(ప్రముఖ కవి , సాహిత్య విశ్లేషకుడు , సాహితి స్రవంతి నాయకుడు కంగార మోహన్ ఈ సంచిక నుంచి కొత్త పుస్తకాల సమీక్షా కాలం *ఈ పుస్తకం  చదివారా ?* ప్రారంభిస్తున్నారు – వసంత మేఘం టీం )

సాహిత్యంలో వస్తువు పాఠకులకొక సారాన్ని అందించాలి. అలా అందించడానికి తగిన రచనా విధానాన్ని వదిలిపెట్టి, వస్తువుకు అనవసరమైన అలంకరణల్ని అతికించడం వల్ల ప్రయోజనం లేదు. సాహిత్యాన్ని చదివినవాడు లేదా విన్నవాడు ఆనందించడంతోబాటు ఎంతో కొంత చైతన్యానికి గురికావాలి. సుష్టుగా భోంచేశాక నిద్ర వచ్చినట్టుండకూడదు సాహిత్యం. అది ఆలోచింపజెయ్యాలి. ఆ ఆలోచనచైతన్యాన్నివ్వాలి. ఆ చైతన్యం కార్యరూపం ధరించాలి. ఆనందించడానికే అయితే దానికి ఇతర సాధనాలు చాలా ఉన్నాయి. సాహిత్యమూ, కళలూ అవసరం లేదు. సాహిత్య కళారూపాల వల్ల కలిగే ఆనందం మానవ చైతన్య స్థాయిని పెంచేదిగా ఉండాలి. మార్క్సిస్టు దృక్పథంలో ఆనందం ఆనందం కోసం, జ్ఞానం జ్ఞానం కోసం కావు. సాహిత్యం వల్ల కలిగే ఆనందం జ్ఞానం కోసం. జ్ఞానం ఉన్న సామాజిక స్థితిని ఉన్నతంగా మార్చడం కోసం. సామాజికోన్నతికి ఉపయోగపడని జ్ఞానం జ్ఞానం కాదు. కాబట్టి ఆనందం, జ్ఞానం అనేవి భిన్న విషయాలు కావు. ఒకే అంశానికి చెందిన రెండు పార్శ్యాలు.

                                                                                                                        -వి.చెంచయ్య

సాహిత్యం ఎంత అధ్యయనం చేశామన్నది ముఖ్యం కాదు. మానవ చైతన్యానికి ఉపయుక్తంగా రాయగలిగామన్నదే ప్రమాణికమని పైన పేర్కొన్న వి. చెంచయ్య గారి మాటల్ని బట్టి అర్థమవుతుంది. సమాజం కోసమే సామాజిక మార్పుకోసమే, సమాజిక చైతన్యమే పరమావధిగా, మరో ప్రపంచం కోసం పోరాడుతున్న వర్తమాన కవులు వర్తమాన సమాజంలో జరుగుతున్న దురాగతాలు, దుర్మార్గాలను వాస్తవాలను గమనిస్తున్నారా? అసలీ ప్రపంచాన్ని చూస్తున్నారా? అసలీ ప్రపంచంలో ఈ దేశంలో ఏం జరుగుతుందో కాస్తైనా స్పృహ  ఉందా?  ఉంటే మనమెందుకిలా ఉంటున్నాం. ప్రపంచమంతా సామ్రాజ్యవాదం బుసలుకొడుతున్న సంక్లిష్ట సందర్భంలో మనమున్నామనే విషయమే ఈ వర్తమాన సమాజం మర్చిపోయింది. మానవసమాజమే ప్రమాదంలో పడిరదన్న విషయం మనం గమనించడంలేదు.  అసలేం జరుగుంది. ఈ శతాబ్ధంలో జరిగిన అనేక విపత్తుల్లో కంటే  ఒక దశాబ్దకాలం నుండి జరిగిన దుర్మార్గాలు, దురాగతాలు, అరాచకాల వల్ల జరిగిన విపత్తులే సమాజాన్ని అతలాకుతలం చేశాయి. అవన్నీ ఆగిపోయాయని అనుకుంటే పొరపాటే. గత పదేళ్ళనుండి మన దేశంలో మరింత ప్రెట్రేగిపోయి ప్రసుత్తం ఇదొక నిరంతర ప్రక్రియగా సాగుతున్నాయి.  ఇటువంటి సంక్లిష్ట సందిగ్ధ సందర్భంలో సాహిత్యకారులుగా మనమేం చేస్తున్నాం. మన వంతు పాత్ర మనం నిర్వర్తిస్తున్నామా? మనల్ని మనం ప్రశ్నించుకోవాలి.

