కమ్యూనిస్టులు కానివారు, అశేష ప్రజాదరణ ఉన్నవారు విప్లవకారులను పీడిత ప్రజలలో పని చేస్తున్నట్లు గుర్తించి నక్సల్బరీ కాలం నుంచీ సంభాషణ జరుపుతున్నారు . అప్పటి  నుంచీ  దానికి  గుండెలు బాదుకుంటున్నవారు  కూడా ఉన్నారు. వీళ్లు భావజాల రీత్యా బ్రాహ్మణీయ, మార్కెట్ శక్తుల ప్రతినిధులు.  శంకరన్, పొత్తూరి విప్లవకారులతో సంభాషణ జరిపి, ప్రభుత్వంతో చర్చల దాకా తీసుకువచ్చి చర్చల వైఫల్యానికి, తర్వాత హింసా విధ్వంసాలకు ప్రభుత్వమే కారణమనడం ఇప్పటికీ వీళ్లకు మింగుడు పడడం లేదు. పుబ్బలో పుట్టి మఖలో మాయమయే ఇటువంటి సంస్థలు కూడా ఉన్నాయి.

హరగోపాల్ పోరాట రూపాలు ప్రజలు నిర్ణయిస్తారనే ఎరుక ఉన్న చరిత్ర విద్యార్థి. మానవత్వం కేంద్రంగా ఉన్న మార్క్సిస్ట్. ఆయన ప్రజాస్వామ్య వాది. ప్రొఫెసర్ కోదండరాం పౌరస్పందన వేదికలో క్రియాశీల సభ్యుడే. అప్పటికే చర్చల కోసం రెండుసార్లు విప్లవ పార్టీ నాయకత్వంతో మాట్లాడడానికి అడవికి పోయిన వీళ్లంతా ప్రజల్ని అమితంగా ప్రేమించిన వాళ్లు. భాషకుండే భావ వినిమయశక్తి తెలిసినవాళ్లు. బ్రాహ్మణీయ భావజాలానికైనా, మార్కెట్కైనా మనుషుల్ని శాసించడం, విడదీయడం మాత్రమే తెలుసు.

ఎమర్జెన్సీలో ఆంధప్రదేశ్లో నక్సలైట్లను ఎన్కౌంటర్లో చంపిన సంఘటనలపై తార్కుండే కమిటీ అరుణ్ శౌరీ ద్వారా ఆ బాధ్యత కన్నబిరాన్, కాళోజీలకప్పగిస్తే వాళ్లు అర్బన్ నక్సలైట్లతో కలిసి పనిచేస్తున్నారని ఆందోళన పడిపోయి భండారు చంద్రమోళీశ్వర రావు, పురుషోత్తమరావులు నక్సలైట్ల హింసా విధ్వంస చర్యల రిపోర్టు ఒకటి తీసుకొని వెళ్లి తార్కుండేని కలిసారు. నేను సైద్ధాంతికంగా కమ్యూనిస్టులను వ్యతిరేకించే రాడికల్ హ్యూమనిస్టును. కాని ప్రాథమిక హక్కులు రద్దుచేసి పార్లమెంట్ ఆమోదం పొందిన ఎమర్జెన్సీ జీవించే హక్కును హరించిందనే మా ఆందోళన అన్నాడు.

ఇప్పుడు సూరజ్కుండ్ యుద్ధ వ్యూహం దాని విశ్వరూపం. అప్పటికి ప్రపంచ బ్యాంకు ఎజెండా పట్టణ సుందరీకరణ, జనాభా నియంత్రణ. ఇపుడో కార్పొరేట్ కంపెనీల కోసం దళారీ ప్రభుత్వాల ఆక్రమణ, సైనిక దాడి, ఆదివాసుల హననం. ప్రకృతిని, ప్రజలను వనరుగా, సరుకుగా చూసే అమానవీయ ఫాసిస్టు రాజనీతి.

హమాస్ సాకుతో కాల్పుల విరమణను కూడా ఉల్లంఘించి, పాలస్తీనియన్లను విస్థాపన చేసే సామ్రాజ్యవాద జియోనిస్టు కుట్ర వంటిదే మావోయిస్టు రహిత భారత్, కార్పొరేట్, బ్రాహ్మణీయ హిందూ రాజ్యం వ్యూహం. అరవిందరావు, జెపిలు అందుకు ప్రతినిధులు. ఆ సభలో వీళ్ళజతన త్రిపురనేని హనుమాన్ చౌదరి లేడెందుకు?

