(ఇటీవల విడుదలైన పలమనేరు బాలాజీ కవితా సంపుటి *లోపలేదో కదులుతున్నట్లు*కు రాసిన  ముందుమాట )

ఒక ఊరి పేరు చెప్పగానే ఓ రచయిత గుర్తుకు రావడం అసాధారణ విషయం .ఊరు పేరుకి తన కవిత్వానికి,అస్తిత్వాన్ని నిలిపి నిలుపుతూ కొనసాగుతున్న రచయిత పలమనేరు బాలాజీ. ఊరి పేరును ఇంటిపేరుగా స్థిరపరచుకున్నారు. ఈ రచయిత కవిత్వం ,కథ ,నవల, విమర్శ ఇలా నాలుగు స్తంభాలాట ఆడుతూ విజయవంతంగా ముందుకెళ్తున్నారు.

గతంలో మాటల్లేని వేళ ,ఇద్దరి మధ్య అంటూ  పాఠకుల్ని పలకరించారు. బాలాజీ కవిత్వానికి మనిషితనం కేంద్ర బిందువు. ఎలా ఉండాల్సిన మనుషులు ఇలా ఎందుకు అయ్యారు ?అనేది ఆ కవి చేస్తున్న కంప్లైంట్. మనుషులు ఎలా ఉండాలి ?వాళ్ళ మధ్య ఏర్పడిన ఖాళీలు మనుషుల మనసుల్లో పేర్కొన్న కలుషితం ఏంటి? ఈ మానసిక కాలుష్యానికి కారణాలు ఏమిటి?  మొదటినుంచి బాలాజీ అన్వేషణ ఇదే.

 హృదయం 72 మీద ఉంటుంది, కానీ ఎలాంటి అనుభూతులు ఉండవు. మెదడు ఆరోగ్యంగానే ఉంటుంది కానీ అనారోగ్యమైన ఆలోచనలు ఉంటాయి. శారీరక లెక్కలన్నీ సరిగానే ఉంటాయి. మానసిక కొలతల్లోనే తేడాలుంటాయి. నీడలను కూడా నమ్మలేని కాలాన్ని, కనబడకుండానే అంత ఎత్తున పెరుగుతున్న గోడల్ని బాలాజీ బహిష్కరించమంటున్నాడు.

అనుభవాలు రెండు రకాలుగా ఉంటాయి. అందులో వైయుక్తిక అనుభవాన్ని స్పష్టంగా చెప్పడం ద్వారా కవిత్వంలో సార్వజనీనత ఏర్పడుతుంది. మనదైన అనుభవం నుండి వచ్చిన వాక్యానికి నిజాయితీ ఉంటుంది ఇతరుల అనుభవాలను కవిత్వీకరిస్తే అవి కేవలం అభిప్రాయ ప్రకటనలుగా  మిగిలిపోతాయి.

బాలాజీ అక్షరాల్లో ఆత్మ మనిషితనం. ఇతని పలవరింత మనిషి. కవిత్వ కలవరింత మనిషి. ఇతని కవిత్వ కాంతి మనిషితనం. వాక్యం చిరునామా మనిషితనం. భవిష్య వీలునామా మంచితనం. అసలు మనిషి అంటే ఏంటో మనుషులు ఇంకా తెలుసుకోలేదని ఆర్తితో బాలాజీ కవిత్వం ముడిపడి ఉంటుంది కవి వాక్యం మాట్లాడుతుంది.

 మో అన్నట్టు  వాస్తవం సహజం అవ్వాలి. సహజం సత్యం అవ్వాలి .అనుభవం అనుభూతి అవ్వాలి. అప్పుడు అది దార్శనికత అవుతుంది.  ఈ మాటలు బాలాజీ కవిత్వానికి సూచికల్లా పనిచేస్తాయి.

 ” లోపలేదో ఉన్నప్పుడు

 లోపలేదో తిరుగుతున్నప్పుడు

 లోపలేదో కలవర పెడుతున్నప్పుడు లోపలేదో కదిలించి కలిగిస్తున్నప్పుడు తప్పకుండా మనుషులు బతికే ఉంటారు”

జీవితాన్ని ప్రతి క్షణం పరిశీలించిన అనుభవించిన కవి మాత్రమే ఇలాంటి వాక్యాలు రాయగలడు . ఈ కవి దృష్టిలో మనిషి అంటే మంచులా కరగాలి .గాలిలా తిరగాలి. పిట్టలాపలకరించాలి. వాన జల్లులా విచ్చుకోవాలి .మబ్బులా కదలాలి .అమ్మకందారులు కొనుగోలుదారుల మధ్య తప్పిపోయిన మనిషి జాతి గురించి బాలాజీ కలవర పడుతున్నాడు. ప్రొఫైల్ పిక్చర్ మార్చినంత సులభంగా మనుషుల్ని వదులుకునే వారిని బాలాజీ కవిత్వం

