అక్కడ యుద్ధం జరిగినట్లు వుంది.
మృత కళేబరాల్లా ఉన్నాయి టమోటా మొక్కలు. సైనికుల దండయాత్రేదో జరిగినట్లుంది. పొలమంతా నానా భీభత్సంగా వుంది. టమోటాలు చితికిపోయి నలిగిపోయి వున్నాయి. ఎకరా పొలంలో ఎక్కడా ఒక మొక్క బతకలేదు. ఒక్క టమోటా కూడా మిగల్లేదు. ఎరుకల దొరస్వామి గుండెలవిసేలా ఏడుస్తున్నాడు.
పక్కనే అతడి భార్య ఏడో నెల గర్భిణి నీలమ్మ కండ్లల్లో నీళ్ళు పొంగుతున్నాయి. ఆమె పక్కనే ఆరేళ్ళ కుర్రాడు.
రాజు దిక్కుతోచకుండా అమ్మానాన్నల వైపు బిత్తరపోయి చూస్తూ వున్నాడు.
ఏం జరిగిందో, టమోటా పంట మొత్తం ఎందుకిట్లా నాశనం అయ్యిందో, అమ్మానాన్న ఎందుకట్లా ఏడుస్తున్నారో వాడికి అస్సలు అర్థం కాలేదు. అమ్మ ఏడ్వడం తెలుసు, కానీ నాన్న ఏడ్వగా చూడ్డం ఇదే మొదటిసారి.
ఊళ్ళో జనం చుట్టుపక్కల రైతులు అక్కడ గుమి గూడిపోయారు.
“… ఎంత ఘోరం. మొత్తం పంటంతా ఎదన పెట్టుకున్నాయి కదా. వాటి దెబ్బకి పెద్ద పెద్ద రైతులే బికార్ల పోతాండారు. దొరసామి గాడింక ఎప్పుడికి తేరుకోవల్ల? చ్చొ.. చ్చా.. చ్చొ…”.
“దీనికంటే మనిషినే తొక్కి చంపేస్తే పోలా? ఒక దినంతో పీడా పోతుంది. బతుకంతా బాధలు పడేదానికన్నా ఆ ఒక్క దినంతో బాధంతా తీరిపోతుంది.”
ఏడ్పుగొంతుతో అంటున్న దొరస్వామి వైపు అందరూ సానుభూతిగా చూశారు.
“ఇదంతా మా ఖర్మ. ఆ దేవుడికే మా మీద దయ లేదు. వడ్డీకి దుడ్లు తెచ్చి సేద్యం చేస్తాండా. బిడ్డల్ని సాకినట్లు సాకినాం. ఈ దినంతో మాకూ భూమి తల్లికీ రుణం తీరిపోయింది. కన్నగసాట్లు పడి పంట చేసినాం. మా కడుపులో బాధ ఎవురికని చెప్పుకునేది తల్లో. మా బాధలెప్పుడు తీరతాయి తండ్రో….” నీలమ్మ ముక్కు చీదుతూ, చేతులు తిప్పుతూ శోకాలు పెడుతోంది.
“ఈ పక్క ఎట్లా వొచ్చినాయబ్బా? ఆ పక్క నించి వొచ్చి సముద్రపల్లె కల్లా ఎలబారినట్లున్నాయి. పోయిన వారం క్రిష్ణారెడ్డి చెరుకుతోట మొత్తం తొక్కేసి పోయినాయి కదా” అన్నాడొక రైతు.
“ లేకలేక మంచి రేటు పలకతా వుంది టమేటాలకి. దొరసామి గాడి దరిద్రం వదిలి పోయ్యుంటుంది పంటగానా మిగిలింటే ”
“చెరుకనే ఏముందప్పా? బీన్సు తింటాయి, మామిడి కాయలు తింటాయి.చెనిగిచేనూ పెరిగి ఆరబెడతాయి. ఒక పంటనేముంది? ఒక కాయ అనేముందాది తేడా? “
రాజుకు ఆ మాటలు కొన్ని అర్థమవుతున్నాయి. కొన్ని అర్థం కావడం లేదు.. కొంత ఊహించుకునే ప్రయత్నం చేస్తున్నాడు.