2004లో ఆంధప్రదేశ్ ప్రభుత్వం నక్సలైట్లతో శాంతి చర్చలు నిర్వహించాలన్నపుడు మియా బీ బీ రాజీ హై తో హం కో క్యా షికాయత్ హై అని గోడ మీది పిల్లి వలె వ్యవహరించినవాడు జె. పి. ఎందుకంటే ఆయనకు నక్సలైట్లు మాత్రమే కాదు వై ఎస్ఆర్ ప్రభుత్వం కూడా గిట్టదు.

ఇంక అరవిందరావుకు చర్చలకు పీపుల్స్వార్గా ఆహ్వానింపబడి, వచ్చినాక మేమిపుడు ఉత్తరాన ఎమ్సిసితో కలిసి సిపిఐ మావోయిస్టు అయ్యాము అనే ప్రకటనే మింగుడు పడలేదు.

1977కు పూర్వం ముఖ్యంగా 68-72లో ఫ్యూడల్, కరడుగట్టిన ప్రాంతీయవాదిగా ఉన్న పురుషోత్తంరావు చంద్రబాబు వరల్డ్ బ్యాంకు పాలన ముగిసే సరికి ఆ దళారీ సంస్కృతి భరించలేక గాంధేయవాది అయ్యాడు. అతని పేరెందుకు తీసుకున్నానంటే ఆయన తెలంగాణ రాజకీయాల్లో ప్రభావం చూపిన కాంగ్రెస్ ప్రతినిధి. 2004 నాటికి ఆయన మావోయిస్టులను గౌరవించే గాంధేయవాది అయ్యాడు. అదట్లా ఉంచి ఎఐపిఆర్ఎఫ్ అనుభవమే చెప్పాలంటే ప్రపంచీకరణను వ్యతిరేకించే గాంధేయవాదులు, లోహియేట్లు ,  అస్తిత్వవాదులుకాని అంబేడ్కరైట్లు, సామ్రాజ్యవాద వ్యతిరేక ఫెమినిస్టులు మావోయిస్టులతో కలిసి పనిచేయడానికి, ఇంకా చెప్పాలంటే మావోయిస్టుగా రాజ్యానికి ప్రజలకు స్పష్టంగా తెలిసినవారు చొరవగా ఆర్గనైజ్ చేసే ఐక్యసంఘటనలో పనిచేయడానికి వీరెవరూ వెనుకాడలేదు. బిడి శర్మ, సురేంద్ర మోహన్, బొజ్జా తారకం, అరుంధతీ రాయ్ వంటి వారెందరో. అంటే 1997 నాటికి జస్టిస్ ఎం.ఎన్ రావు ఒక తీర్పు సందర్భంగా తన పరిశీలనావగాహనగా వ్యాఖ్యానించినట్లు నక్సలిజాన్ని ఒక పరిష్కారంగా ప్రజలు చూస్తున్నారని భూస్వామ్య, సామ్రాజ్యవాద వ్యతిరేక తీవ్రతగల బుద్ధిజీవులందరికీ అర్థమైంది. వస్తుగత దృష్టితో చూస్తే మైదాన ప్రాంతంలో, కొన్నిచోట్ల ఆదివాసీ ప్రాంతాల్లో కార్పొరేటీకరణను నిరోధించలేకపోయిన సుదీర్ఘ పోరాటాలు బస్తర్ ప్రయోగాన్ని న్యాయం దృష్టితోనైనా సమర్థించక తప్పడంలేదు. హిమాంశుకుమార్, నందినీ సుందర్, జస్టిస్ చంద్రకుమార్ల నుంచి బేలాభాటియా, సోనీసోరీ దాకా ఎంతో సృజనాత్మకంగా, ఎంత ఇంటెన్సిటీతో, ఎంత ఆమోదంతో అక్కడ ఆదివాసులు, మావోయిస్టు నాయకత్వాన్ని స్వీకరించడం నేరమో, దేశ ద్రోహమో కాదు అన్నమంత అవసరమని భావిస్తున్నారని శషభిషలు లేకుండా గుర్తిస్తున్నారు. ఇది మొట్టమొదట చైబాసాలోనే గుర్తించి, 2000లో రaార్ఖండ్ ఏర్పడినాక రాంచీకి మారి బగైచా పేరుతో ఆదివాసుల కోసం, వాళ్లు మావోయిస్టులైనాసరే కమ్యూన్ ఏర్పాటు చేసి పథల్గడీ పోరాటంలో సంలీనమైనవాడు జెసూట్ ఫాదర్ స్టాన్ స్వామి.

