నన్ను కట్టిపడేసి ఓ చోట కూర్చోబెట్టి ప్రేమగా నాకోసం ఓ పాట పాడి, నేను దాటొచ్చిన ప్రేమ కధ చెప్పి ఏడిపించి కళ్ళు తుడుచుకునేలోపే మాయమైంది. ఇప్పుడు ఆమె నా ప్రేయసి. జమిల్యా
అతి త్వరగా అతి తీవ్రంగా అతిగా నేను ప్రేమించిన తక్కువ పాత్రల్లో జమీల్యా ఒకటి. కొన్ని సంవత్సరాల క్రితం నేను ప్రేమించిన నా ప్రియురాలు రాజేశ్వరిని మళ్ళీ చూసినట్టుంది.
ఒక చిన్న పెయింటింగ్ చెప్పే కథ. అది గీసిన కుర్రాడి ప్రేమకథ. తన వదిన ప్రేమకథ. ఓ గాయపడిన ఒంటరి సైనికుడి కథ. చాలా మామూలుగా మొదట్లో వేసిన చిత్రం చూడడానికి ఎలా ఉన్నా, దాని లోతు మాత్రం సముద్రమంత.
ప్రజల కోసమే సైనికులు ఉన్నారు. కానీ అసలు యుద్దం ఎవరికోసం అన్న ప్రశ్న ఒక చిన్న కుర్రాడికి వస్తే. దానికి సమాధానం యుద్దానికి ఆమోదించే పాలకులు, యుద్దాలు చేయించే పెట్టుబడిదారులకి తప్ప సామాన్య ప్రజలకి అంతుచిక్కదు. ఎందుకంటే యుద్దమంతా స్వార్దపు సిద్దాంతం మీద ఆధారపడి ఉంటుంది. తమ స్థావరాన్ని విస్తరింపజేయడం కోసం, అవతలి వారి మీద గెలవడం కోసం, నేల కోసం, పెట్టుబడిదారుడి కోసం, వారి ఆలోచనలో యుద్దం ఉంటుంది.
ఆ యుద్దం కారణంగా ఎన్నెని కుటుంబాలు ఇంట్లోనుంచి బయట పడుతున్నాయో కదా! ఒక్కోసారి తమ ఇల్లు ఎక్కడో కూడా గుర్తుపట్టడం వీలు పడదు. నేల మాత్రమే మిగులుతుంది. ఇంకేమీ ఉండదు.
అలాంటి పరిస్థితుల మధ్య యుద్దంలో గాయమయినా మనసుని రాయి చేసుకున్న మనిషి “దనియార్” ఎక్కడో ఓ చోట కేవలం బ్రతికే ఉన్నానని ఆలోచనతో బ్రతుకుతున్నాడు. యుద్దాన్ని కళ్ళముందు, దుఃఖాన్ని మనసులో, గాయాన్ని కాళ్లమీద మోసుకుంటూనే తిరిగాడు.
రెండో ప్రపంచం యుద్దం మొదలైంది. లక్షల్లో కోట్లల్లో సైన్యం, మామూలు ప్రజలు చనిపోయారు. అంతటి తీవ్రమైన యుద్దం అది. ఆనాటి పరిస్థితులు, సంప్రదాయాల విలువల మధ్య వెలిగే ఓ కుటుంబం, ఆ ఇంట్లోకి కోాడలిగా వచ్చిన ఓ చిచ్చర పిడుగు పేరు జమీల్యా. మామూలు ఆడవారిలా కాకుండా తన ఆలోచనలు, తన వ్యక్తిత్వం, ఆమె మాటలు, సమాజంలో ఆమె ప్రవర్తన అంతా ఆ ఇంటినీ తర్వాత కాలంలో ఆమే ఇంటి జిగీత్ అని అనుకునే విధంగా ఉంది. అయితే అనుకోని సంఘటనల వల్ల జమీల్యా చేసిన పోరాటం, సంఘాన్ని ధిక్కరించడం, సమాజనికి అర్దవంతమైన సందేశమే ఇచ్చినా ఆనాటి పరిస్థితికి ప్రజలు తప్పేపట్టారు.
అప్పటి అర్ద బానిసత్వంలో ఉన్న ప్రజలూ, రైతులూ పండించిన ధాన్యాన్ని సమిష్టిగా యుద్దంలో పోరాడే సైనికుల కోసం పంపాలి. ఆ దేశంలో తప్పని సరిగా కుటుంబంలోని పెద్దవారిని యుద్దానికి పంపించాలి. యుద్దానికి వెళ్ళే అలాంటి సైనికుడికి ( మళ్ళీ వస్తాడో రాడో ) యవ్వన యువతిని ఇచ్చి పెళ్లి చేశారు. ఆమె అతని కోసం ఎదురుచూస్తూ ఉంటుంది.
ఈ కథ చదివిన తర్వాత రంగనాయకమ్మ విశ్లేషించిన “అసమానత్వంలోంచి అసమానత్వలోకే” అనే పుస్తకం గుర్తొచ్చింది. కానీ అక్కడ “ఫెమినిస్టు” ఇక్కడ “మేనిస్ట్”. పుంకానుపుంకాలుగా పురుషాధిక్య భావజాలం ఆనాటి యుద్దకాలంలోనే ఉంది. ఇంకా కొనసాగుతూనే ఉంది.
