(ఇటీవల విడుదలైన కామ్రేడ్ కె ఎస్ *కమ్యూనిస్టు ఉద్యమ చరిత్ర*కు రాసిన ముందు మాట )

నక్సల్బరీని తిరిగి నిర్మించుకునే క్రమంలో క్యాడర్‌కు కె.ఎస్‌.చెప్పిన పాఠాలివి. ఆనాటికుండిన సాంకేతికతను ఉపయోగించుకుని లోచర్ల పెద్దారెడ్డి కె.పస్‌. చెప్పిన పాఠాన్ని అక్షరీకరించారు. ఈ పాఠం రెండు భాగాలుగా వెలువడనుంది. దాదాపు ఎనభైయవ దశకం ప్రారంభంలో కొత్తగా పార్టీ నిర్మాణంలోకి వచ్చిన వారికి చెప్పిన పాఠమైనా ఇవ్వాల్టికీ దీని ప్రాసంగికత వుంది. కమ్యూనిస్టు పార్టీలు కృశ్చేవ్‌ శాంతి మంత్రాన్ని పఠిస్తూ వర్గ పోరాటాన్ని మరచిపోయి, రాజ్యాధికారాన్ని హస్తగతం చేసుకోవాలన్న ఎరుకను మరచి ఆర్థిక పోరాటాలకు పరిమితమైన కాలంలో నక్సల్బరీ ఉద్యమం ఆరంభమైంది. అనేక సంక్షోభాలను దాటుకొని విప్లవోద్యమం తిరిగి పునర్నిర్మాణమవుతున్న కాలంలో కెఎస్‌ చెప్పిన పాటం ఇది. ఇవ్వాల్టికీ ఈ పాఠం అత్యవసరం. ఈ అవసరాన్ని ప్రచురణ కర్తలు గ్రహించారు.

నాయకత్వపు అవగాహన లోపం వల్ల పీడితవర్గ విముక్తి పోరాటం తెలంగాణాలో 1951లో ఆగిపోయింది. ఆ తర్వాత   నక్సల్బరీలో ప్రారంభమైన విప్లవోద్యమం నయా రివిజనిస్టుల అణచివేతకు గురి అయింది. శ్రీకాకుళ ఉద్యమం కాంగ్రెస్‌ ప్రభుత్వ అణచివేతకు గురి అయింది. కానీ పీడిత వర్గ పోరాటపు జ్వాల ఆగిపోలేదు.  1980ల నుంచి తిరిగి ఉత్తర తెలంగాణాలో రైతాంగ ఉద్యమం ప్రారంభమై జగిత్యాల జైత్రయాత్ర పోరాటపు కేతనాన్ని ఎగుర వేసింది. అప్పటి నుంచి రాజ్యాధికారమే లక్ష్యంగా మావోయిస్టు ఉద్యమం తన అంతిమ లక్ష్యమని నిర్వచించుకుని నిర్బంధాన్ని ఎదుర్కొంటూనే మునుముందుకు నడుస్తూ వుంది. 2004లోని విప్లవోద్యమ చర్చలు మధ్యలోనే ఆగిపోవడం, నాయకత్వాన్ని చుట్టుముట్టి మట్టుబెట్టడం వంటి క్రూర అణచివేతకు గురి అయినా ఉద్యమం విస్తరిస్తూనే వుంది. ప్రభుత్వాలు తమ అంతర్గత శత్రువని విప్లవోద్యమాన్ని గుర్తించాయి. ఇవ్వాళ కగార్‌ పేరుతో కనీసం రాజ్యాంగపు విలువల్ని గుర్తించకుండా నిర్లజ్జగా నాయకత్వాన్ని మట్టుబెట్ట పూనుకుంది. కాని సమాజం వాస్తవాన్ని గుర్తిస్తూ తన అసంతృప్తిని వెల్లడిస్తూ వుంది. ప్రపంచ వ్యాప్తంగా విప్లవోద్యమానికి నైతిక మద్దతు లభిస్తూ వుంది.

