కొన్ని ‘ఆలోచనలు’ భలే ఉంటాయి. దేనికి ముందుకు వస్తాయోగాని, అసలు విషయాలను బైటపెడతాయి. కె. శ్రీనివాస్‌ ఆగస్టు 15 ఆంధ్రజ్యోతిలో రాసిన ‘‘మరీ ఇంత ‘కళ’ తప్పిందేమిటి తెలుగుదనం?’’ అనే వ్యాసం అట్లాంటిది. కాకపోతే  తెలుగు కళా సాహిత్య సాంస్కృతిక రంగాల గురించి వీలైనంత వెనక్కి వెళ్లి   పాత విషయాలే మళ్లీ మాట్లాడుకోవాల్సి వస్తున్నది.

ఈ మధ్య తెలుగు ప్రగతిశీల సాహిత్య మేధో రంగాల మీద విమర్శనాత్మక పున:పరిశీలన పెరుగుతున్నది. ఇది చాలా అవసరం. ఎక్కడ బయల్దేరాం? ఎట్లా ప్రయాణిస్తున్నాం? దీని గురించి మన అంచనాలేమిటి? అని తరచి చూసుకోవడం మంచిది. ఒకప్పటి కంటే కాస్త ఎక్కువగా చుట్టుపక్కల భాషా రచనలు తెలుగులోకి అనువాదమవుతున్నాయి. ఇతర భాషా రచయితలతో, బుద్ధిజీవులతో కలిసి మాట్లాడుకొనే అవకాశం పెరుగుతున్నది. మనలోకి మనం తొంగి చూసుకోడానికి ఈ సంపర్కం దోహదం చేయాలి. కానీ ఇటీవలి  పరిశీలనలు గమనిస్తే ఈ పని ఎలా చేయాలో మనకు అంతగా తెలియదని స్పష్టమవుతున్నది. 

ఇరుగుపొరుగు రాష్ట్రాలయినంత మాత్రాన, సరిహద్దు సంస్కృతి విస్తారంగా ఉన్నంత మాత్రాన దేశంలోని ఏ రెండు భాషా సమాజాలను పోల్చడం అంత సులభం కాదు.  ఎన్ని పోలికలు ఉండగలవో, ఎన్ని తేడాలు ఉండగలవో, వాటికి ఆ సమాజ అభివృద్ధి వికాసంలో మూలాలు ఎట్లా పని చేస్తున్నాయో చెప్పడానికి చాలా కష్టపడాలి. మన ఆసక్తి కొద్దీ, ప్రవేశం కొద్దీ ఏదో ఒక రంగం వైపు నుంచి చూసి సరిపెట్టుకుంటాం. సాంస్కతిక రంగానికి మాత్రమే పరిమితమై కళా సాహిత్యాలను తేల్చడం ఎవరి వల్లా కాదు. రాజకీయార్థిక చారిత్రక విశ్లేషణల్లోకి వెళ్లాలి. ఆ భాషా సమాజంలోని అంతర్గత వైరుధ్యాలను పరిగణలోకి తీసుకోవాలి. వాటి మధ్యనే అది ఏ మేరకు ఒక భాషా ప్రయుక్త జాతి సమాజంగా సంఘటితమైందో, కాలేకపోతున్నదో పరిశీలించాలి. ఇంత సంక్లిష్టత ఉన్నందు వల్లనే  తెలుగు భాషా సమాజాల మధ్యే  ఎంత ఉమ్మడిదనం ఉన్నదో, ఎన్నెన్ని ప్రత్యేకతలు ఉన్నాయో ఇప్పటికీ మనం సంపూర్ణ అవగాహనకు చేరుకోలేదు.

