స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జనవరి 20-25 తేదిలలో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్య్లూఇఎఫ్‌) 2025 వార్షిక సమావేశం తొలి రోజున (జనవరి 20) ఆక్స్‌ఫామ్‌ సంస్థ ‘టేకర్స్‌ నాట్‌ మేకర్స్‌’ పేరుతో ఆర్థిక అసమానతల నివేదికను విడుదల చేసింది. ఇందులో కీలక విషయాలు వెల్లడిరచింది. బిలియనీర్ల సంపద మునుపెన్నడు లేనంతగా పెరిగిపోయిందని, ప్రపంచవ్యాప్తంగా పేదరికంలో మగ్గుతున్న ప్రజలు అనేక సంక్షోభాలను ఎదుర్కొంటున్నారని నివేదిక నొక్కి చెప్పింది. రోజు రోజుకు ప్రపంచంలోని ధనిక, పేద ప్రజల మధ్య ఆర్థిక అసమానతలు నానాటికీ పెరుగుతూనే ఉన్నాయి. ఈ విషయం మరోసారి రుజువైంది. మానవజాతి చరిత్రలో ఇంతకుముందెన్నడూ ఎరగని అసమానతలపర్వం ఇప్పుడు సమాజాన్ని కలవరపెడుతున్నది. ప్రపంచంలో సంపదంతా ఒకవైపు పోగుపడుతుండగా, పేదరికం, దారిద్య్రం దానికి రెండిరతలు వేగంగా అభివృద్ధి చెందుతున్నది. ఇది ఆందోళన కలిగించే అంశం.

ప్రపంచ జనాభాలో సుమారు ఇరవై ఐదు లక్షల మంది దగ్గర యాభై లక్షల కోట్ల డాలర్ల సంపద పోగైంది. ఎందుకీ కోటీశ్వరుల సంఖ్య పెరుగుతోంది? కార్మికులను చేస్తున్న దోపిడీ ప్రభుత్వాలు వారికి అండగా నిలవడమే కారణం అని ఆక్స్‌ఫామ్‌ ఇంటర్నేషనల్‌ చెప్పిన మాటల్ని తేలిగ్గా తీసుకోకూడదు.  1990 నుంచి పేదరికంలో జీవిస్తున్న వారి సంఖ్యలో పెద్దగా మార్పు రాలేదు గానీ ప్రపంచవ్యాప్తంగా బిలియనీర్ల సంపద మాత్రం భారీగా పెరిగిందని తెలిపింది. ప్రపంచ శతకోటీశ్వరుల (బిలియనీర్ల) సంపద 2024లో శరవేగంగా పెరిగింది. ప్రపంచంలోని అందరు బిలియనీర్ల (కనీసం100 కోట్ల డాలర్లు/రూ.8500 కోట్ల నికర విలువ కలిగిన వారు) సంపద 2024లో 2 లక్షల కోట్ల డాలర్లు (రూ.170 లక్షల కోట్లు) పెరిగి 15 లక్షల కోట్ల డాలర్ల (రూ.1275 లక్షల కోట్ల)కు చేరింది. క్రితం సారి (2023) కంటే 2024లో వారి సంపద ఏకంగా మూడిరతలు పెరిగింది.                            

