సిపిఐ (మావోయిస్టు) ఏర్పడి 2024 సెప్టెంబర్ 21 నాటికి 20 సంవత్సరాలు. సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 20 వరకు నెల రోజుల పాటు ఈ రెండు దశాబ్దాల వార్షికోత్సవాలు జరుపుకోవాలని పీడిత, పోరాట ప్రజలకు మావోయిస్టు పార్టీ విజ్ఞప్తి చేసింది. పార్టీ శ్రేణులు, నాయకత్వం, విప్లవాభిమానులు దేశవ్యాప్తంగా ఈ 20 ఏళ్ల సభలు అమరుల స్మృతిలో నిర్వహించుకుంటారని కూడా ప్రకటించింది. ఈ 20 ఏళ్లలో 5250 మంది పార్టీ సభ్యులు, 22 మంది కేంద్ర కమిటీ సభ్యులు, 8 మంది పోలిట్ బ్యూరో సభ్యులు అమరులయ్యారని, పార్టీ నిర్మాతలైన అమరులు కామ్రేడ్స్ చారుమజుందార్, కన్హయ్య చటర్జీతో పాటు వారి పోరాటాలను, త్యాగాలను స్మరించుకుంటూ అమరుల ఆశయాల సాధనకై, వారి స్ఫూర్తితో నూతన ప్రజాస్వామిక విప్లవ విజయందాకా మడమ తిప్పకుండా పోరాడుతామని ప్రతిజ్ఞ చేసింది. పార్టీ ఎన్ని నిషేధాలు, నిర్బంధాలు, ఎన్‌కౌంటర్‌లు, కగార్ వంటి ఎన్ని మారణకాండలనయినా అధిగమించి ఈ 20 ఏళ్ల వార్షికోత్సవాలను దేశ ప్రజల్లో ఉన్న విప్లవ కాంక్షలు, పీడిత ప్రజల పోరాట పటిమ, వ్యాన్‌గార్డ్ కార్మిక వర్గ పార్టీ నాయకత్వం, దండకారణ్యం, రaార్ఖండ్, బీహార్‌లోను ఏర్పడిన జనతన రాజ్యం మార్గదర్శకత్వంలో విజయవంతంగా నిర్వహించుకుంటుంది. కానీ మొత్తంగా దేశంలోని సమాజం మీద ఈ 20 ఏళ్ల మావోయిస్టు పార్టీ పోరాటం, త్యాగాల ప్రభావం గురించి మనం మాట్లాడుకోవాలి. అటువంటి ప్రయత్నం ఒకటి మావోయిస్టు పార్టీ దశమ వార్షికోత్సవాల సందర్భంగా హైదరాబాద్ కేంద్రంగా 2014 సెప్టెంబర్ 21 సందర్భంగా జరిగింది.
అమరుడు బొజ్జా తారకం, ప్రొఫెసర్ జగ్మోహన్ (షహీద్ సింగ్ భగత్ సింగ్ మేనల్లుడు, ప్రముఖ ప్రజాస్వామ్యవాది ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొ. కెఆర్ చౌదరి, కె. శివారెడ్డి, కాకరాల, ఆర్ నారాయణమూర్తి, కంచన్‌కుమార్, అరుణ్ చక్రవర్తి(పశ్చిమ బెంగాల్), చలసాని ప్రసాద్, కృష్ణాబాయి, జి. కళ్యాణరావు, సిఎస్‌ఆర్ ప్రసాద్, కె ఎస్ పండిట్(రaార్ఖండ్), పాణి, కన్వీనర్‌గా వరవరరావు, కో కన్వీనర్‌గా పద్మకుమారి (అమరుల బంధుమిత్రుల సంఘం)గా ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక ఏర్పడి సాహిత్యం కరపత్రాలతో విస్తృతమైన ప్రచారం, అన్ని ప్రజాసంఘాల భాగస్వామ్యంతో సెప్టెంబర్ 21న సుందరయ్య విజ్ఞాన భవన్‌లో ఒక రోజు సదస్సు, బహిరంగ సభ నిర్వహిస్తామని కూడా ప్రకటించింది. పోస్టర్లు, బ్యానర్లు అన్ని సిద్ధం చేసుకున్నది. పోస్టర్లు రాష్ట్ర వ్యాప్తంగా పంపించి అతికించడం కూడా జరిగింది.
2014 జూన్ 2న 60 ఏళ్ల పోరాట ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఈ 60 ఏళ్ళు ఈ ఒక్క పార్టీయే తనకున్న పూర్వనామాలతో ప్రజాస్వామిక ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పిలుపు ఇచ్చింది. పోరాడిరది. 1968`69 ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ఈ పార్టీ నాయకత్వం నుంచి కె.జి. సత్యమూర్తి, చక్కిళ్ళ ఐలయ్య వరంగల్‌లో అరెస్టయి జైల్లో నిర్బంధించబడ్డారు. హైదరాబాద్ సికింద్రాబాద్ నగరాల్లో కొల్లిపర రామ నరసింహారావు అజ్ఞాతం నుంచి మార్గదర్శకత్వం చేశాడు. రాష్ట్ర నాయకుడు కొండపల్లి సీతారామయ్య, కె. ప్రభాకర్ రెడ్డి పేరుతో ‘ఆంధ్రభూమి’ పత్రికలో సైద్ధాంతిక భూమిక సమకూర్చడమే కాకుండా తెలంగాణ అంతటా విప్లవ శ్రేణులకు నాయకత్వం వహించాడు. 20 ఏళ్ల క్రితం ఏర్పడిన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీలో పొలిట్ బ్యూరోలో తెలంగాణ నుంచి ఉన్న అమరులైన సభ్యులందరూ ఈ ప్రత్యేక తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చిన వాళ్లే.
1968-1969, 1972 ప్రత్యేక తెలంగాణ ఉద్యమాల నాటికి ఆ ఉద్యమానికి స్ఫూర్తి, ఉత్తేజం శ్రీకాకుళ రైతాంగ పోరాటం. 1968-69లలో నైతే శ్రీకాకుళాన్ని కాపాడుకోవడానికి మరో ఫ్రంట్ తెలంగాణ ఉద్యమం, శత్రు దృష్టిని, శక్తిని మళ్లించడానికి మరో శిబిరం అని కూడా ఆనాటి విప్లవ విద్యార్థులు భావించారు.
తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిన విప్లవ విద్యార్థులకు ఆనాటి ఉత్తేజం చైనా శ్రామిక వర్గ మహత్తర సాంస్కృతిక విప్లవం. నక్సల్‌బరీ వసంత మేఘగర్జనతో పాటే వియత్నాం పోరాటం. మరింత వినూత్న ప్రయోగంగా, ప్రత్యేక తెలంగాణకు సన్నిహితంగా చెప్పవలసింది. డీగాల్ నియంతృత్వానికి వ్యతిరేకంగా ఫ్రెంచి విప్లవ విద్యార్థి పోరాటం. కాపాడుకోవాల్సింది శ్రీకాకుళ గిరిజన రైతాంగ పోరాటం. వర్గ చైతన్యం రూపంలో కాకపోవచ్చు గానీ, విలువలు, త్యాగాల విషయంలో తొలి తెలంగాణ విద్యార్థి ఉద్యమం శ్రీకాకుళం వలనే 370 మంది రాజ్య హింసలో అమరులైన జ్ఞాపకంగా మిగిలిపోతుంది. ‘సలాం హైదరాబాద్’ నవలలో పరవస్తు లోకేశ్వర్ హైదరాబాద్ రాజభవన్ ముందు జరిగిన పోలీస్ కాల్పుల ఘట్టాన్ని చదివితే ఈ విలువల, త్యాగాల స్ఫూర్తి మనకు దృశ్య మానమవుతుంది. ఈ ఉద్యమం నుంచి ఎదిగివచ్చిన విద్యార్థి నాయకుడు ఆకుల భూమయ్య అధ్యాపక సంఘాల నాయకుడై, బడిలోనే కాకుండా, మావోయిస్టు పాఠాలు చెప్పే ఉపాధ్యాయుడై 1997 వరంగల్ ప్రజాస్వామిక ప్రత్యేక తెలంగాణ సదస్సు తర్వాత తెలంగాణ జనసభ, తెలంగాణ ప్రజా ఫ్రంట్ నాయకుడిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తధ్యమయ్యే సంధి కాలంలోనే అనుమానాస్పద యాక్సిడెంట్‌లో అమరుడయ్యాడు.
మావోయిస్టు పార్టీ ఏర్పాటుకు, తెలంగాణకు, హైదరాబాద్‌కు ఉన్న మరొక వర్గ బంధాన్ని కూడా వివరించాలి.
మావోయిస్టు పార్టీ ఏర్పడిరది 2004 సెప్టెంబర్ 21లో గానీ, ఈ ఏర్పాటును బహిరంగంగా ప్రకటించింది మాత్రం 2004 అక్టోబర్ 13న మంజీరా గెస్ట్‌హౌస్ లో జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ లోనే. 2004 మేలో వైయస్సార్ ముఖ్యమంత్రిగా, జానారెడ్డి హోం మంత్రిగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినట్లుగా బేషరతుగా నక్సలైట్లతో చర్చలు జరిపే వాగ్దానానికి రూపం ఇచ్చే కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ఆ వివరాలన్నీ చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం గానీ ఆనాడు అధికారికంగా ప్రభుత్వం సిపిఐ ఎం.ఎల్. పీపుల్స్‌వార్‌తో చర్చలు జరుపుతానని ప్రతిపాదించింది. పార్టీ తనతో పాటు మరో రెండు ఎం.ఎల్. పార్టీలు కూడా ఐక్యత చర్చల్లో ఉన్నాయి గనుక ఆ రెండు పార్టీలను కూడా ఆహ్వానించాలని ప్రతిపాదించింది. ఆ మూడు పార్టీలు కూడా సిపిఐ ఎం.ఎల్. (జనశక్తి), మారోజు వీరన్న నాయకత్వంలో ఉన్న పార్టీ మొడాలిటీస్ చర్చించడానికి తమ ప్రతినిధుల పేర్లు ప్రకటించారు.
పరస్పరం మార్చుకున్న చర్చల సరళి నియమావళిని మధ్యవర్తుల ముందు, హోంమంత్రి ముందు చర్చించే క్రమం దాకా పాల్గొన్న వీరన్న నాయకత్వంలోని ప్రతినిధులు తర్వాత చర్చల్లో పాల్గొనే అభిప్రాయాన్ని వదులుకున్నారు. సిపిఐ ఎం.ఎల్. పీపుల్స్ వార్, సిపిఐ ఎం.ఎల్. (జనశక్తి) నాయకులు గానే ఐదుగురు, సుధాకర్ (ఏఓబి కార్యదర్శి, పీపుల్స్‌వార్), గణేశ్ (ఉత్తర తెలంగాణ స్పెషల్ జోనల్ కమిటీ రాష్ట్ర కమిటీ సభ్యుడు), అమర్ సిపిఐ ఎం.ఎల్. (జనశక్తి) కార్యదర్శి, రియాజ్ (సిపిఐ ఎం.ఎల్. చర్చల పార్టీ ప్రతినిధి) లు సిపిఐ ఎం.ఎల్. పీపుల్స్‌వార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ కార్యదర్శి నాయకత్వంలో చర్చల కోసం నల్లమల అడవుల నుంచి శ్రీశైలం కొండ దిగువన పార్టీ కోరికపై జర్నలిస్టులతో పాటు వచ్చిన ఎం.టి. ఖాన్‌తో, చర్చల ప్రతినిధులతో కలిసి కర్నూలు జిల్లా నుంచి గుంటూరు జిల్లా మీదుగా అక్టోబర్ 11న బయలుదేరారు. మొదటి పాదం గుత్తికొండ బిలం దగ్గర ఆగి అక్కడ అప్పటికే నిర్మాణమై సిద్ధంగా ఉన్న సిపిఐ ఎం.ఎల్. నిర్మాత మొదటి కార్యదర్శి అమరుడు చారుమజుందార్ స్థూపాన్ని ఆవిష్కరించి దూర దూరాల నుంచి వచ్చిన వేలాది మందితో బహిరంగ సభ జరిగింది. ఆ సభలో రామకృష్ణ చేసిన ప్రసంగం ఇప్పటికీ సామాజిక మాధ్యమాల్లో యుట్యూబ్‌లో వింటున్న వేలాదిమంది విప్లవాభిమానులు ఉన్నారు. ఆయన దండకారణ్యంలో పోలిట్ బ్యూరో సభ్యుడుగా అమరుడైనప్పుడు మరొకమారు దేశమంతా లక్షలాది మంది స్మరించుకున్న ఘట్టాల్లో అదొకటి. 12వ తేదీ ఉదయానికి ఈ రెండు పార్టీల చర్చల నాయకులు, వాళ్ల వెంట వచ్చిన సెక్యూరిటీ హైదరాబాదులో ప్రభుత్వం వాళ్లకోసం ఏర్పాటుచేసిన నివాసం మంజీరా గెస్ట్‌హౌస్‌కు చేరుకున్నారు. 2004 అక్టోబర్ 12న ప్రజా సంఘాలు, మహిళా సంఘాలతో సహా పార్టీ నాయకత్వంతో చర్చించడానికి వచ్చాయి. కుల సమస్య, జెండర్ సమస్య, ప్రత్యేక తెలంగాణ సమస్యలు చర్చలలో ఆ సమస్యలకు కేటాయించాల్సిన ప్రాధామ్యాల గురించి వాళ్లు చర్చించారు. అయితే అదే రోజు చండ్ర పుల్లారెడ్డి నాయకత్వంలోని సిపిఐ ఎం.ఎల్. అమరుల సంస్మరణ సభ పగిడేరులో నిర్మించిన స్థూపాన్ని ఆవిష్కరించడానికి జనశక్తి కార్యదర్శి అమర్, రియాజ్ లతో పాటు పీపుల్స్‌వార్ ఉత్తర తెలంగాణ స్పెషల్ జోనల్ కమిటీ రాష్ట్ర కమిటీ సభ్యుడు గణేశ్ వెళ్ళాడు. అక్టోబర్ 13న మంజీరా గెస్ట్‌హౌస్ లో ఏర్పాటుచేసిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో రామకృష్ణ సెప్టెంబర్ 21న తేదీ రోజే సిపిఐ ఎం.ఎల్. పీపుల్స్‌వార్, ఎంసిసిఐ ఐక్యమై సిపిఐ మావోయిస్టు ఏర్పడిందని, మావోయిస్టు పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా, కేంద్ర కమిటీ కార్యదర్శిగా తాను చర్చల బృందానికి నాయకత్వం వహిస్తున్నానని, కామ్రేడ్ సుధాకర్ సిపిఐ మావోయిస్టు ఏఓబి కార్యదర్శిగా, కామ్రేడ్ గణేశ్ ఉత్తర తెలంగాణ స్పెషల్ జోనల్ కమిటీ సిపిఐ మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యుడు గానే సిపిఐ ఎం.ఎల్. (జనశక్తి) నాయకత్వంతో కలిసి చర్చల్లో పాల్గొనబోతున్నామని ప్రకటించాడు.
