ఈ దేశం గమనం ఎటు ? ఈ దేశం భవిష్యత్తు ఎటు? ఎన్నాళ్ళీ అరాచకాలు? ఇంకెన్నాళ్ళీ దుర్మార్గాలు. అభం శుభం తెలియని బాలికపై ఒకడు అత్యాచారం చేస్తాడు. ఇంకొక గుంపు వచ్చి కుటుంబాలకు కుటుంబాలను దౌర్జన్యం చేసి, ఆత్యాచారం చేస్తారు. కాదంటే హత్య చేస్తారు. 2012లో జలంధర్‌లో వొక దళిత విద్యార్థితో ఉచ్చ తాగిస్తారు. నొయిడాలో పోలీసులే దళితవర్గానికి చెందిన విద్యార్థితో ఉచ్చతాగిస్తారు. తమిళనాడులోని తిరుచ్చిలో లా చదువుతున్న దళిత విద్యార్థితో తోటి విద్యార్థులే ఉచ్చ తాగించారు. రాజస్థాన్ లోని అజ్మీర్ నడిబొడ్డున జనవరి 26న బహిరంగ ప్రదేశంలో రీల్ వేయడానికి ప్రయత్నించిన మైనర్ దళిత బాలుడిని వేధించి చిత్రహింసలకు గురిచేసిన హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. పర్యాటకులు, సందర్శకులకు ప్రసిద్ధి చెందిన అజ్మీర్ లోని అనా సాగర్ చౌపాటీలో రీల్స్ రూపొందించే పనిలో నిమగ్నమైన 17 ఏళ్ల పదో తరగతి విద్యార్థిపై దాడి జరిగింది. ఈ క్రమంలో దళిత బాలుడిపై ఉచ్చపోశారు. ఆంధ్రప్రదేశ్‌లోనూ దళిత పిల్లవాడిపై ఆరుమంది వ్యక్తులు ఉచ్చపోశారని 2024 జనవరిలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ ఆకృత్యాలకు అంతం లేదా? మంటై మండిన కవులు కలం పట్టారు. అక్షరాలతో తిరగబడ్డాడు. వాళ్ళ దుర్మర్గాలను ఆకృత్యాలను సమాజానికి తెలియజేసే పనిచేశారు. వర్తమానభారతంలో జరుగుతున్న దుర్మార్గాలను మనకళ్ళముందుంచే గొప్ప ప్రయత్నం ఈ సంకలనంలో చేశారు. అదే ఉచ్చల జలధి తరంగ కవిత్వ సంకలనం..
మెర్సీ మార్గరేట్ సంపాదకత్వంలో వచ్చిన ఈ సంకలనంలో కవులందరూ తమ కవిత్వంతో తిరుగుబాటు యుద్దమే చేశారు. ఉచ్చల జలధి తరంగ అన్న పేరుతో వచ్చిన కవిత నరేష్‌కుమార్ సూఫీ రాశాడు.
కొత్తగా ఏమీలేదులే…/ దేశాన్ని ఆవుచ్చలో నానవేసిన నాటినుంచే/ఉచ్ఛకంపు అలవాటైపోయింది మాకు/కొత్తగా వొళ్ళు జలదరించటానికేముందీ? ఇవాళ కొత్తగా జరిగిందేముంది?/పాదాలనుంచి పుట్టినవాళ్ళం కదా ఉచ్చపోసినప్పుడు మీద చిందకుండా ఉంటుందా?/వేల సంవత్సరాలుగా ఈ నేల మీద వింధ్య హిమాచల యమునా గంగ ఉచ్ఛల జలధి తరంగాలై మమ్మల్ని ముచ్చెత్తుతోంది ఉచ్ఛల ప్రవాహం./దేశమంటే మట్టని నమ్మినవాడు వాడు/అందుకే ఈ భూమిని పోలిన నా మొహమ్మీద ఉచ్చపోసాడు/పవిత్రమైన నేల కదా ఇదీ, అందుకే దాన్ని మలినం చేయలేక ఇట్లా…అయితే/ఓ నా దేశవాసులారా/ ఇప్పటికిప్పుడు మనం ఉచ్చని నిషేధించలేం, ఉచ్చపోయటాన్ని కూడా మాట్లాడడం మరిచిపోయిన దరిద్రులారా/కేవలం వాడు ఉచ్చపోసింది నా మొహమ్మీద మాత్రమేనా?/మాట్లాడలేని మీ నోళ్ళలో కూడా..
