మానవ విమోచనను మార్క్స్, అంబేద్కర్ లు ఎలా అర్థం చేసుకున్నారు? మానవ విమోచన పట్ల వాళ్ల అవగాహనల గురించి ప్రఖ్యాత రచయిత, పౌర హక్కుల నేత, ప్రజా మేధావి ఆనంద్ తేల్ తుంబ్డె చేసిన లోతైన ఆసక్తికరమైన విశ్లేషణ ఈ పుస్తకం. ఆయన రాసిన ఇంగ్లీష్ పుస్తకాన్ని సి. పటేల్ తెలుగులోకి అనువదించగా భూమి బుక్ ట్రస్ట్ (హైదరాబాద్) మూడవ ముద్రణగా ప్రచురించింది.
భారతదేశ చరిత్రలో వివిధ రంగాలలో ఆవిర్భవించి ముందుకు వచ్చిన మానవ విమోచనకు సంబంధించిన దృక్పథాలలో మార్క్సిస్ట్, అంబేడ్కరిస్టు దృక్పథాలు ముఖ్యమైనవి . భారత సమాజపు పితృ స్వామిక, కుల, వర్గ పునాదుల రీత్యా అవి అత్యంత ప్రభావశీలమైనవిగా చరిత్రలో ఇంకా ప్రాసంగికంగా కొనసాగుతున్నాయి.
దళిత ప్రజా సమూహాల సమస్యలకు ఒక రాజకీయ పరిష్కారంగా ముందుకు వచ్చిన రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా విఫలం చెందడంతో 1970 తొలి నాళ్లలో మహారాష్ట్రలోని దళిత యువత నాయకత్వంలో దళిత పాంథర్ల ఉద్యమం ఆవిర్భవించింది. నిరాటంకంగా దళితులపై పెరుగుతున్న దురాగతాల ఫలితంగా అంబేడ్కరిజం అసంపూర్ణమని, అంబేడ్కరిజానికి మానవ విమోచనా సిద్ధాంతమైన మార్క్సిజాన్ని జోడించాలని దళిత పాంథర్లు ప్రయత్నించారు. అందులో భాగంగానే సాంప్రదాయ కుల పరిధులను దాటి అణచివేతకు గురవుతున్న సామాజిక సమూహాలకు చెందిన అన్ని ప్రజారాశులను దళితులుగా గుర్తిస్తూ ‘దళిత’ నిర్వచనాన్ని విస్తరించారు. వివిధ అణగారిన ప్రజారాశుల ఉద్యమాలతో మమేకతను ప్రతిపాదిస్తూ దళిత పాంథర్ల ఉద్యమం తన మేనిఫెస్టోను ప్రకటించింది. మానవ అణచివేత, విమోచనల పట్ల సార్వజనీన దృక్పథం ఆవశ్యకతను గుర్తించని అంబేద్కర్ వాదులైన ఒక సెక్షన్ దళిత పాంథర్లు దీనిని మార్క్సిస్టు ప్రణాళికగా పరిగణించి విడిపోయారు. అంబేద్కర్ చూపిన బౌద్ధ మార్గానికి ఈ ప్రణాళిక అనుగుణంగా లేదని వారు వాదించారు. కానీ దళిత ప్రజారాశుల సమస్యల పరిష్కారానికి ఎటువంటి నిర్మాణాత్మక రాజకీయ తాత్విక వాదనను ముందుకు తేలేకపోయారు. అయినప్పటికీ మెజారిటీ దళిత ప్రజారాశులు ఈ అంబేడ్కరిస్టు ధోరణికి, మార్క్సిజానికి ఇంకా ఆకర్షితులవుతూనే ఉన్నారు.
మరోవైపు, భారత ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ నుండి సిపిఎం విడిపోయి, ఆ తర్వాత దాని పార్లమెంటరీ పంథాను వ్యతిరేకిస్తూ నక్సలిజం ఆవిర్భవించింది. నక్సలైట్ ఉద్యమం భారతదేశాన్ని అర్థవలస,అర్థ భూస్వామ్య దేశంగా పరిగణించి చైనా విప్లవాన్ని తన స్ఫూర్తిగా తీసుకుంది. గ్రామీణ భారతంలోని రైతాంగ పోరాటాలకు తన మద్దతు ప్రకటించింది. అప్పటికింకా అంబేడ్కరిజం ప్రభావానికి లోను కాని (మహారాష్ట్రకు బయట ఉన్న) దళిత ప్రజానీకం ఈ నక్సలైట్ ఉద్యమం పట్ల పెద్ద సంఖ్యలో ఆకర్షితులయ్యారు. ముఖ్యంగా 1980 లలో గ్రామాలను తమ పోరాట క్షేత్రాలుగా చేసుకోవడం వల్ల, దళితుల ఇళ్లల్లో ఉండి వారిని ఆర్గనైజ్ చేయడం వల్ల దళితులు పెద్ద ఎత్తున నక్సలైట్ఉ ద్యమంలోకి కదిలి వచ్చారు. ఫలితంగా నక్సలైట్ ఉద్యమానికి కుల సమస్యను ఎదుర్కొనే అనివార్య పరిస్థితి తలెత్తింది. బీహార్ లాంటి రాష్ట్రంలోనైతే దళితులే నక్సలైట్ పార్టీ నాయకులుగా అగ్రకుల భూస్వామ్యంతో రాజీ లేకుండా పోరాడుతూ పార్టీ దాదాపుగా దళితుల పార్టీగా చలామణీ అవడం వల్ల అక్కడ కుల సమస్యను ప్రత్యేకంగా చేపట్టాల్సిన అవసరం రాలేదు. కానీ వేరే చోట్ల, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ లో పార్టీ నాయకత్వం దళితేతరుల చేతుల్లో ఉండడం వల్ల కార్యకర్తల నుండి కుల సమస్యకు సంబంధించిన పలు ప్రశ్నలని అది ఎదుర్కొన్నది. ఆనాడు కమ్యూనిస్టుల వైఖరి పునాది- ఉపరితలం అనే సాంప్రదాయ మార్క్సిస్టు భావనపై ఆధారపడి ఉన్నందువల్ల ఆర్థిక అంశాలను పునాదిగా, కులంతో సహా మిగతా వాటిని ఉపరితలాంశాలుగా పరిగణించారు. పునాదిలోని మార్పులకు అనుగుణంగానే ఉపరితలం ఉంటుందని భావించారు. ఆనాటి నక్సలైట్ ఉద్యమం ఫ్యూడలిజం పట్ల వ్యతిరేకతను బలంగా ప్రతిపాదించినప్పటికీ కుల సమస్య గురించి, కుల నిర్మూలన గురించి ప్రత్యేకంగా ఎక్కడా ప్రస్తావించలేదు. ఆసియా సమాజపు నిర్దిష్ట సమస్య అయిన కులం గురించి ఎప్పుడో కార్ల్ మార్క్స్ కొద్దిగానైనా ప్రస్తావించినప్పటికీ, తొలినాటి భారతీయ మార్క్సిస్టు ఆచరణలో కులాన్ని కనీసంగానైనా పట్టించుకోలేదు. ఆ తర్వాత 1980 లలో గ్రామాలను కేంద్రంగా చేసుకొని పోరాడే క్రమంలో దళిత ఆదివాసీ యువత కార్యకర్తలుగా ప్రవేశించడం వల్లనే నక్సలైట్ పార్టీ ప్రత్యేకంగా కులాల గురించి సీరియస్ గా ఆలోచించాల్సి వచ్చింది.
