సియాంగ్ నదిపై కట్ట తలపెట్టిన విద్యుత్ ప్రాజెక్టు ఆదివాసీల భూములను ముంపుకు గురిచేసే ప్రమాదం ఉంది. జూలై 8న కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పర్యటనకు ముందు డ్యామ్ నిర్మాణ వ్యతిరేక కార్యకర్తలు యిద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

జూన్ 22న, అరుణాచల్ ప్రదేశ్‌లోని ఎగువ సియాంగ్ జిల్లా యంత్రాంగం 12 గ్రామాల పంచాయతీ సభ్యులు, పెద్దలతో సమావేశాన్ని ఏర్పాటు చేసింది. సియాంగ్ నదిపై ప్రతిపాదిత జలవిద్యుత్ ప్రాజెక్ట్ వల్ల గ్రామాలన్నీ ప్రభావితమవుతాయి, ఈ ప్రాంత నివాసితులు సంవత్సరాలుగా తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు. టిబెట్ నుండి అరుణాచల్ ప్రదేశ్‌లోకి ప్రవహించే బ్రహ్మపుత్ర ప్రధాన ఉపనది సియాంగ్.

ఈ సమావేశం 10,000 మెగావాట్ల ఎగువ సియాంగ్ మల్టీపర్పస్ స్టోరేజీ ప్రాజెక్ట్ ప్రయోజనాల గురించి “అవగాహన కలిగించడానికి” ఉద్దేశించబడింది. ప్రాజెక్ట్ కోసం ప్రాతిపదికను సిద్ధం చేయడానికి ముందస్తు సాధ్యాసాధ్యాల సర్వేలను చేపట్టాలనేది పరిపాలనా యంత్రాంగపు నిర్ణయం. డిప్యూటీ కమీషనర్ హేగే లైలాంగ్ గ్రామ ప్రజాప్రతినిధులకు ప్రభుత్వం జిల్లా పరిపాలనా యంత్రాంగంతో  సహకరించాలని “జాతీయ ప్రయోజనాలు”, “ప్రాంత అభివృద్ధి” కోసం ముందస్తు సాధ్యాసాధ్యాల సర్వేను చేయడానికి  అనుమతినివ్వాలని విజ్ఞప్తి చేశాడు.

అయితే ప్రాజెక్టు ప్రభావిత గ్రామాలకు చెందిన ప్రజాప్రతినిధులు మాత్రం ఆనకట్ట నిర్మాణానికి తమ తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేశారు.

“ఆనకట్టను వ్యతిరేకించవద్దని సియాంగ్ డిప్యూటీ కమీషనర్ మమ్మల్ని అడిగినప్పుడు   మా గ్రామంలోని 116 కుటుంబాల అభిప్రాయాన్ని తీసుకోమని చెప్పాను. ఇక్కడ డ్యాం నిర్మిస్తే 43 కుటుంబాల ఇళ్లు నీటమునిగుతాయని దృష్టికి తెచ్చాను. మిగిలిన కుటుంబాలను వేరే ప్రాంతాలకు తరలించాల్సి వుంటుంది” అని పరోంగ్ గ్రామ అధిపతి తరోక్ సిరామ్ చెప్పారు.

అప్పర్ సియాంగ్ జలవిద్యుత్ ప్రాజెక్టును నేషనల్ హైడ్రోఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ నిర్మిస్తుంది.

ఈ మెగా పవర్ ప్రాజెక్ట్ ఎగువ సియాంగ్ జిల్లా యింగ్‌కియాంగ్ జిల్లా ప్రధాన కార్యాలయంతో సహా ఆది వర్గానికి చెందిన పూర్వీకుల భూములను ముంపుకు గురి చేస్తుందని కార్యకర్తలు అంటున్నారు.

“అనేక గ్రామాలు, పట్టణాలను ముంచెత్తే, లక్ష మంది ఆదివాసీ తెగల జనాభాను భూహీనులుగా చేసే ఈ ఆనకట్ట నిర్మాణానికి  వ్యతిరేకంగా మేం 2008-’09 నుండి నిరసనలు చేస్తున్నాము. మాకు ఆనకట్ట అవసరం లేదు. సర్వేకు ఎందుకు అనుమతినివ్వాలి? ” అని అని ఆది సముదాయపు వ్యవసాయదారుల సమిష్టి అయిన సియాంగ్ ఇండిజీనియస్ ఫార్మర్స్ ఫోరం ( స్థానిక రైతుల ఫోరం) అధ్యక్షుడు గెగాంగ్ జిజాంగ్ ప్రశ్నిస్తున్నారు.

