కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లో రెండు రోజుల పర్యటనకు వెళ్లారు. ఈ క్రమంలోనే అమిత్ షా ఛత్తీస్‌గఢ్‌కు వచ్చిన ప్రధాన లక్ష్యం మావోయిజాన్ని అంతం చేయడం గురించి గురించి మాట్లాడటం. ఛత్తీస్‌గఢ్ మాత్రమే కాదు, మావోయిజం ప్రభావం ఉన్న పరిసర ప్రాంతాల రాష్ట్ర అధికారులతో సహా వరుస సమావేశాలు నిర్వహించి చర్చించారు. అన్ని సమావేశాలు ముగిసిన తర్వాత చివరగా నిర్వహించిన విలేఖరుల సమావేశంలో కేవలం దండకారణ్య, బస్తర్, ఛత్తీస్‌గఢ్‌ల నుండి మాత్రమే కాకుండా మొత్తం దేశవ్యాప్తంగానే మావోయిజాన్ని నిర్మూలిస్తామని చెబుతూ అందుకు ఒక తేదీని, 2026 మార్చి కూడా ఇచ్చారు.
వ్యూహాలు రచిస్తున్న తీరు, ప్రభుత్వం సఫలమవుతున్న తీరు చెబుతూ, మావోయిజం సమూలంగా తుడిచిపెట్టుకుపోయే రోజు ఎంతో దూరంలో లేదని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా స్పష్టం చేశారు. జర్నలిస్టులందరి ముందు, ఆన్‌లైన్‌లో కూడా చెప్పారు.
సమాచారం దేశమంతటా తెలిసింది.
ఈ ఆలోచన చాలా కాలం నుండి నా మనస్సులో ఉంది. ఇప్పుడు ఛత్తీస్‌గఢ్‌లో మళ్లీ బిజెపి ప్రభుత్వం వచ్చింది. ప్రభుత్వ ఏర్పాటుకు ముందు కేంద్ర హోంమంత్రి చెప్పేవారు చిటికెలో మావోయిజాన్ని అంతం చేస్తామని. ఈ మావోయిజం మన దేశంలో ఎంతకాలం కొనసాగుతుంది అనే విషయం గురించి నేను చాలా మంది మావోయిస్టు నాయకులతో మాట్లాడుతున్నాను. ఈ క్రమంలో నాకు ఒక లేఖ వచ్చింది. మావోయిస్టుల కేంద్ర కమిటీ, పొలిట్‌బ్యూరో సభ్యులను నేను చాలా ప్రశ్నలు అడిగాను. వాళ్లు నాకు నాలుగు పేజీల లేఖ రాశారు.
ఇది చాలా ఆసక్తికరమైన లేఖ. చాలా రోజులుగా నా దగ్గర ఉంది. కానీ 2026 మార్చి నాటికి భారత్ నుంచి మావోయిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తాం అని అమిత్‌షా ప్రకటించారు కాబట్టి ఆ లేఖను ఇప్పుడు ప్రస్తావించడం చాలా ముఖ్యం అని భావించాను. ఎందుకంటే ఈ వాయిదాకు సంబంధించిన అనేక ప్రశ్నలను మావోయిస్టు అగ్రనేతను కూడా అడిగాను. దానికి ఆయన ఆ లేఖలో ఏమి చర్చించారు? అనే దాని గురించి మాట్లాడదాం.
ఛత్తీస్‌గఢ్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పదే పదే రాష్ట్రానికి వచ్చారు. ఎన్నికల ప్రచారంలో ఆయన ఒక విషయం తరచుగా ప్రస్తావించేవారు. ఛత్తీస్‌గఢ్‌లో బిజెపి ప్రభుత్వం ఏర్పడితే, ఛత్తీస్‌గఢ్‌లో అతిపెద్ద సమస్యగా భావించే మావోయిజాన్ని ఎక్కువ కాలం కొనసాగించనివ్వబోమని అన్నారు.
