పాలస్తీనా నుండి బస్తర్ దాకా కార్పొరేట్ యుద్ధ యంత్రాన్ని ఆపండి
భారత ప్రభుత్వం తమపై కొనసాగిస్తున్న చర్యలను నిలిపివేస్తే శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామని మావోయిస్టు పార్టీ ఏప్రిల్ 3నాడు ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. ప్రజల ప్రయోజనాల దృష్ట్యా శాంతి చర్చలకు తాము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నామని నొక్కి చెబుతూ, అర్థవంతమైన చర్చలకు సానుకూల, అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిజాయితీగా చర్యలు తీసుకోవాలని మావోయిస్టు పార్టీ కోరింది. “ప్రభుత్వం మా పిలుపుకు సానుకూలంగా స్పందిస్తే, మేము వెంటనే కాల్పుల విరమణ ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నాము” అని కూడా పార్టీ ఆ ప్రకటనలో అన్నది. అయితే, మావోయిస్టులు పెట్టిన షరతులన్నింటినీ భారత రాజ్యం మొండిగా తిరస్కరించడాన్ని బట్టి చూస్తే సామాజిక-ఆర్థిక, రాజకీయ సమస్యలను పరిష్కరించడానికి చేసే ఏ ప్రయత్నం పట్లనైనా వారికున్న అలక్ష్యం తెలుస్తోంది.
బస్తర్, ఆ సమీప ప్రాంతాలలో ఆపరేషన్ కగార్ పేరుతో భారత ప్రభుత్వం సైనిక దాడిని మారణహోమ స్థాయికి పెంచిన నేపథ్యంలో శాంతి చర్చల కోసం ఈ ప్రకటన వచ్చిందనే విషయాన్ని గమనించాలి. బస్తర్‌లో యుద్ధంలాంటి పరిస్థితిలో ఉన్న అత్యావశ్యకతని, దానిని పూర్తిగా తిరస్కరిస్తున్న ప్రభుత్వ అధికారుల కపటత్వం గురించి తెలుసుకోవడానికి, మధ్య భారతదేశంలో జరుగుతున్న యుద్ధానికున్న క్రూరమైన చరిత్రను అర్థం చేసుకోవడం ముఖ్యం.
శాంతి చర్చలకు రాజ్యం ప్రతిస్పందన: ఆదివాసీల పట్ల ఉన్న శత్రుత్వానికి స్పష్టమైన సందేశం.
శాంతి చర్చల కోసం మావోయిస్టులు చేసిన పిలుపులకు రాజ్యం స్పందించిన తీరుకు సంబంధించిన ఇటీవలి పరిణామాలు ఒక ఆందోళనకరమైన వాస్తవాన్ని బయటపెట్టాయి: ప్రభుత్వం ఎటువంటి నిర్మాణాత్మక సంభాషణలోనూ పాల్గొనడానికి ఆసక్తి చూపడం లేదు. ఏదైనా చర్చలలో పాల్గొనే ముందు ప్రతిపాదించిన నిబంధనలను పూర్తిగా తిరస్కరించడం ద్వారా రాజ్యం కాల్పుల విరమణకు, అర్థవంతమైన శాంతి చర్చకు అవకాశం లేకుండా చేస్తోంది.
ఛత్తీస్‌గఢ్ ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ శాంతి చర్చల పిలుపుకు ప్రతిస్పందనగా ఈ క్రింది ప్రకటనలు చేసాడు.
రాజ్యం పోలీసు క్యాంపులను ఏర్పాటు చేయడం ఆపాలని మావోయిస్టులు కోరుకుంటున్నది. “రాజ్యం పోలీసు క్యాంపులను ఏర్పాటు చేయడం ఆపివేస్తే, మేము యుద్ధాన్ని ఆపివేస్తామని వారు (మావోయిస్టులు) అంటున్నారు. మీరు (మావోయిస్టులు) నిజంగా చర్చను కోరుకుంటే, మేము సిద్ధంగా ఉన్నాము… మీరు ఒక వ్యక్తిని లేదా కమిటీని పంపవచ్చు లేదా మీకు నచ్చిన ఏదైనా ఒక పద్ధతిని ఎంచుకొని సంభాషణ కోసం పంపవచ్చు. దాని నుండి పరిష్కారం వస్తే, గౌరవనీయ అమిత్ జీ, విష్ణు దేవ్ సాయి జీ చాలా సంతోషిస్తారు” అని అన్నాడు. లక్షలాది మంది సైనికులను మోహరించడం, వైమానిక బాంబు దాడులకు డ్రోన్లను ఉపయోగించడం, దాదాపు 1000 మంది గ్రామస్తులను సామూహికంగా అరెస్టు చేయడం, మరీ ముఖ్యంగా 400 మందికి పైగా సొంత పౌరులను దారుణంగా హత్య చేయడం వంటి అంశాలు యుద్ధంగా గుర్తించడానికి భారత ప్రభుత్వానికి సరిపోవని స్పష్టంగా తెలుస్తోంది.
