2023 సంవత్సరానికి వివిధ దేశాల రక్షణ వ్యయానికి సంబంధించి ఏప్రిల్‌ 22న స్టాక్‌ హోమ్‌ ఇంటర్నేషనల్‌ పీస్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (సిప్రి) ఒక నివేదికను విడుదల చేసింది. ప్రపంచ దేశాల సైనిక వ్యయం ఆల్‌టైమ్‌ గరిష్టానికి పెరిగింది. ప్రపంచ సైనిక వ్యయం 2023లో 2443 బిలియన్ల డాలర్లకు చేరుకుందని  ఇది 2022 వ్యయం కంటే 6.8 శాతం పెరుగుదలను సూచిస్తుంది. భౌగోళిక రాజకీయ అనిశ్చితి సైనిక వ్యయం పెరుగుదలకు కారణంగా విధితమవుతుంది. ఇందుకు పెరుగుతున్న ప్రాంతీయ ఉద్రిక్తతలు, యుద్ధాలు, అభద్రత, ఆధిపత్య ధో రణులు అని చెప్పవచ్చు. యునైటెడ్‌ స్టేట్స్‌, చైనా, రష్యా తోడ్పాటుతో చాల దేశాలు సైనిక వ్యయాన్ని పెంచుకుంటున్నాయి. 2009 తర్వాత మొదటిసారిగా ఐదు భౌగోళిక ప్రాంతాలలో సైనిక వ్యయం పెరిగింది. ముఖ్యంగా యూరప్‌, ఆఫ్రికా, ఆసియా ఓషియానా, పశ్చిమాసియాలో భారీగా సైనిక వ్యయ పెరుగుదల నమోదైంది. రక్షణ అవసరాల కోసం అత్యధికంగా ఖర్చు చేస్తున్న దేశాల జాబితాలో అమెరికా మొదటి స్థానంలో నిలిచింది. ఇది 2023లో 91,600 కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. రెండవ స్థానంలో చైనా, మూడవ స్థానంలో రష్యా, నాల్గవ స్థానంలో భారత్‌, ఐదవ స్థానంలో సౌది అరేబియాలు నిలిచాయి. 2023 సంవత్సరంలో ప్రపంచ సైనిక వ్యయంలో 61 శాతం వాటాను ఈ ఐదు దేశాలు కలిగి ఉన్నాయి. చిన్న దేశం యుక్రెయిన్‌ 8వ స్థానంలో నిలువడం విశేషం.

అమెరికా, చైనా, రష్యాల తర్వాత 83.6 బిలియన్‌ డాలర్ల వ్యయంతో 2023లో ప్రపంచంలోనే మిలిటరీ ఖర్చు చేసే దేశాల్లో భారత్‌ నాలుగో స్థానంలో ఉందని స్టాక్‌హోమ్‌ ఇంటర్నేషనల్‌ పీస్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌(సిప్రి) ప్రచురించిన నివేదికలో పేర్కొంది. భారతదేశ సైనిక వ్యయం 2022తో పోలిస్తే 2023లో 4.2 శాతం పెరిగింది. భారత్‌ తన సైనిక వ్యవస్థను ఆధునీకరించడానికి 2023లో 83.6 బిలియన్ల డాలర్లను (8360 కోట్ల డాలర్లు) కేటాయించింది. విస్తరణవాద కాంక్షతో, పొరుగున ఉన్న పాకిస్తాన్‌ చైనాను సాకుగా చూపుతూ, అమెరికా ప్రోద్భలంతో రక్షణ వ్యవస్థ సామర్థ్యాన్ని పెంపొందించడంపై తన వ్యూహాత్మక ప్రాధాన్యతను ప్రదర్శిస్తుంది. ఈ పెట్టుబడితో యుద్ధ విమానాలు, చాపర్లు, యుద్ధనౌకలు, ట్యాంకులు, హెలికాప్టర్లు, ఫిరంగి తుపాకులు, రాకెట్లు, క్షిపణులు, మానవ రహిత సామర్థ్యాలు, ఇతర వ్యవస్థలతో భారత్‌ తన సైన్యాన్ని ఆధునీకరిస్తోందని సిప్రి పేర్కొంది. భారత్‌ సైనిక వ్యయంలో 4వ స్థానంలో నిలువడం వరుసగా రెండవసారి. 2014తో పోల్చితే సైనిక వ్యయం గత పదేళ్లలో 47 శాతం పెరుగుదలను సూచిస్తుంది. భారత్‌కు రష్యా ప్రధాన ఆయుధ సరఫరా దారుగా ఉంది.