అటువంటి సర్వేను చేపట్టే ప్రయత్నాలు ఇంతకుముందు ప్రతిఘటించారు కానీ, గత సంవత్సరం పార్లమెంటు ఆమోదించిన కొత్త అటవీ చట్టంతో గ్రామస్తులలో ఆందోళన పెరిగింది.

భారత అంతర్జాతీయ సరిహద్దుల నుండి 100 కి.మీ.లోపు వ్యూహాత్మక ప్రాజెక్టుల కోసం అడవులను మళ్లించడానికి – ఎలాంటి అటవీ అనుమతి అవసరం లేకుండానే అటవీ (పరిరక్షణ) సవరణ చట్టం, 2023, కేంద్రాన్ని అనుమతిస్తుంది. “సియాంగ్ ఆనకట్ట జాతీయ వ్యూహాత్మక ప్రాజెక్ట్‌గా కొనసాగుతోంది. కొత్త అటవీ చట్టం ప్రకారం, అటవీ క్లియరెన్స్ అవసరం లేదు” అని డ్యామ్ వ్యతిరేక కార్యకర్త భాను తాటక్ అన్నారు.

ఎగువ సియాంగ్ డిప్యూటీ కమీషనర్ హేగే లైలాంగ్ ప్రాజెక్ట్ పట్ల వ్యతిరేకత తీవ్రతను  తగ్గిస్తూ “ఒక సెక్షన్ ప్రజలు మాత్రమే దీనిని వ్యతిరేకిస్తున్నారు, మద్దతు ఇచ్చే వ్యక్తులు కూడా ఉన్నారు” అని అంటాడు.

జూన్ 22 సమావేశానికి హాజరైన టుటింగ్-యింగ్‌కియాంగ్‌లోని స్థానిక భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే అలో లిబాంగ్  “జాతీయ ప్రయోజనాల” దృష్ట్యా సర్వే కార్యకలాపాలను ప్రజలు అనుమతించాలని, “వ్యూహాత్మక ప్రాముఖ్యత”, జాతీయ భద్రతా సమస్యల కారణంగా ప్రతిపాదిత ఆనకట్ట అవసరమని అన్నాడు.

జూలై 8న, కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ML ఖట్టర్ రాష్ట్ర పర్యటనకు ముందు ఇద్దరు ఆనకట్ట వ్యతిరేక కార్యకర్తలు, ఎబోమిలీ,  డుగ్గే అపాంగ్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అపాంగ్ సియాంగ్ దేశీయ రైతుల ఫోరమ్‌కు కన్వీనర్‌గా ఉన్నారు; మిలీ అరుణాచల్ ప్రదేశ్ ఆధారిత అనేక పౌర సమాజ సంఘాలలో వున్నారు. కొన్ని గంటల తర్వాత ఇద్దరినీ వదిలిపెట్టారు.

సియాంగ్ నదిపై ప్రాజెక్టుకు తమ వ్యతిరేకతను తెలియజేస్తూ విద్యుత్ మంత్రికి మెమోరాండం సమర్పించాలనుకున్న కార్యకర్తల సమూహంలో మిలి, అపాంగ్ ఉన్నారు. “ప్రతిపాదిత సియాంగ్ మెగా డ్యామ్ సున్నితమైన పర్యావరణ వ్యవస్థలు, వన్యప్రాణుల ఆవాసాలు, జీవవైవిధ్యానికి ఆతిథ్యం ఇచ్చే మన పూర్వీకుల ఆవాసాన్ని ధ్వంసం చేస్తుంది. ఇది మన జీవన విధానానికి ముప్పు కలిగిస్తుంది” అని మెమోరాండమ్‌లో పేర్కొన్నారు.

ముందస్తు సాధ్యత సర్వే 10,000 మెగావాట్ల కెపాసిటీతో దేశంలోనే అతిపెద్ద జలవిద్యుత్ ప్రాజెక్ట్ అవుతుందని కేంద్ర ప్రభుత్వ సలహాదారు నీతి అయోగ్ 2017లో తొలిసారిగా డ్యామ్‌ను ప్రతిపాదించింది.

