మోడీ ప్రభుత్వం ఒకవైపు ‘జై శ్రీరాం’ అంటూ చెవులు చిల్లులు పడే హోరుతో బిజెపి ప్రాయోజిత ‘ఒక చెట్టు-తల్లి పేరుతో’ ప్రచారాన్ని నిర్వహిస్తూనే మరోవైపు హస్‌దేవ్ అడవిని అదానీకి బదిలీ చేసేందుకు సిద్ధమవడం మన కాలపు వైచిత్రం. కేతే విస్తరణ పేరుతో మూడో బొగ్గు బ్లాకును అదానీకి అప్పగించేందుకు ఆగస్టు 2న అన్ని నియమ నిబంధనలను తుంగలో తుక్కి పర్యావరణ విచారణ జరుపుతున్నారు. ఈ గని కోసం 8 లక్షలకు పైగా చెట్లను నరికివేస్తారేమోనని అంచనా. రాష్ట్రం మొత్తంగావున్న బిజెపి కార్యకర్తలు కూడా ఇన్ని మొక్కలు నాటలేరు.
ఏడు నెలల క్రితం ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఆ సమయంలో రాజస్థాన్ ప్రభుత్వం అదానీ కోసం హస్‌దేవ్ అడవులను స్వాధీనం చేసుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అప్పటి ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి, భూపేష్ బఘేల్ కూడా రాజస్థాన్‌ను ప్రకాశవంతం చేయడానికి ఆసక్తిగా ఉన్నాడు. రాజ్య ఆధ్వర్యంలో హస్‌దేవ్ నరికివేతను కూడా ప్రారంభించారు. కానీ హస్డియోలోని ఆదివాసీలు, రాష్ట్ర ప్రజల స్వర వ్యతిరేకత, మొత్తం ప్రపంచంలోని పర్యావరణ ప్రేమికుల సంఘీభావం కారణంగా, రాజ్యం చెట్లు నరకడాన్ని ఆపవలసి వచ్చింది. ఛత్తీస్‌గఢ్ నలుమూలల నుండి వేలాది మంది ప్రజలు ఈ రాజ్య-ప్రాయోజిత నరికివేతకు వ్యతిరేకంగా ఏకమయ్యారు. హస్‌దేవ్‌లో “పౌర ప్రతిఘటనా యాత్ర” నిర్వహించారు. అప్పటి ప్రతిపక్షం బీజేపీ కూడా ఈ నరికివేతను వ్యతిరేకించింది.
ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లో బీజేపీ ప్రభుత్వం ఉంది. ఇప్పుడు రాజస్థాన్‌లోని బీజేపీ ప్రభుత్వం అదానీకి హస్‌దేవ్ అడవులు యివ్వాలనుకుంటోంది. ఛత్తీస్‌గఢ్‌లోని బీజేపీ ప్రభుత్వం అదానీని ముక్తకంఠంతో స్వాగతించడానికి ఉత్సాహం చూపుతోంది. ప్రతిపక్ష కాంగ్రెస్ నిరసన నటిస్తోంది. ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లలో కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా అదానీకి మాత్రం ఎలాంటి మార్పు లేదు.
అదానీకి ఇప్పటికే ఛత్తీస్‌గఢ్‌లోని హస్డియో ప్రాంతంలో రెండు బొగ్గు గనులు ఉన్నాయి – పర్సా, పర్సా ఈస్ట్ కేతే బేసన్ (పిఇకెబి). ఈ రెండు గనులు సుమారు 10000 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నాయి. హస్‌దేవ్ అడవులను మధ్య భారతదేశపు ఊపిరితిత్తులు అని పిలుస్తారు. భారతదేశంలోని హస్‌దేవ్ అడవుల జీవవైవిధ్యము, పర్యావరణ ప్రాముఖ్యత, ఇక్కడ నివసిస్తున్న ఆదివాసీ సముదాయ సామాజిక-ఆర్థిక ప్రయోజనాల గురించి తెలిసిన వారు ఇప్పటికే ఎంత నష్టం జరిగిందో స్పష్టంగా ఊహించవచ్చు. ఈ రెండు గనుల కారణంగా జీవ పర్యావరణాలకు నష్టం జరిగింది. ఆదివాసీ సముదాయం నిర్వాసితులయ్యారు. ఈ రెండు గనులను ప్రారంభించినప్పుడు ఆదివాసీ సముదాయానికి యిచ్చిన ఏ ఒక్క హామీనీ నెరవేర్చలేదు.