మార్క్స్ తో గాని, అంబేడ్కర్ తో గాని సంబంధంలేని సోషల్ డెమోక్రాట్లుగా పరిగణింపబడే ఉదారవాద సోషలిస్టులు మూడో శ్రేణిలో ఉంటారు. మార్క్స్ ప్రతిపాదించిన విప్లవాత్మక శాస్త్రీయ సోషలిజానికి భిన్నంగా సంస్కరణాత్మక ప్రజాస్వామిక సోషలిజాన్ని వీరు అనుసరిస్తారు. ఈ గ్రూపులో విద్యావేత్తలు, మధ్యేవాదులైన క్రియాశీల వామపక్షీయులుంటారు. వీరికి నిర్దిష్టమైన భావజాలం కాని, స్పష్టమైన లక్ష్యంగాని ఉండవు. మార్క్స్, అంబేద్కర్, లోహియా, గాంధీ వంటి వారి నుండి వేరువేరు భావాలను తీసుకుని ఒక భావజాల మిశ్రమాన్ని తయారుచేసే ప్రయత్నం చేస్తారు. ఒక్కొక్కసారి మార్క్స్, అంబేద్కర్ ల ఆలోచనల మధ్య సంశ్లేషణను ఒక పరిష్కారంగా చూపుతారు. అయితే ఇది భావోద్వేగ స్థాయిలో చేస్తున్నదే తప్ప దాని రూపురేఖలు, వాస్తవ ఆచరణ ఎలా ఉంటాయో కూడా తెలియకుండా చేస్తున్నారని రచయిత అంటారు.
కానీ ఈ ఇరువురి ఆలోచనలు ఎలా మనకు సహాయ పడగలవో పరిశీలించడం అవసరమని, వాటిని వివరించే ప్రయత్నం చేస్తానని రచయిత ఇందులో అంటారు.
అసలు విమోచన అర్థం స్థల కాలాలను బట్టి, సంస్కృతిని బట్టి మారుతూ ఉంటుంది. విముక్తిని సాధించేందుకు వేర్వేరు రూపాలలో సాగిన అనేక సంఘటిత ప్రజా పోరాటాలకు ఈ పదం పర్యాయపదంగా నిలిచిందని, ఫ్రెంచ్ విప్లవంలో ‘నిరంకుశత్వం, మతాధిపత్యం’ నుండి బూర్జువా వర్గం విముక్తి కావడానికి ఇది ప్రేరణగా నిలిచిందని అంటారు. ముఖ్యంగా, ఇతరుల ఆధిపత్యం, అణచివేతల నుండి స్వేచ్ఛను కోరుకున్న నూతన సమూహాల స్వీయ విముక్తి భావనకు ఈ విమోచన అనే పదం ప్రాతినిధ్యం వహించింది. అణగారిన వాళ్ళ దృష్టి కోణంలో విమోచన అనే భావనకు చాలా ప్రాముఖ్యత ఉన్నప్పటికీ, వ్యవస్థాగతంగా విస్తరించి ఉన్న అణచివేత మూలాలను పరిశీలించకుండా దృగ్గోచరమైన వాటికి మాత్రమే పరిమితమైతే ఆ భావన ప్రజలకు ఒక అభూత కల్పనగా మారే అవకాశం ఉన్నదని హెచ్చరిస్తారు.
నిజానికి మానవ విమోచనా క్రమం (స్వేచ్ఛ లేదా విముక్తిని సాధించే క్రమం) రెండు ప్రత్యామ్నాయ దృక్పథాలను ప్రతిపాదిస్తుందని, మొదటిది సంస్కరణ దృక్పథం, రెండవది విప్లవ దృక్పథం అని అంటారు. అణచివేతకు గురవుతున్న వ్యక్తులు/ బృందాలు ప్రస్తుతం కొనసాగుతూ ఉన్న సామాజిక రాజకీయ వ్యవస్థలోనే సమాన భాగస్వామ్య హక్కుల కోసం ప్రయత్నించడం సంస్కరణవాద దృక్పథం కాగా, అణచివేతకు కారణమైన ప్రస్తుత సామాజిక రాజకీయ నిర్మాణాన్ని సమూలంగా నిర్మూలించి నూతన వ్యవస్థను నిర్మించడమే విప్లవ దృక్పథం లక్ష్యంగా ఉంటుంది.
భారత సమాజం అనేక దొంతరల అణచివేత నిర్మాణంగా ఉండి ఒక దొంతర వద్దనున్న అణచివేతను అంతం చేస్తే, మిగిలిన దొంతరల వద్ద అణచివేత అలాగే కొనసాగుతుందని, మానవ విమోచనకు సంబంధించిన రాడికల్ చైతన్యం లేకపోతే అణచివేత నుండి విముక్తి పొందిన వాళ్లే ఇతరులను మళ్లీ అణిచివేసే వారిగా మారవచ్చునని అంటాడు. ప్రస్తుతం ప్రపంచంలో కొనసాగుతున్న అనేక పోరాటాలు విమోచన భావన నుండి ప్రేరణ పొందుతున్నప్పటికీ, ఆ పోరాటాలన్నీ అనివార్యంగా విమోచనకు దారి తీయకపోవచ్చు. కొన్ని పోరాటాలు సంస్కరణలు మాత్రమే సాధించి అణిచివేతకు గల విస్తృత సామాజిక నిర్మాణాన్ని చెక్కుచెదరకుండా ఉంచవచ్చు. కాబట్టి విప్లవ సాధనకు ఉద్దేశించిన చైతన్యయుత వ్యూహంలో అంతర్భాగమైనప్పుడే, ఎత్తుగడలుగా చేపట్టిన సంస్కరణలు మానవ విమోచనకు దారితీసే అవకాశం ఉంటుందని అంటారు.
ఈ కోణంలో మార్క్స్, అంబేడ్కర్ ల ఆచరణను పరిశీలిస్తే వారిద్దరూ మానవ విమోచన కోసం కృషి చేశారని, సైద్ధాంతికంగా వారి మధ్య వ్యత్యాసం ఉన్నదని తెలుస్తుంది. సాధారణంగా మార్క్స్ ను విప్లవకారుడిగా, అంబేడ్కర్ ను సంస్కరణవాదిగా కమ్యూనిస్టులు చెబుతారు. కానీ విప్లవాన్ని ఒక ఘటనగా చూసే మూస అవగాహన కల కమ్యూనిస్టులే ఇలా నిర్వచిస్తారని అంటాడు. విప్లవం ఒక ధీర్ఘకాలిక క్రమం అని, ఈ వ్యవస్థాగత మార్పు క్రమంలో చిన్నపాటి సంస్కరణా చర్యలు కూడా విప్లవంలో అంతర్భాగమవుతాయని అంటాడు. కారల్ మార్క్స్ లోతైన తాత్విక అన్వేషణ ద్వారా మానవ దాస్యాన్ని, దాన్ని అంతం చేసే మార్గాలను గ్రహించాడు. వర్గ సమాజ ఆవిర్భావం నాటి నుండి ఈనాటి పెట్టుబడిదారీ వ్యవస్థ వరకు తమ మనుగడ కోసం నిరంతర పోరాటాల్లో నిమగ్నమైన ప్రజలు వాళ్ళ వాస్తవ స్వభావమైన మానవ ఉమ్మడి అస్తిత్వం నుండి పరాయికరణకు గురయ్యారని, కమ్యూనిస్టు సమాజం దిశగా జరిగే విప్లవ పరివర్తన ద్వారా మాత్రమే ఈ పరాయికరణ అధిగమించబడుతుందని మార్క్స్ అంటాడు. అయితే ఈ విప్లవ పరివర్తన పెట్టుబడిదారీ వ్యవస్థ నుండి విమోచనను కోరే కార్మిక వర్గ క్రియాశీలత ద్వారా మాత్రమే జరుగుతుందని చెప్పాడు.
కానీ అంబేడ్కర్ అట్టడుగు అస్పృశ్య కులంలో పుట్టినందువల్ల (మార్క్స్ కు భిన్నంగా ) కుల నిర్మూలనా లక్ష్యాన్ని ఎంచుకున్నాడు. కులాల నిర్మూలన ద్వారా ‘స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం’ అనే నైతిక విలువల త్రయాన్ని ఒంటపట్టించుకోవడం ద్వారా ప్రజలను విముక్తి చేయడం సాధ్యమవుతుందని అంబేడ్కర్ భావించాడు.
