ఆదివాసీ సమాజం ఎదుర్కొంటున్న అణచివేతలో పెద్ద భాగం బూటకపు ఎన్‌కౌంటర్లు. ముప్పులో ఉన్న తమ భూమి, జీవనోపాధిలపై భద్రతా బలగాలు చేసే లక్షిత దాడులతో పాటు లైంగిక వేధింపులకు గురికావడం వల్ల మహిళలు ఈ ఘర్షణలో మరింతగా రక్షణ లేనివారిగా మారారు.
సునీతా పొట్టెంని మొదటిసారి న్యూఢిల్లీలోని అంబేద్కర్ భవన్‌లోని మసకవెలుతురు వున్న ఒక ఖాళీ గదిలో కలుసుకున్నాం; 2023 అక్టోబర్. ఆదివాసీ హక్కుల కార్యకర్త అయిన ఆమెపైన అప్పటికి “మావోయిస్ట్” అనే ముద్ర పడలేదు. సరిగ్గా మూడు నెలల క్రితం 2024 జూన్‌లో ఆమెను అరెస్టు చేశారు.
మేము ఆమెను కలిసినప్పుడు – స్వేచ్ఛా, ధిక్కరణలు ధ్వనించే గొంతుకతో పలకరింపుగా నవ్వింది. ఈ ప్రక్రియ గురించి తనకు ముందే తెలిసినట్లుగా మాట్లాడటం ప్రారంభించింది; ఛత్తీస్‌గఢ్ అడవుల్లో తన సముదాయంపై (ఆమె అడవి-ఆమె ప్రజలు) జరిగిన, జరుగుతున్న, తాము అనుభవించిన దారుణ గాథలను వివరించింది.
“నా పేరు సునీత పొట్టెం, జిల్లా బీజాపూర్, గ్రామం థానా గంగలూర్” అని ఆమె తనను పరిచయం చేసుకుంది. ఆమె స్వరం తన మాతృభూమి బస్తర్ గుర్తింపుతో ప్రతిధ్వనించింది. కానీ ఆమె పదాలలో ఉన్న : “థాణా గంగలూర్” (“గంగలూర్ పోలీసు స్టేషన్”) అనే పదం; తన పరిచయంలో తన ప్రాంత పోలీస్ స్టేషన్ పేరును పేర్కొనడం, ఆ ప్రాంతంలో స్వేచ్ఛ, భద్రతల స్థితిని లేదా అవి లేకపోవడాన్ని ప్రతిబింబిస్తుంది.
“నేను బస్తర్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను,” స్పష్టంగా, దృఢంగా ప్రకటించింది. బస్తర్, దాని ప్రజల కథ ఈ 25 ఏళ్ల యువతి నుండి విడదీయరానివి.
“బస్తర్‌లో, ఇప్పటికీ కూడా, విషయాలు ముందెన్నడూ లేనంత స్థాయికి పెరుగుతున్నాయి,” అన్నది; ఆమె స్వరం స్థిరంగా ఉంది, కానీ ఆతృతను వ్యక్తపరుస్తోంది. బస్తర్‌లో కొనసాగుతున్న కల్లోలం, తన జీవితాన్ని, అనేక మంది జీవితాలను రూపొందించిన ఘర్షణ గురించి సునీత మాట్లాడింది. 2000ల మధ్యకాలంలో విస్తృతమైన నిర్వాసిత్వం, హింసకు కారణమైన వివాదాస్పద మావోయిస్టు వ్యతిరేక మిలీషియా గురించి ప్రస్తావిస్తూ “ఇప్పటి మా పరిస్థితి సల్వాజుడుం కాలంలో ఉన్నదానికి ఎక్కువ భిన్నంగా లేదు” అన్నది.