కవి కె.రత్నంయేసేపు ఉపాధ్యాయ ఉద్యమంలో క్రియాశీలకమైన కార్యకర్త. డీటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసి ఆ సంఘ పత్రిక ఉపాధ్యాయ క్రాంతి ప్రధాన సంపాదకులుగా ఉన్నారు. ఊపిరిసలపనంతపనిలో ఉన్న తను కవిత్వపుస్తకాన్ని నా చేతిలో పెట్టి చదవి తన అభిప్రాయంచెప్పమన్నాడు. ఉపాధ్యాయ ఉద్యమంలో క్రియాశీలకంగా, ఉపాధ్యాయపత్రిక ప్రధాన సంపాదకులుగా క్రియాశీలకంగా ఉండటం చేత మరింత ఆసక్తిగానే అందుకున్నాను. అలా ఉన్నవాళ్ళు కవిత్వం కూడా రాస్తారా?అంత సమయముంటుందా అనేది నాప్రశ్న. బాల్యమే శరణార్ధి అనే పేరుతో కవిత్వ సంపుటి తెచ్చారు.  మనం ముందు అనుకుంటున్నట్లు ప్రపంచంలో ఏం జరుగుతుందో అన్న విషయాన్ని చాలా స్పష్టంగా..సమాజం పట్ల ఎంతో బాధ్యతగా రాశారు. వొక్కొక్క విషయాన్ని చెబుతూ కవిత్వీకరిస్తూ వచ్చాడు. ముఖ్యమైన వాటిని పరిశీలిద్దాం..

విద్యారంగం గూర్చి..!

సమాజాన్ని నడిపిస్తున్న వ్యవస్థలు శాస్త్ర వ్యవస్థ, కార్యవ్యవస్థ, న్యాయవ్యవస్థ,పత్రికావ్యవస్థ ఈ నాలుగు వ్యవస్థల్ని నడిపించేది విద్యావ్యవస్థ. విద్య అన్నది భావజాలాన్ని ప్రచారం చేస్తుంది. మేధాశక్తి సంపన్నతను ఉత్పత్తి చేయాల్సింది విద్య,విద్యారంగం.విద్యావ్యవస్థ చెడిపోతే అన్నిరంగాలు చెడిపోయినట్లే. విద్యారంగంలో ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకనుగుణంగా వ్యవస్థ ఉంటుంది. ప్రస్తుత సమాజంలో విద్యారంగం వెనక్కి నడుస్తున్న విషయాన్ని పసిగట్టి కవిత్వం ఎలా రాశారో చూడండి..

          మనిషిని,సమాజాన్ని చదవలేని జ్ఞానం

          విజ్ఞానం కాదు అజ్ఞానం

          మనిషిలోని మనస్సుని, మానవీయతను వెలికి తీయని పాఠం

          శాస్త్రీయం కాదు అశాస్త్రీయం (బాల్యం ఓ నాస్తాల్జియా) అంటాడు..

          జ్ఞానం నిరంతర చలన శీలి, చైతన్యశీలి

          వృక్షాలై, ఫలాలై నలుదిశలా విస్తరించాల్సిన జ్ఞానపు మెదళ్ళు

          మొదళ్ళ దగ్గరే గిడసబారిపోతే ఎట్లా..?(వాంటెడ్‌ క్వాలిఫైడ్‌ టీచర్స్‌ టు టీచ్‌) అంటాడు.

