2024 జూలై లో, ఇంగ్లండ్‌లోని అనేక నగరాల్లో అల్లర్లు, దాడులు జరిగాయి. దీనికి ప్రధాన కారణం తప్పుడు వార్తలు, ప్రజల్లో ఉన్న వలస వ్యతిరేక భావాలు. అల్లర్ల బాధితుల్లో ఎక్కువ మంది ముస్లింలు. మసీదులు, వలసదారులు నివసించే ప్రదేశాలపై దాడులు జరిగాయి. ఈ ఘటనల తర్వాత, భవిష్యత్తులో ఇటువంటి హింసను నిరోధించే లక్ష్యంతో ఇంగ్లాండులోని ‘ఆల్-పార్టీ పార్లమెంటరీ గ్రూప్’ ఒక నివేదికను విడుదల చేసింది. “ముస్లింలు కత్తి చూపించి ఇస్లాంను వ్యాప్తి చేశారు” అని చెప్పడాన్ని నిషేధించాలని నివేదిక పేర్కొంది. ఈ విశ్వాసం ఇస్లామోఫోబియాకు మూలమైన విషయాలలో ఒకటి.

అనేక ఇతర అపోహలు, దురభిప్రాయాలు ప్రజల మనస్సులలో లోతుగా పాతుకుపోయిన మన దేశంలో ఈ ఉదాహరణ అనుకరించదగినది. ఇస్లాం ఎలా వ్యాపించింది? కొంతమంది హిందూ రాజులను ముస్లిం రాజులు హత్య చేయడాన్ని ఉదాహరణగా చూపించి(రాజకీయ కారణాల వల్ల ఇవి జరిగాయి) ఇస్లాం కత్తి మొన చూపించి వ్యాపించింది అని కల్పిత కథలు ప్రచారం చేస్తారు. భారతదేశంలో ఇస్లాం విస్తరణ వాస్తవికత దీనికి చాలా భిన్నమైనది.

అరబ్ వ్యాపారులు కేరళలోని మలబార్ తీరానికి వస్తూండే వారు. వారి పరిచయం కారణంగా స్థానిక ప్రజలు ఇస్లాం స్వీకరించారు. కేరళలోని మలబార్ ప్రాంతంలోని చేరమాన్ జుమా మసీదు ఏడవ శతాబ్దంలో నిర్మించబడిందనే వాస్తవం దీనికి నిదర్శనం.

స్వామి వివేకానంద ప్రకారం, “భారతదేశంలో ముస్లింల విజయం అణగారిన వర్గాలకు, పేదలకు ఒక విముక్తి సందేశం అయింది. మన మొత్తం సమాజంలో ప్రతి ఐదవ వ్యక్తి ముస్లింగా మారడానికి ఇదే కారణం. ఇది కత్తి మొన చూపించి జరగలేదు. ఇది కేవలం కత్తిచూపించో, బలవంతంగానో జరిగిందనుకోవడం పిచ్చితనం తప్ప మరొకటి కాదు. వాస్తవమేమిటంటే, భూస్వాములు, పూజారుల నుండి స్వాతంత్ర్యం పొందడానికి ఇది జరిగింది. చాలా మంది భూస్వాములు ఉండడమే బెంగాల్‌లో రైతులలో ముస్లింల సంఖ్య హిందువుల కంటే ఎక్కువగా ఉండటానికి కారణం.” నిజమేమిటంటే అశోక చక్రవర్తి తప్ప, ఏ రాజు కూడా తన మతాన్ని వ్యాప్తి చేసే పని చేయలేదు. గౌతమ బుద్ధుని సందేశాన్ని వ్యాప్తి చేయడానికి అశోకుడు మాత్రమే తన ప్రతినిధులను చాలా దూర ప్రదేశాలకు కూడా పంపాడు.

నేటి భారతదేశంలో ముస్లింలు, క్రైస్తవుల గురించి అనేక అపోహలు పెద్ద ఎత్తున ఉన్నాయి. వారిపై హింసకు ప్రధాన కారణాలు ఇవే. ఈ దురభిప్రాయాలు కాలక్రమేణా ఊపందుకున్నాయి. సమాజపు విశాల దృక్పథంలో భాగమయ్యాయి.

