ఫాసిజాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అది ఎట్లా పని చేస్తున్నది? దేనికి ఫాసిజం ఇంతగా బలపడిరది? ఈ సమస్య ఇప్పటికిప్పుడే వచ్చిందా? దాన్ని ఏ ఒక్క కోణంలోనో ఎదుర్కొని ఓడించగలమా ? అనే ప్రశ్నలకు ప్రగతిశీల, లౌకిక శక్తుల మధ్య ఏకాభిప్రాయ సమాధానాలు లేవు. ఎప్పటికైనా వస్తాయా?  నిజానికి ఇది అవగాహన సమస్యనా? లేక ఆచరణ సమస్యనా? ఆలోచించాలి. ఫాసిస్టు వ్యతిరేక ఆచరణకు సిద్ధం కావడంలో ఉన్న తేడాలు కూడా దీనికి కారణం కావచ్చు. వీటన్నిటికీ తోడు ఫాసిజం  గురించి ప్రజలకు  ఎట్లా చెప్పాలి? వాళ్లను ఎట్లా ఫాసిస్టు ప్రభావం నుంచి బైటికి తీసుకరావాలి? ప్రజాస్వామిక ఉద్యమంలో భాగం చేయాలి? అనే సవాళ్లు ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ ప్రగతిశీల శిబిరాన్ని ఇప్పటికీ వెంటాడుతూనే ఉన్నాయి.

ఎన్నికల ద్వారా ఫాసిస్టులను అధికారంలోంచి దించేయాలనే వ్యూహానికి ఉన్న ప్రాధాన్యతను కాదనేది లేదు. కానీ ఎన్నికలయ్యాక ఫాసిస్టు వ్యతిరేక పోరాటాలు అప్రధానమవుతాయి. దీనికి ఎన్నికల రాజకీయాలే కారణం.  వ్యక్తులను బాధ్యులను చేయడం అంత బాగుండదు. మళ్లీ దేశంలో ఎక్కడో ఒక చోట ఎన్నికలు రాగానే  సహజంగానే సమస్య మీద కేంద్రీకరణ పెరుగుతుంది.

అయితే మనం ఫాసిజం అంటున్న దాని గురించి ఫాసిస్టులు ఏమనుకుంటున్నారు? గత పదేళ్ల అనుభవాలను వాళ్లు ఎట్లా విశ్లేషించుకుంటున్నారు? ఇటీవలి సాధారణ ఎన్నికల్లో బొటాబొటిగా బైటపడ్డం మీద ఎలాంటి అంచనాలకు వచ్చారు? అనేవి చాలా ఆసక్తికరమైనవి. ప్రగతిశీల శిబిరం విస్తరించకపోవడానికి అవతలి వాళ్ల స్వీయ పరిశీలనలకు తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడం ఒక కారణం కావచ్చు.

ఎప్పటికైనా ఎదుటి పక్షాన్ని ఓడిరచాలంటే ముందు మన అంచనాలు బలపడాలి. సమగ్రం కావాలి. ఫాసిజం గురించి మనం  అనుకుంటున్న ప్రతి అంశమూ ప్రధానమే కావచ్చు. కానీ అన్నిటినీ కలిపి చూడాలి. ‘అప్రధానాల’ని   కొన్నిటిని పక్కకు తోసేస్తున్నామా? సున్నితంగా పరిశీలించాల్సిన వాటితో మొరటుగా వ్యవహరిస్తున్నామా? మిలిటెంట్‌గా ఉండవలసి చోట మితవాద తెలివితేటలు ప్రదర్శిస్తున్నామా? పరిశీలించాలి. ఈ నిండైన చూపు ఉంటే సమస్యను సమగ్రంగా చూస్తాం.  దీంతోపాటు  అవతలి వాళ్ల వ్యూహాన్ని కూడా లెక్కలోకి తీసుకుంటాం. వాళ్ల ప్రమాదకర ఎత్తుగడలను సీరియస్‌గా పరిగణిస్తాం. వాస్తవ పరిస్థితుల నుంచి సత్యాన్ని చేరుకోడానికి ప్రయత్నిస్తాం.

ఇలాంటి అవగాహనకు మనం ఎప్పటికైనా రాగలమా? బహుశా ఫాసిజం మీది పోరాటం దీర్ఘకాలికం అనుకున్నాక ఇది తప్పదు. ఫాసిజాన్ని ఆర్థిక రంగానికో, సాంస్కృతిక రంగానికో, రాజకీయాలకో పరిమితం చేసే ధోరణి ప్రగతిశీల శిబిరంలో ఇప్పటికీ ఉన్నది. ఫాసిజం భావజాల శక్తి అనీ, రాజకీయ శక్తి అనీ వేరు చేసే వాళ్లున్నారు. ఫాసిజానికి పునాది సనాతనత్వమా? లేక రాజకీయార్థికమా?అని చర్చించేవాళ్లూ ఉన్నారు. ఈ సందిగ్థత వాస్తవాలను తెలుసుకోడానికి ఆటంకంగా మారింది.

