చత్తీస్‌ఘడ్‌ జిల్లా సుక్మా జిల్లా జబ్బగట్టాకు చెందిన భీమా సోడీ, గుడ్‌రాజ్‌ గుడాకు చెందిన జోశన్‌ మడకంలను, బీజాపూర్‌ జిల్లా గోమ్‌గూడాకు చెందిన జోగా మడకంలను ఈనెల 8న పోలంపల్లి నుంచి అక్రమంగా పోలీసులు ఎత్తుకెళ్లారని మూలవాసీ బచావో మంచ్‌  ప్రకటన ద్వారా తెలిసింది. 

వీరిలో  భీమా సోడీ జూన్‌ 19న మూలవాసీ బచావో మంచ్‌ అధ్యక్షుడు రఘు మిడియామితోపాటు హైదరాబాదు వచ్చి చత్తీస్‌ఘడ్‌లో ఆపరేషన్‌ కగార్‌ పేరుతో రాష్ట్ర పోలీసులు, కేంద్ర భద్రతా బలగాల చట్ట వ్యతరేక నిర్బంధ కాండ గురించి పత్రికలతో, మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగం తమకు కల్పించిన రక్షణ చట్టాలను ఉల్లంఘించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసుల మీద యుద్ధం చేస్తున్నాయని, తమ ఉనికిని రద్దు చేయాలని చూస్తున్నాయని వివరించారు. తమ తరపున  సరిహద్దు రాష్ట్రాల్లోని  మేధావులు, ప్రజాసంఘాలు, పత్రికలు మాట్లాడాలని విజ్ఞప్తి చేశారు.

చత్తీస్‌ఘడ్‌లో రాష్ట్ర, కేంద్ర బీజేపీ ప్రభుత్వాలు చేస్తున్న అణచివేత చర్యలను బైటి సమాజం దృష్టికి తీసికెళ్లారనే కక్షతో సోడీ భీమాను, ఆయనతోపాటు మరో ఇద్దరు ఆ సంస్థ సభ్యులను అక్రమంగా అరెస్టు చేశారని భావించవలసి వస్తున్నది. ఆ సంస్థ ఇచ్చిన ప్రకటన ప్రకారం మూడేళ్ల కింద సుక్మా జిల్లాలోని సిలింగేర్‌ అనే గ్రామంలో సైనిక క్యాంపు ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఆదివాసులు నిరసన తెలిసిన సందర్భంగా పోలీసులు ఐదుగురు చనిపోయిన ఘటనకు మూడేళ్లయిన సందర్భంగా వాళ్లు ఈ నెల 10న మీటింగ్‌ పెట్టుకోదలిచారు. అనుమతి కోసం కలెక్టర్‌, ఎస్పీ దగ్గరికి వెళ్లారు. వాళ్లు  కలవలేదు. ఆదివాసీ నాయకులు కొంటా ఎస్‌డిఎంను కలిసి తిరిగి వాళ్ల గ్రామాలకు వెళుతుండగా పోలంపల్లి పోలీసు స్టేషన్‌ దగ్గర అరెస్టు చేసి సుక్మాకు తీసుకువెళ్లారు.

రెండు రోజులపాటు వాళ్లను ఎక్కడ ఉంచిందీ తెలియజేయకుండా ఆదివాసులను ఆందోళనకు గురి చేశారు. కనిపించిన వాళ్లను, దొరికిన వాళ్లను ఎక్కడికక్కడ కాల్చేస్తున్నందు వల్ల వాళ్ల ప్రాణాలకు భద్రత లేదని, వాళ్లను విడుదల చేయాలని మూలవాసీ బచావో మంచ్‌ డిమాండ్‌ చేసింది. ఇంతకంటే ముందు ఆదివాసీ బచావో మంచ్‌ ఉపాధ్యక్షురాలు సునీత పొట్టంను రాయపూర్‌లో అక్రమంగా అరెస్టు చేశారు. ఆమె పియుసిల్‌, డబ్ల్యూఎస్‌ఎస్‌ సభ్యురాలు కూడా.

రాజ్యాంగ వ్యతిరేకంగా ప్రభుత్వాలు ఆదివాసుల అస్తిత్వాన్ని ధ్వంసం చేయడానికి, పర్యావరణాన్ని నాశనం చేయడానికి వాళ్ల మీద సైనిక దాడి చేయడమేగాక, ఈ బాధలను, దు:ఖాన్ని ఇతరులకు చెప్పుకోడానికి మైదాన ప్రాంతానికి రావడం కూడా నేరమైపోయింది. అడవుల్లో గనుల తవ్వకాన్ని వ్యతిరేకిస్తున్న ఆదివాసులను అణచివేయడానికి వాళ్ల గ్రామాల మధ్య సైనిక క్యాంపులు పెట్టి, దాన్ని నిరసించినందుకు ఐదుగురిని కాల్చేసి, వాళ్ల సంస్మరణ సభను పెట్టుకోవడం కూడా ప్రభుత్వానికి అభ్యంతరమైపోయింది. అక్రమ అరెస్టులతో మరింతగా నిర్బంధాన్ని తీసుకొచ్చారు. ఇదంతా రాజ్యాంగం ప్రకారం ఆదివాసులకు, ఈదేశ వాసులకు ఉన్న హక్కులను ఉల్లంఘించడమే అని ఆదివాసీ హక్కుల పోరాట సంఫీుభావ కమిటీ అభిప్రాయపడుతున్నది. నిర్బంధంలో ఉన్న ఆదివాసీ యువకుల్లో భీమా సోడీ, జోశన్‌ మడకంలను సోమవారం సాయంకాలం   విడుదల చేశారని, జోగా మడకంను జైలుకు పంపారని తెలుస్తోంది. ఆయనను, ఆ సంస్థ ఉపాధ్యక్షురాలు సునీత పొట్టంను విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తున్నాం. 

Leave a Reply