విషయాలను పై పైన చూసేవారికి మానవహక్కుల లాంటి మౌలిక అంశాలను మార్క్స్ పట్టించుకోలేదని, మార్క్స్ ఆలోచనా చట్రంలో మానవ విమోచనా భావనకు చోటు లేదని అనిపిస్తుంది. ఆయన ప్రఖ్యాత రచన కమ్యూనిస్టు మేనిఫెస్టోలో మానవ హక్కుల ప్రస్తావన లేదని కూడా ఎవరైనా అనవచ్చు. అందులో స్వేచ్ఛ భావనను బూర్జువా వర్గ అహంగా ఆయన విమర్శించాడనీ అనవచ్చు. చరిత్రలో బ్యూఖానన్, స్టీవెన్ లూక్స్, డ్రుసిల్లా కోర్నెల్, విలియం మెక్బ్రైడ్, లెస్ జెక్ కోలకో విస్కీ లాంటి మేధావులు కొందరు మార్క్స్ లో మానవ హక్కుల పట్ల తిరస్కృత వైఖరి ఉందని పేర్కొన్నారు. మార్క్సిస్టు సిద్ధాంతంలో స్వాతంత్ర్యం, వ్యక్తిగత హక్కులు,స్వేచ్ఛ,ఎంపిక లాంటి భావనలకే కాక కనీసం ప్రజాస్వామ్య భావనకు కూడా స్థానం లేదని శ్యామ్యూల్ ఔల్స్, హెర్బర్ట్ జింటిస్ లు తమ ‘డెమోక్రసీ అండ్ క్యాపిటలిజం’ అనే గ్రంథంలో పేర్కొన్నారు. విప్లవానంతర సమాజంలో కూడా ప్రజాస్వామ్యానికి బదులుగా ‘భయం కలిగించే కార్మిక వర్గ నియంతృత్వం’ ఉంటుందని చెప్పాడనవచ్చు. విప్లవానికి ముందు,విప్లవ క్రమంలోనూ బలప్రయోగాన్ని మార్క్స్ సమర్ధించడం ఫలితంగా రష్యా, చైనా విప్లవాలలో పెద్ద ఎత్తున మానవహననం సంభవించిందని కూడా అనవచ్చు. లెనిన్, మావోలు తమ తమ దేశాలలో దోపిడీ రాజ్య వ్యవస్థలను హింసాత్మక తిరుగుబాటు ద్వారా కూలదోసి విప్లవాలను విజయవంతం చేశారన్నది మనందరికీ తెలిసిన సత్యమే. ఇక్కడ రచయిత ఏమంటాడంటే – నేటి ఆధునిక రాజ్యాల యుగంలో రాజ్యం, విప్లవ పార్టీల మధ్య సైనిక బలంలో ఉన్న అసమతుల్యతను పరిగణలోకి తీసుకొని చూస్తే హింసాయుత తిరుగుబాట్ల ద్వారా దోపిడీ రాజ్య వ్యవస్థను కూల దోయడం చాలా కష్టసాధ్యమవుతుందని అంటాడు. తదనంతర కాలపు విప్లవ కార్యాచరణను లెనినిజం, మావోయిజం లే నడిపించడం వల్ల మార్క్సియన్ మూల సిద్ధాంతం విస్మరణకు గురైందని అంటాడు. ఎందుకంటే కొన్నికొన్ని పరిస్థితులలో సోషలిజానికి శాంతియుత పరివర్తన సాధ్యమని మార్క్స్ భావించినట్టుగా చెబుతాడు. కాబట్టి భవిష్యత్తులో శాంతియుత పరివర్తన ఒక మినహాయింపుగా కంటే ఎక్కువగా ఒక నియమంగా ఉండవచ్చునని రచయిత అభిప్రాయపడతాడు. పదేపదే సంభవించిన తిరోగమనాలు, పరాజయాల పిమ్మట కూడా విప్లవోద్యమాలు గుణపాఠాలు నేర్చుకోవడానికి, తమ వ్యూహాన్ని,ఎత్తుగడలను సవరించుకోవడానికి నిరాకరిస్తున్నాయని, పైగా సంకుచిత మిలిటరీ దృష్టి ఉండడం వల్ల సమాజాల సజీవ శాస్త్రంగా ఉండాల్సిన మార్క్సిజం దాదాపు ఒక ‘మతం’గా చూడబడడం వల్ల అది తన జీవశక్తిని కోల్పోయిందని అంటాడు.
1991లో సోవియట్ యూనియన్ పతనంతో పెట్టుబడిదారీ విపణి వ్యవస్థ మార్క్స్ ని పూర్తిగా ఓడించిందని, దీని పర్యవసానంగా కలిగిన ఆనందంలో వాళ్లు ‘చరిత్ర అంతాన్ని’ ప్రకటించారని అంటాడు. ఇటీవల కాలంలో తరచు సంభవిస్తున్న ద్రవ్య, రుణ సంక్షోభాలు మానవ చరిత్రలో కెల్లా అత్యంత వినాశకరమైనవి అయినప్పటికీ పెట్టుబడిదారీ వ్యవస్థను శాశ్వతమైనదిగా భావిస్తూ, వాళ్లు వాస్తవికతా దిశగా మేలుకోవడంలో విఫలమవుతున్నారని అంటాడు. మార్క్స్ ను తప్పుగా అర్థం చేసుకోవడానికి పెట్టుబడిదారీ ప్రచార యంత్రాంగం ఒక్కటే కారణం కాదని, అసలు మార్క్స్ ఆలోచనలలోనే అమూర్త భావనలు ఉండడం వల్ల మార్క్స్ ను అర్థం చేసుకోవడానికి ఉన్నత స్థాయి మేధోసంపత్తి అవసరమవుతుందని రచయిత అంటాడు.
అయితే మార్క్స్ నిజంగానే మానవ హక్కుల్ని వ్యతిరేకించాడా? అని రచయిత ప్రశ్న వేసుకొని సమాధానం కోసం వెతికాడు. మానవహక్కుల పట్ల మార్క్స్ వైఖరి,అవగాహనలు క్రమక్రమంగా మారుతూ పరిణతి చెందాయని అంటాడు. మార్క్స్ తన మొదటి దశలో మానవ హక్కుల్ని సమర్థించడానికి 1842లో ఆరవ రైన్ ప్రొవిన్స్ అసెంబ్లీ చర్చలకు సంబంధించి మూడు వ్యాసపరంపరల్ని –(1) కామెంట్స్ ఆన్ ది లేటెస్ట్ ప్రష్యన్ సెన్సార్షిప్ ఇన్స్ట్రక్షన్, (2) ఆన్ ఫ్రీడమ్ ఆఫ్ ది ప్రెస్, (3) డిబేట్స్ ఆన్ ది తెఫ్ట్స్ ఆఫ్ వుడ్ అని ఆయన పేర్కొన్నాడు. అలాగే ‘యూదుల సమస్య'(1844) అనే రచనలో మార్క్స్ వ్యక్తపరిచిన అభిప్రాయాలను కూడా మానవ హక్కుల భావనపై ఆయనకున్న నిబద్ధతను తెలియజేస్తాయి. అందులో యూదుల రాజకీయ విమోచనను బ్రూన్ బవర్ వారి మత విశ్వాసంతో ముడి పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ, జుడాయిజాన్ని అనుసరిస్తూ కూడా యూదులు రాజకీయ విమోచన పొందడం రాజ్యం అధికారిక మతం నుండి విముక్తి కావడమేనని మార్క్స్ వాదించాడు. జుడాయిజానికి గాని, ఏ ఇతర మతానికి గాని మార్క్స్ అనుకూలుడు కానప్పటికీ అధికారాన్ని ఉపయోగించి మతాన్ని బలవంతంగా రద్దు చేయడాన్ని మార్క్స్ నిర్ద్వందంగా వ్యతిరేకించాడు.
అయితే తర్వాతి దశలో రాజకీయార్థ శాస్త్రం పై లోతైన విమర్శ చేయగల పరిణతిని సంతరించుకున్న మార్క్స్ తన ‘పెట్టుబడి’, గ్రండ్రస్సె’, ‘కమ్యూనిస్టు మేనిఫెస్టో’ లాంటి గ్రంథాలలో మానవ హక్కులపై చేసిన చర్చ సరళంగా సూటిగా ఉండకుండా సంక్లిష్టమైనదిగా, సూక్ష్మ దృష్టి కలదిగా పరిణామం చెందింది. స్వేచ్ఛ, సమాన హక్కుకి సంబంధించిన అన్ని ఆధునిక భావనల ఆధారం మారకపు విలువలో ఇమిడి ఉంటుందని మార్క్స్ పేర్కొన్నాడు (గ్రండ్రస్సె).