“వారు కాల్పుల విరమణ గురించి మాట్లాడుతున్నారు. అలాంటి పరిభాషతో చర్చ ఎలా జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వం ఒక్క బుల్లెట్ కూడా పేల్చాలని అనుకోవడం లేదని నేను మళ్ళీ చెప్పాలనుకుంటున్నాను, అందుకే పునరావాస విధానాన్ని మళ్ళీ తీసుకువచ్చాం. చాలా మంది (నక్సల్) ప్రజలు లొంగిపోయారు; వారి జీవితాలను స్థిరీకరించే ప్రయత్నంలో పునరావాసం పొందుతున్నారు” అని అన్నాడు. చారిత్రాత్మకంగా, కాల్పుల విరమణ శాంతి చర్చలలో అంతర్భాగంగా ఉంది; అంతర్జాతీయ చట్టాలు కూడా గుర్తించాయి. ఇలాంటి ప్రకటనలు భారత రాజ్యానికి అంతర్జాతీయ చట్టపరమైన బాధ్యతల పట్ల నిర్లక్ష్యం వహించడమే కాకుండా, తన స్వంత పౌరుల సామాజిక-రాజకీయ డిమాండ్లను అర్థం చేసుకోవడంలో ఉన్న వైఫల్యాన్ని కూడా చూపుతాయి. ఈ డిమాండ్లు మావోయిస్టులు లేవనెత్తినవి మాత్రమే కాదు బస్తర్‌లోని ఆదివాసీల చట్టబద్ధమైన డిమాండ్లు కూడా. సమస్యలను పరిష్కరించకుండా పూర్తిగా లొంగిపోవాలని పిలుపునివ్వడం బస్తర్‌లోని ఆదివాసీల ఆకాంక్షల పట్ల చిన్న చూపుకలిగి వుండడమే కాకుండా, చివరికి శాంతికి నిజమైన అవకాశాన్ని తిరస్కరించే రాజకీయ తీర్మానాలకు అవకాశాలు కూడా లేకుండా చేస్తుంది.
బస్తర్‌లో ప్రబలంగా ఉన్న ప్రోత్సాహక హత్యల ఆచారాన్ని పరిగణనలోకి తీసుకుంటే, భారత ప్రభుత్వం చెబుతున్న పచ్చి అబద్ధం ఇది. ప్రతి మావోయిస్టుకు ఒక నిర్దిష్ట ప్రోత్సాహకం ఉంటుంది. ఆ స్థిర మొత్తాన్ని పొందడానికి పౌరులను కూడా మావోయిస్టులుగా చూపిస్తారు. భద్రతా సిబ్బందికి అరెస్టు చేయడానికి కాకుండా, చంపడానికి ప్రోత్సహం దొరుకుతుంది; ఆదేశం స్పష్టంగా ఉంది: ఒక మావోయిస్టు కనిపించినట్లయితే, వారిని నిర్మూలించాలి.
ఇది ఒక ప్రాథమిక ప్రశ్నను లేవనెత్తుతుంది – రాజ్యం తన అత్యంత అణగారిన, పేద, అణచివేతకు గురైన జనాభాపైన వారి స్వంత భూభాగంలో ఎందుకని యుద్ధానికి వెళ్లాలి?
శాంతి విధ్వంసం: రాజ్య వారసత్వ ద్రోహాలు; ముందస్తు షరతులు
ప్రభుత్వంతో శాంతి చర్చల కోసం మావోయిస్టు పార్టీ ప్రతిపాదించిన షరతులలో బస్తర్‌లో కాల్పుల విరమణ జరపడం, సైనిక కార్యకలాపాలన్నింటినీ వెంటనే నిలిపివేయడం ఉన్నాయి. ప్రజా భద్రతకు, స్వీయ-నిర్ణయాధికారానికి మూలస్తంభాలలో ఒకటైన శాంతి చర్చలు జరపాలంటే సైనికీకరణను తొలిగించడం చాలా ముఖ్యమైనది. అయితే, బస్తర్ ప్రజలకు హామీలు ఇవ్వడానికి ఈ అవకాశాన్ని ఉపయోగించుకునే బదులు, ఈ షరతులను రాజ్యం అంగీకరించకపోవడం వల్ల వాగ్దానాల ఉల్లంఘన, మోసపూరిత చర్చలు, పూర్తి ద్రోహబుద్ధి పునరావృతమవుతున్నాయి.