ఇటువంటి తరుణంలో కమ్యూనిస్టు ఇంటర్నేషనల్‌ సాధించిన విజయాల్ని, పొందిన అపజయాల్ని వివరిస్తూ ప్రపంచ విప్లవోద్యమంలో భాగంగా మన దేశంలో జరగవలసిన విప్లవోద్యమ అనివార్యతను వివరిస్తుందీ పాఠం. కె.ఎస్‌. తాను విప్లవోద్యమ కార్యకర్తగా పొందిన అనుభవాన్ని, తెలుసుకున్న శాస్త్రీయతను జోడిరచి క్రమానుగత ఉద్యమ చరిత్రను వివరించారు. అసలు మార్క్సిజంలోని ప్రాథమిక అవగాహనకు సంబంధించిన అనేక విషయాల్ని సోపపత్తికంగా అందించడంలోని కె.పస్‌. శాస్త్రీయతను గమనించాలి. మార్క్సిస్టు ప్రాథమిక సూత్రాల్ని చారిత్రక గమనంలో భాగంగా మన సమాజానికి అప్లై చేస్తూ వివరించడం వల్ల మన సమాజ స్వరూప స్వభావాలు ప్రధాన వైరుధ్యాలు పరిష్కారం కాగల పద్ధతిని వివరించడంలో తన అనుభవం శాస్త్ర శోధన రెండూ ఇందులో కనిపిస్తాయి. శ్రమ దోపిడి, అధికోత్పత్తి, మార్కెట్‌ విస్తరణలో పోటీలు, అనివార్యమైన యుద్ధాలు వాటి పర్యవసానాలు ఇందులోకనిపిస్తాయి. శ్రామికుల ఉదారవాదం, విప్లవోద్యమంలో అనివార్య భాగస్వామ్యం పలా జరుగుతుందో వివరిస్తారు. సామ్రాజ్యవాదాన్ని మార్క్సిస్టు మహోపాధ్యాయులు వివరించిన తీరు నుంచి విశ్లేషించే విధానం శ్రోతకు తేలికగా బోధపడుతుంది.

మన దేశంలో తొలినాళ్ళలోని విప్లవోద్యమం పడిలేచిన తీరును, అందుకు గల సైద్ధాంతిక లోపాల మూలాలను తాత్త్వికంగా ఆచరణాత్మంగా వివరించడం వల్లనూ, శాస్త్రీయ అవగాహనతో వివరించడం వల్లనూ, రివిజనిజాన్ని, నయా రివిజనిజాన్ని పూర్వపక్షం చేసి విప్లవోద్యమానికి బాటలు వేస్తారు. శ్రీకాకుళ విప్లవోద్యమం అణచివేతకు గురి అయిన తరువాత తిరిగి విప్లవోద్యమంలో రకరకాల ధోరణులు తలెత్తాయి. వాటిని సరి చేసుకునే ఎత్తుగడలు, పంథానూ రూపొందించడంలోని పునాదులు పాఠంలో వున్నాయి. సరైన విప్లవోద్యమానికి శాస్త్రీయ బాటలు వేసే ఇంజనీరింగ్‌ ఈ పాఠంలో చదువుకోగలం.

సాహిత్య పరిభాషలో ఆఖ్యాన శైలిని ఈ పుస్తకం అనుసరించింది. అందుకని ఒకరు చెబితే ఎలా వుంటుందో అలా వుంటుంది. కె.ఎస్‌   ఉపన్యాస శైలిలో సరళత్వం వుంటుంది. ఉపాధ్యాయుడు రాజకీయవేత్త అయితే విద్యార్థుల్ని గొప్పగా ప్రభావితం చేయగలడు. ఆ ప్రయత్నం ఇందులో కనిపిస్తుంది.