వ్యక్తుల్ని వాళ్ళ సామాజిక అస్తిత్వం నుండి విడదీసినప్పుడు మాత్రమే వాళ్లు స్వతంత్రులుగా కనపడతారు. అందుకే మిగతా హక్కుల లాగే ‘సమానత్వ హక్కు కూడా దాన్ని సారాంశంలో అసమానత్వ హక్కే’ నని మార్క్స్ ‘క్రిటిక్ ఆఫ్ ది గోతా ప్రోగ్రాం’ అనే గ్రంథంలో అంటాడు. అన్ని సమాజాల్లో ఆస్తి ఉన్నప్పటికీ ప్రైవేటు ఆస్తి హక్కు మాత్రం ఆధునిక ప్రపంచంలోనే ఉద్భవించింది. అయినప్పటికీ పెట్టుబడిదారీ పూర్వ ఆస్తి రూపాలతో పోలిస్తే ఆస్తి హక్కులలో జరిగిన అభివృద్ధిని (బూర్జువా పరిమితుల్ని పక్కనపెట్టి ) ఒక గొప్ప ముందడుగుగా మార్క్స్ గుర్తించాడు. ఇలా పెట్టుబడిదారీ సమాజంలో స్వాతంత్య్రం, సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం లాంటి విలువల సానుకూల సారాన్ని గుర్తించినప్పటికీ, అదే సమయంలో బూర్జువా చట్రం వల్ల అవి సంతరించుకునే ప్రతికూల స్వభావం పట్ల జాగ్రత్త వహించాలని మార్క్స్ హెచ్చరించాడు. ప్రాచీన కాలంలో కూడా మారకం ఉన్నప్పటికీ మారకపు విలువలేదు. కానీ పెట్టుబడిదారీ విధానంలో మారకపు విలువ ఏర్పడిన తర్వాతే మానవహక్కులు ఆవిర్భవించాయని మార్క్స్ అంటాడు. అందువల్ల మానవహక్కులు పెట్టుబడిదారీ విధానానికి పరిమితమైన అంశంగా పేర్కొంటాడు మార్క్స్.
కాబట్టి మార్క్స్ మానవ హక్కులను పట్టించుకోలేదని విమర్శించడం సరైనది కాదని, మానవ హక్కుల పట్ల మార్క్స్ విమర్శ వ్యక్తివాదం పట్ల ఆయనకున్న తీవ్ర వ్యతిరేకతగా మనం చూడాలి అనంటాడు. కర్కష పోటీ తత్వం, స్వార్థపరత్వంతో కూడిన అణుమాత్ర వ్యక్తుల మానవ హక్కులు ఏవీ కూడా సామూహిక సామాజిక సమస్యలను, మానవ సామాజికతను, మానవ ఉమ్మడి అస్తిత్వాన్ని పట్టించుకోలేదని మార్క్స్ విమర్శించాడు. ( ఎరిక్ హాబ్స్ బామ్ రాసిన ‘వర్కర్స్’). ఏదేమైనప్పటికీ వ్యక్తి హక్కుల పట్ల మార్క్స్ అవగాహన ఆనాటి స్థల కాలాలకు పరిమితమై ఉన్నదని మనం అనుకోవాలి. ఆనాటికి అమలులో ఉన్న హక్కుల రూపాన్ని విమర్శించడాన్ని దాటి ఆయన ముందుకు పోలేదు. మానవ హక్కులకు సంబంధించిన ప్రత్యామ్నాయ సిద్ధాంతాన్ని రూపొందించే పనిని ఆయన చేపట్టలేదు. కాని సామాజికతకు బలాన్ని చేకూర్చడానికి వ్యక్తిగత పౌరుడికి ఉండే హక్కుల్ని, వ్యక్తిత్వాన్ని, స్వేచ్ఛని, వ్యక్తిగత ఎంపికని మార్క్స్ తిరస్కరించలేదనేది నిర్వివాదమైన సత్యం.
అయితే ఎ వి బార్తలోమ్యూ భావించినట్టుగా- మానవ హక్కులకు సంబంధించిన ప్రత్యామ్నాయ సిద్ధాంతాన్ని రూపొందించడం తదనంతర మార్క్క్సిస్టుల బాధ్యతగా ఉంటుందని, అందుకు మార్క్స్ మూల సూత్రాల నుంచి దూరంగా జరగకుండానే మార్క్సిజాన్ని అభివృద్ధి పరచవచ్చని రచయిత కూడా ఏకీభవించాడు.
ఈ విధంగా మార్క్స్ విషయంలో ఉన్న అవగాహనా లోపం ఆయన మౌలికంగా మానవ విమోచనా తత్వవేత్త అని కూడా గుర్తించడానికి ప్రతిబంధకంగా ఉంటోంది. యువ హెగెలియన్ గా మార్క్స్ హెగెల్గు రించి విమర్శనాత్మక విశ్లేషణ ప్రారంభించినప్పటి నుండి, తన మలి రచన ‘ఎ క్రిటిక్ ఆఫ్ పొలిటికల్ ఎకానమీ’ వరకు ఆయన మానవ విమోచనా లక్ష్యానికే కట్టుబడి ఉన్నాడు.
” ప్రతి విమోచన మానవ ప్రపంచాన్ని, మానవ సంబంధాలను మనిషికి తిరిగి చెందేట్లు చేయడమే. వైయక్తిక మానవుడు తన దైనందిన జీవితంలో, తన పనిలో, తన సంబంధాలలో మానవ ఉమ్మడి అస్తిత్వం(Species being )గా మారాలి. మనిషి తన శక్తుల్ని సామాజిక శక్తులుగా గుర్తించి అభివృద్ధి చేసుకోవడం ద్వారా అతని సామాజిక శక్తి రాజకీయ అధికారం రూపంలో అతని నుండి వేరు కావడాన్ని అధిగమించాలి. ( మార్క్స్ & ఎంగెల్స్ (1956) పే. 370 ; మార్క్ & ఎంగెల్స్ (1978) పే. 46 )
అందువల్ల మార్క్స్ ప్రకారం ” సమాజాన్ని ప్రైవేటు ఆస్తి నుండి దాస్యం నుండి విముక్తి చేయడం అనేది కార్మికుల విముక్తి అనే రాజకీయ రూపం తీసుకుంటుంది. దీని అర్థం కార్మికులు మాత్రమే విముక్తి కావలసి ఉన్నారని కాదు. వారి విముక్తిలో మొత్తం మానవాళి విముక్తి కలిసివుంది. ఎందుకంటే
కార్మికుడికి ఉత్పత్తితో ఉండే సంబంధంలో మొత్తం మానవ పరాధీనత ఇమిడి ఉంది. అన్ని రకాల పరాధీనతలు ఈ సంబంధానికి రూపాంతరాలు, పర్యవసానాలు మాత్రమే”. (కార్ల్ మార్క్స్ : ఎకనమిక్ అండ్ ఫిలసాఫిక్ మాన్యుస్క్రిప్ట్స్ ఆఫ్ 1844- పే.10).
కనుక మార్క్స్ లక్ష్యం కార్మిక వర్గ విముక్తికి మాత్రమే పరిమితం కాదు. మానవులందరిలో పరాయికరణ చెందని స్వేచ్ఛాయుత కార్యాచరణను పునరుద్ధరించడం ద్వారా మానవ విముక్తిని సాధించడమే ఆయన లక్ష్యం. వస్తు ఉత్పత్తిని కాక మనిషిని కేంద్రంగా గుర్తించే సమాజాన్ని మార్క్స్ కోరుకున్నాడు. మనిషి ‘వైకల్య పూరిత వికృతత్వం’ నుండి బయటపడి పూర్తిగా అభివృద్ధి చెందిన మానవుడిగా మారే సమాజ నిర్మాణమే మార్క్స్ లక్ష్యం. (మార్క్స్ : క్యాపిటల్ వాల్యూమ్-1 ).
అంటే మార్క్స్ దృష్టిలో మానవ విమోచన అనేది అణచివేత నుండి, ఆధిపత్యం నుండి వ్యక్తి విముక్తి మాత్రమే కాదు. మనిషిని విశ్వజనీన అస్తిత్వంతో మమేకం కాగల ఆత్మిక స్థాయికి ఉన్నతీకరించడంగా మానవ విమోచనను మనం అర్థం చేసుకోవాలి.
