొనే అధికారాన్ని ఈ బిల్లు ఇస్తుంది.  అంతేకాదు, ఈ బిల్లు నిషేధిత సంస్థలో క్రియాశీలక కార్యకర్తకు, సానుభూతిపరులకుకి మధ్యతేడా చూడదు. ఇవన్నీ భీమాకోరేగావ్‌ కేసులో కొంతమందికి బెయిలు మంజూరు జేస్తూ సుప్రీంకోర్టు ‘‘కేవలం సాహిత్యం, అది హింసను ప్రేరేపించేదిగా లేక ప్రచారం జేసేదిగా ఉన్ననూ, దాన్ని ఉపా చట్టంచాప్టర్‌1ప మరియు ప1 పరిధిలో నేరంగాపరిగణించబడవు’’ అని సుప్రీంకోర్టు చేసిన వాఖ్యానానికి పూర్తిగా విరుద్ద్ధమని చెప్పవచ్చు..

ఈ బిల్లు ప్రకారం, ఈ కింది కార్యకలాపాలను మాటల్లోగాని, చేతల్లోగాని చేపడితే, అవి చట్టవ్యతిరేక కార్యకలాపాలవుతాయి.

1)ప్రజల శాంతిభద్రతలకు ప్రమాదాన్ని కలిగించేవి.

2)శాంతిభద్రతల నిర్వహణలో జోక్యం కలిగించుకోవడమో లేక, కలిగించుకొనే ఉద్దేశ్యం కలిగిఉండడం.

3)చట్టసంబంధిత పాలనలో, లేక దాని సంబంధిత సంస్థల, అధికారుల కార్యకలాపాలలో జోక్యం కలిగించుకోవడమో లేక కలిగించుకొనే ధోరణి కలిగి ఉండేవి.

4)నేరపూరితచర్యల వల్లగాని, లేకవాటితో బెదిరించడంవల్లగాని, మరే విధంగానైనా రాష్ట్ర, కేంద్రసిబ్బందితో సహా, ప్రభుత్వ అధికారుల కార్యకలాపాలను అడ్డుకోవడం.

5)ప్రజల్ని భయబ్రాంతులకు గురిజేసె హింసాత్మక ప్రచారానికి, చర్యలకుపాల్పడడం, లేక, తుపాకులను, ఇతర పేలుడు పదార్థాలను వినియోగించడం, లేకవాటిని ప్రోత్సహించడం లేక రైలు, రోడ్డు, విమాన, నౌక రవాణ సౌకర్యాలను దెబ్బతీయడం

6)ఇప్పుడున్న చట్టాలను న్యాయస్థానాలను ధిóక్కరించమని బోధించడం లేక, ప్రోత్సహించడం

7)పైన తెల్పిన చట్టవ్యతిరేక కార్యకలాపాలలో ఒకటి, లేక ఎక్కువ వాటి కొరకు ధనాన్ని లేక వస్తువులను సేకరించడం

ఈ బిల్లు మహారాష్ట్ర ప్రభుత్వపు కాలపరిమితి ముగిసే ముందు అసెంబ్లీలో ప్రవేశపెట్టబడిరది. అది చట్టం కావడమనేది రాబోయే ప్రభుత్వంపై, నవంబర్‌ ఎన్నికల తర్వాత, ఆధారపడి వుంటుంది. ఈలోగా, ఆర్డినెన్సు తెస్తే, అది మరో విషయం. అసలు ‘‘అర్బన్‌ నక్సల్‌’’ అనే పదం ప్రభుత్వ నిఘంటులో లేనే లేదని నాటి గృహ శాఖ రాష్ట్రమంత్రి కిరణ్‌ రెడ్డి పార్లమెంటు సాక్షిగా ప్రకటించారు. ఇక ఈ బిల్లులో ఆ పదాలకు నిర్దిష్ట నిర్వచనం లేకపోవడం గమనార్హం.

