ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌భద్ర జిల్లాలోని ఆదివాసీ గ్రామాల్లో విషాదకర స్థితి ఏర్పడింది . ఇక్కడి ఆదివాసీలు తమ హక్కులు, గౌరవం, మనుగడ కోసం ప్రతిరోజూ పోరాడుతున్నారు.

ఈ ప్రాంతంలో బెదిరింపులు, పేదరికం, పోలీసు క్రూరత్వాలు వారి జీవితాలను అనిశ్చితిలోకి నెట్టాయి; ఇక్కడ ప్రతి రోజు వారికి ఒక కొత్త సవాలును తెస్తుంది. వారు తమ స్వరాన్ని పెంచే ప్రయత్నాలకు పోలీసుల నుండి నిరాశ, ఉదాసీనత మాత్రమే ఎదురౌతాయి.

సోన్‌భద్ర ఆదివాసుల పట్ల పోలీసుల ప్రవర్తన వారి వాస్తవికతను స్పష్టంగా ప్రతిబింబిస్తుంది. భూమిపై శాశ్వత యాజమాన్యం లేదా ఆర్థిక శక్తి లేని పేద ఆదివాసీలు శక్తివంతమైన పోలీసుల నుండి అణచివేతను ఎదుర్కొంటున్నారు. న్యాయం కోసం ఆశతో పోలీసులను ఆశ్రయించినప్పుడు, వారిని నేరస్థులుగా పరిగణిస్తారు. వారి ఫిర్యాదులను పట్టించుకోరు, చాలాసార్లు వారిపై తప్పుడు కేసులు పెట్టారు, పోలీసు స్టేషన్లలో నిర్బంధించారు.

జగ్వంతి దేవి, 45 ఏళ్ల సాధారణ మహిళ, సోన్‌భద్ర జిల్లాలోని ఒక చిన్న గ్రామ నివాసి. ఆమె కుటుంబం కలలో కూడా ఊహించని క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోంది. జగవంతికి ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు; అంగన్‌వాడీలో మంత్రసానిగా పనిచేస్తూ పిల్లలను పోషిస్తోంది.

ఆమె ఉద్యోగమే కుటుంబానికి ఆసరా;  కానీ ఈరోజు ఆమె తన జీవితంలోని అతి పెద్ద దుఃఖంలో మునిగిపోయింది.

అది 2024 జనవరి 10 – మధ్యాహ్నం. బనారస్‌లోని ఓ ఆసుపత్రిలో ప్రమాదానికి గురై చికిత్స పొందుతున్న జగవంతికి ఫోన్ వచ్చింది. పోలీసులు ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులను విచారిస్తున్నారని, భర్త, కొడుకు మహేంద్ర కోసం వెతుకుతున్నారని ఆమె కుమార్తె సునీత తీవ్ర భయాందోళనకు గురవుతూ చెప్పింది.

ఇది విన్న జగవంతి కంగారు పడింది. ఆపరేషన్ నొప్పి, కొడుకుల ఆలోచన ఆమెని మరింత అశాంతికి గురిచేసాయి.

ఆపరేషన్ అయి పదిరోజుల తర్వాత ఇంటికి తిరిగి వచ్చిన జగవంతికి మరో పెద్ద షాక్ తగిలింది. కొడుకు మహేంద్ర జైలులో ఉన్నాడు. అతని వద్ద గంజాయి ఉందని ఆరోపించిన పోలీసులు అతని బండిని స్వాధీనం చేసుకుని జైలుకు పంపారు.

జగవంతి మాటల్లో చెప్పాలంటే, “ఇదంతా ఎలా జరిగిందో నాకు అర్థం కావడం లేదు? నేను హాస్పిటల్‌లో ఉన్నప్పుడు మా ఇంట్లో ఇంత పెద్ద గొడవ జరిగింది. పోలీసులు నా కొడుకు జీవితాన్ని నాశనం చేశారు“

కొంతకాలం తర్వాత, అలహాబాద్ హైకోర్టు నుండి బెయిల్ వచ్చింది, కాని పోలీసులు గ్యాంగ్‌స్టర్ చట్టం కింద మళ్లీ జైలులో పెట్టారు. జైలులో ఉన్న తన కొడుకును చూడడానికి వెళ్ళిన ప్రతిసారీ అతని పరిస్థితి చూసి జగవంతి గుండె తరుక్కుపోతుంది.

 “మమ్మీ, నన్ను త్వరగా జైలు నుండి బయటకు తీసుకెళ్ళు, ఇక్కడ వారు నన్ను ఊడిపిస్తున్నారు, తుడిపిస్తున్నారు, కాలువలు శుభ్రం చేయిస్తున్నారు. చేయను అంటే, నన్ను కొట్టారు. నేను ఇక్కడే చనిపోతాను అమ్మ!”అని ఒకటే ఏడుస్తున్నాడు.

కళ్ల ముందే కొడుకు అలా ఏడవడాన్ని చూడటం కంటే ఎక్కువ బాధ తల్లికి ఏముంటుంది? “అత‌ని ముఖం నా క‌ళ్ల ముందు ఎప్పుడూ కదలాడుతూనే ఉంటుంది. నేను ప్రేమగా పెంచిన కొడుకు ఈరోజు అష్ట కష్టాలు పడుతున్నాడు” అని అంటుంది.

ఇప్పుడు న్యాయం కోసం జగవంతి ఆశగా ఎదురు చూస్తున్నది. తన కుమారుడిపై వచ్చిన తప్పుడు ఆరోపణలపై విచారణ జరిపి దోషులను శిక్షించాలని కోరుతోంది. తన కొడుకునుని జైలు నుంచి బయటకు తీసుకురావాలనే ఆశతో ఆమె తన బాధను అణచివేసుకుని సమాజాన్ని ఆశ్రయించింది.

“మేము పేదవాళ్ళం, మా మాట ఎవరూ వినరు, కానీ ఏదో ఒక రోజు న్యాయం జరుగుతుంది, నా కొడుకు మళ్లీ స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకోగలడు.”

పోలీసులు, గ్యాంగ్‌స్టర్ల మధ్య కుమ్మక్కు:

సోన్‌భద్రలో రౌడీలు, పోలీసుల మధ్య అనుబంధం ఆదివాసులకు పెను సవాలుగా మారింది. స్థానిక రౌడీలు పోలీసుల రక్షణలో ఆదివాసీల భూమిని ఆక్రమించారు, ఈ కుటుంబాలు నిరసన వ్యక్తం చేసినప్పుడు, వారు పోలీసులతో కలిసి భయపెడతారు, బెదిరిస్తారు. 

శాంతి భద్రతలు తమ కోసం కాదు అని  అనుకోవడం తప్ప వారికి వేరే మార్గం లేదు. తమ భూమి ఆక్రమణకు గురైనా, ఇంటిపై దాడి జరిగినా పోలీసులు రౌడీలకు అండగా నిలుస్తున్నారు.