ఇతర రాష్ట్రాలతో పాటు ఛత్తీస్‌గఢ్‌లో కూడా 1960ల నుండి ఈ నక్సలైట్ ఉద్యమం (సాయుధ ప్రతిఘటన) జరుగుతోంది. అట్టడుగు వర్గాలనుఅణచివేస్తున్న, వారి సహజ వనరులను దోపిడీ చేస్తున్న భూయజమానులకు వ్యతిరేకంగా పోరాడటానికి ఈ ఉద్యమం కమ్యూనిస్ట్ ఉద్యమాలనుంచి ప్రేరణ పొందింది.
ఈ ప్రాంతంలోని ఆదివాసీ సముదాయం – బహుళ సంస్థల బ్యానర్ క్రింద, కొత్తగా ఏర్పడిన- మూల్‌వాసీ బచావో మంచ్ అనేక సంవత్సరాలుగా మధ్యభారతదేశంలోని వనరులు అధికంగా ఉన్న ప్రాంతంలో ప్రస్తుతం కొనసాగుతున్న, ప్రతిపాదిత మైనింగ్ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్యబద్ధంగా నిరసనలు చేస్తోంది. ఫలితంగా అనేక మంది ఆదివాసీ యువత నిర్బంధానికి, హింసకు గురయ్యారు.
తన సముదాయాన్ని పట్టి పీడిస్తున్న భయం, ఏకపక్ష నిర్బంధాలు, భద్రతా బలగాలు, మావోయిస్టు తిరుగుబాటుదారుల మధ్య ఘర్షణలు, ఎదురుకాల్పుల్లో చిక్కుకున్న ఆదివాసీ జీవితాల గురించి సునీత వివరించింది.
మనుగడ కోసం తమ పోరాటం; అస్తవ్యస్తతల మధ్య తమ భూమి, పర్యావరణం, అడవి, ఆత్మ గౌరవాన్ని నిలుపుకోవడం కోసం జరుగుతున్న పోరాటం గురించి మాట్లాడింది. కోల్పోయిన స్నేహితుల, విడిపోయిన కుటుంబాల గాథలు, సముదాయపు దృఢమైన స్ఫూర్తితో ఆమె కథనం వుండింది.
అంబేద్కర్ భవన్‌లోని ఆ చిన్న గదిలో, సునీత బస్తర్ స్వరమైంది. వినమని డిమాండ్ చేసే స్వరం, తన కథకు మించిన కథను చెప్పింది- న్యాయం, శాంతి కోసం మొత్తం సముదాయం చేస్తున్న పోరాట గాథ.
ఆమె ఇటీవలి సంవత్సరాల గురించి మాట్లాడుతున్నప్పుడు ఆమె కళ్ళు విషాదమయమయ్యాయి. “గత మూడు సంవత్సరాలలో, పోలీసు అధికారులు అడవుల్లో మహిళలపై దుర్భాషలు, దాడులు, అత్యాచారాలు చేయడం మరింతగా ఎకువ్వైపోయింది” అన్నది.
2024 ఏప్రిల్‌లో దంతెవాడలో కలిసినప్పుడు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన కార్యకర్త సోని సోరి “అత్యాచారం అనేది మరణం లాంటి అనుభవం, దానిని అధిగమించడానికి మేము ఇంకా మార్గాలను కనుగొనలేకపోయాము.” అన్నది .
“నేను మాట్లాడే యువతులందరూ ఒకే మాట అంటారు – ‘మమ్మల్ని అరెస్టు చేసినా, కాల్చి చంపినా లేదా చంపినా ఫర్వాలేదు, కానీ అత్యాచారంని ఎదుర్కోవటానికి బహుశా మేం సిద్ధంగా లేము'”.
ఛత్తీస్‌గఢ్‌లో లైంగిక వేధింపుల ఆరోపణలు కొత్త కాదు; సంవత్సరాలుగా అనేక కేసులు నమోదవుతున్నాయి.
ఇంద్రావతి నిరసన ప్రదేశంలో మేము రోషిని ఓయమ్‌ని కలిసినప్పుడు, భద్రతా దళాల చేత లైంగిక హింసకు గురైన ఆదివాసీ మహిళలు ఎంతగా కలవరపడుతున్నారో, సమస్యను ఎలా ముందుకు తీసుకువస్తున్నారో వివరించారు.