సియాంగ్ నది వెంబడి ఉన్న ఉగ్గెంగ్, డిట్టె డిమ్మె, పరోంగ్ ప్రాంతాలలో ఆనకట్ట నిర్మాణం సాధ్యమేనా అని అంచనా వేయడానికి ఎన్‌హెచ్‌పి‌సి (నేషనల్ హైడ్రో ఎలెక్ట్రిక్ పవర్ కార్పొరేషన్) మూడు ప్రదేశాలను ఎంపిక చేసింది.

“మేము ప్రస్తుతం ముందస్తు సాధ్యాసాధ్యాల నివేదిక కోసం దర్యాప్తు, సర్వేలు చేస్తున్నాము” అన్న అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన ఎన్‌హెచ్‌పి‌సి అధికారి, మీడియాతో మాట్లాడే అధికారం తనకు లేనందున తన పేరు బయట పెట్టవద్దన్నారు.

ప్రీ-ఫీజిబిలిటీ రిపోర్ట్ అనేది డ్యామ్ నిర్మాణానికి అయ్యే సంభావ్య వ్యయాన్ని అంచనా వేయడానికి, ఆ ప్రాంతంలో ఆనకట్టను నిర్మించవచ్చా లేదా అనేదానిని అంచనా వేయడానికి వివరణాత్మక ప్రాజెక్ట్ నివేదిక కంటే ముందుగా తయారు చేసే పత్రం. సర్వేలో రాతి ఉపరితలం బలాన్ని పరీక్షించడానికి 200 మీటర్ల లోతు రంధ్రం కూడా ఉంటుంది.

 “మేము మూడు సైట్‌ల నుండి ముందస్తు సాధ్యాసాధ్యాల నివేదికలను పోల్చి చూస్తాము. నివేదికలు, అంచనా ఆధారంగా డ్యామ్ స్థానాన్ని ఖరారు చేస్తాము, ”అని అధికారి తెలిపారు.

గత ఏడాది ఎన్‌హెచ్‌పిసి డ్యామ్ వ్యతిరేక సంఘాల నుండి వ్యతిరేకత కారణంగా సర్వేలను పూర్తి చేయలేకపోయింది.

పరోంగ్‌లో ప్రజల అనుమతి లేకుండా ఈ బృందాలు సర్వేలు నిర్వహిస్తున్నాయని ఆరోపిస్తూ సియాంగ్ స్థానిక రైతుల ఫోరం గతేడాది జూలైలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. గ్రామస్తుల ఆగ్రహానికి గురికాకుండా ఉండేందుకు ఎన్‌హెచ్‌పిసి అధికారులు తెల్లవారుజామున తమ పనిని దొంగచాటుగా నిర్వహించారని వారు ఆరోపించారు.

ముందస్తు సాధ్యాసాధ్యాల నివేదికలను సమర్పించిన తర్వాత, వివిధ ప్రభుత్వ సంస్థలు వాటిని తనిఖీ చేసి, సవివరమైన ప్రాజెక్ట్ నివేదికకు అనుమతిని ఇస్తాయని, ఆ తర్వాత పర్యావరణ, అటవీ శాఖలు  క్లియరెన్స్‌ని మంజూరు చేస్తాయి.  అని మరో ఎన్‌హెచ్‌పి‌సి అధికారి తెలిపారు .

“స్థానిక ప్రతిఘటన కారణంగా నిర్మాణాన్ని ప్రారంభించడానికి మరో ఐదు సంవత్సరాలు పట్టవచ్చు. వివరణాత్మక ప్రాజెక్ట్ నివేదిక తయారీ, పర్యావరణ, అటవీ క్లియరెన్స్ ఏక సమయంలో జరుగుతాయి” అని మరో అధికారి తెలిపారు.

చైనాను ఎదుర్కోవడానికి ఆనకట్ట:

2022 నాటి భారతీయ అంతర్-మంత్రిత్వ సాంకేతిక కమిటీ నివేదిక ప్రకారం, ఎగువ సియాంగ్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ యార్లంగ్ త్సాంగ్పో నది ఎగువన అభివృద్ధి చేస్తున్న చైనా ప్రాజెక్టుల నుండి ఎదురయ్యే ముప్పును ఎదుర్కోవడానికి నిర్మితమవుతోంది. బ్రహ్మపుత్ర లేదా సియాంగ్‌ను టిబెట్‌లో యార్లంగ్ త్సాంగ్పో అని పిలుస్తారు.