కుటుంబసభ్యులు పోలీసు స్టేషన్‌కు వెళ్తే వారి మాట వినకుండా, అవమానకరంగా ప్రవర్తిస్తారు. పోలీస్ స్టేషన్లలో వారిని  పట్టించుకోకపోవడం మామూలే. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడంలో జాప్యం చేయడం, పదేపదే సాకులు చెప్పడం పోలీసుల వ్యవహార శైలిగా మారింది.

ఆదివాసీ మహిళలు తరచూ పోలీస్ స్టేషన్లలో వేధింపులకు గురవుతున్నారు; తప్పుడు కేసుల్లో ఇరికించి పురుషులను బెదిరిస్తున్నారు. పోలీసుల ఈ వైఖరి ఈ సముదాయ ప్రజల హృదయాలను తీవ్ర బాధతో , నిస్సహాయ భావనతో నింపింది.

సోన్‌భద్ర జిల్లాలోని ఒక చిన్న గ్రామంలోని వార్డ్ నంబర్ 10లో నివసించే అమర్‌జీత్ జీవితంలో 2024 ఫిబ్రవరి 10  వినాశనాన్ని తీసుకు వచ్చింది. ఆ రోజు ఉదయం, అమృత్ లాల్ యాదవ్ , నీరజ్ యాదవ్‌లతో సహా పది మంది బలవంతుల ముఠా అతని ఇంటి దగ్గర చేరి, భూమిని స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు ప్రారంభించింది.

ఆ సమయంలో అమర్జీత్ భార్య లవాసి దేవి, కొడుకు విజయ్ శంకర్, కోడలు సుమిత్రా దేవి వాళ్ళని ఆపడానికి వెళ్లారు. వారు, “అన్నా, మేము పేదవాళ్ళం, మాకు ఉన్నది ఇదే, మా మీద దయ చూపండి” అని వేడుకొన్నారు. కానీ వాళ్ళని పట్టించుకోకుండా, ఆ రౌడీలు బూతులు తిట్టడం మొదలుపెట్టారు. లవాసి దేవిని నేలమీద పడేసారు.

అంతేకాకుండా అమర్‌జీత్ కుటుంబ సభ్యుల్ని కూడా కొట్టడం ప్రారంభించారు. అమర్జీత్ ఇలా అంటాడు, “వారు నా భార్యని అవమానించేందుకు ప్రయత్నించారు, ఆమె చీర కూడా లాగారు , నా కోడలు , కొడుకును చాలా దారుణంగా కొట్టారు. తాము ఏం చేస్తున్నామో కూడా తెలుసుకోలేనంత కోపంతో ఉన్నాడు. ఆ రోజు మా కుటుంబం అంతం అయిపోతుంది అనిపించింది.”

ఈ ఘటన మొత్తాన్ని గ్రామానికి చెందిన ఓ యువకుడు వీడియో తీశాడు. గొడవ అనంతరం రౌడీలు వెంటనే తమ కారులో పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. భయం , బాధతో నిండిన అమర్‌జీత్ కుటుంబం కూడా ఎలాగో అలా పోలీస్ స్టేషన్‌కి చేరుకుంది, అయితే అక్కడ వారు మరింత బాధాకరమైన అనుభవాన్ని ఎదుర్కోవలసి వచ్చింది.

“మా మాట వినడానికి బదులుగా, పోలీసులు మమ్మల్నే తిట్టారు. మేం చేతులు జోడించి  న్యాయం చేయాలని విజ్ఞప్తి చేసినా మమ్మల్ని వెనక్కి పంపించేసారు. రాత్రంతా ఏడుస్తూ గడిపాం” అని అమర్జీత్ వేదనతో అంటాడు.

“మరుసటి రోజు ఉదయం నేను మళ్లీ పోలీస్ స్టేషన్‌కి వెళ్లినప్పుడు, స్టేషన్ ఆఫీసర్ వీడియో చూసి, “మేము ఇద్దరు పోలీసులను పంపుతున్నాము” అని చెప్పాడు. దీని తర్వాత, ఆఫీసర్ అమర్‌జీత్ కుటుంబాన్ని వీడియో తీసిన వ్యక్తి పేరు ఏమిటి అని అడిగాడు. “సార్, వీడియో ఎవరు చేశారో మాకు తెలియదు అని అంటే పోలీసులు మమ్మల్నే తిట్టడం ప్రారంభించారు” అని అమర్‌జీత్ చెప్పాడు.

తరువాత  పోలీసులు అతడిని ఆస్పత్రికి పంపిస్తే అక్కడ చికిత్స ప్రారంభించారు. అనంతరం గ్రామంలో పోలీసులు విచారణ చేసారు కానీ ఎలాంటి చర్యలూ చేపట్టలేదు.

నేటికీ శైలేంద్ర యాదవ్ , అతని సహచరులు స్వేచ్ఛగా తిరుగుతూ పదేపదే బెదిరిస్తున్నారు. అమర్జీత్ ఇలా అంటాడు, “నీకు ఇంకా ఏమీ చేయలేదు.. ఈసారి నిన్ను చంపి మాయం చేస్తాం అని శైలేంద్ర యాదవ్ బెదిరించాడు. ఇది విన్నాక  ఎప్పుడూ భయం వెంటాడుతూంటుంది. ఎక్కడికైనా వెళ్లాలంటే భయంగా ఉంది, రాత్రి నిద్రపట్టదు.”

అమర్‌జీత్‌కి ఇప్పుడు ఆఖరి ఆశ “న్యాయం”. అతను ఇలా అంటాడు, “మేము పేదవాళ్లం, కానీ మాకు కూడా న్యాయం కావాలి. మాపై జరిగిన వ్యవస్థీకృత హింస, వేదనకు వ్యతిరేకంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. మేము చట్టబద్ధమైన పాలనను కోరుకుంటున్నాము, తద్వారా ఈ వ్యక్తులను శిక్షించాలి, మాకు కూడా న్యాయం జరుగుతుంది.

ఈ అమర్‌జీత్ గొంతుక పేదరికం , శక్తివంతుల అణచివేతను ఎదుర్కొంటున్న కుటుంబాలన్నింటికీ ప్రాతినిధ్యం వహిస్తుంది; పోలీసుల నిర్లక్ష్యం కారణంగా భయం, నిస్సహాయతతో జీవించాల్సి వస్తోంది.

జీవితం భయం, బాధలకు పర్యాయపదంగా మారింది:

సోన్‌భద్రలోని ఆదివాసీ కుటుంబాలకు, పోలీసుల అణచివేత, భయం జీవితంలో ఒక దినచర్యగా మారాయి; ప్రతి రోజూ తమకు ఎలాంటి ఇబ్బంది రాబోతోందో అని ఆందోళన చెందుతూ వుంటారు. తమకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నా, పోలీసుల తీరు వారి మనసుల్లో ఎప్పుడూ భయాన్ని కలిగిస్తుంది.

