దక్షిణ ఒడిశాలో వేదాంత బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఉద్యమ నాయకుడు కార్తీక్ నాయక్ అరెస్టును నిర్ద్వంద్వంగా ఖండిస్తున్నాం. 2024 సెప్టెంబర్ 19న ఉదయం 11.30 గంటల సమయంలో బ్యాంకు నుంచి బయటకు వెళ్లేటపుడు ముప్పై ఏళ్ల కార్తీక్‌ను కాశీపూర్ పోలీసులు తీసుకెళ్లారు. కాశీపూర్ పోలీస్ స్టేషన్‌లో కొద్దిసేపు ఆగిన తర్వాత కాశీపూర్ జెఎంఎఫ్‌సి కోర్టుకు తీసుకెళ్ళి కొన్ని గంటల తర్వాత, రాయగడ సబ్ జైలుకి పంపారు.
అదే రోజు, తిజిమాలి ప్రాంతానికి చెందిన వెయ్యి మందికి పైగా గ్రామస్తులు కార్తీక్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పోలీసు స్టేషన్ ముందు సాయంత్రం వరకు నిరసన ప్రదర్శన చేసారు. వారి ఆవేశాన్ని, న్యాయం జరపాలనే డిమాండ్‌ను అణిచివేసేందుకు పరిపాలనా యంత్రాంగం, పోలీసులు చాలా కష్టపడ్డారు. చివరికి కార్తీక్ నాయక్‌ను విడుదల చేయడానికి అంగీకరించక తప్పలేదు. తిజిమాలి ప్రజలపై ఇకపై తప్పుడు, కల్పిత ఆరోపణలు చేయబోమని హామీ కూడా ఇచ్చారు. అయితే, పోలీసు స్టేషన్‌లో గ్రామస్తులు విధ్వంసం సృష్టించారనే ఆరోపణతో ఆ రాత్రే పోలీసులు, పరిపాలనా యంత్రాంగం 200 మంది గ్రామస్తులపై మరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు తెలిసింది. కార్తీక్ ఇంకా జైల్లోనే ఉన్నాడు.
జైలు నుండి మాట్లాడిన కార్తీక్ నాయక్ తన ప్రజల స్థితి పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. కొండలు, అడవులను గనుల తవ్వకాల నుండి రక్షించడానికి జైలులో వుండడానికి లేదా తన ప్రాణాలనైనా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నానన్నాడు. అహింసా, శాంతియుత మార్గాల ద్వారా ఈ ప్రాంతంలో మైనింగ్ వ్యతిరేక పోరాటాన్ని కొనసాగించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశాడు. రాజ్యాంగం కల్పించిన హక్కుల కోసం ప్రజలు పోరాడుతున్నారని, రాజ్యాంగం ఉన్నంత వరకు పోరాటం కొనసాగుతుందని అన్నాడు.
ప్రధానంగా ఆదివాసీలు, దళితులు నివసించే తిజిమాలి, కుట్రుమాలి, మజింగ్‌మాలి ప్రాంతం రాయగడ జిల్లాలోని కాశీపూర్, కలహండి జిల్లాలోని థుమల్ రాంపూర్ అంతటా విస్తరించి ఉంది. ఈ ప్రాంతం రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూల్ కిందకు వస్తుంది. అయినప్పటికీ, తిజిమాలి, మరియు కుటురుమాలి బాక్సైట్ నిల్వలను వరుసగా వేదాంత, అదానీ గ్రూపులకు లీజుకు ఇచ్చినప్పుడు ప్రజల అభిప్రాయాలను లేదా సమ్మతిని తీసుకోలేదు. ఇది రాజ్యాంగం నిర్దేశించిన విధాన తీవ్ర ఉల్లంఘననే. బదులుగా, మైత్రి పేరుతో వేదాంతకు చెందిన ఒక కాంట్రాక్ట్ కంపెనీ గత సంవత్సరం ప్రారంభంలో తిజిమాలి గ్రామాలకు రావడం ప్రారంభించింది; గ్రామస్తులపై నిఘా పెట్టింది.
