మే 3,4 తేదీలలో ఎం.ఏ రెండోవ సంవత్సరం థియేటర్ ఆర్ట్స్ విభాగం విద్యార్థులు తమ పరీక్షలో భాగంగా “హోలి”(holi) అనే నాటకాన్ని హైదరాబాద్ విశ్వవిద్యాలయంలోని జిబి హాల్లో ప్రదర్శించారు. మొదటి రోజు ప్రదర్శన ముగిసే సమయానికి ఏబివిపి కార్యకర్తలు జిబి హాల్ దగ్గరికి చేరుకుని ఈ నాటకంలో పలు సన్నివేశాలు ‘హిందువుల మనోభావాలు’ దెబ్బతీసేవిగా, హిందూమతాన్ని అవమానించేలాగా ఉన్నాయి అంటూ నాటకం ప్రదర్శిస్తున్నా విద్యార్థులకు, అధ్యాపకులకు వ్యతిరేకంగా నినాదాలు ఇస్తూ, మరుసటి రోజు ఈనాటకాన్ని ప్రదర్శించనివ్వబోమని హెచ్చరించారు. ఆ తరువాత ఈ నాటకం ఒక మతాన్నిఅవమానించే విషయాలను ప్రోత్సహిస్తోంది అని, ఈ నాటకాన్ని బహిష్కరించాలి అంటూ విద్యార్థుల, హాస్టల్ వాట్సాప్ గ్రూపులలో సందేశాలు వ్యాప్తి చేశారు. ఇలా అసత్య ప్రచారాలు వ్యాప్తి చేసినప్పటికి మరుసటి రోజు అంటే మే 4న హాల్ పూర్తిగా విద్యార్థులతో నిండిపోయి ఇంకా కొందరు బయటే ఉండాల్సి వచ్చింది నాటకం వీక్షించడం కోసం. అదే సమయంలో నాటకాన్ని నిలిపివేయాలనే స్పష్టమైన ఉద్దేశంతో ఏబివిపి కార్యకర్తలు జీబీ హాల్‌కు దూసుకొచ్చారు. అక్కడే బయట ఉన్న విద్యార్థులు, ప్రగతిశీలా విద్యార్థి సంఘాలకు చెందిన విద్యార్థులు ఏబివిపి వారిని అడ్డుకోవడంతో వారిపై మద్యం సీసాలు విసరడం, రాళ్లు, కర్రలతో దాడి చేసి తీవ్రమైన హింసకు పాల్పడ్డారు. దానితో అనేక మంది విద్యార్థులు గాయపడ్డారు. ముఖ్యంగా ఎస్‌ఎఫ్‌ఐకి చెందిన ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడి కుట్లు వేయించుకోవాల్సి వచ్చింది. నాటకం ముగిసిన తరువాత విద్యార్థులు, ప్రొఫెసర్లు హాల్ నుండి బయటకు వస్తుండగా, ‘గోలి మారో సాలోమ్ కో, యాంటీ నేషనల్’ అంటూ బహిరంగంగా పోలీసులు భద్రతాసిబ్బంది సమక్షంలోనే హింసను ప్రేరేపించే నినాదాలు చేశారు. ఈ దాడుల్లో ప్రస్తుతం ఎన్నుకోబడి విద్యార్థి కౌన్సిల్‌లో ప్రాతినిధ్యం వహిస్తున్నవారు కూడా ఉన్నారు.
“హోలి” నాటక రచయిత మహేష్ ఎల్కుంచ్వార్ మే 7న ఈ దాడి గురించి స్పందిస్తూ ‘ఈ నాటకం 1969లో రచించబడింది, 1970లో మొదటిసారి విజయా మెహతా దీనిని రంగస్థలంపై ప్రదర్శించారు అని, ఆ ప్రదర్శనకు మహారాష్ట్ర రాష్ట్ర పరినిరీక్షణ మండల్ (maharastra rajya parinirikshan mandal) అనుమతి ఇచ్చింది’ అని పేర్కొన్నారు. అలాగే ఈ నాటకం 1984లో సినిమాగా కూడా రూపొందించబడింది. అంతేకాకుండా 1984లో జరిగిన అంతర్జాతీయ చలనచిత్రోత్సవానికి భారతదేశ అధికారిక ప్రవేశికగా కూడా ఎంపికైంది అని వివరించారు.
రచయిత హోలి నాటక ప్రధాన అంశం గురించి వివరిస్తూ, ‘ఈ నాటకం మార్గదర్శకం లేని, విచక్షణ లేని కోపం కలిగి ఉన్న కొందరి విద్యార్థుల మనస్తత్వాన్ని, వారు మంచి చెడు అనే తేడా లేకుండా అన్నింటిని ద్వంసం చేసే స్వభావాన్ని చిత్రిస్తుంది’ అని వివరించాడు. ఈ నాటకం గత 57 సంవత్సరాలుగా దేశమంతటా వివిధ బాషల్లో ప్రదర్శించబడుతుంది. ఇది ఎవరి మతానికి లేదా సాంస్కృతికి హాని కలిగించలేదు. ప్రజలకు బాగా తెలుసు ఈ నాటకం ఏ మతం లేదా సాంస్కృతిపై దాడి కాదని, ఇది కేవలం ద్వంద్వ వైఖరి అవినీతి అవలంబించే కొందరి యువకులపై విమర్శ మాత్రమేనని అర్థం చేసుకున్నారు అని రచయిత పేర్కొన్నారు. అయితే కొందరు వ్యక్తులు ఈ నాటకాన్ని తప్పుగా అర్థం చేసుకుని దానిని వక్రీకరించి హింసాత్మక ప్రతిస్పందనకు దారితీయడం నాకు తీవ్ర బాధ కలిగిస్తోంది అని ఆవేదన వ్యక్తం చేశారు.