2024లో మొత్తం కుబేరుల సంఖ్య 2,769కి ఎగబాకింది. 2023లో ఉన్న 2,565 మంది బిలియనీర్లతో పోలిస్తే బిలియనీర్ల క్లబ్బులో 2024లో కొత్తగా 204 మంది చేరారు. అంటే సగటున వారానికి నలుగురు బిలియనీర్లు ఆవిర్భవించినట్లు లెక్క. ఇక ఆసియా నుంచి కొత్తగా 41 మంది కొత్త బిలియనీర్లు అవతరించారు. గత ఏడాదిలో ఒక్కో బిలియనీర్‌ సగటున రోజుకు 2 మిలియన్‌ డాలర్‌లు సంపాదించారు. తొలి పది మంది బిలియనీర్ల సంపద 2024లో రోజుకు సగటున 100 మిలియన్‌ డాలర్లు వెనకేసుకున్నారు. గత సంవత్సరం ఆసియాలో కుబేరుల సంపద ఏకంగా 29,900 కోట్ల డాలర్లు పెరిగింది. ఇప్పటిదాకా మనం కుబేరులను చూసే అబ్బో అనుకుంటున్నాం.. ఇకపై ట్రిలియనీర్ల సంగతి విని నోరెళ్లబెట్టాల్సిందే! రాబోయే దశాబ్ద కాలంలో కనీసం ఐదుగురు ట్రిలియనీర్లు ఉంటారని ఆక్స్‌ఫామ్‌ చెబుతోంది. గత ఏడాది ఆక్స్‌ఫామ్‌ లెక్కల ప్రకారం ప్రపంచంలో తొలి ట్రిలియనీర్‌ (సహస్ర కోటీశ్వరుడు)ను చూసేందుకు దశాబ్దం పడుతుందని అంచనా వేసింది. అయితే 2024లో సంపాదించిన వేగాన్ని చూస్తే, దశాబ్ద కాలంలో ఐదుగురు ట్రిలియనీర్లను చూడబోతున్నామని అంచనా వేసింది.

ఒక్క 2023లో నార్త్‌ వరల్డ్‌కి సౌత్‌ వరల్డ్‌ నుంచి గంటకు 30 మిలియన్‌ డాలర్ల సంపద వెళ్లినట్లు పేర్కొంది. ఈ మహా కుబేరులు ఎలా ప్రభవించారు? వారి అపార ధనరాశులు ఎలా వచ్చాయి? ఆ వేల కోట్ల ఆస్తులు వారు కష్టపడి సంపాదించుకున్నవి కాదని, అవి వారు దోచుకున్న ఆస్తులేనని ఆ నివేదిక పేర్కొంది. వారసత్వం, గుత్తాధిపత్యం, ఆశ్రిత పక్షపాతం ద్వారా వారికి ఆ ఆస్తులు సమకూరాయి. పూర్తిగా అవినీతి మార్గాలలోనే వారు బిలియనీరు కావడం జరిగింది. 20-30 ఏళ్లలో 1000 మందికిపైగా బిలియనీర్లు రూ.442 లక్షల కోట్ల సంపదని తమ వారసులకు అందించనున్నట్లు పేర్కొంది. సంపన్నులపై అధిక పన్ను వేయాలని ఆక్స్‌ఫామ్‌ కోరుతోంది. ఆర్థిక అసమానతలపై ఐఎంఎఫ్‌, వరల్డ్‌ బ్యాంక్‌ సైతం ఆందోళనలు వ్యక్తం చేస్తున్నాయని ఆక్స్‌ఫామ్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అమితాబ్‌ బెహర్‌ గుర్తు చేశారు. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్‌ ఒక  బిలియనీర్‌ అని, అతను ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన ఎలాన్‌ మస్క్‌ను సలహాదారుగా ఎంచుకోవడాన్ని గుర్తు చేస్తూ బహుళజాతి కంపెనీలు ఆధునిక వలసవాదాన్ని తీసుకువస్తున్నట్లు ఆక్స్‌ఫామ్‌ డైరెక్టరు బెహర్‌ వివరించారు.

అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌ వంటి ఉత్తర దేశాల్లో ఉన్న ధనవంతుల్లో ఒక శాతం మంది, దక్షిణ దేశాల నుంచి గంటకు రూ.255 కోట్లు తీసుకుంటున్నారని గుర్తు చేశారు.  వలసవాద యుగం అందించిన ఒక ప్రొడక్టే ప్రైవేట్‌ బహుళజాతి కంపెనీలుగా పేర్కొంది నివేదిక. అవి సొంత సైన్యాన్ని తయారు చేసుకుని సంపదను దోచుకున్నాయి. భారత్‌లో ఈస్ట్‌ ఇండియా కంపెనీకి 2.60 లక్షల మంది సైనికులు ఉండేవారని గుర్తు చేసింది. భూఆక్రమణలు, విలీనాలు, కొనుగోళ్ల ద్వారా ప్రపంచంలో తొలి అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థని తెచ్చారని, దీంతో భారత్‌లోని ఐరోపా ఆర్మీ అధికారులు అధికంగా లాభపడినట్లు తెలిపింది. 1940 వచ్చే నాటికి ట్రేడర్లు, బ్యాంకర్లు, పారిశ్రామికవేత్తలు భారీగా లబ్ధి పొందారు. భారత్‌లో ఈస్ట్‌ ఇండియా కంపెనీ పాలనలో మిలిటరీ కోసం 75 శాతం నిధులు కేటాయించగా.. ప్రజా పనులకు 3 శాతమే కేటాయించారు. దీంతో కరువులు తాండవం చేశాయి. ఆధునిక భారత్‌లో ఈ ప్రభావం ఇంకా కనిపిస్తున్నట్లు నివేదిక హెచ్చరించింది. 

