1980 దశకంలో నెమ్మదించిన వృద్ధి, వాణిజ్య అసమతుల్యత, క్షీణిస్తున్న సామాజిక పరిస్థితుల్లో సామ్రాజ్యవాద ప్రపంచీకరణ శకం ప్రారంభమైంది. సామ్రాజ్యవాద ప్రపంచీకరణ ఆర్థిక విధానాలు అమలులోకి వచ్చిన 1990 నుండి ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలో ఆటు పోట్లు ఏర్పడుతోన్నాయి. పర్యావరణ సమస్యలు, యుద్ధాలు. ఫలితంగా వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు సంక్షోభంలోకి జారుకున్నాయి. ద్రవ్యోల్భణం, నిరుద్యోగం, పేదరికం పెరిగింది. ప్రపంచ ద్రవ్య సంస్థలు, కార్పొరేట్లు, ఆయా దేశాలలోని ఆశ్రితులు విపరీత లాభాలు గడిరచి బిలియనీర్లుగా మారుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా దేశాల మధ్య, దేశాలలోని ప్రజల మధ్య ఆర్థిక అంతరాలు అనూహ్యంగా పెరిగాయి. మరోవైపు దేశాల రుణభారం పెరిగింది. సహజ వనరుల లూటీ పెరిగింది. అడవులు ధ్వంసమయ్యాయి, నిర్వాసితులు పెరిగిపోతున్నారు. అవినీతి పరాకాష్టకు చేరింది. పర్యవసానంగా ప్రజా ఉద్యమాలు పెల్లుబికాయి. అదే సమయంలో పలు దేశాల్లో మితవాద, మతవాద ప్రభుత్వాలు అధికారంలోకి వస్తోన్నాయి.
ఆర్థిక విధానాల్లో సామ్రాజ్యవాద ప్రపంచీకరణలో మూడు అంశాలు చోటు చేసుకున్నాయి. (సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ) విధానాలు ఆచరణలోకి వచ్చాయి. సరళీకరణ అంటే ప్రభుత్వ ఆంక్షలు, నియంత్రణలను సడలించి పారిశ్రామిక, ద్రవ్య, విత్త, విదేశీ విధానం, విదేశీ పెట్టుబడి పట్ల ఉదార వైఖరిని పాటించడాన్ని వివరిస్తాయి. ప్రైవేటీకరణ అంటే ప్రభుత్వ రంగ సంస్థలు, విధులు ప్రైవేట్ రంగపరం చేయడాన్ని తెలుపుతుంది. ప్రపంచీకరణ అంటే పెట్టుబడి, సాంకేతిక విజ్ఞానం, వస్తుసేవలు, శ్రామిక గమన శీలతపై ఆంక్షలు తొలగించి స్వేచ్ఛా మార్కెట్ విధానానికి మార్పు సుగమనం చేయడాన్ని సూచిస్తుంది. ప్రపంచ దేశాలు అన్నీ ఈ సంస్కరణలు చేపట్టాయి. ఒక్క మాటలో చెప్పాలంటే దేశాల సార్వభౌమత్వాన్ని అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడికి తాకట్టు పెట్టాయి. ప్రజా సంక్షేమాన్ని మార్కెట్‌కు వదిలేసి రాజ్యం శాంతి భద్రతలు చూడడానికి మాత్రమే పరిమితమైంది. దేశసంపద, సహజవనరులు, శ్రమ, మార్కెట్‌ను దోచుకుంటున్నాయి. దేశ వనరులు, సంపద ప్రజలది కాకుండా పోతోంది.