మరో మాటల్లో చెప్పాలంటే – మానవ విమోచన గురించిన మార్క్స్ భావన వెనుక ఉన్న కీలకమైన అంశం పరాయీకరణ. ఆ పరాయీకరణను అధిగమించి మనిషి తన నిజమైన ఆత్మను, తన మానవ ఉమ్మడి అస్తిత్వాన్ని తిరిగి పొందడమే అసలు సిసలైన మానవ విమోచన అని మార్క్స్ చెప్పాడు.
మార్క్స్ కి భిన్నంగా మానవ విమోచనకు సంబంధించిన ఎటువంటి మహా సిద్ధాంతాన్ని అంబేడ్కర్ నిర్మించలేదు. ఆయన ఏ కులంలో జన్మించాడో ఆ కుల సమూహపు ప్రజలను అణచివేతకు గురి చేసే కుల వ్యవస్థ బారి నుండి విముక్తి చేసే కృషిని చేపట్టాడు. కొలంబియా విశ్వవిద్యాలయంలో విద్యార్థిగా చేరినప్పుడు అక్కడ పాశ్చాత్య ఉదారవాద ఆచార్యుడైన జాన్ డ్యూయీ చే అత్యంత ప్రభావితుడయ్యాడు. జాన్ డ్యూయీ ఒక ఫెబియన్ సోషలిస్టు. ఆయన కార్మిక వర్గ విప్లవం ద్వారా మాత్రమే సోషలిజాన్ని సాధించగలమనే మార్క్సిస్టు సిద్ధాంతంతో విభేదిస్తాడు. జ్ఞానవంతులైన మధ్యతరగతి వర్గాలు పాలనా బాధ్యతలు చేపట్టి భూమిని, (పారిశ్రామిక) పెట్టుబడిని విమోచన చేసే దిశగా దానిని క్రమక్రమంగా మార్చడం ద్వారా సోషలిజాన్ని సాధించవచ్చునని ఫెబియన్ సోషలిజం చెబుతుంది. అటువంటి పరిమాణాత్మక ఫేబియన్ సోషలిజం ప్రభావానికి గురైన అంబేద్కర్ భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత అస్పృశ్యులైన దళితుల విమోచన కోసం తన జ్ఞాన సంపత్తిని, ఫెబియన్ సోషలిస్టు స్ఫూర్తిని సృజనాత్మకంగా అన్వయించాడు. భారతదేశంలో కుల వ్యవస్థ పుట్టుక, దాని అభివృద్ధి గురించి మొట్టమొదటి సమగ్ర పరిశోధనా వ్యాసాన్ని అంబేద్కర్ రాసి కొలంబియా విశ్వవిద్యాలయంలో సమర్పించాడు. మార్క్స్ వలెనే సమాజాన్ని వర్గ సమాజంగా పరిగణిస్తూనే వర్గాల మధ్య ఘర్షణ పూరితమైన సంబంధాలు తప్పనిసరి అన్న మార్క్స్ భావనను అంబేడ్కర్ అంగీకరించలేదు. డ్యూయీ తన ప్రగతి శీల వ్యవహారిక సత్తా వాదాన్ని సాంకేతిక అంశాలను ‘లాజిక్ : ది థియరీ ఆఫ్ ఎంక్వయిరీ ‘ అనే గ్రంథంలో వివరించాడు. ఈ వ్యవహారిక సత్తావాదపు సిద్ధాంతం జ్ఞానం తాత్కాలికమని, అది తప్పనిసరిగా ప్రయోగాత్మక వైఖరి నుండి రావాలని నొక్కి చెబుతుంది. సాధారణత కంటే నిర్దిష్టతకు
ప్రాధాన్యతనిస్తుంది. దళితుల విముక్తికి సాధనంగా విద్యను పరిగణించడానికి గల మూలాలను అంబేడ్కర్ డ్యూయీ అభివృద్ధి చేసిన విద్యా తత్వశాస్త్రం నుండి తీసుకున్నాడు. డ్యూయీ వలెనే అంబేద్కర్ కూడా పాఠశాలలను సామాజిక పరివర్తనా సాధనాలుగా పరిగణించాడు. డ్యూయీకి భిన్నంగా అస్పృశ్యులకు పాఠశాల విద్య కంటే ఉన్నత విద్య ముఖ్యమైనదిగా అంబేడ్కర్ భావించాడు. ఉన్నత విద్య ద్వారా దళితులు రాజ్యాధికారం సాధించాలని కోరుకున్నాడు. పాలనా వ్యవస్థలోకి దళితులను, మధ్యతరగతి చెందిన వివేకవంతులను క్రమక్రమంగా ప్రవేశపెట్టడం ద్వారా సామాజిక పరివర్తన సాధించాలని ఫెబియన్ సోషలిజం లక్ష్యానికి అనుగుణంగా అంబేడ్కర్ తన అవగాహనను రూపొందించుకున్నాడు. డ్యూయీ ప్రతిపాదించిన ప్రగతిశీల వ్యవహారిక సత్తా వాదం ప్రకారం క్రమ పరిణామ వాదం ద్వారానే అన్ని దేశాలలోని ప్రజలు తమ అస్తిత్వ బంధనాల నుండి విమోచన పొందిన తరువాతనే, ప్రపంచ మానవాళి విమోచన సాధ్యమవుతుంది. అంబేడ్కర్ అస్పృశ్యుల విమోచనకు కులాల నిర్మూలన
అవసరమని భా వించినప్పటికీ, విశాల సమాజం మద్దతు లేకుండా అది సాధ్యం కాదని ఆయన గ్రహించాడు. అందుకు హిందువులు తమ సనాతన ఆచారాల నుండి బయటపడి, చెడును గుర్తించి సంస్కరణలు చేపట్టాడానికి ముందుకు వస్తారని ఆయన ఆశించాడు.
అయితే మహద్ సభ చేదు అనుభవం ఆయన ఆశను భగ్నం చేసింది. హిందూ సమాజంలో కుల వ్యవస్థ నెరపే అణచివేతను సంస్కరణల ద్వారా సడలింప చేయవచ్చని ఆయన ఆశ నెరవేరలేదు. సవర్ణ హిందువులే మహద్ సభకు హాజరైన వారిపై క్రూరంగా దాడి చేశారు. అందుకు ప్రతిగా నిరవధిక సత్యాగ్రహాన్ని చేపడితే సవర్ణ హిందూ చాంధసవాదులే కోర్టుకెళ్లి నిషేధ ఉత్తర్వులు తెచ్చుకోవడం వల్ల అంబేడ్కర్ సత్యాగ్రహ కార్యక్రమాన్ని విరమించుకోవాల్సి వచ్చింది.
అంబేద్కర్ వెంటనే తన దృష్టిని రాజకీయాల వైపు మళ్ళించాడు. అస్పృశ్యులకు ప్రత్యేక సామాజిక అస్తిత్వాన్ని నెలకొల్పగలిగితే రాజకీయాల్లో వారి భాగస్వామ్య హక్కులతో సహా సామాజిక, సాంస్కృతిక హక్కులు కూడా సాధించవచ్చని ఆశించాడు. అందుకే మహద్ సంఘటన జరిగిన వెంటనే తాను హిందూ మతాన్ని పరిత్యజించి మరో మతంలోకి మారుతానని అంబేడ్కర్ హెచ్చరిక చేశాడు. ఈ హెచ్చరిక కాంగ్రెస్ కు రాజకీయ ప్రమాదంగా పరిణమిస్తుందని, అందువల్ల హిందూ సమాజంలో సంస్కరణ కోసం కాంగ్రెస్ ముందుకు వస్తుందని ఆయన ఆశించాడు. కానీ ఆయన ఆశించినట్టుగా కాంగ్రెస్ గాని, ఏ హిందూ సంస్థ గానీ సంస్కరణలకు సిద్ధం కాలేదు.