సరిగ్గా అమిత్ షా కోరుకున్నదే జరిగింది, చత్తీస్‌గఢ్‌లో ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారిన తర్వాత, ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులపై ప్రభుత్వ కార్యాచరణ ప్రణాళిక కూడా మొదలైంది. ప్రభుత్వం ముందెన్నడూ ప్రవేశించలేని అబూజ్‌మాడ్‌లోని ప్రాంతాల్లో కూడా ఎన్‌కౌంటర్లు నిరంతరం జరుగుతున్నాయి. ఈ లెక్కలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. గత ఎనిమిది నెలల్లో తాను సాధించిన విజయాల సంఖ్య 150 దాటిందని ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి రిపోర్టు పంపింది. వీరంతా హత్యకు గురైన మావోయిస్టులు. లొంగిపోయిన వారి సంఖ్య, అరెస్టుల సంఖ్య కూడా చాలా ఎక్కువగా వుంది. అన్ని గణాంకాలను జర్నలిస్టుల ముందు పెట్టి, దాని ఆధారంగా 2026 నాటికి మావోయిజం ఎలా నిర్మూలించబడుతుందో వివరించారు.
ఒకప్పుడు బస్తర్‌లో పనిచేసిన ఐపిఎస్ అధికారి జితేంద్రశుక్లాతో మాట్లాడుతున్నప్పుడు ఈ సమస్య నా మనస్సులో ఉండిరది. ఆయనతో ఫోన్‌లో చాలా సేపు మాట్లాడాను. ‘‘ఛత్తీస్‌ఘడ్‌లో ప్రభుత్వం మారిన తర్వాత నిజంగా మావోయిస్టులకు వ్యతిరేకంగా ప్రణాళికలు రూపొందిస్తారా? బిజెపి తరచుగా అలా అంటోంది.. గృహమంత్రి అమిత్ షా కూడా అన్నారు కదా’’ అని అంటే, జితేంద్ర శుక్లా ‘‘బిజెపి ప్రభుత్వం వస్తే తప్పకుండా బస్తర్‌లో పెద్ద ఎత్తున ప్లాన్ తయారు చేస్తాం. భారీ చర్యలు (ఆపరేషన్‌లు) చేపడ్తాం. బస్తర్‌లో యుద్ధ వాతావరణం నెలకొంటుంది’’ అని చెప్పారు.
‘‘మావోయిస్టులతో ప్రభుత్వం శాంతి చర్చలు జరపాలనుకుంటే, మావోయిస్టులు కూడా చర్చలలో పాల్గొనాలనుకుంటే నేను ముఖ్యమైన పాత్ర పోషిస్తాను, ప్రభుత్వం-మావోయిస్టుల మధ్య ఒక ముఖ్యమైన లింక్‌గా ఉంటాను. శాంతిచర్చలు జరగాలి. తద్వారా బస్తర్‌లో ఆయుధాలు ఉపయోగించకుండా, బుల్లెట్లు కాల్చకుండా, రక్తం చిందించకుండా శాంతిని తీసుకురావచ్చు’’ అన్నారు.
బస్తర్‌లోని లోతట్టు ప్రాంతాలలో, మావోయిస్టుల ప్రధాన ప్రాంతాలలో నిరంతరం క్యాంపులు ఏర్పాటు చేస్తున్నప్పుడు, నాలుగు వైపులా చుట్టుముట్టినప్పుడు మావోయిస్టుల సరఫరా వ్యవస్థ (లింకు) కూడా తీవ్రంగా ప్రభావితమవుతుంది. ఖచ్చితంగా తూటాలు, ఆయుధాల కొరతను వాళ్లు ఎదుర్కొంటారు. అలాంటప్పుడు మావోయిస్టులు ప్రభుత్వంతో ఎలా పోరాడుతారు? అందుకని వారు శాంతి చర్చల కోసం ముందుకు రావడం చాలా ముఖ్యం కదా అనే ప్రశ్న తలెత్తుతుంది.
శాంతి చర్చలకు సిద్ధంగా వున్నామని గృహమంత్రి విజయ్ శర్మ పదే పదే చెబుతున్నారు. మీరు బహిరంగంగా రాలేకపోతే, మీ అభిప్రాయాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లేదా వీడియో కాల్ ద్వారా తెలియజేయవచ్చు అని అంటున్నారు. మీరు ఏ మాధ్యమం ద్వారా మాట్లాడాలనుకున్నా మాట్లాడవచ్చు అన్నారు. పోలీసు ఆఫీసర్ జితేంద్ర శుక్లా కూడా మావోయిస్టులకు ఏమైనా షరతులు ఉంటే ఆ షరతులపై కూడా చర్చించవచ్చు అన్నారు. రెండు వైపులా రక్తం ప్రవహిస్తుంది, రెండు వైపులా నష్టాలు జరుగుతాయి కాబట్టి శాంతి చర్చలపై మావోయిస్టులు, ప్రభుత్వమూ కూడా చొరవ తీసుకోవాలి.