అసహ్యించుకుంటుంది. ప్రేమించటం, జీవించటం ప్రేమతో జీవించడం అంటే ఫేస్బుక్లో అకౌంట్ ప్రారంభించినంత సులభం కాదని  అసలు ప్రేమ అంటే ఏమిటో,జీవిత లాలస అంటే ఏమిటో మనుషులు  నిర్లక్ష్యం చేస్తున్నారని బాధపడతాడు .

 “మనిషి లోపలి మనసుని

మనిషి లోపలి శిశువుని

నిత్యం కాపాడుకునేవాడే

కవీ, మనిషీ”

బాలాజీ వాక్యాలు నిరాడంబరంగా ఉంటూనే భావోద్వేగాలను ప్రసారం చేస్తాయి. ఒక పరిపక్వతతో కూడిన ధ్యానంతో వస్తువుని సొంతం చేసుకోవడం కనిపిస్తుంది. తాను ఎంచుకున్న వస్తువుకి సంబంధించి పూర్తి వాతావరణం లోకి అతను ప్రవేశిస్తూనే మనల్ని తీసుకెళ్తాడు. తాను దర్శించిన మూలాలను సారాంశంగా ప్రకటించి పాఠకుడిని ఆలోచింపజేసేలా చూస్తాడు.

దైనందిన జీవన అనుభవాలు, తాత్వికత,అనుభూతుల్ని కోల్పోతున్న మనుషుల్ని హెచ్చరిస్తాడు.

బాలాజీ కవిత్వం తేటగా ఉంటుంది .చదవగానే లోపలికి వెళ్తుంది .ప్రతి చర్యను ప్రారంభిస్తూ ఉద్వేగాన్ని కలిగిస్తుంది .సాహిత్యం మానవ జీవితాలకు ప్రతిబింబం .ఈ వాక్యానికి నూరు నూరు శాతం  బాలాజీ వాక్యం సాక్ష్యంగా నిలుస్తుంది. మనుషుల్ని అనుక్షణం మానవీయ విలువలతో మూల్యాంకనం చేసుకోమని అనుక్షణం మదింపు  చేసుకోమని అప్రమత్తం చేసే కవి బాలాజీ.

మనిషి పరాయికరణ చెందడం ఎప్పటినుంచో ఎంతోమంది కవులు చెబుతూనే ఉన్నారు. వ్యక్తి, కుటుంబం ,సమాజం  ఈ మూడు ఒకదానిమీద ఒకటి ఆధారపడి ఉంటాయి.  ఎక్కడ సమతుల్యత దెబ్బ తిన్నా వైపరీత్యాలు తప్పవు.

గుళ్ళు కి వెళ్తాం. భజనలు చేస్తాం. దేవుడికి వినబడిన వినబడకపోయినా పాటల కడతాం. శ్లోకాలు చెప్తాం. సమూహాలు ముందు సమావేశాలు లక్షలాది భక్తుల ముందు మనిషిని కాపాడుకోవాల్సిన వాక్యాలు ప్రచారం చేయడం మాత్రం మానేస్తాం. మనుషుల్ని ఏవేవో ఆక్రమించేసాయి. ఈ ఆక్రమణల నుంచి కాపాడుకోవడానికి నాయనా నువ్వు మనిషివి రా అని గుర్తు చేయాలి.

తొడ బెల్లం పెట్టాలి .వీపు మీద గట్టిగా చరచాలి.  సమూహాలు సమావేశాల్లోనూ  బాలాజీ లాంటి కవులు రాసిన వాక్యాలను  మైకుల్లో వినిపించాలి. బాలాజీ మనుషుల పట్ల అపారమైన ప్రేమ కలిగిన కవి.