సామాజిక స్పృహ లేని టీచర్లు ఉన్నారని చెబుతూనే పిల్లలు ఈ సమాజంలో బతకగలిగే పాఠాలు నేర్పవాళ్ళు కావాలంటాడు.  అమెరికా పాఠశాలల్లో జరుగుతున్న కాల్పుల స్పందనగా ఒక కవిత రాస్తాడు..అందులో..

               వాళ్ళు సైకోలు, శాడిస్టులు

                పాలబుగ్గల నుండి రక్తాన్ని పిండుతారు

                “““

               జ్ఞానం వెల్లి విరియాల్సిన చోటే గన్‌లు గర్జిస్తున్నాయని

               ఇప్పుడు చికిత్స చేయాల్సింది

               పిల్లలకు కాదు పెద్దల మెదళ్ళకు

              వికృత అమెరికా సమాజానికి! (బాలలారా బహుపరాక్‌).

అంతేకాక బీహర్‌లోని శరన్‌ జిల్లాలో ఒక పాఠశాలలో విషపూరిత ఆహరం తిని మరణించిన 24 మంది బాలల మృతికి అశృనివాళులు అర్పిస్తూ మృత్యుబోజనం అనే కవిత రాశాడు. అంతేకాక ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 1వతరగతి నుండి తెలుగు భాషామాధ్యమాన్ని రద్దుచేసిన సందర్భంగా  రాసిన కవితలో ..

                   తల్లి భాష కావాలని చిన్నారి శంభూకులు నినదిస్తే

                   తలనరకడానికి రాముడు అవసరంలేదు

                   నేటి ఏలికలు చాలు తల్లీ

అంటూ అమ్మభాష కవితలో చెప్తాడు. ఇలా విద్యారంగంలో మనదేశంలో ఎలా ప్రమాదంలో ఉందో కవి తన కవిత్వంలో ఆవేదనగా చెప్తాడు. అలా రాయడానికి విద్య అన్నది మనదేశంలో సార్వత్రికం కాకకపోవడం విద్య ప్రపంచ విధానాలకు అనుగుణంగా విద్య లేకపోవడం విషాదం. అసలు మన దేశానికి నిర్ధిష్టమైన  శాస్త్రీయమైన విద్యావిధానం లేకపోవడం విచారకరం.అధికారంలోకి రాగానే విద్యావిధానాలు మారడం, జ్యోతిష్యం చెప్పడం`జ్యోతిషం ను కోర్సుగా పెట్టడం,డార్విన్‌ థియరీని తొలగించడం నేటి దుర్మార్గం.

మనువాదం ప్రమాదం గూర్చి..! 

విద్య ఆధిపత్యకులాలకే పరిమితం అన్నదగ్గర్నుంచి అందరికీ విద్య అనేంతవరకు ఎదిగాం. చిన్నజియర్‌ స్వామి  లాంటి వాళ్ళు కులవ్యవస్థ ఉండాలంటున్నారంటే మనువాదం విస్తారంగా భారతీయ సమాజంలో నాటుకుపోవాలనే తృష్ణతోనే అటువంటి వ్యాఖ్యానాలు చేస్తున్నారు. పోతనలాంటి మహాకవి మనిషన్నవాడు చదవాలంటాడు, అన్నమయ్య కోటివిద్యలు కూటికొరకే అంటాడు. చదివి చదివి చావంగనేల`చావు లేని చదువు చదువవలయు అని గొప్పవాళ్ళు చెప్తుంటే మనువాదులు మాత్రం చదువు అందరికీ వొద్దూ అనే కోణంలో విద్యలో సంస్కరణలు తెస్తున్నారు. సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా, సమానత్వానికి వ్యతిరేకంగా ఉన్న ఎన్‌ఈపిని అమలు చేయచూస్తున్నారు.  పోతులూరి చదువుకు సరస్వతి పేరు పెట్టుకుని మీ వాళ్ళకే సదువు లేకుండా చేశావేమిటంటాడు. కర్మ, దైవసిద్దాంతాలు శ్రామిక శక్తిని తొక్కిపెట్టడానికి ఉపయోగపడ్తాయే తప్ప సమాజ పురోభివృద్దికి కాదు.