కానీ ఫాసిస్టు కుటుంబం మాత్రం చాలా స్పష్టంగా ఉంది. మొదటి నుంచీ వాళ్లు ఎప్పుడు ఏది ముఖ్యమో గ్రహించి దాన్ని వాడుకున్నప్పటికీ ఒక సమగ్రమైన అవగాహన ఉన్నది. తమ లక్ష్యం కోసం అన్ని రంగాలను  సంపూర్ణంగా సిద్ధం చేయాలనే వ్యూహం ఉన్నది. వాళ్లు దేన్నీ విడిగా చూడటం లేదు. దీనికి  జూలై 8న వాషింగ్టన్‌ అంతర్జాతీయ వేదిక మీద జరిగిన హిందుత్వ శక్తుల జాతీయ సంప్రదాయ సదస్సు ఉదాహరణ. ఇందులో ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకుడు రామ్‌మాధవ్‌ ప్రసంగాన్ని జాగ్రత్తగా గమనించాలి.  సంఫ్‌ు నాయకులు గతంలో కూడా ఇట్లా మాట్లాడి ఉండవచ్చు. కానీ సాధారణ ఎన్నికల అనంతర సందర్భంలో రామ్‌మాధవ్‌ వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఉంది. వాళ్లు తమను తాము సాంస్కృతిక జాతీయవాదులమని చెప్పుకున్నప్పటికీ హిందుత్వ.. సామాజిక శక్తి అనీ, రాజకీయ శక్తి అనీ ఆయన మరోసారి ప్రకటించాడు.  దేశంలోని అన్ని రంగాలను తాము ఆక్రమించుకున్నామని, ఉదారవాద, వామపక్ష శక్తులు అంచుల్లోకి వెళ్లిపోయాయని అన్నాడు. సోషలిజం అనే మాటకు ముగింపు ఇచ్చామని అన్నాడు.

 దేశంలో ఉదారవాద ఆదర్శాలకు, వామపక్ష ఆశయాలకు చోటు లేకుండ చేశామనే విశ్వాసం అందులో ఉంది. ఒక వేళ ఎన్నికల్లో ఈ విడత సీట్లు తగ్గి ఉండవచ్చు. అయినా సమాజమంతా తమ చేతుల్లో ఉందని ఆయన చెప్పుకోదలిచాడు. బహుశా ఆ అర్థంలో సామాజిక, సాంస్కృతిక శక్తిగానే తమను తాము గుర్తించుకోవచ్చు. విశ్వవిద్యాలయాలు తమ చేతిలోకి వచ్చాయని కూడా ఇందువల్లే అని ఉండవచ్చు. అట్లని రాజకీయాల విషయాల్లో ఎంత జాగ్రత్తగా ఉండేదీ అంకెల్లో బలహీనపడినప్పటికీ ఈ ఎన్నికల సందర్భంలో చూశాం. రాజకీయాలతో సంస్కృతి కలిస్తే ఎంత శక్తి విడుదలయ్యేదీ ప్రగతిశీల శక్తులకు చాలా స్పష్టంగా తెలుసు. ఈ కలయిక లేకపోతే సంస్కృతీ పోరాటం నీడ మీద తిరుగుబాటుగా మారే ప్రమాదం ఉంది. సంస్కృతిని కేంద్రంగా చేసుకున్నప్పుడు కూడా సెంటిమెంట్ల కంటే రోజువారీ జీవితమే ఆధారం అవుతుంది.

