పోరాటాల సాహిత్య చరిత్ర పరిశోధకుడు, విలువైన రచనలు తెలుగు సమాజానికి అందించిన ప్రజాపక్ష రచయిత కె. ముత్యం గారికి జోహార్లు. అట్టడుగు ప్రజలు నిర్మించే చరిత్ర, సాహిత్య చరిత్ర మౌఖిక రూపాల్లోనే ఎక్కువగా నిక్షిప్తమై ఉంటుంది. ప్రజల నాల్కల మీద ఆడుతుంటుంది. అటువంటి గాథలను, మౌఖిక కళా రూపాలను అన్వేషిస్తూ పోతే మహోన్నత పోరాటం కొత్త అర్ధాలతో కళ్ల ముందు నిలుస్తుంది. ఆ పోరాటాలు చేసిన మట్టి మనుషుల సాహసం దృశ్యం కడుతుంది. పై నుంచి కాకుండా కింది నుంచి చరిత్రను లఖితబద్ధం చేసే శాస్త్రీయ విధానమిది. ముత్యం గారు పరిశోధక విద్యార్థిగా శ్రీకాకుళ ఉద్యమం, సాహిత్యం గురించి చేసిన పరిశోధన ఈ కోవకు చెందినదే. శ్రీకాకుళ సాహిత్యం అక్కడ విప్లవోద్యమం ఉధృతంగా ఉన్న కాలంలో తయారైంది. అందువల్ల అక్కడి సాహిత్యాన్ని పోరాటం నుంచి వేరు చేయలేం. అక్కడ నడిచిన పోరాటం పట్ల ఎవరికి ఏ అభిప్రాయం అయినా ఉండవచ్చు. కానీ, ఆ పోరాటం నుంచి వచ్చిన సాహిత్యం, ఆ సాహిత్యం కళ్లకు కట్టిన పోరాట నిజాయితీని మాత్రం నిరాకరించలేరు. తెలుగు సాహిత్య కళారంగాలను శ్రీకాకుళ పోరాట సాహిత్యం అపారంగా ప్రభావితం చేసిందనే చారిత్రక సత్యాన్ని ఎవ్వరూ కాదనలేరు. అందువల్లే ముత్యంగారు తన పరిశోధనను శ్రీకాకుళ సాహిత్య పరిశీలనతోనే మొదలుపెట్టారు. అక్కడి పోరాట వాస్తవికతను చాలా వరకు గ్రహించగలిగారు. ఆయన పీహెచ్‌డీ గ్రంథం శ్రీకాకుళ ఉద్యమం – సాహిత్యం 1993లో అచ్చయింది. అనంతర కాలంలో శ్రీకాకుళం, ఉత్తర తెలంగాణ ప్రాంతాలకు చెందిన ఉద్యమ, సాంస్కృతిక కార్యకర్తలు, నాయకుల జీవితాలను, వారి పోరాట అనుభవాలను ఈ తరానికి ఆయన అందించారు. సాహిత్యం వైపు నుంచి పోరాటాలను చూస్తూ పాతికకు పైగా గ్రంథాలను, రెఫరెన్స్‌ సోర్సులను అందించిన రచయితగా ముత్యంగారిని విప్లవోద్యమ సాహితీలోకం గుర్తు పెట్టుకుంటుంది.