ఆదివాసీ మహిళలపై లైంగిక వేధింపులు ఒక ఆయుధంగా ఎలా ఉపయోగిస్తున్నారో వివరించారు.
“మహిళలను తనిఖీ చేయడానికని భద్రతా దళాలు ఆపివేస్తాయి, అసౌకర్యంగా లేదా అనుచితంగా తాకి యిబ్బంది పెడతారు” అని కోపం నిండిన కళ్ళతో చెప్పింది.
“అత్యాచారం, లైంగిక హింసతో సహా హింస ఎల్లప్పుడూ సాయుధ పోరాటంలో ఆయుధంగా ఉందని” స్థానిక స్త్రీవాద నెట్‌వర్క్ ఆసియా పసిఫిక్ ఫోరమ్ ఆన్ ఉమెన్, లా అండ్ డెవలప్‌మెంట్ (ఏపిడబల్యూఎల్‌డి)లో భాగం అయిన ఆర్‌ఐటిఈఇఎస్ ఫోరమ్‌కి చెందిన శరణ్య నాయక్ అన్నారు.
స్థానిక ప్రజలు బలవంతమైన శక్తులను ప్రతిఘటిస్తున్నప్పుడు “వారు కేవలం ఆర్థిక లేదా సామాజిక విముక్తి కోసం పోరాడటంలేదు; ప్రస్తుత జాతి-రాజ్యం ఉనికిలో ఉన్న పితృస్వామ్య ఆలోచనకు వ్యతిరేకంగా కూడా పోరాడుతున్నారు” అని ఆమె నొక్కి చెప్పారు. “క్షేత్ర స్థాయిలో వెళ్ళే బలగాలు చాలా క్రూరంగానూ, దుర్మార్గంగానూ ప్రవర్తిస్తున్నాయి..”అని కూడా అన్నారు.
“భారత జాతీయ-రాజ్యం” భావాన్ని రక్షించడానికి హింసను ఒక రూపంగా ఉపయోగించడం “న్యాయోచితమైనది”గా సమర్థిస్తారు.
“హిందూత్వ శక్తులు ముస్లిం వ్యాపారులను చంపినప్పుడు లేదా అగ్రవర్ణ పురుషులు దళిత మహిళలపై దాడి చేసినప్పుడు జరిగేది అదే. అదే మగతనం; తాము రక్షకులుగా ఉండాలనే చాలా కలతపెట్టే ఆలోచన; ఒకరి శరీరాన్ని నాశనం చేయడం; కళ్ళు పీకేయడం; మహిళల రొమ్ములను కోయడం; పిస్టల్స్‌ని యోనిలోకి నెట్టడం – ఇవన్నీ తాము భారత దేశ-రాజ్య ప్రయోజనాల కోసం చేస్తున్న శక్తిమంతులుగా తమని భావిస్తారు” అని ఆమె జోడించారు.
కార్యకర్తను లక్ష్యంగా చేసుకున్న అరెస్టుల అలలు:
“మా పేర్ల మీద చాలా బూటకపు కేసులు బనాయిస్తున్నారు,” నిరాశ నిండిన స్వరంతో అన్నది సునీత. “ఆదివాసీలు ఇలా ఎలా జీవిస్తారు? ఎక్కడికి వెళతారు?”
న్యాయవాది, మానవ హక్కుల కార్యకర్త బేలా భాటియా మాట్లాడుతూ, గత రెండేళ్లలో ఆదివాసీ గ్రామస్తులను సామూహికంగా చుట్టుముట్టడం తీవ్రమైంది; అయితే, ఆదివాసీ సమాజంపై దాడి చేయడానికి అధికారులు దశాబ్దాలుగా ఇలా చేస్తూనే వున్నారు.
“మావోయిస్ట్‌లకు సంబంధించి విచారణ చేయడానికి గ్రామస్తులను తీసుకెళ్లారు. తరచుగా వారిని రోజుల తరబడి తమతో ఉంచుకుంటారు. అధికారికంగా అరెస్టు చేయకుండా నిర్బంధంలో వుంచుకొని కొడతారు. తర్వాత కొందరిని విడిచిపెట్టి, మిగిలిన వారి మీద కేసు పెట్టి మేజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారు,” అని భాటియా జోడించారు.