రాజ్యమూ మావోయిస్టుల మధ్య గతంలో జరిగిన శాంతి చర్చల అనుభవాలను బట్టి, ముఖ్యంగా 2004, 2010, 2011సందర్భాలలో, ఆందోళన కలగడానికి చాలా ఆస్కారం ఉంది. 2004లో సిపిఐ (మావోయిస్టు) అవిభక్త ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో బహిరంగ శాంతి చర్చలు జరిపి, చివరికి వందలాది సిపిఐ (మావోయిస్టు) కార్యకర్తలను గుర్తించి చంపినప్పుడు ప్రభుత్వం శాంతి ఒప్పందాలను వెనక్కి తీసుకున్న విధానం, గృహ మంత్రి చిదంబరం స్వామి అగ్నివేష్‌కు ఇచ్చిన వాగ్దానాన్ని ఉల్లంఘించిన విధానం, శాంతి చర్చల ప్రక్రియను ఖరారు చేస్తున్న మావోయిస్టు నాయకుడు చెరుకూరి రాజ్‌కుమార్ అలియాస్ ఆజాద్‌ను 2010లో అపహరించి బూటకపు ఎన్‌కౌంటర్‌లో చంపిన దారుణమైన విధానం, లాల్‌గఢ్ ఉద్యమ సమయంలో పశ్చిమ బెంగాల్‌లో శాంతి కోసం చర్చలు జరుగుతున్నప్పుడు ఒరిస్సా ఒప్పందాలను అకస్మాత్తుగా రద్దు చేయడం, ప్రసిద్ధ మావోయిస్టు నాయకుడు కిషన్‌జీని హత్య చేయడం – ఇలా గతంలో అనేక సందర్భాల్లో హింసను నివారించడానికి, శాంతియుత చర్చల వైపు వెళ్ళడానికి మావోయిస్టులతో చేసుకున్న ఒప్పందాలపై రాజ్యం కఠినంగా వ్యవహరించింది.
ప్రస్తుతం జరుగుతున్న కీలక మావోయిస్టు నాయకుల అరెస్టులు; వివిధ ముసుగుల్లో బహుళ సైనిక దాడులు; రూపంలో మారణహోమ ఆపరేషన్ గ్రీన్ హంట్ కొనసాగింపుగా ఆపరేషన్ కగార్ -ఇవన్నీ ప్రభుత్వ నిజమైన లక్ష్యం శాంతి కాదని, అసమ్మతిని అణచివేయడమేనని చెప్పడానికి స్పష్టమైన సంకేతాలు. అయినప్పటికీ, శాంతియుత చర్చలకు చారిత్రక సాధ్యత ఇప్పటికీ ఉన్నది.
గత అనుభవాలు, కొనసాగుతున్న శత్రుత్వాల దృష్ట్యా, మావోయిస్టు పార్టీ ప్రతినిధి అభయ్, శాంతి చర్చలను ప్రారంభించడానికి స్పష్టమైన డిమాండ్లను ముందుకు తెచ్చారు. న్యాయసూత్రాలు, మానవ హక్కులు, అంతర్జాతీయేతర సాయుధ సంఘర్షణలలో (అంతర్యుద్ధం) కాల్పుల విరమణ, శాంతి చర్చలను నియంత్రించే అంతర్జాతీయ చట్టాలపట్ల భారత రాజ్యానికి ఉన్న బాధ్యతల ప్రాథమిక సూత్రాలలో ఈ షరతుల మూలాలు ఉన్నాయి.
ఆపరేషన్ కగార్ కింద ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర (గడ్చిరోలి), ఒడిశా, జార్ఖండ్, మధ్యప్రదేశ్, తెలంగాణలలో జరుపుతున్న హత్యలు, మానవహననాన్ని వెంటనే నిలిపివేయాలి; ప్రస్తుతం ఉన్న క్యాంపుల్లో భద్రతా బలగాలను పరిమితం చేయాలి; కొత్త క్యాంపుల ఏర్పాటును నిలిపివేయాలి.
మావోయిస్టులు ప్రతిపాదించిన ఈ షరతులు వాస్తవానికి ఆదివాసీ గ్రామస్తుల డిమాండ్లే. ఆపరేషన్ కగార్ అనే పేరుతో కొనసాగుతున్న సైనిక దాడిలో క్యాంపుల ఏర్పాటు, అరెస్టులు, అత్యాచారాలు, ఊచకోతలను వ్యతిరేకిస్తూ వేలాది మంది ఆదివాసీలు మూలవాసీ బచావో మంచ్ బ్యానర్ కింద నిరసన ప్రదర్శనలు చేసారు.
ప్రజాస్వామిక సంస్థల అణచివేత: ప్రజల డిమాండ్‌లను నేరంగా పరిగణించడం
తమ భూమిని రక్షించుకోవడానికి ప్రయత్నిస్తున్న బస్తర్ ప్రజల ప్రజాస్వామిక స్వరాలను బెదిరించడానికి, మాట్లాడకుండా చేసే స్పష్టమైన ప్రయత్నమే ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ప్రజా భద్రతా చట్టం కింద ప్రజా సంఘమైన మూలవాసీ బచావో మంచ్‌ను నిషేధించాలని రాజ్యం తీసుకున్న నిర్ణయం. ఆదివాసుల జనాభాకు చెందిన సంస్థలను నేరపూరితమైనవిగా పరిగణించడం ద్వారా, ప్రభుత్వం శాంతియుత, నిరాయుధ ప్రజాస్వామిక ఉద్యమాలను కూడా బెదిరింపులుగా పరిగణించే వాతావరణాన్ని సృష్టించింది.
సంభాషణకు, శాంతియుత పరిష్కారానికి అవకాశం లేకుండా చేసే ఈ విధానం చాలా ఆందోళనకరమైనది. ఆదివాసీ గ్రామస్తుల డిమాండ్ల గురించి ఈ సంస్థలతో మాట్లాడడానికి రాజ్యం నిరాకరించడం వల్ల, సాయుధ పోరాటాన్ని ఆశ్రయించడం తప్ప ఆదివాసీలకు వేరే ప్రత్యామ్నాయం లేకుండా పోతుంది. తన అణచివేత విధానాల వల్ల, సంఘర్షణకు మూల కారణాలను పరిష్కరించడానికి నిరాకరించడం ద్వారా రాజ్యమే ప్రజలను ఆయుధాలు పట్టేలా చేస్తుంది.