నిజామాబాద్‌లోని బాచుపల్లికి చెందిన ముత్యంగారు ఎంఏ తెలుగు విద్యార్థిగా ఉస్మానియా యూనివర్సిటీలో అడుగుపెట్టారు. అప్పటికే యూనివర్సిటీలోని ఉద్యమ వాతావరణం ఆయనను విద్యార్థి ఉద్యమాల వైపు నిలబెట్టింది. పీడీఎస్‌యూలో కీలక బాధ్యతలు ఆయన నిర్వహిస్తూనే, చరిత్ర అధ్యయనం, పోరాటాల పరిశీలన, నమోదు వైపు ఆలోచనలు సాగించారు. పీహెచ్‌డీ కోసం బెనారస్‌ యూనివర్సిటీలో చేరినప్పుడు ఆయన శ్రీకాకుళ ఉద్యమం- సాహిత్యంపై దాని ప్రభావం అనే అంశాన్ని ఎంచుకున్నారు. విప్లవ విద్యార్థి ఉద్యమ నేపథ్యం లేకుంటే, అప్పటికే సెట్‌ బ్యాక్‌కు గురై, భిన్న రాజకీయ వైఖరులను ప్రోది చేసుకున్న శ్రీకాకుళ ఉద్యమంపై ఆయన ఆసక్తి మళ్లేది కాదు. ఉస్మానియా, బెనారస్‌ యూనివర్సిటీల్లో ఉన్నప్పటికంటే క్షేత్రస్థాయిలో పరిశోధన కోసం తిరిగినప్పుడు ప్రజలు చూపించిన కొత్త దారుల్లో ఆయన నిజాయితీగా నడిచారు. అందువల్ల ఆయన శ్రీకాకుళ ఉద్యమ సాహిత్యం మీద అద్భుతమైన పరిశోధన అందించారు. ఆ రకంగా ఆయనకు అట్టడుగు చరిత్రను, సాహిత్య చరిత్రను పరిశోధించే సంవిధానం పట్టుబడిరది. ఆయన మిగతా రచనల్లో కూడా దాన్నే అనుసరించారు. ఆయనకు ముందు, ఈ విధమైన పరిశోధనా విధానాన్ని బుందేల్‌ఖండ్‌ ప్రాంతంలో 1940ల్లో బెంగాల్‌ రచయిత్రి మహాశ్వేతాదేవి అనుసరించారు. విస్మృతంగా పడి ఉన్న రaాన్సీరాణి, ఇతర 1857 స్వాతంత్య్ర వీరుల చరిత్రను అక్కడి ప్రజల స్మృతుల్లోని గాథలు, జానపద కళా రూపాలు, సామెతల నుంచి మహాశ్వేతాదేవి నిర్మించే ప్రయత్నం చేశారు. 1947 అధికార మార్పిడి తర్వాత మొదలై 1970ల దాకా నడిచిన దశ.. అంత విస్మృతంగా లేదు. కాకపోతే చరిత్రను శోధించే చేతులే లేవు. ఉన్నా అతి కొద్ది. గురజాడ, దువ్వురి రామిరెడ్డిపై అప్పటికే కామ్రేడ్‌ కేవీఆర్‌ తన విలువైన పరిశోధనలను అందించారు. కేవీఆర్‌ చరిత్ర, సాహిత్య చరిత్ర అధ్యయన పద్ధతి నుంచి ముత్యంగారు ప్రేరణ పొందారని మిత్రులు చెబుతున్నారు. ఆయన పరిశోధనలు సాగిన కాలం కూడా ప్రత్యేకమైనదే. సెట్‌ బ్యాక్‌కు గురైన ఉద్యమాలు గత పోరాటాల నుంచి గుణపాఠాలను, చారిత్రక స్ఫూర్తిని పొందుతూ పునర్‌ నిర్మాణం అవుతున్న దశ అది. ఆ ప్రయాణం ఉత్తర తెలంగాణ నుంచి తిరిగి శ్రీకాకుళం మీదుగా దండకారణ్యం వరకు విస్తరించిన వర్తమాన అద్భుతం. ఈ అద్భుతం ఇంద్రధనస్సులా ఈ తరం, ఈ కాలం హృదయాల్లో ముద్ర పడటానికి ముత్యంగానే చేసిన సాహిత్య, ఉద్యమ, జీవిత చరిత్రల, అట్టడుగు సంస్కృతుల పరిశోధనల ప్రభావం వెల కట్టలేనిది. కామ్రేడ్‌ కె. ముత్యం గారికి వినమ్ర జోహార్లు.

Leave a Reply