2024 జూన్ 6 నాటికి సురేంద్రను అరెస్టు చేసి ఆరేళ్లు పూర్తయ్యాయి. సుదీర్ఘ ఆరేళ్లు! ఈ కాలాన్ని కొన్ని పదాల్లో వివరించడం చాలా కష్టం. ఈ ఆరేళ్లలో జీవితం పూర్తిగా మారిపోయింది. ఇంతకుముందు వుండిన స్థిరత్వం, భద్రత, స్నేహితులు, బంధువులు, సంతోషాలతో  ఉన్న జీవితం అకస్మాత్తుగా పూర్తిగా మారిపోయింది. నా ఘోరమైన  పీడకలల్లో కూడా ఊహించలేనంత వాస్తవాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది.

మా ఇంటిపై దాడి జరిగిన  2018 ఏప్రిల్ 17నాటి భయంకరమైన తెల్లవారుజామును నేను గుర్తుచేసుకున్నాను; సురేంద్రను తీసుకెళ్ళిన  2018 జూన్ 6 నాటి ఆ దుర్మార్గపు ఉదయం. ఇది నిజంగా జరిగిందని నమ్మడానికి నాకు చాలా సమయం పట్టింది. తరచుగా, నేను ఉదయాన్నే లేచి అదంతా ఒక పీడ కల అయితే బాగుంది అని అనుకుంటాను, కానీ కాదు. ఇది మా జీవితాలను నాశనం చేసిన చేదు నిజం. నేను ఇంతకు ముందెన్నడూ ఆలోచించని రాజ్యం, న్యాయవ్యవస్థ, సమాజాల చీకటి వాస్తవాన్ని అనుభవించేలా చేసింది.

డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్‌ను సురేంద్ర చాలా గౌరవించేవాడు. బాబాసాహెబ్ తన జీవితాంతం దళితుల అభ్యున్నతిపై దృష్టి సారించారు. విద్యాభ్యాసాన్ని సమాజ శ్రేయస్సు కోసం వినియోగించడం వారి కర్తవ్యమని బోధించారు. ఈ సందేశాన్ని గ్రహించిన సురేంద్ర దళితులు, ఆదివాసీలు, మైనారిటీలు, పేదలకు సహాయం చేయడానికి నిరంతరం కృషి చేశాడు. అతను తన జీవితమంతా ఈ లక్ష్యానికి అంకితం చేశాడు. చాలా సందర్భాలలో తన కుటుంబాన్ని, ఆరోగ్యాన్ని కూడా నిర్లక్ష్యం చేశాడు. వారిపై జరిగిన అకృత్యాలు, అన్యాయాల నుంచి న్యాయం జరగాలని నిర్భయంగా పోరాడాడు.

కానీ, ఉపా, టాడా కేసులలో ఎప్పుడూ కూడా మంచి ఫలితాలను సాధించిన వ్యక్తి తానే యిప్పుడు జైలులో ఉన్నాడు. బాబాసాహెబ్ చూపిన బాటలో నడిచే దళిత న్యాయవాది, దళితుడైనందుకు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తూంది. సత్యమార్గంలో నిర్భయంగా నడిచినందుకు, దళితులు, ఆదివాసీలు న్యాయం కోసం చేస్తున్న పోరాటంలో వారితో పాటు నిలబడినందుకు “అర్బన్ నక్సల్”గా ముద్ర వేశారు. ఈ రోజు, అతను నిర్దోషి అయినప్పటికీ, తన కుటుంబం నుండి దూరంగా ఆరు సంవత్సరాలుగా కటకటాల వెనుక ఉన్నాడు. తల్లిని ఆఖరి రోజుల్లో కూడా చూడలేకపోయాడు.