ప్రపంచంలో అత్యంత శక్తివంతంగా ఎదగాలనే రేసులో అన్ని దేశాలు తమ సైన్యాన్ని బలోపేతం చేసేందుకు తమ రక్షణ బడ్జెట్‌ను నిరంతరం పెంచుకుంటున్నాయి. తాజాగా వెల్లడిరచిన బ్లూమ్‌బెర్గ్‌ నివేదిక ప్రకారం, వచ్చే దశాబ్దకాలం నాటికి జి7 దేశాలు ఆయుధాలపై కేటాయింపులు దాదాపు 10 ట్రిలియన్ల డాలర్లు ఉంటుందని పేర్కొంది. ప్రపంచ పునర్వ్యవస్థీకరణలో భాగంగా భారీ వ్యయంతో కూడిన ఆయుధాల సంపత్తిపై ఆయా దేశాలు భారీగా ఖర్చు పెడుతున్నాయి. గత ఏడాది ప్రపంచ రక్షణ వ్యయం రికార్డు స్థాయిలో 2.2 ట్రిలియన్‌ డాలర్లకు చేరుకుంది. అయితే ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న భద్రతా సమస్యల దృష్ట్యా, చైనా సైనిక దూకుడును అరికట్టడానికి అధునాతన ఆయుధ సామాగ్రి దిగుమతులను భారత్‌ కొనసాగిస్తుందా? అనేది వేచి చూడవలసిన అంశం.

సైనిక వ్యయంలో చైనా కూడా వెనుకంజ వేయలేదు. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో, ఇతర ప్రాంతాలలో దాని భద్రతను పెంచుకోవడానికి, చైనా తన సైనిక వ్యయాన్ని నిరంతరం పెంచుతోంది. 2023 సంవత్సరానికి 296 బిలియన్లకు పెంచింది. దీంతో అమెరికా తర్వాత రెండవ అతిపెద్ద సైనికవ్యయ దారుగా మారింది. అలా చేయడం ద్వారా బీజింగ్‌ తన సైనిక వ్యయాన్ని 2022తో పోలిస్తే 6 శాతం పెంచింది. 2023 అక్టోబర్‌ 7 తర్వాత ఇజ్రాయెల్‌ గాజాపై యుద్ధానికి దిగడంతో ఇజ్రాయెల్‌ సైనిక వ్యయం గత సంవత్సరం కంటే 2023లో 24 శాతం పెరిగి 27.5 బిలియన్‌ డాలర్లకు చేరుకుంది. ఇది పశ్చిమాసియాలో సౌది అరేబియా తర్వాత రెండవ దేశంగా ఉంది. యుక్రెయిన్‌తో యుద్ధం కారణంగా రష్యా యొక్క సైనిక వ్యయం 2023లో 24 శాతం పెరిగి 109 బిలియన్‌ డాలర్లకు చేరుకుంది. గత 30 ఏళ్లలో లేనంతగా ఐరోపాలో సైనిక వ్యయం 13 శాతం పెరిగింది. ఇటీవల నాటోలో చేరిన ఫిన్లాండ్‌ సైనిక వ్యయం 36 శాతం పెంచింది. అలాగే లిథువేనియా సైనిక వ్యయం 27 శాతం పెంచింది. ప్రపంచ దేశాల్లో ఆర్థిక అనిశ్చితి, పేదరికం, నిరుద్యోగం ఉన్నప్పటికీ సైనిక వ్యయం మాత్రం పెరుగుతోంది.