ఉత్తర అమెరికా, యూరప్‌లోని సంపన్న, శక్తివంతమైన దేశాలలో నివరిస్తున్న ఒక శాతం కుబేరులు 2023వ సంవత్సరంలో  ఆర్థిక వ్యవస్థల ద్వారా యూరప్‌, ఉత్తర అమెరికా వెలుపల ఉన్న ప్రాంతాల నుండి గంటకు 30 మిలియన్‌ డాలర్లు కొల్లగొట్టారని ఆక్స్‌ఫామ్‌ తన నివేదికలో తెలియజేసింది. కోటీశ్వరుల సంపదలో 60 శాతం వారసత్వం, గుత్తాధిపత్యం, క్రోనీ సంబంధాల నుండి పొందినదేనని ‘టేకర్స్‌… నాట్‌ మేకర్స్‌’ పేరిట విడుదల చేసిన నివేదికలో ఆక్స్‌ఫామ్‌ ఎత్తిచూపింది. సాధారణంగా బిలియనీర్‌లను సంపద సృష్టికర్తలని పాలకులు ముద్దుగా, గౌరవంగా పిలుచుకుంటారు. కానీ వారు సంపద సృష్టికర్తలు కాదు.. స్వీకర్తలేనని ఆక్స్‌ఫామ్‌ స్పష్టం చేసింది. పేద దేశాలను దోచుకోవడం ద్వారానే బిలియనీర్లు సంపద పోగుచేసుకున్నట్లు పారిస్‌లోని ఇనిక్వాలిటీ ల్యాబ్‌ పరిశోధకులు ధ్రువీకరించినట్లు ఈ నివేదిక పేర్కొంది.

బిలియనీర్ల సంపదంతా తమ మేధస్సుతో పెంచుకున్నది కాదని,  ఆశ్రితపక్షపాతం లేదా అవినీతి లేదా మార్కెట్‌ గుత్తాధిపత్యంతో వచ్చిందేనని ఆక్స్‌ఫామ్‌ తెలియజేసింది. ఒకవైపు బిలియనీర్లు ఆకాశమే హద్దుగా సంపాదిస్తుంటే, పేదల బతుకులు మాత్రం ఏమాత్రం మారడం లేదు. ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం 1990లో ప్రపంచవ్యాప్తంగా ఎంత మంది పేదలు ఉన్నారో, నాలుగు దశాబ్దాల తరువాత ఇప్పటికీ ఆ సంఖ్య మారలేదని ఆక్స్‌ఫామ్‌ వెల్లడిరచింది. నాడు 360 కోట్ల మంది దారిద్య్రరేఖ దిగువన ఉండగా, ఇప్పటికీ రమారమి అదే సంఖ్యలో ఉన్నారు. అంటే జనాభాలో పేదలు 44 శాతం మంది ఉన్నారు. అదే సమయంలో ఒక్క శాతం ధనికుల చేతుల్లో 45 శాతం సంపద పోగుపడి ఉంది. ప్రపంచవ్యాప్తంగా పేదలు బహుళ సంక్షోభాలు ఎదుర్కొంటుందని నివేదిక పేర్కొంది.