ముస్లిం రాజులు హిందూ దేవాలయాలను పగలగొట్టి ధ్వంసం చేశారనే ఆలోచనతో ప్రారంభమవుతుంది. ఈ ప్రచారానికి బలం చేకూరిన ఫలితమే 1992 డిసెంబరు 6న బాబ్రీ మసీదు కూల్చివేత, ఈనాటి వరకు దోషులకు శిక్ష పడలేదు. ఇప్పుడు బాబ్రీ మసీదు కేసులో కాశీ, మధుర అంశం కూడా చేరింది. తరువాత షాజహాన్ రాణి ముంతాజ్ సమాధిగా మార్చిన తాజ్ మహల్‌ను కూడా శివాలయం అని అంటున్నారు.

‘ఆవు పవిత్ర జంతువు, ముస్లింలు ఆవులను చంపుతున్నారు’ అనే అపోహ ఇటీవల ఊపందుకుంది. ఈ నమ్మకం ఆధారంగానే ఒకవైపు శాకాహారాన్ని ప్రచారం చేస్తూ మరోవైపు హత్యాకాండ సాగిస్తున్నారు. “2010- 2017 మధ్య కాలంలో ఆవు-సంబంధిత హింసకు గురైన వారిలో 51 శాతం మంది ముస్లింలు, 63 ఘటనలలో మరణించిన 28 మంది భారతీయ పౌరులలో 83 శాతం మంది ముస్లింలు” అని ఇండియా స్పెండ్ తన నివేదికాలో పేర్కొంది.

2014 మేలో ప్రధాని నరేంద్ర మోదీ అధికారంలోకి రాకముందు మొత్తం ఘటనల్లో కేవలం 3 శాతం మాత్రమే జరిగాయి. దాదాపు సగం హింస – 63లో 32 – ఘటనలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే జరిగాయని ఇండియా స్పెండ్ రాసింది.

మానవ హక్కుల కార్యకర్త, కారవాన్-ఎ-మొహబ్బత్ వ్యవస్థాపకుడు హర్ష్ మందర్, లించింగ్‌కు గురైన వారిని ఓదార్చడానికి  వారి కుటుంబాలను, పొరుగువారిని కలుస్తూ వుంటారు. అతను ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో ఇలా వ్రాశాడు, “మోను మానేసర్ సోషల్ మీడియా ఖాతాను చూస్తే నాకు వణుకుపుడుతుంది. అతను, అతని ముఠా సభ్యులు బహిరంగంగా ఆధునిక ఆయుధాలను ప్రదర్శిస్తూ ప్రత్యక్ష వీడియోలను ప్రసారం చేస్తారు;  పోలీసు వాహనాల వరసలో సైరన్లు మోగిస్తారు; వాహనాలపై కాల్పులు జరుపుతారు; పట్టుబడిన వారిని దారుణంగా కొడతారు.”

ఆవు స్మగ్లింగ్ అనుమానంతో ఆర్యన్ మిశ్రా అనే హిందూ విద్యార్థిని గోసంరక్షకులు హత్య చేయడంతో ఈ జ్ఞాపకాలన్నీ తాజాగా మారాయి. ఆర్యన్ తల్లి, తన ప్రకటనలో, హత్యకు గల కారణాలపై ప్రశ్నలను లేవనెత్తింది. “నిందితులు అతన్ని ముస్లింగా భావించి చంపారు. ఎందుకు? ముస్లింలు మనుషులు కాదా? ముస్లింలను చంపే హక్కు మీకు ఏమున్నది”. అఖ్లాక్, జునైద్, రక్బర్ ఖాన్, యింకా అనేక మందిని గోహత్యకు పాల్పడ్డారనే అనుమానంతో  చంపడం మాకు గుర్తుంది. ఇటీవల, అమృత్‌సర్ నుండి పాలంపూర్‌కు రోడ్ దారిలో వస్తుంటే, రోడ్లపై తిరుగుతున్న ఆవుల దుస్థితి, అందువల్ల రోడ్డు మీద కలిగే యిబ్బందులు, పరిస్థితులను చూశాడు. కానీ ఆవులు సంచరించడం వల్ల ప్రమాదాలు, తప్పిపోయిన ఆవుల వల్ల రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, నష్టాలను చూసి నా యువ సహోద్యోగి దిగ్భ్రాంతి చెందాడు.

