ప్రపంచ విప్లవ మానవుడు, సామ్రాజ్యవాద వ్యతిరేక ప్రజా ఉద్యమకారుడు, కవి, మేధావి కామ్రేడ్‌ జి.ఎన్‌ సాయిబాబకు అరుణారుణ జోహార్లు
ఆయన రాజ్య ధిక్కార స్ఫూర్తితో విశాల ఐక్య సంఘటనా పోరాటాలతో ఆపరేషన్‌ కగార్‌ను అడ్డుకుందాం
హిందుత్వ కార్పొరేట్‌ శక్తులకు వ్యతిరేక నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని ముందుకు తీసికెళదాం

సుప్రసిద్ధ విప్లవ మేధావి, కవి, ప్రజా ఉద్యమ నాయకుడు, విప్లవ రచయితల సంఘం సభ్యుడు కామ్రేడ్‌ జి.ఎన్‌ సాయిబాబ తీవ్ర ఆనారోగ్యంతో అక్టోబర్‌ 12 శనివారం రాత్రి 8.36 గంటలకు హైదరాబాదులోని నిమ్స్‌ హాస్పెటల్‌లో అమరుడయ్యాడు. భారత ప్రభుత్వం 2009లో ఆదివాసుల మీద ప్రకటించిన ఆపరేషన్‌ గ్రీన్‌హంట్‌కు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా ప్రొ. సాయిబాబా సంఫీుభావం కూడగడుతున్న నేపథ్యంలో పోలీసులు ఆయన మీద అనేక తప్పుడు ఆరోపణలతో అక్రమ కేసు పెట్టారు. సంఫ్‌ుపరివార్‌ కనుసన్నల్లో ప్రభుత్వం, న్యాయస్థానాలు కలిసి ఆయనకు యావజ్జీవ శిక్ష విధించాయి. పధ్నాలుగు నెలల బెయిలుతో కలిపి పదేళ్లపాటు దారుణమైన ఒంటరి జైలు జీవితాన్ని గడిపాడు. తీవ్ర అనారోగ్యంతో అనేకసార్లు మృత్యుముఖంలోకి వెళ్లి కూడా తేరుకున్నాడు. ఈ శిక్షాకాలంలో జైలు అధికారులు, న్యాయమూర్తులు ఆయనతో, ఆయన సహచరులతో అత్యంత క్రూరంగా వ్యవహరించారు. ఈ అక్రమ కేసులో సహ నిందితుడు పాండు నరోటే జైలులోనే అమరుడయ్యాడు. ఈ కేసుకు వ్యతిరేకంగా ప్రపంచ వ్యాప్తంగా విప్లవ, ప్రజాస్వామిక, మానవతావాదుల నుంచి అపారమైన మద్దతు వచ్చింది. పూర్తి నిరాధారమైన ఆరోపణలతో ఎన్‌ఐఏ అధికారులు ఆయన విడుదల కాకుండా అనేక దుర్మార్గ ప్రయత్నాలు చేశారు. అయినా చివరికి కేసు కొట్టివేయడంతో ఆయన ఇటీవలే విడుదలయ్యాడు.
సుదీర్ఘమైన జైలు జీవితంలో సాయిబాబు రాజకీయ, తాత్విక విశ్వాసాలు మరింత రాటుదేలాయి. ఆయన శరీరం శిథిలమైనా ఆయన మేధస్సు మహాద్భుతంగా వికసించింది. ఒంటరి జైలు జీవితంలోంచి విశాల ప్రపంచ మానవ చైతన్యాన్ని, పోరాటతత్వాన్ని, స్వేచ్ఛకాంక్షలను, విముక్తి భావనలను ఆయన మరింత సొంతం చేసుకున్నాడు. ప్రజల కాల్పనికశక్తి ఆయనలో అజరామర కవిత్వంగా వ్యక్తమైంది. మృత్యువుకు చేరువైనప్పుడల్లా ‘నేను చావును నిరాకరిస్తున్నాను’ అని రాజ్యాన్ని, వ్యవస్థను, మృత్యువును సహితం ధిక్కరించి ప్రజా ఆకాంక్షలను గానం చేశాడు. ఫాసిస్టు రాజ్యాన్ని కుప్పకూల్చి, మానవీయ సమాజాన్ని నిర్మించే ప్రజాపోరాటాలకు జైలులోంచి సంఫీుభావం ప్రకటించాడు. ఆయన శారీరకంగా వికలాంగుడైనప్పటికీ ఆయన సృజనాత్మకమైన విప్లవ మేధస్సును చూసి ఫాసిస్టు న్యాయస్థానాలు భయపపడ్డాయి. ఆయనను ఉరితీసినా తప్పుకాదని ప్రకటించాయి.