గత ఏడాది కుబేరుల సంపద రోజుకు సగటున 5.7 బిలియన్‌ డాలర్ల చొప్పున పెరిగింది. 2023లో బిలియనీర్ల సంఖ్య 2,565 నుండి 2,769కి పెరిగింది. ప్రపంచంలో అత్యంత సంపన్నులైన  పది మంది సంపద రోజుకు సగటున వంద మిలియన్‌ డాలర్ల చొప్పున పెరిగింది. ఒకవేళ వారు రాత్రికి రాత్రే తమ సంపదలో 99 శాతాన్ని కోల్పోయినప్పటికీ వారు కోటీశ్వరులుగానే మిగులుతారని ఆక్స్‌ఫామ్‌ తేల్చి చెప్పింది. నేడు అసమానతలు గరిష్ట స్థాయికి చేరడం వెనుక అక్రమ సంపద, వలసవాదం శక్తివంతంగా పనిచేస్తున్నాయి. కోటీశ్వరుల సంపద ఇబ్బడిముబ్బడిగా పెరగడానికి కూడా ఇవే కారణం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం కొందరి చేతిలో బందీగా ఉండిపోయింది. బిలియనీర్లకు అడ్డుకట్ట వేయడంలో జరుగుతున్న పాలకుల వైఫల్యం కారణంగా ట్రిలియనీర్లు పుట్టుకొస్తున్నారు. కోటీశ్వరుల సంపద మాత్రమే పెరగడం లేదు… దానితో పాటు వారి పెత్తనం కూడా పెరుగుతోందని ఆక్స్‌ఫామ్‌ ఇంటర్నేషనల్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అమితాబ్‌ బెహర్‌ చెప్పారు.

వారసత్వం, కుటిలత్వం, గుత్తాధిపత్యం ద్వారా పురుడు పోసుకున్న నూతన ఒలిగార్కీ పెరుగుదల. ఎంపిక చేసిన కొద్దిమందికి మాత్రమే ఉపయోగపడే ఆర్థిక విధానాలు దోపిడీని మరింత పెంపొందించడం ద్వారా సంపద, అధికారం ఒకే చోటికి చేరడాన్ని మనం చూస్తున్నాం.మన దేశంలో చూస్తే అసమానతలు పెరగడానికి ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు ప్రధాన కారణం. కార్పొరేట్ల స్వప్రయోజనాల కోసం పాటుపడటం, వారికి లబ్ధి చేకూర్చే విధంగా చట్టాల్ని తీసుకురావడం, రూల్స్‌ని రూపొందించడం, యథేచ్ఛగా సాగుతున్న అవినీతికి వంతపడటం. ఇంకా ప్రమాదకరమైన అంశం ఏమిటంటే? పాలకులే ఏకంగా బడా పారిశ్రామికవేత్తలతో మిలాఖత్‌ అవ్వడం. ఇలాంటి నాయకులు దేశాన్ని ఏలుతుంటే సంపద కొద్దిమంది వద్దే కేంద్రీకరణ కాకుండా ఎలా ఉంటుంది? ఇప్పుడు భారత్‌లో జరుగుతున్నది కూడా అదే.

వలసవాద రోజుల్లోనే కాదు… ఇప్పటికీ దక్షిణ భూగోళ సంపదను ఉత్తర భూగోళ బిలియనీర్లు తరలించుకుపోతున్నారు. ఉత్తర భూగోళానికి చెందిన ఒక్క శాతం ఐశ్వర్యవంతులు గంటకు 30 బిలియన్‌ డాలర్ల చొప్పున ఏడాది కాలంలో దక్షిణ భూగోళం నుంచి 263 బిలియన్‌ డాలర్లు సంపాదించారని ఆక్స్‌ఫామ్‌ నివేదిక వెల్లడిరచింది. వారిలో 68 శాతం మంది ఉత్తర భూగోళంలోనే నివసిస్తుండడం విశేషం. కాగా, ఉత్తర భూగోళంలో ఐదో వంతు ప్రపంచ జనాభానే ఉంటుంది. ఇదంతా కూడా నయా వలసవాదాన్ని సూచిస్తుందని ఆక్స్‌ఫామ్‌ పేర్కొంది.