చిన్న దేశం యుక్రెయిన్‌ 2023 సైనిక వ్యయం 64.8 బిలియన్‌ డాలర్లను తాకింది, మిత్రదేశాల నుండి సైనిక సహాయంగా 35 బిలియన్‌ డాలర్లను ఎయిడ్‌గా పొందింది. 2023లో కైవ్‌ రక్షణ వ్యయం రష్యా పరిణామంలో 59 శాతం ఉంది. అయితే విదేశీ సైనిక సహాయంతో సహా 91 శాతానికి పెరిగింది. రష్యా-యుక్రెయిన్‌ యుద్ధం ప్రపంచ ఆయుధ వ్యాపారులకు లాభసాటిగా మారింది. అమెరికా నేతృత్వంలోని నాటో దేశాల భద్రత కోసం, యుక్రెయిన్‌లో గత రెండు సంవత్సరాల యుద్ధం నాటో భద్రతా దృక్పథాన్ని మార్చింది. బెదిరింపు అవగాహనలతో ఈ మార్పు నాటో దేశాల జిడిపిలో పెరుగుదలను సైనిక వ్యయం వైపు మళ్లించడంలో ప్రతిబింబిస్తుంది, నాటో లక్ష్యం 2 శాతం ఎక్కువగా చేరుకోవడానికి థ్రెషోల్డ్‌గా కాకుండా బేస్‌లైన్‌గా కనిపిస్తుందని సిప్రి సైనిక వ్యయ పరిశోధకుడు లోరెంజో స్కరాజాటో చెప్పారు. యుక్రెయిన్‌ కోసం రష్యాతో అణు యుద్ధానికి సిద్ధమేనని నాటో దేశాలు బెదిరింపులకు దిగుతున్నాయి. రష్యా కూడ తాము అణు యుద్ధానికి సిద్ధమే అంటుంది. అణు యుద్ధమే జరిగితే ప్రపంచం భస్మీపటలం కాక తప్పదు.

పశ్చిమాసియాలో యుద్ధాలు, ఉద్రిక్తతలు గత దశాబ్ద కాలంలో అతిఎక్కువ సైనిక వ్యయం పెరుగుదలకు కారణంగా నిలిచింది. పశ్చిమాసియాలో 2022 సైనిక వ్యయంపై 9 శాతం పెరిగి 200 బిలియన్‌ డాలర్లకు చేరుకుంది. ఇవాళ ప్రపంచ ఆయుధ దిగుమతుల్లో పశ్చిమాసియా 30 శాతం వాటాను కలిగి ఉంది. ఈ ప్రాంతం ప్రపంచంలోనే అత్యధికంగా సైనికీకరించబడిన ప్రాంతంగా మారింది. ఆసియాలో ఇంత సైనిక వ్యయం గతంలో ఎన్నడూ జరుగలేదు. గాజా, యుక్రెయిన్‌ యుద్ధం మాత్రమే కాదు. తైవాన్‌పై చైనా ఒత్తిడి కారణంగా ప్రపంచ ఆయుధ పోటీ మరింత పెరిగింది. బీజింగ్‌ పెట్టుబడుల దూకుడు ఆసియా-పసిఫిక్‌ దేశాలను, జపాన్‌, తైవాన్‌ను ప్రభావితం చేస్తున్నాయి. చైనా సైన్యాన్ని శరవేగంగా ఆధునీకరిస్తోంది. భూమి, గాలి, సముద్రం అలాగే అణు, అంతరిక్షం, సైబర్‌ ట్రాడిషనల్‌ డొమైన్‌లలో నూతన టెక్నాలజీతో దూసుకుపోతుంది. దానిలో భాగంగా ఈ ఏడాది సైనిక బడ్జెట్‌ను గణనీయంగా పెంచింది. ఇది మన దేశం కంటే దాదాపు నాలుగు రెట్లు ఎక్కువ. చైనా తమ తూర్పు, దక్షిణ సముద్ర తీరాలతో పాటు తైవాన్‌లో యూఎస్‌ నేతృత్వంలోని కూటమి జోక్యాన్ని నిరోధించడానికి సైనిక వ్యయం ఎక్కువగా ఖర్చు చేస్తుంది. సైనిక వ్యయంలో ప్రపంచ దేశాల అపూర్వమైన పెరుగుదల శాంతి భద్రతల క్షీణతకు దారితీసే ప్రమాదం ఉంది. 