ఇప్పుడు అదానీకి గనుల విస్తరణ కోసం 4400 ఎకరాల్లో విస్తరించి ఉన్న మూడో గని కూడా కావాలి. ఇందుకు ఆమోదం దొరికితే 4350 ఎకరాల దట్టమైన అటవీ ప్రాంతంలో వందల ఏళ్లుగా ఉన్న 8 లక్షలకు పైగా చెట్లు నాశనం అవుతాయి. దీంతో పదుల సంఖ్యలో గ్రామాలు నిర్వాసితులయ్యే, జీవనోపాధి ధ్వంసమయ్యే పరిస్థితి వస్తుంది.
పర్యావరణ విచారణ చట్టవిరుద్ధం:
కేట్ గని విస్తరణకు సంబంధించిన పర్యావరణ విచారణ చట్టవిరుద్ధం, ఎందుకంటే మార్చి 2021లో విడుదల చేసిన పర్యావరణ ప్రభావ అంచనా ఆధారంతో ఈ విచారణను జరపబోతున్నారు. పర్యావరణ మంత్రిత్వ శాఖ నిబంధనల ప్రకారం ఈ నివేదిక చాలా పాతది, దాని ఆధారంగా బహిరంగ విచారణ నిర్వహించడం సాధ్యం కాదు. అయితే ఛత్తీస్‌గఢ్‌కు చెందిన పర్యావరణ పరిరక్షణ బోర్డు దీని ఆధారంగా విచారణ జరుపుతోంది అంటే ఈ చట్టవ్యతిరేక చర్యకు గ్రీన్ సిగ్నల్ ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం చేసుకోవచ్చు.
ఒకవేళ పర్యావరణ బోర్డు తీసుకున్న ఈ వైఖరిని పక్కనపెట్టినప్పటికీ , ఈ బహిరంగ విచారణను చట్టబద్ధం చేసే అంశం ఏ ఒక్కటీ లేదు. రాష్ట్ర అటవీ శాఖ, ఖనిజ వనరుల శాఖలు రెండూ గని ప్రాజెక్ట్‌ను వ్యతిరేకించాయి. గని విస్తరణ కోసం భూసేకరణ ప్రక్రియపై తమ అభ్యంతరాన్ని కూడా నమోదు చేశాయి. ఈ ప్రాజెక్ట్ లెమరూ ఏనుగుల అభయారణ్యం వున్న 10 కి.మీ. పరిధిలోకి వస్తుంది. ఈ రిజర్వ్ ప్రాంతాన్ని 2021 అక్టోబర్ 22 చత్తీస్‌గఢ్ గెజిట్‌లో కూడా ప్రకటించారు. ఇప్పుడు ఇది ‘ఎవరూ ప్రవేశించగూడని ప్రదేశం (నో గో ఏరియా)’.
వైల్డ్ లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కూడా హస్‌దేవ్‌లో ఏదైనా మైనింగ్ ప్రాజెక్ట్ ను ప్రోత్సహించడం వల్ల ఈ ప్రాంత పర్యావరణం, జీవావరణ శాస్త్రంపై ‘ తిరుగులేని’ ప్రభావం చూపుతుందని, ఏనుగు కారిడార్‌ను ప్రభావితం చేయడం వల్ల మానవ-ఏనుగుల మధ్య ఘర్షణను పెరుగుతుంది. దీనితో పాటు, ఈ గని కారణంగా, హస్‌దేవ్ నది 10,000 చదరపు కి.మీ. పరీవాహక ప్రాంతం కూడా ప్రభావితమవడంవల్ల వివిధ నీటి వనరులు, బ్యాంగో డ్యామ్ కూడా ప్రమాదంలో పడతాయి. ఇది వ్యవసాయం, పారిశ్రామిక రంగాల నీటి సరఫరాను దెబ్బ తీస్తుంది. ఇది 50 లక్షల మంది ప్రజల జీవనోపాధిని, జీవితాన్ని కూడా ప్రమాదంలో పడేస్తుంది.
ఈ కారణాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని, 2022 జూలై 26న, హస్‌దేవ్ అరణ్యలో ప్రతిపాదించిన బొగ్గు గనులన్నింటినీ రద్దు చేయాలని ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది. పర్సా ఈస్ట్ కేతే బేసన్ గని రాజస్థాన్ ప్రభుత్వ అవసరాలను వచ్చే ఇరవై ఏళ్లపాటు తీర్చగలదని ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది.