1765 నుంచి 1900 మధ్య భారత నుంచి బ్రిటీషర్‌లు దోపిడీ చేసిన సంపద ప్రస్తుత లెక్కల ప్రకారం సుమారు 65  ట్రిలియన్‌ డాలర్లు అని, అందులో పది మంది యుకె ధనికుల చేతుల్లో 33.8 ట్రిలియన్‌ల భారత సంపద ఉన్నదని ఆక్స్‌ఫామ్‌ వెల్లడిరచింది. ఇందులో సగ భాగం అంటే 32.8 లక్షల కోట్ల డాలర్ల (ప్రస్తుత లెక్కల ప్రకారం) మేర బ్రిటన్‌లోని 10 శాతం మంది కుబేరుల చేతిలోకి వెళ్లింది. ఆ మొత్తాన్ని లండన్‌ వీధుల్లో 50 పౌండ్ల నోట్లతో పరిస్తే నాలుగుసార్లు ఆ నగరమంతా పరచవచ్చని పేర్కొంది. వ్యాపారం పేరుతో భారత్‌కు వలస వచ్చిన ఆంగ్లేయులు.. ఇక్కడి అపారమైన సంపదను వారి దేశానికి కొల్లగొట్టుకుపోయారని చరిత్ర చెప్తున్న నేపథ్యంలో తాజా నివేదిక ప్రాధాన్యాన్ని సంతరించుకుంటున్నది.

– ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన ఎలాన్‌ మస్క్‌ సంపద విలువ 400 బిలియన్‌ డాలర్లను దాటేసింది. త్వరలో ట్రిలియనీర్‌ హోదాను కూడా మస్క్‌ అందుకుంటారని అంచనా.

– ప్రస్తుత పరిస్థితులను బట్టి 2034 కల్లా ప్రపంచవ్యాప్తంగా ఐదుగురు ట్రిలియనీర్లు అవతరించవచ్చు. ఏడాది క్రితం ఈ అంచనా ఒక్క ట్రిలియనీర్‌గానే ఉండటం గమనార్హం.

– 2020 నుంచి 2023 మధ్య బిలియనీర్ల సంపద రెట్టింపైంది. కరోనా ప్రభావం సంపద సృష్టిపై పెద్దగా లేదన్న అభిప్రాయాలు. అయితే ఇదే సమయంలో పేదరికంలోకి దాదాపు 500 కోట్ల జనాభా.

– ధనిక, పేద మధ్య తారతమ్యం దక్షిణాది దేశాల్లోనే ఎక్కువ. ఆఫ్రికా, ఆసియా, మిడిల్‌ ఈస్ట్‌ వంటి ప్రాంతాల్లో ఆదాయంలో 20 శాతం 1 శాతం సంపన్నుల చేతుల్లోకే వెళ్తున్నది. ఐరోపా దేశాలతో పోల్చితే ఇది రెట్టింపు.

– ప్రపంచ శ్రామిక శక్తిలో 90 శాతం కలిగిన అల్ప, మధ్య ఆదాయ దేశాల్లో ప్రపంచ ఆదాయంలో కేవలం 21 శాతాన్నే అక్కడి శ్రామికులు అందుకుంటున్నారు.

– ప్రపంచంలో టాప్‌-10 అపర కుబేరుల సంపద 2024లో రోజుకు 10 కోట్ల డాలర్ల చొప్పున ఎగబాకింది. వారి సంపద రాత్రికిరాత్రి 99 శాతం ఆవిరైపోయినా కూడా బిలియనీర్లుగానే కొనసాగుతారు.

– ప్రపంచంలోని మొత్తం బిలియనీర్ల సంపద సగటున రోజుకు 570 కోట్ల డాలర్ల చొప్పున పెరిగింది.

– అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌ తదితర గ్లోబల్‌ నార్త్‌ దేశాల్లోని 1 శాతం అపర కుబేరులకు గ్లోబల్‌ సౌత్‌ దేశాల ఆర్థిక వ్యవస్థల నుంచి గంటకు 3 కోట్ల డాలర్ల సంపద బదిలీ అవుతోంది.