అదే సమయంలో బ్రిటిష్ పాలనా ప్రాంతాలలో నివసించే భారతీయులకు రాజ్యాంగ పద్ధతుల ద్వారా స్వయంపాలనాధికారాన్ని బదలాయించే అంశంపై బ్రిటిష్ ప్రభుత్వం రౌండ్ టేబుల్ సమావేశాలని ఏర్పాటు చేసింది. ఇదే అదునుగా అస్పృశ్యులకు ప్రత్యేక రాజకీయ అస్తిత్వాన్ని కల్పించాలని అంబేడ్కర్ పోరాడాడు. అందుకు కమ్యూనల్ అవార్డు ద్వారా అస్పృశ్యులకు ప్రత్యేక నియోజకవర్గాలను ఏర్పాటు చేస్తానని బ్రిటిష్ ప్రభుత్వం అంగీకరించింది. కానీ దీనిని గాంధీ తీవ్రంగా విభేదిస్తూ ఆమరణ నిరాహార దీక్ష చేసి, అస్పృశ్యులకు ప్రత్యేక నియోజకవర్గాలు కాకుండా
ఉమ్మడి నియోజకవర్గాలలో సీట్ల రిజర్వేషన్ కి అంగీకరించేలా అంబేడ్కర్ ను బ్లాక్ మెయిల్ చేసి ఒప్పించాడు. ఆ సీట్ల రిజర్వేషన్ పద్ధతి ద్వారా అస్పృశ్యుల స్థితిగతులను మెరుగుపరుస్తామని చేసిన వాగ్దానాన్ని కాంగ్రెస్ తదనంతరం నిలబెట్టుకోలేదు. అప్పుడు అస్పృశ్యుల విమోచనకు కులాల నిర్మూలన తప్పనిసరి అని అవసరమనే నిర్ధారణకు అంబేడ్కర్ వచ్చాడు. అయితే ఇందుకు హిందూ సమాజం ఎన్నటికీ సిద్ధపడదని గ్రహించి, హిందూ మతాన్ని త్యజిస్తాననే నిర్ణయాన్ని అంబేడ్కర్ 1935లో బహిరంగంగా ప్రకటించి, ఆ తర్వాత 1956లో దాన్ని నెరవేర్చాడు.
మొదటి దశలో అంబేద్కర్ కులాలను నిర్మూలించాలని అనుకున్నాడు. కానీ హిందువులను అందుకు సిద్ధపడకుండా చేస్తున్నది మతమని గుర్తించిన తర్వాత, హిందూమత గ్రంథాలను ధ్వంసం చేయకుండా కులాల నిర్మూలన సాధ్యం కాదని 1936లో రాసిన ఒక చిన్న పుస్తకం ద్వారా అంబేద్కర్ ప్రకటించాడు. అంబేడ్కర్ ఎన్నడూ స్వీయ అస్తిత్వవాది కాదు. మార్క్స్ వలెనే అంబేద్కర్ కూడా సమాజాన్ని వర్గ సమాజంగా
గుర్తించాడని చెప్పవచ్చు. 1916 లో కొలంబియా విశ్వవిద్యాలయంలో సమర్పించిన తన మొట్టమొదటి పరిశోధనా వ్యాసంలో ఇలా అన్నాడు:
” సమాజం విడివిడిగా ఉండే ఒంటరి వ్యక్తుల కలయిక అని రాజకీయ ప్రసంగాల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేయబడిన భావన ఒక అతిపెద్ద మోసం. నాకైతే ఇది వికృతీకరించబడిన భావన అని కూడా చెప్పాలనిపిస్తోంది. వ్యక్తులే సమాజాన్ని రూపొందిస్తారని చెప్పటం సాదాసీదా అవగాహన. సమాజం ఎల్లప్పుడూ వర్గాలతో నిర్మించబడి ఉంటుంది. వర్గ పోరాట సిద్ధాంతాన్ని నొక్కి చెప్పడం అతిశయోక్తి కావచ్చు. కానీ సమాజంలో నిర్దిష్ట వర్గాలు అస్తిత్వంలో ఉన్నాయనేది వాస్తవం. వాటి ప్రాతిపదిక వేర్వేరుగా ఉండవచ్చు. అవి ఆర్థికపరమైనవి, మేధోపరమైనవి, సామాజికపరమైనవి కావచ్చు. కానీ సమాజంలోని వ్యక్తి ఎల్లప్పుడూ ఒక వర్గంలో సభ్యుడే. ఇది సార్వజనీన వాస్తవం. తొలినాటి హిందూ సమాజం ఈ సూత్రానికి మినహాయింపు కావడం సాధ్యం కాదు. వాస్తవానికి అది మినహాయింపు కాదని మనకు తెలుసు. ఈ సాధారణీకరణను మనం
మనసులో ఉంచుకున్నట్లయితే, కులం పుట్టుక గురించిన మన అధ్యయనం మరింత సులువవుతుంది. ఎందుకంటే, ముందుగా ఏ వర్గం తనని తాను కులంగా మార్చుకున్నదనే అంశాన్ని మనం నిర్ణయిస్తే సరిపోతుంది. ఎందుకంటే వర్గం, కులం ఇరుగుపొరుగు లాంటివి. వాటి మధ్య దూరం అతి స్వల్పం. అన్ని వైపుల దారులు మూసుకుపోయిన వర్గమే కులం”. (భారతదేశంలో కులాలు: వాటి యంత్రాంగం, ఆవిర్భావం, అభివృద్ధి)
అందువల్ల మొదటి దశలో అస్పృశ్యులైన దళిత కులాల, ఉపకులాల భిన్న అస్తిత్వాలను ఉద్దేశపూర్వకంగా పక్కకు పెట్టి, వారిని దాదాపు ఒక వర్గంగా పరిగణిస్తూ అంబేద్కర్ తన పరిశీలన ప్రారంభించాడు. వారికి ఆపాదించబడిన అంటరానితనం అనే సామాజిక కళంకం తప్ప వారు కార్మిక వర్గానికి చెందిన వాళ్ళనే అవగాహన అంబేడ్కర్ కు ఉండింది. కులపరంగా వారికి కార్మిక వర్గంతో ఉమ్మడి అంశాలు ఉండడం వల్ల కార్మిక వర్గ విమోచన క్రమం తో వారికి సన్నిహిత సంబంధం ఉన్నదని అంబేద్కర్ భావించాడు. అందుకే రాజకీయాలలో కులం అనే అంశం పైననే ఆధారపడకుండా ఇండియన్ లేబర్ పార్టీ(ILP) అనే మొదటి వామపక్ష పార్టీని స్థాపించాడు. జమిలిగా కుల-వర్గ పోరాటాలను సాగించి ఆనాటి ఎన్నికలలో చెప్పుకోదగిన విజయాన్ని ILP సాధించింది. కానీ 1942 ఫిబ్రవరిలో సమర్పించబడిన క్రిప్స్ నివేదిక ఇతర కమ్యూనల్ పార్టీల అనేక డిమాండ్లను అంగీకరించింది గాని (కమ్యూనల్ పార్టీ కాని) ఇండియన్ లేబర్ పార్టీ డిమాండ్లను అంగీకరించలేదు. ఈ కారణంగా ఇండియన్ లేబర్ పార్టీని రద్దుచేసి, అప్పటి రాజకీయ పరిస్థితులకు తగినట్టుగా కమ్యూనల్ పార్టీగా కనిపించే షెడ్యూల్ క్యాస్ట్ ఫెడరేషన్ (SCF )ను అంబేద్కర్ ఏర్పాటు చేశాడు. అదే కాలంలో ఆయన వైస్రాయ్ కౌన్సిల్లో సభ్యుడై, 1946 లో అది రద్దయే వరకు కార్మిక శాఖ మంత్రిగా పనిచేశాడు. తన పదవీ కాలంలో మొత్తం జనాభాలో షెడ్యూల్డ్ కులాల వారి నిష్పత్తికి సమానమైన కోటా పద్ధతిలో అస్పృశ్యులకు విద్యలో, ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్లు కల్పించాడు. క్రమంగా రాజకీయ సంప్రదింపులకు దూరంగా ఉంచబడిన అంబేద్కర్ మొదట ముస్లిం లీగ్ సహాయంతో, దేశ విభజన తర్వాత కాంగ్రెస్ సహాయంతో రాజ్యాంగ సభలో స్థానం సంపాదించి, రాజ్యాంగ ముసాయిదా కమిటీకి అధ్యక్షుడిగా నియమించబడ్డాడు. ఆ తర్వాత ఆయన అఖిలపక్ష క్యాబినెట్ లో స్థానం పొంది న్యాయశాఖ మంత్రిగా పనిచేశాడు. ఈ కాలంలో (అంటే 1947లో) ఆయన ఫెబియన్ సోషలిజం స్ఫూర్తితో రాజ్య సోషలిజాన్ని ప్రతిపాదిస్తూ “స్టేట్స్ అండ్ మైనారిటీస్” అనే చిన్న గ్రంథాన్ని రాశాడు. అస్పృశ్యుల భవిష్యత్తుకు భద్రత కల్పించాలనే మౌలిక ప్రేరణతో రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీలో పనిచేసినప్పటికీ,తయారైన రాజ్యాంగ ముసాయిదా మాత్రం అనేక రాజీల ఫలితం అని అంబేడ్కరే స్వయంగా చెప్పాడు. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తొలినాళ్లలోనే అంబేడ్కర్ భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యం పట్ల ఎంతో నిరాశ చెంది “రాజ్యాంగాన్ని నేనే స్వయంగా తగలబెడతానని” ఆగ్రహంతో ప్రకటించాడు. కొద్దికాలం తర్వాత క్యాబినెట్ చే నిర్లక్ష్యం చేయబడ్డాడు. అలాగే హిందూ స్త్రీలకు కొన్ని మౌలిక హక్కులు కల్పించడానికి
హిందూకోడ్ బిల్లును రూపొందించినప్పుడు, ఆ విషయంలో ఆయన విద్రోహనికి గురికావడంతో అంబేడ్కర్ క్యాబినెట్ నుంచి బయటకు వచ్చి పూర్తిగా రచనా వ్యాసంగానికి పరిమితమయ్యాడు. అంతకుముందు రెండు దశాబ్దాల క్రితం తాను చెప్పిన మాటను నెరవేరుస్తూ హిందూ మతాన్ని త్యజించి బౌద్ధాన్ని స్వీకరించాడు. ఆ తర్వాత కొద్ది కాలానికి 1956 లో అంబేడ్కర్ మరణించాడు.