ప్రపంచీకరణ లక్ష్యాలు :
1. ద్రవ్యలోటు, రెవెన్యూలోటును బడ్జెట్‌లో తగ్గించాలి. 2. శ్రామికవర్గ హక్కులను కట్టడి చేయాలి, సమ్మెలు నివారించాలి. 3. పారిశ్రామిక లైసెన్స్ విధానాన్ని ఎత్తి వేయాలి. 4. విదేశీ ద్రవ్య పెట్టుబడులను ప్రోత్సహించడానికి దిగుమతి సుంకాలు, కోటాలు ఎత్తి వేయాలి. 5. ప్రజల అభివృద్ధి కాకుండా ఆర్థిక వృద్ధి రేట్ పెంచాలి. 6. తక్షణ సమస్యకు సంబంధించి స్థూల ఆర్థిక స్థిరీకరణ చర్యలు తీసుకోవాలి. దీర్ఘకాలానికి సంబంధించి నిర్మాణాత్మక సర్దుబాటు చర్యలు చేపట్టాలి.
స్థూల ఆర్థిక స్థిరీకరణ చర్యలు అంటే ఆర్థిక వ్యవస్థలో తక్షణం చేపట్టే సర్దుబాటు చర్యలు. ఈ చర్యలను డిమాండ్ నిర్వహణ చర్యలు అంటారు. దీనిలో భాగంగా ద్రవ్య సప్లయ్‌ని తగ్గించడం ద్వారా ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడం అంటే సంక్షేమ పథకాలను, సబ్సిడీలకు కోత విధించడమే. కోశ సర్దుబాటు చర్యల్లో భాగంగా రాబడిని (పన్నులు పెంచి, ప్రభుత్వ ఆస్తులను విక్రయించి) పెంచి, ప్రభుత్వ వ్యయాలను తగ్గించడం చేయాలి. విదేశీ చెల్లింపుల్లో లోటును తగ్గించేందుకు మూల్యహీనీకరణ (డివాల్యూయేషన్) లాంటి చర్యలు తీసుకోవడం.
నిర్మాణాత్మక సర్దుబాటు (స్ట్రక్చరల్ అడ్జస్ట్‌మెంట్) చర్యలు దీర్ఘకాలానికి చెందినవి. దీనిలో భాగంగానే సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ అనే మూడు విధానాలు ప్రవేశ పెట్టడానికి చర్యలు తీసుకున్నారు.
ప్రపంచీకరణ విధానాలే ఆర్థిక సంక్షోభానికి కారణం :
ఇవాళ ప్రపంచంలోని పలు దేశాలు ఆర్థిక సంక్షోభాలను ఎదుర్కొంటున్నాయి. ప్రపంచీకరణ ఆర్థిక సంస్కరణలు అమలును నిలిపివేయాలని పలు దేశాలలో ప్రజలు, రైతులు, కార్మికులు, ఉద్యోగులు, విద్యార్థులు, మహిళలు ఉద్యమాలు చేస్తోన్నారు. కొన్ని దేశలిలలో ప్రజల తిరుగుబాటుకు ప్రభుత్వాలు కుప్పకూలి పోతున్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి వేగం 2008 సంక్షోభం తర్వాత తగ్గిందన్నది నిస్సందేహం. అమెరికాలోని కొందరు మితవాద ఆర్థికవేత్తలు సైతం ‘ఇది దీర్ఘకాలిక మాంద్యం’ అంటున్నారు. జిడిపిని (స్థూల జాతీయోత్పత్తి) లెక్కించే విధానాలు ఆయా దేశాల్లో చాలావరకూ విశ్వసనీయత కలిగినవి కావు. ఇక మొత్తతం ప్రపంచానికి సంబంధించి ప్రత్యేకంగా చెప్పనవసరమే లేదు. భారతదేశంలో అధికారిక లెక్కలను అనేకమంది పరిశోధకులు ప్రశ్నిస్తున్నారు. అధికారులేమో 7 శాతం, ఆ పైబడి వృద్ధిరేటు ఉన్నట్టు చూపుతున్నారు. కాని ఈ పరిశోధకులు అది 4 శాతం నుండి 4.5 శాతానికి మించదని, ఈ పరిస్థితి గత కొన్ని సంవత్సరాలుగా ఇదే మాదిరిగా ఉంటోందని గట్టిగా చెప్తున్నారు. ప్రభుత్వ నియంత్రణలో ఆర్థిక వ్యవస్థ కొనసాగిన గత కాలంతో పోల్చి సామ్రాజ్యవాద ప్రపంచీకరణ ఆర్థిక విధానాల కాలంలో జిడిపి వృద్ధిరేటు గురించి చంకలు గుద్దుకోవడం అర్థం లేనిది. మరోవైపు అసమానతలు బాగా పెరిగిపోతున్నాయి. పోషకాహార లభ్యత గురించి లభిస్తున్న గణాంకాలను బట్టి శ్రామిక ప్రజానీకపు స్థితిగతులు బాగా క్షీణించాయని స్పష్టంగా చెప్పవచ్చు.