జనం మెల్లగా కదులుతూ ఉన్నారు. చూపుల్లో కొందరు, మాటల్లో కొందరు సానుభూతి చూపిస్తున్నారు. ఎవరేం మాట్లాడినా భార్యాభర్తలిద్దరూ కన్నీళ్లపర్యంతమవుతున్నారు.
“జనాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తాండాయి కదన్నా ముండా ఏనుగులు. ఎప్పుడు తీరతాయో మనకీ బాధలు” అప్పుడే అక్కడకు వచ్చిన ఈశ్వరనాయుడు వైపు చేతులు చూపిస్తూ అడిగాడొక రైతు.
ఈశ్వరనాయుడ్ని చూడగానే దొరస్వామి చప్పున కదిలాడు. వెళ్ళి అతడి కాళ్ళ దగ్గర కూలబడిపోయాడు.
“సామీ నువ్వే కాపాడాల. నీ ధర్మం మీదనే బతకతా వుంటి. సొంతంగా సేద్యం చేసుకుందామని నా పెళ్ళాం పోరతావుంటే దాని మాటలిని దీంట్లోకి దిగినా సామీ. అదే వడ్డీకి దుడ్లు తెచ్చుకుంది. ఇప్పుడింక నాకు బతికే మార్గమేడుండాది. ముండా ఏనుగులవల్ల మొత్తం పంటంతా పోయింది నువ్వే కాపాడల్ల సామీ.”
ఈశ్వరనాయుడు తన కాళ్ళమీద పడిన దొరస్వామిని లేపే ప్రయత్నం చెయ్యలేదు. లెయ్యమనీ చెప్పలేదు.చుట్టూ చూసాడు. ఊర్లో జనం చూస్తున్నారా లేదా అని గమనిస్తూ తలతిప్పి నీలమ్మ వైపు చూశాడు.
తలవంచుకుని నిలబడి వుంది నీలమ్మ. ఆమె మొహం జేవురించింది. పళ్ళ బిగువున కోపాన్ని, బాధను భరిస్తోంది. ఇంతలోనే మొగుడు వెళ్ళి నాయుడు కాళ్ళపైన పడతాడని ఆమె ఊహించలేకపోయింది. భూమి రెండుగా చీలి అందులో కూరుకుపోతే బావుండుననిపిస్తోంది. రాజు చొక్కా గుండీలు విప్పి మళ్ళీ తగిలిస్తోంది.
నాయుడు దగ్గర దొరసామి సేద్యగాడుగా బతికిన వైనం ఆమెకు గుర్తొచ్చింది. నాయుడి కుటుంబానికి రెండు తరాలుగా సేవ చేసినా దొరస్వామికి నాయుడేం చేసాడో, ఏం చేయలేదో అది నీలమ్మకు అర్థమయ్యింది. కానీ దొరస్వామికి అర్ధం కాలేదు.
దొరస్వామి తనకు ఏపనీ చేతకాదని, సాటి ఎరుకల కులస్తుల్లాగా పందులు మేపడం తనకు రాదనీ, నచ్చాడు అనీ నాయుడి ప్రాపకంలో బ్రతకడమే తన జీవితానికి పరమార్ధమని నమ్మినవాడు.
ఆ భ్రమలోంచి అతడ్ని తప్పించి నాయుడికి దూరం చేసి సొంతంగా కొంచెం సేద్యం చేసుకుందామని నీలమ్మ రాత్రి, పగలూ పోరు. పెడితే అనేక గొడవల తర్వాత దొరస్వామి తమకు ప్రభుత్వం వాళ్ళిచ్చిన భూమిలో సేద్యం చెయ్యటానికి ఒప్పుకున్నాడు.సాగులో లేకుండా గాలికి ఎండకీ వదిలేసిన ఆ భూమిని సాగులోకి తీసుకు రావటానికి పెద్ద యుద్ధమే చేసింది నీలమ్మ.అందుకు ఆమె పడిన కష్టం అంతా ఇంతా కాదు.