ఆధునిక ప్రపంచ చరిత్రలో మేధావిగా, విప్లవకారుడిగా ఇటలీ కమ్యూనిస్టు పార్టీ నాయకుడు కా. అంటోనియో గ్రాంసీలాగే భారత కార్పొరేట్‌ ఫాసిస్టు పాలకులకు సాయిబాబ నిద్రలేకుండా చేశాడు. ఆయనలాగే సుదీర్ఘ జైలు జీవితం గడిపి, విడుదలైన కొద్ది కాలానికే తీవ్ర అనారోగ్యంతో సాయిబాబ అమరుడయ్యాడు. గ్రాంసీ దగ్గరి నుంచి ప్రపంచ వ్యాప్తంగా కవులు, రచయితలు, విప్లవకారులు, మన దేశంలో నక్సల్బరీ కాలం నుంచి అద్భుతమైన ప్రజానాయకులు, మేధావులు, కళాకారులు నియంతృత్వ, ఫాసిస్టు రాజ్యానికి వ్యతిరేకంగా చాలుబోసిన విప్లవ మార్గాన్ని ప్రొ. సాయిబాబా తన జీవితంతో, పోరాటాలతో, కవిత్వంతో సమున్నతం చేశాడు.
విప్లవ విద్యార్థి ఉద్యమంలో, రాజకీయ ఖైదీల విడుదల పోరాటంలో, సామ్రాజ్యవాద వ్యతిరేక అభిల భారత ప్రజా ప్రతిఘటన వేదికలో, భారత బందీఖానాలో ఉన్న జాతుల విముక్తి పోరాటాల సంఫీుభావ ఉద్యమంలో, ప్రజాస్వామిక తెలంగాణ ఆకాంక్షల్లో, ఆదివాసులపై సాగిన సల్వాజుడుం, ఆపరేషన్‌ గ్రీన్‌హంట్‌ వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్త పోరాటంలో, అంతర్జాతీయ స్థాయిలో భారత విప్లవోద్యమ రాజకీయ ప్రచారంలో.. ఆయన జీవితం అంతర్భాగమైంది. 2005లో ఏర్పడిన రివల్యూషనరీ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌కు 2014లో అరెస్టు అయ్యేదాకా నాయకత్వం వహించాడు. 2012లో హైదరాబాదులో ఆ సంస్థ అఖిల భారత మహాసభల్లో సహాయ కార్యదర్శిగా ఎన్నికయ్యాడు. ‘కమిటీ అగెయినిస్టు వార్‌ ఆన్‌ పీపుల్‌’ ద్వారా ప్రజా ఉద్యమాల మీద ప్రభుత్వ యుద్ధానికి వ్యతిరేకంగా పని చేశాడు.
ఎక్కడో గోదావరి తీరంలోని అమలాపురంలో పుట్టిన ఒక శారీక వైకల్య బాలుడు మానవ జీవితంలోని సకల హింసలను, దుర్మార్గాలను, వైకల్యాలను గురి చూసి వాటిని రద్దు చేయడానికి విప్లవ రాజకీయాలను స్వీకరించాడు. తెలంగాణను, బస్తర్‌ను, దేశంలోని పీడిత జాతులను, ముస్లింలను, దళితులను, కార్మికవర్గాన్ని ప్రపంచ మానవాళితో అనుసంధానం చేయగల ప్రాపంచిక దృక్పథాన్ని సొంతం చేసుకున్నాడు. అట్లాంటి రాజకీయ, సాహిత్య ఆచరణను కొనసాగించాడు. విప్లవం ఎంత అద్భుతమైనదో, విశాలమైనదో, మానవీయమైనదో, నిర్మాణాత్మకమైనదో తన పోరాట జీవితంతో మరోసారి నిరూపించాడు. రాజకీయ విశ్లేషణలు, ఉద్యమ లక్ష్య ప్రకటనలు, పోరాట ప్రణాళికలు ముప్పై ఏళ్లుగా తన రచనల ద్వారా ప్రజలకు అందించిన సాయిబాబ దుర్భరమైన జైలులో, ఆస్పత్రులో మృత్యుశయ్య మీద ఉండి కూడా తన ఊహలను, విశ్వాసాలను, భవిష్యదాశలను కవిత్వం చేశాడు. జైలులో అధ్యయనం, రచన ప్రాణంగా జీవించాడు. జీవితాన్ని, ప్రపంచాన్ని, ప్రజలను, విప్లవాన్ని అపారంగా ప్రేమించినందు వల్లనే ఫాసిస్టు నిర్బంధాన్ని అధిమించగలిగాడు. తిరిగి సమాజంలోకి వచ్చాడు.