గతాన్ని సమీక్షించుకుంటూ ఈనాటి నిర్దిష్ట పరిస్థితులకు మార్క్సిజాన్ని అన్వయిస్తూ వ్యూహ రచన చేయడంలో కె.పస్‌. విప్లవ దార్శనికత కనిపిస్తుంది. కారల్‌ మార్క్స్‌ రచనలు, లెనిన్‌ స్టాలిన్‌ల రచనలు చూసి వాటిని చదివి మార్క్సిజాన్ని అర్థం చేసుకోగలమా అని సందేహించే వారికి కె.ఎస్‌. రచనలు మార్క్సిజాన్ని అర్థం చేసుకోవడం నల్లేరుపై నడక వంటిది. ఈ రచన పాఠం చదువుతూ వుంటే కె.ఎస్‌. కేవలం పుస్తకాలు చదివి సిద్ధాంతాలు చెబుతున్న వాడిగా కనుపించడు, కేవలం ఆచరణ వాదిగా సిద్ధాంతాలు చెబుతున్న వాడిగా కూడా కనిపించడు. ఈ రెంటినీ సమన్వయం చేసుకుని మన సమాజానికన్వయిస్తూ చెప్పిన పాఠమిది. ఎక్కడా విప్లవ కాంక్షను వీడి పక్కకు జరగడు. ప్రజా పక్షంగా నిలబడి వుంటాడు. రాజకీయార్థ శాస్త్రం, తత్వ శాస్త్రం, చరిత్రా అన్నీ కలగలిపిన గతి తర్కంగా జరిగిన ఈ విశ్లేషణ శ్రోతలకు, పాఠకులకు  సులభగ్రాహ్యం.

తెలంగాణా సాయుధ పోరాట విరమణానంతరం  రెండుసార్లు కమ్యూనిస్టు పార్టీ నుంచి బహిష్కృతుడైన కె.ఎస్‌. తాను మాత్రం మార్క్సిజానికి దూరం కాలేదు. నక్సల్బరీ శ్రీకాకుళ ఉద్యమాల్ని పుణికి పుచ్చుకుని నాటి సమాజాన్ని విశ్లేషిస్తూ వ్యవసాయిక విప్లవ పంథాను అందించారు. మన దేశంలో జరగవలసింది నూతన ప్రజాస్వామిక విప్లవమేనని ఆచరణాత్మకంగా నిరూపించాడు. ఆనాటి వైరుధ్యాల్ని పరిష్కరించే శాస్త్రీయ పద్ధతిని ఆవిష్కరించాడు.

ఈ పాఠం వింటే, చదివితే, ఇవ్వాళ దేశంలో వున్న పార్లమెంటరీ కమ్యూనిస్టు పార్టీలు పీడిత ప్రజల్ని ఎలా విముక్తి చేయగలుగుతాయన్న అనుమానానికిలోనై వాటిని అసహ్యించుకోక మానరు. ఇందులో కెఎస్‌ మన కమ్యూనిస్టు ఉద్యమ చారిత్రక విశేషాలతోపాటు సామ్రాజ్యవాద లక్షణాల్ని, నయా వలస విధానాన్ని వివరిస్తారు. నలభై ఏళ్ళ క్రితం నాటి ఈ పాఠం మళ్ళీ విప్లవోద్యమంలో భాగస్వాములు కాదలుచుకున్న వారికి  కరదీపిక. ఈ పాఠం మూలప్రతి లోచర్ల పెద్దారెడ్డి చేతిరాతలో వుంది.  మారిస్‌ కార్న్‌ ఫోర్త్‌  జ్ఞాన సిద్ధాంతపు అనువాదాన్ని తన చేతి  రాతలో పెద్దారెడ్డి నాకిచ్చినారు. మిత్రుల్ని సంప్రదించి ఆ రచనను కూడా ప్రచురించే ప్రయత్నం చేయాల్సి వుంది. కె.ఎస్‌. చెప్పిన ఈ పాఠపు రాత ప్రతులు రాష్ట్రంలో మరికొద్ది మంది దగ్గర ఉన్నట్లు ఉద్యమాభిమానుల ద్వారా తెలుస్తూ వుంది. దీన్ని విస్తృత పాఠకులకు, ముఖ్యంగా ఈ తరానికి అందివ్వడానికి దీన్ని ప్రచురిస్తున్నారు. అనేక నిర్బంధాలకు, అటుపోట్లకు గురైనప్పటికీ విప్లవోద్యమం   ఈ పాఠాన్ని పదిలపచడం వల్లనే ఇప్పుడు ఇలా పాఠకుల ముందుకు వస్తున్నది.

Leave a Reply