 అత్యధికంగా మిలిటరీ ఖర్చు చేస్తున్న టాప్‌ 10 దేశాలు : అమెరికా- 916 బిలియన్‌ డాలర్లు, చైనా- 296 బిలియన్‌ డాలర్లు, రష్యా – 109 బిలియన్‌ డాలర్లు, భారత్‌-84 బిలియన్‌ డాలర్లు, సౌదీ అరేబియా- 76 బిలియన్‌ డాలర్లు, బ్రిటన్‌- 75 బిలియన్‌ డాలర్లు, జర్మనీ- 67 బిలియన్‌ డాలర్లు, ఉక్రెయిన్‌- 65 బిలియన్‌ డాలర్లు, ఫ్రాన్స్‌- 61 బిలియన్‌ డాలర్లు, జపాన్‌- 50 బిలియన్‌ డాలర్లు. 2013-23 మధ్య ప్రధాన ఆయుధాల దిగుమతులో పలు దేశాల ప్రపంచ మార్కెట్‌లో వాటా ఇలా ఉంది. భారత్‌ 9.8 శాతం, సౌదీ అరేబియా 8.4 శాతం, ఖతార్‌ 7.6 శాతం, యుక్రెయిన్‌ 4.9 శాతం, పాకిస్తాన్‌ 4.3 శాతం, జపాన్‌ 4.1 శాతం, ఈజిప్ట్‌ 4 శాతం, ఆస్ట్రేలియా 3.7 శాతం, దక్షిణకొరియా 3.1 శాతం, చైనా 2.9 శాతం.

 భారత రక్షణ రంగ తయారీ పరిశ్రమ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది. మన దేశంలో ప్రైవేట్‌ రంగానికి చెందిన రక్షణరంగ ఉత్పత్తుల సంస్థలతో పాటు ప్రభుత్వ నియంత్రణలోని ఆయుధ తయారీ సంస్థలు కలిసి పని చేస్తున్నాయి. వాటిలో హెచ్‌ఏఎల్‌, మజగాన్‌ డాక్‌, భారత్‌ ఫోర్జ్‌, భారత్‌ డైనమిక్స్‌, పారాస్‌ డిఫెన్స్‌ అండ్‌ స్పేస్‌, భారత్‌ ఎలక్ట్రానిక్స్‌, ఐడియా ఫోర్జ్‌, ఎటిఏఆర్‌ టెక్నాలజీస్‌, డేటా ప్యాటర్న్స్‌, సోలార్‌ ఇండస్ట్రీస్‌, గోవా షిప్‌యార్డ్‌, తనేజా ఏరోస్పేస్‌ ఉన్నాయి. దేశంలోని ఆయుధ తయారీ మార్కెట్‌ పరిమాణం 2024లో 17.40 బిలియన్‌ డాలర్లుగా అంచనా వేశారు. ఇది 2029 నాటికి 23.05 బిలియన్‌ డాలర్లకు చేరుతుందని నిపుణుల అంచనా.  దేశీయ రక్షణ రంగ పరిశ్రమ అమెరికా, రష్యా, చైనా, యుకె, జర్మనీ, ఫ్రాన్స్‌, ఇజ్రాయెల్‌ వంటి ప్రపంచంలోని అగ్రశ్రేణి ఆయుధ తయారీ దేశాల సరసన చేరింది.

అమెరికా విదేశీ సైనిక విక్రయాల వ్యవస్థ ప్రత్యక్షంగా 80.9 బిలియన్‌ డాలర్ల అమ్మకాల్లో సంప్రదింపులు కొనసాగించింది. తద్వారా 2022 ఆర్థిక సంవత్సరంలో 55.9 శాతం ఆయుధ విక్రయాల పెరుగుదల సాధించింది. 2023లో 157.5 బిలియన్‌ డాలర్ల వాణిజ్య విక్రయాలు జరిగాయి. హై మొబిలిటి ఆర్టిలరీ రాకెట్‌ సిస్టం (హెచ్‌ఐఎంఎఆర్‌ఎస్‌) పోలెండ్‌కు సరఫరా చేసింది. వీటి ఖరీదు 12 బిలియన్‌ డాలర్లు. జర్మనీకి 8.5 బిలియన్‌ డాలర్ల ఖరీదైన సిహెచ్‌ 47 ఎఫ్‌ చినూక్‌ హెలికాప్టర్లను సరఫరా చేసింది. నేషనల్‌ ఎడ్వాన్స్‌డ్‌ సర్ఫేస్‌ టు ఎయిర్‌ మిస్సైల్‌ సిస్టం అంటే భూతలం మీద నుంచే ఆకాశంలో శత్రు లక్ష్యాలను ఛేదించగల అత్యాధునిక విధ్వంసక వ్యవస్థను యుక్రెయిన్‌కు సరఫరా చేయనుంది. ఈ విధంగా అమెరికా రెచ్చగొడుతున్న యుద్ధోన్మాద చర్యల ప్రభావం కనబడుతోంది. చెక్‌ రిపబ్లిక్‌ కూడా 5.6 బిలియన్‌ డాలర్లతో ఎప్‌35జెట్‌ విమానాలను కొనుగోలు చేసింది. దక్షిణ కొరియాకు 5.62 బిలియన్‌ డాలర్లు విలువైన ఆయుధాల వీటిలో ప్రధానంగా ఎఫ్‌35 ఎయిర్‌ క్రాఫ్ట్‌లు, 1.5 బిలియన్‌ డాలర్లు విలువైన సిహెచ్‌47ఎఫ్‌ చినూక్‌ హెలికాప్టర్లు ఉన్నాయి. ఆయుధ వ్యాపారాన్ని గణనీయంగా పెంచుకోవటంతో పాటు కొత్తకొత్త ప్రాంతాలలో అమెరికా వివాదాలు సృష్టిస్తోంది. ఇందుకోసం గూఢచారి సంస్థ(సిఐఎ) ముమ్మరంగా పనిచేస్తోంది.