రాజ్యం చేపడుతున్న ఈ చర్యలు ఒక కలతపెట్టే నమూనాను వెల్లడిస్తున్నాయి: నిర్వాసిత్వం, పేదరికం, చావులు – ఇది దశాబ్దాలుగా పునరావృతమయ్యే ఒక చక్రం; మానవ హక్కుల కంటే కార్పొరేట్ లాభాలకు ప్రాధాన్యతనిచ్చే విధానాల భారాన్ని ఆదివాసీలు మోస్తున్నారు. ఈ సముదాయాల చట్టబద్ధమైన డిమాండ్లను గుర్తించడంలో ప్రభుత్వం వైఫల్యానికి, అమలుచేస్తున్న కఠినమైన విధానాలు కలిసి సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేస్తున్నాయి.
కాబట్టి ఆదివాసీలు చేసే పోరాటం ప్రజల మనుగడ గురించి – భూమిపై తమ హక్కు, తమ సంస్కృతి, తమ గౌరవం గురించి. ఆదివాసీలు తిరుగుబాటు బాధితులు కాదు – వారిని క్రమబద్ధంగా అణగదొక్కిన, ప్రాథమిక హక్కులను తిరస్కరించిన, ఇప్పుడు నిర్వాసిత్వం, సైనికీకరణ ద్వారా వారి ఉనికిని తుడిచిపెట్టడానికి ప్రయత్నిస్తున్న ప్రభుత్వ యంత్రాంగానికి వారు బాధితులు.
ప్రపంచం దీనిని గుర్తించాలి:
ఆదివాసీ జీవన విధానాన్ని తుడిచిపెట్టడానికి, వారిని తొలగించడానికి, నాశనం చేయడానికి చేస్తున్న ఒక క్రమబద్ధమైన ప్రయత్నం. అధికారంలో ఉన్నవారికి, మేము చెప్పేది ఏమంటే ఇది మావోయిస్టులు లేదా నక్సలైట్లపైన మాత్రమే యుద్ధం కాదు; భారతదేశ ప్రజలకు వ్యతిరేకంగా, వారి చరిత్ర, సంస్కృతి పైనా వారి భవిష్యత్తుకు వ్యతిరేకంగానూ జరుపుతున్న యుద్ధం.
బహిరంగ అడవుల నుంచి బహిరంగ జైలుకు భారతదేశంలోని నాలుగు వేర్వేరు రాష్ట్రాల నుండి తీసుకొన్న విస్తారమైన అటవీ ప్రాంతం బస్తర్ దండకారణ్యంలో, మధ్య భారతదేశంలో ఉంది. ఈ ప్రాంతంలో మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఒదిషాలోని కొన్ని ప్రాంతాలు ఉంటాయి. ఇది అటవీ, ఖనిజ వనరులతో చాలా సమృద్ధిగా ఉంది. పదకొండు జిల్లాల్లో 1,10,000 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉంది. చారిత్రాత్మకంగా, ఆదివాసీ ఆధిపత్య ప్రాంతం అయిన దండకారణ్యంలో నివసించే గోండ్, ఖోయా, భత్రా తదితర ఆదివాసీ సముదాయాల జీవనోపాధి ఎక్కువగా అడవి, దాని ఉత్పత్తులపై ఆధారపడి ఉంటుంది.
అయితే, ప్రారంభం నుండీ దండకారణ్యంలోని ఆదివాసీ రైతాంగం రాజ్య అధికారుల చేతుల్లో దోపిడీ, నిర్వాసిత్వాలకు గురయ్యారు. దేశంలోని అత్యంత ధనిక ప్రాంతాలలో ఒకదానిలో నివసిస్తున్నప్పటికీ, వైపరీత్యం ఏమిటంటే బస్తర్‌లోని ఆదివాసీ సముదాయాలు సమాజంలో అత్యంత అణచివేతకు గురయ్యే సమూహాలలో ఉన్నాయి.
అటవీ సంరక్షణ, పునరావాసం పేరుతో చట్టాలు వేలాది ఆదివాసీ కుటుంబాలను నిర్వాసితులను చేస్తున్నప్పటికీ, అదే అటవీ భూమిని రాజ్యాంగ విరుద్ధంగా, చట్టవిరుద్ధంగా లీజుకు ఇచ్చి, మైనింగ్, ఇతర రకాల భూ ఆక్రమణల కోసం పెద్ద సంస్థలకు అమ్మడం కొనసాగుతోంది.