అందుకే తల్లీ భారతి వందనం అనే కవితలో..

                  ఇక్కడ ఒళ్ళంతా కొవ్వెక్కిన మదోన్మాద మనవులున్నారంటాడు.

                 ఇది మనువాద లోకం

                 మగ మనువుల రాజ్యం

ఆర్‌యస్‌యస్‌ వాళ్లే కీలక పదవుల్లో ఉన్నారు. కాబట్టి విద్యలోనే మనువాదం అమలు చేయడంసులభం. ఇక్కడ మేధస్సుకు ప్రాధాన్యత లేదు. నాగపూర్‌ కేంద్రకార్యాలయంలో కాలుమోపి వచ్చాడా లేదా అన్నది ప్రామాణికం. ఇట్‌ ఈజ్‌ ఎ బ్లూ ప్రింట్‌ ఫర్‌ ఫాసిస్ట్‌ యాక్టివిటీ..అందుకే కవి..వేముల రోహిత్‌ హత్యకు నిరసనగా  తిరగబడుతున్న కాలం అనే కవితలో..

             ఉన్మాదమే మతమైన చోట

             స్వప్నాలు నక్షత్ర ధూళిలో స్వాంతనను

             వెదుక్కుంటున్నాయి… అంటాడు

అలాగే పోలీసుల వేషంలో ఆర్‌యస్‌యస్‌ కార్యకర్తలు జామియా మిలియా విశ్వవిద్యాలయంలో చేసిన దాడులకు స్పందనగా జామియా మిలియా ఇస్లామియా…అనే కవితరాస్తూ..

వాడొక ఫాసిస్టు వాడొక ఆధునిక మనువు అని అంటూనే..

              మనువాదాన్ని

              మతోన్మాదాన్ని కంపుగొట్టే కులగోడల్ని కూలగొట్టే

              ఎన్ని ఉద్యమాలు ఇక్కడ పురుడుపూసుకోలేదు..అంటాడు..

ఇంకా లోతుల్లోకి వెళ్ళి రాజస్థాన్‌ లో ఓ పాఠశాలలో శూద్రకులాల పిల్లలు తాగే నీళ్ళ కుండ నుండి నీళ్ళు తాగినందుకు ఉపాధ్యాయుడి చేతిలో ప్రాణాలు కోల్పోయిన తొమ్మిదేళ్ళ దళిత విద్యార్థికి నివాళిగా ..

                అవును ఇక్కడ మనువాదులు రాజ్యమేలుతున్నారు అంటాడు.

                మనువాదం నగ్నంగా నర్తిస్తూ వుంటే

                నేటి శంభూకులు

                 ఏకలవ్యులు ఏం చేయగలరు అంటాడు..

ఇంకా గొప్పగా ఇంకొక మాట మాట్లాడతాడు

                మతం మత్తు మందు మాత్రమే కాదు

                ఈదేశపు నెత్తురైంది అంటాడు…

ఫిబ్రవరి 2022లో ఉడిపి కాలేజీలో ఆర్‌యస్‌యస్‌కార్యకర్తలు హిజాబ్‌ ధరించి కళాశాలలకు హాజరైన యువతి ముస్కాన్‌పై దాడికి నిరసనగా రాసిన హఇజాబ్‌ దరహాసం అనే కవితలో పై మాటలంటాడు.

అసీఫా ఘటన గూర్చి..!