ఈ బిల్లు పట్ల ప్రతిపక్షాలు  తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం జేసాయి. సిపిఐ(ఎం) మహారాష్ట్ర రాష్ట్ర కార్యదర్శి డా.ఉదయనర్కర్‌ ఈ బిల్లును వ్యతిరేకిస్తూ, బిజెపి నాయకత్వంలో, కూటమి ప్రజల నిరసన తెలిపే హక్కును కాలరాసేందుకే ఈబిల్లును ముందుకు తెచ్చిందన్నారు. ఎమ్మెల్యేలకు దానిపైచర్చించే కనీస అవకాశం ఇవ్వలేదని ఆయన విమర్శించారు. రాబోయే ఎన్నికల ముందు ఈబిల్లు, ప్రతిపక్షాలను అణచివేసేందు ప్రతిపాదించారని వామపక్షాలు అభిప్రాయం వ్యక్తం చేసాయి. ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ వర్కింగ్‌ అధ్యక్షుడు అరీఫ్నసీంఖాన్‌ మాట్లాడుతూ  ఈ బిల్లును దుర్వినియోగం చేసేందుకే తెచ్చారని, ఇప్పుడున్న చట్టాలు నక్సల్స్‌ను అదుపుజేయడానికి సరిపోతాయన్నారు. అంతేగాక, దానికి వ్యతిరేకంగా తాము పోరాడుతామన్నారు.రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్షనాయకులు, విజయ్వాదేట్టివార్‌ అభిప్రాయంలో  అర్బన్‌ నక్సల్స్‌ను అణచివేసే సాకుతో, ప్రతిపక్షాలను, సామాన్యప్రజలను అణచేసేందుకై ఈ బిల్లును ప్రవేశపెట్టారన్నారు. ప్రతిపక్షపార్టీలకు వాటి భయం వాటికుంది. బిజెపి అధికారంలోకి ివచ్చాక, తన విధానాలను ప్రశ్నిస్తున్న అందరినీ ఒకేగాట కట్టేసివారిపై రకరకాల వేధింపులకు, దాడులకు దిగుతూ వస్తూంది. దాంతో విప్లవకారులపై గతంలో అమానుషంగా దాడులు జేసినా పట్టించుకోని కాంగ్రెస్‌, సిపిఐ(ఎం)పార్టీలకూ నేడు అలాంటి దాడులకు గురికావలసి వస్తుందనే భయం పట్టుకోవడం సహజమే. అందుకే నక్సల్స్‌ అణచివేతకు ఉపా చట్టముండగా, ఈ కొత్తబిల్లు ఎందుకని వారి వాదన.

ఈ బిల్లును ప్రతిపక్షాలు నిలువరించకపొతే, దానికి వ్యతిరేకంగా వీధిపోరాటాలు చేయాల్సి ఉంటుందని, దీనివల్ల మహారాష్ట్ర పోలీసురాజ్యమవుతుందని, అసమ్మతిని, నిరసనను అర్బన్‌  నక్సలిజంగా పరిగణిస్తారని తుషార్‌   గాంధి అంటారు. మానవహక్కుల కార్యకర్త తీస్తాసెతల్వాద్‌ ఈ బిల్లును వ్యతిరేకిస్తూ, అందులోని ఏడు సెక్షన్లు మానవహక్కులను ఉల్లంఘించడమేగాక వాటి నిర్వచనంలో అస్పష్టత ఉందన్నారు. ’’ఇది రాజ్యాంగ వ్యతిరేక, అత్యంత అమానుష చట్టం కాబోతుంది. జమ్మూ కాశ్మీర్‌, చత్తీస్‌ఘడ్‌, ఒరిస్సాల తర్వాత, అర్బన్‌ నక్సల్స్‌ను కట్టడి చేసే సాకుతో, మహారాష్ట్ర చేయబోతున్న అమానుషమైన చట్టం ఇది. అర్బన్‌ నక్సల్స్‌ అనేది చట్టబద్ధ నిర్వచనం లేనిది, రాజకీయంగా నిందవేయబడ్డపదం. ఇది, నిరసనను, అసమ్మతిని నేరంగా పరిగణిస్తూ, రచయితల, అకడమిక్స్‌ను, క్రియాశీలకార్యకర్తలను, ప్రతిపక్షనాయకులను నిర్బంధించేందుకు ఫాసిస్టు శక్తులు ఉపయోగించే పదం ఇది’’ అన్నారు.