1990కి ముందు ప్రభుత్వాల నియంత్రణలో దేశాల ఆర్థిక వ్యవస్థలు నడిచినప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటు ప్రపంచీకరణ కాలంలోని వృద్ధిరేటు కన్నా చాలా ఎక్కువగా ఉంది. ‘‘మార్కెట్టే సర్వశక్తి సంపన్నం’’ అంటూ ఇప్పుడు జరుగుతున్న చర్చల్లో సామ్రాజ్యవాద ప్రపంచీకరణ ఆర్థిక విధానాలు అమలు జరుగుతున్న కాలంలోని వృద్ధిరేటు బాగా ఎక్కువగా ఉందన్న అభిప్రాయం కలుగుతుంది. ఈ అభిప్రాయం పూర్తిగా తప్పు. వాస్తవానికి ప్రపంచీకరణ కాలంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటు గణనీయంగా మందగించింది. ప్రభుత్వ నియంత్రణలో ఆర్థిక వ్యవస్థలు నడిచిన కాలానికి, ప్రపంచీకరణ ఆర్థిక విధానాలు అమలు కావడం మొదలైన నాటికి మధ్య కొంత వ్యవధి ఉంది. ఈ కాలంలో వృద్ధిరేటు 5.4 శాతం నుండి 2.9 శాతానికి పడిపోయింది. 1967 నుండి ద్రవ్యోల్బణం వేగవంతం అయి 1973-74 వరకూ కొనసాగింది. దానిని అదుపు చేయడానికి పెట్టుబడిదారీ వర్గం ప్రభుత్వ వ్యయాన్ని కుదిస్తూ, భారీ స్థాయిలో నిరుద్యోగాన్ని పెంచే వ్యూహాన్ని అనుసరించింది. అప్పటి నుంచీ దేశాల ఆర్థిక వ్యవస్థల మీద ప్రభుత్వాల నియంత్రణ నిలిచిపోయింది. ఇలా వృద్ధిరేటు మందగించిపోవడం ప్రపంచీకరణ ఆర్థిక విధానాలను ప్రవేశపెట్టడానికి కావలసిన భూమికను కల్పించింది. అప్పటికే పెరుగుతూ అంతకంతకూ అంతర్జాతీయ స్వభావాన్ని సంతరించుకుంటున్న ద్రవ్య పెట్టుబడి అంతకు ముందునుంచే ప్రపంచీకరణ ఆర్థిక విధానాలకు మళ్ళాల్సిందేనంటూ ఒత్తిడి పెంచుతోంది. సరిగ్గా ఆ సమయానికే పాత విధానాల పర్యవసానంగా ముందు ద్రవ్యోల్భణం, తర్వాత వృద్ధిరేటు మందగించడం జరిగాయి.