ఇక్కడ రక్షణ కల్పించే వారు లేకపోవడంతో కొంత మంది తమ భూములను వదిలి ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. పరిపాలనా యంత్రాంగం కూడా వారి గొంతును అణిచివేసేందుకు ప్రయత్నిస్తోంది; ఇకపై వారు ఎవరినీ నమ్మరు.

సోన్‌భద్రలోని చిన్న గ్రామమైన పావిలో నివసించే లాలీ దేవి కథ ఒక తల్లి బాధను, ఒక పేద కుటుంబపు నిస్సహాయతను ప్రతిబింబిస్తుంది. 64 ఏళ్ల లాలీ దేవి తన కుటుంబాన్ని పోషించుకోవడానికి చాలా కష్టపడుతుంది. ఆమె భర్త చనిపోయాడు; నలుగురు కుమారులు, ఒక కుమార్తెతో ఆమె కుటుంబం పరిమిత వనరులతో జీవనాన్ని గడుపుతోంది.

అది 2020 జనవరి 21 చీకటి రాత్రి. ఆదివారం, రాత్రి 8 గంటల సమయంలో అకస్మాత్తుగా మూడు పోలీసు వాహనాలు అతని ఇంటి ముందర  ఆగాయి. దాదాపు 16-17 మంది పోలీసులను చూసి లాలీ దేవి భయపడిపోయింది. ఆమెకు ఏమీ అర్థం కాకముందే పోలీసులు ఆమె ఇంటిని చుట్టుముట్టి లోపలికి ప్రవేశించి వెతకడం ప్రారంభించారు.

ఇంట్లోని సామాగ్రి చిందరవందర చేసారు; ఏమీ దొరక్కపోయినా ఇంట్లోని వస్తువులన్నీ చెల్లాచెదురుగా పడేసారు. “సార్, మీరు ఏమి చూస్తున్నారు?” అని లాలీ దేవి అడిగితే ఎవరూ సమాధానం ఇవ్వలేదు. ఆమె కళ్లలో నీళ్ళు నిండిపోయాయి, చుట్టుపక్కల వారు ఆమెని ఈ స్థితిలో చూసి ఆశ్చర్యపోయారు.

అప్పుడే పోలీసులు ఆమెని “కన్హయ్య ఎక్కడ?” అని అడిగారు. తన కొడుకు రాబర్ట్స్‌గంజ్‌కి కూలి పనికి వెళ్లాడని లాలీ దేవి సంకోచిస్తూ చెప్పింది. పోలీసులు ఆమెను, ఆమె కుటుంబాన్ని దుర్భాషలాడారు; అతని కొడుకు దొంగతనానికి పాల్పడ్డాడని ఆరోపించారు.

ఆమె చిన్న కొడుకును లాక్కుంటూ తీసుకువెళ్లి కారులో కూర్చోబెట్టారు. కన్హయ్య ఇంటికి తిరిగి రాగానే పోలీస్ స్టేషన్‌కు పంపమని చెప్పారు. లాలీ దేవి గుండె దడదడలాడింది; కానీ ఏమీ చేయలేకపోయింది.

కొంతకాలం తర్వాత, కన్హయ్య పని నుండి ఇంటికి తిరిగి వచ్చి, తల్లి నుండి కథంతా విన్నప్పుడు, “అమ్మా, నేను ఎలాంటి దొంగతనం చేయలేదు. నేను పోలీస్ స్టేషన్‌కి వెళ్తున్నాను.” అన్నాడు. లాలీ దేవి అతన్ని ఆపడానికి ప్రయత్నించింది, కాని కొడుకు, “బాధపడకు అమ్మా. పోలీసులు మమ్మల్ని ఏమీ చేయరు.”అని వెళ్ళాడు.

రాత్రి, ఇద్దరు పోలీసులు మోటారు సైకిల్‌పై వచ్చి, “ఊరిలో భజన్ ఇంట్లో దొంగతనం చేశావా?” అని కన్హయ్యను అడిగారు. కొడుకు, “అయ్యా, మేమేమీ దొంగతనం చేయలేదు” అన్నాడు. పోలీస్ స్టేషన్‌కు రమ్మన్నారు. లాలీ దేవి తాను కూడా వస్తానని వేడుకుంటే పోలీసులు అడ్డుకున్నారు.

కన్హయ్యను పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు; లాలీ దేవి తన కుమారుడి కళ్లలో కన్నీళ్లు చూసి గుండెలు బాదుకుంది. ఆ రాత్రి ఇంట్లో వంట చేయకపోవడంతో కుటుంబసభ్యులు రాత్రంతా అశాంతితో పస్తున్నారు.

తెల్లవారగానే లాలీ దేవి, ఆమె కోడలు మాయ పోలీస్ స్టేషన్‌కు వెళ్ళారు, కానీ  పోలీసులు వారిని కలవడానికి అనుమతించలేదు. పోలీసు స్టేషన్‌లో కూర్చొని వేచి చూసినా పోలీసులు స్పందించలేదు. చివరికి స్టేషన్ ఆఫీసర్  ఒక పోలీసును పంపి, కొడుకును కలవమని చెప్పాడు.

కొడుకు గుండె పగిలేలా ఏడుస్తూ, “అమ్మా, నేనేమీ దొంగతనం చేయలేదు” అని చెప్పాడు, అది విన్న లాలీదేవి కళ్లలో నీళ్లు ఆగడం లేదు. అయితే పోలీసులు ఆమె చేయి పట్టుకుని పోలీస్ స్టేషన్ నుంచి బయటకు నెట్టేసారు.

స్టేషన్ ఆఫీసర్  “ఆధార్ కార్డ్ తీసుకువస్తేనే ఇంటికి పంపిస్తాం” అన్నాడు. లాలీ దేవి త్వరత్వరగా ఇంటికి వెళ్లి తన కొడుకు ఆధార్ కార్డుతో తిరిగి వచ్చింది, అయితే పోలీసులు ఆమెకు నాలుగు గంటల వరకు సమయం ఇచ్చారు. ఆ తరువాత అతనిపై గంజాయి  కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరుస్తామని పోలీసులు తెలిపారు.

అది విని లాలీదేవి కుప్పకూలిపోయింది. ఏడుస్తూ ఇంటికి తిరిగి వచ్చింది, పోలీసులు ఆమె కొడుకును కోర్టులో హాజరుపరిచి జైలుకు పంపారు.

నాలుగు నెలలు గడుస్తున్నా, కుమారుడి బెయిల్ కోసం కుటుంబీకులు తమ నగలు అమ్మి అప్పులు చేసినా ఇంతవరకు విడుదల కాలేదు. లాలీ దేవి ప్రకారం, “ప్రతి రాత్రి మేము మా బిడ్డకు ఏమి జరుగుతుందో అని ఆలోచిస్తాము. అతని పిల్లలు కూడా ప్రతిరోజూ ‘నాన్న ఎప్పుడు వస్తారు?’ అని అడుగుతుంటే నాకు నిద్ర పట్టడం లేదు.”

