మానవజీవితంలో కవిత్వం ఒక నిరంతరం అన్వేషణ. సమాకాలీన ప్రపంచంలో నిజం ఎక్కడున్నా వెలుగులోకి తెచ్చే ప్రతిస్పందనా సాధనం. ఏ భాషలోనైనా`ఏ ప్రాంతంలోనైనా అది కొనసాగే సంవాదం. ఆకలి` ఆవేదనలను నిర్మోహమాటంగా గుండెల్లోకి పంపించే అక్షర సముదాయం
-అద్దేపల్లి రామ్మోహన్ రావు.
కవిత్వమే ఆయుధంగా సమాజాన్ని నడిపించాలని అహర్నిశలు కలలు కన్న వాళ్ళలో చాలా మంది ఉంటారు. కొంతమంది బయట ప్రపంచానికి తెలిసి ఉండటమో..తెలియకపోవడమో యాదృచ్చికం. కాని వాళ్లు సృజియించిన అక్షరాలు మాత్రం ఎన్నితరాలు మారినా అవి శాశ్వతంగా ఈ యుద్దమైదానంపై పోరాడుతూనే ఉంటాయి. అటువంటి పోరాట పటిమ ఉన్న నిండా సామాజిక చైతన్యం కలిగిన కవయిత్రి కొత్త కోట రామలక్ష్మి. శ్రీకాకుళం జిల్లాకు చెందిన కవి. ఉపాధ్యాయ ఉద్యమం లో క్రియాశీలకంగా పనిచేశారు. ఆమె అనారోగ్యంతో అస్తమించాక వారి భర్త అప్పారావు ఆమె రాసిని కవిత్వాన్ని నేనొక పేరుతో ఇటీవల పుస్తకంగా తెచ్చారు.
ప్రగతిశీల ఉద్యమాలతో పెనవేసుకున్న జీవితంలో పోరాడటమొక్కటే కాదు..ఆలోచనల్ని అక్షరాలుగా అణ్వాయుధాలుగా మార్చడం అవసరమని భావించిందేమో మదిలో దాగిన విస్ఫోటనాల్ని ఈ వర్తమాన ప్రపంచానికి ఇలా మన చేతుల్లోకి వచ్చేలా చేసింది. తను రాసిన కవితావేశాన్ని..ఈ కవిత్వసొగసుల్ని..ఈ కవిత్వం ద్వారా తను కోరుకుంటున్న సమాజాన్ని చూడకపోయినా ఆమె రాసిన ఈ నాల్గక్షరాలు సమాజాన్ని ఆలోచింపజేస్తాయనిమాత్రం నేను బలంగా నమ్ముతున్నాను. ఒక నాల్గక్షరాల అతిశయోక్తులు..పొగడ్తలు రాసి వదిలేసే కవిత్వం కాదిది. లోతైన భావుకత కలిగిన కవితాక్షరాలను సృజియించి మనకివాళ అందించింది. ఆమె కవిత్వం చదువుతున్నంతసేపూ ఈ వర్తమాన సమాజం గమనం కనబడింది. ఎందుకలా అన్నానో నేను మళ్ళీ ఉటంకిస్తాను..ముందుగా ఆమే రాసిన ఆవేదనాత్మక కవిత్వాన్ని హృదయం నిండా నింపుకుని పలకరిద్దాం..
‘స్వేచ్ఛ ఒక ఆయుధం’(ఇదీ వరస)
ఏడు పదులు దాటిన ఈ స్వతంత్య్ర భారతంలో స్త్రీ స్వేచ్ఛను కోల్పోయింది. అందుకేనా తను స్వేచ్ఛ ఒక ఆయుధమంటుంది. అందుకేనా పుడమితల్లి నుదిట మీద సింధూరం మహోధ్యమానికి పునాది మహిళ అంటుంది. ఈ కవితలో అస్థిత్వ వాద స్పృహ కనబడినా హక్కులకోసం పోరాడుతూనే ప్రపంచీకరణపై నిరసన ప్రకటిస్తుంది. ఈ కవిత చైతన్యాక్షరాల సముదాయమనిపించింది.
ఇవాళ దేశంలో మతం ముఖ్యభూమిక పోషించడం చేత మతోన్మాదుల చేష్టలకు అడ్డులేకుండా పోయింది. మతం పేరుతో చేసే మారణహోమాలు కులం పేరుతో కుటిల కుతంత్రాలు ఈ నవీనభావతావని కళ్ళల్లో నీళ్ళు పెట్టుకుని మరీ వీక్షిస్తుంది. అందుకే ఈ కవయిత్రి అంటారు..
