(ఇటీవల విడుదల అయిన రాయలసీమ విద్యావంతుల వేదిక
బులిటెన్ -2 *మన రాయలసీమ* సంపాదకీయం)
రాయలసీమ అనేక ఉప ప్రాంతాల ఉమ్మడి అస్తిత్వ సీమ. ఇవ్వాల్టి భౌగోళిక, పాలనా గుర్తింపులతో నిమిత్తం లేని చారిత్రక, సామాజిక, సాంస్కృతిక ప్రత్యేకతలు ప్రతి ఉప ప్రాంతానికీ ఉన్నాయి. మళ్లీ అన్నిటి మధ్య సాధారణ లక్షణాలు ఉన్నాయి. వ్యవసాయం, నీటిపారుదల రంగాల్లో, సాంస్కృతిక వికాసంలో ఇవి కనిపిస్తాయి. కనీసం ఆంధ్రరాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి వీటిని చాలా స్పష్టంగా పరిశీలించవచ్చు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో, విభజనానంతర ఆంధ్రప్రదేశ్‌లో రాయలసీమలోని ప్రతి ఉపప్రాంతం నిర్దిష్ట స్థానిక సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. పాలకుల నిర్లక్ష్యం వల్ల ఈ సమస్యలు తీవ్రమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని మిగతా ప్రాంతాలతో పోల్చినప్పుడు అభివృద్ధిలో, అవకాశాల్లో రాయలసీమ వెనుకబడినట్లే రాయలసీమలోని కొన్ని ఉప ప్రాంతాలు మిగతా ఉప ప్రాంతాలకంటే తీవ్రమైన వివక్షకు గురవుతున్నాయి.
సమానత్వం ఒక ప్రజాస్వామిక, మానవీయ విలువ. దీన్ని దెబ్బతీస్తూ రాయలసీమలోనే ప్రాంతాలపరంగా ఉన్న అసమానతలు వాస్తవానికి రాజకీయార్థిక సామాజిక సాంస్కృతిక సంబంధమైనవి. వీటికి కారణాలు తెలుసుకోకుండా, సరైన పరిష్కారాలను వెతకకుండా ప్రాంతాల మధ్య సమానత్వం సాధించలేం.
రాయలసీమలో ఇట్లాంటి ఒక ప్రత్యేక ప్రాంతం అనంతపురం.
ఈస్టిండియా కంపెనీ కాలంలో 1796లో ఏర్పడ్డ బళ్లారి జిల్లాలో ఇవ్వాల్టి రాయలసీమలోని చాలా ప్రాంతాలు ఉండేవి. దాని నుంచి అనంతపురం జిల్లా 1882లో విడివడిరది. ఆ తర్వాత తెలుగు భాషాప్రయుక్త రాష్ట్రంలో అనంతపురం జిల్లా భాగమైంది. తాజాగా 2022లో అనంతపురం జిల్లా నుంచి శ్రీసత్యసాయి జిల్లా విడిపోయింది.
ఈ చరిత్ర పొడవునా అనంతపురం చాలా సంక్షోభాలను ఎదుర్కొన్నది. సాధారణంగా రాయలసీమ అంటే అనంతపురం గుర్తుకు వస్తుంది. అనంతపురం అంటే కరువు, వలసలు, ఆత్మహత్యలు, ఎడారి జీవన దృశ్యాలు తలపుకొస్తాయి. ఆధునిక భారతదేశంలోనే వెనుకబడిన ప్రాంతాల్లో, దుర్భర జీవితం గడిపే ప్రాంతాల్లో, పాలకుల నిరాదరణకు గురైన ప్రాంతాల్లో అనంతపురం ఒకటి. ఈ దుస్థితి ఎట్లా వచ్చింది? ఎందుకు ఇది కొనసాగుతున్నది? అనే పరిశోధన ఇంకా పూర్తి కాలేదు.