మీడియాలో గానీ, ప్రభుత్వం నుంచి గానీ ఎక్కడా, ఎప్పుడూ టెక్నికల్‌గా కూడా ఎవరు మిమ్మల్ని పీపుల్స్‌వార్‌గా ఆహ్వానించారు కదా, ఆహ్వానించాం కదా అని అభ్యంతరం, సందేహం కూడా వెలుబుచ్చకుండా చాలా మామూలుగా అందరికీ అప్పటికే తెలిసిన అంశంగా ఈ మార్పు జరిగిపోయింది. అప్పుడు ఇంటిలిజెన్స్ ఐజిగా ఉన్న అరవింద రావు, డిజిపి కూడా అయి పదవీ విరమణ చేశాక ఓపెన్ హార్ట్ విత్ ఆర్‌కె కు ఏబీఎన్ ఛానల్ లో ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు మావోయిస్టు పార్టీని రెండో విడత చర్చలకు ఎందుకు పిలవలేదో కారణం చెప్పినప్పుడు గానీ పోలీసు, ప్రభుత్వం అంతరంగం బయటపడలేదు.
ప్రభుత్వం ఆ పార్టీని పీపుల్స్‌వార్‌గా పిలిచింది. కానీ వాళ్లు దేశంలోనే మరొక పెద్ద సాయుధ పోరాటంలో పాల్గొంటున్న ఎం.సి.సి. పార్టీతో ఐక్యమై మావోయిస్టుగా ఏర్పడినట్లు ప్రకటించారు. అంటే ఇప్పుడది దేశంలోనే ఒక పెద్ద ప్రాంతంలో సాయుధ పోరాటంలో పాల్గొంటున్న పార్టీ అయింది. అంటే దేశంలో సాయుధ ఘర్షణలో ఉన్న విప్లవ పార్టీతో ప్రభుత్వం చర్చలు జరపడం అంటే ఐక్యరాజ్యసమితి జెనీవా అంతర్జాతీయ న్యాయ సూత్రాలను ఆమోదించాల్సి ఉంటుంది. మేము ఇప్పటి దాకా ఈ సాయుధ సంఘర్షణ ప్రాంతాలను అధికారికంగా సంఘర్షణ (కాన్‌ఫ్లిక్ట్ ఏరియాస్) ప్రాంతాలుగా గుర్తించడం లేదు. అందుకని పిలువ లేదని బయటపెట్టాడు. ప్రభుత్వంతో సంప్రదించకుండానే చర్చల మొదటి రోజే లంచ్‌టైంలోనే రాష్ట్రవ్యాప్తంగా ఎస్‌పిలతో వీడియో కాన్ఫరెన్స్ పెట్టి చర్చల్లో ప్రతిస్టంభన వచ్చిందని అందుకోసమే హెచ్చరించాడన్నమాట.
చర్చలలో మొదటిరోజు ఉపోద్ఘాతం వలె ఆహ్వానిస్తూ హోం మంత్రి జానారెడ్డి ‘మీరేమి కోరుకుంటున్నారో చెప్పండి’ అని ముగింపుగా రామకృష్ణనడిగాడు. ‘మేం మాకోసం ఏమి అడగడానికి రాలేదు. మీ కోసం మీరు ఏం అడుగుతారో తెలుసుకోవడానికి రాలేదు. మనం ఇరువురం ఈ చర్చల ద్వారా ప్రజలకు ఏమైనా ఇవ్వగలమా అని ప్రయత్నించడానికి వచ్చాం’ అని, ఇప్పటిదాకా ‘మీరు మమ్మల్ని ఆహ్వానిస్తూ, మేం వస్తామని చెప్తూ చర్చల నియమావళిని, కొన్ని ప్రతిపాదనలు పరస్పరం మార్చుకున్నాం. ఇప్పుడు ఎదురెదురుగా కూర్చుని మాట్లాడే అవకాశం వచ్చింది కనుక మన ఉభయుల ఒప్పందంగా నియమావళి, ప్రతిపాదనలను జల్లెడబట్టి కాగితంపై మన ఇరువురి సంతకాలు చేద్దాం! అన్నాడు. దానిమీద చర్చ లంచ్ టైం వరకు కూడా తేలక, భూసంస్కరణల మీద విస్తారంగా చర్చలు కోరుకుంటున్న మధ్యవర్తులతో, ఒకరి లేఖలు ఒకరి దగ్గర ఉన్నాయి గనుక అది చట్టపరంగా కూడ సంయుక్త ఒప్పందమే అవుతుంది. రాజ్యాంగ నిపుణులయిన న్యాయవాదులు కూడా కనుక కన్నబిరాన్, తారకం గార్లు సూచించారు. ఎస్.ఆర్. శంకరన్ గారు సమన్వయకర్తగా చర్చను ముగించారు.
చర్చలకు మీడియాను అనుమతించలేదు. మినిట్స్ రాయాలనే పార్టీల ప్రతిపాదనను అంగీకరించి స్టెనోను నియోగించారు.