ఈ వర్ణవ్యవస్థను కాదు కాదు..ఈ మతోన్మాద వ్యవస్థను చాలా బాగా చెప్పాడు కవి. ఈదేశంలో రాజ్యం దేన్నైనా నిషేదిస్తుంది. ఏక్తా భారత్ అని వొకసారి, వికసిత భారత్ అని మరొకసారి మాట్లాడుతూ దేశం నిండా విషాన్ని చిమ్ముతుంది. వాళ్ళు చెప్పిందే తినాలి అంటూ వొకసారి ఆహారం మీద ఆంక్షలు, ఇదేభాష మాట్లాడాలంటూ ఇతర భాషలమీద ఆంక్షలు..మనిషి మనగడ మీద కూడా ఆంక్షలు విధిస్తారేమో! ప్రతిపౌరుడు భయపడేలా చెప్తారు. కానీ మనం మాత్రం రాజ్యం ఏం చేసినా మాట్లాడం. అందుకే సూఫీ చాలా బాగా ముగించాడీ కవితలో..వాడు ఉచ్చపోసింది నా మొహమ్మీద మాత్రమేనా?/మాట్లాడలేని మీ నోళ్ళలో కూడా..ఇలా అంటాడు.
ఈ సంకలనంలో తొలికవితగా రాసిన ఉచ్ఛనీచధార అంటూ జి.వెంకటకృష్ణ కవిత రాశారు. ఇందులో వొకవాక్యం దగ్గర ఆగిపోయాను. ఎవడి ధారల్లో తడుస్తూ/ దేశముఖచిత్రం యిన్నేళ్ళుగా/ ఉచ్చకంపు కొడుతున్నదో గమనిస్తున్నామా.! అంటారు. ఈ కవితలో మనకు చురకలంటిస్తాడు..మనం నోరువిప్పని తనాన్ని గొంతు విప్పని పిరికితనాన్ని చెప్తాడు. మనం ఉచ్చనీచధారలో తడిసి మోపెడవుదాం రండి అంటూ వ్యంగ్యంగా పిలుపునిస్తాడు. మనకేమో మాటలు రావు..చలనం రాదు. కథనాలు చూసి అయ్యో దేశం ఏమిటిలా తయారైంది..ఏమిటిలా తయారవుతోంది అంటూ సానుభూతి ప్రేలాపనలు ప్రదర్శిస్తుంటాం. కానీ వాడు దేశముఖచిత్రాన్ని ఉచ్చతో తడిపేస్తున్నాడని మాత్రం మనకెప్పటికీ అర్థమవ్వదు. చాంద్ ఉస్మాన్ కూడా ఇదేమాటంటాడు ‘ఈరోజు దేశపు ముఖం మీద మూత్రం పోస్తుంటే సిగ్గుతో తలదించుకున్నాను’ అని. దీన్నే మరొకలా మల్లిపురం జగదీష్ ‘అది మనువు తయారు చేసిన మర్మాంగం’ అంటారు. మనువు తయారు చేశాడు కాబట్టి అది ఎక్కడైనా పోస్తుంది. వొక్కమాటలో, వొక్కకవితావాక్యంలో ఈ వర్ణవ్యవస్థను చెప్తాడు. చాతుర్వర్ణవ్యవస్థలో ‘బ్రాహ్మణ్యోస్య ముఖమాసీత్ బాహు రాజన్య కృత: /ఊరు తథస్య యద్వైశ్య: పద్భ్యాగ్‌ం శూద్రో మజాయత’ అనే శ్లోకం ప్రకారం బ్రాహ్మణుడు మహాపురుషుని ముఖం నుండి, క్షత్రియుడు భుజాల నుండి, వైశ్యుడు తొడల నుండి, శూద్రుడు పాదాల నుండి ఉద్భవించాడని బలంగా నమ్ముతాడు కాబట్టి వాడి మర్మాంగం కూడా మనువు చేసిందంటాడు జగదీష్.