మొత్తంగా మానవ విమోచన గురించిన అంబేద్కర్ కున్న భావన డ్యూయీ వ్యావహారిక సత్తావాదం, ఫెబియన్ సోషలిజంలచే ప్రభావితం చేయబడింది. ఆయన రాజకీయ తాత్విక అవగాహనను స్వేచ్ఛ,సమానత్వం, సౌభ్రాతృత్వం అనే మూడు ఆధునిక విలువల సమాహారంగా చెప్పవచ్చు. (వీటిని ఆయన ఫ్రెంచ్ విప్లవం నుండి కాక బౌద్ధం నుండి తీసుకున్నానని చెప్పాడు).
ఇక అంబేద్కర్ చెప్పిన మతమార్పిడి వివిధ రకాలుగా ఉన్నది. కొన్నిసార్లు అది హిందువులను హెచ్చరించే ఎత్తుగడగా, కొన్నిసార్లు హిందూమత బంధనాల నుండి తప్పించుకునే వ్యూహంగా, కొన్నిసార్లు అంటరానివారైన దళితులను ఒక మత సమూహంలో విలీనం చేయడం ద్వారా వారి అస్తిత్వాన్ని బలోపేతం చేసే అవసరంగా, చివరికి ఆయనే పేర్కొన్నట్లుగా మతమార్పిడిని ఒక ఆధ్యాత్మిక పరిష్కారంగా కూడా ఆయన రకరకాలుగా చెప్పాడు. మొత్తంమీద మతమార్పిడి విషయంలో ఆయన విధానం స్థిరత్వంతో కూడినదిగా లేదు. ఎందుకంటే 1927లో మహద్ ఘటన వల్ల భ్రమలు తొలగిపోయిన వెంటనే ఆయన జల్గావ్ (విదర్భ)లోని అంటరానివారికి ముస్లింలుగా మారమని పిలుపిచ్చాడు. ఆ తర్వాత దానిని ఆయన పట్టించుకోలేదు. మరి కొన్నిసార్లు దళితులను క్రైస్తవంలోకి మారమని అంబేద్కర్ పిలుపిచ్చాడు. ఆ తర్వాత మళ్లీ ఆయనే బౌద్ధంలోకి మారమని చెప్పాడు. అంటే మతమార్పిడి పట్ల ఆయన అనుసరించిన విధానంలో సామాజిక అస్తిత్వ దృక్పథం, మతపరమైన ఆధ్యాత్మిక దృక్పథం అనే రెండు దృక్పథాలు ఉన్నాయి. దళితులు తమ కనీస మానవ హక్కుల కోసం పోరాడినందుకు వారిపై జరిగిన అత్యాచారాల్ని అంబేడ్కర్ వర్గ ఘర్షణలుగా పరిగణించాడు. (అంబేద్కర్ రచనలు, ప్రసంగాలు -ఆంగ్లవాల్యూమ్ -18 పార్ట్-1, మహారాష్ట్ర ప్రభుత్వం ప్రచురణ -2002 పే. 495 -496 ). కాని వర్గాల మధ్య ఘర్షణ అనివార్యమని చెప్పిన మార్క్స్ తో విభేదించిన అంబేడ్కర్ ఇక్కడ “స్పృష్యులకు,అస్పృశ్యులకు మధ్య ఘర్షణ శాశ్వతం” అని అంటాడు. (అంబేడ్కర్ రచనలు, ప్రసంగాలు -ఆంగ్ల వాల్యూమ్- 18 పార్ట్ -2,మహారాష్ట్ర ప్రభుత్వం ప్రచురణ -2002, పే. 476) పైగా మానవాళి కాంక్షించే సంఖ్యాబలం, ధనబలం, మనోబలాలలో ఏదీ దళితులకు లేదని ఆయన అంటాడు ( పై గ్రంథం పే. 497 ). ఎందుకంటే-కుల వివక్ష కారణంగా పోరాడే దళితులకు మద్దతుగా హిందువులందరి సామాజిక మద్దతు ఉండదు. కాబట్టి దళితులు కేవలం తమ సొంత బలం మీద మాత్రమే ఆధారపడితే తమ దైన్య స్థితి నుండి బయటపడడం వారికి సాధ్యం కాదని, మతమార్పిడి తప్పనిసరి అవసరమని అంటాడు. అయితే క్రైస్తవం,ఇస్లాం రెండింటికి విదేశీ మూలాలు ఉన్నాయని,అస్పృశ్యులు వాటిలోకి మారితే మెజారిటీ హిందువులు సహించరని,పెద్ద మానవహననం జరుగుతుందని( అప్పటికే దేశం విభజన తాలూకు విషాదం సంభవించిందని మనం గుర్తుపెట్టుకోవాలి) భావించి, భారతీయ మూలాలు ఉన్న బౌద్ధంలోకి మారడమే అస్పృశ్యులకు శ్రేయస్కరమని పిలుపిచ్చాడు. అంతేకాకుండా, బౌద్ధం ఒక్కటే ఆధునిక హేతువుకి, ఆధునిక శాస్త్రానికి అత్యంత అనుగుణమైన మతం అని ఆయన విశ్వసించాడు. అందుకు ఆధునిక విజ్ఞాన శాస్త్రంతో బౌద్ధానికి ఉన్న పొందికను ఆల్బర్ట్ ఐన్స్టీన్ అంగీకరించడం కూడా ఒక కారణం. (ఆల్బర్ట్ ఐన్స్టీన్ : ది హ్యూమన్ సైడ్ -1954) అంతేకాదు బౌద్ధం మార్క్సి జంలోని సానుకూలసారమంతా కలిగి ఉన్నదని, దాని ప్రతికూలతలేవీ బౌద్ధంలో లేవని అంబేడ్కర్ పేర్కొన్నాడు. బౌద్ధ సంఘాన్ని కమ్యూనిస్టు సమాజపు నమూనాగా ఆయన పరిగణించాడు. మార్క్సిస్టు విప్లవానికి భిన్నంగా బౌద్ధ సంఘాన్ని రక్తపాతరహితంగా సాధించవచ్చని ఆయన నమ్మాడు. అయితే మార్క్సిజం పట్ల ఆయన అవగాహనతో విప్లవ మార్క్సిస్టులైన వాళ్ళు ఎవరూ ఏకీభవించకపోవచ్చు. అలాగే బౌద్ధ సంఘాన్ని కమ్యూనిస్టు సమాజంగా పరిగణించడాన్ని కూడా అంగీకరించరు. ఎందుకంటే – బౌద్ధ సంఘం లోకి అందరికీ ప్రవేశం లేదు. ” పారిపోయిన బానిసలు,ఆటవిక తెగలకు చెందినవారు, తప్పించుకుపోయిన నేరస్థులు, దీర్ఘకాలిక రోగులు, రుణగ్రస్తులు, ఆదిమనాగాలకు బౌద్ధంలోకి ప్రవేశం నిరాకరించబడింది ” (దేవరాజా చనానా: ప్రాచీన భారతదేశంలో బానిస వ్యవస్థ- పే. 