– ప్రపంచ జనాభాలో 20 శాతంగానే ఉన్న ఉత్తరాది దేశాలు ప్రపంచ సంపదలో 70 శాతాన్ని ఒడిసి పట్టుకుంటున్నాయి. ఐక్యరాజ్యసమితి, ప్రపంచ బ్యాంక్‌, అంతర్జాతీయ ద్రవ్య నిధి వంటి అంతర్జాతీయ సంస్థల్లో నిర్మాణాత్మక సంస్కరణలు అమలైతేనే ఆదాయ అసమానతల్ని రూపుమాపవచ్చు.

ప్రపంచంలో దాదాపు 800 మిలియన్ల మంది కార్మికులు గత రెండు సంవత్సరాల్లో తమ నిజ వేతనాలు ద్రవ్యోల్బణం కొనసాగడంతో కోల్పోయారు, దీని ఫలితంగా సగటున ప్రతి కార్మికుడు 25 రోజుల వార్షిక ఆదాయాన్ని కోల్పోయారు, ఆక్స్‌ఫామ్‌ విశ్లేషణ ప్రకారం ప్రపంచంలోని 1,600  అతిపెద్ద కార్పొరేషన్లలో, వాటిలో కేవలం 0.4 శాతం మాత్రమే కార్మికులకు జీవన వేతనం చెల్లించడానికి, జీవన వేతనానికి మద్దతు ఇవ్వడానికి బహిరంగంగా కట్టుబడి ఉన్నాయని అధ్యయనం కనుగొంది. చాలాకాలంగా, కార్పొరేషన్‌లు, అతి సంపన్నులైన కొద్దిమంది సాధారణ శ్రామిక కుటుంబాలను పణంగా పెట్టి, అంతులేని సంపద, వనరులు, శ్రమను ముఖ్యంగా గ్లోబల్‌ సౌత్‌ నుండి వెలికితీశారు. దోపిడీ, అసమానతల చక్రాన్ని మరింతగా పెంచారు. ఇప్పుడు, యునైటెడ్‌ స్టేట్స్‌లో, మనకు బిలియనీర్‌ల అధ్యక్షుడు ఉన్నారు. అమెరికా మరియు ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే అసాధారణ స్థాయి అసమానతలకు జ్వాలలు రేకెత్తిస్తూ అల్ట్రారిచ్‌, మెగా-కార్పొరేషన్ల కోసం పన్నులను తగ్గించడానికి ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థపై తన అధికారాన్ని ఉపయోగించేందుకు అధ్యక్షుడు ట్రంప్‌ సిద్ధంగా ఉన్నారు.

ఇవాళ ప్రపంచం మునుపెన్నడూ లేనంతగా అసమానతలతో ఉంది.  ప్రస్తుత పెట్టుబడిదారీ సామ్రాజ్యవాద శకం ఉద్దేశపూర్వకంగా సంపన్న శ్రేణిని మరింత సంపన్నం చేయడానికి ప్రజల శ్రమ దోపిడీని ప్రోత్సహించే దుర్మార్గమైన ఆర్థిక వ్యవస్థ కారణంగా ఉందని చెప్పవచ్చు. ప్రస్తుత సమాజం పూర్తిగా విభజించబడిరది. 1 శాతం సంపన్నులు, 99 శాతం ప్రజల మధ్య ఆర్థిక అంతరం ఆగాధంగా పెరిగింది. పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ ప్రజాస్వామ్యానికి, సమూహిక భవిష్యత్తుకు ప్రమాదకరంగా మారింది. ఆర్థిక గుత్తాధిపత్యం ప్రభుత్వాలతో కలిగియున్న కుటిల సంబంధాలు అసమానతను కొనసాగించడంలో కీలకమైనవి. గుత్తాధిపత్య సంస్థలు మార్కెట్లను నియంత్రిస్తాయి, నిబంధనలను నిర్దేశిస్తాయి. శిక్షార్హత లేకుండా ధరలను నిర్ణయిస్తారు, బిలియనీర్‌ యజమానులను మరింత సుసంపన్నం చేస్తాయి. కుటిలవాదం, అవినీతి, అతి సంపన్నుల ప్రయోజనాల కోసం ప్రభుత్వ విధానాలను నిర్ధేశించడానికి ప్రయత్నిస్తాయి, సాధారణ ప్రజల కోసం కాదని విధితమవుతుంది. ప్రజలను ఏమార్చేందుకు అసాధారణమైన సంపద అనేది అసాధారణమైన ప్రతిభకు ప్రతిఫలమనే భ్రమను లేదా కష్టపడి పనిచేయడం వల్లనే సంపద పోగుపడుతుందనే భ్రమను కల్పిస్తున్నారు. సంపద పెరుగడానికి శ్రమదోపిడీ కారణమనే వాస్తవాన్ని దాచిపెడతారు. ప్రస్తుత సామ్రాజ్యవాద ద్రవ్య పెట్టుబడి దోపిడీని అంతం చేసి మెరుగైన సమాజం కోసం పోరాడవలసి ఉంది. 