నాకు గుర్తున్నంతవరకు, సురేంద్ర తన క్లయింట్‌లకు తన శక్తికి మించి సహాయం చేస్తాడు.  వీరిలో చాలా మంది గడ్చిరోలి తదితర జిల్లాల్లోని మారుమూల, కుగ్రామాల నుండి వచ్చిన ఆదివాసీలు, వారి కుటుంబాలు. తమ వారిని కలవడానికి ప్రయాణ ఖర్చు, కనీస అవసరాలు తీర్చుకునే శక్తి కూడా లేనివారు. చాలా సార్లు, నేను కొంతమంది మహిళా క్లయింట్‌ల కోసం దుస్తులు కొన్నాను. వారిని అకస్మాత్తుగా అరెస్టు చేసి తీసుకొచ్చినప్పుడు వంటి మీద దుస్తులు తప్ప వేరే ఏమీ వుండేవి కావు. కొంతమంది ఆదివాసీ క్లయింట్‌లకు విడుదలైన తర్వాత తిరిగి యింటికి వెళ్లడానికి చేతిలో డబ్బు, వుండడానికి నగరంలో స్థలం వుండదు కాబట్టి తమ కుటుంబ సభ్యులు వచ్చే వరకు ఒకటి లేదా రెండు రోజులు మా ఇంట్లోనే వసతి కల్పించేవాళ్లం. ఇంత సహాయకారిగా ఉన్న న్యాయవాది స్వయంగా ఖైదీగా మారినప్పుడు, జీవితం అతనికి నరకప్రాయమవుతుంది.

సురేంద్రను 2018 జూన్ 6న అరెస్టు చేశారు. జూన్ 8న, అతను పూణేలోని సాసూన్ ఆసుపత్రిలో చేరినట్లు నాకు సమాచారం అందింది. వెంటనే పూణే బయలుదేరాను. మరుసటి రోజు వెళ్ళేసరికి తను ఐసియులో ఉన్నాడు. ఎడమ చేతిని సంకెళ్ళతో మంచానికి కట్టేసారు; యాంజియోగ్రఫీ కోసం కుడి చేతికి  యాంజియోక్యాత్ పెట్టారు. ఆసుపత్రిలో అతన్ని ఏదో పెద్ద, ప్రమాదకరమైన నేరస్థుడిలాగా వుంచారు.

అతన్ని ఈ స్థితిలో చూడగానే నా పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. అతనికి మందులు ఇవ్వడం కోసం కేవలం ఒక్కసారి చూడటానికి అనుమతించారు. జూన్ 11న డిశ్చార్జి అయ్యాడు. మందులు, చికిత్స, రక్తపరీక్షల ఖర్చులన్నీ మా దగ్గరే తీసుకున్నారు కానీ మమ్మల్ని కలవనివ్వలేదు. 11వ తేదీ మధ్యాహ్నానికి రక్తపరీక్ష రిపోర్టులు వచ్చాయి కాబట్టి రిపోర్టులు చూడకుండానే మందులు, అందులోనూ అతడికి కాకుండా పోలీసులకి యివ్వాల్సి వచ్చింది. అందువల్ల, ఏ మందులు, ఏ పరిమాణంలో, ఎప్పుడు తీసుకోవాలో కూడా సురేంద్రకు తెలియదు. ఈ క్రమంలోనే అతడి జీవితంతో ఆటలాడి జైలుకు పంపారు. ఇది నేటికీ కొనసాగుతోంది.

సురేంద్ర ఆరోగ్య సమస్యలు, జైలు అధికారుల నిర్లక్ష్యాన్ని చూసి, మరొక ఫాదర్ స్టాన్ స్వామి తరహా ప్రకరణ మళ్లీ జరుగుతుందేమోనని నాకు ఎప్పుడూ ఆందోళనగా వుంటుంది. సురేంద్రకు అధిక రక్తపోటు, మధుమేహం, స్పాండిలైటిస్, ఆస్తమా, గుండె సంబంధిత సమస్యలతో సహా అనేక ఆరోగ్య సమస్యలు ఉన్నాయి.