భీమా కోరేగావ్ ఎల్గార్ పరిషత్ కుట్ర కేసులో మావోయిస్టుల వ్యూహాన్ని చూసి రాజ్యం దళితుల్లో వారిపట్ల విశ్వాసాన్ని పెంచింది. నయీపీష్వాయి నహీ చలేగీ అని రిపబ్లిక్ ప్యాంథర్స్ నాయకుడు సుధీర్ ధావ్లే, కబీర్ కళామంచ్ సాగర్ గోర్కే, రమేశ్ గైచార్, జ్యోతి జగ్తప్ ఎలుగెత్తిన ఎల్గార్(పిలుపు) సావర్కర్ మత్తు నుంచి మేల్కొల్పే ఒక సందర్భమైంది. సాయిబాబా కేసు తీర్పు నాటికే రోనావిల్సన్, సురేంద్ర గాడ్లింగ్, స్టాన్ స్వామిలపై కుట్రకేసుకు రంగం సిద్ధమైంది. అక్కడ ఝార్ఖండ్  ముక్తిమోర్చా ప్రభుత్వం ఉండడం వల్ల ఎన్.ఐ.ఎ. ఈ కేసును తన చేతుల్లోకి తీసుకునే దాకా వీలు కాలేదు. స్టాన్ స్వామికి, 83 ఏళ్ల పార్కిన్సన్ బాధితుడికి నీళ్లు తాగే సిప్పర్ ఇవ్వడానికి నిరాకరించిన రాజ్య దౌర్జన్య స్వభావాన్ని, జ్యుడిషియల్ కస్టడీ నుంచి బయట పడేయలేకపోయిన హైకోర్టు అసహాయతను ప్రపంచం నిరసించింది.

ఇటీవల బెయిలుపై   విడుదలైన రోనా విల్సన్ జైల్లో మహేశ్ చేసిన అధ్యయనం ఐదు డాక్యుమెంట్లు చూసినా, తమ అనుభవం చూసినా, ఇప్పుడు రాజకీయ ఖైదీలను బ్రాహ్మణీయ హిందుత్వ బాధితులైన ముస్లిం, దళిత, అతిశూద్రులు అని కూడా చెప్పాల్సి ఉంటుందన్నాడు. ఈ కారణాలతోపాటు సాయిబాబా కేసు వాదించినందుకు, సూరజ్ ఖుండ్  మైనింగ్ ను  వ్యతిరేకించినందుకు సురేంద్ర గాడ్లింగ్ ను , రోనా విల్సన్ విషయంలో అప్రూవర్ గా  మారనందున, ముస్లిం కూడా అయినందున హనీ బాబును, సుధీర్ ధావ్లే విషయంలో అప్రూవర్లు కానందుకు సాగర్, రమేశ్ లను  బెయిలుపై బయటికి రాకుండా అడ్డుపడుతున్నారు. ఈ కేసు నేపథ్యం అయిన పీష్వాల పాలన కాలం నుంచి ఫడ్నవీస్ కాలం వరకు ఉన్న దళిత, ముస్లిం వ్యతిరేక బ్రాహ్మణీయ భావజాలాన్ని సైద్ధాంతికంగా, సాంస్కృతికంగా సాహిత్య కళా రంగాల్లో విద్రోహి పత్రిక ద్వారా, కబీర్ కళామంచ్ ప్రదర్శనల ద్వారా బట్ట బయలు చేయడమే వీళ్ల మీద కక్షకు కారణం అని పాటలు, ప్రదర్శనలు విశ్లేషించి అజాజ్ అష్రఫ్ ఈ కేసుపై రాసిన చారిత్రక ప్రామాణిక గ్రంథంలో వివరించాడు.