దొరసామి ఇంకా నాయుడి కాళ్ళ దగ్గరే కూలబడి వున్నాడు. తరతరాల బానిసత్వం, చిన్నప్పట్నుంచి ఊడిగం చేసిన ఒళ్ళు, నీలమ్మకు ఇదంతా ఛీదరంగా వుంది, వికారంగా వుంది.
నీలమ్మ పదోతరగతి వరకు చదువుకుంది. కుల వృత్తి వద్దు, ఈ బానిస బతుకూ వద్దు, మనం మన కష్టంతో ఎట్లైనా బతకచ్చు మామా. టౌన్కు వెళ్ళిపోదాం అంటే మొగుడు ఒప్పుకునింది లేదు. పల్లెలోనే వుండాలన్నాడు.
ఆ పక్క పొలం రామకృష్ణారెడ్డిది.
ఆయనకు నాయుడికి పాత గొడవలున్నాయి. కోర్టు కేసులూ జరుగుతున్నాయి. నీలమ్మే భర్త వద్దంటున్నా వినకుండా రామకృష్ణారెడ్డితో మాట్లాడి ఎకరా పొలానికి నీళ్ళు అరువు ఇప్పించుకుంది. నీకు మంచి జరిగితే నాయుడేం వొద్దనడులేబ్బా అని సర్ది చెప్పింది. అదికూడా నాయుడికి మంటగానే వుంది. రాబోయే ఎలక్షన్లలో సర్పంచు పదవి ఎస్టీలకు రిజర్వు చేయబడిందనే సంగతి నాయుడికి తెలుసు. రెడ్డికి తెలుసు. తెలియందంతా దొరస్వామికే.
ఊర్లో అంటే ఊరికి దూరంగానే ఉండే ఐదారు ఎరుకల కుటుంబాల్లో అంతో ఇంతో పేరుండేది దొరస్వామికే కాబట్టి ఇద్దరూ అతడ్ని మచ్చిక చేసుకునే ప్రయత్నాల్లోనే వున్నారు.
అప్పటికే నాయుడు అంతా ఆలోచించుకునే అక్కడికి వచ్చాడు.
“లేరా అబ్బోడా లే, విఆర్వోకి, ఎంఆర్ఓ ఫోన్ చేసి చెప్తాను. ఎంఆర్వో ఆఫీసులో ఆర్టీ ఇచ్చిరా ఎంఆర్ఓ మావోడేలే. ఫారెస్టోళ్ళకీ చెప్తా. నీ పెండ్లాం చదువుకుంది కదా, ఆయమ్మనే ఆర్జీలు రాయమను. ముందు జరిగేది చూడు, అయ్యిందేదో అయిపోయింది. సాయంత్రం ఇంటికి రా బియ్యం, బేళ్ళూ ఇస్తాను. నీ పెండ్లాం అసలే ఒట్టి మనిషి కూడా కాదు. నేను ఈ లోగా టౌనుకు పోయ్యెస్తా… వస్తానమ్మా నీలమ్మా…”.
మాటతోబాటే నాయుడు కదిలాడు. కదులుతూ కదులుతూ నీలమ్మ వైపు, పొలం వైపు చూస్తూ కదిలాడు.
అతడి కళ్ళలోని పైశాచిక ఆనందం నీలమ్మకు కనపడింది. ఆమె భర్తకు అదంతా కనిపించదు. నాయుడు మాటలతో దొరస్వామి కొంత తేరుకున్నాడు.అతడి మాటలే తియ్యగా అనిపించాయి.
“స్వామి నువ్వు టౌన్లో యాడుంటావో నాకు తెల్సిందే కదా. గంటలో నేనూ టౌనుకొచ్చేస్తా, ఏ ఆఫీసులో ఎవరికి చెప్తావో అంతా నీ ఇష్టం సామి, ఏం చేస్తావో ఏమో నిన్నే నమ్ముకుని బతకతావుండా. నీ బిడ్డలాంటోడ్ని, నువ్వు కాకబోతే మాకు ఇంక దిక్కెవరుంటారు చెప్పూ. నువ్వు ముందు పద సామి, నీ ఎనకాలే వొచ్చేస్తా.” నాయుడు వెనకే వెడుతూ వంగి వినయంగా చేతులు కట్టుకుని అన్నాడు దొరస్వామి .