పూణెలో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. సురేంద్రకు శీతాకాలంలో ఉబ్బసం, మూర్ఛలాంటి తీవ్రమైన ఆరోగ్య సమస్య ఉంది. ఎరవాడ జైలులో కూడా చాలా వివక్ష చూశాను. వారిని అర్బన్ నక్సల్స్‌గా ముద్రవేసి మరీ వేధించారు. కుటుంబ సభ్యుల నుండి ఇతర ఖైదీలకు స్వెటర్లు యివ్వనిచ్చారు కానీ సురేంద్రకు ఇవ్వడానికి మాత్రం ఒప్పుకోలేదు. ఎందుకలా అని ప్రశ్నించినప్పుడు, “ఆత్మహత్య చేసుకోవడానికి స్వెటర్‌ను ఒక సాధనంగా ఉపయోగించే అవకాశం వుంది”అన్నారు. నిరంతర పోరాటం, కోర్టు ఉత్తర్వు తర్వాత మాత్రమే స్వెటర్, దుప్పటిలాంటి ప్రాథమిక అవసరాలకు అనుమతి దొరికింది.

నవీ ముంబయిలోని తలోజా జైలులో కూడా ఇలాంటి వివక్షను ఎదుర్కొన్నాడు. సురేంద్ర ఆరోగ్య సమస్యలను గమనించిన వైద్యుడు అతనికి పాలు, గుడ్లు, గోరువెచ్చని నీరు ఇవ్వాలని ఆదేశించాడు, కోర్టు కూడా అందుకు అనుమతించింది. కానీ తలోజా సూపరింటెండెంట్ మాత్రం సురేంద్రకు అవి యివ్వడానికి నిర్దిష్టంగా వ్యతిరేకించాడు. అధిక రక్తపోటు, మధుమేహం ఉన్న రోగి అయినప్పటికీ, సురేంద్రకు చాలా రోజులు మందులు ఇవ్వలేదు. షుగర్ పరీక్షలు క్రమం తప్పకుండా చేయించలేదు. చక్కెర స్థాయిలు పెరిగినప్పుడు కంటి చూపు మందగిస్తుంది. జైలు అధికారులు చాలా కాలం పాటు మందులు ఇవ్వకపోవడంతో అతను ఒకసారి స్పృహ తప్పి కింద పడిపోవడంతో తలకు గాయం అయింది. వారు అతని జీవితంతో ఆడుకున్నారు.

సురేంద్ర పుస్తకాల కోసం కూడా కష్టపడాల్సి వచ్చింది. న్యాయవాదిగా, తన కేసును స్వయంగా వాదించటానికి, న్యాయశాస్త్ర పుస్తకాలు కావాలని కోర్టుల నుంచి అనుమతులు పొందినప్పటికీ కూడా పుస్తకాలు యివ్వనిరాకరించారు. అతను స్వామి వివేకానందపై పుస్తకాన్ని కోరినప్పుడు కూడా, అది చట్టవ్యతిరేక, నక్సలైట్ ప్రచురణ అనే కారణంతో జైలు అధికారులు తిరస్కరించారు. తలోజా జైలులో అతని కోసం ఒక లా జర్నల్ వచ్చేది, కానీ జైలు అధికారి అతని పేరుతో ఉన్న స్టిక్కర్‌ను తీసివేసి ఇతరులకు ఇచ్చేసేవాడు. తన సహజ స్వభావం రీత్యా జైలులో ఉన్న యితర ఖైదీలకు న్యాయపర సహాయం చేస్తాడు కాబట్టి, ఎరవాడ జైలులో అతన్ని నిరంతరం ఒక బ్యారక్ నుండి మరొక బ్యారక్‌కు మార్చేవారు. ఇది ఒక రకమైన మానసిక హింస.

సురేంద్ర జైలులో, మేము బయట కష్టాలనెదుర్కొన్నాం. బహుశా ఈ కష్టాలు సరిపోవని భావించి, సురేంద్ర సమస్యలను మరింతగా ఎక్కువ చేయడానికి, మరిన్ని రోజులు జైలులో ఉంచేందుకు, మాపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ (ఇడి) కేసును పెట్టారు. ఈరోజు భారతదేశంలో ఎవరైనా రాజ్యానికి వ్యతిరేకంగా మాట్లాడితే, నిజం చెబితే, వారి మీద ఇడివారి  దయా దృష్టి పడుతుంది.