సునీతతో పాటు, నిరసన తెలియచేసిన అనేక ఇతర ప్రముఖ ఆదివాసీ ఉద్యమకారులను గత సంవత్సరం అరెస్టు చేశారు. మానవ హక్కుల కార్యకర్త, బస్తర్ జన్ సంఘర్ష్ సమన్వయ్ సమితి కన్వీనర్, ఛత్తీస్‌గఢ్‌లోని అన్ని ఆదివాసీ సంస్థల సమిష్టి అయిన సర్వ ఆదివాసీ సమాజ్ ఉపాధ్యక్షుడు సర్జు టేకంను ఏప్రిల్ 2024లో అరెస్టు చేశారు.
చట్టవిరుద్ధమైన ఉరిశిక్షలు, సంఘం నాయకుల అరెస్టులు, బలవంతపు బేదఖలు (తొలగింపు)లతో సహా భద్రతా దళాల మానవ హక్కుల ఉల్లంఘనలకు వ్యతిరేకంగా తన గొంతు వినిపించాడు. 2024 ఏప్రిల్ 2 న, భద్రతా దళాలు అతని ఇంటిపై దాడి చేసి, ఆ తరువాత అరెస్టు చేశారు. అతను తిరోగమన చట్టవ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం (యుఎపిఎ) ఆయుధాల చట్టం కింద కేసు పెట్టారు. బిలాస్‌పూర్‌లోని జాతీయ దర్యాప్తు సంస్థ కోర్టు బెయిల్‌ను తిరస్కరించింది.
నిషేధిత సల్వాజుడుమ్‌తో పోల్చదగిన ఛత్తీస్‌గఢ్ పోలీసుల జిల్లా రిజర్వ్ గార్డ్ ఫోర్స్‌తో సహా భద్రతా బలగాలు నక్సలైట్లుగా ముద్ర వేసి, చట్టవిరుద్ధంగా ఆదివాసీల హత్యలకు పాల్పడుతున్నాయని ఆరోపిస్తూ ఆదివాసీ హక్కుల కార్యకర్తలు, పౌర సమాజ సంఘాలు పెరుగుతున్న శిక్షాలేమి impunity సంస్కృతిని నిలదీశారు.
మూలవాసి బచావో మంచ్‌కు చెందిన పది మందికి పైగా కార్యకర్తలు – అందులో సునీతా పొట్టం, రామ్ సింగ్ కడ్తి, మున్నా లాల్ ఓయం, మంగేష్ ఓయం, గజేంద్ర మడి, జోగా కర్ది, శంకర్ కొర్రమ్, కమలేష్ కుర్సం, లక్మా కుర్రం వంటి వారిని అరెస్టు చేసి వేధిస్తున్నారు.
నక్సలిజం పేరుమీద వందలాది మంది ఆదివాసీలు ప్రాణాలు కోల్పోయారు; భద్రతా దళాలు ఈ ప్రాంతం నుండి నక్సలిజాన్ని ‘నిర్మూలన’ చేయాలనే చర్యగా ప్రభుత్వ అధికారులు పిలుస్తున్నారు.
మరోవైపు, ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ రేంజ్‌లోని ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సుందర్‌రాజ్ పట్టిలింగంతో , 2024 మేలో మాట్లాడినప్పుడు ఆదివాసీ సమాజం చేస్తున్న ఎన్‌కౌంటర్ వాదనలను ‘తప్పుడు’, ‘నిరాధారం’ అని అన్నారు. “ఆ ఆరోపణలన్నీ అబద్ధం, ఆధారం లేదు. చర్యలు జాగ్రత్తగా, పారదర్శకంగా జరుగుతాయి”అన్నారాయన.