దీనితో పాటు, నా మదిలో ఉన్న మరొక ప్రశ్న గురించి మావోయిస్టు అగ్ర నాయకుడితో చర్చించాను. మీ పార్టీలో, మీ నిర్మాణంలో, కింది స్థాయిలో అన్నీ సరిగ్గా జరగడం లేదు. రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నప్పుడు లోతట్టు ప్రాంతాల్లో వుండే కింది స్థాయి మావోయిస్టులు డబ్బులు తీసుకుంటున్నారని రోడ్డు నిర్మాణ పనులు చేసే ఒక మిత్రుడు యిచ్చిన సమాచారం వల్ల తెలిసింది. లొంగిపోయి ప్రభుత్వం పక్షాన నిలిచిన మావోయిస్టులు కూడా చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు. అందువల్ల నిర్మాణం బలహీనపడుతున్నదని నేను అనుకుంటున్నాను. ఈ విషయం నేను మావోయిస్టు నాయకుడికి తెలియచేసాను.
మావోయిస్టుల ఆ విషయాన్ని కూడా ఈ లేఖలో ప్రస్తావించారు. కింది స్థాయి నాయకులు రోడ్డు వేస్తున్న వారి నుంచి విరాళాలు తీసుకంటూ ఉంటే అది సరైంది కాదని ఆ నాయకుడు రాశాడు.
ఆయన నాకు ఇలా రాశారు..
ప్రియమైన మిత్రమా నమస్తే
ఎలా వున్నారు? ఎల్లప్పుడూ మీ క్షేమాన్ని, మీ వృత్తిలో అభివృద్ధిని ఆశిస్తూ మీకు ఈ లేఖను పంపిస్తున్నాను. మీరు మా భద్రతకు సంబంధించి చాలా ముఖ్యమైన వార్తలను పంపారు. అందుకు మా కృతజ్ఞతలు. రోడ్లు నిర్మిస్తున్న వారి నుంచి కింది స్థాయి మావోయిస్టు నేతలు డబ్బు తీసుకుంటే అది వారి భద్రతను దెబ్బ తీస్తుంది’’ అన్నారు. విష్ణుదేవ్ సాయి ముఖ్యమంత్రి అయ్యారు, మావోయిజం నుండి విముక్తి చేస్తామని ప్రజలకు ప్రభుత్వం హామీ ఇచ్చారు కాబట్టి ఇక పదే పదే దాడులు జరుగుతాయి అని నేను రాశాను కాబట్టి ఆ విషయం ప్రస్తావించారు ఆయన ప్రస్తావిస్తూ.. ‘‘రాష్ట్రంలో బీజేపీ గెలిచి విష్ణుదేవ్ సాయి ముఖ్యమంత్రి అయ్యారు. గతంలో లాగా ఈ సందర్భంలో కూడా విప్లవోద్యమాన్ని ముందుకు తీసికెళ్లడానికి పూర్తిగా కృషి చేస్తాం. గత బిజెపి రమణ్‌సింగ్ 15 సంవత్సరాల పాలనలో, మా ఉద్యమం చాలా గొప్ప విజయాలు సాధించింది. 1980 నుండి 2003 వరకు మా ఉద్యమం సాధించిన దానికంటే 2003 నుండి 2018 వరకు మేం మరింత ప్రముఖ విజయాలు సాధించాం. బిజెపి పాలనలో సల్వాజుడుంను ఓడిరచాం. ఆ సమయంలోనే ఆపరేషన్ గ్రీన్‌హంట్‌కు తగిన సమాధానమిచ్చాం. అలాంటిదే అయిన ఆపరేషన్ సమాధాన్‌ను అర్థం చేసుకున్నాం. పరిష్కారాన్ని కనుగొన్నాం. అధికారంలో వున్న హిందుత్వ శక్తులకు దాని మీద లోతైన సమీక్ష చేసి 2022 అక్టోబర్‌లో విప్లవ వ్యతిరేక సూరజ్‌కుండ్ వ్యూహాత్మక సైనిక కేంపెయిన్‌ను చేపట్టాల్సి వచ్చింది. ఇదంతా అధికారంలో ఉన్న బిజెపి చేసినదే. ఇక్కడ నేను మీకు మరొక సత్యాన్ని తెలియజేయడానికి ప్రయత్నిస్తాను. 2003లో బీజేపీ తొలిసారి అధికారంలోకి వచ్చినప్పుడు బెటాలియన్ మాట అటుంచి మనకు కంపెనీ కూడా లేదు. కానీ వారి పాలనాకాలంలో ఎన్నో కంపెనీలు, ప్లాటూన్లు, బెటాలియన్లు కూడా ఏర్పాటయ్యాయి. తాడ్‌మెట్లలాంటి అనుభవాలు వచ్చాయి. జీరగూడలాంటి అనుభవాలు కూడా చూశాం. వాటినుండి నేర్చుకున్నాం. మన వీర ప్రజలు తమ ప్రియమైన పిల్లలను వందల సంఖ్యలో పిఎల్‌జిలో చేర్చి వీర గెరిల్లాలుగా మార్చేందుకు తమ శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు.