ఆదివాసీ సముదాయాలకు రాజ్యాంగబద్ధంగా హామీ ఇచ్చిన స్వయం నిర్ణయాధికారం, స్వయం పాలన లాంటి హక్కులను క్రమబద్ధంగా రద్దు చేయడం, ఆదివాసీ పూర్వీకుల భూమిపై సాంస్కృతిక, రాజకీయ హక్కులను నియంత్రించే అంతర్జాతీయ చట్టాలను రాజ్యం స్పష్టంగా ఉల్లంఘించడం అనేది ఈ అదుపులేని కార్పొరేట్ దోపిడీ పథకంలో భాగం. దీని ద్వారా రాజ్యం, పెద్ద కార్పొరేట్‌ల మధ్య ఉన్న సంబంధం స్పష్టంగా కనిపిస్తుంది.
అంతేకాకుండా, ఆదివాసీ సముదాయాలు, వారినుంచి విడదీయరాని భూమి హక్కు, రాజ్యం చేపడుతున్న అప్రజాస్వామిక పద్ధతులకు వ్యతిరేకంగా చేసే అన్ని రకాల ప్రజాస్వామిక వాదనలను భారత రాజ్యం నేరపూరితం చేయడాన్ని, క్రూరమైన సైనిక అణచివేతను అమలుపరచిన చరిత్రను చూసాం.
ఏ కోణంలో చూసినా ఈ అణచివేత దాని స్వంత ప్రజలపై రాజ్యం చేస్తున్న యుద్ధం; ఇది 20 సంవత్సరాలకు పైగా కొనసాగుతోంది. భారతదేశంలోని మధ్య, తూర్పు ప్రాంతాలను మానవహననంతో పాటు అన్ని విధాలుగా ప్రజల వనరులను దోచుకోవడం, కొల్లగొట్టడం, పెద్ద ఎత్తున ఊచకోత కోయడం అనే ఒకే ఎజెండాతో ఆపరేషన్ గ్రీన్ హంట్ నుండి ఆపరేషన్ కగార్ వరకు, భారత రాజ్యం రూపాన్ని మార్చుకొని చేస్తున్న దాడి, తమ భూమిని రక్షించుకోవడానికి ప్రయత్నిస్తున్న ఆదివాసీ సముదాయాలను లక్ష్యంగా చేసుకుంది. గత 7-8 సంవత్సరాలలోనే బస్తర్‌లో దాదాపు 250 సెక్యూరిటీ క్యాంపులను, బలిష్టమైన పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేసారు. ప్రతి 2-5 కిలోమీటర్లకు ఒక క్యాంపు ఉంటుంది! ఇది ఆ ప్రాంతాన్ని బహిరంగ జైలు శిబిరంగా మార్చింది.
ఆపరేషన్ కగార్- ఆదివాసీ ప్రతిఘటనపై తుది దాడి:
ఈ క్రూరమైన యుద్ధ ప్రస్తుత దశ బిజెపి నేతృత్వంలోని హిందూత్వ ఫాసిస్ట్ ప్రభుత్వం ప్రారంభించిన ఆపరేషన్ కగార్ పేరుతో జరుగుతోంది. 2026 మార్చి నాటికి మావోయిస్టులను పూర్తిగా తుడిచిపెట్టాలని గృహ మంత్రి అమిత్ షా ఇచ్చిన పిలుపుతో, ఈ కొత్త దాడి ఆదివాసీ సముదాయాల ప్రజాస్వామిక ప్రతిఘటనను ఏ విధంగానైనా సరే అణిచివేయడానికి చేస్తున్న ప్రయత్నం. ఆపరేషన్ కగార్ కింద జరుగుతున్న హింస భయానకంగా ఉంది.
భూమ్కల్ తిరుగుబాటు సమయం నుండి ఆదివాసీ రైతాంగం ఎదుర్కొంటున్న అత్యంత క్రూరమైన దాడులలో ఒకటైన ఈ దాడి భద్రతా బలగాలు ఆరు నెలల శిశువును అతి దారుణంగా చంపడంతో ప్రారంభమైంది. ఆపరేషన్ కగార్ ప్రారంభమైన తర్వాత రాజ్యం సాధించిన కొన్ని రక్తపాత విజయాలలో, బూటకపు ఎన్‌కౌంటర్లలో గ్రామస్తులు, నిరాయుధులైన మావోయిస్టుల ఊచకోతలు ఉన్నాయి. వాటిలో నెంద్ర (జనవరి 19)లో ముగ్గురు గ్రామస్తుల హత్య, చిపుర్‌భట్టి (మార్చి 27)లో ఇద్దరు నిరాయుధులైన మావోయిస్టులు, నలుగురు గ్రామస్తులు, పిడియా (మే 10)లో పది మంది గ్రామస్తులు, ఇద్దరు నిరాయుధులైన మావోయిస్టులు, ఘమండి అడవిలో (జూలై 3) నలుగురు గ్రామస్తులు, ఘమండి (డిసెంబర్ 12)లో ఐదుగురు గ్రామస్తులు, ఇద్దరు పట్టుబడిన మావోయిస్టులు ఉన్నారు; ఇవి కొన్ని ఘటనలే, జాబితా ఇంకా చాలా పెద్దది.
భద్రతా బలగాల మోర్టార్ షెల్స్ ఇద్దరు కౌమారదశ పిల్లల మరణానికి దారితీశాయి. యువతను ప్రజా విముక్తి గెరిల్లా సైన్య (పిఎల్‌జిఎ) దుస్తులు ధరించమని బలవంతం చేసి భద్రతా దళాలు వారిని బూటకపు ఎన్‌కౌంటర్‌లో చంపడానికి ప్రయత్నించిన ఘటనలు జరిగాయి అని పౌర హక్కుల కార్యకర్త సోని సోరి కూడా ప్రస్తావించారు.