లాలీ దేవి తనకు న్యాయం చేయాలని వేడుకుంటోంది. “నా కొడుకుపై తప్పుడు కేసు పెట్టి జైలుకు పంపిన పోలీసులపై చట్టపరమైన చర్యలు తీసుకుని మాకు న్యాయం చేయాలి. మా కుటుంబం మళ్లీ సంతోషాన్ని పొందాలి” అంటుంది.

తన కొడుకు నిర్దోషి అని నిరూపించి అతనికి న్యాయం చేయాలని పోరాడుతున్న నిస్సహాయ తల్లి రోదన ఈ కథ.

 ఉత్తరప్రదేశ్ పోలీసుల పాత్ర, ముఖ్యంగా సోన్‌భద్రలోని ఆదివాసీ ప్రాంతాలలో, కఠినమైన అణచివేత యంత్రాంగంగా తయారైంది. పేద, నిరుపేద ఆదివాసీ కుటుంబాలపై పోలీసుల దౌర్జన్యం ఇక్కడ సర్వసాధారణమైంద;, ఇక్కడ వారికి న్యాయం జరగకపోవడమే కాకుండా అమానవీయంగా ప్రవర్తిస్తున్నారు.

పోలీసుల ఈ పనితీరు వారి హక్కులను ఉల్లంఘించడమే కాకుండా, సమాజంలోని బలహీన వర్గాల పట్ల ఉదాసీనత, సున్నితతత్వం లేకపోవడాన్ని నొక్కి చెబుతుంది. పోలీసులు ఆదివాసులపై చిన్న చిన్న నేరాలకు పాల్పడ్డారనే తప్పుడు కేసుల్లో ఇరికిస్తున్నారు. ఉదాహరణకు, పోలీసులు కొన్నిసార్లు ఆదివాసీ యువకులను మాదకద్రవ్యాల కేసుల్లో ఇరికిస్తారు, వారి వద్ద గంజాయి లేదా ఇతర డ్రగ్స్ ఉన్నట్లు ఆరోపిస్తున్నారు. ఇటువంటి ఆరోపణలు వారి స్వేచ్ఛను హరించడమే కాకుండా వారి సామాజిక , ఆర్థిక జీవితాన్ని నాశనం చేస్తాయి.

సోన్‌భద్ర జిల్లాలోని చిన్న గ్రామానికి చెందిన పాపికి చెందిన మాయాదేవి (30) కళ్లలో నీళ్లు ఆగడం లేదు. భర్త కన్హయ్య లాల్, ముగ్గురు చిన్న పిల్లలతో కూలీపనులు చేస్తూ ఎలాగోలా బతుకుతున్న మాయాదేవి జీవితం ఒక్క క్షణంలో తలక్రిందులైపోయింది.

అది 2024 జనవరి 21 రాత్రి సుమారు 8 గంటలు. అకస్మాత్తుగా అతని ఇంటి ముందు మూడు పోలీసు వాహనాలు ఆగాయి. వాటిలోంచి దిగిన 16-17 మంది పోలీసులను చూసి, మాయా దేవి హృదయం భయాందోళనలకు గురైంది; ఇంటి వెలుపల జనం గుమిగూడారు.

మాయాదేవి మాట్లాడుతూ, “అప్పట్లో మేం పెద్ద నేరస్తులమేమో అనిపించింది. పోలీసులు అన్ని వైపుల నుండి మా ఇంటిని చుట్టుముట్టారు. మాకు సమాచారం ఇవ్వకుండా, వారు మా ఇంట్లోకి ప్రవేశించి వెతకడం ప్రారంభించారు.

ఇంట్లోని వస్తువులన్నీ చెల్లాచెదురు చేశారు; బియ్యం, పప్పులు, బట్టలు కూడా బయట పడేశారు. మా పిల్లలు భయపడిపోయి ఏడుస్తున్నారు; ఏమి జరుగుతోందో మాకు అర్థం కాలేదు.

కన్హయ్యని పోలీసులు తిడుతూనే వున్నారు. మాయా దేవి భయపడుతూ అడిగింది, “అయ్యా, ఏమిటి విషయం?” దీనిపై పోలీసు ఆమెని బూతులు తిడుతూ, “నీ భర్త దొంగ, దొంగతనం చేసాడు” అన్నాడు.

మాయా దేవి, “మేం కష్టపడి సంపాదించుకుంటాం సార్, మా భర్త అలా చేయడు” అని వివరించడానికి ప్రయత్నించింది. కానీ పోలీసులు ఆమె చెప్పిన ఒక్క మాటను కూడా వినడానికి నిరాకరించారు. పదేపదే ప్రశ్నిస్తూనే ఉన్నారు.

తన భర్త పని నిమిత్తం రాబర్ట్స్‌గంజ్‌కు వెళ్లాడని మాయా దేవి చెప్పింది. ఇది విన్న పోలీసులు అతని బావ అరుణ్‌ని పట్టుకుని కారులోకి తోసేశారు. వెళ్ళేటప్పుడు, కన్హయ్య ఇంటికి తిరిగి వచ్చాక, అతన్ని పోలీస్ స్టేషన్‌కు పంపండి అని చెప్పారు. “మా చేతులు , కాళ్ళు వణుకుతున్నాయి, మాకు ఏమి చేయాలో తెలియలేదు” అని మాయా దేవి చెప్పింది.

పోలీస్ స్టేషన్‌లో అవమానం, నిస్సహాయత:

అరెస్టయిన ఆదివాసీ యువకులను, మహిళలను పోలీస్ స్టేషన్లలో అనాగరికంగా ప్రవర్తించడం పోలీసుల అనుచిత వైఖరికి అద్దం పడుతోంది. అరెస్టయిన గిరిజనులను బలవంతంగా ఊడ్చి, తుడుచుకోవడం, కొట్టడం, ఆకలి, దాహం వేయడం, అమానవీయంగా చిత్రహింసలు పెట్టడం పోలీసుల సాధారణ వ్యవహార శైలిగా మారింది.

ఈ క్రూరత్వం ఆదివాసీ సమాజం పట్ల వారికి గల ద్వేషాన్ని; ధిక్కార ఆలోచనను బహిర్గతం చేస్తుంది.

సాయంత్రం పని నుంచి వచ్చిన కన్హయ్యకు విషయం తెలియడంతో భయాందోళనకు గురయ్యాడు. మళ్లీ పోలీసులు ఇంటికి వచ్చి, “రండి, సార్ పిలిచారు, మీపై దొంగతనం ఆరోపణలు వచ్చాయి” అన్నారు. కన్హయ్య బిడియంగా అన్నాడు, “సార్, మేము ఎలాంటి దొంగతనం చేయలేదు,” కానీ పోలీసులు టమాటో పాటు రమ్మన్నారు.