ఈ సంకలనంలో శాంతిశ్రీ రాసిన ఉచ్ఛజాతి అనే కవిత వాడి దురహంకారాన్ని చెబుతుంది. ఈ చరాచర జగత్తులో మనుషజాతి, జంతుజాతి, వృక్షజాతి ఇలా అన్నీ జాతుల్లాగే ఉచ్ఛజాతి ఉందని చెబుతూ ప్రతి వొక్కరినీ ఆకర్షించేలా కవిత రాసింది. సరికొత్త జాతిని సృష్టించింది. నిజమే కదా..ఆ జాతి అలాంటిది మరి. ఆ జాతిని కనిపెట్టడం, ఆ జాతినీచత్వాన్ని మనం బయటకు చెప్పకపోవడం తప్పేకదా..ఆ జాతి ఎలాంటిదో చూద్దాం..జంతువులు మూత్రం తాగుతూ మనుషులపై ఉచ్చపోసే.. ఉచ్చజాతి అది../పోసేది ఒకరు.. కడిగేది మరొకరు.. అయితే.. పోసింది ఒకరిపై.. కాళ్ళు కడిగింది మరొకరివి.. అంతా ఉచ్చజాతి మరి../మూత్ర విసర్జన చేసి కాళ్ళు కడుక్కునే శుభ్రత ఏమోగానీ.. ఇప్పుడు నా దేశమంతా అదే కంపు ఉచ్చజాతిదేగా పెత్తనం../పక్కనోడి బట్టలు తడిసి మన నాసికా పుటలు బద్దలవుతున్నా…మిన్నకుండిపోతున్నాం../రేపు నీపైనా పోస్తాడు.. వాడిది ఉచ్చజాతి కదా/మూత్రాన్ని యధేచ్చగా ప్రవహింపజేస్తూ.. ఉచ్ఛనీచాల గురించి బోధిస్తూ..ఉచ్చ సంద్రంలో దేశభక్తి పడవపై../మతపరదా కడుతున్నాడు../అయినా పట్టనితనంలో మనం../ఇప్పుడు ఆ ఉచ్చలజాతి.. పంటపొలాల్లో మూత్రంపోస్తూ../కొండ గుట్టల్లో ఉచ్చ జలపాతాలవుతోంది../ఏంచేసినా మాదే చెల్లుబాటు అనేదే ఈఉచ్చజాతి నీతి../సిగ్గు విడిచి నగ్నంగా దేశమంతా ఊరేగుతుంది ఈ జాతి../అంతా తనదే అయినప్పుడు..నాటకం రసవత్తరంగానే కొనసాగుతుంది../ తనే నేరానికి గురవుతూ.. తీర్పూ తానే లిఖిస్తాడు../మన మధ్య అంతర కంచెలు వేసే పనిలో ఆ జాతి ఎప్పుడూ బిజీనే చట్టసభల్లోనూ ఇప్పుడు అదే కంపు మల్లయోధులైన స్త్రీలయితే చాలు/ తెగించిన లింగాలు వారు మరి /ఉచ్చజాతి కదా నువ్వలా చూస్తూ ఉంటే పోస్తూనే ఉంటారు. మనలో ఉద్రేకాన్ని, ఉద్వేగాన్ని కలిగించే కవిత అది.
ఇక డొంకతిరుగుడులెందుకు..ఇక ముసుగులో గుద్దులాటలెందుకు. నేరుగా ఎవరిలా చేస్తున్నారో చెబితే సరిపోదా..ఎవరింతటి దుర్మార్గాల్ని చేస్తున్నారో ఈ దేశపౌరులముందు చెబితే సరిపోతుందని అనంతు చింతలపల్లి వొక ఘాటైన వాక్యం చెప్తాడు ఈ సంకలనంలోని పూలతోటకోసం అనే కవితా శీర్షికలో..ఒక్క కమలమే మలమూ, మూత్రమూ విసర్జన చేస్తోంది/నూటా ముప్పై కోట్ల నుదురులపైన ఇపుడు..అంటూ..ఇక ఈ మాటను వివరించడమో, విశ్లేషించడమో చేయాల్సిన పని లేదు. కమలమెవరో అందరికీ తెలిసిందే..వాళ్లు ఈ దేశాన్ని చాలా పద్దతిగా ప్రణాళికగా నాశనం చేయాలనుకుంటున్నారు. మనకు అర్థమవ్వదు. మరొక్కసారి గుర్తుచేస్తాను. లౌకికత్వం మీద పరోక్షంగా దాడి చేయడం. శాస్త్రీయవిజ్ఞానం పెంచుకునే ప్రయత్నాలు చేస్తే అవన్నీ మన సాధువులు వేలఏళ్ళ నాడే వాడే వారని తప్పుదోవ పట్టించడం చేస్తున్నది. ఇంకా చెప్పాలంటే సప్తసూత్రాలను అవలంభిస్తోంది. ప్రాచీన భారతదేశ చరిత్ర ఘనమైనదని చెప్పడం, హిందువులుగా గుర్తించిన వారందరినీ ఒక గొడుగుకింద తీసుకురావడం, దేశం ఎదుర్కొంటున్న అన్ని రకాల ఉపద్రవాలకు ముస్లీంలు, క్రిస్టయన్లు, కమ్యూనిస్టులు