మనుషులు మొలకెత్తుతారు

“మనుషులు చిగురిస్తారు

మనుషులు ప్రవహిస్తారు పరవశిస్తారు

ఏ దేశంలో అయినా

ఏ కాలంలో అయినా మనుషులు మనుషులు కావడమే

మనిషి చరిత్ర”

బాలాజీ కవిత్వంలో మరో కోణం ఇల్లు, ఇంట్లో ఉండే వ్యక్తుల మధ్య ఉండాల్సిన సంబంధాలు. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఉండాల్సిన ప్రేమ ,అనురాగం ఒకరి పట్ల ఒకరకి ఉండవలసిన బాధ్యతలు, పరస్పర గౌరవం గురించి బాలాజీ చాలా కవితల్లో స్పృశించాడు. ఇంట్లో ఉండే స్త్రీల పట్ల ముఖ్యంగా సహచరి పట్ల, భర్త ఎలాంటి గౌరవం, బాధ్యత, ప్రేమ కలిగి ఉండాలో చెప్తాడు. స్త్రీ అంటే ఇల్లు, వసారా, పూలతోట ,వంటిల్లు అని చెబుతూనే అతడు ఆమె కాలేకపోవడాన్ని చివరికి ఆమె అతని క్షమించి ,ప్రేమించి ఆమె, అతడు అవుతుందని చెప్తూ పితృస్వామ్య వ్యవస్థలో స్త్రీల సర్దుబాటు గురించి ఎలాంటి  బేష జాలు లేకుండా ప్రకటించాడు.

 ” పనులు ఎప్పుడూ

 ఇద్దరవైతేనే

 ఏ ఇల్లు అయినా జీవితమైనా

 ఇద్దరిదీ అవుతుంది.”

 ఏ ఇంట్లో అయినా ఎప్పటికీ మూతపడని వంటిల్లు ఆమె అని గుర్తిస్తూనే ఒక్క పడక ఇంట్లోనే కాకుండా అన్ని పనుల్లో భర్త భాగస్వామ్యం కావాల్సిన అవసరాన్ని బాలాజీ గుర్తించమంటున్నాడు  ఆయన జీవితంలో భాగంగా ఉన్న స్త్రీలను గురించి ,ఆయన అడుగడుగునా తలుచుకున్నాడు. ఇంట్లో స్త్రీ నిద్రిస్తున్నప్పుడు  అమ్మ సహచరి కూతురు ఇలా ఎవరైనా కావచ్చు, అయితే వారి నిద్రలో అద్భుతం ఉంటుంది , కానీ ఏ ఒక్క రోజు ఇంట్లో మగాళ్ళ కన్నా ముందు వాళ్ళు నిద్రపోతే చూడాలని ఉంది అని కవి ఆశపడతాడు.

” వాళ్ల కన్నా ముందు నిద్రలేచి

వాళ్ళకన్నా ఆలస్యంగా నిద్రించే రోజు వాళ్ళ మొహాల్లో ,వాళ్ళ చేతుల్లో

వాళ్ళ కళ్ళల్లో

నవ్వుల్ని చూడాలి

నిరంతరం ప్రేమించి, నిరంతరం శ్రమించే వాళ్ళ నిద్ర

సోమరిపోతు ప్రపంచానికి ఒక మెలకువ” అంటూ  “ఆమె నిద్ర ”  అనే కవితలో ఆవిష్కరించాడు

అమ్మ , భార్య , కూతుర్లు ఈ ముగ్గురితోను ఆ ఇంటి తోను తనకున్న అనుబంధాన్ని అనేక వాక్యాల్లో చూపించాడు. కొత్తగా పెళ్లయిన దంపతులకు బాలాజీ రాసిన ఈ కవిత్వాన్ని కానుకగా ఇస్తే , అది గొప్ప కానుకగా నిలుస్తుందని నా భావన.

ఈ కవిత్వంలో బాలాజీకి మనుషుల పట్ల అపారమైన దయ కరుణ ,కనిపిస్తాయి. మనుషులకు మనుషులు ఎంత అవసరమో అడుగడుగు మనకు గుర్తు చేస్తూనే ఉంటాడు. వెంట ఉండేవాళ్లు వెంట వచ్చేవాళ్ళు అనే కవిత ఒక ప్రవాహ వేగంతో సాగుతూ  భూమి మీద పడినప్పుడు కన్నా మంచం మీద పడినప్పుడు ఆసుపత్రిలో ఉన్నప్పుడు మనిషి విలువ మరో మనిషికి తెలుస్తుందంటాడు. పెళ్ళియ్యాక కొందరు భార్యను స్త్రీగా చూడరు. సేవకురాలుగా చూస్తారు. రకరకాల ఆదేశాలు జారీ చేస్తారు. మాటలతో వేధిస్తారు .హింసిస్తారు .తక్కువగా చూస్తారు. కానీ ఏదైనా ప్రమాదం జరిగి ఆసుపత్రిలో భర్త మంచం మీద పడినప్పుడు భార్య అవేమి గుర్తుపెట్టుకోకుండా సేవలు చేస్తుంది. ప్రాణానికి పహరా కాస్తుంది. చిన్న బిడ్డకు చేసినట్టే అన్నీ పనులు చేస్తోంది.  అలాగే అనుకోకుండా ఎంతోమంది ప్రమాదాల్లోనూ, వ్యాధులతోనూ ఆసుపత్రి పాలైనప్పుడు  మనిషికి మరో మనిషికి ఆసరా ఎంత అవసరమో చెప్తూ అలాంటి అవసరాలు గుర్తించాలంటే ఒక్కసారైనా ఆసుపత్రి దర్శించాలని చెప్తాడు.