 ఈ బిల్లుపై మరింత వివరణ యిస్తూ ఆమె, ‘‘సెక్షన్‌2((f)) నుంచి ((Vii)) వరకు అన్నింటిని దుర్వినియోగం చేసే అవకాశం ఉందన్నారు. ఆ సెక్షన్‌లోని ప్రజాశాంతి భద్రతలకు, ప్రశాంతతకూ ప్రమాదం,  హాని కలింగించు’’ అనే దాన్ని వాఖ్యానించడం సమస్యాత్మకమైనది. Menace అనేపదాన్ని ఎక్కడా నిర్వచించలేదు. డిక్షనరీ ప్రకారం, ఆ పదానికి అర్థం-వ్యక్తుల ప్రమాదకర కార్యకలాపాలు. అందువల్ల ఏదైనా ప్రమాదమంటూ, దాన్ని ఈచట్టం కింద చేర్చవచ్చన్నారు. అంతేగాక,సెక్షన్‌9 మేజస్ట్రేట్‌, పోలీసు కమీషనర్‌కు పూర్తి అధికారాన్ని కల్పిస్తుందని, దాంతో, వారు అర్బన్‌ నక్సల్స్‌ ఆవాస ప్రాంతమని ప్రకటించినా, ఆప్రాంతాన్ని స్వాధీనం జేసుకొని అక్కడివ్యక్తులను బయటకు తరిమేయవచ్చన్నారు.

సుప్రసిద్ధ లాయర్‌, మానవహక్కుల నేత కొలిన్‌ గాన్‌ స్లేవేస్‌ (Colin Gonslevs)) మాట్లాడుతూ, రాజ్యాంగం ప్రజలకు రాజ్యం యొక్క అత్యంత హానికరమైన విధానాలను శాంతియుతంగా  ప్రతిఘటించే హక్కును ఇచ్చిందని, అది పౌరుల కర్తవ్యమన్నారు. అధికారంలో వున్న వారు చెట్లను నరికి వేయడం, వాతావరణాన్ని కాలుష్యపరిచే  చట్ట వ్యతిరేక పనులకు పాలపడినప్పుడు తాను ప్రజలను వాటిని అడ్డుకోమని చెబితే, అలాగే చిత్రహింసలకు, బూటకాపు ఎన్‌కౌంటర్లకు  వ్యతిరేకంగా  జరిగే ఆందోళనలో  తాను పాల్గొంటే ఎలా నేెరమవుతుందని ప్రశ్నించారు. అంతేగాదు, నక్సలైట్‌కు కూడా తనకు రాజ్యాంగపరంగా, చట్టపరంగా వున్న హక్కులను తెలుసుకొనే హక్కు వుందన్నారు. ఇక సుప్రీం కోర్టు, కేవలం వామపక్ష సాహిత్యం కలిగి వుండటం నేరం కాదని భీమాకొరేగావ్‌ కేసులో అక్రమ నిర్బంధంలో ఉన్న వెర్నన్‌ కేసులో  తీర్పునిచ్చిందని చెబుతూ కొలిన్‌ గాన్‌ స్లేవస్‌ అయినా, అలాంటి  సాహిత్యాన్ని కలిగి వుండటం నేెరమని మహారాష్ట్ర బిల్లులో వుందన్నారు. ఆందోళనలలో పాల్గొనడం నేరం కాదని సుప్రీంకోర్టు షోమాసేన్‌ వాజ్యంలో తీర్పు ఇచ్చిందని, అయితే బిల్లులో అలా పాల్గొంటే మూడు సంవత్సరాల  జైలు శిక్ష  వుందన్నారు. ఆ విధంగా ఆయన, ఈ బిల్లు నెడున్న చట్టాలను, రాజ్యాంగాన్ని ఎలా ఉల్లంఘిస్తున్నదో వివరించారు.

ఇలాంటి ప్రజా వ్యతిరేక చట్టాలను పాలకులను  రూపొందించడాన్ని విశ్లేషిస్తూ ‘‘న్యాయవ్యవస్థ తరచూ మనల్ని నిరాశ పరుస్తూ ఉండడంతో, తమ పిల్లలకై  ఒక ఉన్నతమైన ఇండియా కోసం శాంతియుతంగా ఉద్యమాల నిర్వహించేవారందరినీ  ఒక సాలెగూడులో  ఇరికించేందుకు అత్యంత ప్రమాదకర చట్టాలని చేసేందుకు ప్రభుత్వం ధైర్యపడుతున్నది’’  అన్నారు.  ఈ బిల్లును అందరూ వ్యతిరేకించాలని పిలుపు నిచ్చారు.