అనంతపురం అంటే ఇదే కాదు. కరువుకాటకాల మధ్యనే ఇక్కడ అద్భుతమైన సాంస్కృతిక వికాసం జరిగింది. అలనాటి రాయలసీమలో బళ్లారి, అనంతపురం ప్రధానమైన రాజకీయ, పాలనా, సాంస్కృతిక కేంద్రాలుగా విరాజిల్లాయి. తెలుగు ప్రాంతాల ఆధునికతా వికాసంలో రాయలసీమది ఒక ప్రత్యేకమైన మార్గం. అందులో అనంతపురం స్థానం గణనీయమైనది. తన స్థానీయతను నిలబెట్టుకుంటూ రాయలసీమ మిగతా తెలుగు ప్రాంతాలతో, ఇతర భాషా సమాజాలతో సంపర్కం పెట్టుకున్నది. ఇది అనంతపురం వైపు నుంచి ఎట్లా జరిగిందో మనం ఇంకా తెలుసుకోవలసే ఉన్నది. శుష్కించిపోయిన పెన్నాతీరంలో, తుంగభద్ర అంచుల్లో ఇవాళ అనంతపురం ఒక నిర్లక్ష్య సీమగా మిగిలిపోయి ఉండవచ్చు. పదే పదే పాలకుల వంచనలకు, విద్రోహాలకు గురై ఉండవచ్చు. ఆశ నిరాశల మధ్య నలిగిపోయి ఉండవచ్చు. కానీ అనంతపురం రాయలసీమ హృదయ ధ్వనిగా, విషాదకంఠంలోని జీరగా వినిపించడమేగాక ఆధునిక ప్రగతిశీల విలువలకు, ఆకాంక్షలకు, చైతన్యాలకు జీవధారగా కూడా ఉన్నది.
ఈ మొత్తాన్నీ ఎప్పటికైనా వెలిక తీయవలసిందే. ఎత్తిపట్టవలసిందే. రాయలసీమలోని విశిష్టతలను, విధ్వంసాలను, విషాదాలను, సగర్వాలను కలిసి చూడవలసిందే. రాయలసీమలో కూడా అనంతపురానికి ఏం కావాలో, ఎందుకు కావాలో ఎలుగెత్తి ప్రకటించాల్సిందే. గత అరవై ఏళ్లుగా కృష్ణా జలాల నుంచి ఆంధ్రప్రదేశ్‌కు నీటి వాటా డిమాండ్ చేసినప్పుడలా మధ్యాంధ్ర పాలకులు అనంతపురం కరువును సాకుగా చూపుతూ వచ్చారు. కానీ రాయలసీమకైనా, అందులో భాగంగా అనంతపురానికైనా నీళ్లిచ్చిందే లేదు.
కానీ తమ ప్రాంతానికి ఏం కావాలో అనంతపురం ప్రజలకు తెలుసు. గట్టిగానో, లో గొంతుకతోనే జిల్లా ప్రజలు తమ డిమాండ్లు వినిపిస్తూనే ఉన్నారు. అయినా పాలకులు పట్టించుకోవడం లేదు. నీటి పారుదల, వ్యవసాయం, విద్యా వైద్య ఉపాధి రంగాల్లో పాలకులు తయారు చేసుకున్న అభివృద్ధి చెందిన ప్రాంత కేంద్రక విధానాలేవీ రాయలసీమకు పనికి రావు. అనంతపురానికి అసలే పనికి రావు.
ప్రాంతాల ప్రత్యేకతలు, అవసరాలు, ప్రాధాన్యాలపట్ల ఎరుక లేని అభివృద్ధి విధానం ఎప్పటికీ వెనుకబడిన ప్రాంతాలను ఉద్ధరించలేవు. ఈ సంగతి తెలుసుకోడానికి అనంతపురం ఉదాహరణ సరిపోతుంది. రాయలసీమ ఉద్యమం కూడా స్థూలంగా ఈ ప్రాంత సమస్యలను మొత్తంగా పరిగణలోకి తీసుకుంటూనే, పరిష్కారం కోసం పోరాడుతూనే నిర్దిష్టంగా ఉప ప్రాంతాల అవసరాలపై కేంద్రీకరించాలి. రాయలసీమ విద్యావంతుల వేదిక ఆరంభం నుంచి సీమలోని ఉప ప్రాంతాల అవసరాలను గుర్తిస్తూ వచ్చింది. రాయలసీమ ఉద్యమం అనంతపురం వంటి కనీసంగా నీటిపారుదల సౌకర్యం లేని ప్రాంతాలు కేంద్రంగా నడవాలని చెబుతూ వస్తున్నది. అత్యంత దుర్భరంగా ఉన్న జన సమూహానికి, ప్రాంతానికి ప్రాధాన్యత ఇస్తేనే ఏదైనా ప్రజాస్వామిక ఉద్యమం అవుతుంది. విద్యావంతుల వేదిక ప్రాపంచిక దృక్పథంలో ఇదొక ముఖ్యమైన గీటురాయి. ఈ బులిటెన్‌లో ఇలాంటి అవగాహనను మీరు చూడవచ్చు.