నిరసన స్థలం వైపు వెళుతున్న అమాయక ఆదివాసీ రైతులపై దాడి జరిగిన అనేక ఇతర ఘటనలు ఉన్నాయి; చాలా మందిని కాల్చి చంపారు; వారిలో కొందరిని అరెస్టు చేసి మావోయిస్టులుగా ముద్ర వేశారు. ఒకసారి జరిగిన ఘటనలో, ఇంట్లో మంచం మీద అనారోగ్యంతో విశ్రాంతి తీసుకుంటున్న కమ్లి కుంజమ్ అనే చెవిటి మూగ బాలికను లాక్కెళ్లి, అత్యాచారం చేసి, ఆపై చంపారు. కమ్లి అనారోగ్యంతో, ఆమెను దళాలు అపహరించి అత్యాచారం చేసినప్పుడు ఆమె మంచం నుండి లేవలేని స్థితిలో ఉండింది. పౌరులతో పాటు, నిరాయుధులైన మావోయిస్టులను బంధించి, కట్టివేసి, హింసించి చంపేవారు. తరచుగా, మావోయిస్టుల పేరును పోలిన మొదటి పేరు కలిగిన ఆదివాసీ రైతులను అపహరించి చంపడం లేదా అరెస్టు చేయడం జరుగుతుంది. చాలాసార్లు, ఆదివాసీ రైతులను కిడ్నాప్ చేసి, ఆపై మావోయిస్టులుగా ముద్ర వేస్తే, ఆపై లొంగిపోవాల్సి వస్తుంది. వారిలో వేలాది మందిని అరెస్టు కూడా చేశారు. ఆదివాసీ రైతులపై ఇటువంటి దారుణమైన హింసాత్మక చర్యలు జరగడం సర్వసాధారణమైపోయింది. గత రెండు సంవత్సరాలలో, ప్రజల హక్కులు, స్వేచ్ఛలను కాపాడతామని హామీ ఇచ్చిన రాజ్యం చేతిలో 400 మందికి పైగా మరణించారు.
నిజమైన ఉద్దేశ్యం- కార్పొరేట్ దోపిడీ, ఆదివాసీల నిర్వాసితం:
వాస్తవానికి, ఈ యుద్ధం రెండు దశాబ్దాలుగా కొనసాగుతోంది – మొదట సల్వా జుడుం, తరువాత ఆపరేషన్ గ్రీన్ హంట్ రూపంలో ప్రజలకు వ్యతిరేకంగా యుద్ధం ప్రారంభించినప్పుడు ఆదివాసీల నీరు, అడవి, భూమిలను లాక్కోవడం తన లక్ష్యమని ప్రారంభంలోనే రాజ్యం స్పష్టం చేసింది. 2008లో మావోయిజం అతిపెద్ద అంతర్గత ముప్పుగా ప్రకటించిన మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్, దేశంలోని కార్పొరేట్లు వనరులను ఉపయోగించకుండా మావోయిస్టులు నిరోధించారని కూడా అన్నాడు. ఈ సంవత్సరాల్లో, భూమి కింద ఉన్న వనరులను విక్రయించడానికి కార్పొరేట్‌లతో బహుళ అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఈ అవగాహన ఒప్పందాలలో చాలా వరకు రహస్య స్వభావం ఉంటుంది. భారత రాజ్యం నిజమైన లక్ష్యాలు మావోయిస్టులేనా? అనే ప్రశ్నను ఇది లేవనెత్తుతుంది.
మావోయిస్టులతో పోరాటం పేరుతో రాజ్యం ఆదివాసుల మొత్తం ప్రాంతాన్ని ఖాళీ చేయించి భూమిని, అడవులను బహుళజాతి కంపెనీలకు సులభంగా అప్పగించవచ్చు అని అనుకుంటుంది. ఇది కొత్తది కాదు. అడవులు, భూమి, నదులు, సాధారణ పచ్చిక బయళ్ళు, గ్రామ చెరువులు, ఇతర ఉమ్మడి వనరులు, ప్రజా ఆస్తిపై పేదలకు ఉన్న కొద్దిపాటి అందుబాటు పైన 1991 నుండి నూతన ఆర్థిక విధానం పదే పదే దాడి చేసింది. ప్రతి సందర్భంలోనూ, ప్రత్యేక ఆర్థిక మండలాలు (స్పెషల్ ఎకనామిక్ జోన్), గనుల తవ్వకం లేదా పారిశ్రామిక పార్కుల అభివృద్ధి పేరుతో ఈ దాడులను సమర్థించారు. ప్రతి సందర్భంలోనూ తమ భూమిని, జీవనోపాధిని కోల్పోయింది పేదలే. ఉదాహరణకు, అనేక డోంగ్రియా తెగలకు నిలయంగా ఉన్న ఒరిస్సాలోని నియమగిరిలో, బహుళజాతి కంపెనీ వేదాంతకు, జగత్సింగ్‌పూర్‌లో పోస్కోకు లేదా కళింగనగర్‌లో టాటాలకు భూమిని అప్పగించారు; ఫలితంగా సామూహిక నష్టం జరిగింది.