రచయిత చెప్పించిన కొన్ని మేనిస్ట్ మాటలని చూద్దాం.
“ మా ఊళ్ళో అప్పటికున్న కులాచారం ప్రకారం కొడుకులు ఉన్న వితంతువు ఎటూ పోవడానికి కుదరదు. చనిపోయిన మనిషికి దగ్గరి బంధువు మా నాన్నే కాబట్టి మా కుల పెద్దలు ఆమెను మా నాన్నకే ఇచ్చి పెండ్లి చేశారు”
“ స్త్రీకి వంట రావడం పిల్లల్ని కనడం వస్తే చాలు” ఎన్నో తరాల నుంచి స్త్రీ సమాజంలో బానిసగానే ఉంది. పురుషాధిక్య బుద్ది వల్ల, బలం వల్ల, మానసికంగా పురుషులు స్త్రీని ఇంటి వరకే సంకెళ్ళు వేశారు. కానీ రచయిత కథలోని పురుషుడు మాత్రం ఆ ఇంటి యజమాని వడ్రంగి భార్య. సమాజంలో లేని దానినీ, మనుషులు ఉహీంచని దానినీ, కథనీ పరిగెత్తించే దానిని పట్టుకుంటే ప్రతి కథ జమీల్యానే.
రచయిత దృష్టి వారి ఊహ. యుద్దం తాలూకు నెత్తుటిని తాకింది. రాలిపోయే పువ్వుని ముద్దాడింది. నలిగిపోయే మనసుని కౌగిలించుకుంది
అన్ని సిద్దాంతాలని తనకున్న విలువలని ఒక్క చిన్న కంఠ స్వరం, ఓ అరచూపు పెకిలించివేసింది. “దనియార్” పాట యుద్దం తాలూకు తీవ్రతను, వాతావరణాన్ని తోటి సోదరులని గుర్తు చేసింది. ఒక్కొక్క పదానికి జమీల్యా తన ఒక్కో కన్నీటి బొట్టుని దనియార్ భుజం మీదినుంచి జారవిడిచింది. మళ్ళీ ప్రేమ! తన మీద కానీ, తాను చేసే శ్రమ మీద కానీ ఏమాత్రం ప్రేమ లేని అతన్ని పెళ్లి చేసుకుని ఏ ఆనందం పొందగలిగాను. నా మీద ఒక్క ఉత్తరం రాయడే! (పరిస్థితులు ఇలా ఉంటే మాత్రం నా ప్రేమ అందుకు అతీతం కదూ!) నా కోసం ఒక చిన్న మాట రాయడే! (ఆచారాలు అలా ఉంటే మట్టుకు నా మీద ప్రేమ లేదూ!) అంతా అయిపోయాక ఆఖర్లో “నా భార్యని అడిగినట్టు చెప్పండి” అని రాస్తే మాత్రం అది నాకెందుకు? అనుకుంది. పెళ్లిని పక్కన పెట్టింది. మళ్ళీ ప్రేమించింది. తన అల్లరిని, తన చేష్టలని, తన సూటి మాటలని, తన అందాన్ని ప్రేమించిన ఆనాటి కుల మనుషులు… మళ్ళీ ప్రేమించింది, ఆ అనామకుడితో వెళ్లిపోయింది, అనగానే దుమ్మెత్తి పోశారు. అప్పటి వరకు ప్రేమించిన మరిది వాళ్ళని అర్దం చేసుకుని నేను ప్రేమించింది అమ్మని అని నమ్మి వారి జీవితాన్ని చరిత్రలో అచ్చు వేశాడు.
అనువాదం చేసిన రచయిత సూఫీ గారికి అభినందనలు. రష్యాలో వచ్చిన పుస్తకం కానీ ఇంగ్లిష్ లో వచ్చిన పుస్తకం కానీ వుప్పల లక్ష్మణరావుగారి అనువాదం గానీ నేను చదవనప్పటికీ, సూఫీ అనువాదం చాలా బాగా నచ్చింది. ఆ వర్ణన ఇంకా బాగా నచ్చింది. కానీ ఇంకా సహజమైనా సరళమైన భాషలో అదే వర్ణనని చెప్పొచ్చు అని నాకు కొన్ని ఒకట్రెండు పదాలు ఉన్న చోట అనిపించింది. కాస్త కటువుగా. కొన్నిటి దగ్గర మైదానాన్ని వర్ణించినప్పుడు మామూలు పాఠకులకు అర్దమయ్యే పదాలు వాడితే ఆ వాక్యం ఇంకా బాగుండేది. కొన్ని అచ్చుతప్పులు కొన్ని విభక్తులు మినహాయిస్తే. ఒక చక్కని అల్లం టీ చేసుకునే సమయంలో పరిచమైన జమీల్యా, టీ తాగేలోపు ప్రేమించేశా. అంతటి మహోత్తర పాత్రలని పరిచయం చేసిన ఇద్దరు రచయితలకు అభినందనలు.
ఈ కధలో అతి సాధరణమైన ఆ చిత్రాన్ని చూసి.. ఏముంది అంతా మామూలే కదా! అని లోపలికి వెళ్ళి వచ్చి ఆ చిత్రాన్ని గుండెకు కౌగిలించుకుని కళ్ళతోనే ముద్దుపెట్టుకున్నాను. అతి సాధారణ రైతులు ఒకరు కళాకారులు ఇద్దరు స్వేచ్ఛా జీవులు.