ఏది ఏమైనప్పటికీ, భూకంపశాస్త్రపరంగా పెళుసుగా ఉండే ప్రాంతంలో “డ్యామ్-ఫర్-డ్యామ్” విధానం అధిక పరిణామాలను కలిగి ఉంటుందని, చైనాలో డ్యామ్‌ల ప్రభావాన్ని మందగించే అవకాశం లేదని నిపుణులు హెచ్చరించారు .

అంతర్-మంత్రిత్వ సాంకేతిక కమిటీ నివేదిక కూడా “ఎగువ సియాంగ్ ప్రాజెక్ట్ హిమనదీయ సరస్సు విస్ఫోటనం వరద లేదా జి‌ఎల్‌ఓ‌ఎఫ్ ( గ్లేసియల్ లేక్ ఔట్‌బర్స్ట్ ఫ్లడ్ – హిమానీనదం ప్రక్కన, ముందు, లోపల, కింద లేదా ఉపరితలంపై ఏర్పడిన హిమానీనదం కరిగిన సరస్సు నుండి నీటిని ఆకస్మికంగా విడుదల చేస్తుంది) సందర్భంలో “సౌకర్యవంతంగా మితమైన” అకస్మాత్తుగా వచ్చే వరదలకు సహాయపడుతుందని” పేర్కొంది. కరిగే హిమానీనదాల కారణంగా ఏర్పడిన సరస్సులు వాటి సామర్థ్యాలను ఉల్లంఘించినప్పుడు జి‌ఎల్‌ఓ‌ఎఫ్‌లు సంభవిస్తాయి.

చైనాలో నీటినిల్వలో ఏదైనా ఉల్లంఘన కారణంగా వరద అకస్మాత్తుగా విడుదలైనప్పుడు ప్రతిపాదిత ఆనకట్ట “వరద పరిపుష్టి”గా పనిచేస్తుందని నివేదిక పేర్కొంది.

అయితే, అలాంటి వాదనపై కార్యకర్తలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. “భవిష్యత్ ప్రాజెక్టుల గురించి ప్రభుత్వాలు ఎల్లప్పుడూ గొప్ప వాదనలు చేస్తాయి” అని సౌత్ ఏషియా  నెట్‌వర్క్‌ ఆన్ డ్యామ్స్, రివర్స్ అండ్ పీపుల్ కు చెందిన హిమాంశు ఠక్కర్ అన్నారు. “ఈ వాదనలు ఎంత నిజం అనేది ప్రాజెక్ట్ నిర్వహణ ఎలా వుంటుందనే దానితో సహా పెద్ద సంఖ్యలో కారకాలపై ఆధారపడి ఉంటుంది. వాటి పని తీరు అధ్వాన్నంగా ఉంది.”

ఎన్‌హెచ్‌పి‌సి ‘అభివృద్ధి’ సందేహాలను రేకెత్తిస్తుంది:

కొన్ని నెలలుగా, ఎన్‌హెచ్‌పి‌సి ఈ ప్రాంతంలో ముందస్తు నిర్మాణ కార్యకలాపాలను ప్రారంభించింది, ఇది మెగా డ్యామ్ ఆలోచనకు స్థానిక నివాసితులను గెలుచుకునే మార్గంగా కనబడుతోంది.

ఎగువ సియాంగ్ బహుళార్థ సాధక ప్రాజెక్ట్‌కు సంబంధించి తూర్పు సియాంగ్, సియాంగ్, ఎగువ సియాంగ్ జిల్లాల్లో సామాజిక అభివృద్ధి పనుల కోసం గత ఏడాది మే 24న కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ రూ.350 కోట్లు వెచ్చించడానికి ఆమోదించింది.

బోలెన్‌లో మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం, పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాల అభివృద్ధి వంటి అభివృద్ధి-సంబంధిత ప్రాజెక్టుల కోసం ఎన్‌హెచ్‌పి‌సి, అనేక ఇతర విభాగాల మధ్య అనేక అవగాహన ఒప్పందాలు కుదిరాయి. ఇచ్చిపుచ్చుకునే కార్యకలాపాల్లో భాగంగా, ఎన్‌హెచ్‌పి‌సి మార్చి 3న సియాంగ్ జిల్లా యంత్రాంగానికి రెండు బొలెరో వాహనాలను అందజేసింది.