2023 సెప్టెంబర్‌లో, ప్రతిపాదిత గనుల తవ్వకానికి పర్యావరణ అనుమతి కోసం జరిగిన రెండు బహిరంగ విచారణలలో ఈ ప్రాంత ప్రజలు వేదాంత ప్రతిపాదిత మైనింగ్ ప్రణాళికలను వ్యతిరేకించారు. బెదిరింపు ఎత్తుగడలను బహిర్గతం చేశారు. మైనింగ్ తమ జీవితాలను, జీవనోపాధిని, వాగులు, మొత్తం నివాసాలను ఎలా ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందో వివరిస్తూ గ్రామస్థులు నిలదీశారు. అన్నింటి కంటే ముఖ్యంగా, ప్రతిపాదిత గని తవ్వకం స్థానం తమ పవిత్ర దేవత తిజిరాజా నివాసం అని తెలియచేసారు.
ప్రజలు తమ రాజ్యాంగ హక్కుల అమలు కోసం 2024 గణతంత్ర దినోత్సవం రోజున భారత రాష్ట్రపతికి ఒక విజ్ఞప్తిని కూడా పంపారు.
ఇటీవల, ప్రజలు తమ సొంత గ్రామసభలను 2024ఆగస్టు 30 నుండి సెప్టెంబర్ 4, వరకు కాశీపూర్ బ్లాక్‌లోని ఎనిమిది గ్రామాలు, థుమల్ రాంపూర్ బ్లాక్‌లోని రెండు గ్రామాలలో నిర్వహించారు. ఇవి అటవీ హక్కుల చట్టం & పెసా చట్ట ప్రకారం వారికున్న హక్కులకనుకూలంగా జరిగాయి. 2023డిసెంబరు 8న పరిపాలనా యంత్రాంగం భారీ పోలీసు బలగాలను మోహరించి కంపెనీ సిబ్బంది సమక్షంలో నిర్వహించిన బూటకపు గ్రామసభలను ప్రజలు తిరస్కరించారు. బూటకపు గ్రామసభలపై రెండు పోలీస్ స్టేషన్లలో ప్రజలు ఫిర్యాదులు నమోదు చేశారు.
ఏడాదిన్నర పైగా ప్రజల బలమైన ఐక్యత ఖచ్చితంగా పరిపాలనా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది, అందువల్ల ఇప్పుడు మరో దఫా అణచివేతను ప్రారంభించింది. 2024 జనవరి 12 న జరిగిన వివాదాస్పద ఘటనకు సంబంధించి మైత్రీ కంపెనీ దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా కార్తీక్ అరెస్టు జరిగింది. మైత్రీ కంపెనీ సిబ్బంది తమపై ఒక గ్రామంలో దాదాపు 40 మంది వ్యక్తులు దాడి చేశారని పేర్కొన్నారు. వారు ఇచ్చిన దాదాపు అన్ని పేర్లు స్థానిక నాయకులు లేదా మైనింగ్ వ్యతిరేక నిరసనలకు నాయకత్వం వహిస్తున్న మా మాటి మాలి సురక్షా మంచ్ సభ్యుల పేర్లు. అందులో ఒక పేరు కార్తీక్.
పోలీసులు 19 నెలల తర్వాత ఎఫ్‌ఐఆర్‌పై చర్యలు తీసుకోవడం చాలా ప్రశ్నలను లేవనెత్తుతుంది, ఎందుకంటే వ్యక్తులందరూ బహిరంగంగా కనిపించేవారు, తెలిసినవారు అంతేకాకుండా, బహిరంగ అస్తిత్వాన్ని కొనసాగిస్తున్నవారు. అరెస్టులో కొన్ని అంశాలు ఇలా ఉన్నాయి.
మొదట, నిందితులు “పరారీలో” ఉన్నారని చెప్పి రాయగడ పోలీసులు 2024ఆగస్టు 29న కోర్టు ద్వారా అరెస్ట్ వారెంట్లు తీసుకున్నారు. కార్తీక్ నాయక్‌తో సహా పదకొండు మంది వ్యక్తులకు ఎటువంటి నోటీసులు లేదా సమన్లు పంపకుండానే కోర్టు నాన్ బెయిలబుల్ వారంట్లను జారీ చేసింది; అనేక కేసుల్లో గౌరవనీయమైన అపెక్స్ కోర్టు నిర్దేశించిన నియమాలు, విధానాలను అనుసరించలేదు.
రెండవది, పేర్కొన్న వ్యక్తులందరూ రోజువారీ పనుల్లో వున్నవారే; పరారీలో లేరు అనేది స్పష్టం. కొందరు గ్రామసభలు కూడా నిర్వహించారు; అందరికీ కనిపించారు. మెయిన్ రోడ్‌లో చిన్న కిరాణా షాపు పెట్టుకోవడానికి లోన్ కోసం దరఖాస్తు చేసుకున్న కార్తీక్ బ్యాంకు నుండి బయటికి వచ్చేసరికి పట్టుకున్నారు.