కానీ తమిళం నుంచో, మళయాళం నుంచో అనువాదమైన ఒక రచనతో తెలుగు సాహిత్యాన్ని  కొలవడం ఇటీవల ఒక ధోరణిగా మారింది. ఇది తులనాత్మక అధ్యయనంగా మారితే మంచిదే. అది అత్యవసరమైన గంభీరమైన పని. కానీ బైటి నుంచి వచ్చిన ఒక రచనను చదవగానే మనవాళ్లు పారవశ్యానికి గురవుతున్నారు. నిస్పందేహంగా ఇతర భాషా రచన కొత్త అనుభవాన్ని ఇస్తుంది. కొత్త ఎరుకను కూడా ఇస్తుంది. కానీ దాన్ని స్కేలుగా భావించి తెలుగు సాహిత్యాన్ని కొలుస్తున్నారు. ఈ పని  సాహిత్య పాఠకులు చేస్తే  తప్పుపట్టలేం. కానీ సాహిత్య సామాజిక విశ్లేషకులు కూడా ఇదే చేస్తున్నారు.  ఇందులో  యాంత్రికత లేదా? ఇది తక్షణ ప్రతిస్పందన కాదా? అని కనీసంగా అనుకోవడం లేదు.

నిజానికి తులనాత్మక పరిశీలన కూడా నిర్దిష్టంగా ఒక రచనకు, రచయితకు పరిమితమైతే కొన్ని విషయాలే చెప్పగలం. బహుశా అవి ఎక్కువగా కళా సంబంధమైనవి కావచ్చు. అంతకంటే లోతైన, జటిలమైన సమాజ సాహిత్య అంశాలను ఆ రచనకు, రచయితకు మాత్రమే పరిమితమై ఎవ్వరూ తులనాత్మకంగా చర్చించలేరు.  రెండు భాషా సాహిత్యాల మధ్యే కాదు. ఒకే భాషలోని రెండు పక్కపక్క ప్రాంతాల మధ్య కూడా చేయలేరు.  సాహిత్యంలోని సామాజికత, తాత్వికతల సంగతి పక్కన పెడితే,  సృజనాత్మకతలో  వ్యక్తి ప్రమేయం, తాత్విక ప్రభావం  ఉన్నప్పటికీ ఆ ప్రాంత అంతర్గత కారణాలు కూడా  దోహదం చేయవచ్చు. ఒకే రాజకీయ, భావజాల ప్రభావం నుంచి వచ్చే కళా సాహిత్యాల్లో ప్రాంతాల మధ్య తేడాలు చూడవచ్చు. ఒకే ప్రాంతంలోని సామాజిక అస్తిత్వ ప్రత్యేకతల్లోనూ చూడవచ్చు. అందులో కూడా వ్యక్తికీ వ్యక్తికీ మధ్య కూడా చూడవచ్చు.

ఇంత జటిలమైన విషయాన్ని సవ్యంగా చూడకపోవడం వల్ల బెంగళూరు బుక్‌ బ్రహ్మ ప్రోగ్రాంకు వెళ్లినప్పుడు ‘పెరుమాళ్‌ మురుగన్‌, వసుదేంద్ర, జయమోహన్‌, సచ్చిదానందన్‌ వంటి గొప్ప సాహిత్య వ్యక్తిత్వాలు తెలుగు నుంచి వస్తున్నాయా?’ అని గీతారామస్వామికి అనిపించి ఉండవచ్చు. కానీ కె. శ్రీనివాస్‌కు కూడా అలాగే అనిపించింది. ఇదీ ఆశ్చర్యకరం. మామూలుగా  ఎవ్వరూ ఇంత అలవోకగా  ఇలాంటి పోలిక తీసుకరాలేరు. ఇతర భాషల్లో ఎట్లా ఉన్నదోగాని, తెలుగులో ఒక సాహిత్య వ్యక్తిత్వం, సాహిత్య వ్యక్తీకరణ, సాహిత్య కళా ధోరణి, సాహిత్యోద్యమం చరిత్రగతిలో ఎట్లా ముందుకు వచ్చేదీ విస్తారమైన చర్చ జరిగింది. రాజకీయార్థిక చారిత్రక పరిశీలనగా కూడా అభివృద్ధి చెందింది. అదంతా మర్చిపోయి ఈ పోలిక తేవడం ఏమిటో అర్థం కాలేదు. ఇది నిజానికి వ్యక్తుల మధ్య, భాషా సాహిత్యాల మధ్య పోలిక తేవడానికేనా? లేక బుక్‌ బ్రహ్మ సందర్భంలో తెలుగు సాహిత్య సామాజిక రంగాల్లో బలంగా ఉన్న ప్రగతిశీల భావజాల, రాజకీయ ప్రభావాలను విమర్శించడానికా? సందేహం కలుగుతోంది. అందుకే తెలుగు పాఠకులకు చిరపరిచయమైన విషయాలను ఇంత వివరంగా గుర్తు చేయాల్సి వచ్చింది.       