ఈ మాత్రం ఆలస్యాన్నే ప్రతిష్టంభనగా చిత్రించి ఇంటిలిజెన్స్ ఐజి అరవిందరావు వీడియో కాన్ఫరెన్స్‌లో ఎస్‌పిలకు శాంతిభద్రతల కోసం అలర్ట్ చేశాడు. సిపిఐ ఎంఎల్ పీపుల్స్‌వార్ కాకుండా చర్చలకు మావోయిస్టు పార్టీగా వచ్చిందనేది సమాచారం ఉంది అన్నాడు. ఆయన భ్రమాత్మక వ్యూహానికి గొంతులో వెలక్కాయపడినట్లు అయింది. ఆ వ్యూహానికి చిన్న నేపథ్యం ఉన్నది. వైఎస్‌ఆర్ ముఖ్యమంత్రి అయిన కొద్ది రోజుల్లోనే అప్పటి కరీంనగర్ ఎస్‌పి ప్రవీణ్‌కుమార్ కరీంనగర్ జిల్లా సిపిఐ ఎం.ఎల్. జనశక్తి కార్యదర్శి, రాష్ట్ర కమిటీ సభ్యుడైన రణధీర్ నాయకత్వంలో 45 మందిని యూనిఫారాలు, ఆయుధాలతో లొంగిపోతున్నట్లు ప్రకటించి జూబ్లీ హాల్లో ఆ దృశ్యాన్ని లైవ్ ప్రసారం చేయించారు. అప్పుడు ముఖ్యమంత్రి పీపుల్స్‌వార్ గ్రూపులో కూడా భారీ సంఖ్యలో ఇట్లా సరెండర్ అవుతారని మాకు నమ్మదగిన సమాచారం ఉంది. ఈ మాటలను ఆయన నోట వచ్చినట్లుగానే ‘హిందూ’ ప్రచురించింది.
పీపుల్స్‌వార్ రెండవ ర్యాంక్ నాయకుడుగా ఉండి సరెండరయిన వ్యక్తి ముఫ్పై ఐదేళ్ల పోరాటంలో పీపుల్స్‌వార్ నాయకత్వం కూడా అలసిపోయింది, ప్రభుత్వం అవకాశం కల్పిస్తే వాళ్లలో అత్యధికులు సరెండర్ అవుతారని అరవిందరావు నమ్మి చర్చల ప్రతిపాదనకు అడ్డు చెప్పకపోగా చర్చలు అందుకు మార్గం సుగమం చేస్తాయనుకున్నాడు. వైఎస్‌ఆర్‌కు ఆ మాటే చెప్పాడు. కానీ అటువంటి ఆలోచనకు, వాతావరణానికి భిన్నంగా దేశంలో రెండు విశాల ప్రాంతాల్లో (జార్ఖండ్, బీహార్, ఆంధ్రప్రదేశ్, దండకారణ్యం, ఉత్తర దక్షిణాల్లో) సాయుధ పోరాటంలో ఉన్న రెండు పార్టీలు కలిసి ప్రజా యుద్ధాన్ని మరింత పటిష్ఠం చేసి విముక్తి మార్గంలో పురోగమించడానికే మావోయిస్టు పార్టీగా ఏర్పడినవనే 13వ తేదీ రామకృష్ణ ప్రకటన వైఎస్‌ఆర్, అరవిందరావు భ్రమలను పటాపంచలు చేసింది. అరవిందరావు వీడియో కాన్ఫరెన్స్ పెట్టి తన వ్యాకులతను ప్రదర్శిస్తే, చర్చలకు ఆహ్వానించిన ప్రభుత్వాధిపతి ముఖ్యమంత్రి ఆరోజు కక్షపూర్వకంగా పులిచింతల ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేయడానికి వెళ్ళాడు. సామ్రాజ్యవాద ప్రపంచీకరణను ప్రతిఘటిస్తున్న మావోయిస్టు పార్టీ చర్చలలో స్వావలంబన అనే అంశం కింద పోలవరం, పులిచింతల ప్రాజెక్టులను వ్యతిరేకిస్తున్నదనేది అందరికీ తెలిసిన విషయమే. అంత మాత్రమే కాదు, ఆయన శంకుస్థాపన చేసి హైదరాబాద్ చేరుకోగానే ఆ శిలాఫలకాన్ని పోలీసులే పగులకొట్టి మావోయిస్టులు పులిచింతల ప్రాజెక్టుకు వ్యతిరేకం గనుక పగుల కొట్టారని ప్రచారం చేశారు.
తాటాకు చప్పుళ్లకే కాదు తూటల కాల్పులకు కూడా బెదరని కుందేళ్లు మావోయిస్టులు. ప్రజాస్వామిక హక్కుల పరిరక్షణ రాజ్యాంగ ఉపోద్ఘాతం, ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక హక్కులు, రూల్ ఆఫ్ లా మీద ఒక రోజంతా చర్చ జరిగింది. అట్లాగే మూడు రోజులు భూసంస్కరణల మీద చర్చ జరిగింది. చర్చలు ప్రశాంత వాతావరణంలోనే జరిగాయి గానీ 11 రోజులు మంజీరా గెస్ట్‌హౌస్‌లో మావోయిస్టు పార్టీ రామకృష్ణ దగ్గరికి వ్యక్తిగత, సమిష్టి సమస్యల పరిష్కారం కోసం వచ్చిన వివిధ వర్గాల ప్రజల జాతర పక్కనే లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో ముఖ్యమంత్రి నిర్వహించే ప్రజా దర్బార్ డొల్లతనాన్ని బయటపెట్టింది. అది రాజ దర్బార్ అని తేలిపోయింది. ఆ 11 రోజులే కాదు కాల్పుల విరమణ పై ఒప్పందం జరిగిన మే 14 నుంచి చర్చలు ముగిసి అక్టోబర్ 20న రెండు విప్లవ పార్టీలు చిన ఆరుట్ల దగ్గర మళ్లా అడవిలో ప్రవేశించేదాకా రాష్ట్రంలో నెలకొన్న వాతావరణం మావోయిస్టు పార్టీ ప్రతిష్ఠను పాలకవర్గాలు భీతిల్లేలా పెంచాయి. అడవిలోనే కాదు, సచివాలయంలో, మంజీరా గెస్ట్ హౌస్, చెన్నారెడ్డి మానవ వనరుల సంస్థలో, మీడియాలో మావోయిస్టు రాజకీయాలు ‘ప్రధాన స్రవంతి’ రాజకీయాలను పరాస్తం చేశాయి. నిర్దిష్ట ప్రతిపాదన విప్లవ పార్టీలు చేశాయి. రూల్ ఆఫ్ లాకు కట్టుబడి ఉంటాం. గతం గురించి అడగకండి అని శుష్క వాగ్దానం తప్ప ప్రజాస్వామిక హక్కుల గురించి ప్రభుత్వం దగ్గర సంతృప్తికరమైన సమాధానం లేదు. కాని భూసంస్కరణల గురించిన చర్చ ప్రభుత్వం దగ్గర రెవెన్యూ రికార్డులు కూడా లేవని 30 శాతం రికార్డులు చెదలు పట్టిపోయాయని స్వయానా రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు అసహాయత బయటపెట్టాడు.