విదేశీ శక్తులు, జియోనిస్టుల పాత్ర ఈ యుద్ధానికి తోడయ్యే మరో భయానకమైన విషయం ఏమిటంటే విదేశీ శక్తుల ప్రమేయం. అమెరికాకి చెందిన ఎన్‌ఎస్‌ఎ మద్దతుతో ఏర్పాటు చేసిన నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, భారత పౌరులపై డ్రోన్ దాడులను సమన్వయం చేయడంలో కీలక పాత్ర పోషించింది.
భారత రాజ్యం ప్రపంచవ్యాప్తంగా ఆయుధాలను ఎక్కువగా దిగుమతి చేసుకునే దేశం కావడమూ ఇజ్రాయిల్‌కు అతిపెద్ద ఆయుధ ఖాతాదారు కావడమూ మరింత ఆందోళనకరమైన విషయం. భారత రాజ్యం ప్రజలను ఊచకోత కోయడమే కాకుండా తన స్వంత గడ్డపై కూడా బాంబు దాడులు చేస్తోంది. ఈ వైమానిక బాంబు దాడులు ఇజ్రాయెల్ హెరాన్ మార్క్ 2 డ్రోన్‌లను ఉపయోగించి జరుగుతున్నాయి.
ఇటీవల ప్రారంభించిన అదానీ-ఎల్బిట్ మానవరహిత వైమానిక వాహనాల (యుఎవి) కాంప్లెక్స్ భారత రాజ్యం, ఇజ్రాయెల్ దేశాలకి ప్రాతినిధ్యం వహిస్తున్న అదానీ, ఎల్బిట్ భూ కబ్జాదారుల మధ్య ఉన్న కుమ్మక్కును వెల్లడి చేస్తుంది. పెద్ద ఎత్తున ఆయుధాలు, యుఎవి డ్రోన్‌లు, క్షిపణులను సేకరించడంతో పాటు; కార్పొరేట్ దోపిడీ కోసం భారతదేశం ప్రజలపై చేస్తున్న యుద్ధాన్ని ప్రశ్నిస్తున్న కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని అరెస్టు చేయడానికి భారత రాజ్యం ఇజ్రాయెల్ నిఘా సాంకేతికత, పెగాసస్ స్పైవేర్‌ను కూడా ఉపయోగించింది. సాక్షులు లేకుండా యుద్ధాన్ని సృష్టించడం ఈ అరెస్టుల లక్ష్యం. బికె-16 కార్యకర్తలు జి.ఎన్. సాయిబాబా, హేమ్ మిశ్రాల అరెస్టులను కూడా అదే కోణంలో చూడవచ్చు.
శాంతి చర్చలపై మా వైఖరి:
భారతీయ, ఇజ్రాయెల్ దేశాల మధ్య కుదిరిన ఒప్పందం, లక్షలాది డాలర్ల విలువైన అధునాతన ఆయుధాలు, గూఢచారి సాఫ్ట్‌వేర్‌లను భారీగా కొనుగోలు చేయడం అంటే భారతీయ పన్ను చెల్లింపుదారుల డబ్బు పరోక్షంగా పాలస్తీనాలో జాతి నిర్మూలనకు నిధులు సమకూరుస్తుందని, అదే సమయంలో “జాతీయ భద్రత” పేరిట క్రమపద్ధతిలో భారతదేశంలోని ఆదివాసీల నిర్మూలన జరుగుతోందని కూడా అర్థం.
గత రెండు సంవత్సరాలలో, భారత రాజ్యం చేసిన క్రూరమైన యుద్ధంలో 400 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు; వారిలో ఎక్కువ మంది ఆదివాసీలు. వీరిలో 40 శాతం మంది మహిళలు కాగా, 35 శాతానికి పైగా గ్రామీణులు. సుమారు 200 మంది సాధారణ గ్రామస్తులు, నిరాయుధ, గాయపడిన లేదా కోలుకుంటున్న మావోయిస్టులు. ముఖ్యంగా గత మూడు శాంతి ప్రక్రియల సందర్భంలో రాజ్యం వైపు నుండి జరిగిన ద్రోహాల అనుభవాలను బట్టి ప్రస్తుతం నెలకొన్న అంతర్యుద్ధ పరిస్థితిలో ఎలాంటి శాంతి చర్చలు జరగడానికైనా అనువైన పరిస్థితిని సృష్టించడానికి ఒక జోక్యం అవసరం.
ఆదివాసులు, మావోయిస్టుల హత్యలు, హింసలు, అరెస్టులను ఆపడం; భద్రతా సిబ్బందిని ఇప్పటికే ఉన్న క్యాంపులకు పరిమితం చేయడం; కొత్త క్యాంపుల నిర్మాణాన్ని నిలిపివేయడం వంటివి చేర్చిన కాల్పుల విరమణ ద్వారా చర్చలకు అనువైన పరిస్థితిని సృష్టించడం రాజ్య బాధ్యత అని మేము నమ్ముతున్నాము. గత చర్చల సందర్భంగా రాజ్యం విశ్వసనీయతకు భంగం కలిగించడం వల్ల మావోయిస్టులు ఈ చర్చల ప్రయత్నాన్ని ప్రారంభించడానికి ముందు 13 సంవత్సరాలుగా శత్రుత్వం ఏర్పడిందని పరిగణనలోకి తీసుకుంటే ఈ బాధ్యత మరింత ఎక్కువగా ఉంటుంది.