అమెరికా రక్షణ బడ్జెట్‌ మొత్తం 1 ట్రిలియన్‌ డాలర్ల మొత్తాన్ని అధిగమించే అవకాశం ఉంది. అయితే వాస్తవ సంఖ్య రహస్యంగానే ఉంటుంది. ఎందుకంటే సైనిక సంబంధిత వ్యయంలో ఎక్కువ భాగం నిఘా, సైనిక ఉపగ్రహ ప్రయోగాలు, ఇతర కార్యకలాపాలుగా వర్గీకరించబడి ఉంటుంది. అమెరికా సైనిక వ్యయానికి సంబంధించి బహిరంగంగా లభించే గణాంకాల ఆధారంగా చూసినప్పటికీ అది అనూహ్య స్థాయిలోనే ఉంటుంది. మొత్తం ప్రపంచ సైనిక వ్యయంలో ఒక్క అమెరికా వాటానే 39 శాతం ఉంది. ఇది అమెరికా తరువాత అత్యున్నత స్థాయిలో సైనిక వ్యయం చేస్తున్న 11 దేశాల మొత్తం సైనిక వ్యయాన్ని కలిపిన దానితో సమానం కాదు. అమెరికా నాయకత్వంలోని నాటో కూటమి దేశాల 300 బిలియన్ల సంయుక్త సైనిక వ్యయం, ఆసియాలో అమెరికా మిత్రదేశాలు (క్వాడ్‌ అని పిలవబడే ఇండియా, జపాన్‌, ఆస్ట్రేలియా) చేస్తున్న 160 బిలియన్ల సైనిక వ్యయం, అలాగే పశ్చిమాసియాలో అమెరికా కనుసన్నల్లో మెలిగే సౌదీ అరేబియా, ఇజ్రాయెల్‌, ఖతార్‌, యుఎఇ కలిపి చేస్తున్న 130 బిలియన్ల సైనిక వ్యయం అంటే అమెరికా, దాని ప్రధాన మిత్రదేశాల సంయుక్త సైనిక వ్యయం అంతా కలిపి చూపినప్పుడు అది 1.5 ట్రిలియన్‌ డాలర్ల మొత్తాన్ని మించి ఉంటుంది. ఇది మొత్తం ప్రపంచంలోని సైనిక వ్యయంలో మూడిరట రెండు వంతులుంటుంది. రష్యా, చైనాల సంయుక్త సైనిక వ్యయం కంటే నాలుగు రెట్లు ఎక్కువ. ఈ స్థాయిలో అమెరికా, దాని మిత్ర దేశాలు చేస్తున్న సైనిక వ్యయం ప్రపంచ యుద్ధానికి సన్నాహామా అన్న సందేహం కలుగుతుంది.