” అప్పటికి తృప్తి కలిగింది నాయుడికి.
ఇంక దొరస్వామి తనను కాదని ఎక్కడికీ పోడనే నమ్మకం కలిగింది. జేబులోంచి యాభై రూపాయలనోటు తీసి దొరసామి చేతుల్లో పెట్టి “సరస్వతి హోటల్లో వుంటాను, ఆడికి వచ్చేయ్ అబ్బోడా…” అని చెప్పి అక్కడ్నుంచి కదిలాడు.
నీలమ్మకు జరుగుతున్నదంతా అర్థం అవుతూనే వుంది. అయినా ఏం చెప్పినా మొగుడు తన మాట వినే పరిస్థితిలో లేడని తెలుస్తూనే వుంది..
నాయుడి ప్రాపకంలోకి తిరిగి వెళ్ళడం అంటే పులి గుహలోకి గొర్రె వెళ్ళినట్లే. అవును అతడు గొర్రే. కాకుంటే కసాయి వాడ్ని ఎట్లా నమ్ముతాడు? జరిగింది జరిగిపోయింది. జరగాల్సిందేమిటో చూడాలి. నాయుడి ప్రాపకంలోకి మొగుడు తిరిగి వెళ్ళాడంటే ఆ రామకృష్ణారెడ్డి ఈ పొలానికి నీళ్ళివ్వడు. నీళ్ళు లేకుండా సేద్యం చెయ్యటం కుదరదు.
ఊర్లో అందరికీ కంటగింపుగానే వుంది దొరస్వామి సేద్యం. ఆ సంగతి నీలమ్మకూ తెలుసు.
ఏం చెయ్యాలి. మొగుడ్ని ఎట్లా నిలువరించాలి? కలోగంజో స్వంతంగా సంపాదించుకుని తాగుదామనుకుంటే ఈ ఏనుగుల పీడొకటి.
అయినా ఆ ఏనుగులకు కూడా పేదోడి పంటే కావాల్సి వచ్చిందా? అడవిలోంచి వచ్చినా ఏనుగులు ఐదారు మంది పెద్దకులపోళ్ళ రైతుల పొలాల్ని దాటుకునే కదా రావాలి ఏం? సరిగ్గా ఎరికిలోడి పంటే ఆ ఏనుగులకి కావాల్సి వచ్చిందా?
మెల్లగా మొదలైన అనుమానం క్షణాల్లో పెరిగి పెద్దదయిపోయింది నీలమ్మ మనసులో, అయినా ఏనుగులు అట్లెందుకు చేస్తాయి? మనుషులకు వుండే వివక్షత ఏనుగులకు ఎందుకు వుంటుంది? తనను తానే ప్రశ్నించుకుంది.
“మా… నేనూ నాయనతో బోతా మా….” అంటూ రాజు ఏడుపు అందుకున్నాడు. తేరుకుని చూస్తే తనతో మాటమాత్రం చెప్పకుండా నాయుడి వెనుక మెడవంచి వెడుతున్న మొగుడు దూరంగా కనిపించాడు.అచ్చం గొర్రేలాగే అనిపించాడు.
కోపం తట్టుకోలేక లాగి ఒక్కటిచ్చింది పిల్లాడి వీపుమీద.
“మూస్కోని ఈడ్నే వుండ్రా బేవర్సోడా. మీ నాయిన పోతా వుండాడు కదా తోకాడిస్తా, ఇంక నువ్వు కూడా పోవాల్నా? ఇంటికొకడు ఊడిగం చేస్తే చాల్లే నోర్మూసుకో…..”
మొగుడిపైన చూపించాల్సిన, చూపించలేని కోపం కొడుకుపైన చూపించినందుకు మరునిముషంలోనే తనపైన తనకే కోపమొచ్చింది. దాంతో బాటే ఏడుపు వచ్చింది. పంటి బిగువున బాధని, కోపాన్ని, ఏడుపుని భరించింది. బానిస బతుకు బతకటం ఎట్లా? ఆ తిండి సాగించదు. చస్తే తను తన బిడ్డకూ ఆ తిండి పెట్టదు.
