‘గ్లోబల్ విట్‌నెస్’ రిపోర్టు ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా, 2012 నుండి పర్యావరణ పరిరక్షణా కర్తవ్యంలో  మొత్తం 2,106 మంది ప్రాణాలు కోల్పోయారు. 2023లోనే, కనీసం 196 మంది పర్యావరణ రక్షణ కార్యకర్తలు తమ ఇళ్లను లేదా సముదాయాలను రక్షించుకోవడానికి పోరాడుతూ మరణించారు. వీటిలో భారత్ పదో స్థానంలో ఉంది. పర్యావరణం, భూమి హక్కుల కోసం మాట్లాడే వారిపై జరుగుతున్న హింసకు సంబంధించిన ఈ ఆందోళనకరమైన సంఖ్య ప్రపంచ సంక్షోభాన్ని నొక్కి చెబుతుంది.

కొలంబియా వరుసగా రెండో ఏడాది కార్యకర్తలకు అత్యంత ఘోరమైన దేశంగా వుంది. 2023లో, గ్లోబల్ విట్‌నెస్ రికార్డ్ చేసిన ఒక్క సంవత్సరంలో మరే ఇతర దేశం కంటే ఎక్కువగా, రికార్డు స్థాయిలో 79 మందిని అక్కడ చంపారు. 2012 నుండి, కొలంబియాలో ఇలాంటి హత్యలు 461 జరిగాయి. ఇంట ఎక్కువగా మరే దేశంలోనూ జరగలేదు.

కొలంబియా తర్వాత బ్రెజిల్‌లో 25 మంది మరణించగా, మెక్సికో, హోండురాస్‌లో 18 మంది చొప్పున మరణించారు. కార్యకర్తలకు అత్యంత ప్రమాదకరమైన ప్రాంతాలలో ఒకటిగా సెంట్రల్ అమెరికా మారింది; హోండురాస్‌లో గత ఏడాది తలసరి హత్యలు అత్యధికంగా జరిగాయి.

వ్యవస్థీకృత నేర ముఠాలు, భూ ఆక్రమణదారుల కారణంగా 2022లో ప్రతి రెండవ రోజు ఒక పర్యావరణ రక్షణ కార్యకర్త హత్యకు గురయ్యారని గ్లోబల్ విట్‌నెస్ డేటా చూపిస్తుంది. కొలంబియాలో అత్యంత ఘోరంగా, 60 హత్యలు నమోదయ్యాయి.

ప్రపంచ జనాభాలో కేవలం 5% మందికి మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ, మొత్తం హత్యలలో 34% మంది ఆదివాసీ సముదాయాలకు చెందినవారు వుండడాన్ని చూస్తే చాలా ఎక్కువ నిష్పత్తిలో వారిని లక్ష్యంగా పెట్టుకున్నారని గణాంకాలు చూపిస్తున్నాయి. గ్లోబల్ విట్‌నెస్ కొత్త గణాంకాల ప్రకారం 2012- 2022 సంవత్సరాల మధ్య కనీసం 1,910 మంది పర్యావరణ కార్యకర్తలు హత్యకు గురయ్యారు; అత్యధిక హంతకులకు శిక్ష పడలేదు.

2022 సంవత్సరంలో కొలంబియా తర్వాత బ్రెజిల్, మెక్సికో, హోండురాస్, ఫిలిప్పీన్స్ అత్యంత ప్రాణాంతక దేశాలు. జులైలో బ్రెజిలియన్ కార్యకర్త బ్రూనో పెరీరా, జర్నలిస్టు డోమ్ ఫిలిప్స్ హత్యలతో సహా అన్ని ప్రాణాంతకమైన దాడుల్లో 88% లాటిన్ అమెరికాలో నమోదయ్యాయి.