గత తొమ్మిది నెలలో విశ్వవిద్యాలయంలో జరిగిన వివిధ సంఘటనలను కలిపి సందర్భానుసారంగా చూడవల్సిన అవసరం ఎంతో ఉంది. గత సంవత్సరం సెప్టెంబర్ 10వ తేదీన ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా యూనివర్సిటీ యంత్రాంగం అప్పుడు ఉన్న ఎస్‌ఎఫ్‌ఐ-ఏఎస్‌ఏ విద్యార్థి కౌన్సిల్ ని రెండు నెలల ముందే అకస్మాత్తుగా రద్దు చేసి కేవలం పది రోజులలోపే అంటే సెప్టెంబర్ 20న ఎన్నిక నిర్వహించింది. సమయం లేకపోవడం వల్ల, అలాగే ఎస్‌ఎఫ్‌ఐ-ఏఎస్‌ఏ మధ్య కూటమి కుదరకపోవడంతో రెండు వేరు వేరుగా ఎన్నికలకు వెళ్ళడం వల్ల 2025-26 విద్యా సంవత్సరం, విద్యార్థి కౌన్సిల్ ఎన్నికలో ఏబివిపి గెలిచింది. చట్టాన్ని గౌరవిస్తూ, చట్ట పరిధిలో పనిచేయాలి అని వీరిని యునివర్సిటి యంత్రాంగం ఆదేశించాలి అని భావించినప్పటికి వారి ధైర్యానికి మించిన పని అవుతుంది. మరోమాట యంత్రాంగం అలా భావించడమూలేదు. ఈ మూక చట్టానికి అతీతులు అయినారు.
గెలిచిందే తరువాయి, అప్పటి నుండి వినాయక చవితి, దసరా, రామనవమి అంటూ వివిధ పండుగల పేరుతో ఏబివిపి దాని అనుబంధ సంస్థ ఆర్‌ఎస్‌ఎస్ విచ్చలవిడిగా క్యాంపస్ లో విహరిస్తూ, క్యాంపస్ అభ్యుదయ వాతావరణం ఎన్నడూ లేనంతగా చెడగొడుతుంది. అలాగే తరచూ వేరే విద్యార్థులపై దాడులకు దిగడం వంటివి జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా మెన్స్ హాస్టల్లో ఏబివిపికి చెందిన వాళ్ళు పెద్ద శబ్దాలు చేస్తూ చదువుకోవడానికి భంగం కలిగిస్తూ ఉంటే తోటి విద్యార్థి నిశ్శబ్దం పాటించమని కోరారు. ఆ విద్యార్థి కాశ్మీరీకి చెందిన ముస్లిం అవడంతో అతని మీద అసభ్య పదజాలంతో, యాంటీ నేషనల్ వంటి నినాదాలతో దాడి చేశారు. అలాగే దళిత విద్యార్థి మీద కూడా కులం పేరుతో అసభ్య, ద్వేషపూరిత పదజాలం వాడి దాడి చేశారు. ఇలా క్లాస్ రూమ్ బయట సాగుతున్న వీరి దౌర్జన్యం మొన్నటి దాడి ద్వారా పాఠ్యాంశంలో భాగమైన ఒక నాటకాన్ని, అది అభ్యంతరకరమనే పేరుతో లక్ష్యంగా చేసుకొని విద్యా స్వేచ్ఛను, దానికి ఉండే స్వతంత్ర ప్రతిపత్తిని దెబ్బతీయాలనే దాడికి పాల్పడారు.
ఈ దాడిని విడిగా, ప్రత్యేకంగా దేశ హింసాత్మక రాజకీయాల నుంచి, నిర్దిష్టంగా విద్యావ్యవస్థపై జరుగుతున్న దాడుల నుంచి వేరుచేసి చూస్తే సంపూర్ణంగా అర్థం చేసుకోలేము. శాస్త్రీయత లేకుండా పాఠ్యాంశాలను కాశాయికరించడం, ‘తమవారితో’ (ఆర్‌ఎస్‌ఎస్ ఆశీస్సులతో ) విభగాలను నింపడం, ‘తమ’కానీ వారిని పలు రకాలుగా ఇబ్బంది పెట్టడం(కనీసపు లీవ్ కోసం కోర్ట్ వరకు వెళ్ళడం), గ్రాంట్లను, ప్రవేశ పరీక్షలను తమకు అనుగుణంగా ఒక ఆయుధంగా వాడడం, భిన్నత్వాన్ని ఆమోదించక పరాయీకరించడం, ఆ పరాయీకరణ ద్వేషంగా మారుతుంది. ఇలాంటి వాతావరణంలో దాడులు సాధారణీకరించబడుతున్నాయి. వీటిని ఎదుర్కోవడం కోసం ప్రజాస్వామిక, ప్రగతిశీల ఆలోచనపరుల ఐక్యసంఘటనల నిర్మాణం, ఐక్య కార్యక్రమాల అవసరం ఎంతో ఉంది.