అన్నా,
మీరు బస్తర్‌కి ఎప్పుడు వచ్చారో తెలీదు కానీ 80వ దశకంలో మట్టి కుండలో వండుకుని చింతపండు రసంతో ఒక పూట తినే, అర్ధనగ్నంగా ఉండిన ఆదివాసీలు ఇప్పుడు ఈ దేశ అణగారిన ప్రజల ముందు ఆదర్శంగా ఒక ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని, ప్రజల ప్రభుత్వాన్ని (జనతాన సర్కార్) నిలబెట్టారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంగా ఏర్పడి 23 ఏళ్లు దాటింది. భాజపా అత్యధికకాలం పాలన చేసింది. పిల్లలకు తమ మాతృభాషలో విద్య లభించలేదు. ఈనాడు జనతాన సర్కార్‌లో పిల్లలు తమ మాతృభాషలో సంతోషంగా చదువుకొంటున్నారు. ఇదంతా మేం హిందూత్వ శక్తులతో, బడా కార్పొరేట్ కంపెనీలతో, వారి కోసం మోహరించిన ఖాకీ బలగాలతో పోరాడి సాధించాం.
పైన పేర్కొన్న విజయాలను సాధించడానికి, బస్తర్ ప్రజలు చాలా విలువైన త్యాగాలు చేయవలసి వచ్చింది. బస్తర్ అడవుల్లో రక్తం ప్రవహించింది. ఎన్నో నష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. విప్లవంలో యివన్నీ అనివార్యమైనవి కాదు. ఈ నష్టాల్లో చాలా వరకు అనవసరమైనవి కూడా వున్నాయి. వాటి నుంచి గుణపాఠాలు తీసుకొని, విష్ణు దేవ్‌సాయి పాలనా కాలంలో తప్పకుండా ముందుకెళ్లడానికి ప్రయత్నం చేస్తాం. మీ అందరి మద్దతు దొరుకుతుందని విశ్వాసం వుంది. అన్నింటి నుండి గుణపాఠం తీసుకుంటాం. ప్రజలందరి మద్దతు లభిస్తుందని ఖచ్చితంగా అనుకుంటున్నాను.
‘‘చాలా విషయాల్లో నాకు మావోయిస్టుల సిద్ధాంతాలతో విభేదాలు ఉన్నాయని, వారి కార్యకలాపాల గురించి నాకు ప్రశ్నలు ఉన్నాయని నేను చెప్పాను. అందుకు సంబంధించి ఆయన రాస్తూ’’
మా సూత్రాలతో మీకు విభేదాలు ఉండవచ్చు. కానీ నిమ్మళంగా ఆలోచిస్తే దేశంలో విప్లవ ఆవశ్యకతను మీరందరూ అర్థం చేసుకుంటారు. మేము హింసను ఏ మాత్రం కోరుకోం. రక్తకేళిని ఆపడానికే త్యాగాల మార్గంలో మృత్యువును సవాలు చేస్తున్నాం. మీకు గుండాధూర్ నుండి భగత్ సింగ్ వరకుబీ తరువాత ప్రవీర్ చంద్ భంజ్‌దేవ్ వరకు తెలిసి వుండవచ్చు. అంతకు ముందు, స్పార్టకస్ (బానిస సమాజం) చరిత్ర అందరికీ తెలుసు. అందుకే విప్లవం అంటేనే త్యాగాలతో ప్రపంచాన్ని మార్చడం. విప్లవం అంటే ఒక పార్టీ స్థానంలో మరో పార్టీ రావడం కాదు. అది కాంగ్రెస్ కావచ్చు, బిజెపీ కావచ్చు లేదా ఏ పార్టీ అయినా కావచ్చు. విప్లవం అంటే అణగారిన, దోపిడీకి గురైన, పేద, శ్రామిక ప్రజలు ఏకమై దోపిడీ, పాలకవర్గాలనుంచి అధికారాన్ని తీసుకోవడం.