ప్రభుత్వ భూసంస్కరణల చట్టాల పరిమితికి మించి ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్యాల ఆక్రమణల్లో కోటి 20 లక్షల ఎకరాల భూమి ఉందని అది గరిష్ట పరిమితి నుంచి కాకుండా కనిష్ట పరిమితి మూడు ఎకరాలు భూమిలేని దళిత కుటుంబాలలో మహిళా యజమాని పేరు మీద రిజిస్టర్ చేయించి పంచాలని, నిర్దిష్ట ప్రతిపాదన చేసింది. ఎంత మిగులు భూమి ఉందో ప్రభుత్వం దగ్గర ఏవో కాకి లెక్కలు ఉన్నాయి. ఎస్ ఆర్ శంకరన్, కె ఆర్ వేణుగోపాల్ లు దళితుల గురించి, ఆదివాసుల గురించి నిర్దిష్టంగా ప్రతిపాదించిన ప్రత్యామ్నాయాలున్నాయి. ఈ అన్నిటిని క్రోడీకరించి ఎంత మిగులు భూమి ఉంది, ఎట్లా పంచాలి అని సూచించడానికి భూమి కమిషన్ వేయమని, తాము ఒక జాబితా కూడా ఇచ్చి నవంబర్లో రెండవ దశ చర్చలకు వస్తామని విప్లవ పార్టీలు చెప్పాయి. మేం గాంధీ వర్ధంతి జనవరి 30 నుంచి మిగులు భూమి పంచడం మొదలు పెడతాము అని కోనేరు రంగారావు (ఉప ముఖ్యమంత్రి) నాయకత్వంలో ఆరుగురితో, పొత్తూరి వెంకటేశ్వరరావు ను కూడా చేర్చి ప్రభుత్వం కమిషన్ వేసింది. అంతకు పూర్వం భూమి లేక దళితులు స్వాధీనం చేసుకున్న భూములను మూడు ఎకరాలకు మించకుండా ఉన్న వాటికి వెంటనే పట్టా చేయాలన్న కోనేరు రంగారావు సూచనను కూడా ప్రభుత్వం అమలు చేయలేదు. ఈ మాత్రం వివరాలైన 20 ఏళ్లు గడిచిపోయాక కొత్త తరానికి తెలియకపోవచ్చు గాని ప్రభుత్వంతో మావోయిస్టు పార్టీ చర్చల గురించి ఈ 20 ఏళ్ల కాలంలో మౌఖికంగానూ, లికిత పూర్వకంగానూ, చాలా చర్చనే జరిగింది. అయితే ఈ రచన ఉద్దేశం మావోయిస్టు ఆవిర్భావాన్ని స్మరించుకోవడం అందుకు సంబంధించిన జ్ఞాపకాలను పంచుకోవడం.
ఈ చర్చల వాతావరణం ఇంకెందుకోసం కాకున్నా 2004 నవంబర్ 13న హైదరాబాద్ పిర్జాదిగూడలో మావోయిస్టు పార్టీ ఆవిర్భావ సభ బహిరంగ సభగా జరుపుకోవడానికి మాత్రం ఉపయోగపడిరది. ప్రభుత్వం అప్పటికే హైదరాబాద్ పరిసరాలలో ఉన్న ఈ పీర్జాదిగూడ బహిరంగ సభకు ప్రజలు దురదూరాలనుంచి వాహనాలలో రావడానికి ఎన్నో అవాంతరాలు కల్పించింది. నియంత్రణ చేసింది. అయినా రైళ్లల్లో, బస్సుల్లో, కాలినడకన వేలాదిమంది ప్రజలు బహిరంగ సభకు వచ్చారు. నవంబర్ లోనే రెండవ దశ చర్చలకు పిలిస్తే విప్లవ పార్టీల నాయకులు కూడా అందులో పాల్గొని ఉండేవారు. ఆ అవకాశం ఒక్క గుత్తికొండ బిలం దగ్గర 2004 అక్టోబర్ 11న మాత్రమే వచ్చింది.
అయితే ప్రభుత్వం – విప్లవ పార్టీల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం, 2005 ఫిబ్రవరి 13 వరకు ఉన్నది. అది ఆరు నెలల కాల్పుల విరమణ ఒప్పందం కానీ 2005 జనవరి 8న కర్నూలులో టైలర్ వృత్తిలో ఉన్న మద్దూరు లక్ష్మిని ఎన్‌కౌంటర్ పేరుతో చంపి వేయడంతో ప్రభుత్వం దీనిని ఉల్లంఘించింది. అయినా జనవరి 15వ తేదీ వరకు కూడా మావోయిస్టు పార్టీ ఎటువంటి ప్రతిఘటనకు పూనుకోకుండా ఒప్పందాన్ని గౌరవించింది. 2005 జనవరి 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో విరసం సాహిత్య పాఠశాల జరిగిన రెండు రోజులు వరుసగా వేరు వేరు చోట్ల ఎన్‌కౌంటర్‌లు చేసి ప్రజాసంఘాల నాయకులను మళ్లీ చంపింది ప్రభుత్వం.
1997 లోనే ప్రజాస్వామిక ప్రత్యేక తెలంగాణ కోసం ఒక లక్ష్య ప్రకటన ‘వరంగల్ డిక్లరేషన్’ చేసి ఏర్పడిన తెలంగాణ జన సభ నవంబర్‌లో రెండవ దశ చర్చలకు పిలువలేదు కనుక ప్రత్యేక తెలంగాణ అంశం చర్చలకు రాకుండా పోయిందని కనుక కాల్పుల విరమణ కాలంలోనే రెండవ దశ చర్చలు జరిగితే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పై ఏ ప్రాతిపదికన మావోయిస్టు పార్టీ చర్చలు జరుపుతుందో ఉత్తర తెలంగాణ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి జంపన్న, మరో రాష్ట్ర కమిటీ సభ్యుడు చంద్రన్నతో చర్చించడానికి తెలంగాణ జన సభ నాయకులు ఆకుల భూమయ్య, కో కన్వీనర్ దారం మల్లారెడ్డి నాయకత్వంలో రాష్ట్ర కమిటీ సభ్యులు న్యాయవాది ధర్మపాల్, నిజామాబాద్ పోస్టల్ ఉద్యోగి సుదర్శన్, తెలంగాణ రాష్ట్ర సమితి వరంగల్ ఉపాధ్యక్షుడు నల్ల వసంత్ వెళ్లారు. ఇంకా కాల్పుల ఒప్పంద కాలం కొనసాగుతూ పార్టీ మీద నిషేధం కూడా లేదు గనుక ఎటువంటి అవాంతరం ఉండదనుకున్నారేమో, అయినా అన్ని జాగ్రత్తలు తీసుకొని వెళ్లినా పోలీసులకు తెలిసిపోయింది. వీళ్లు సమావేశమైన అడవిలోని ప్రాంతాన్ని చుట్టుముట్టి పోలీసులు సమావేశంపై కాల్పులు జరిపారు. సాయుధులై గెరిల్లా పద్ధతులు తెలిసిన నాయకత్వం తప్పించుకోగలిగింది. భూమయ్య, మల్లారెడ్డి, ధర్మపాల్ లు కూడా తప్పించుకోగలిగారు. కానీ కాలుస్తూ, గాలింపు చర్యలు జరుపుతూ వచ్చిన పోలీసులకు నిజామాబాద్ సుదర్శన్, వరంగల్ నల్ల వసంత్ దొరికిపోయారు. వాళ్లను చిత్రహింసలు పెట్టి పోలీసులు చంపేశారు.