పెరుమాళ్‌ మురుగన్‌, వసుదేంద్ర, జయమోహన్‌, సచ్చిదానందన్‌ వంటి వాళ్ల పోలికను తిరగేసి  తెలుగులోంచి ఎన్ని ఉదాహరణలైనా ఇవ్వవచ్చు. తెలుగు  ప్రగతిశీల, విప్లవ, అస్త్తిత్వవాద సాహిత్య వ్యక్తిత్వాలతో మిగతా దక్షిణ భారత భాషల్లోని సాహిత్య సాంస్కృతిక వ్యక్తిత్వాలను పోల్చి చెప్పవచ్చు. పోటీగా నిలబెట్టవచ్చు. అటూ ఇటూ ఈ రెండు పనులూ అసంబద్ధ వ్యవహారాలే.  ఇంత పాపులిస్టిక్‌ ధోరణి వల్ల ఏ సత్యం బోధపడుతుంది? ఏ పున:పరిశీలనకు ఇది దోహదం చేస్తుంది? ఇలాంటి తులనాత్మకత  పక్కవారి నుంచి ఏం నేర్చుకోడానికి దారి చూపుతుంది?

                0              0              0

ప్రతి సమాజం అనుభవించే అంతర్గత సంఘర్షణల నుంచి,  బైటి ప్రభావాల నుంచి,  అంతిమంగా మార్పు కోసం చేసే కఠోర ప్రయత్నాల నుంచి ఆ భాషా సాహిత్యంలో కొత్తదనం వస్తుంది. మనుషులు తమ   గతంలోకి, దాని మూలాల్లోకి పదే పదే తొంగి చూసుకుంటూ ఉండవచ్చు. తద్వారా తమ వర్తమాన జీవితాన్ని అర్థం చేసుకుంటూ ఉండవచ్చు. కానీ అంతకంటే ఎక్కువగా మనుషుల పెనుగులాట అంతా భవిష్యత్తు దిశగానే ఉంటుంది. లేకుంటే జీవితమూ, సాహిత్యమూ ఇంత ముందుకు ప్రయాణించేవే కాదు. భవిష్యత్తు దిశగా సాగే ఆరాటంలో వ్యక్తులకు, సమూహాలకు, భాషా సమాజాలకు పోలికే ఉండదు. అందరూ, అన్ని ప్రాంతాల్లోని వారు ఒకేలా తలపడలేరు. ఎన్నో కారణాలు నిర్దేశిస్తాయి. మరెన్నో కారణాలు పరిమితులు విధిస్తాయి.  ఒక ప్రాంతానికి, లేదా భాషా సమాజానికి సొంతదనం ఏదైనా ఉన్నదనుకుంటే అది ఇదే. ఈ గీటురాయిని ప్రధానంగా తీసుకొని  ఏ భాషా సాహిత్యాన్నయినా పరిశీలించవచ్చు.  ఎన్ని భాషా సాహిత్యాలనైనా పోల్చి పరిశీలించవచ్చు. ఎందరు సాహిత్యకారులనైనా అంచనా వేయవచ్చు. ఈ తెలివిడితో ఎన్ని పనులైనా చేయవచ్చు. అప్పుడు వివిధ భాషా సాహిత్యాల, సాహిత్య వ్యక్తిత్వాల నిర్మాణం ఎందుకు ఇలా జరిగిందో, వాటి ప్రత్యేకతలేమిటో సులభంగా తెలుసుకోవచ్చు.  ఇవేవీ శ్రీనివాస్‌ అన్నట్లు కచ్చితంగా  ప్రమాదవశాత్తు సంభవించేవి కావనీ,  పూర్వజన్మ సుకృతాల వల్ల సమకూరేవి కావనీ అందరూ అంగీకరిస్తారు.  ఈ స్పష్టత ఉంటే అందరూ కలిసి సాహిత్య మేళాలు జరుపుకోవడం ఏమంత కష్టం కాదు.  ఆసక్తి ఉన్నవాళ్లు ఆ పని చేయవచ్చు.  ఒకవేళ బుక్‌ బ్రహ్మ లాంటి సమ్మేళనాలు  జరగకపోయినంత మాత్రాన మనవాళ్లు ఒట్టి వెధవాయిలోయ్‌ అనుకొని కించపడాల్సిన పని ఉండదు. అట్లా అనుకోవడమే తెలివిడి అని, ఆత్మవిమర్శ అని, అయినా ఏమీ చేయకపోవడంలో తెలుగువారికి ప్రసిద్ధి ఉన్నదని నొప్పి పడాల్సిన దుస్థితి ఉండదు.