ఇట్లా చూస్తే, మీరు దోపిడీదారుడు కాదు. మీరు ఖచ్చితంగా పీడకులు కాదు. మీరు శ్రామికులు. ప్రజల సంక్షేమం కోసం మీరు కష్టపడి సంపాదించిన డబ్బుతో జీవిస్తున్నారు. కాబట్టి మీకు ఇష్టమున్నా లేకపోయినా మీరు విప్లవవర్గానికి చెందినవారు. అందుకని అధికారంలో బిజెపి ఉన్నా లేదా కాంగ్రెస్ ఉన్నా మాకు ఎటువంటి తేడా వుండదు. నేను స్పష్టం చేయదలచుకున్న విషయం ఏమంటే మా శత్రువులు ఎంత శక్తివంతంగా ఉంటారో, ఎంత మోసగాళ్ళో, ఎంత కపటులో అంతకంటే శక్తివంతంగా, తెలివిగా మేం తయారు కావాలి. ప్రజలు చరిత్రను సృష్టిస్తారు. వారు అపూర్వమైన పనులన్నింటినీ చేయగలరు. చరిత్ర ఇందుకు సాక్ష్యం.
ప్రస్తుతం, విష్ణుదేవ్ సాయి ముఖ్యమంత్రి కావడం గురించి వార్తల్లో ఉన్న ఒక విషయం ఏమిటంటే, అతను ఆదివాసీనే. అయితే మహేంద్ర కర్మ కూడా ఆదివాసీనే అని మీకు తెలుసు. అయితే అతను సల్వాజుడుం ప్రాణదాత అని అంటారు. కశ్యప్ కుటుంబం కూడా ఆదివాసీలే. బస్తర్ ఎంపీగా ఉన్న బలిరామ్ కశ్యప్‌జీ, మృతిచెందిన నాయకుడు, బీజేపీకి చెందిన ప్రముఖ నాయకుడు. ఆయన కూడా ఆదివాసీ. కానీ బలిరామ్ కశ్యప్ మొదలుకొని దినేష్ కశ్యప్, అతని సోదరుల వరకు ఎవరైనప్పటికీ, వారు ఎంత ప్రమాదకరమైనవారో మీకు తెలుసు లతా ఉసెండీ లేదా కాకా లఖ్మా కూడా కావచ్చు.
కాకా లఖ్మా లేదా ఏ ఆదివాసీ నాయకుడైనా, రిజర్వేషన్ కోసం, అధికారం కోసం ఆదివాసీ పేరుతో ఆడుకుంటారు. ఇలాంటి వారినే గోముఖ వ్యాఘ్రాలు అంటారు. విష్ణు దేవ్ సాయి సాహిబ్‌ను నేతమ్ సాహిబ్ అభినందించాడు కూడా. ఇప్పుడు కార్పొరేటీకరణ, సైనికీకరణ ఎంత వేగంగా జరుగుతుందో చూడాలి. దీనితో పాటు ఆదివాసీల హైందవీకరణ కూడా పెరుగుతుంది, శిబుసోరెన్ సాహెబ్ కూడా ఆదివాసీనే. అతని కుమారుడు, ప్రస్తుత జార్ఖండ్ ముఖ్యమంత్రి అర్జున్ ముండా కూడా ఆదివాసీనే. ధర్మారావు ఆత్రం కూడా ఆదివాసీనే. ఆదివాసీ అయినంత మాత్రాన ఆదివాసీల భవితవ్యం మారదు సోదరా. ద్రౌపది ముర్ము మహిళ, అనసూయా ఉయికే కూడా ఆదివాసీ మహిళ. ఇందిరాగాంధీ కూడా ఒక మహిళే. అయినా ఆడవాళ్ల దౌర్భాగ్యం మనదేశంలో ఎంత మారింది? కులం పేరుతో, మతం పేరుతో, తెగ పేరుతో ఎన్ని మారణకాండలు జరుగుతున్నాయి? అందుకే ఈ వర్గసమాజంలో, దోపిడి వర్గానికి చెందిన ప్రతి వ్యక్తి తన వర్గ ప్రయోజనాలను కాపాడాలి అని మాత్రమే చూస్తాడు.