“బూటకపు ఎన్‌కౌంటర్ల” ఆరోపణలు నక్సలైట్లు వ్యాప్తి చేస్తున్నారని ఆయన పునరుద్ఘాటించారు. “వారి కార్యకర్తల మనోబలాన్ని పెంచడానికి ఇలా చేస్తారు. అయితే, మావోయిస్టుల ఇలాంటి తప్పుడు కథనాలకు స్థానిక ప్రజలు బలి అవుతారు” అని ఆయన అన్నారు.
2024 సెప్టెంబర్ 3న నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) పత్రికా ప్రకటనలో, మాడ్ బచావో మంచ్ అనే సంస్థను కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) తమ “భావనల” వ్యాప్తికి ఉపయోగిస్తోందని ఆరోపించింది. నారాయణపూర్‌లోని ఓర్చా పట్టణంలో సైనికీకరణ, కార్పొరేటీకరణకు వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో మాడ్ బచావో మంచ్ ముందునుంది.
2023లో జరిగిన రోడ్డు దిగ్బంధనం (నిరసన) కేసుకు సంబంధించి పలు ప్రాంతాల్లో అనుమానిత సిపిఐ (ఎం) నాయకుల ఇళ్లపై దాడులు చేసినట్లు దర్యాప్తు సంస్థ పేర్కొంది. ఈ రోడ్‌బ్లాక్‌ల ఉద్దేశం “పోలీసులపై మెరుపుదాడి చేయడమే” అని ఎన్‌ఐఎ పత్రికా ప్రకటన పేర్కొంది.
అప్పటి నుండి మాడ్ బచావో మంచ్ ద్వారా “కొత్తక్యాంపులు ఏర్పాటు చేసారు” అని కూడా ఎన్‌ఐఎ పేర్కొంది.
అయితే, పౌరులపై భారత భద్రతా దళాలు దాడి చేయడమే కాకుండా, వారిని నక్సల్స్ లేదా మావోయిస్టులుగా తప్పుగా గుర్తించారని ప్రజలు అంటున్నారు. ఈ సంవత్సరం ఫిబ్రవరి 2నాడు ఆదివాసీ యువకుడు – సోమారు వెడ్డే, (35 సం.), తన బంధువులతో కలిసి సాంప్రదాయ మద్యం సల్ఫీ (తాటి కల్లు)ని తాగడానికి వెళుతున్నప్పుడు భద్రతా దళాలు చంపేసిన ఘటనకు ప్రజలు నిరసన తెలియచేసారు.
“మేము వెళ్తూ నీరు త్రాగడానికి ఒక చిన్న చెరువు దగ్గర ఆగాము. అప్పుడే పొదల్లో దాక్కున్న భద్రతా బలగాలు మాపై మెరుపుదాడి చేశాయి’ అని అతను చెప్పాడు.
వద్దే పారిపోగలిగాడు. కానీ మెడలోంచి తూటా దూసుకుపోవడంతో గాయపడ్డాడు. “కానీ నా బంధువులు ఇద్దరిని నా ముందే చంపేసారు. భద్రతా బలగాలు వెళ్లిపోయేవరకు నేను పొదల్లో దాక్కున్నాను”అన్నాడతను.
భద్రతా బలగాలు మరణించిన పౌరుల మృతదేహాలను తమతో తీసుకెళ్లాయి. వారి కుటుంబసభ్యులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశామని, ప్రథమ సమాచార నివేదిక (ఎఫ్‌ఐఆర్) నమోదు చేశారని వెద్దే చెప్పారు.
‘‘మా భూములను మేం చూసుకుంటాం. అడవులతో ఏం చేయాలో మాకు తెలుసు. అప్పుడు ఈ సంస్థలు మా భూమిని నాశనం చేయడానికి మాత్రమే వస్తాయి. శాంతియుతంగా నిరసనలు చేయడం ద్వారా మా భూమిని కాపాడుకోవడానికి ప్రయత్నించినప్పుడు, మమ్మల్ని చంపేస్తారు లేదా నక్సలైట్లు అని పిలుస్తారు, ”అని మూలవాసి బచావో మంచ్‌కి చెందిన యువ ఆదివాసీ నాయకుడు రఘు అన్నారు.