ఇంతకూ ఇదంతా పెరుమాళ్‌ మురుగన్‌, వసుదేంద్ర, జయమోహన్‌, సచ్చిదానందన్‌ వంటి ఉదార్త సాహిత్యకారులు తెలుగులో లేరనా? అలాంటి వాళ్లు అక్కడ ఉన్నందు వల్లనే సాధ్యమైన బుక్‌ బ్రహ్మలాంటివి తెలుగులో జరగడం లేదనా? లేక ఇక్కడి ప్రగతిశీల, విప్లవ, అస్తిత్వ ఉద్యమాల వల్ల ‘తెలుగుదనం’ అడుగంటిపోయిందనా?

‘‘‘సామాజిక, సాంస్కృతిక ఉద్యమాలు, రాజకీయ పోరాటాలు ఉన్నత సమిష్టి విలువలను మనలో నిలపలేదేమో? పెద్ద ఎత్తున సమీకరించి విముక్తి పోరాటాలు నడిపిన ఉద్యమాలు, సామాజిక, సాంస్కృతిక జీవనంలో ఉత్తమ, విశిష్ట ప్రమాణాల మీద దృష్టి పెట్టలేదేమో?’ అని కె. శ్రీనివాస్‌ రాశారు.  వాస్తవాలను తిరగేసి ఈ మాటలు చెప్పారు. వామపక్ష విప్లవ శక్తులు సాహిత్యం, కళలు, సాంస్కృతిక విషయాలతో కలిసిన రాజకీయ పోరాటాలు  పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాయి. విడిగా కూడా నిర్వహిస్తున్నాయి. ఈ  ఉద్యమాలు  సామాజిక, సాంస్కృతిక జీవనంలో సమిష్టి విలువలను, ఉత్తమ, విశిష్ట ప్రమాణాల మీద కేంద్రీకరించడం వల్లనే ఎన్నోకొన్ని విజయాలు సాధించగలిగాయి. కమ్యూనిస్టు విప్లవ శిబిరానికి బైట కూడా మొదటి నుంచి తెలుగులో అద్భుతమైన సాంస్కృతిక పోరాట ధార ఉన్నది.  రాజకీయ విషయాల్లో ఎన్ని తేడాలు ఉన్నప్పటికీ అస్తిత్వ ధోరణులు దీన్ని ముందుకు తీసికెళ్లాయి. మూడు తరాల బహుజన సాహిత్యకారులు, సాంస్కృతిక మేధో వ్యక్తులు ముందుకు వచ్చారు.