అయితే సుదర్ఘకాలపు జైలు నిర్బంధంలో ఆయన ఆరోగ్యం పూర్తిగా దెబ్బతినిపోయింది. ప్రభుత్వం కనీస వైద్యం కూడా అందకుండా వేధించడంతో ఆయన శరీరం శిథిలమైపోయింది. బైటికి వచ్చాక వైద్యం చేయించుకున్నా నయం కాలేదు. ఒక చిన్న ఆపరేషన్‌ కోసం వారం పాటు హైదరాబాదు హాస్పెటల్‌లో ఉన్నాడు. వైద్యానికి ఆయన శరీరం సహకరించలేదు. జైలులోంచి ప్రపంచ మానవుల హృదయ స్పందనలు ఆలకించిన ఆ గుండె పని చేయలేక ఆగిపోయింది. సాయిబాబ మరణం యాదృశ్చికం కాదు. ఆయనది సహజ నిష్క్రమణ కాదు. కేంద్రంలోని హిందుత్వ ఫాసిస్టు ప్రభుత్వం చేసిన హత్య ఇది. ముసోలినీ ఫాసిస్టు రాజ్యం గ్రాంసీని హత్య చేసినట్లే మోదీ హిందుత్వ ఫాసిస్టు రాజ్యం ప్రొ. సాయిబాబను హత్య చేసింది.
‘నేను చనిపోయేలా ఏం చేయాలో
వాళ్లకు తెలియడం లేదు
ఎందుకంటే
నాకు మొలకెత్తే గడ్డి సవ్వడులు
చాలా ఇష్టం…’ అని జీవితేచ్ఛను, విప్లవాకాంక్షను ప్రకటించిన సాయిబాబ మరణం తీరని దు:ఖమే. ఆయన జీవన సహచరికి, కుమార్తెకు, రక్తబంధువులకు, ప్రపంచవ్యాప్త పోరాటకారులకు ఇప్పట్లో తేరుకోలేని విషాదమే. కానీ సాయిబాబా కోసం కార్చే కన్నీరు కేవలం దు:ఖమే కావడానికి వీల్లేదు. ఆయన జైల్లో ఉన్నప్పుడైనా, బైటికి వచ్చాక అయినా ఈ దేశ ప్రజల గురించి ఆరాటపడ్డాడు. ఆరోగ్యం కాస్త కుదుటపడితే మధ్యభారతదేశంలో ఆదివాసులపై భారత ప్రభుత్వం చేస్తున్న యుద్ధానికి వ్యతిరేకంగా పని చేస్తా అని పదే పదే ప్రకటించాడు. రచయితలు, బుద్ధిజీవులు, వివిధ ప్రజాస్వామిక దృక్పథాలతో పోరాడుతున్న వాళ్లంతా ఆదివాసుల కోసం పని చేయాలని పిలుపు ఇచ్చాడు. సల్వాజుడుం దగ్గరి నుంచి ఆదివాసుల మీద భారత రాజ్యం చేసిన యుద్ధానికి వ్యతిరేకంగా పోరాడిన అనుభవం ఆయనకు ఉంది. ఆచరణ బలం ఉంది. అట్లాగే ఇప్పటి ఆపరేషన్‌ కగార్‌కు వ్యతిరేకంగా ఉద్యమించడానికి కూడా సిద్ధమయ్యాడు.
ఇప్పుడు ఆయన లేదు. ఆయన కల అర్థాంతరంగా ఆగిపోయింది. ఆయన పోరాటకాంక్షను మనం సొంతం చేసుకోవాల్సి ఉంది. ఆదివాసుల కోసం, అడవి కోసం, పర్యావరణం కోసం కార్పొరేట్‌ రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడటానికి మనం సిద్ధం కావాల్సి ఉంది. ఆపరేషన్‌ గ్రీన్‌హంట్‌కు వ్యతిరేకంగా పోరాడి యావజ్జీవ శిక్ష అనుభవించిన సాయిబాబ స్ఫూర్తితో ఆపరేషన్‌ కగార్‌కు వ్యతిరేకంగా సంఘటితం కావాల్సి ఉన్నది. దేశాన్ని కార్పొరేట్లకు అప్పగించడమే రాజ్యాంగబద్ధ పాలనగా మారిన వర్తమాన పరిస్థితుల్లో గ్రీన్‌హంట్‌ కంటే తీవ్రమైన అంతిమ యుద్ధానికి ప్రభుత్వం తెగబడిరది.