దీంతో పాటు టిఫిన్‌లో మాంసాహారం కూడా ముస్లిం విద్యార్థులను వేధించడానికి మరో ప్రాతిపదికగా మారుతోంది. ఇటీవల జరిగిన ఓ ఘటనలో అమ్రోహాలోని ఓ ప్రముఖ పాఠశాలలో 3వ తరగతి చదువుతున్న విద్యార్థి తన టిఫిన్‌లో బిర్యానీ తీసుకొచ్చాడు. “పెద్దయ్యాక దేవాలయాలను ధ్వంసం చేసే పిల్లలకు నేను చదువు చెప్పను” అని హిల్టన్ స్కూల్ ప్రిన్సిపాల్ అమ్రిష్ కుమార్ శర్మ ఆ పిల్లవాడిని లాక్కెళ్లి స్టోర్ రూమ్‌లో బంధించాడు.

ద్వేషపూరిత ప్రసంగం కూడా దేశానికి పెద్ద సమస్యగా మారింది. ద్వేషపూరిత ప్రసంగాలు చేసేవారిని నియంత్రించడానికి, శిక్షించడానికి యంత్రాంగాలు, ప్రక్రియలు ఉన్నాయి, కానీ  క్షేత్రస్థాయి వాస్తవం ఏమిటంటే, అలా చేసేవారు సాధారణంగా శిక్షించబడకుండా ఉండటమే కాకుండా పార్టీలో సీనియర్ పదవులకు పదోన్నతి పొందుతారు కూడా. అస్సాం ముఖ్యమంత్రి ‘ముస్లింలను అస్సాం స్వాధీనం చేసుకోనివ్వను’ అంటూ విద్వేషపూరిత మాటలు చెబుతూనే వరద జిహాద్, కరెంటు జిహాద్, జాబ్ జిహాద్ లాంటి పదాలు వాడుతున్నారు. మత ప్రాతిపదికన సమాజాన్ని భిన్న ధృవాలుగా విడదీసేందుకు అతను, ఇతర బీజేపీ నేతలు నిరంతరం ఇలా మాట్లాడుతూనే ఉన్నారు.

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బుల్డోజర్ల ద్వారా ముస్లింల ఇళ్లు, ఆస్తులను కూల్చివేస్తున్నారు. బీజేపీకి చెందిన ఇతర ముఖ్యమంత్రులు కూడా ఆయన వెంటే ఉన్నారు. బుల్‌డోజర్‌లు విధ్వంసం చేస్తున్నాయని వ్యాఖ్యానిస్తూ, జస్టిస్ బిఆర్ గవాయ్ ఇలా వ్యాఖ్యానించారు, “ఒక వ్యక్తి కేవలం నిందితుడు అయినంత మాత్రాన అతని ఇంటిని ఎలా కూల్చివేస్తారు? ఒకవేళ అతను దోషిగా తేలినప్పటికీ, తగిన చట్టపరమైన ప్రక్రియను  అనుసరించకుండా అలా చేయడానికి వీలులేదు.”

ఢిల్లీలో 2020 అల్లర్ల తర్వాత జహంగీర్‌పురిలో జరిగిన కూల్చివేత ప్రచారానికి సంబంధించిన పిటిషన్‌ను ఆయన విచారించారు. అయితే ఈ వ్యాఖ్యను రాష్ట్రాల ముఖ్యమంత్రులు అంగీకరిస్తారా అనేది ప్రశ్న.

ఇంగ్లండులో మాదిరిగానే భారతదేశంలో కూడా అపోహలను తొలగించడానికి నిర్దేశించిన ఎజెండాను అమలు చేసేలా ప్రభుత్వం అటువంటి కమిటీలను ఏర్పాటు చేయాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ అపోహలు సమాజంలో చాలా ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. మత హింసను నివారించడానికి సమాజంలో ద్వేషాన్ని, అపార్థాలను తొలగించే పని చాలా కాలం క్రితమే ప్రారంభం కావాల్సి వుండింది.

సెప్టెంబర్ 14, 2024

Leave a Reply