మాయా దేవి వారి వెనుకనే పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది; కాని పోలీసులు ఆమెను వెళ్లిపొమ్మన్నారు, “విచారణ చేసి  వదిలేస్తాం” అని చెప్పారు.

మాయా దేవి, ఆమె కుటుంబ సభ్యులకు రాత్రంతా నిద్రపట్టలేదు. మాయాదేవి ఉదయం 7 గంటలకు అత్తగారితో కలిసి పోలీస్ స్టేషన్‌కు చేరుకుంది, అయితే పోలీసులు ఆమెను భర్తను కలవడానికి అనుమతించలేదు. పోలీస్ స్టేషన్‌లోనే కూర్చొని, తన భర్తను కలవనివ్వమని వేడుకొంది; ఆ తరువాత అనుమతినిచ్చారు.

మాయా దేవి తన భర్తను చూడగానే ఏడుస్తున్నాడు. అది చూసిన మాయాదేవి, అత్తగారి కళ్లలో నీళ్లు తిరిగాయి. “మా గుండెలు పగిలిపోవడం ప్రారంభించాయి. ‘నేనేమీ దొంగతనం చేయలేదు, నన్ను ఇరికిస్తున్నారు’ అన్నాడు. ఇలా అంటూ అతను మళ్లీ ఏడవడం మొదలుపెట్టాడు” అని మాయా దేవి చెప్పింది.

దీని తర్వాత, పోలీసులు మాయాదేవిని , ఆమె అత్తగారిని పోలీస్ స్టేషన్ నుండి బయటకు పంపేసారు. తన భర్త నిర్దోషి అని, అతడిని విడుదల చేయాలని మాయాదేవి ఎస్‌హెచ్‌ఓ సాహెబ్‌ను వేడుకుంటే, అతను ఆధార్ కార్డు తీసుకురావాలని కోరాడు. ఇది విన్న మాయా దేవి బహుశా తన భర్తను విడిచిపెట్టవచ్చునని భావించింది. ఆమె త్వరగా ఆధార్ కార్డుతో తిరిగి వచ్చింది, అయితే పోలీసులు ఆమెను సాయంత్రం 4 గంటలకు రమ్మన్నారు.

నాలుగు గంటల వరకు ఎదురుచూసి పోలీస్‌స్టేషన్‌కు చేరుకోగానే ఓ పోలీసు ఆమెను దుర్భాషలాడుతూ గేటు బయటికి రమ్మని, మళ్లీ వస్తే తాళం వేస్తానని బెదిరించాడు.

ఆమె ఏడుస్తూ పోలీస్ స్టేషన్ నుండి బయటకు వచ్చింది, గంజాయి దొరికిందనే ఆరోపణతో తన భర్తను కోర్టులో హాజరుపరిచినట్లు తెలిసింది. మాయా దేవి మాటల్లో చెప్పాలంటే, “మా కాళ్ళ క్రింద నుండి నేల కదిలిపోయినట్లు అనిపించింది.”

పోలీసులు ఆమె భర్తను కోర్టులో హాజరుపరిచి రాబర్ట్స్‌గంజ్ జైలుకు తరలించారు. మాయాదేవి , ఆమె కుటుంబం తన భర్తను విడిపించేందుకు నగలు కూడా అమ్మి, వడ్డీకి డబ్బు తీసుకుంది, కానీ మూడు నెలలు గడిచినా ఇప్పటివరకు బెయిల్ రాలేదు.

“ప్రతి రాత్రి మేము మా పిల్లలకు ఏమి జరుగుతుందో అని ఆలోచిస్తాము. పాప ఎప్పుడు వస్తుందని పిల్లలు అడుగుతారు, నా దగ్గర సమాధానం లేదు” అని మాయా దేవి చెప్పింది.

మాయా దేవి న్యాయం కోసం వేడుకుంటోంది. “నా భర్త తప్పుడు ఆరోపణల్లో చిక్కుకున్నాడు. మాకు న్యాయం జరిగాలి ఈ పోలీసు చర్యపై న్యాయమైన విచారణ జరగాలి; నా భర్తను విడుదల చేయాలి. మళ్లీ తమ ఇంటికి పోలీసులు వస్తారేమోనన్న భయంతో తన కుటుంబం బతుకుతున్నదని మాయా దేవి చెప్పింది.

పోలీసుల నిర్లక్ష్యానికి, ఒత్తిళ్లకు బలి అవుతున్న కుటుంబాలన్నింటి కథ ఇది. మాయా దేవి యొక్క ఈ అభ్యర్థన పేద , బలహీన ప్రజల గొంతులను తరచుగా అణచివేసే సమాజానికి సంబంధించిన చిత్రం.

ఆకలితో, దాహంతో లాకప్‌లో ఉంచారు:

స్థానిక రౌడీలు, పోలీసుల మధ్య ఉన్న అనుబంధం ఆదివాసీలకు పెద్ద శాపంగా మారింది. పోలీసుల రక్షణలో వారి భూములను రౌడీలు స్వాధీనపరుచుకుంటున్నారు; నిరసన తెలిపితే పోలీసుల వేధింపులకు గురవుతున్నారు.

చాలాసార్లు ఆదివాసీ కుటుంబాలు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళితే పోలీసులు పట్టించుకోకపోవడమే కాకుండా రౌడీలతో కలిసి బెదిరించడం లేదా తప్పుడు కేసుల్లో ఇరికించడం చేస్తుంటారు.

జనవరి 10, 2024 సాయంత్రం, సోన్‌భద్ర జిల్లా కరాహి గ్రామానికి చెందిన మురళీ రామ్ జీవితంలో అలాంటి బాధను తెచ్చిపెట్టింది, దాని బాధ ఇప్పటికీ అతని హృదయంలో తాజాగా ఉంది. 48 ఏళ్ల మురళీరామ్ తన కుటుంబ పోషణ కోసం కూలి పని చేస్తూ జీవితాన్ని గడిపేవాడు. ఇతనికి ఇద్దరు కుమారులు , ఒక కుమార్తె ఉన్నారు; వ్యాపారం ద్వారా ఇంటి ఖర్చులను ఎలాగోలా నిర్వహిస్తున్నాడు.

ఆ రోజు మధ్యాహ్నం 3 గంటల సమయంలో అకస్మాత్తుగా రెండు పోలీసు వాహనాలు ఆయన ఇంటికి చేరుకున్నాయి. మురళీరామ్ పనిలో ఉండగా, అతని కుమార్తె సునీత ఫోన్‌లో భయాందోళనకు గురై, పోలీసులు ఇంటికి వచ్చి తనను పిలుస్తున్నారని చెప్పారు. మురళీ రామ్ పని వదిలి ఇంటికి చేరుకున్నాడు, అక్కడ పోలీసులు అతని చిన్న కొడుకు మహేంద్ర గురించి విచారించడం ప్రారంభించారు.