”  మనుషుల వెంట మనుషులు ఎంత అవసరమో

మనుషుల వెంట ఉండే మనుషు

లెంతటి విలువైన ఖనిజాలో

చెప్పే దేవాలయాలు, బోధివృక్షాలు ఆసుపత్రులు “

ఈ వాక్యాలు చూడడానికి సాదాసీదాగా అనిపించవచ్చు. కానీ ఇందులో ఒక జీవితకాలపు జీవితం ఉంటుంది. జీవితం మీద ఉండాల్సిన ప్రేమ విలువ తెలుస్తుంది. అందుకే ఈ కవిత్వం నిండా మనుషులు మనిషిని కోల్పోవడం కన్నా మనిషిని మనిషి పోగొట్టుకోవడమే పెద్ద దుఃఖంగా ఆయన వ్యాఖ్యానిస్తారు.

బాలాజీ కవిత్వంలో ఈ మధ్యకాలంలో కనిపిస్తున్న మరొక అంశం మరణం ,ఆ తాలూకా , జ్ఞాపకాలు బహుశా బాలాజీ తన తల్లిని కోల్పోయాక  , ఆ ఖాళీ నుంచి ఈ విధమైన ఆర్తిని పొందినట్టుగా కనిపిస్తోంది. అనేక చోట్ల మరణం గురించి కవి మాట్లాడటం గమనించవచ్చు.

 ” మనుషులు మనుషుల్ని పోగొట్టుకోవడమే మరణం మనుషులు మనసులు పోగొట్టుకోవడమే మరణం మనుషులు జ్ఞాపకాలను పోగొట్టుకోవడమే మరణం”

అంటూ మరణానికి కొత్త నిర్వచనాన్ని ఇచ్చాడు. అందరి మరణాలు మరణాలు కావు మనుషుల్ని, స్వేచ్ఛని ప్రేమించిన వాడు మనుషుల కోసం మనుషులతో బ్రతికినవాడు చెమట రక్తం ,కన్నీళ్లు, మరొకరు కోసం కార్చినవాడు మరణించిన మరణమే మరణం అలాంటి జీవితమే జీవితం అంటూ  నిర్ధారిస్తాడు. చిత్తడి తప్పని చిరపుంజి లాంటి మనసులో లోపలి మనం చనిపోయేంతవరకు ,ఎవరు ఎక్కడికి వెళ్ళరని ఆ జ్ఞాపకాలు అలానే కొనసాగుతాయని తన అమ్మని గుర్తు చేసుకుంటాడు.

 ఆయన ఎంచుకునే వస్తువులు కూడా చాలావరకు మన నిజ జీవితానికి దగ్గరగా ఉంటాయి .ఆయన కవితా శీర్షికలు ఏది చూసినా మనకిట్టే ఆ విషయం అర్థం అవుతుంది. మానవ సంబంధాలు ,మానవ జీవితంలోని ఉద్వేగాలు ప్రేమరాహిత్యం , ప్రపంచీకరణ ఈయన కవిత్వంలో ప్రధాన వస్తువులుగా మనకు కనిపిస్తూ ఉంటాయి. బాలాజీ  ఉపయోగించే భాష, నడక అంతా చాలా సరళంగా సూటిగా ఉంటూ ఎవరికైనా ఇట్టే అర్థమయ్యేలాగా ఉంటాయి. 100 కవితల్లో ఉన్నా పలమనేరు బాలాజీ కవితని ఇట్టే గుర్తించొచ్చు .కచ్చితంగా ఆయన నడకలో ఒక ఉద్వేగం,లేదా భావ పరంపర వరుస మనకు కచ్చితంగా చేరుతుంది. ఆ వాక్యాల వెంట పాఠకుడు హాయిగా ప్రయాణిస్తాడు. సారాంశం ఒక్కటే అన్నట్లు కొన్ని చోట్ల ఉన్నా , ఆ భావన కవి పదేపదే   మనుషులు ఉండాల్సిన చేతిలో ఉండడం లేదనే తపన లొంచి వచ్చినవిగా భావించాలి. 