ఆక్స్‌ఫామ్‌ నివేదిక, పెరుగుతున్న బిలియనీర్ల సంపద, ప్రపంచ పేదరికం మధ్య స్పష్టమైన వ్యత్యాసాన్ని నివేదిక చూపింది. ‘‘టేకర్స్‌, నాట్‌ మేకర్స్‌’’, నివేదికలో మన ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ అతి ధనవంతులైన కొద్దిమందికి ప్రయోజనం చేకూర్చేలా ఎలా రూపొందించబడిరదో వివరిస్తుంది. అదే సమయంలో గుత్తాధిపత్యాన్ని విచ్ఛిన్నం చేయడం, అదనపు లాభం, సంపదపై పన్నులు విధించడం, ఉద్యోగుల యాజమాన్యం యొక్క రూపాలు వంటి వాటాదారుల నియంత్రణకు ప్రత్యామ్నాయాలను ప్రోత్సహించడం ద్వారా ప్రభుత్వాలు కార్పొరేట్‌ శక్తిని నియంత్రించాలని ఆక్స్‌ఫామ్‌ పిలుపునిచ్చింది. కొద్దిమంది చేతిలో ఉన్న అంతులేని సంపద కారణంగా ప్రపంచంలోని సామాన్య ప్రజలు నలిగిపోతున్నారు. ప్రధానంగా మహిళల తీవ్రమైన పేదరికం వల్ల అసమానంగా ప్రభావితమవుతున్నారని అమితాబ్‌ బెహర్‌ తెలిపారు. ఈ అసమాతలను పరిష్కరించడానికి వ్యవస్థగత మార్పులు అవసరమని బెహర్‌ సూచించాడు.

అత్యంత సంపన్నులైన వారి ఆర్జనలో ఎక్కువ భాగం గౌరవప్రదంగా పొందిందేమీ కాదని పేర్కొంటూ అసమానతలను తగ్గించేందుకు, అధిక సంపదకు స్వస్తి పలికేందుకు, కొత్తగా పుట్టుకొచ్చిన దొరతనాన్ని అంతం చేసేందుకు వీలుగా ప్రపంచంలోని కుబేరులపై ఆయా దేశాల ప్రభుత్వాలు అధిక పన్నులు విధించాలని హక్కుల సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఇప్పుడు ప్రపంచ బిలియనీర్‌ సంపద 2 ట్రిలియన్‌ డాలర్లకు పెరగడంతో ప్రపంచం యావత్తు ‘అరిస్టోక్రాటిక్‌ ఒలిగార్కీ’ పాలనలో ఉందని స్పష్టమవుతుంది. అందువలన మనం ఉద్యమ మార్గాన్ని ఎంచుకోవాలి, సమరశీలంగా పోరాటం చేయాలి. విపరీతమైన అసమానతను ఎదుర్కోవడానికి మన ఆర్థిక వ్యవస్థలను నిర్వహించే విధానంలో మౌలిక మార్పులు అవసరం. సంపదను సమాజపరం చేసినప్పుడే అంతరాలు అంతమవుతాయన్నది చారిత్రక సత్యం. అది సమసమాజ స్థాపనతోనే సాధ్యపడుతుందని గ్రహించాలి.  అందుకు సంఘటిత ఉద్యమాల ద్వారా పెట్టుబడిదారీ విధానాన్ని కూల్చి సామ్యవాద వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం తప్ప మరో మార్గం లేదు.

Leave a Reply