ప్రమాదం జరిగిన తర్వాత తన తల్లిని చూసుకోవడానికి మహేంద్ర బనారస్‌లోని ఆసుపత్రికి వెళ్లాడని చెప్పాడు. కానీ పోలీసులు అతని మాటలను పట్టించుకోకుండా, “మీ కారు తీసుకొని బనారస్ వెళ్లండి, మేము కొంత విచారణ చేయాలి” అన్నారు.

మురళీరామ్ కారులో పోలీసులతో బయలుదేరాడు, అయితే అతను ఆసుపత్రికి చేరుకున్న వెంటనే, అతని కొడుకును పిలవమని పోలీసులు కోరారు. మహేంద్ర ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి ఉండడంతో మురళీరామ్ అతనికి ఫోన్ చేయలేకపోయాడు. నౌఘర్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి విడిచిపెడతామని పోలీసులు మళ్లీ చెప్పారు.

పోలీస్‌స్టేషన్‌కు చేరుకోగానే పోలీసులు వారి కారును బయట పార్క్‌ చేసి కారు కీలు, పత్రాలు, మొబైల్‌ను తీసుకెళ్లారు. అనంతరం పోలీస్ స్టేషన్‌లోకి తీసుకెళ్లి లాకప్‌లో బంధించారు. మురళీరాం భయపడిపోయి , “సార్ నన్ను ఎందుకు లాకప్‌లో వేస్తున్నారు?” అని భయంగా అడిగాడు. అయితే ఆయన మాటలకు ఎవరూ స్పందించలేదు.

మురళీరాం ఆ రాత్రంతా ఆకలితో, దాహంతో లాకప్‌లోనే కూర్చున్నాడు. చలితో వణికిపోతూ, డెబ్బై వేల రూపాయలు అవసరమయ్యే ఆపరేషన్ కోసం తన భార్య ఆసుపత్రికి వెళ్లడంపై రాత్రంతా ఆందోళన చెందాడు.

పోలీసులు ఎందుకు వేధిస్తున్నారని రాత్రంతా అతని మదిలో ఈ ఆలోచన వస్తూనే ఉంది. ఉదయం 11 గంటల ప్రాంతంలో చలి నుంచి బయటపడేందుకు ఎండలో కూర్చోవడానికి పోలీసులను అనుమతి కోరారు.

కాసేపు ఎండలో కూర్చున్న మురళీరాం పోలీస్ స్టేషన్ వెనుక నుంచి పెద్ద ప్లాస్టిక్ సంచిలో ఏదో తెచ్చి పోలీస్ జీపులో పెట్టడం చూశాడు. అప్పుడు జీపులో ఒక అబ్బాయిని కూడా కూర్చోబెట్టి, అతనితో పాటు మురళీరామ్ కారుని కూడా తీసుకెళ్లారు. ఒక గంట తరువాత, పోలీసు జీపు తిరిగి వచ్చింది, మురళీ రామ్ తన కారులో అదే గోనె సంచిని ఉంచడం చూశాడు. అనంతరం అదే సంచిలో గంజాయి ఉంచినట్లు గుర్తించారు.

పోలీసులు హ్యాండ్‌ఓవర్ కాగితాలపై సంతకం చేసి అతనిని విడిచిపెట్టారు, కాని అతని కారు , మొబైల్‌ను స్వాధీనం చేసుకున్నారు. మురళీరాం మనసు చంచలమైంది, పోలీసులు తనకు ఇంత పెద్ద అన్యాయం ఎందుకు చేస్తున్నారో అర్థం కాలేదు.

ఇంటికి చేరుకుని పరిశీలించగా కారులో 21 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. అది విన్న మురళీరామ్‌కి మతి పోయింది. అతని భార్య ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతోంది, ఇక్కడ పోలీసులు అతనిపై తప్పుడు కేసులు పెట్టి జీవితాన్ని నాశనం చేశారు.

నిరంతర బెదిరింపులు:

కొన్ని రోజుల తర్వాత, పోలీసులు మళ్లీ అతని ఇంటిపై దాడి చేసి, అతని కుమారుడు మహేంద్రను పోలీస్ స్టేషన్‌లో హాజరుపరచకపోతే, అతనిని , అతని పెద్ద కొడుకును కూడా అరెస్టు చేస్తామని బెదిరించారు. 2024 జనవరి 23న మురళీరామ్ తన కొడుకు మహేంద్ర కోర్టులో లొంగిపోవాల్సి వచ్చింది.

దీంతో పోలీసులు అతడిపై దొంగతనం ఆరోపణలపై కేసు నమోదు చేసి జైలుకు తరలించారు. మూడు నెలల తర్వాత, అతను హైకోర్టు నుండి బెయిల్ పొందాడు, కానీ 20 రోజుల తర్వాత, పోలీసులు మళ్లీ గ్యాంగ్‌స్టర్ చట్టంను ప్రయోగించి జైలుకు పంపారు.

మురళీరామ్ మాట్లాడుతూ “పోలీసులు నా కొడుకు జీవితాన్ని నాశనం చేశారు. ఆమె పెళ్లి తేదీ ఏప్రిల్ 20న జరిగింది, అయితే పోలీసులు ఆమె కలలను, భవిష్యత్తును నాశనం చేశారు. కొడుకుని కలవడానికి వెళ్తే.. ‘పాపా, నన్ను త్వరగా బయటకు తీసుకెళ్లు లేకపోతే నా ప్రాణం పోతుంది’ అని ఏడుస్తూ చెప్పాడు.

“ఇక్కడ చాలా పని చేయిస్తారు, ఊడిపిస్తారు, కాలువలు శుభ్రం చేయిస్తారు. ఖాళీ సమయం దొరికినప్పుడు, మేము ఇటుక పని చేయిస్తారు. భరించలేకపోతున్నాను” అని బాధ పడ్డాడు.

మురళీరామ్ మనసులో ఇప్పుడు ఒకే ఒక ఆశ ఉంది, అది న్యాయం. “మేము నిరుపేద కూలీలం, మా ఏకైక డిమాండ్ ఈ విషయంపై న్యాయమైన విచారణ జరగాలి; దోషులైన పోలీసులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. “మాకు న్యాయం , భద్రత లభిస్తుంది, తద్వారా మా కుటుంబం మళ్లీ శాంతితో జీవించగలదు.”