ఆయన ఇంకా రాశాడు.
ఇంత పెద్ద ఉద్యమంలో తప్పులు కూడా జరగొచ్చు, కొందరు చెడు పనులు చేయవచ్చు, అవినీతి కేసులు కూడా వెలుగులోకి రావచ్చు. పార్టీలో వున్నవారందరూ వృత్తి విప్లవకారులు కాదు. వృత్తి విప్లవకారులే అయితే ఎలాంటి తప్పులు చేసినా వారిపై కచ్చితంగా విచారణ జరిపి, క్రమశిక్షణా చర్యలు తీసుకుంటాం. మరోవైపు లక్షలాది మందితో కూడిన ప్రజా సంఘాలు ఉన్నాయి. వారంతా దేవుడి పిల్లలు కాదు. ఇక్కడ ఒక విషయం చెబుతాను. ప్రపంచంలోనే అతిపెద్ద లంచం తీసుకునేది దేవుడు. డబ్బు లేకుండా, ప్రసాదం లేకుండా దేవుడు కూడా వినడు. సరే అదంతా పక్కనపెడితే, మీరు సందేశంలో పేర్కొన్న వ్యక్తులను మేము ఖచ్చితంగా కనుగొంటాము.
మావోయిస్టుల నిర్మూలన గురించి మీతో మాట్లాడిన ఎస్పీ సాహిబ్ గురించి మీతో ఒక ముఖ్యమైన విషయం పంచుకోవాలనుకుంటున్నాను. ఈ ప్రపంచం నుండి ప్రతి భావజాలాన్ని, ముఖ్యంగా మావోయిస్టులను అంతం చేయడానికి ముందు, ప్రపంచాన్ని దోపిడీ, పీడనల నుంచి విముక్తిచేయమని మా తరపున ఆ మహానుభావుడైన ఎస్పీ సాహిబ్‌కి చెప్పండి. ఒకవేళ ఆ కాకీ దొరకు చేతకాకపోతే మావోయిజం లేదా వేరే ఏదైనా పేరుతో ఈ ప్రపంచంలో అభివృద్ధి చెందుతుంది. మా వ్యవస్థాపక నాయకులు కామ్రేడ్ చారుమజుందార్, కన్హయ ఛటర్జీల అమరత్వం తర్వాత నక్సలైట్ల పీక నొక్కేసామని ప్రచారం చేశారు. కానీ నక్సలైట్లు మావోయిస్టుల పేరుతో ఎర్ర జెండాఎగురవేస్తున్నారు కాబట్టి ముందుగా అందరం కలిసి దోపిడి, అణచివేత, దౌర్జన్యం, అత్యాచారం తదితర సామాజిక రుగ్మతలను పరిష్కరిద్దాం.
‘‘ప్రభుత్వంతో చర్చల గురించి నేను కూడా చెప్పాను. ఎందుకంటే ప్రభుత్వం మీదో మాట్లాడాలని కోరుకుంటే మీరు చర్చలకు ఎందుకు ముందుకు రావడం లేదు? ఒకసారి చర్చలు ఎందుకు జరపకూడదు? మీరు కూడా ఈ రక్తపాతాన్ని ఆపడానికి చొరవ ఎందుకు తీసుకోవడం లేదు? అని అడిగాను’’
అందుకు యిలా జవాబు యిచ్చారు.