మరో హక్కుల నాయకుడు సుభాష్‌ ఘటాడే పై బిల్లుపై ఒక వివరమైన వ్యాసం రాస్తూ, ఆ బిల్లులోని అర్బన్‌ నక్సల్‌ అనే పదం,  1950ల నాటి రిపబ్లికన్‌  పార్టీ సెనేటర్‌ మెకార్తె అమెరికాలో నాడు ‘‘కమ్యూనిస్టు నాయకుల, క్రైస్తవ మతం మధ్య యుద్ధం జరుగుతుందని ’’ అన్న మాటలను  గుర్తుకు తెస్తుందన్నారు. నాడూ, నేడూ జరుగుతున్నది కేవలం ఔఱ్‌షష్ట్ర నబఅ్‌ మాత్రమేనని ఆయన అభిప్రాయం. అందువల్ల మన హక్కులను , సెక్యూలర్‌,  సోషలిస్టు , సర్వసత్తాక, ప్రజాస్వామ్య, రిపబ్లిక్‌ ను కాపాడుకొనేందుకు  మనం త్యాగాలకు సిద్ధం కావాలి అని ఘటాడే పిలుపునిచ్చారు.

జర్నలిస్టుల బృందమూ ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించింది. ఆ యూనియన్‌  కార్యదర్శి ఇంద్రకుమార్‌  మాట్లాడుతూ, ‘‘చట్టవ్యతిరేక’’అనే పదానికి ఏ అర్థాన్నయినా  ఇవ్వవచ్చనీ, దాని కింద ప్రకృతి వైపరీత్యాలను, ఆరోగ్యసంబంధ  రోగాల గురించి, చివరకు బ్రిడ్జిలు కూలడం గురించి రాసిన వారినీ ఆ చట్టంకింద శిక్షించే అవకాశముందన్నారు. కోవిడ్‌-19 సమయంలో దానివ్యాప్తి గురించి రాసిన 50మందికిపైగా జర్నలిస్టులను, ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నారని అరెస్టు  చేసిన విషయం ఆయన తెలిపారు. (ఎవరి భయం వారిది). పియుసిఎల్‌  మహారాష్ట్ర శాఖ ఈ బిల్లును తీవ్రంగా ఖండిస్తూ, అది నిరంకుశమైనది, రాజ్యాంగవ్యతిరేకమైనది, విశాల అర్థం కలిగినది, ఏకపక్షమైనదేగాక, దుర్వినియోగానికి అవకాశమిచ్చేదిగా ఉందన్నారు.

 పై భయాందోళనలు విశ్లేషిస్తే వ్యవస్థ మార్పుకు పోరాటం జేస్తున్న శక్తుల మాట అటుంచి, ఆ ప్రజా పోరాటాలకు మద్దతునిస్తూ భావజాలరంగంలో పనిజేస్తున్న రచయితలూ, మేధావులతోపాటు, ఈ వ్యవస్థలోనే కాస్త వెసులుబాటుకై పరితపించేవారు, ఈ రాజ్యాంగమిచ్చిన భావప్రకటనా స్వాతంత్రం కాపాడుకోవాలని వాంఛించే  మధ్యతరగతి మేధావులు, ఉదారవాదులకు ఈ పాలకుల విధానాలు భయపెడుతున్నాయని అర్థమవుతుంది. అయినా, ఈ వ్యవస్థలోనే, ఈ రాజ్యాంగపరిధిలోనే నిజమైన ప్రజాస్వామ్యం, రాజకీయ, ఆర్థిక, సాంఘిక సమానత్వం సాధించగలమనేవారికి ఎవరైనా ఏం జెప్పగలం.  అదే విధంగా పాలకులకూ

   ‘‘అరచేతిని అడ్డుపెట్టి

    సూర్యకాంతినాపలేరు.

    అరెస్టులసాగించి

   ప్రజాశక్తినడ్డలేరు’’ అనే అమరుడు సుబ్బారావు పాణిగ్రాహి చెప్పిన మాట  అర్థం కాదు. 

Leave a Reply