మనిషికీ మనిషికీ మధ్య అడ్డుగోడ`మతం/ మతరక్కసితో నలిగిపోతున్నాడు నేడు మనిషి/ స్వార్థపు రాజకీయ ప్రయోజనాలకు/ నేడు వాడుతున్నారు మతం అనే అస్త్రాన్ని../స్వార్థపు మనిషి జల్లుతున్నాడు/ ఎదుట మనిషిపై మతం అనే మత్తుమందును/ మత్తులో ఉన్న మనిషికి తెలియడం లేదు ఏం చేస్తున్నాడో/ మత్తువదిలాక తెలుస్తుంది, మానవ మారణహోమం సిగ్గుచేటని/ అందుకే కులం, మతం అన్నవాడిని ఆలోచింపజేయి/కులం లేని మతం లేని భారతీయులం మనం./మతవిభేదాల్లేని భరతావని/మనదని చాటి చెప్పు..
ఈ కవయిత్రి ఆలోచనలు చదువుతుంటే పెరియార్‌ను గుర్తుచేశాయి. బహుశా ఆయన ఇటువంటి ఆలోచనల్తోనే సంఘసంస్కరణా ఉద్యమన్ని తమిళనాట నిర్మించాడు. మతంపైన..దురాచారాలపైనా దక్షిణాదిన యుద్దం చేసిన యోధుల జాబితాలో ఆయన ముందువరసలో ఉంటారు. మతం చేసే దారుణాలు మతాన్ని స్వార్థ రాజకీయాలకు వాడుకునే కుటిల నాయకుల బండారాన్ని ఈ చిన్న కవితలో బహిర్గతం చేస్తుంది. ఈ కవిత్వం స్పృహ-చైతన్యం రెండునేత్రాలుగా సాగుతుంది. ఇటువంటి భావన కొత్తప్రపంచాన్ని చూడాలనుకుని.. కలలుకనే వారికిమాత్రమే సాధ్యమౌతుంది. తను ఆ దిశగా అడుగులు త్రికరణశుద్ధిగా వేసింది.
సాంఘిక దురాచాలకు ముందుగా బలయ్యేది స్త్రీనే. భారతీయసమాజంలో పితృస్వామిక ఆధిపత్యంలో బలిపశువుస్త్రీయే. అందుకే చూసే ప్రతిదురాగతం స్త్రీ మస్తిష్కంలో వెంటనే రికార్డు అవుతాయి. అలా అయినపుడే కవితాగ్ని కణాలు సమాజ గర్భాన్ని చీల్చుకుని వస్తాయి. సారా నిషేద ఉద్యమాన్ని బలపరుస్తుంది. బలవుతున్న జీవితాలు మనకు తనకళ్ళతో చూపిస్తుంది. ఇవాళ ప్రభుత్వాలు మాత్రం ప్రజల జీవితాలు ఏమైనా ఫర్లేదు మద్యాన్ని అమ్మే ఆదాయాన్ని సృష్టిద్దాం అన్న చందంగా సాగుతున్నాయి.
ఈ కవిత్వం వస్తుప్రదానంగా సాగినప్పటికీ ఒక్కమాటలో చెప్పాలంటే ఈ కవిత్వం నిండా చైతన్యవంతమైన కార్యాచరణ కనబడుతుంది. అది మనల్ని పిడికిలి బిగించిపోరాడేలా ఉద్యమానికి ఉసిగొల్పుతుంది. వస్తువు ఎప్పటికైనా పాఠకుడికి అర్థవంతమైన సారాన్ని అందిస్తుంది. అది ఈ కవిత్వంలో సాధ్యమయ్యింది. ప్రపంచీకరణ గూర్చి కవిత రాస్తూ..
ప్రపంచీకరణ అంతం?
ఎంతగా మరిచిపోదామన్నా
నా ఎదలో ప్రతిబింబంలా
నా మెదడులో జ్ఞాపికలా
నన్ను వెంటాడుతూ
వేధిస్తూ ఉన్న
ప్రపంచీకరణమా
నీ అంతం ఎప్పుడు?
మనిషికీ మనిషికీ మధ్య
అడ్డుగోడలా ఉంది మతం
మతం అనే మత్తులో
నలిపివేస్తున్న
ఓ ప్రపంచీకరణమా
ఎప్పుడు నీ అంతం?