అయితే ఈ కార్యకలాపాలను చాలా మంది స్థానికులు అనుమానంతో చూస్తున్నారు.

ఈ సంవత్సరం మార్చి 23న, సియాంగ్ స్థానిక రైతుల ఫోరమ్ బ్యానర్‌ కింద 1,500 మంది స్థానిక నివాసితులు, ఎక్కువగా ఆది వ్యవసాయ సముదాయాలకు చెందినవారు, ఎన్‌హెచ్‌పి‌సి సంస్కరణ “అభివృద్ధి”కి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. సియాంగ్, అప్పర్ సియాంగ్ జిల్లాల పరిపాలనకు ఎన్‌హెచ్‌పి‌సి కేటాయించిన కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

“అభివృద్ధి కార్యక్రమాల పేరుతో ప్రభుత్వం ముందస్తు నిర్మాణ కార్యక్రమాల ద్వారా ప్రజల సమ్మతిని తారుమారు చేస్తోంది”

“ఎన్‌హెచ్‌పి‌సి అభివృద్ధి పనులు చేస్తే, ఇక ప్రభుత్వం ఎందుకు?”

 “ఎన్‌హెచ్‌పి‌సి ప్రతిపాదిత ఆనకట్ట ప్రదేశంలో మాత్రమే ఈ కార్యకలాపాలను నిర్వహిస్తోంది. స్పష్టంగా, 30 ఏళ్ల నుంచి డ్యామ్ వ్యతిరేక ప్రతిఘటన ఉన్నప్పటికీ, వారు ఇంకా ప్రజల అభీష్టాన్ని గుర్తించలేదు” అని ఆనకట్ట నిర్మాణ వ్యతిరేక కార్యకర్త భాను తాటక్ అన్నారు..

ఒక న్యాయవాది, ఒక రైతు నాయకుడు శాంతియుతంగా అడ్డూ అదుపూ లేని ఆనకట్ట నిర్మాణాన్ని నిరసించాలని కోరుకున్నారు; విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ హిమాలయ రాష్ట్రానికి రావడానికి ముందు,  అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన ఇద్దరు మెగా డ్యామ్ వ్యతిరేక కార్యకర్తలు ఎబో మిలీ, డంగే అపాంగ్‌లను జూలై 8న సందర్శించడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు.

సియాంగ్ ఇండిజీనియస్ ఫార్మర్స్ ఫోరం (ఎస్‌ఐ‌ఎఫ్‌ఎఫ్) ప్రకారం, ఇటానగర్ సచివాలయంలో వీరిద్దరూ ఖట్టర్‌కు మెమోరాండం అందజేయాల్సి ఉంది. అయితే, ఆ సమావేశానికి ముందు, ఇటానగర్ పోలీసులు వారిని రాష్ట్ర రాజధానిలోని పోలీసు స్టేషన్‌కు పిలిపించి అదుపులోకి తీసుకున్నారు.

రోయింగ్‌లోని ఇడు మిష్మి ఆదివాసీ సముదాయానికి చెందిన మానవ హక్కుల న్యాయవాది ఎబో మిలీ, రాష్ట్రంలో మెగా డ్యామ్‌లను నిర్మించాలనే అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వ ప్రణాళికలను తీవ్రంగా వ్యతిరేకించారు. ఇటానగర్‌లోని ఒక భవనంపైన డ్యామ్ వ్యతిరేక కుడ్యచిత్రం చిత్రీకరించిన కేసులో ఇంతకుముందు కూడా అతన్ని అరెస్టు చేశారు.

జూలై 8న మిలీకి ఇటానగర్‌లోని ఒక పోలీసు స్టేషన్ నుండి వచ్చిన ఒక ఫోన్ కాల్‌లో అతని ఆచూకీ గురించి అడిగాడు. మిలీ అధికారిక సమన్‌ను యివ్వమని అడిగితే, ఫోన్ కాల్ రికార్డ్ అయిందని, అదే సమన్‌గా పరిగణించబడుతుందని పోలీసు అధికారి తెలిపారు.