ఇన్ స్పెక్టర్ ‘ రాజీ ‘ చేసుకోమన్నాడు:

సోన్‌భద్ర జిల్లాలోని రేణుకోట్ నగర్ పంచాయితీకి చెందిన విజయ్ శంకర్‌కి, 9 ఫిబ్రవరి 2024 అనేది అతను ఎప్పటికీ మరచిపోలేని రోజు. 32 ఏళ్ల విజయ్ శంకర్ తన కుటుంబ పోషణ కోసం కూలి పని చేస్తూ జీవితాన్ని గడుపుతున్నాడు. అతని కుటుంబం వారి రోజువారీ అవసరాలను తీర్చడానికి చాలా కష్టపడుతుంది. కానీ ఆ రోజు అతని కుటుంబానికి జరిగిన సంఘటన అతని జీవితంలో భయం , నిస్సహాయత యొక్క కొత్త అధ్యాయాన్ని జోడించింది.

ఇది శుక్రవారం. అమృత్‌లాల్‌ యాదవ్‌, నీరజ్‌ యాదవ్‌, శైలేంద్రసింగ్‌ వంటి శక్తివంతమైన వ్యక్తులు కొందరు కూలీలు, తాపీ మేస్త్రీలతో కలిసి విజయ్‌ శంకర్‌ ఇంటిముందుకు వచ్చి రోడ్డుపై అక్రమ హద్దులు వేయడం ప్రారంభించారు. విజయ్ శంకర్ తల్లి విలాసి దేవి 112 నంబర్‌కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించింది. కొంతసేపటికి నలుగురు సభ్యులతో కూడిన పోలీసు బృందం అక్కడికి చేరుకుని పనులను నిలిపివేసింది.

మరుసటి రోజు ఫిబ్రవరి 10వ తేదీ ఉదయం 10 గంటలకు మళ్లీ అదే వ్యక్తులు కూలీలతో వచ్చి పనులు ప్రారంభించారు. విజయ్ శంకర్ , అతని కుటుంబం నిరసన వ్యక్తం చేస్తూ, “అకౌంటెంట్ , పట్వారీని పిలిచి సరిహద్దును కొలవండి, కానీ మీరు మా రహదారిని ఎందుకు అడ్డుకుంటున్నారు?” అని ప్రశ్నించారు.

ఇది విన్న రౌడీలు కోపంతో దుర్భాషలాడారు. వారు విజయ్ శంకర్ తల్లిని నేలపైకి తోసి కొట్టడం ప్రారంభించారు. వారు అతని తల్లి చీర లాగి ఆమెను కొట్టారు, అలాగే విజయ్ శంకర్‌ను కర్రలతో కొట్టారు; పిడిగుద్దులు కొట్టారు. విజయ్ శంకర్ గొంతు విని, అతని సోదరి, కుమార్తె , భార్య కూడా బయటకు వచ్చారు, అయితే రౌడీలు వారిని కూడా వదిలిపెట్టలేదు , అందరినీ దారుణంగా కొట్టారు. విజయ్ మాట్లాడుతూ ”అప్పట్లో మా ప్రాణాలు పోయేవి కావు. మేము అరుస్తున్నాము , ఏడుస్తున్నాము, కానీ వారు కనికరం చూపలేదు.

కొంత సేపయ్యాక, ఇరుగుపొరుగు రాణా జీ , సంజయ్ శ్రీవాస్తవ పోలీసు పోస్ట్‌కి వెళ్లి సహాయం కోసం వేడుకున్నారు, అయితే పోలీసులు వాయిదా వేశారు , ఆలస్యం చేశారు. రౌడీలు వెళ్లగానే పోలీసులు వచ్చారు.

విజయ్ , అతని కుటుంబ సభ్యులు చేతులు జోడించి పోలీసులను వేడుకున్నారు, అయితే పోలీసులు వీడియో గురించి,  వీడియో ఎవరు చేసారు అని మాత్రమే అడిగారు. ఇరుగుపొరుగు వారు వీడియో తీశారని విజయ్ చెప్పాడు.

పోలీసులు విజయ్ శంకర్ , అతని కుటుంబ సభ్యులను పోస్ట్‌కు పిలిచారు. పరిస్థితి విషమంగా ఉన్న విజయ్ తల్లి చేతులు కట్టుకుని పోస్టు వద్ద నిల్చుంది. అయితే పోలీసులు వారి మాట వినకపోవడంతో వారిని ఇంటికి పంపించారు.

తరువాత, ఎవరో ఈ సంఘటన యొక్క వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేసారు, దీని తరువాత విజయ్ , అతని కుటుంబం సాయంత్రం మళ్లీ పోలీస్ స్టేషన్‌కు వెళ్లవలసి వచ్చింది. అక్కడ ఎస్‌హెచ్‌ఒ, సిఒ అతని మాట పూర్తిగా విన్నారు, కానీ చర్య పేరుతో ఎటువంటి నిర్దిష్ట చర్యలు తీసుకోలేదు.

అనంతరం ముఖ్యమంత్రిని ట్యాగ్ చేస్తూ వీడియో పోస్ట్ చేయడంతో ఎఫ్ఐఆర్ నమోదైంది. దీని తర్వాత, మరుసటి రోజు పోలీసులు విజయ్ తల్లిని వైద్య చికిత్స కోసం మయూర్‌పూర్ ఆసుపత్రికి తీసుకెళ్లి ఎక్స్-రే చేయించారు. సిఒ సాహిబ్ కూడా వచ్చి, సంఘటన స్థలాన్ని పరిశీలించి, “పోస్ట్‌కి వెళ్లి విషయాన్ని పరిశీలించండి” అని చెప్పారు.

పోస్ట్‌కి చేరుకున్న ఇన్‌స్పెక్టర్, “రాజీ చేసుకోండి” అన్నాడు. విజయ్ , అతని తల్లి రాజీకి నిరాకరించారు. విజయ్ వివరిస్తూ, “మా అమ్మ పరిస్థితి విషమంగా ఉంది, మమ్మల్ని రాజీ చేసుకోమని అడిగారు. మేము పేద ఆదివాసీలం, కానీ మాకు న్యాయం కావాలి.

విజయ్ కుటుంబం ఇప్పటికీ భయంతో జీవిస్తోంది. రౌడీలు బహిరంగంగా తిరుగుతూ కుటుంబాన్ని చంపేస్తామని బెదిరిస్తున్నారు. విజయ్ మాట్లాడుతూ “పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు, రౌడీలను కూడా అరెస్టు చేయలేదు. మేము భయపడుతున్నాము, మేము పనికి వెళ్ళడానికి కూడా భయపడుతున్నాము.

తనను కాపాడుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేసిన విజయ్ వృద్ధ తల్లి కూడా ఈ అన్యాయానికి గుండెలవిసేలా ఉంది. విజయ్ మాట్లాడుతూ, “మేము పేద ఆదివాసులం, మేము ఎవరికీ హాని చేయలేదు, అయినప్పటికీ మాకు అలాంటి అన్యాయం జరుగుతోంది. మాకు న్యాయం కావాలి, తద్వారా మా కుటుంబం మళ్లీ సురక్షితంగా ఉండగలుగుతుంది.