ఇతర భాషా సాహిత్యాలతో పోల్చితే అనేక సామాజిక, రాజకీయ ఉద్యమాల వల్ల తెలుగు సమాజాలు  సాంస్కృతికంగా చాలా ఎదిగాయి. సాంస్కృతిక, మేధో ఉద్యమాల వల్ల కూడా  ఇది సాధ్యమైంది. రాజకీయాలను విశాలమైన అర్థంలో చూసే దృక్పథం ఉన్నందు వల్ల జీవితమంతా వ్యాపించి ఉండే సంస్కృతిని చూడగలిగాయి. సంస్కృతి వైపు నుంచి రాజకీయాలను కదిలించిన అనుభవం కూడా తెలుగు సమాజాలకు ఉన్నది. ఇక్కడి సాహిత్య వైవిధ్యానికి, వైశాల్యానికి ఇదొక ముఖ్యమైన కారణం. దక్షిణ భారత భాషల్లో  వస్తున్న సాహిత్యం గురించి మొత్తంగా చెప్పలేకపోయినా, తెలుగులోకి అనువాదమవుతున్న తాజా సాహిత్యాన్ని చదివితే ఒక పరిశీలన చేయవచ్చు. బహుశా తెలుగులో నలభై యాభై  ఏళ్ల కింద వచ్చిన సాహిత్యంలాంటిదాన్ని ఇప్పటికీ అక్కడ రాస్తున్నారు. అక్కడి ప్రగతిశీల, అస్తిత్వ సాహిత్య స్రవంతులన్నిటికీ స్థూలంగా ఇది వర్తిస్తుందేమో చూడాలి.  జీవితం మారుతున్న తీరును, పాత ధ్వంసమైపోయి కొత్తది రూపొందుతున్న తీరును చిత్రించడంలో తెలుగు సాహిత్యం చాలా ముందు ఉంది. ఎంత గతంలోకి వెళ్లినా, అక్కడితో సరిపెట్టుకోకుండా మార్పు క్రమాల మీద కేంద్రీకరణ  ఉన్నది. బహుశా ఇదే తెలుగులో ఇవాళ ప్రగతిశీల సాహిత్య ప్రధాన ధోరణి.

తెలుగు సమాజపు సాంస్కృతిక పరిణతి, రాజకీయ క్రియాశీలత వల్లనే ఇది సాధ్యమైంది. మిగతా భాషలతో పోల్చినప్పుడు వర్తమాన సామాజిక సంఘర్షణలు, భావజాల తాత్విక పోరాటాలు తెలుగు సాహిత్యంలో విస్తృతంగా  కనిపిస్తాయి.  తెలుగుదనం అనే భావనను దాటి తెలుగు సాహిత్యం చాలా ముందుకు వచ్చింది. తెలుగు జాతి నిర్మాణమే అస్తవ్యస్తంగా జరిగిందని తెలంగాణ ఉద్యమం బట్టబయలు చేసింది.  అనేక చారిత్రక కారణాలు, అభివృద్ధిలోని అసమానతలు, ఆధునికతా వికాసంలో ప్రత్యేకతలు,  అధికార కేంద్రీకరణలు వగైరా ఎన్నో అంశాలు చర్చకు వచ్చాయి. తెలుగు భాష అనే ఉమ్మడిదనం ఒక్కటి తప్ప మరే రకంగానూ తెలుగుదనంలో తెలంగాణదనం లేదని ఆ ఉద్యమం తేల్చింది. తెలుగు, తెలంగాణ వేరనే వాదన కూడా వచ్చింది. ఇలాంటి  అతిశయం కొంత ఉన్నా తెలుగుదనం మీద ఆ ఉద్యమం ఇచ్చిన ఫోకస్‌ను విస్మరించలేం. తెలుగు మాట్లాడే ప్రజల్లో కొందరికి తెలంగాణదనం, ఆంధ్రాదనం, రాయలసీమదనం ఉన్నాయని స్పష్టమైంది. ఒకే భాష మాట్లాడుతూ ఒక్కటి కాలేకపోయిన తెలుగు  ప్రజలు ఒక్కటి కావడానికి, ప్రపంచ మానవులు కావడానికి తెలుగుదనం కంటే వేరే ప్రాతిపాదికలు ఎక్కువ ఉపయోగపడతాయేమో చూడాలి.  దేనికంటే తెలుగుదనంలో అసమానతలు, వివక్షలు ఉన్నాయి. వాటిని ప్రశ్నించలేని సంప్రదాయక భావనగా తెలుగుదనం ఒకప్పుడు ఉండిరది. దాని గురించి ఎవ్వరు మాట్లాడినా, ఎందుకు మాట్లాడినా అందులో సంప్రదాయ, యథాతధ కంఠస్వరం వినిపిస్తుంది.