 సుదీర్ఘ  చారిత్రక క్రమంలో అమెరికన్‌ సామ్రాజ్యవాద ఆర్థిక స్థితి గణనీయంగా క్షీణించింది. రెండో ప్రపంచ యుద్ధం ముగిసేనాటికి ప్రపంచ స్థూల జాతీయోత్పత్తిలో దాదాపు 50 శాతంగా ఉన్న అమెరికా వాటా 1960 కల్లా 40 శాతానికి, 1971 కల్లా 27 శాతానికి పడిపోయింది. ప్రెసిడెంట్‌ రిచర్డ్‌ నిక్సన్‌ చెల్లింపుల లోటు పెరుగుతున్న కారణంగా డాలర్‌ను బంగారంగా మార్చుకునే విధానాన్ని 1973లో రద్దు చేశాడు. క్షీణిస్తున్న అమెరికా ఆర్థిక స్థితి, అది చేస్తున్న భారీ సైనిక వ్యయం మధ్యగల ఈ వైరుధ్యం అమెరికా తన విదేశాంగ విధానంలో అనుసరిస్తున్న యుద్ధోన్మాదాన్ని  వివరిస్తుంది. అమెరికా ఆర్థిక వ్యవస్థను త్వరలో అధిగమించనున్న  చైనాను దెబ్బ కొట్టే విషయంలోనూ, చైనా మిత్రదేశాలైన రష్యా, ఇరాన్‌, ఉత్తర కొరియాలను లంగదీసుకోవటానికి ప్రయత్నించే విషయంలోనూ అమెరికాలోని రెండు ప్రధాన పెట్టుబడిదారీ రాజకీయ పార్టీలైన డెమోక్రాట్లు, రిపబ్లికన్ల మధ్య ఏకాభిప్రాయం ఉంది. చైనాను రెచ్చగొట్టి, ఆ దేశంతో ఘర్షణకు దిగాలని అమెరికా ద్రవ్య పెట్టుబడిదారీ వర్గం, దాని రాజకీయ నాయకత్వం ప్రయత్నిస్తున్నాయి.

సమకాలీన ప్రపంచం ద్రవ్యోల్బణం, అధిక ధరలు, నిరుద్యోగం, పేదరికం, ఆర్థిక అంతరాలు వంటి సవాళ్లను ఎదుర్కొంటుంది. అయినా, ఈ సవాళ్లను పరిష్కరించడానికి ప్రయత్నించకుండా సైనిక వ్యయాన్ని పెంచుకుంటూ పోవడం శాంతిభద్రతల క్షీణతకు దారితీస్తుందని సిప్రి సైనిక వ్యయం, ఆయుధాల ఉత్పత్తి కార్యక్రమానికి సీనియర్‌ పరిశోధకుడు నాన్‌ టియాన్‌ చెప్పారు. 2008లో ఏర్పడ్డ ఆర్థిక సంక్షోభం ఇప్పటికి తేరుకోలేదు. ప్రజల కొనుగోలు శక్తి క్షీణించింది. మార్కెట్లు మందగించి వృద్ధి రేటు కుంటు పడుతుంది. ప్రపంచ వృద్ధి రేటు 2022లో 3.1 శాతం ఉండగా 2023లో 2.1 శాతానికి పడిపోయింది. 2024లో మరింత క్షీణించే అవకాశాలు ఉన్నాయని ఐఎంఎఫ్‌, ప్రపంచ బ్యాంక్‌లు ఆందోళన వ్యక్తం చేశాయి. ప్రపంచంలో నిరుద్యోగం 5.1 శాతం నుంచి 2023లో 5.2 శాతానికి పెరిగిందని ప్రపంచ కార్మిక సంస్థ (ఐఎల్‌ఒ) తెలిపింది. ఇటీవలి దశాబ్దాలలో పలు దేశాలలో ఆదాయం, సంపద అసమానతలు భయంకరంగా పెరిగినట్లు ప్రపంచ అసమానతల ల్యాబ్‌ పరిశోధన వెల్లడిరచింది. పెరుగుతున్న అసమానతలు, నిరుద్యోగం, పేదరికం సామాజిక అసంతృప్తిని రేకెత్తిస్తున్నాయని తెలిపింది. పెరుగుతున్న అసమానతలు రాజకీయాల పట్ల వ్యతిరేకతను, ప్రభుత్వ సంస్థల పట్ల అపనమ్మకాన్ని పెంచుతుందని ప్రపంచ అసమానతల ల్యాబ్‌ (డబ్య్లూఐఎల్‌) నివేదిక పేర్కొంది. అంతిమంగా ఆర్థిక అనిశ్చితి, యుద్ధ వాతావరణం, భౌగోళిక రాజకీయ స్థిరత్వాన్ని దెబ్బ తీస్తుందని, ప్రజా ఆందోళనలు ఉధృతమవుతాయని అసమానతల ల్యాబ్‌ పరిశోధన స్పష్టం చేసింది.

Leave a Reply