సురేంద్ర చాలా పేరున్న న్యాయవాది. అతను చాలా పేద కుటుంబం నుండి వచ్చినప్పటికీ, తన నిజాయితీ, కఠోర పరిశ్రమతో ప్రసిద్ధ న్యాయవాది అయ్యాడు. తన జీవితంలో ఒక్క రూపాయి కూడా అవినీతితో సంపాదించలేదు. మాది మధ్యతరగతి కుటుంబం, మాకు ఉన్న ఆస్తి అంతా బహిరంగమే. కానీ మమ్మల్ని వీలయినంత వరకు ఇబ్బంది పెట్టాలనుకున్నారు. సురేంద్రను వీలైనంత కాలం లోపల ఉంచడానికి కొత్త కేసులను పెడుతూనే ఉన్నారు.

నక్సల్స్ మాకు డబ్బు పంపిస్తారనే అభిప్రాయాన్ని రాజ్యం కల్పించాలనుకుంది. దీనికి సంబంధించి కోర్టు అనుమతితో సురేంద్రను మూడు రోజుల పాటు ఇడి విచారించింది. అతని బ్యాంకు ఖాతాలో రూ. 24 లక్షల నగదు లావాదేవీలు ఎలా జరిగాయో వివరించాలని ఇడి అధికారి అడిగాడు.

సురేంద్ర నిర్ఘాంతపోయాడు. “ఇరవై నాలుగు లక్షలు! ఎప్పుడు?”

“కొంత కాలం నుంచి” ఇడి అధికారి సమాధానమిచ్చాడు.

“ఓహ్!” వూపిరి పీల్చుకున్నాడు సురేంద్ర. “ఎప్పటి నుండి?” అని అడిగాడు.

“నువ్వు అకౌంట్ తెరిచినప్పటి నుండి” అని అధికారి సమాధానమిచ్చాడు.

సురేంద్ర తిరస్కార భావనతో  “నేను వకీలుని. షకీల్‌ని కాదు! నేను మంచి ప్రాక్టీస్ ఉన్న న్యాయవాదిని. ఇరవై ఏళ్లకు పైగా రూ. 25-30 లక్షల నగదు లావాదేవీలు చేయడం పెద్ద విషయం కాదు” అని సమాధానమిచ్చాడు.

“మీకు డబ్బులు ఎవరు ఇచ్చారు?నక్సల్స్ ఇచ్చారని మేం అంటే కాదని మీరు ఎలా నిరూపించగలరు?”” అని ఇడి అధికారి ప్రశ్నిస్తే, “నా క్లయింట్లే నాకు ఈ డబ్బు ఇచ్చారు, వాళ్లని అడిగితే చెప్తారు” అని సురేంద్ర సమాధానమిచ్చాడు.

ఈ విధంగా సురేంద్ర కష్టపడి సంపాదించిన సొమ్ము నక్సల్స్‌ యిచ్చారని చూపించే ప్రయత్నం చేశారు. ఇరవై సంవత్సరాలకు పైబడిన కాలంలో రూ. 24 లక్షల లావాదేవీలు, అంటే నెలకు దాదాపు పదివేలు మాత్రమే అవుతుంది. ప్రధానంగా నగదు రూపంలో లావాదేవీలు చేసే, పెద్ద సంఖ్యలో పేద ఖాతాదారులతో వ్యవహరించే న్యాయవాదికి ఇది చాలా తక్కువ మొత్తం. తనకు ఒక్క రూపాయి కూడా అన్యాయంగా వచ్చినట్లు తేలితే ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా 15 రోజుల ఇడి కస్టడీకి వెళ్లేందుకు సిద్ధమని సురేంద్ర బహిరంగ కోర్టులో ప్రకటించాడు.