ప్రభుత్వంతో చర్చలు జరపడంలో మాకు ఎలాంటి వ్యతిరేకత లేదు. బిబిసి పూర్వ జర్నలిస్ట్ సుభ్రాంశు చౌదరి మీకు తెలుసు. ‘చాలా సీనియర్ జర్నలిస్ట్. శాంతి చర్చల కోసం నిరంతరం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు’. మేము లొంగిపోయేట్లు చేయడానికి గత ఆరు సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్నారు. ఒక ఇంటర్వ్యూలో సునీల్ అనే పత్రిక సంపాదకుడు చాలా మంచి ప్రశ్న అడిగాడు. ప్రస్తుతం హాలండ్ ద్వారా ఫిలిప్పీన్స్ పార్టీ వైపు నుంచి శాంతి చర్చలు మొదలవబోతున్నాయి. కానీ పిలిప్పీన్స్ కమ్యూనిస్టు పార్టీ వాళ్ళు చాలా స్పష్టంగా తమ డిమాండ్లను శాంతి చర్చలకు ముందు ప్రభుత్వం ముందు వుంచారు అని. అలానే శాంతి చర్చల కోసం మా డిమాండ్లు గత 13 సంవత్సరాలుగా ప్రభుత్వం ముందు ఉన్నాయి. అయితే మేము మా ఆయుధాలను ఎప్పటికీ వదులుకోము. లొంగిపోయే సమస్య అసలు లేనేలేదు. విప్లవాభినందనాలతో.. శ్రీనివాస్
ఇదీ ఈ నాలుగు పేజీల లేఖ. నేను ఇంకా చాలా ప్రశ్నలను పంపాను. వాటికి అతను సమాధానం ఇవ్వాలనుకుంటున్నాడు. సమాధానం ఇవ్వడానికి సమయం పడుతుంది. ఎందుకంటే బలగాలు అతన్ని అన్ని వైపుల నుండి ఖచ్చితంగా చుట్టుముట్టి వుండవచ్చు. పరిస్థితి అతనికి అనుకూలంగా లేదు. అందుకే అతనితో చాలా కాలంగా మాట్లాడలేకపోయాను. ఇంకా చాలా ప్రశ్నలకు సమాధానం రావాల్సి వుంది.
కానీ నాలుగు పేజీల లేఖను అందరి ముందు ఉంచడానికి ఇది చాలా సరైన సమయం అని నేను భావించాను. ఎందుకంటే ప్రభుత్వమూ, కేంద్ర గృహ మంత్రి అమిత్ షా కూడా ఆయుధాలతో అడవుల్లో తిరుగుతున్న వారు వచ్చి లొంగిపోతే, వారి అభివృద్ధికి ప్రభుత్వం నిరంతరం కట్టుబడి ఉంటుందని, వారిని దేశంలోని మొత్తం ప్రజలతో పాటు ముందుకు తీసుకెళ్తామని మరోసారి విజ్ఞప్తి చేశారు.
దాంతోపాటు, వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా లేదా వీడియో కాల్ ద్వారా లేదా ఏ మాద్యమం ద్వారా మాట్లాడాలనుకున్నా మావోయిసులు మాట్లాడవచ్చు అని ఛత్తీస్‌గఢ్ గృహమంత్రి విజయ్ శర్మ చర్చలకు సిద్ధంగా వున్నామని ప్రకటిస్తున్నారు. మావోయిస్టులేమనుకుంటున్నారో చెప్పమంటున్నారు. వీటన్నింటి మధ్య ఈ లేఖ గురించి తెలియచేయడం ముఖ్యం అని నేను భావించాను.
నేను అడిగిన ప్రశ్నపై మావోయిస్టుల పొలిట్‌బ్యూరో స్థాయి నాయకుల అభిప్రాయం ఏమిటో అందరూ తెలుసుకోవాలి. అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వారి అభిప్రాయం పార్టీ అభిప్రాయం. అందుకే నేను ఈ లేఖకు సంబంధించి ఈ వీడియోను సిద్ధం చేసాను. ఈ ముఖ్యమైన సంభాషణ నా ప్రేక్షకులందరికీ చేరాలి. అది మావోయిస్టు పార్టీ సభ్యులు లేదా భద్రతా దళాల సభ్యులు, రహస్య విభాగం సభ్యులు, ప్రభుత్వ వ్యక్తులు, ప్రతిపక్షం – వారందరికీ లేదా ప్రజలందరికీ మావోయిస్టులు ఏమనుకుంటున్నారో తెలియాలి. అందుకే చర్చలకు సంబంధించి ఈ వీడియోను సిద్ధం చేశాను.
బస్తర్ టాకీస్, యూ ట్యూబ్ చానెల్ వీడియోకు అక్షరీకణ
పద్మ కొండిపర్తి