కథువా రేప్‌ కేసులో 2018 జనవరిలో జమ్మూ కాశ్మీర్‌లోని కతువా సమీపంలోని రసనా గ్రామంలో 8 ఏళ్ల ముస్లిం బాలిక అసిఫా బానోను ఏడుగురు హిందూ పురుషులు (ఆరుగురు పురుషులు మరియు ఒక బాలుడు) అపహరించి, సామూహిక అత్యాచారం చేసి, హత్య చేశారు.  బాధితురాలు సంచార బకర్వాల్‌ కమ్యూనిటీకి చెందింది.  గ్రామానికి ఒక కిలోమీటరు దూరంలో ఉన్న గ్రామస్థులు ఆమె మృతదేహాన్ని కనుగొనడానికి ఒక వారం ముందు ఆమె అదృశ్యమైంది. సామూహిక అత్యాచారం మరియు హత్య చేశారు. అలాగే నిందితులకు ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ స్థానిక అధికారుల నుండి లభించిన మద్దతు భారతదేశం మరియు ప్రపంచవ్యాప్తంగా విస్తృత ఆగ్రహాన్ని రేకెత్తించింది. వర్ణనాతీత బాధను కవితగా రాస్తాడీ కవి..

                 నీ పాలుగారే పసిబుగ్గల

                 జ్ఞాపకాలతో

                 ఏ సంతాప గీతం పాడగలను.

                 అంగాంగం  ఖండించబడి

                 శిరసు చిద్రమై,మాంసపు ముద్దగా మారిన నీ దేహం

                 భంగపడ్డ భరతజాతికి సంకేతమైనప్పుడు

                ఘోషించిన ఆది పరాశక్తి ఓ భ్రమగా తేలినప్పుడు

                 వేన ఏళ్ళ మనువు మోసగాళ్ళు సృష్టించిన

                 భరతమాత ముద్ర

                 సిగ్గుపడిపోయినప్పుడు

                 దేశదిమ్మరులకు ఈ దేశంలో

                 భద్రత లేనప్పుడు

                 ఇక ఏముందని ఏడ్వగలం..?

                 ఇక్కడ అందరంపశుసంతతి గాళ్ళమే

                  వావి వరుసలు లేని జాతులం..(అసిఫా కోసం ఓ ఎలిజీ)

మణిపూర్‌ దుర్మార్గం గూర్చి..!

ఇప్పటికీ చల్లారని మంటగా మణిపూర్‌ మండిపోతూనే ఉంది. గతేడాది మణిపూర్‌ లో ఇద్దరు మహిళలను ఓ గుంపు నగ్నంగా ఊరేగిస్తూ.. అసభ్యకరంగా తాకుతూ.. కొడుతున్న వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. వారిపై సామూహిక అత్యాచారానికీ పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.  ఇంఫాల్కు 35 కిలో మీటర్ల దూరంలోని కాంగ్పోప్కి జిల్లాలో మే 4న ఈ ఘటన జరిగింది.  మెజార్టీ వర్గమైన మైతీలు, కొండ ప్రాంతాల్లో నివసించే కుకీ తెగల మధ్య ఘర్షణలు ఈనాటికీ జరుగుతున్నాయి. అయితే, మే 4న ఏం జరిగిందనే దానిపై పోలీసులు నమోదు స్త్రీ చేసిన ఎన్‌ఐర్లో కీలక విషయాలు వెలుగులోకొచ్చాయి. మణిపూర్‌ మే 3న మైతీ, కుకీ తెగల మధ్య హింస చెలరేగింది. దీంతో ఇంఫాల్కు 35 కిలో మీటర్ల దూరంలోని కాంగ్‌ పోప్కి జిల్లా ఘర్షణలు జరిగాయి. తమ వర్గానికి చెందిన ఓ మహిళపై అత్యాచారం చేశారన్న ప్రచారంతో కొందరు యువకులు మరో వర్గానికి చెందిన గ్రామాలపై దాడులు ప్రారంభించారు. తమ గ్రామంపై దాడి జరుగుతుందని భావించిన ఓ కుటుంబం అడవిలోకి బయలుదేరింది. వీరిలో 50 ఏండ్ల వ్యక్తి, అతని 19 ఏండ్ల కొడుకు, 21 ఏండ్ల బిడ్డతో పాటు 42, 52 ఏండ్ల ఇద్దరు మహిళలు ఉన్నారు. అదే టైంలో నాంగ్పోక్‌ సెక్మె వద్ద వారికి పోలీసులు కనిపించారు. ప్రాణాలు కాపాడుకునేందుకు ఐదుగురు వాళ్ల దగ్గరికెళ్లారు. అంతలోనే 800 నుంచి 1,000 మంది గుంపు వాళ్లను అడ్డగించి దాడికి పాల్పడిరది. తన అక్కను రక్షించేందుకు 19 ఏండ్ల తమ్ముడు ప్రయత్నించగా.. అతనితో పాటు 50 ఏండ్ల తండ్రి అల్లరిమూక దాడిలో చనిపోయారు. ఆ తర్వాత, 21 ఏండ్ల యువతితో పాటు 42 ఏండ్ల మహిళ బట్టలు ఊడదీశారు. నగ్నంగా ఊరేగిస్తూ.. అసభ్యకరంగా తాకుతూ.. కొడుతూ.. పొలాల్లోకి లాక్కెళ్లారు. అందులో ఒకరిపై కొందరు సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు బాధిత కుటుంబం ఆరోపించింది. ఈ ఘటనకు సంబంధించి కవి మణిపూర్‌ మంటలు అని ఒక కవిత రాశాడు..అందులో..