 తెలుగు ప్రజలు ఒక్కటి కావడానికి తెలుగుదనం కంటే రాజకీయార్థిక, సాంస్కృతిక, భావజాలపరంగా, విలువల పరంగా, కొత్త సమాజ ఆకాంక్షల పరంగా  వేరే ప్రాతిపదికలే అనుకూలమైనవి. ప్రాంతాలపరంగానే కాక కులాల వారిగా అన్ని కులాలకు ఉమ్మడి తెలుగుదనం లేదు. తెలుగు ప్రాంతాల్లో జీవిస్తున్న తెలుగేతర మాతృభాషా సమూహాలకు వర్తించే తెలుగుదనం లేదు.

తెలుగు సమాజం ఈ ఎరుక పొందడం వల్లనే సాంస్కృతికంగా చాలా ఎదిగింది. దీన్ని పోల్చి మిగతా భాషా సమాజాలను, కళా సాహిత్యాలను తక్కువా చేయాల్సిన పని లేదు. ఎక్కువా చేయాల్సిన పనిలేదు. ఇది తెలుగు సమాజాల ప్రత్యేకత. బహుశా ఇదే తెలుగు ప్రజల ఉమ్మడిదనం. దీని ప్రకారం వర్గాలకు అతీతంగా తెలుగుదనం పేరుతో సాహిత్య సమ్మేళనాలు జరిగే వాతావరణం లేదు.

తెలుగు సాహిత్యరంగంలో ప్రతికూల అంశాలు చాలానే ఉండవచ్చు. దాని మీద శ్రీనివాస్‌ కంటే కఠినంగా మాట్లాడవలసిందే. కానీ అనుకూల అంశాలను మర్చిపోవడానికి లేదు.   ప్రగతిశీలత అనే మాట కూడా స్థూల అర్థంలోకి వెళ్లే కొద్దీ ద్రవ స్థితికి చేరుకుంటుంది. వర్గాలు, వర్గ పోరాటం, రాజ్యం, బ్రాహ్మణ భావజాల ఆధిపత్యం,  అగ్రకుల స్వభావం మొదలైన వాటికి అతీతంగా ‘ప్రగతి’ అనే మాటను అంగీకరించే పరిస్థితిలో తెలుగు సమాజ సాహిత్యరంగాలు లేవు. దీన్ని సాంస్కృతిక పరిణతి అని ఎందుకు అనుకోకూడదు? బుక్‌ బ్రహ్మను కూడా  అక్కడ తిరస్కరించిన, దూరంగా ఉండిన రచయితల, సాహిత్య బృందాల అవగాహనే సరైందని ఎందుకు అనుకోకూడదు? అందరూ కలవడం దానికదే తప్పు కాదు. ఏదో ఒక సామాజిక సమస్యపై స్థూల ఏకాభిప్రాయంతో కలవడానికి తెలుగుదనంలాంటి ప్రాతిపదికలపై కలవడానికి తేడా ఉంటుంది. తమిళంలో, మళయాళంలో, కన్నడంలో లక్షల కాపీలు పుస్తకాలు అచ్చయి పాఠకుల్లోకి వెళ్లవచ్చు. ఇది అద్భుతమే. కానీ తెలుగు రచయితలు, కళాకారులు, మేధావులు సాహిత్య రచనను దాటి ప్రజల్లోకి వెళ్లి సమరశీల కార్యకర్తృత్వం వహించే  సంప్రదాయం ఉన్నది. మిగతా భాషల్లో కూడా ఉండవచ్చు. కానీ తెలుగులో ఇది చాలా గరిష్ట స్థాయిలో ఉంది. అందువల్ల  వర్గాలకు, రాజ్యానికి, సామాజిక ఆధిపత్యాలకు అతీతంగా తెలుగుదనం పేరుతో రచయితలంతా ఒకే పరివారంగా కలిసిపోలేరు. బుక్‌ బ్రహ్మ సమావేశాలను చూసిన వాళ్లు నొప్పిపడ్డది ఇలాంటి తెలుగుదనం కళ తప్పిందనే కావచ్చు. ఎవరి శిబిరం వాళ్లు నిర్వహించుకుంటూ కూడా ఉమ్మడి ఉత్సవాలు జరుపుకోవాలనే ఆకాంక్ష చూడ్డానికి చాలా ఉదార్తమైనది. కానీ ఆ ఉమ్మడిదనాన్ని తెలుగుదనం అనగలమా?  ఫాసిజానికి, ప్రభుత్వ విధానాలకు, సామాజికంగా పీడిత సముదాయాల మీద దాడులకు వ్యతిరేకంగా ఉమ్మడి కార్యక్రమాలు తెలుగులో జరుగుతూనే ఉన్నాయి. కానీ బుక్‌ బ్రహ్మ ఇలాంటిది కాదు. దాని నమూనా పూర్తిగా వేరే.