ఈ విధంగా, యిప్పటికీ రాజ్యాంగబద్ధంగా కట్టుబడి వున్న ఈ నివేదికలన్నింటినీ విస్మరించి బిజెపి ప్రభుత్వం అసెంబ్లీ తీర్మాన ప్రతిపాదనను, సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌ను ఉల్లంఘిస్తూ ఈ బహిరంగ విచారణను నిర్వహిస్తోంది.
అదానీ దోపిడీ గాథ:
సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ప్రకారం, 2024 జనవరిలో రాజస్థాన్‌లో విద్యుత్ డిమాండ్ 18,128 మెగావాట్లు. రాజస్థాన్ మొత్తం విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 40,209 మెగావాట్లు, ఇందులో సౌరశక్తి ద్వారా విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 26,815 మెగావాట్లు. రాష్ట్రంలో బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్ల సామర్థ్యం 9200 మెగావాట్లు మాత్రమే. విద్యుత్ పరంగా, రాజస్థాన్ ప్రభుత్వం 2030 సంవత్సరం నాటికి కేవలం సౌరశక్తితో లక్ష మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసి, దేశంలోని ఇతర రాష్ట్రాలకు అమ్మడం ద్వారా పూర్తిగా స్వయం సమృద్ధి సాధించడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ విషయంలో పురోగతి కనిపిస్తోందని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నది. ఈ వాస్తవాల దృష్ట్యా, పార్సా తూర్పు కేతే బేసన్ గని అవసరాలను రాజస్థాన్ ప్రభుత్వం రాబోయే ఇరవై ఏళ్లపాటు తీర్చగలదని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఇచ్చిన అఫిడవిట్‌లో వుంది. అలాంటప్పుడు మరో బొగ్గు గనికోసం రాజస్థాన్ ప్రభుత్వ పట్టుదల ఎందుకు?
ఈ కథనం అదానీ బొగ్గు దోపిడీపై ఆధారపడి ఉంటుంది. రాజస్థాన్ ప్రభుత్వం బొగ్గు తవ్వకం పనిని అదానీకి అప్పగించిన ఎండిఒ కాంట్రాక్ట్ ప్రధాన నిబంధన ఏమిటంటే, రాజస్థాన్ ప్రభుత్వం తన పవర్ ప్లాంట్లను నడపడానికి అదానీ నుండి కిలోకు 4000 కేలరీల కంటే తక్కువ నాణ్యత గల బొగ్గును అంగీకరించదు. ఒక కిలోకు 4000 కేలరీలు నాణ్యమైన తిరస్కరించబడిన బొగ్గును తొలగించి, పారవేసే పనిని అదానీ కంపెనీ చేపడుతుంది. ఛత్తీస్‌గఢ్, దేశంలోని ఇతర ప్రాంతాలలో ప్రభుత్వ, ప్రైవేట్ పవర్ ప్లాంట్‌లలో ఉపయోగించే బొగ్గు సగటు నాణ్యత కిలోకు 3400 కేలరీలు కాబట్టి మొత్తం గందరగోళం, కుంభకోణం ఈ ఒప్పందంలోనే దాగి ఉంది. ఛత్తీస్‌గఢ్‌లోని ప్రైవేట్ పరిశ్రమలు ఎస్‌ఇసిఎల్ నుండి 2200 కేలరీల వరకు నాణ్యమైన బొగ్గును తీసుకుంటాయి.
2022 సంవత్సరంలో, అదానీ 2021 సంవత్సరంలోనే 29.58 లక్షల టన్నుల తిరస్కరించబడిన బొగ్గును పర్సా కేట్ గనుల నుండి రవాణా చేసిందని, ఇది రైలు ద్వారా రవాణా చేసిన మొత్తం బొగ్గులో 26.6% అని ఆర్‌టిఐ కార్యకర్త డికె సోనీకి ఒక పత్రం ద్వారా రైల్వే తెలియజేసింది. ఈ బొగ్గు అదానీకి ఉచితంగా లభిస్తోంది, అతను తన పవర్ ప్లాంట్లను నడపడానికి, ప్రైవేట్ పరిశ్రమలకు అమ్మడానికి ఉపయోగిస్తున్నాడు. అదానీ చేసిన బొగ్గు దొంగతనానికి సంబంధించిన మొత్తం కథను రాష్ట్ర ప్రసిద్ధ సాయంత్రం దినపత్రిక ‘ఛత్తీస్‌గఢ్’ తన మొదటి పేజీలో 2022 డిసెంబర్ 22నాటి సంచికలో ప్రచురించింది.