ఖట్టర్‌కు మెమోరాండం యివ్వాలని, ఈ అంశంపై విలేకరుల సమావేశం ఏర్పాటు చేయాలని కూడా ప్లాన్ చేశారు. అయితే, అనుమతి తీసుకోవడానికి ముందే మిలీని అదుపులోకి తీసుకున్నారు.

మిలీని అదుపులోకి తీసుకున్న తర్వాత, పోలీసులు సియాంగ్ ఇండిజీనియస్ ఫార్మర్స్ ఫోరం కన్వీనర్ డంగే అపాంగ్‌ను కూడా పిలిపించి అదుపులోకి తీసుకున్నారు.

ఈ పరిణామాన్ని ఇటానగర్ పోలీస్ సూపరింటెండెంట్ రోహిత్ రాజ్‌బీర్ సింగ్ ధృవీకరించారు. “మేము కార్యకర్తలను ముందస్తు కస్టడీలోకి తీసుకున్నాం. ఈ అంశంపై క్షుణ్ణంగా విచారణ జరుపుతున్నాం. ఆ తర్వాత ఒక ప్రకటన విడుదల చేస్తాము, ”అని సింగ్ అన్నాడు.

“ఆనకట్టలను విచ్చలవిడిగా నిర్మించడం, మా భూమి అమ్మకం” గురించి అవగాహన కల్పించడానికి చంద్రానగర్ నుండి అరుణాచల్ ప్రెస్ క్లబ్ వరకు శాంతియుత ప్రదర్శన కోసం అనుమతి కోసం ఇటానగర్ డిప్యూటీ కమీషనర్‌ను కలవాలని మిలీ పట్టుబట్టారు.

జూలై 9న అరుణాచల్ ముఖ్యమంత్రి పెమా ఖండూ, కేంద్ర మంత్రి ఎమ్‌ఎల్ ఖట్టర్ ” పాల్గొన బోయే బహిరంగ సభకు అంతరాయం కలిగించడం”, “శాంతి భద్రతల సమస్యను కలిగించే ప్రయత్నం” కారణంగా మిలీ, అపాంగ్‌లను అరెస్టు చేసినట్లు ఇటానగర్ పోలీసులు తర్వాత ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రయత్నంలో ఎస్‌ఐఎఫ్‌ఎఫ్ వంటి రాష్ట్ర-ఆధారిత డ్యామ్ వ్యతిరేక సంస్థలలోని ఇతర సభ్యులు కూడా వీరిద్దరితో చేరే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు సూచించాయని ఇటానగర్ పోలీసులు తెలిపారు.

అనుమానిత వ్యక్తుల నుండి మంచి ప్రవర్తనకు భద్రత కల్పించే భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (బి‌ఎన్‌ఎస్‌ఎస్) సెక్షన్ 128ని కూడా వీరిద్దరిపై పెట్టారు. ‘మంచి ప్రవర్తన’ హామీ కోసం మిలి, అపాంగ్‌లు ఒక్కొక్కరికి రూ 50,000 బాండ్‌పై సంతకం చేసి విడుదల అయ్యారు.

అరుణాచల్‌లో భారీ ఆనకట్టలు కేంద్ర, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ డ్యామ్‌ల నిర్మాణాన్ని శీఘ్రగతిన కొనసాగిస్తుండగా, రాష్ట్ర ప్రజలు డ్యామ్ నిర్మాణంపై ఆందోళనలు చేస్తున్నారు. జలవిద్యుత్ పవర్‌హౌస్‌గా కనిపించే అరుణాచల్ ప్రదేశ్, డ్యామ్‌లను వ్యతిరేకిస్తున్న స్థానికుల హక్కులను దెబ్బతీస్తోందని ఆరోపించారు. ప్రతిపాదిత 11 GW సియాంగ్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ విషయంలో స్థానిక సముదాయాలతో సంప్రదింపులు జరపకుండా, కార్పొరేట్ సామాజిక బాధ్యత, ఏకపక్షంగా గ్రామాల తరలింపుకు ప్రభుత్వం ప్రణాళికలు  వేస్తోందని కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ, అరుణాచల్ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు రెండూ కూడా చైనీస్ నియంత్రణలో ఉన్న టిబెట్‌లో యార్లంగ్ త్సాంగ్పో అని పిలిచే సరిహద్దు నది అయిన బ్రహ్మపుత్రపై చైనీస్ డ్యామ్ నిర్మాణ ప్రభావాన్ని ఎదుర్కోవడానికి ఆనకట్టల నిర్మాణం అవసరమని వాదించాయి.