బతికి వచ్చిన తెలంగాణ జన సభ నాయకుల అనుభవాలు అమరులు సుదర్శన్ (నిజామాబాద్) నల్ల వసంత్ సంస్మరణ సభల్లో చాలా వివరంగా చెప్పారు గానీ 20 ఏళ్లకు మించిన కాలంలో ఇంత కాలానికి దారం మల్లారెడ్డి (సిద్దిపేట) తన ‘బాట ముచ్చట్లు’ అనే స్వీయ చరిత్రలో (147వ పీజీ నుంచి 192 పేజీల దాకా) ఆ సమావేశం నుంచి సుదర్శన్ తప్పించుకోలేని వైనాన్ని, తాను తప్పించుకోగలిగిన అవకాశం గురించి 45 పేజీలు రాశాడు. ఆ సమావేశంపై పోలీసుల దాడి గురించి జీవించి ఉన్నవారు తమ అనుభవాలు కూడా రాస్తే పార్టీ, ప్రజాసంఘాలు ప్రత్యేక తెలంగాణ వంటి డిమాండ్ కోసమే కాదు నిజమైన ప్రజాస్వామ్యం కోసం ఎన్ని పోరాటాలు చేశారో, ఎన్ని త్యాగాలు చేశారో భావితరాలు తెలుసుకొని ఉత్తేజం పొందుతారు.
మళ్లీ 2014 సెప్టెంబర్ 21న తలపెట్టిన మావోయిస్టు పార్టీ ఆవిర్భావ దశమ వార్షికోత్సవానికి వద్దాం. ఆ సభల నిర్వహణ సమాచారం కోసం దేశంలోని ప్రజాస్వామ్య వాదులు అందరికీ సమాచారం కోసం ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక సభ్యుల పేర్లతో ఒక లెటర్ ప్యాడ్ కూడా తెలుగు ఇంగ్లిష్ భాషల్లో అచ్చు వేశారు. అప్పటికింకా మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఉన్న గణపతి పార్టీ వ్యూహం, ఎత్తుగడలు, రాజకీయ తీర్మానంల గురించిన రెండు ఇంటర్వ్యూలు కలిపి పుస్తకంగా అచ్చు వేశారు. (అవి, వాటితో పాటు మరికొంత మావోయిస్టు పార్టీ సాహిత్యం, ముఖ్యమైన ప్రకటనలు, కరపత్రాలు 2017 నక్సల్బరీ 50 ఏళ్ల సదస్సు, బహిరంగ సభ విరసం నిర్వహించినప్పుడు విస్తృతంగా పంచడం జరిగింది. మిగిలిన గణపతి ఇంటర్వ్యూలు బండిల్స్ ను 2018 ఆగస్టు 28న పూణే పోలీసులు దాడి చేసి, వివిని అరెస్ట్ చేసినప్పుడు తెలంగాణ ఇంటిలిజెన్స్ సిఐ సూచనపై పూణే పోలీసులు జప్తు చేశారు.)
దూర దూరాల నుంచి వచ్చే వారికోసం మూడు నాలుగు చోట్ల వసతి ఏర్పాట్లు జరిగి సెప్టెంబర్ 20 నాలుగు గంటల వరకే కాచిగూడ స్టేషన్ దగ్గర ఉన్న తుల్జా భవన్ నిండిపోయింది. జీతన్ మరాండి, అతని సాంస్కృతిక బృందాన్ని డప్పు రమేష్ రిసీవ్ చేసుకుని భూదేవినగర్‌లో తన ఇంట్లోను ఇతర ఏబీఎంఎస్, పి కె ఎం కార్యకర్తల ఇళ్లల్లోను పెట్టాడు.
ఇవి మాత్రమే ప్రత్యేకంగా పేర్కొంటున్నానంటే సదస్సుకు సభకు అనుమతి లేదని సుందరయ్య విజ్ఞాన భవన్‌కు తాళం పెట్టి తుల్జాభవన్‌లో దిగిన వారి తో ప్రారంభించి జీతన్ మరాండి బృందాన్ని డప్పు రమేష్‌ను, ఆ ప్రాంతంలోని తదితర ప్రజాసంఘాల కార్యకర్తలను అరెస్టు చేశారు. ఈ వార్త తెలిసి సభ నిర్వాహక బాధ్యులందరూ తుల్జాభవన్‌కు చేరుకొని తమకు తెలిసిన తెలంగాణ రాష్ట్ర మంత్రులు, నాయకులందరితో సహా, ఎపిసిఎల్‌సి నాయకులు, ప్రజాస్వామిక వాదులందరి దృష్టికి తెచ్చి మావోయిస్టు ఎజెండాతో గెలిచిన మూడు నెలలు మాత్రమే దాటిన తెరాస ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. సుందరయ్య విజ్ఞాన భవన్ నిర్వాహకులకు భావ ప్రకటన స్వేచ్ఛను ఉద్దేశించి ఏ భావాజాలం కలవారికైనా అద్దెకిచ్చే భవనానికి పోలీసులు తాళాలు పెడితే ఎట్లా ఊరుకున్నారు. ఇది మీ హక్కులను, అధికారాన్ని హరించే చర్య అని కూడా గుర్తు చేశారు. అన్ని కంఠశోషై వేదిక కన్వీనర్, కో కన్వీనర్ సిటీ కమిషనర్ మహేందర్ రెడ్డిని కలిసి ఇంతమంది ప్రజాస్వామ్య వాదులు తలపెట్టిన సదస్సును ఎట్లా నిరోధిస్తారు అని అడిగారు. మీరంతా నిషేధిత పార్టీ ఆవిర్భావ సభను జరుపుకుంటున్నారు కనుక అనుమతి నిరాకరించామన్నాడు. ఆ పార్టీ ఏర్పడిన 10 ఏళ్ల సందర్భంగా ఆ పార్టీ 10 ఏళ్ల ఆచరణ గురించిన ఒక ప్రజాస్వామిక చర్చ ప్రత్యామ్నాయ రాజకీయ వేదికలోని ఎవరికీ మావోయిస్టు పార్టీ భావజాలంతో పూర్తి ఏకీభావంగానీ, ఆచరణ పట్ల నూరుపాళ్ల ఆమోదం గాని