ప్రజలు తమ రాజ్యాంగబద్ధమైన హక్కులను సాధించుకోవడానికి పోరాడుతున్నప్పుడు, పరిపాలనా యంత్రాంగం కఠినమైన బెదిరింపు ఎత్తుగడలను ఉపయోగించి తీవ్ర నియంత్రణ ద్వారా మాత్రమే ప్రతిస్పందిస్తుందని గమనించాలి.
ఉదాహరణకు, 2024 రాష్ట్ర అసెంబ్లీ, సాధారణ ఎన్నికలకు ముందు కాలంలో, ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఈ ప్రాంతంలో శాంతి, భద్రతలను కాపాడేందుకు బాండ్‌పై సంతకం చేయమని ఎందుకు ఆదేశించకూడదో తెలియజేయమని సీఆర్‌పిసి సెక్షన్ 107 కింద కార్యకర్తలు, నాయకులకు షోకాజ్ నోటీసు పంపారు. అది చట్టం దృష్టిలో “అలవాటైన అపరాధి”కి సమానం. ఈ చట్టం నేర తెగల వలస శాసన అవశేషం.
తమ జీవితాలను, నివాసాలను రక్షించుకోవడానికి ప్రయత్నించే మొత్తం సమాజాలను అప్రజాస్వామిక, అణచివేత చర్యల ద్వారా నేరపూరితంగా మార్చడం వలసరాజ్యాల కాలం నుండి ఇప్పటి వరకు పోలీసు, పరిపాలనా యంత్రాంగం అమలు చేస్తున్న పద్ధతి.
షెడ్యూల్ అయిదు ప్రాంతాలలో ఆదివాసీలు, దళితులకు వారి హక్కులకు హామీ ఇవ్వడంలో ప్రజాస్వామ్య నిబంధనలను, చట్టబద్ధమైన ప్రక్రియను అనుసరించడానికి బదులుగా, ఒడిశా ప్రభుత్వం చట్టవిరుద్ధంగా, మైనింగ్ కంపెనీల ఆదేశానుసారం నిర్మొహమాటంగా వ్యవహరిస్తోందని మేము తీవ్ర ఆందోళన చెందుతున్నాము.
భారతదేశానికి ఒక ఆదివాసీ రాష్ట్రపతి, రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఆదివాసీ ఉన్నప్పటికీ, సహజ వనరుల అక్రమ, బలవంతపు దోపిడీ, ముఖ్యంగా షెడ్యూల్ అయిదు ప్రాంతాలలో, ఆదివాసీ, దళిత వర్గాలను వారి జీవనం, జీవనోపాధి, గుర్తింపుల నుండి దూరం చేయడం చాలా విడ్డూరం. కొండలు, అడవులను రక్షించాలనే వారి ధీరత్వం తీవ్రమైన అణచివేత, అరెస్టులను ఎదుర్కొంటోంది.
దిగువ సంతకం చేసిన మేము ఒడిశా ప్రభుత్వానికి చేస్తున్న డిమాండ్లు:
1. తిజిమాలి బాక్సైట్ మైనింగ్ ప్రాజెక్టును ప్రతిఘటిస్తున్న వ్యక్తులపై పెండింగ్‌లో ఉన్న అన్ని కేసులు, ఎఫ్‌ఐఆర్‌లను ఉపసంహరించుకోవాలి.
2. కార్తిక్ నాయక్‌ను వెంటనే విడుదల చేయాలి.
3. 2024 ఆగస్ట్ 30 నుండి సెప్టెంబర్ 4, వరకు ప్రజలు నిర్వహించిన గ్రామసభల తీర్మానాలను సమర్థించండి.
4. 23.09.24 & 24.09.24 తేదీలలో వరుసగా కాశీపూర్ & థుమల్ రాంపూర్ పోలీస్ స్టేషన్లలో ప్రజలు దాఖలు చేసిన ఫిర్యాదుల ప్రకారం అవసరమైన చర్య తీసుకోవాలి.
సంతకాలు చేసినవారు నలభై మందికి పైగా సామాజిక కార్యకర్తలు, రచయితలు వగైరా
27 సెప్టెంబర్ 2024
భువనేశ్వర్, ఒడిశా
https://countercurrents.org/2024/09/condemn-the-arrest-of-kartik-naik-in-sijimali-odisha