ఈ విషయాలు సంఫ్‌ుపరివార్‌కు కూడా తెలుసు.  ఎన్నికల రాజకీయాల్లో వాళ్ల లక్ష్యం కాంగ్రెస్‌ అనిపిస్తుంది.  అందుకే ఎన్నికల ద్వారా ఫాసిజాన్ని ఓడించాలని  అనుకొనే వారికి కాంగ్రెస్‌ ఆలంబన అవుతుంది. ఇదేమీ అసమంజసం కాదు. ఎన్నికల తర్కం ఇట్లాగే ఉంటుంది. కానీ మనతో ఫాసిస్టులుగా పిలవబడుతున్న వారు తమ బలాలను, బలగాలను కేవలం ఎన్నికల్లోనే చూసుకోవడం లేదు. అన్ని రంగాల నుంచి విస్తరణ ఎత్తుగడలు అల్లుతున్నారు.  ఒక రంగంలో కాస్త ఎదురుగాలి వీచినా ఇంకో వైపు నుంచి విస్తరించగలమనే నమ్మకంతో ఉన్నారు. మొత్తంగా కలిపి తమ అనుకూలతలను అంచనా వేస్తున్నారు. ఈ తరం సంఘ్  వ్యాఖ్యాతగా రామ్‌మాధవ్‌ మాటల్లో ఇంత  విస్తృతి ఉన్నది.  తమ లక్యం ఉదార వాడ, వామ పక్ష శక్తులని ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు. అన్ని వైపుల నుంచి ఉదారవాద, ప్రజాస్వామిక వామపక్ష శక్తులను ఎదుర్కొనే వ్యూహం ఉన్నదంటే ఆ అన్ని వైపుల నుంచి తమ లక్ష్యం దిశగా దేశాన్ని ఆవరించగల పథకం కూడా ఉన్నట్లే. హిందుత్వతో సరికొత్త ఫ్యాషన్‌ ప్రపంచాన్ని నిర్మించగలం అనే ధీమా కూడా ఉన్నట్లే. ఇది వాస్తవంగా మారేకొద్దీ సనాతనత్వం, మితవాదం, మతవాదం పాత వాసనలను వదిలించుకుంటాయి. ఆధునిక వేషధారణలో అవి దేశం నడి వీధుల్లో బోర విరుచుకొని ఊరేగుతాయి. ఉదారవాద లౌకిక విలువలు ఖాళీ చేయించి ఆ జాగాను దురాక్రమిస్తామని వాళ్లకు నమ్మకం ఉంది. బహుశా ఎన్నికల తదనంతరం వాళ్ల పదేళ్ల సమీక్ష ఇదే కావచ్చు. భవిష్యత్‌ ప్రయాణ మార్గం కూడా ఇదే కావచ్చు.

భారతదేశంలో సంస్కృతి పేరుతో చెలామణి అవుతున్నదంతా సనాతన, అగ్రకుల, పితృస్వామ్య, అహేతుక అంధ విశ్వాసాల మూక సంస్కృతి. దీన్ని నేరుగా ముట్టుకుంటే చేతులు కాలిపోతాయి.  సంఫ్‌ు దాన్ని ఎంతయినా వాడుకోవచ్చు. మనుషుల వివేకాన్ని సహితం ఈ బురద గుంటలో పాతర వేయవచ్చు. కానీ ఇవాళ ఈ మూకతత్వం రాజకీయ సంస్కృతిగా మారింది. కార్పొరేట్‌ సంస్కృతిగా విస్తరిస్తున్నది. కాబట్టి రోజువారీ ఆర్థిక జీవితంతో సంస్కృతిని ముడిపెట్టి చూడాల్సిందే. ఈ సమావేశంలో రామ్‌మాధవ్‌ ఇంకో మాట కూడా అన్నాడు.  గత పదేళ్లలో దేశాన్ని ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో నాలుగో స్థానానికి తీసుకొచ్చామని అన్నాడు. అంతక ముందు పదకొండో స్థానంలో ఉండేదని, కార్పొరేట్‌ మార్కెట్‌ విధానం వల్ల ఇది సాధించామని చెప్పడం ఆయన ఉద్దేశం. దీని అర్థం కార్పొరేటీకరణను అధికారిక విధానంగా వ్యవస్థీకృతం చేశామనడం. తీవ్రమైన ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్న దేశంలో ఫాసిస్టులు తమను తాము సామాజిక, రాజకీయార్థిక శక్తిగా ప్రకటించుకుంటున్నారు. దేశాన్ని ముందుకు తీసికెళుతున్నామని అంటున్నారు. కార్పొరేట్‌ ఎకానమీతో వెలిగిపోతున్న దేశంలో దాదాపు సగం జనాభాకు తాను అన్నం పెడుతున్నానని మోదీ ఇంకో పక్క ప్రకటించాడు. అయినా ప్రజలందరి మనసును పట్టుకోడానికి ఆర్థిక రంగంలో అద్భుతాలు సాధించామని చెప్పుకోక తప్పడం లేదు.

అబద్ధాలు, వంచనలు, వక్రీకరణలు, అసంబద్ధ వాదనలకు పాల్పడే సంఫ్‌ు నాయకులు తమ ఆంతరంగిక సమావేశాల్లో, బహింగ వేదికల్లో, పత్రికల్లో తమ విజయాల గురించేగాక భవిష్యత్‌ వ్యూహాల గురించి కూడా చెప్పుకొనే మాటలు ఫాసిస్టు వ్యతిరేక ఉద్యమం పట్టించుకోవాలి. అందులో అతిశయం ఉండవచ్చు. ఊకదంపుడు ఉండవచ్చు. ఎదురుదాడి ఉండవచ్చు. కానీ వాళ్లు కూడా ఈ వాస్తవ ప్రపంచంతోనే వ్యవహరించక తప్పదు. అది ఎట్లా చేస్తున్నారో మరింతగా తెలుసుకోవడం ప్రజాస్వామికశక్తులు చేయాల్సిన ఒక ముఖ్యమైన పని.

Leave a Reply