అమెరికాలో 2008 హౌజింగ్ బుడగ పేలింది. అనంతర కాలంలో (2007-2010 మధ్య సంభవించిన అమెరికా బహుళ జాతి ఆర్థిక సంక్షోభం ప్రపంచ ఆర్థిక సంక్షోభానికి దోహదపడిరది. ఆనాటి నుంచి వృద్ధిరేటు మందగమనం కొనసాగుతూనే ఉంది. 2007లో హౌజింగ్ బుడగ బద్ధలైపోవడంతో పెట్టుబడిదారీ ప్రపంచం మొత్తంగా సంక్షోభంలో పడిరది. అప్పుడు ఆర్థిక వ్యవస్థను నిలబెట్టడానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున జోక్యం చేసుకుంది ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వాల జోక్యం ఉండరాదనే ప్రపంచీకరణ బండారం దీనితో బైటపడిరది. కాని వాస్తవ ఆర్థిక వ్యవస్థకు దాని నుంచి ఎటువంటి ప్రేరణ లభించలేదు. 2008 నుంచి మందగించిన వృద్ధిరేటు పుంజుకోలేదు. 2008-18 మధ్యకాలంలో ఆర్థిక వృద్ధిరేటు 2.7 శాతం ఉండగా 2018-22 కాలంలో వృద్ధిరేటు 2.1 శాతం మాత్రమే ఉన్నది. ఇదేసమయంలో ఆదాయాల మధ్య అసమాతలు బాగా పెరిగాయి.
ప్రపంచ ఆదాయం మొత్తంలో అధిక భాగం జనాభాలోని అత్యంత సంపన్నులైన 10 శాతం ప్రజలు పొందుతున్నారు. వీరి ఆదాయాలు ఏటా కనీసం 2 శాతం చొప్పున పెరుగుతున్నాయనుకుంటే అప్పుడు తక్కిన 90 శాతం మంది ఆదాయాలూ ఏ పెరుగుదలా లేకుండా స్తంభించిపోయినట్టే కదా. అంటే ప్రపంచీకరణ చివరి దశలో పెట్టుబడిదారీ వ్యవస్థ ప్రపంచ జనాభాలో అత్యధిక ప్రజానీకపు ఆదాయాలు పెరుగుదల లేకుండా స్తంభించిపోయేట్టు చేసిందని స్పష్టం అవుతోంది. ఇది పాత వలస పాలనా కాలాన్ని గుర్తుకు తెస్తోంది. అప్పుడు కూడా ప్రపంచంలోని అత్యధిక శాతం ప్రజల నిజ ఆదాయాలు పెరగకపోగా తరిగిపోయాయి. ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వృద్ధిరేటు పెరగాలంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో డిమాండ్ పెరగాలి. అంటే ప్రజల కొనుగోలు శక్తి పెరగాలి. ప్రజల కొనుగోలు శక్తి పెరగాలంటే ప్రభుత్వం అందుకు వీలుగా వ్యయాన్ని పెంచాలి. ఆ పెరిగే వ్యయాన్ని ద్రవ్యలోటును పెంచడం ద్వారానో లేక సంపన్నుల మీద పన్నులను అదనంగా విధించడం ద్వారానో భరించాలి. కాని ఈ రెండిరట్లో దేనినీ అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి అంగీకరించదు. ప్రభుత్వం ఆయా దేశాలకు విడివిడిగా ఉంటుంది. కాని ద్రవ్య పెట్టుబడి అంతర్జాతీయ స్వభావాన్ని కలిగి ఉంది. అందుచేత ఏ దేశంలోనైనా తన ఆదేశాలకు భిన్నంగా జరిగితే వెంటనే ద్రవ్య పెట్టుబడి క్షణాల్లో ఆ దేశాన్ని వదిలిపెట్టి పోతుంది. అలా వెళ్ళిపోకుండా నిలుపు చేయాలంటే ఆయా దేశాల ప్రభుత్వాలు అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి అడుగులకు మడుగులత్తక తప్పదు. అందుచేత ప్రభుత్వ జోక్యం ద్వారా మార్కెట్‌లో డిమాండ్‌ను, ప్రజల కొనుగోలు శక్తిని పెంచడం అనేది జరుగాలి. కాని అలా జరుగదు. ఎందువల్లనంటే ద్రవ్య పెట్టుబడి ఆదేశాల చట్రం లోపల అది జరగని పని.