కారణమని చెప్పి ఈ ముగుర్ని అంతం చేసి జాతిని పునర్నవీకరణ చేయడం, ముస్లీంలను, హిందుత్వ విమర్శకులను దేశద్రోహులుగా పాకిస్తాన్ అనుకూలమైన వాళ్ళుగా ముద్రవేయడం, విద్యను కాషాయికరించే పాఠ్యపుస్తకాలను తీసుకరావడం, మతాల ఆధారంగా ఆందోళన కార్యక్రమాలను చేయడం, మతఘర్షణలను అల్లర్లను రెచ్చగొట్టడం, సైనిక దళాలను సంస్థలను తయారు చేయడం ఈ సప్త సూత్రాలకు మరో సూత్రం కూడా చేరుద్దామా..అదే ఉచ్చపోయడం. అందుకే ఈ కవితల్లో కవులంతగా మండిపోతున్నారు. నిద్రాణమైన మనల్ని కవితల దివిటీలతో లేపుతున్నారు. ఈ దేశం ఉచ్చకంపుతోనూ మతోన్మాద కంపుతోనూ మలినమైంది. సలీమా కంపుకొడుతోంది అంటూ వో కవిత రాసింది. అందులో తొమ్మిదేండ్లే అని చెప్పింది. కానీ వొక దశాబ్దకాలం పూర్తయ్యంది. అంటే పదకొండేళ్లు..ఆ కవితలో అవును మీరు విన్నది నిజమే/ దేశం ఇప్పుడు కంపు కొడుతున్నది./అయ్యో..ఇప్పుడేంటి గత తొమ్మదేండ్లుగ/ కంపుకొడుతూనే వుంది/అదే మతోన్మాద కంపు..ఎందుకో పాపం రెండేళ్లు వాళ్ళకు మినహాయింపు ఇచ్చింది. అక్కడ పద్నాలుగేళ్లు నాశనం చేసి ఇక్కడికొచ్చి దశాబ్దం దాటింది.
అంత దుర్నీతి పాలన ఉంది కాబట్టే కవి ఎజ్రాశాస్త్రి నీకు క్షమాబిక్షలేదు అంటూ ఒక కవిత రాశాడు..నిజంగా ‘ మాదేహాల ఓట్ల మీద నడిచెళ్ళి సింహసనం/ఎక్కబట్టే కళ్ళు నెత్తికెక్కినై, ప్రపంచాన్ని / ఏలిన మహారాజులు సైతం పేదవాడి పాదాల/ దగ్గర నుండే ప్రభువులయ్యారన్న సంగతి/గుర్తెరుగురా భాడ్కౌ’ ..అది తెలిస్తే బాగుండు. ఇప్పటివరకు మనపై పోసిన ఉచ్చచాలదా? ఇంకా ఎప్పుడు మేల్కొంటాం. ఎందుకు రాస్తున్నాం..ఎవరికోసం రాస్తున్నాం..మన కవిత్వం పదిమందితో మొదలై..వందలు..వేలు..లక్షలు..కోట్ల ప్రజల్ని చైతన్యం కలిగించాలి కదా..వాడికెలాగూ తెలీదు..అందుకే మెర్సీ మార్గరెట్ అంటుంది..ఒక నాగరికత..ఒక భాష..ఒక సంస్కృతి/జనించటం అంతరించటంలో కలిగే దు:ఖం వాడికెలా తెలుస్తుంది?/ఎన్ని మానసిక సంఘర్షణలు కలిసి/ఎన్ని మానవ నాగరికతలకు పునాదులు వేశాయో/వాడికెలా తెలుస్తుంది. వాడు మనువును నమ్ముతున్నాడు..మనం మనుషుల్ని నమ్ముతున్నాం. ఈ మనుషుల్ని మన మనుషులుగా మార్చుకునే ప్రయత్నం నిరంతరం చేద్దాం..ఎందుకంటే అంత త్వరగా మారని సమాజంలో మనమున్నాం.నందిని సిధారెడ్డి చెప్పినట్లు..అతనికి పొరలెక్కాయి/తలకు మతమెక్కింది/ పొగరే మనిషి మనిషి మీద/ మూత్రం పోసే పొగరు/ఒక్కొక్కరిది ఒక్కొక్క పొగరు/ఎవరి పొగరైనా దించకపోరు/ఎవరో ఒకరు మనషులే/దయగల మనుషులో/ధైర్యం గల మనషులో..అంటాడు.
ఈ తలపొగరు వొక వ్యక్తిది కాదు..ఉన్మాదానిది..మతోన్మాదానిది. దాన్ని బీటలు వార్చడం కాదు..గోడలు కూల్చాలి. ఆయుధాలు మనమే అవ్వాలి.
ఈ సంకలనంలోని కవులంతా నిరసన జ్వాలలు రగిలించారు. వొకరకంగా ప్రతివొక్కరు వొక కవితాఖడ్గం తీసుకుని బయలుదేరారు. ప్రతివొక్కరి కవితను తడిమిచూశాను. అన్నీ బాగున్నాయి. అన్నీ విశ్లేషించదగ్గవే. ఈ సంకలనం ఖచ్చితంగా చదవాల్సిందే..
బావుంది.