మానవ సంబంధాలను
కాసుల బరువుతో లెక్కిస్తున్న
సమాజ సంస్కృతిని విషతుల్యం జేసే
ఓ ప్రపంచీకరణమా
ఎప్పుడు నీ అంతం?
సమసిపోయిన రుగ్మతలలో
భయపెడుతూ విజ్ఞాన శాస్త్రాన్ని
అణగదొక్కుతున్న
ఓ ప్రపంచీకరణమా
ఎప్పుడు నీ అంతం?
అత్యాశతో
నీతో సమానంగా పోటీ పడలేక
ఆత్మహత్యకు దారితీస్తున్న
ప్రపంచీకరణమా ఎప్పుడు నీ అంతం?
చదివినోడు చేతిలో నకలుతో
ఉద్యోగాన్వేషణలో
ఊర్లన్నీ తిరుగుతూ చివరకు
ఆత్మాహుతికి కారణమవుతున్న
ఓ ప్రపంచీకరణమా
ఎప్పుడు నీ అంతం?
నీ ఎత్తుకు ఎదగాలని
చివరకు నిస్సిగ్గుగా దొంగగా మారుతూ
జైలుపాలు చేస్తున్న
ఓ ప్రపంచీకరణమా
ఎప్పుడు నీ అంతం
ప్రపంచీకరణలో కేవలం ఇద్దరే ఉంటారు. ఒకడు వ్యాపారి.రెండోవాడు’ వినియోగదారుడు. వ్యాపారికీ ఏ సిద్ధాంతాలూ ఉండవు. అన్నీ వ్యాపారానికి పని కొచ్చే వస్తువులే. స్త్రీ అవయవాలు కూడా వ్యాపారానికి కేంద్రాలే. అమ్మపాలను కూడా నిలవచేసి అమ్ముకునే దారుణాతి దారుణమైన వ్యవస్థ క్రమంగా రూపొంది అది అత్యున్నత దిశకు చేరకుని రేవ్‌పార్టీ సంస్కృతివరకు ఎగబ్రాకింది. ప్రపంచీకరణలో పెట్టుబడిదారుల వ్యాపారమే ప్రకృతిని ధ్వంసం చేస్తోంది. హింసాత్మకమైన నేరసమాజాన్ని సృష్టిస్తుంది. మన భాష, మన భావాలు, మన సంస్కృతి కళలు అన్నీ నశించిపోయి, పాశ్చాత్య సంస్కృతితో ఏకీభావన పొందిన నవనాగరిక సమాజంలో మనమున్నాం. దీని వల్ల సమాజం కావాలిసినంత పతనమైంది. ఆదే ఆవేదననే కవయిత్రి తన కవితలో పంచుకుంది.
ఈ కవితల్లో రామలక్ష్మిగారు స్త్రీవాదిగా కనబడతారు. ఆణచివేయబడుతున్న ..సంకెళ్ళు బిగియించబడ్డ ధిక్కారవనితగా దర్శనమిస్తారు.స్త్రీ తనబంధాలన తానే త్రెంచుకోవాలని పిలుపునిస్తుంది. కవిత్వం మారుతున్న సమాజంలో అనివార్యంగా చేసుకోవాల్సిన సమయమిది. మారుతున్న పోకడల్లో ..వ్యాపార సంస్కృతిలో సామాజిక స్పృహ కలిగిన ప్రతి వొక్కరూ కవిత్వం రాయాల్సిన అవసరముందని భావిస్తున్నాను. ఈ పని కవయిత్రి చేసింది. స్పృహ ఉన్న కవులెందుకు చేయకూడదు ప్రశ్నించుకోవాలి. ఆమె మాత్రం..సమాజం గూర్చి నాలోని చైతన్యభావాలను రాసే కవయిత్రి నేనని అంటుంది. మరి మనమెక్కడున్నాం. సాహిత్యం ద్వారా సమాజానికి శస్త్ర చికిత్స చేయాల్సిన కవులం మనమేం చేయాలి. కవిత్వ యుద్దం చేయాలి. అసమానతలపై పోరాడాలి. స్త్రీ వివక్షపై కలాలను రaుళిపించాలి. ఇది మన కర్తవ్యం కాదా? ఈ కవిత్వం గూర్చి చాలా విషయాలు పంచుకోవాలని ఉంది. ఈ కవిత్వ సంపుటికి నేనొక అనే శీర్షిక నిర్ణయించడం అర్థవంతమైన కవిత్వ ప్రయోగం. తనకుతాను ఏమైన అవొచ్చు. అక్షరమవ్చొచ్చు..అస్త్రమవ్వొచ్చు..కవిత్వ వాక్యామై పరిమళించవచ్చు..కదనరంగంలో విప్లవశంఖారావమవ్వొచ్చు. తనిపుడు మాత్రం బిగించిన పిడికిట్లో..గొంతెత్తి అరిచే రణన్నినాదంలో స్పష్టంగా కనిపిస్తున్నది. విద్యార్థి ఉద్యమాల్లో..ఉపాధ్యాయ ఉద్యమాల్లో క్రియాశీలక కార్యకర్తగా నడచి నడిపించి నాయకురాలై అంతరాలు లేని సమాజం కోసం తపించిన తను నిశ్శబ్దంగా ఎలా వెళ్ళిపోతుంది తను లేదన్ననిజం తన ఉద్యమసహచరులెలా జీర్ణం చేసుకోవగలరు. కానీ వొక్కటి మాత్రం నిజం…ఈ కవిత్వంలోని ప్రతి అక్షరంలోనూ సజీవంగా పలకరిస్తున్నది.