సురేంద్రను బలహీనపరచడానికి, నన్ను కూడా ఇడి తన భయానక ఆఫీసుకు పిలిచింది. నేను ఒక సాధారణ భారతీయ గృహిణిని. నేను చాలా సంవత్సరాలుగా, ఇంటి ఖర్చుల నుండి ఆదా చేసి, కొన్ని ఇంటి సామాన్లను, అవసరమైన సమయాల్లో ఉపయోగపడతాయి అని కొద్దిపాటి బంగారు నగలను కొన్నాను. రూ. 25,000 లేదా 45,000 వంటి కొన్ని మొత్తాలు నా ఖాతాలోకి ఎలా వచ్చాయి, ఎవరు ఇచ్చారులాంటి ప్రశ్నలు అడిగారు. ఇవి నా భర్త ఆదాయం నుండి వచ్చాయి. దొంగలెత్తుకుపోతారనో  లేదా అనవసరమైన ఖర్చులు చేస్తానేమోననే భయంతో భద్రత కోసం నా బ్యాంకు ఖాతాలో పెట్టాను. ఇంత కష్టపడి, కష్ట సమయాల్లో పనికొస్తాయని పైసా పైసా పొదుపు చేసిన మా నిజాయితీపర సంపాదన గురించి ఇడికి వివరణ ఇవ్వాల్సి వస్తుందని నేనెప్పుడూ అనుకోలేదు.

ఆర్థిక ఇబ్బందుల్లో వున్నట్లు తెలిసినప్పటికీ పోలీసులు, కొందరు తెలిసిన వ్యక్తులు మేం నక్సల్స్ నుంచి డబ్బులు తీసుకుంటున్నామని అంటున్నారు. ఇది పూర్తిగా అబద్ధం. చాలా బాధగా అనిపిస్తుంది. ఇప్పుడు లాయర్‌గా మారిన నా కుమారుడికి, “నక్సల్స్ మీకు డబ్బు ఇస్తున్నారు” అని సుప్రీంకోర్టులో ఒక పోలీసు అధికారి అనేంత స్థాయికి ఈ వేధింపులు చేరాయి.

వైచిత్రమేమంటే, మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఎన్‌ఫోర్స్‌మెంట్ కేసు సమాచార రిపోర్టును ఇడి ఇచ్చిన సమయంలోనే, జైలు క్యాంటీన్‌లో ఖైదీ వ్యక్తిగత నగదు (పిపిసి) ఖాతాలో జీరో బ్యాలెన్స్ వుండడం వల్ల  సురేంద్రకు షేవింగ్ బ్లేడ్ ఇవ్వలేమని ఎన్‌ఐ‌ఎ ప్రత్యేక కోర్టుకు తలోజా సూపరింటెండెంట్ తెలియజేశాడు. ఇటీవల కూడా, అతని పిపిసి ఖాతా జీరో బ్యాలెన్స్ చూపించడం వల్ల  జైలు కల్పించే ఆరు నిమిషాల వాయిస్-కాలింగ్ సౌకర్యాన్ని ఉపయోగించుకోలేకపోయాడు. అయితే ఒక అధికారి తన స్మార్ట్ కార్డ్ ఫోన్-కాలింగ్ ఖాతాలో రూ. 6 జమ చేయడం వల్ల మూడు సార్లుగా ఒకటి, రెండు, మూడు నిమిషాలు – మొత్తం ఆరు నిమిషాలు – ఉపయోగించుకోగలిగాడు.

సురేంద్ర నిర్దోషి అయినప్పటికీ, తన కుటుంబానికి దూరమై జైలులో వుండాల్సి వచ్చేట్లుగా బాధిస్తున్నారు. సురేంద్ర లేని జీవితం చాలా కష్టం. ఈ ఆరేళ్లలో చాలా భరించాం, చాలా చూశాం. ఒకప్పుడు చాలా సన్నిహితంగా ఉండే చాలా మంది స్నేహితులు, బంధువులు హఠాత్తుగా మాతో సంబంధాలు తెంచుకున్నారు. అయితే చాలా మంది స్నేహితులు, బంధువులు, లాయర్లు కూడా మాకు మద్దతుగా నిలిచారు. అతన్ని చూడాలని ఎంతో ఆశతో ఎదురుచూసిన అతని తల్లి, కోవిడ్ సమయంలో మరణించింది.

ఎన్నో ఎగుడు దిగుళ్ళను చూశాం, అయినా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం. సురేంద్ర, బికె-16 సభ్యులందరూ ఎంతకాలం న్యాయం కోసం ఎదురుచూడాల్సి వస్తుందో ఎవరికీ తెలియదు. ఎంతకాలం?

Leave a Reply