లేదు అని వేదికలో ఉన్న వారి పేర్లు ప్రస్తావించారు. వాళ్లంతా మీతో కలిసి మావోయిస్టు పార్టీకి మద్దతు ఇస్తున్నారన్నాడు. మరి ఆ పార్టీతో కాంగ్రెస్ తెరాస సంకీర్ణ ప్రభుత్వం చర్చలు జరిపింది కదా. చర్చల పార్టీ ప్రతినిధి రియాజ్ మరో నలుగురు విప్లవకారులను ష్రాఫ్ ఆసుపత్రి దగ్గర అరెస్ట్ చేసి కరీంనగర్ జిల్లా బదనకల్‌లో ఎన్‌కౌంటర్ చేసినాక నిరసనగా తెరాస మంత్రులందరూ రాష్ట్ర మంత్రివర్గం నుంచి రాజీనామాలు చేసి బయటకు వచ్చారు కదా. ఇప్పుడు తమదే అయిన ప్రభుత్వం, గ్రామపంచాయతీ ఎన్నికలు 2001 మొదలు 2014 శాసనసభ ఎన్నికల దాకా ప్రతి ఎన్నికల్లోనూ తమది మావోయిస్టు ఎజెండా అని చెప్పిన ప్రభుత్వం ఆ పార్టీపై చర్చను కూడా అనుమతించకపోవడం ఏంటి అంటే ఆ రాజకీయ విశ్లేషణ చేయడం మా పని కాదు. మా పని శాంతి భద్రతలు కాపాడడం. ఆ పార్టీ ఏపి ప్రజా భద్రతా చట్టం కింద కూడా నిషేధించబడిరది కనుక (2004లో యుఏపిఏ కింద కూడా నిషేధిత పార్టీల జాబితాలో పేర్కొన్నారు అని, మేము దానిపై చర్చను కూడా అనుమతించం అన్నాడు.
కన్వీనర్లు ఆ మాటనే పట్టుకొని, అది ఆంధ్రప్రదేశ్ ప్రజా భద్రత చట్టం కదా తెలంగాణ ప్రభుత్వం ఎందుకు పాటించాలి అని ఆఖరి వస్త్రం ప్రయోగించారు. మీరు ఈ ప్రశ్న లేవనెత్తి తెలంగాణ సెంటిమెంటు కూడా తెస్తారని తెలుసు, రాష్ట్ర విభజన చట్టంలోనే విభజన తర్వాత మూడేళ్ల దాకా అవిభక్త ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చట్టాలు చెల్లుతాయని స్పష్టమైన వివరణ ఉందన్నాడు. చీకటి పడిరది.
మర్నాడు సుందరయ్య విజ్ఞాన భవన్, బాగ్‌లింగంపల్లి పార్క్ దగ్గరికి ఒక్కరొక్కరుగా ప్లకార్డులతో చేరుకొని పోలీసులు అరెస్ట్ చేసేదాకా శక్తి కొద్ది నినాదాలతో, ప్రసంగాలతో నిరసన తెలుపాలనే అవగాహనకు తుల్జాభవన్ దగ్గరే ప్రజా సంఘాలన్నీ వచ్చాయి. ఈ సమాచారాన్ని ప్రజలందరికి చేరవేసే మౌఖిక బాధ్యతలు అన్ని ప్రజాసంఘాల నాయకులు తీసుకున్నారు. అందుకే సభకు అనుమతి నిరాకరింపబడిరది. ఎవరు రావద్దనే ప్రకటన ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక ఇవ్వలేదు.
ఒక్క నక్సల్బరీ, శ్రీకాకుళం, వైనాడు, మోగా(పంజాబ్) చుట్టి వచ్చిన అనుభవం ఉంది. 1984లో ఒక్క కమలాపూర్ (సిరొంచ, గడ్చిరోలీ జిల్లా) రైతు కూలీ సంఘం సభలు జరుగనివ్వకపోతే కమలాపూర్ దారులన్నీ, దారుల్లోని జైళ్లన్నీ పెక్కు సభలయ్యాయని కామ్రేడ్ అనురాధ గాంధీ ‘క్రాంతి’లో రాసిన సంపాదకీయ సందేశ ఉత్తేజం ఉంది. ఇది ఎవరికీ ఎప్పుడూ చెప్పనక్కర్లేకుండానే ఒక రహస్తంత్రి వలె పాకిపోయింది.
అర్ధరాత్రి చైతన్య మహిళా సంఘం కార్యదర్శి దేవేంద్ర గదిపై దాడి, సెర్చ్, ఇంటరాగేషన్, అరెస్ట్‌లతో ప్రారంభమైంది ప్రజాసంఘాల నాయకుల, క్రియాశీల కార్యకర్తల అరెస్టుల పరంపర. అన్ని రైల్వేస్టేషన్‌లలోనూ దిగిన వారిని మళ్లీ తిరుగు ప్రయాణపు రైల్లో ఎక్కించడమో, నాయకత్వం వహించి తీసుకొస్తున్న వాళ్లను అరెస్టు చేయడమో, కనీసం రైల్వే స్టేషన్‌లోనే వేలాది మందిని వెనక్కి పంపించి 700 మందిని వివిధ పోలీస్ స్టేషన్లలో నిర్బంధించారు. బొల్లారం పోలీస్ స్టేషన్ నుంచి, నాంపల్లి, గోషామహల్, కంచన్ బాగ్, ఇంకా నగర పరిసరాల్లో ఉండే దూరదూర పోలీస్‌స్టేషన్‌లలో బంధించారు. అంతటా పోలీస్‌స్టేషన్‌లలోనే 20 రాత్రి 21 సాయంత్రం దాకా మావోయిస్టు పార్టీ ఆవిర్భావ మహా సభలు పాటలతో, ప్రసంగాలతో, నినాదాలతో నిర్బంధితులందరూ రక్షకభటులు ఉత్తేజం పొందేలా జరుపుకున్నారు. సుందరయ్య విజ్ఞాన భవన్ దాకా, లేదా బాగ్‌లింగంపల్లి పార్క్‌కు వాకింగ్ కొరకు వచ్చినట్లుగా వచ్చి జేబులోని పోస్టర్‌నో, షర్టు లోపల దాచుకున్న ప్లకార్డునో పైకి తీసి నిరసన తెలిపి పోలీస్ వ్యాన్ ఎక్కిన యువకులు, వృద్ధులు ఎందరో.