రౌడీల ధైర్యం మరింత పెరిగింది:

సోన్‌భద్ర జిల్లాలోని రేణుకూట్ నగర్ పంచాయతీ వెనుక ఉన్న ముర్దవ అనే చిన్న గ్రామ నివాసి అయిన విలాసి దేవి ఆ భయంకరమైన రోజును ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నది. 54 ఏళ్ల విలాసి దేవి, ఆమె కుటుంబం ఆ రోజు అనుభవించిన బాధ, ఆక్రోశం, అవమానాలు ఇప్పటికీ వారి కళ్లలో కనిపిస్తాయి.

కూలిపనుల ద్వారా కుటుంబాన్ని పోషించుకునే ఈ మహిళ కుటుంబం 10 ఫిబ్రవరి 2024న ఈ దారుణానికి బలైపోయింది, దురదృష్టవశాత్తు పోలీసుల ఉదాసీనత వారి ఆశలను మరింత ఛిద్రం చేసింది.

అది శనివారం, ఉదయం 11 గంటల ప్రాంతంలో. అమృత్ లాల్ యాదవ్, నీరజ్ యాదవ్, శైలేంద్ర సింగ్ వంటి రౌడీలు వారితో పాటు 10-12 మంది ముఠాగా వచ్చి అతని ఇంటి ముందు రోడ్డును ఆక్రమించడం ప్రారంభించారు. ఇదే రహదారి గుండా విలాసి దేవి కుటుంబసభ్యులు, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు తమ పనుల నిమిత్తం రాకపోకలు సాగిస్తుంటారు.

విలాసి దేవి , ఆమె కుమారుడు విజయ్ శంకర్ వారిని అడ్డుకోవడానికి ముందుకు వచ్చి, “అన్నా, ఇది మేం తిరిగే రోడ్డు దీన్ని అడ్డుకోవద్దు” అని చెప్పారు. అయితే ఇది విన్న రౌడీలు అతడిని తిట్టడమే కాకుండా తోసి నేలపై పడేశారు.

విలాసి దేవి చీర లాగి, ఆమె కొడుకు, కోడలుపై కూడా దారుణంగా దాడి చేశారు. విలాసి దేవి కంఠం వణికిపోతూ, “ఈరోజు ఇక చనిపోతామని అనిపించింది. వారి చేతుల్లో కర్రలు, గడ్డపారలు ఉన్నాయి. మా ప్రాణాలంటే వారికి ఏ మాత్రం  విలువ లేదు.

వారి అరుపులు విన్న గ్రామానికి చెందిన ఓ బాలుడు ఘటన మొత్తాన్ని వీడియో తీశాడు. గొడవ అనంతరం రౌడీలు తమ కారులో కూర్చుని పోలీస్ స్టేషన్ వైపు వెళ్లారు. ఎలాగోఅలా భయం, ఆందోళనలతో విలాసి దేవి, ఆమె కొడుకు విజయ్, కోడలు పోలీస్ స్టేషన్‌కి చేరుకున్నారు. అక్కడికి చేరుకున్న తర్వాత తనకు న్యాయం చేయాలని ఇన్‌స్పెక్టర్‌ను వేడుకొన్నారు.. పోలీసులు సాయం చేస్తారని ఆశించారు.

కానీ భయపడినట్లే జరిగింది. పోలీసులు వారి మాటలు వినడానికి బదులు  వారినే తిట్టి, ఇంటికి వెళ్లిపొమ్మన్నారు. విలాసి దేవి , ఆమె కుటుంబ సభ్యులు చేతులు జోడించి, “అయ్యా, దయచేసి మా మాట వినండి, మేము పేదవాళ్ళం, మాకు డబ్బు లేదు, అధికారం లేదు” అని వేడుకున్నారు. కానీ పోలీసులు వారిని పట్టించుకోలేదు.

విలాసి దేవి ఇలా చెప్పింది, “రాత్రంతా బాధతో ఏడుస్తూనే ఉన్నాడు, కళ్ళ నుండి కన్నీళ్లు ఆగలేదు. మా నిస్సహాయతను చూసి ఎవరూ జాలిపడలేదు. ఎలాగోలా రాత్రి గడిపి మళ్లీ ఉదయానికి లాపరి పోలీస్ స్టేషన్‌కి చేరుకున్నాం. వీడియో ఇప్పటికే వైరల్ అయింది, కానీ ఎటువంటి చర్య తీసుకోకుండా, స్టేషన్ ఆఫీసర్ కేవలం వీడియో ఎవరు చేసారు? అని విచారణ చేయడం మొదలు పెట్టాడు.

అవుట్ పోస్టుకు చేరిన తర్వాత కూడా ప్రశ్నలే ఎదుర్కోవాల్సి వచ్చింది కానీ, విచారణ పేరుతో ఏమీ చేయలేదు. ఆ రోజు సిఓ , ఎస్‌ఒ విచారణ కోసం గ్రామానికి వచ్చారు, కానీ ఆ తర్వాత తదుపరి చర్యలు ఏవీ తీసుకోలేదు. దాంతో రౌడీల ధైర్యం మరింత పెరిగిపోయింది.

అత్యంత దూకుడుగా వ్యవహరించిన శైలేంద్ర యాదవ్ ఇప్పుడు బహిరంగంగానే బెదిరింపులకు దిగుతున్నాడు. “మీకు ఏమీ జరగలేదు, ఈసారి నిన్ను చంపి మాయం చేసేస్తాం” అన్నాడు.

వారి బెదిరింపుల వల్ల నిత్యం భయంతో జీవిస్తున్నాం’ అని విలాసి దేవి చెప్పారు. రాత్రి నిద్ర పట్టదు, పగలు పనికి వెళ్లాలని అనిపించదు. ఈ రౌడీలు ఏమి చేస్తారో అనే భయం ఎప్పుడూ వెంటాడుతూంటుంది. పోలీసుల సహాయంతో మరింత భయం లేకుండా తయారయ్యారు.”

విలాసి దేవి , ఆమె కుటుంబం ఇప్పుడు న్యాయం కోసం నానా పాట్లు పడుతున్నారు.. “మేము పేద ఆదివాసీలం. మాకు ఇంత అన్యాయం చేయడానికి మేం ఎవరికీ ఏం చేసాము? మా ముసలి తల్లులు, కుమార్తెలు , కొడుకులు, ఎవరినీ ఈ రౌడీలు వదలడం లేదు. మాపై జరిగిన వ్యవస్థీకృత హింసపై న్యాయమైన విచారణ జరగాలని మేము కోరుకుంటున్నాము.

నవంబర్ 6, 2024

(విజయ్ వినీత్ బనారస్‌కి చెందిన సీనియర్ జర్నలిస్ట్. సోన్‌భద్ర నుండి అతని క్షేత్రస్థాయి రిపోర్ట్)

Leave a Reply