                మరి అక్కడ! ఈ దేశం హద్దుల చివర

                కాబోదులు .. గాంధారి పుత్రులు రాజ్యమేలుతున్న చోట

                ధృతరాష్ట్రుడి అంధ భక్తులు సాగించిన వస్త్రాపహరణాలు,

                ద్రౌపదిపై అత్యాచారాలు పశుసంతతి.. నిర్లజ్జా క్రీడలు

                నిత్యం ఆరని మంటలై మండుతూ వున్నాయి!

                ఈ దేశ కీర్తి రెండు వేల ఏళ్ళు వెనక్కు వెళ్ళి

               సిగ్గుతో ముడుచుకుపోయింది

               దగాకోరు, అబద్దాల మనువు వారసుల

               ‘సబ్‌ ఠీక్‌ హై’, ‘మన్‌ కీ బాత్‌లు ’

               మిరుమిట్ల వెలుగులో ప్రెస్‌మీట్లు

               కార్పొరేట్ల గాఢ పరిష్వంగంలో

               పాలకుల మైమరపులు వెలుగుతూ వున్నాయి!

               అక్కడ వందల ఏళ్ల ఆధిపత్య మనువు

               మగ తనపు పొగరు జడలు విప్పి, నర్తిస్తూ వుంది.

               ఈ దేశ పౌరుషత్వం… చెమటలు పట్టి

               నిస్తేజంగా అవిరైపోతూవుంది!

               సిగ్గు లేని పాలకులు

              ముసళ్లే సిగ్గు పడేలా కన్నీరు కారుస్తూ అంగలారుస్తారు.

              శాంతి కపోతాలు.. పంజరంలో

              బంధించబడుతాయి! డేగలు… నెత్తుటి నోళ్లతో

              విజయ గీతాలను అలపిస్తాయి!

              నెమ్మదిగా.. మరో అంకం నాటకానికి తెర లేస్తుంది.

             ఈ దేశం మొత్తంగా మత్తుగా నిద్రలోకి జారిపోతుంది!

ఇంకా ఈ కవిత్వ సంపుటిలో ఢల్లీి రైతు ఉద్యమం మీద.. ప్రస్తుతంజరగుతున్న  పాలస్తీనా `ఇజ్రాయిల్‌ యుద్దం మీద కూడా బలమైన కవితలున్నాయి. ప్రపంచంవ్యాప్త పరిణామాల్ని ఈ కవి చరిత్రలో రికార్డు చేసే పనిలో సఫలీకృతుడయ్యాడనిపించింది. ఈ సంపుటి కావాల్సిన వాళ్ళు..అలాగే కవిని అభినందించాలనుకున్నవాళ్ళు  9440467678 నెంబర్‌కు సంప్రదించండి..

Leave a Reply