ఇక ఆయా దేశాల ప్రభుత్వాలు జోక్యం చేసుకోగలిగేది ఒక్క ద్రవ్య విధానం ద్వారా మాత్రమే. ఇక్కడ కూడా ఒక దేశం తన వడ్డీ రేట్లను సంపన్న దేశాలలో అమలౌతున్న వడ్డీ రేట్లకన్నా మరీ తక్కువగా నిర్ణయించకూడదు. ముఖ్యంగా అమెరికాలోని వడ్డీ రేట్లతో పోల్చుకున్నపత్పుడు తేడా ఎక్కువ ఉండకూడదు. ఒకవేళ వడ్డీ రేట్లను బాగా తగ్గించి ప్రజలకు ఎక్కువ ధనాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ఏ ప్రభుత్వం అయినా అనుకుంటే అప్పుడు ఆ స్వల్ప వడ్డీ రేట్లు ఆకర్షణీయంగా లేవంటూ ఇక్కడి బ్యాంకుల్లో ఉన్న డిపాజిట్లను అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి వేరే చోటికి తరలించుకుపోతుంది. ప్రస్తుతం తన ఇష్టం వచ్చినట్టు వడ్డీ రేట్లను పెంచడం గాని, తగ్గించడం గాని చేయగలిగే శక్తి ఒక్క అమెరికాకు మాత్రమే ఉంది. అక్కడ గనుక డిమాండ్‌ను పెంచడం కోసం వడ్డీ రేట్లను తగ్గిస్తే అప్పుడు తక్కిన దేశాలలో కూడా వడ్డీరేట్లను తగ్గించడానికి వీలౌతుంది. ఐతే, ప్రస్తుతం అమెరికాలో వడ్డీ రేట్లు దాదాపు సున్నా శాతానికి చేరుకున్నాయి. అయినా ఆర్థిక వ్యవస్థ కోలుకోవడం లేదు. దీర్ఘకాలంగా ఇలా వడ్డీరేట్లను అతి తక్కువగా కొనసాగించడంతో కార్పొరేట్లు తమ లాభాల మార్జిన్‌ను పెంచుకోవడానికి సరుకుల ధరలను పెంచడం మొదలెట్టాయి. దానితో ద్రవ్యోల్బణం వేగం పుంజుకుంది. పాపం! కీన్స్! మాంద్యం రాకుండా పెట్టుబడిదారీ వ్యవస్థే దీర్ఘకాలం కొనసాగాలని కలలు గన్నాడు. అందుకోసం ప్రభుత్వ జోక్యాన్ని ఒక పరిష్కారంగా సూచించాడు. కాని ఇప్పుడది సాధ్యమయ్యేది కాదని తేలిపోయింది. కీన్స్ కల పీడకలగా మిగిలిపోయింది. ప్రస్తుత ప్రపంచీకరణ పెట్టుబడిదారీ వ్యవస్థ పరిస్థితి ఈ విషయాన్ని స్పష్టంగా చూపుతోంది.