81 ). అలాగే బుద్ధుడు గాని, ప్రాచీన బౌద్ధ గురువులు గాని కుల వ్యవస్థపై పోరాడలేదని హాలండ్ కు చెందిన అధ్యయన వేత్త ప్రొఫెసర్ జర్షర్ పేర్కొన్నాడు. అందువల్ల అంబేద్కర్ ఊహించినట్లుగా బౌద్ధ మతావలంబన ద్వారా ఎటువంటి విప్లవాత్మక మార్పు వచ్చే అవకాశం లేదని, అసలు బౌద్ధానికి సామాజిక దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడే క్రియాశీలత లేదని, అది ప్రపంచాన్ని పరిత్యజించడం ద్వారా వైయక్తిక మోక్షాన్ని బోధించిందని కొందరు విమర్శకులు చెప్పారు. అన్నిటికీ మించి అస్పృష్యులకు బౌద్ధంలోకి మతాంతీకరణ బోధించడం అనేది వారిని అస్తిత్వ సమస్యల నుండి పక్కదారి పట్టించడంగా మనం చూడవచ్చు. ఇందువల్ల ఇప్పటికే అనేక అస్తిత్వాల భారాన్ని మోస్తున్న ప్రజలకు మరొక మత అస్తిత్వాన్ని అదనంగా చేర్చడమే అవుతుంది. కాబట్టి స్వేచ్ఛ,సమానత్వం, సౌభ్రాతృత్వం అనే ఆధునిక విలువలను బోధించిన అంబేడ్కరే అస్పృశ్యులైన దళితులను బౌద్ధంలోకి మారమని చెప్పడం ద్వారా ఆయనే ఆధ్యాత్మిక పరిష్కారాన్ని సూచించినట్లయిందని చెబితే తప్పవుతుందా?
ఇంకా చెప్పాలంటే- అంబేడ్కర్ విమోచనా భావనే సామాజికతతో సంబంధం లేనిదని చెప్పవచ్చు. ఒక సందర్భంలో సమాజమంటే విడివిడి వ్యక్తుల కలయిక కాదని చెప్పిన అంబేడ్కరే అణగారిన సమూహపు విమోచన సందర్భంలో బౌద్ధ మతాంతీకరణ ద్వారా వ్యక్తిపర ఆ(ధ్యా)త్మిక విముక్తిని బోధించాడు. సామాజికతతో సంబంధం లేని కేవలం వ్యక్తిపరమైన హక్కులను, విమోచనను మార్క్స్ తిరస్కరిస్తే, అంబేడ్కర్ వ్యక్తికి అనుకూలంగా సామాజికతను తిరస్కరించాడు. అంబేడ్కర్ విమోచనా భావన వ్యావహారిక సత్తావాదపరంగాను, అస్తిత్వవాద పరంగాను సరైంది కాదు.
హిందూ మతాన్ని తీవ్రంగా ఎంతో రాడికల్ గా విమర్శించి చీల్చి చెండాడిన అంబేడ్కర్ అసలు మత పరిధిని దాటి ఎందుకు ఆలోచించలేక పోయాడని లోతుగా పరిశీలిస్తే – మొత్తంగా మతమనే భావన పట్లనే ఆయనది సానుకూల దృక్పథం అని చెప్పవచ్చు. ఛాందసానికి, వివక్షకు, దైవానికి అతీతంగా మతాన్ని ఆయన ఒక సామాజిక సమూహంగా, శక్తిగా చూసాడనిపిస్తుంది. మతానికి బయట మనుషులు ఒక ఐక్య సమూహంగా, నూతన సమూహంగా ఉండగలరని ఆయన భావించలేకపోయాడు. కనుకనే మిగతా మతాలకంటే మెరుగైన బౌద్ధాన్ని ఆయన ఎంచుకున్నాడు.
చివరగా రచయిత ఆనంద తేల్ తుంబ్డే ఏమంటాడంటే- బౌద్ధ దర్శనంలో దిద్దుబాటు సాధ్యం కాదు. కానీ మార్క్సిజం ఒక శాస్త్రం. దానికి దిద్దుబాటు సాధ్యమవుతుంది.అనుభవం రీత్యా చూస్తే- మార్క్స్,అంబేద్కర్లు ఊహించినట్టుగా జరగకపోవడం వల్ల ఇద్దరూ విఫలమయ్యారని రచయిత అంటాడు. నిజమే వ్యక్తులుగా వాళ్ళు విఫలం చెందారని అనవచ్చు. వారు మరణించారు కనుక దిద్దుబాటు ఎలాగూ సాధ్యం కాదు. కానీ
మార్క్సిజం అసలే విజయం సాధించలేదని చెప్పలేం.( ఉదా : రష్యా, చైనాలలో విప్లవ విజయాలు). తర్వాతి కాలంలో అక్కడ పెట్టుబడిదారీ పునరుద్ధరణ జరిగి అవి విఫలం కావచ్చు. అవి విఫలం కావడానికి అనుసరించిన సిద్ధాంతంలో గాని, ఆచరణలో గానీ లోపాలు కారణం కావచ్చు. ఆ విషయంపై పరిశోధన, చర్చ జరగవల్సిందే.
రచయిత అన్నట్లుగా మార్క్సిజం లోని అంతస్సారం ఇంకా కాలానుగుణ్యమైనదేనని చెప్పడంలో సందేహం లేదు. ఆయన అన్నట్లు -విప్లవానంతర దేశాలలో తలెత్తిన సామాజిక పరిస్థితులపై సిద్ధాంత కృషి జరగడమే కాదు, విప్లవాన్ని కాంక్షించి పోరాడే దేశాలలో కూడా నెలకొన్న సామాజిక పరిస్థితులను శాస్త్రీయంగా అధ్యయనం చేసి, అర్థం చేసుకోవడానికి మార్క్సిస్టు సిద్ధాంతాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి పరుచుకోవడం కూడా చాలా అవసరమే. అలాగే రచయిత అన్నట్లుగా- వర్గ పోరాటం అంటే హింసాయుత పోరాటమే కాదని చెప్పడానికి ఈనాడు మధ్యభారతంలో, సిలింగేర్ తదితర ప్రాంతాలలో జరుగుతున్న పోరాటాలే సజీవ సాక్షాలుగా ఉన్నాయని కూడా మనం గుర్తించాలి.
ఏదేమైనప్పటికీ, సమాజంలో సమూల మార్పులు కోరుకునే ప్రజలకు, పోరాటకారులకు మార్క్స్, అంబేడ్కర్ ల ఆలోచనలు చాలా అవసరమైనవి. ఎందుకంటే- రాజకీయ ఆర్ధిక వ్యవస్థను, సామాజిక వ్యవస్థను మార్చడం కోసం వర్గపోరాటం అన్ని వైపులా జరగాల్సిన అవసరం వుంది.
మొత్తంమీద ఆనంద్ తేల్ తుంబ్డే రాసిన ఈ పుస్తకం మార్క్స్, అంబేడ్కర్ ల ఆలోచనలను చాలా సాధికారికంగా వివరించి, విశ్లేషించిందని చెప్పాలి. రచయత అభిప్రాయాలతో ఏకీభావం లేదా విభేదం తో నిమిత్తం లేకుండానే మార్పు కోరే కార్యకర్తలు అందరూ దీన్ని చదివితే మానవ విమోచనకు సంబంధించిన అవగాహన తప్పక మెరుగు పడుతుంది.
***********************