పర్సా కేట్ మైన్స్ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 150 లక్షల టన్నులు. తిరస్కరించబడిన బొగ్గు పరిమాణం కేవలం 26.6%గా పరిగణించినట్లయితే, మొత్తం తిరస్కరించబడిన బొగ్గు పరిమాణం దాదాపు 40 లక్షల టన్నులకు చేరుకుంటుంది. అదానీ ఈ తిరస్కరించబడిన బొగ్గులో 60% తన సొంత పవర్ ప్లాంట్ల కోసం ఉపయోగిస్తోంది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో దిగుమతి కాని బొగ్గు సగటు ధర టన్నుకు రూ.7000 ఉండగా, ఈ రేటు ప్రకారం తిరస్కరించబడిన బొగ్గు విలువ రూ.2800 కోట్లు. ఈ దోపిడీ 2021 సంవత్సరానికి చెందినది, అయితే 2013 సంవత్సరం నుండి ఇక్కడ అదానీ గనుల తవ్వకాలు జరుగుతున్నాయి. గత 10 ఏళ్లలో కేంద్రం, రాష్ట్రంలోని కార్పొరేట్ అనుకూల ప్రభుత్వ సహకారంతో అదానీ ఛత్తీస్‌గఢ్‌లోని ఒక్క గని నుంచి రూ.28,000 కోట్ల విలువైన 4 కోట్ల టన్నుల బొగ్గును కొల్లగొట్టింది! పీకేబీ గని మైనింగ్ 2028 సంవత్సరం వరకు జరగాల్సి ఉండగా మరింత దోపిడి దాహంతో అదానీ 2022 నాటికే గనినంతా తవ్వేసి , ఇప్పుడు కేతే గని మూడో విస్తరణ కోసం డిమాండ్ చేస్తున్నాడు.
కోల్ ఇండియా తన బొగ్గును టన్నుకు రూ.3405 చొప్పున విక్రయిస్తుండగా, రాజస్థాన్ ప్రభుత్వం ప్రభుత్వ గనుల నుంచి వెలికితీసిన బొగ్గును అదానీ నుంచి టన్నుకు రూ.3915 చొప్పున కొనుగోలు చేస్తుందని ఇక్కడ పేర్కొనడం సముచితంగా వుంటుంది. ఈ వ్యత్యాసం టన్నుకు రూ.510. 2021 సంవత్సరంలో, రాజస్థాన్ ప్రభుత్వం 81.63 లక్షల టన్నుల బొగ్గును కొనుగోలు చేసింది, దీని కారణంగా అదానీ కంపెనీ రూ. 416.28 కోట్ల అదనపు లాభం పొందింది. గత పదేళ్లలో రాజస్థాన్ చవిచూసిన నష్టం దాదాపు రూ.4163 కోట్లు. రాజస్థాన్ ప్రజలు ఖరీదైన విద్యుత్‌ను పొందేందుకు ఇది కూడా ఒక పెద్ద కారణం.
ఛత్తీస్‌గఢ్‌లో అదానీ చేసిన ఈ బొగ్గు దోపిడీ రాష్ట్రంలో బస్తర్ నుండి సర్గుజా వరకు జరుగుతున్న సహజ వనరుల కార్పొరేట్ దోపిడీకి ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. సామాన్య ప్రజల ఐక్య పోరాటమే ఈ దోపిడీని అరికట్టగలదు. ఆగస్టు 2న జరిగే కేతే గాని విస్తరణకు సంబంధించిన పర్యావరణ విచారణలో ఆ ప్రాంత ఆదివాసీలు తమ తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో, యునైటెడ్ కిసాన్ మోర్చా కూడా “అదానీ – క్విట్ ఛత్తీస్‌గఢ్” నినాదంపై ఈ నెలలో బహిరంగ సదస్సును నిర్వహించనున్నట్లు ప్రకటించింది.
2024 జులై 29
(సంజయ్ పరాటే అఖిల భారత కిసాన్ సభకు అనుబంధంగా ఉన్న ఛత్తీస్‌గఢ్ కిసాన్ సభ ఉపాధ్యక్షుడు. https://janchowk.com/beech-bahas/one-plant-for-mother-and-the-entire-forest-in-the-name-of-abba-hail-shri-ram-hail-shri-ram/?fbclid=IwY2xjawEUWvZleHRuA2FlbQIxMQABHYY6imCvwbVz-kt8nbO9rRJVQVhRWf3VeLzJnisjGB9LLYwgw98Hlcy_EA_aem_YxCYes51V1qdz8v8r9Xuiw&noamp=available&sfnsn=wiwspmo