ఒకవైపు ప్రజావ్యతిరేక కార్పొరేట్ అనుకూల ఆర్థిక విధానాలు, మరోవైపు యుద్ధాలు, పర్యావరణ మార్పులు. కారణాలేమైతేనేం…ప్రపంచాన్ని క్రమంగా మాంద్యం మేఘాలు కమ్ముకుంటున్నాయి. జపాన్ ఇటీవలే ఆర్థిక మాంద్యపు ఛాయల్లోకి జారుకుంది. ప్రపంచంలో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల జాబితాలో మూడు నుంచి నాలుగో స్థానానికి దిగజారింది. బ్రిటన్ కూడా సాంకేతికంగా మాంద్యంలోకి జారుకుంది. అయితే ఇది ట్రైలర్ మాత్రమేనని ఆర్థికవేత్తలంటున్నారు. పదుల సంఖ్యలో దేశాలు ఆర్థిక ఒడిదొడుకులతో విపరీతంగా సతమతమవుతూ మాంద్యం దిశగా సాగుతున్నట్టు చెబుతున్నారు. ఇప్పటికే కనీసం మరో 18 దేశాలు ఈ జాబితాలోకి చేరడం కలవరపరుస్తోంది… ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం వరుసగా రెండు త్రైమాసికాల్లో దేశ స్థూల జాతీయోత్పత్తి (జిడిపి)లో తగ్గుదల నమోదైతే సాంకేతికంగా దాన్ని మాంద్యం కిందే పరిగణిస్తారు. 2023 డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికానికి జపాన్, బ్రిటన్ రెండూ ఈ మాంద్యం బారిన పడ్డాయి. ఇవి అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలు కావడంతో ఈ పరిణామం సర్వత్రా చర్చనీయంగా మారింది. కానీ ప్రపంచవ్యాప్తంగా చాలా చోట్ల చాలా దేశాల్లో మాంద్యం ఛాయలు ప్రస్ఫుటమవుతున్నాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. వీటిలో ఇప్పటికే మాంద్యం బారినపడ్డవి కొన్ని కాగా మరికొన్ని అతి త్వరలో ఆ ముప్పు దిశగా సాగుతున్నాయని హెచ్చరిస్తున్నారు.
జపాన్, బ్రిటన్‌తో పాటు ఐర్లాండ్, ఫిన్లాండ్ కూడా ప్రస్తుత ఆర్థిక సంవత్సర నాలుగో త్రైమాసికంలో సాంకేతిక ఆర్థిక మాంద్యం బారినపడ్డాయి. ఐర్లాండ్ జిడిపి మూడో త్రైమాసికంలో 0.7 శాతం తగ్గగా నాలుగో త్రైమాసికంలో ఇప్పటికే ఏకంగా 1.9 శాతం తగ్గుదల నమోదు చేసింది! ఫిన్లాండ్ జిడిపిలో వరుసగా 0.4, 0.9 శాతం తగ్గుదల నమోదైంది. నిజానికి చాలా దేశాల్లో ఈ పరిస్థితి నెలకొని ఉందని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. చాలా దేశాల నాలుగో త్రైమాసిక జిడిపి గణాంకాలు ఇంకా రావాల్సి ఉంది. అవి వెల్లడయ్యాక సాంకేతిక మాంద్యం జాబితాలోని దేశాల సంఖ్య బాగా పెరిగేలా కన్పిస్తోంది. అయితే కనీసం మరో 10 దేశాలు జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో జిడిపి తగ్గుదలను చవిచూశాయి. ఈ జాబితాలో కెనడా, న్యూజిలాండ్‌తో పాటు డెన్మార్క్, లగ్జెంబర్గ్, మాల్డోవా, ఎస్టోనియా, ఈక్వెడార్, బహ్రయిన్, ఐస్‌లాండ్, దక్షిణాఫ్రికా ఉన్నాయి. వీటిలో డెన్మార్క్, లగ్జెంబర్గ్, మాల్డోవా, ఎస్టోనియా మూడో త్రైమాసికంలోనే ఆర్థిక మాంద్యం నమోదు చేశాయి! ఇవేగాక తాజాగా నాలుగో త్రైమాసిక ఫలితాలు విడుదలైన మరో 9 దేశాల్లో కూడా జిడిపి తగ్గుదల నమోదైంది. వీటిలో ఆరు దేశాల్లో ఇటీవలి కాలంలో జిడిపి తగ్గుదల నమోదవడం ఇదే తొలిసారి! జిడిపి తగ్గుదల జాబితాలో జర్మనీ వంటి ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ కూడా ఉండటం యూరప్‌ను మరింత కలవరపెడుతోంది. ఇది మొత్తం యూరప్ ఆర్థిక వ్యవస్థనే ప్రభావితం చేయడం ఖాయమన్న అంచనాలు వెలువడుతున్నాయి. నాలుగో త్రైమాసికంలో యూరోజోన్ జిడిపి వృద్ధి సున్నాగా నమోదవడం వాటికి మరింత బలం చేకూరుస్తోంది. ఫ్రాన్స్ కూడా మాంద్యం బాట పడుతున్న సంకేతాలు ఇప్పటికే వెలువడుతున్నాయి.