పాప చేతిలో ఉన్నప్పుడు అనే కవిత ను చదివితే ఒక చిన్న ఆనందం లో నుంచి పుట్టిన వాక్యం

అలా వాగై పొంగి అద్భుతమైన కవితగా రూపుదిద్దుకున్న విధానం  ఎలాంటి  పాఠకుడినైనా ఆకర్షిస్తుంది. తన మనవరాలు చేతుల్లోకి తీసుకున్న ఆ క్షణాల్ని  ప్రభావంతంగా రికార్డ్ చేశారు. అలాంటి పాపల చేతుల్లో ఉన్నప్పుడు మనం మళ్ళీ పిల్లలమైపోతామని మనం మళ్ళీ మనుషులం అయిపోతామని చెప్పడం ద్వారా మనుషుల్లో దూరమైన దయ ,ప్రేమ , వాత్సల్యం కరుణని జ్ఞప్తికి తెస్తాడు.

”  పాప చేతుల్లో ఉన్నప్పుడు మనసు పైన వర్షం కురిసినట్టు కలతలు, దుఃఖాలు, బాధలన్నీ

 ఎటో కొట్టుకుపోయి

 నేను తేలికైపోతాను

 మళ్ళీ పసివాడినై పోతాను”

అని చెప్తూ తన లోకి తాను చూసుకుంటూ మనల్ని  కూడా చెక్ చేసుకోమంటాడు. సామాజిక చైతన్య, ఉద్యమ ప్రభావాలు కూడా బాలాజీ కవితల్లో కనిపిస్తాయి. రెండు ఆకాశాలు వాళ్లు ,అరణ్యం ఆదివాసిదే,రద్దు  ఇలాంటి కవితలు  . కవుల కి కవి సమయాలు ఉన్నట్టు బాలాజీకి టీ సమయాలు ఉంటాయి.  అన్నంతినే సమయాలు ఉంటాయి. ఇల్లంతా కలిసి తినడం లేదా మిత్రులతో కలిసి టీ తాగడం ఈ రెండు సందర్భాల్లో జీవిత సౌందర్యాన్ని బాలాజీ గొప్పగా పొందుతానని అంటూ ఉంటారు. అందుకే ఆయన కవిత్వం మొత్తం మొక్కలు నాటినట్టు మనుషుల్ని నాటవలసిన కాలాన్ని గురించే మాట్లాడతారు. మన కాలం లో విలువైన కవి బాలాజీ.

భేషజాలు లేకుండా అందరితో ఆత్మీయంగా కలిసిపోయే సాహిత్య స్నేహపూర్వక వ్యక్తిత్వం పలమనేరు బాలాజీ ప్రత్యేకత. అదే అతడి సాహిత్యంలో ప్రతి పేజీలో కనిపిస్తుంది. పలమనేరు వెళ్లిన ప్రతి కవి లేదా రచయితలు  ఆయన ఆతిథ్యం నుండి తప్పించుకోలేరు. సాహిత్యం పట్ల గొప్ప గౌరవంతో, నిబద్దతతో ఉంటారు.

త్వరలో మరో కొత్త కవితా సంపుటి (లోపలేదో కదులుతున్నట్లు)తో మనల్ని పలకరించబోతున్న

సందర్భంగా ఆయనకి హృదయపూర్వక శుభాకాంక్షలు.

మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా విధులు నిర్వహిస్తూ, పలమనేరు కేంద్రకంగా నిరంతరం అనేక జాతీయ రాష్ట్రస్థాయి , జిల్లాస్థాయి , సాహిత్య కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తూ,  కొత్త  రచయితలను కవులను ఎంతో ప్రోత్సహిస్తూ, వాళ్లకు విలువైన పుస్తకాలను  అందజేస్తూ, మరోవైపు కవిగా రచయితగా నవలాకారుడుగా విమర్శకుడిగా పలమనేరు బాలాజీ చేస్తున్న ప్రయాణం అత్యంత వేగంగా, చురుకుగా కొనసాగుతూ ఉంటుంది. ఆ చురుకుదనం ,ఆవేగం ,ఆ ఉత్సాహం వెనకాల తన కుటుంబ సభ్యులు, తన మిత్రబృందం అండదండలే అందుకు కారణంగా చెప్పవచ్చు.

ఎప్పుడైనా పలమనేరు వెళ్తే బాలాజీ గారికి ఫోన్ చేయండి టీ తాగుతూ , సాహిత్యాన్ని పంచుకునే క్షణాల్ని ఆస్వాదించే అద్భుతమైన రోజును కానుకగా ఇస్తాడు.

One thought on “బ్రతికించే మాటల్నివాగ్దానం చేసే కవి బాలాజీ

  1. సుంకర గోపాల క్రిష్ణగారు సమీక్ష అద్బతంగా రాశారు

Leave a Reply