నేనొక కవిత్వంలో భాషామాధుర్యం గూర్చి, స్త్రీ స్వేచ్ఛ, సమానత్వం గూర్చి, తెలుగుతదం, ఉగాది పరవశం గూర్చి..విద్యా విలువలు, నిరుద్యోగి బాధలు..నిర్భయకన్నీళ్లు..సారా వ్యతిరేకాక్షరాలు ఈ కవిత్వంలో దర్శనమిస్తాయి. సాంఘిక దురాచారాలు, సామాజిక అంతరాలు మనల్ని ఆలోచింపజేస్తాయి. ఇంకా లోతుల్లోకి వెళ్ళి మతమూ..మతోన్మాదమూ..ప్రపంచీకరణ దుష్ప్రభావమూ కవితాక్షరాలై కనబడతాయి. చాలా విషయాలు పంచుకోవాలని ఉన్నా అన్నింటిని విశ్లేషించానికి అవకాశమున్నా పాఠకులను చదివించాలన్న కాంక్షతో ఈ నాల్గుమాటలు రాస్తున్నాను. అయితే ఈ సంపుటిలో నాకు ఇష్టమైన కవితను ఉదహరించదలచాను..
నిజస్వరూపం
నేనొక సామాన్య మహిళను/అందరిలా ఆలోచించే సగటు స్త్రీని/నా మనసు రెపరెపలాడే తెల్లకాగితంలాంటిది కాని/ఆ తెల్లకాగితం/సాటిమనిషి చరిత్రనే మార్చేయగలదు/అందరిలా నాకూ ఆశలున్నాయి/ఆ ఆశను పెంచే మనిషే నన్ను నిరాశపరిస్తే/జీవితమే దుర్లభంగా భావించే/నా మనసుకు ఓదార్పు నిచ్చేదెవరు?/నా మనసు/కన్నీటిబొట్లుగా/కరిగినపుడు ఆ కన్నీటిబొట్లే /ఒక మహాసాగరంగా ఘోషిస్తుంటే/ఆ మహాసాగర అలల/తాకిడికి తట్టుకోలేక/నా మనసు ఛిన్నాభిన్నమై/పలువిధాలుగా ఆలోచింపజేస్తుంది/ఆ ఆలోచనలే ఒక శక్తి గా/రూపొందితే/అప్పుడే తెలుస్తుంది/ఈ మహిళ నిజ స్వరూపం.
ఈ కవితలో వస్తుశిల్పం సమపాళ్ళలో సాగుతుంది. భావావేశంతో సాగడం వల్ల కవిత్వం జలపాతంలా జారిపడుతుంది. ఒక నిట్టూర్పు..ఒక ఓదార్పు..ఓ అనిర్వచనీయ అనుభూతి మదిని పరవశింపజేస్తుంది. అందుకే ఈ కవితను ప్రత్యేకంగా చెప్పాలనిపించింది. ఈ కవితలు చదువదగ్గ వస్తుప్రదాన, భావావేశకవితలు. ఇవి వర్తమాన సమాజానికి అవసరమైనవి. ఆచరణాత్మకమైనవి. నిర్భయఘటనపై రాసిన కవిత కన్నీటినితెప్పిస్తుంది. ఈమెను మళ్ళీ పదికాలాలు బతికేలా ఈ పుస్తకాన్ని మనముందుకు తీసుకొచ్చారు.
Unte bhaagundu —
Good writer —miss her
——————————
Buchireddy gangula
సమీక్ష స్ఫూర్తిదాయకంగా ఉంది