తెలుగు సాహిత్యంలోని అనుకూలాంశాల వల్ల బుక్‌ బ్రహ్మ లాంటి భారీ సమ్మేళనాలు జరగకపోయి ఉంటే దానికి సంతోషించాల్సిందే. విచారం దేనికి? కానీ శ్రీనివాస్‌ తెలుగులోని అనుకూల, ప్రతికూల అంశాల పరిశీలనలోకి వెళ్లలేదు. కొంత వరకు రెంటినీ కలిపి చూశారు. అందువల్ల బుక్‌ బ్రహ్మ వంటి కార్యక్రమాలు జరగకపోవడానికి  కారణం ప్రగతిశీల ఉద్యమాల వైఫల్యం అన్నారు.  ‘సాంస్కృతిక జీవనంలోనూ, విలువల పాటింపులోనూ కొత్త పతన స్థాయిని, లేకితనంలో కొంగ్రొత్త పతన పతాకస్థాయిని అందుకుంటున్న ప్రయాణం తెలుగువారిది’ అని నిర్ధారించారు.

ఒకవేళ ఈ లేకితనం వల్లనే ఉమ్మడి మేళాలు జరగలేదని, ‘ఒక ప్రస్పుట కళా సాహిత్య చిత్రపటం’ తెలుగులో కనిపించడం లేదని అనుకుంటే అదేమిటో చెప్పాలి. బహుశా ప్రభుత్వ, ప్రభుత్వేతర అవార్డుల కోసం, పురస్కారాల కోసం పాకులాడటం, శాలువాల కోసం పరితపించడం, ఒకరికి అవార్డు రాకుండా మరొకరు అడ్డుపడటం, సొంత గుర్తింపు ఒక్కటే లక్ష్యంగా మారడం,  రాజాశ్రయానికి పాలుమాలడం,  పరస్పర భజన బృందాలుగా రచయితలు తయారవడం, కులాలవారిగా, ప్రాంతాలవారిగా వివక్షలను నేటికీ కొనసాగించడం వంటి ఎన్నో కారణాలను గుర్తించవచ్చు. వాటిని ఎండగట్టాలి. దీని వల్లే ‘తెలుగు సాహిత్య సమాజంతో వ్యవహరించడం కష్టం’ అయితే ఆ సంగతి చెప్పాలి. ఒకసారి సొంత గుర్తింపు పరమ లక్ష్యం అయ్యాక ఉమ్మడి ప్రయాణం, ప్రయాణపు ఉమ్మడిదనం మీద శ్రద్ధ ఉండదని చెప్పాలి. అప్పుడు కూడా ఒక ప్రశ్న తలెత్తుతుంది. ఈ ప్రతికూల ధోరణులు మిగతా భాషల్లో లేవా? ఉన్నా సరే సయోధ్య సాధించి ఎట్లా బుక్‌ బ్రహ్మవంటి కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నారు? కేరళలో నెలకు రెండు భారీ సాహిత్య కార్యక్రమాలు జరుపుతున్నారు? ఆలోచించాల్సిందే.

ఇన్నిటి మధ్య కూడా తెలుగు సాంస్కృతిక పరివారమంతా  ఒకటిగా బయటి ప్రపంచానికి కనిపించాలని కె శ్రీనివాస్‌ కోరుకున్న ఏకత వల్ల ప్రయోజనం ఏమోగాని ఆ మాటను అంగీకరించడం కష్టం.  

2 thoughts on “ఈ  ‘తెలుగుదనం’  దేనికి?

  1. Too much politics //too much ego / too much differences in our telugu writers
    Caste feeling is there
    No unity —too much groupism —just like political leaders
    Rayadam. Varake.—-paatinchadam zero
    —————————————————————-buchireddy gangula

Leave a Reply