జనం తలో రకంగా సలహా ఇస్తున్నారు, సానుభూతి మాటలేవో మాట్లాడుతున్నారు కానీ, అవేవీ ఆమె చెవుల్లోకి పోవడం లేదు.
కుళ్ళి, కుళ్ళి ఏడుస్తోంది నీలమ్మ. రాత్రి భార్యా భర్తల మధ్యజరిగిన గొడవలో ఆమె దెబ్బలు తింది. అక్కడక్కడా నొప్పులు, గుండెలో మంటగా వుంది.
రాత్రి తొమ్మిది దాటి ఉంటుంది.రాజు భయపడి ఏడుపు మొదలెట్టేసాడు.
“పంట నాశనం చేసింది ఏనుగులు కాదేమోనబ్బా, ఎక్కడా ఏనుగుల అడుగులూ లేవు. లద్దె కూడా కనబడలే. నువ్వూరికే నాయుడ్ని నమ్మద్దు గుడ్డిగా. దారిలో అన్ని పొలాల్ని వదిలేసి మన పొలం లోకే కక్ష గట్టినట్లు నేరుగా వస్తాయా ఆ ఏనుగులు . ” అంది నీలమ్మమొగుడికి అన్నం పెడుతూ., మెల్లగా,
కంచాన్ని విసిరికొట్టి జుట్టుపట్టుకుని వీపు మీద గుద్దాడు దొరస్వామి. చెంపలు వాయించేశాడు.
“నీ యమ్మ నీ కంటికి ఎట్టా కనపడతాండానే. మొగుడ్ని ఎదవను చేసి కొంగుకు కట్టుకుని ఆడిస్తావుండదని ఊర్లో అంటుంటారు. నీకు నాయుడిపైన గురి లేదు. రెడ్డి తియ్యగా మాట్లాడినాడు కదా, వాని మాటే వింటావు. కొంగు పరుస్తా వుండావా వాడికి? తోలు తీసేస్తాను. నోర్మూసుకుని కొంపలో పడిండు. యాడుండే దానివి ఆడ్నే వుండు, లేదంటే నా చేతుల్లోనే ఐపోతావ్. నీ మొగం చూడు, ముండమోపి మొగం థూ…” బూతులు మధ్యలో ఆపి ఎంగిలి ఉమ్మి వీథిలోకి వెళ్ళిపోయాడు. నాయుడు టౌన్లో నాటుసారా తాపించినట్లున్నాడు. వెగటు వాసన.
ఉక్కగా వుంది. ఉదయం నుండి ఏడ్చి ఏడ్చి గొంతు మండుతోంది. జ్వరం వచ్చినట్లు వుంది. నాలుగు దెబ్బలు పడిన కారణంగా రాజు ఏడుస్తూనే ఉన్నాడు.
గుడిసెలోంచి బయటకొచ్చింది.
రాజు తల్లిని ఏడుస్తూనే అనుసరించాడు.
పక్క గుడిసె ముందర నులక మంచంలో మేనపాటి దేవరాజులు తాత సగం కళ్ళు మూసుకుని తత్వాలేవో పాడుకుంటున్నాడు. దబ్బలు అల్లినవి, చీల్చినవి, గంపలు వెదుర్లతో చేసినవి. వెన్నెల్లో మెరిసిపోతున్నాయి.
చిన్నప్పుడెప్పుడో దబ్బులు అల్లేది.తట్టలు, చాటాలు, బుట్టలు చేసేవాళ్ళు. ఇంట్లో అదే వృత్తి. వారం వారం సంతలకు వెళ్ళి వాటిని అమ్ముకొచ్చేవాళ్ళు – నీలమ్మ కళ్ళు తుడుచుకుంది.
రాజును సముదాయించింది..
“ఏరా… రేపు నీకు చిన్న గంప చేసిస్తాన్లే, ఊర్కో.. ఏడవకు” అంది కుదుటపడ్డ మనసుతో