అయితే, నిరసనలలో స్థానిక సంఘాలతో సంప్రదింపులు చేయకపోవడం, భిన్నాభిప్రాయాలకు ప్రజాస్వామిక అవకాశం లేకపోవడం అనే లోపాలు వున్నాయి. “రాజ్యం తన స్వంత ప్రజలపై అణచివేత అమలుపరచడం అత్యంత ఖండనీయం. అభివృద్ధి కోసం స్వీయ-విధ్వంసకరం. మెగా డ్యామ్‌ల వంటి అభివృద్ధి కార్యక్రమాల నిర్ణయాత్మక ప్రక్రియలో ప్రజల భాగస్వామ్యం లేకుండా, ప్రజాస్వామ్యం గురించి రాజ్యం చేసే వాగ్దానం ఫలించదు. రాష్ట్రంలో 50 ఏళ్ల నాటి ఆనకట్ట వ్యతిరేక ఉద్యమాన్ని అరుణాచల్ ప్రభుత్వం వినాల్సిన సమయం ఆసన్నమైంది. కొంతమంది లాభాల కోసం బహుళజాతి సంస్థలకు తమ పూర్వీకుల భూమిని వదులుకోవడానికి ప్రజలు అనుమతించరని స్పష్టంగా తెలుస్తుంది. రాష్ట్ర సార్వభౌమత్వాన్ని ప్రభుత్వం కాపాడాలి” అని ఎస్‌ఐ‌ఎఫ్‌ అధికార ప్రతినిధి భాను తాటక్ అన్నారు.

“గౌహతి హైకోర్టు తీర్పు 2022 నుండి 44 జలవిద్యుత్ ప్రాజెక్టులు, సియాంగ్ వ్యాలీలోని డ్యామ్ ప్రాజెక్టులను రద్దు చేసింది. “కార్యకర్తలు గౌహతి హైకోర్టు నిర్దేశించిన పూర్వాపరాలను సమర్థిస్తున్నారు, అవగాహన పెంచుతున్నారు. అయితే, రూల్‌బుక్ ప్రకారం వెళ్లే వారిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం దురదృష్టకరం, ”అని ఎస్‌ఐ‌ఎఫ్‌ఎఫ్ అధ్యక్షుడు రిటైర్డ్ పోలీసు అధికారి అయిన జిజోంగ్ అన్నారు.

అరుణాచల్ ప్రదేశ్‌లో ప్రతిపాదించిన 11,000 మెగావాట్ల అప్పర్ సియాంగ్ మల్టీపర్పస్ స్టోరేజ్ ప్రాజెక్ట్‌కు జూలై 8న, ఎస్‌ఐ‌ఎఫ్‌ఎఫ్, దిబాంగ్ రెసిస్టెన్స్, నార్త్ ఈస్ట్ హ్యూమన్ రైట్స్, అధికారికంగా తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేశాయి. ఖట్టర్‌కు రాసిన లేఖలో, సంస్థలు ఈ భారీ ఆనకట్ట వారి పూర్వీకుల భూములు, సున్నితమైన పర్యావరణ వ్యవస్థలను దెబ్బతీస్తుందని తెలియచేసారు. ఈ ప్రాజెక్ట్‌ నిర్మాణం వల్ల  ఈ ప్రాంత పర్యావరణం నాశనమవుతుందని, దాని ప్రజలకు సంభావ్య విపత్తుగా పరినమిస్తుందని అభివర్ణించారు. మెగా డ్యామ్ ప్రాజెక్టులను చేపట్టకూడదని చేసిన  అధ్యయనాలు  సిక్కిం డ్యామ్ కూలిపోవడం, అస్సాం వరదలను ఉదాహరణగా చూపించాయన్నారు.

https://www.downtoearth.org.in/dams/arunachal-anti-dam-activists-detained-ahead-of-union-ministers-visit

https://scroll.in/article/1070339/why-arunachal-pradesh-residents-are-stalling-surveys-for-a-mega-dam

Leave a Reply