భారత్‌లో అగాధంలోకి కీలక రంగాలు :
దేశ ఆర్థిక వ్యవస్థలో అత్యంత కీలకమైన మౌలిక వసతుల రంగాలు ప్రతికూల వృద్ధిని చవిచూశాయి. మూడున్నరేళ్ల తర్వాత తొలిసారి మైనస్ స్థాయికి పడిపోయాయి. కేంద్ర పరిశ్రమల, వాణిజ్య మంత్రిత్వ శాఖ సెప్టెంబర్‌లో వెల్లడిరచిన గణాంకాల ప్రకారం.. 2024 ఆగస్టలో ఎనిమిది కీలక రంగాల్లో 1.8 శాతం ప్రతికూల వృద్ధి నమోదయింది. ముఖ్యంగా బగ్గు, ముడి చమురు, సహజ వాయువు, రిఫైనరీ ప్రొడక్ట్స్, సిమెంట్, విద్యుత్ రంగాల్లో ఉత్పత్తి భారీగా క్షీణించింది. ఇంతకు క్రితం జూలైలో బగ్గు, ముడిచమురు, సహజ వాయువు, రిఫైనరీ ఉత్పత్తులు, ఎరువులు, స్టీల్, సిమెంట్, విద్యుత్ లాంటి ఎనిమిది కీలక రంగాలు 6.1 శాతం వృద్ధిని నమోదు చేశాయి. ఆగస్టు నెలలో బగ్గు, ముడి చమురు, సహజ వాయువు, రిఫైనరీ ఉత్పత్తులు, సిమెంట్, విద్యుత్ రంగాలు వరుసగా 8.1 శాతం, 3.4 శాతం, 3.6 శాతం, 1 శాతతం, 3 శాతం, 5 శాతతం చొప్పున ప్రతికూల వృద్ధి చోటుచేసుకున్నాయి. సహజ వాయువు ఉత్పత్తి వరుసగా రెండో మాసంలోనూ మందగించింది. గత తొమ్మిది నెలల్లో ఎన్నడూ లేని విధంగా సిమెంట్ రంగం క్షీణించగా… రిఫైనరీ ఉత్పత్తులు మూడు నెలల్లో రెండోసారి పతనమయ్యాయి. మరోవైపు ఎరువులు 3.2 శాతం వృద్ధితో కొంచెం నయమనిపించాయి. స్టీల్ ఉత్పత్తి 4.5 శాతానికి మందగించింది. 2023లో ఇదే నెలలో ఉక్కు రంగం 16.4 శాతం వృద్ధి సాధించింది. దేశంలోని మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపి)లో కీలక రంగాల వాటా 40.27 శాతంగా ఉంది. ఇంతటి ప్రాధాన్యత కలిగిన ఎనిమిది రంగాలు మైనస్‌లోకి జారుకోవడంతో దేశ ఆర్థిక వ్యవస్థ డిమాండ్‌లో తీవ్ర ప్రతికూల పరిస్థితులు నెలకొన్నాయని భావించవచ్చు. ఈ ఏడాది ఆగస్టులో కీలక రంగాల పరిశ్రమల ఉత్పత్తి భయంకరంగా పడిపోయిందని ఇక్రా రేటింగ్ ఏజెన్సీ పేర్కొంది. గడచిన 42 నెలల్లో ఇదే అతి పెద్ద పతనం అని తెలిపింది. ఇది మాంద్యానికి సంకేతం.