అంతేకాకుండా, ఉద్యమం ద్వారా తలెత్తిన సామాజిక-ఆర్థిక, రాజకీయ సమస్యల పరిష్కారానికి శాంతి చర్చలు రాజకీయ సంభాషణతో కూడి ఉండాలని మేము విశ్వసిస్తున్నాము. ఈ అంశాన్ని గతంలో రాజ్యానికి చెందిన కమిటీలే అంగీకరించిన మాట వాస్తవం. ప్రజా పోరాటాలకు కారణమయ్యే సమాజంలోని సమస్యలను పరిష్కరించకుండా, పరిస్థితులను పరిష్కరించకుండా, ఛత్తీస్‌ఘఢ్ హోంమంత్రి విజయ్ శర్మ సాధించాలని చెప్పుకుంటున్న విధంగా అంటే, సమస్యలను పరిష్కరించకుండా బేషరతుగా లొంగిపోవడం, అదే సమయంలో, రాజ్యం తన సాయుధ శక్తి ద్వారా ఈ ప్రాంతాల ఖనిజ వనరులను దోచుకోవడం కొనసాగుతుంటే శాంతిని సాధించలేము.
ఈ విధానం వ్యత్యాసాన్ని మరింతగా ఎక్కువ చేస్తుంది; శత్రుత్వాలను పెంచుతుంది. అసంభవం అయినప్పటికీ ఒకవేళ సూత్రరహిత “శాంతి”ని సాధించినా అది నిలబడదు; పెద్ద భారతదేశ కార్పొరేట్ కంపెనీలు, విదేశీ కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాలకు అనుగుణంగా ఉండే రాజ్య విధానం వల్ల బేదఖలు, నిర్వాసిత్వం, దోపిడీల మధ్య పతనమయ్యే అవకాశం ఉంది. ఆదివాసులు తమ జల్-జంగిల్-జమీన్‌ను కాపాడటానికి భూమ్‌కల్, సంథాల్ తిరుగుబాటు వంటి చారిత్రక పోరాటాల వెలుగులో మేము దీనిని చెప్తున్నాము; అందువల్ల ఈ పోరాటం, సాయుధ పోరాటంతో సహా దాని వివిధ రూపాలు మావోయిస్టులకు మాత్రమే పరిమితం కాదు, వారికంటే ముందునుంచే ఉన్నాయి.
అంతేకాకుండా, ఈ యుద్ధం కేవలం తిరుగుబాటు, శాంతి భద్రతలు లేదా జాతీయ భద్రత, అభివృద్ధిల గురించి కాదు; ఇది ఒక పెద్ద, మరింత దుర్మార్గమైన అజెండాలో భాగం. సూరజ్‌కుండ్ పథకం (2022) కింద బ్రాహ్మణీయ హిందూత్వ ఫాసిస్టు భారతీయ రాజ్యం ఏకీకరణ కోసం, భారతదేశ సొంత ప్రజల రక్తం, బాధలపైన “హిందూ రాష్ట్రాన్ని” నిర్మించడానికి ” వికసిత్ భారత్ కోసం విజన్ 2047″ అని పిలుస్తున్న లక్ష్య సాధనలో కొనసాగుతున్న అణచివేత కీలకంగా ఉంటుంది. నిర్వాసిత్వం, మానవ హననం, ఆదివాసీ భూముల దోపిడీ ద్వారా రాజ్యం ప్రోత్సహిస్తున్న అభివృద్ధి కథనం కార్పొరేట్ దోపిడీని పెంపొందిస్తుంది.
ఈనాడు భారతదేశ భవిష్యత్తు ఒక కూడలి వద్ద ఉంది. అణచివేతకు, దోపిడీకి గురవుతున్నవారికి సంఘీభావంగా నిలబడాలని రైతాంగ, కార్మికవర్గ సంస్థలు, విద్యార్థులు, కార్యకర్తలు, మేధావులు, మీడియా మిత్రులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. బస్తర్ ప్రజల డిమాండ్లను, మావోయిస్టుల డిమాండ్లను గౌరవిస్తూ, దౌర్జన్యం, అణచివేత, సైనిక శక్తుల భారీ వినాశ శక్తి నుండి విముక్తి పొంది, నిజమైన శాంతి చర్చల్లో ప్రభుత్వం పాల్గొనాలని డిమాండ్ చేసే సమయం ఇది. శాంతి కోసం ఈ పిలుపు కేవలం మావోయిస్టుల పిలుపు మాత్రమే కాదు, ఇది న్యాయం, ప్రజాస్వామ్యం, ప్రజల సార్వభౌమత్వాన్ని విశ్వసించే ప్రతి పౌరుడి పోరాటం.
14-04-2025