బూటకపు ఎన్‌కౌంటర్లు ఆదివాసీ సమాజం ఎదుర్కొంటున్న అణచివేతలో పెద్ద భాగం. ప్రమాదంలో ఉన్న వారి భూమి, జీవనోపాధి, భద్రతా బలగాల నుండి లక్షిత దాడులతో పాటు లైంగిక వేధింపులకు గురికావడం వల్ల మహిళలు ఈ సంఘర్షణలో మరింతగా దాడులకు గురయ్యేవారుగా అయారు.
రోషిణి ఓయం, (19 సం.) కనీసం రెండు సంవత్సరాలుగా మూల్ వాసి బచావో మంచ్‌లో పాల్గొంటోంది. ఇంద్రావతి నది పక్కన నివాసం. చిన్నప్పటి నుంచి తను చూస్తున్న అన్యాయపు ఆవేశానికి ఒక అర్థాన్ని యివ్వాలనుకొంది. తన కళను ఉపయోగించడానికి, వారి కథలను ప్రపంచానికి చెప్పడానికి మంచ్ ఒక మాధ్యమంగా వచ్చింది. రోషిని సాంస్కృతిక విభాగంలో పని చేస్తూంది; కవిత్వం రాస్తుంది.
దశాబ్దాలుగా తమ సముదాయాన్ని అణచివేస్తున్న శక్తులపై పోరాడేందుకు ఆదివాసీ యువతను ఏకతాటిపైకి తీసుకురావడంలో మూలనివాసి బచావో మంచ్ కీలకపాత్ర పోషించింది.
అరెస్టుకు ముందు సునీత అదే విషయాన్ని పునరుద్ఘాటించింది. “వారు మా నిరసన ప్రదేశాలను అణచివేస్తున్నారు; మా గ్రామాలలో ప్రతి రెండు కిలోమీటర్లకు శిబిరాలను నిర్మిస్తున్నారు. ఈ ప్రాంతంలో మైనింగ్ కంపెనీల ప్రయాణ సౌలభ్యం కోసం పెద్ద పెద్ద రోడ్లు నిర్మిస్తున్నారు’’ అంటూ కోపంతో ఆమె స్వర స్థాయి పెరిగింది.
“జల్, జంగల్, జమీన్‌ను (నీరు, అడవి, భూమి) రక్షించడానికి మేం ఇప్పటికీ పోరాడుతున్నాం. కానీ ఇప్పటి వరకు మా డిమాండ్లు ఏవీ నెరవేరలేదు. మా స్వరం కూడా సరైన వ్యక్తులకు చేరడం లేదు.
ఆమె కాస్సేపు ఆగింది. ఆమె కళ్ళు దుఃఖఆవేశాల సమ్మిళిత్వాన్ని ప్రతిబింబిస్తున్నాయి. “బాధ్యులైన వ్యక్తులకి ఎందుకని శిక్షపడదు?” ప్రశ్నిస్తున్న ఆమె గొంతు నిరాశతో నిండిపోయింది.
“మేము జైలుకు వెళ్ళిన తర్వాత కూడా, మా జీవితాల గురించి ఎటువంటి రిపోర్టులు లేదా ఎందుకు మాట్లాడరు ?” అని అరెస్టుకు ముందు సునీత అన్నది . ప్రపంచవ్యాప్తంగా అనేక హక్కుల సంస్థలు ఆమెను విడుదల చేయాలని కోరాయి.
ఈ కథనాన్ని ఆసియా పసిఫిక్ ఫోరమ్ ఆన్ విమెన్, లా అండ్ డెవెలప్‌మెంట్ (ఎపిడబల్యూఎల్‌డి), మీడియా-విజువల్ రిపోర్టింగ్ ఫెలోషిప్‌లో భాగంగా, సైనిక వాదం-శాంతి-మహిళల మానవ హక్కులపై రూపొందించారు.
-రచయితలు స్వతంత్ర జర్నలిస్టులు.