ఒక దేశ ప్రధాని దేశ అంతర్గత భద్రతకు మావోయిస్టు పార్టీ పెను ప్రమాదమని సామ్రాజ్యవాద విధ్వంసక పూర్వక అభివృద్ధి నమూనా రచయితగా చెప్తే, దేశ ప్రధానిగా మండల్ కమిషన్ సిఫారసులను అమలు చేసిన ప్రధాని విపి సింగ్ పదవీచ్యుతుడై క్యాన్సర్ తో బాధపడుతూ 20 ఏళ్ల యువకుణ్ని అయితే మావోయిస్టు పార్టీలో చేరి ఉండే వాడ్నన్నాడు. ఇవాళ ప్రపంచమంతా విప్లవ, ప్రజాస్వామ్య శక్తులు భారత ప్రభుత్వ అంతిమ యుద్ధం కగార్‌ను, మీ ప్రతి అంతమూ మా ఆరంభమే అంటూ మావోయిస్టు పార్టీ 20 ఏళ్ల ఆవిర్భావ సభ జరుపుకుంటున్నది. మార్క్స్ ఎంగిల్స్ కమ్యూనిస్టు ప్రణాళికను ఇవాళ యూరప్ ఖండాన్ని కమ్యూనిజం అనే భూతం వెంటాడుతున్నది అని ప్రారంభించారు. పరస్పరం సంఘర్షించిన శక్తులలో చరిత్ర పుట్టెను అని వర్గ పోరాట ప్రణాళికను అగ్రగామి కార్మిక వర్గం చేతికి ఒక ఆయుధంగా ఇచ్చిపోయారు. ఇప్పుడు ఖండాలను, దేశాలను కాదు పాలకులను పాలకవర్గాలను విప్లవం ‘భూతం వలె వెంటాడుతున్న’ వర్తమానం. మనమెవ్వరమూ ఇప్పుడు మనసుల్లో తప్ప, సభల్లోకి వచ్చి మావోయిస్టు పార్టీ 20 ఏళ్ల ఆవిర్భావ దినాన్ని జరుపుకుంటున్నాం అని చెప్పక పోవచ్చు. దమ్ము గూడెంలోనో, బస్తర్‌లోనో వందలాది ఎకరాల భూమి ప్రభుత్వాలు ఆక్రమించుకొని తెలంగాణలో, బస్తర్‌లో ప్రజల ప్రాణాలకు ప్రమాదాలు తలపెట్టాయని లేదా అటువంటి ఎన్నో ప్రజా సమస్యలపై చర్చలు, సభలు, ధర్నాలు, నిర్వహించుకుంటున్నాం కావచ్చు.
కానీ మోషా ప్రభుత్వానికి అర్బన్ మావోయిస్టులతో ప్రారంభమై, మావోయిస్టు పార్టీ నార్త్ రీజినల్ బ్యూరో కుట్రకేసు పేరుతో ఓజి/ ఓవర్ గ్రౌండ్/ మావోయిస్టుల ముద్రతో అంతటా మావోయిస్టు పార్టీ నీడయే కనబడుతున్నది. కమ్యూనిజం ఒక్కటే ఎప్పుడూ భూతం అని చెప్పుకోవడానికి వీలులేని భవిష్యత్తు స్వప్నాలు రక్తాలతో రచించే వర్తమానం. మోషాలు, వాళ్ల ఛత్తీస్‌గడ్, తెలంగాణ ప్రభుత్వాలు దండకారణ్యంలోనూ, తెలంగాణలో సంవత్సరమే ఎందరు (అంకెలు వందల సంఖ్యలుగా మారి) ఆదివాసులను, మావోయిస్టులను ఎన్‌కౌంటర్‌ల పేరుతో హత్యలు చేసి బీజాపూర్, నారాయణపూర్, అబూజ్ మడ్‌లు మొదలు చెర్ల, రఘునాథ పాలెంల వరకు నెత్తుర్లు పారించారు.
‘ఏసోబులు ఎందరో… అని’ భాస్కరుడు సర్వనామం కాదన్నట్లుగా ఎందరు నరుడో, భాస్కరుల నెత్తుర్లను కడవలకెత్తుతూనే నర్రెంక చెట్టుకింద బందూకు అందుకుంటున్నారు ప్రజలు. ఇందిరా గాంధీ, జ్యోతిబసు, సిద్ధార్థశంకర్ రే, జలగం వెంగళరావులు మొదలు ఏబిఎంఎస్ ఉష ‘ఏడ చెన్నారెడ్డి, ఏడ ఎన్టీఆర్’ అని ఎన్‌కౌంటర్‌ల, స్థూపాల జ్ఞాపకాల పాట ఎత్తుకున్నట్లు చంద్రబాబు, వైఎస్‌ఆర్, కెసిఆర్‌ల నుంచి మోషాలు, వాళ్ళ తాబేదార్ల దాకా ఎందరు ఈ భూతం గురించి పలవరిస్తూ రక్తపాతం సృష్టిస్తున్నారో.
ఇప్పుడు ఇంకా పేజర్లు పేలే, వాకి టాకీలు పేలే మన శరీరంలో భాగమైపోతున్న ఎలక్ట్రానికల్ పరికరాలు యుద్ధ ఫిరంగులై మోగి, టెక్నాలజీ పోయే వెన్నంటే యుద్ధాన్ని సామ్రాజ్యవాద ఫాసిజం మనమీద పాలస్తీనాలోనూ, పాలస్తీనియన్ల అనుకూల దేశాల్లోనూ, దండకారణ్యంలోనూ, దేశవ్యాప్తంగా పీడిత పోరాట ప్రజల మీద అమలు చేస్తున్నది. ప్రజా సాంకేతిక విజ్ఞానం మాత్రమే, ప్రజలు మాత్రమే అజేయులు. ప్రజలు మాత్రమే చరిత్ర నిర్మాతలని సైద్ధాంతిక అవగాహన దండకారణ్య పర్‌స్పెక్టివ్‌తో ప్రజా యుద్ధాన్ని ప్రారంభించిన మావోయిస్టు పార్టీ ఇవాళ ప్రత్యామ్నాయ రాజకీయ లైట్ హౌస్ జనతన రాజ్యంలో మాత్రమే కాదు, ప్రజాయుద్ధ క్షేత్రంలో మాత్రమే కాదు, కోట్లాది మంది పీడిత, పోరాట ప్రజా హృదయాల్లో బ్రాహ్మణీయ పాసిస్ట్ వ్యతిరేక ప్రజాస్వామిక శక్తుల, వ్యక్తుల అండతో 20వ ఆవిర్భావ సభ జరుపుకుంటున్నది. ఆ సందర్భంగా ప్రథమ ఆవిర్భావ సభ, పదేళ్ల ఆవిర్భావ సభ జ్ఞాపకాల శకలాలను సాక్షీ భూతంగా పాఠకులతో పంచుకోవాలనిపించింది. విప్లవం వర్ధిల్లాలి!
21 9 2024.