యుద్ధాలతో మరింత ఆర్థిక సంక్షోభం :
రష్యా- యుక్రెయిన్, ఇజ్రాయెల్-హమస్ యుద్ధాలు ప్రపంచవ్యాప్త సంక్షోభానికి దారితీస్తోన్నాయి. ఈ యుద్ధాలు కేవలం ఆయా దేశాలకే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా వివిధ రంగాలకు ప్రభావం చూపిస్తున్నాయి. వాణిజ్యం, ఆర్థిక వ్యవస్థలు, మౌలిక సదుపాయాలు, ప్రజల జీవన విధానాలు ఇలా అన్ని విభాగాల మీద యుద్ధాల ప్రభావం తీవ్రంగా కనపడుతోంది. ఈ రెండు ప్రధాన యుద్ధాల కారణంగా జరుగుతున్న పరిణామాలు, ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తానికి కారణం అవుతున్నాయి. రష్యా, యుక్రెయిన్ రెండు దేశాలూ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ముఖ్యమైనవి. ఈ యుద్ధం ఫలితంగా యుక్రెయిన్ మౌలిక సదుపాయాల ధ్వంసం ఒక విపత్కర దశలోకి చేరుకుంది. విద్యుత్‌గిడ్డు, నీటిపారుదల వ్యవస్థలు, రవాణా మార్గాలు, అనేక ముఖ్యమైన సౌకర్యాలు నాశనం అయ్యాయి. ఈ విధ్వంసం అనేక శతాబ్దాల సాధనను, ప్రగతిని తుడిచిపెట్టేసినట్టుగా చెప్పవచ్చు. గాజాపై ఇజ్రాయెల్ యుద్ధం వల్ల విద్యుత్, నీటి వనరులు, ఆస్పత్రులు వంటి ముఖ్యమైన సౌకర్యాలు దెబ్బతిన్నాయి. గాజాలో వేలాది ప్రజలు తమ జీవితాలను కోల్పోతున్నారు.
ముగింపు :
సామ్రాజ్యవాదం అంటేనే ప్రపంచీకరణ, ఇవాళ అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి కొత్త పుంతలు తొక్కుతూ విపరీతంగా దోపిడీ చేస్తోంది. ద్రవ్య పెట్టుబడిపై రాజ్యపు అదుపు ఉండదు. ఏ దేశానికి అది ప్రాతినిధ్యం వహించదు. ఒక దేశ ప్రయోజనాలను నెరవేర్చేదిగానూ ఉండదు. ప్రపంచీకరణ నేపథ్యంలో ఉత్పాదకతతో సంబంధం లేని నూతన ఆవిష్కరణలు ద్రవ్య పెట్టుబడి రూపాలుగా ముందుకు వచ్చాయి. ఆయా దేశాలలోని సహజ వనరులను, ఉత్పత్తి సంస్థలను స్వాధీనం చేసుకోవడానికి ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తోంది. క్రమంగా ఈ ద్రవ్య పెట్టుబడి మార్కెట్లను స్వాధీనం చేసుకుంటుంది. పోటీ పేరిట, లాభాల పేరిట శాశ్వత ఉపాధికీ, హెచ్చు వేతనాల పద్ధతికి గుడ్‌బై చెప్పేసింది. అంత ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలే. ఆదాయాల్లో అంతరాలు, సంపద పంపిణీలో అంతరాలు తీవ్రంగా పెరిగాయి. ఫలితంగా దీర్ఘకాలిక మాంద్యం విస్తృతమవుతోంది. యంఎన్‌సిలు వర్ధమాన దేశాల వనరులను, ప్రభుత్వ రంగ సంస్థలను కబళించాయి. మనం కళ్ల ముందే రైల్వేలు, రక్షణ రంగం, కమ్యూనికేషన్ రంగం, ఖనిజాలు, అడవులు బహుళజాతి సంస్థలకు దారాదత్తం చేసే పాలకుల చర్యలను చూస్తునే ఉన్నాం. అందువలన ఇవాళ మనం ఎదుర్కొంటున్న సమస్యలకు కారణమైన ద్రవ్య పెట్టుబడి మూలాలను తెలుసుకుంటూ, సమూల సామాజిక పరివర్తనకు, నిబద్ధమైన ఉద్యమాల నిర్మాణావశ్యకతను గుర్తించాల్సిన సందర్భం ఇది.