ఈ గణాంకాలు 2021లో నమోదైన 200 హత్యల కంటే తక్కువైనప్పటికీ, ఇంకా ఎక్కువగానే ఉన్నాయి, వాతావరణ-క్లిష్టమైన పర్యావరణ వ్యవస్థల పర్యావరణ రక్షణా కార్యకర్తలకు ప్రత్యేక రక్షణ కల్పించాలని గ్లోబల్ విట్‌నెస్ పిలుపునిచ్చింది. ఎలక్ట్రిక్ కార్లు, విండ్ టర్బైన్‌ల ఉత్పత్తిలో ఉపయోగించే అరుదైన ఖనిజాల వెలికితీతతో సహా లాటిన్ అమెరికా, ఆసియా, ఆఫ్రికాలో వనరుల కోసం పోటీ హింసకు కారణమని నివేదిక పేర్కొంది.

“చాలా కాలంగా, కార్యకర్తలపై ప్రాణాంతక దాడులకు పాల్పడిన వారు హత్య ఆరోపణలను తప్పించుకున్నారు. బాధ్యతారహితమైన కార్పొరేట్, ప్రభుత్వ చర్యల నుండి ముప్పు ఉన్నప్పటికీ, ప్రజల ఈ ప్రపంచవ్యాప్త ఉద్యమం, తమ ఇళ్ళను, సముదాయాలను రక్షించుకోవాలనే సంకల్పం, నిబద్ధతతో ఐక్యంగా ఉంది- వారి నోళ్ళు మూయించలేరు; మూయించబోరు” అని గ్లోబల్ విట్‌నెస్‌ ప్రచారశాఖ కో-డైరెక్టర్ శృతి సురేష్ అన్నారు.

గ్లోబల్ విట్‌నెస్ గత 11 సంవత్సరాలుగా ప్రతి ఏటా రూపొందించిన నివేదిక, తమ భూములు, పర్యావరణ వ్యవస్థలను రక్షించుకోవడానికి ప్రయత్నిస్తున్న ప్రజలకు సురక్షితమైన వాతావరణాలను సృష్టించేందుకు ఇప్పటికే ఉన్న చట్టాలను అమలు చేయాలని ప్రభుత్వాలను డిమాండ్ చేసింది. తమ సరఫరా శ్రేణులు,  కార్యకలాపాలు హింసను ప్రోత్సహించడంలో పాల్గొనకుండా చూసుకోవాలని పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చింది.

ప్రపంచవ్యాప్తంగా దాడుల గణాంకాలు, ముఖ్యంగా ఆఫ్రికా, ఆసియాలో తక్కువగా రిపోర్టు అయ్యాయి. పర్యావరణ రక్షకులను నిశ్శబ్దం చేయడానికి ఉద్దేశించిన ప్రాణాంతకమైన దాడులు బహుశా చాలా ఎక్కువగా ఉండవచ్చు, కానీ రికార్డ్ చేయడం చాలా కష్టం అని గ్లోబల్ విట్‌నెస్ అభిప్రాయపడింది.

ఆదివాసీ సముదాయాలపై జరుగుతున్న దాడులు ప్రత్యేక ఆందోళన కలిగిస్తున్నాయని రిపోర్టు సలహాదారు, అటవీ పరిపాలనా నిపుణురాలు లారా ఫ్యూరోన్స్ అన్నారు.

“ఆదివాసులు అడవులకు ఉత్తమ సంరక్షకులు; అందువల్ల పర్యావరణ సంక్షోభాన్ని తగ్గించడంలో ప్రాథమిక పాత్ర పోషిస్తారని పరిశోధనలు పదేపదే చూపించాయి. బ్రెజిల్, పెరూ, వెనిజులా వంటి దేశాల్లో సరిగ్గా అలాచేస్తున్నందుకే వారిని చుట్టుముడుతున్నారు. మనం అడవులను సంరక్షించాలంటే, అడవులు ‘మా ఇళ్ళు’ అనే ఆదివాసుల భద్రతపై ఆ సంరక్షణ ఆధారపడి ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి.

(శైలేంద్ర చౌహాన్ రచయిత-సాహిత్యవేత్త)

తెలుగు: పద్మ కొండిపర్తి

Leave a Reply