ఆదివాసులు చేస్తున్న పోరాటాలు వాళ్లవే కావని, అవి నూటా నలభై కోట్ల భారత ప్రజలవని సాయిబాబ చెప్పాడు. ఆయన అందించిన రాజకీయ చైతన్యంతో ఈ రోజు విశాల ప్రజాస్వామిక ఐక్య సంఘటనగా మనం పోరాడాలి. 2026 కల్లా ఈ దేశాన్ని మావోయిస్టు రహిత భారత్‌గా, ఆదివాసీ రహిత భారత్‌గా, కార్పొరేట్‌ ఇండియాగా మార్చేస్తామని ప్రకటిస్తున్న ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌ షా ఫాసిస్టు హత్యారాజకీయాలకు వ్యతిరేకంగా ఐక్య పోరాటాలను వేగవంతం చేయాలి. వందల వేల ఏళ్లుగా ఈ దేశ అట్టడుగు శ్రామిక ప్రజలు, పీడిత అస్తిత్వ సమూహాలు నిర్మించిన ప్రజాస్వామిక లౌకిక, సామరస్య సహజీవన సంస్కృతిని ధ్వంసం చేసి 2047కల్లా కార్పొరేట్‌ హిందుత్వ రాష్ట్రను స్థాపించాలనుకుంటున్న ఫాసిస్టు శక్తులకు వ్యతిరేకంగా ఉద్యమించాల్సి ఉన్నది. దేశవ్యాప్తంగా ప్రజానుకూల, ప్రజావ్యతిరేక శక్తుల మధ్య పొలిటికల్‌ పోలరైజేషన్‌కు ప్రొ. సాయిబాబ అమరత్వ స్ఫూర్తితో కృషి చేయాల్సి ఉన్నది.
ఇందులో వివిధ ప్రజానుకూల భావజాలాలున్న మేధావులు, పోరాటకారులు ఐక్యం కావాలి. వేర్వేరు జీవన తలాల్లో జరుగుతున్న ఉద్యమాలు ఫాసిస్టు విధ్వంసానికి వ్యతిరేకంగా ఉమ్మడి పోరాట క్షేత్రాన్ని నిర్మించుకోవాలి. ముఖ్యంగా తెలుగులో చాలా విస్తారమైన సాహిత్య రంగం సాయిబాబ కవిత్వ స్ఫూర్తితో ఫాసిస్టు వ్యతిరేక స్వభావాన్ని సంతరించుకోవాలి. సాహిత్యకారులు అల్పమైన పురస్కారాలకు, స్వయం ప్రచారాలకు, కీర్తిదాహాలకు, రాజ్యప్రాపకాలకు లొంగిపోకుండా ఫాసిస్టు వ్యతిరేక చైతన్యాన్ని ప్రదర్శించవలసి ఉన్నది. ప్రభుత్వ వ్యతిరేక చైతన్యంతో ప్రజా జీవితంలోకి రావలసి ఉన్నది.
‘సంగీతం ఆగిపోయింది
సృజనకారులను తరిమేశారు
కవులకు విషపాత్రలిచ్చారు
చరిత్రకారులను సజీవంగా పాతిపెట్టారు
శాస్త్రవేత్తలను మచ్చిక చేసుకున్నారు
తత్వవేత్తలను ఉరికంబాలెక్కించారు
అపరిచితమైన మనుషులు
బాగా తెసిన మనుషులను
ప్రేమికులనూ ఆలోచకులనూ
కాల్చి చంపుతున్నారు..’ అని సాయి ఈ వర్తమాన పరిస్థితులను జైలు నుంచే వర్ణించారు. సాహిత్యకారులు, మేధావులు ఈ సంక్షోభ సందర్భంలో సాయిబాబను ఆదర్శంగా తీసుకోవాలి. ఆపరేషన్‌ కగార్‌కు, బ్రాహ్మణీయ ఫాసిస్టు కొర్పొరేట్‌ రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడినప్పుడే సాయిబాబకు మనం ఇచ్చే నివాళి అర్థవంతం అవుతుంది. ఆయనకు విప్లవ రచయితల సంఘం వినమ్రంగా నివాళి ప్రకటిస్తోంది. ఆయన ఆశయాలకు పునరంకితం అవుతోంది.

అధ్యక్షుడు
అరసవిల్లి కృష్ణ
కార్యదర్శి
రివేరా

Leave a Reply