మహేశ్ రావత్ది గడ్చిరోలీ జిల్లా. ఆయన ప్రధాన మంత్రి ఆదివాసీ విభాగ అధ్యయనంలో పనిచేస్తూ జిల్లా వ్యాప్తంగా గ్రామ సభలు నిర్మాణం చేసాడు. ఆయనను విడుదల చేయాల్సిందిగా అరెస్ట్ సందర్భంగా మూడు వందల గ్రామ సభలు తీర్మానం చేసాయి. ఏడు సంవత్సరాలు కావస్తున్నా ఇరువై నెలల కిందట హైకోర్టులో బెయిల్ ఇచ్చినా సుప్రీం కోర్టులో ప్రభుత్వం అందుకే అడ్డుపడుతున్నది.

ఇటీవల పోలిస్ (polis) సంస్థ చేసిన అధ్యయనంలో ఈ కేసులో రోనా విల్సన, సురేంద్ర గాడ్లింగ్, స్టాన్స్వామిలను ఎన్ఐఏ ప్రధాన కుట్రదారులుగా చూపింది. 2012 నుంచి ఆ మాటకొస్తే వినాయక్ సేన్కు జీవిత శిక్ష పడిన కాలం నుంచి ఆర్.ఎస్.ఎస్ కేంద్రీకరణ మధ్యభారతంలో ఆదివాసుల మధ్య మావోయిస్టుల పనిపై, దానికి అర్బన్ కనెక్ట్ అనుకుంటున్న వాళ్లపై ఉంది. రంగులు మారిన మావోయిస్టులని, అర్బన్ మావోయిస్టులని చర్చల ప్రస్తావన రాగానే ఉలిక్కిపడి అందుకే ఈ కూటమి మోషాలకు అండగా నిలిచింది. పోరాట రూపంతో సంబంధం లేకుండా 2026 మార్చ్ 31 వరకు కార్పొరేట్లకు బస్తర్ను అప్పగించడానికి మావోయిస్టు రహిత పేరుతో ఆదివాసుల మారణహోమం చేస్తున్న రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల తాబేదార్గా ఈ కూటమి సాయుధ పోరాట మార్గాన్ని ఖండిరచాలంటున్నది.

ఇవ్వాళ బస్తర్ అర్ధ సైనిక, యాంటీ మావోయిస్టు సాయుధ పోలీసు తుపాకి మోతలతో దద్దరిల్లుతున్నది. ప్రతి ఎన్కౌంటర్ పేరుమీద ఎందరిని నిర్మూలిస్తున్నారో లెక్కలు జిల్లా ఎస్పిలు, ఐజి సుందర్రాజ్ నుంచి కేంద్ర హోంమంత్రి అమిత్ షా దాకా చెప్తున్నారు. దేశ ఆంతరంగిక భద్రత తన బాధ్యత అంటున్నాడు. ముందు ఆయన ప్రమాణం చేసిన రాజ్యాంగాన్ని గౌరవించి ఆదివాసుల కోసం రాజ్యాంగం హామీ పడిన అధికరణలు, పెసా వంటి చట్టాలు అమలు చేయమనండి. కగార్ ఆక్రమణ యుద్ధ ఆఖరు గడువును రోజూ ప్రకటిస్తున్న రాజ్యం నుంచి అది ఆశించలేం. కనుక అశేష ప్రజారాశుల, ప్రజాస్వామిక శక్తుల సంఫీుభావమే ఇపుడు కావాల్సింది. సాధించాల్సింది.

అందుకే చర్చలు ప్రారంభమైన తొలి రోజు (2004 అక్టోబర్ 14)  రెండు నక్సలైట్ పార్టీల టీం నాయకుడు ఆర్కే ఇప్పటి దాకా పరస్పర లేఖలతో చర్చలకు ఒప్పుకున్నాం, ఇప్పుడు ఇంక అటువంటి ఒప్పందంపై ఇరువురం (ప్రభుత్వం తరఫున హోంమంత్రి జానారెడ్డి, రెండు విప్లవ పార్టీల తరఫున తాను) సంతకాలు చేయాలని వాదించాడు. లంచ్ టైం దాకా ఆ చర్చ నడిచింది. అప్పుడు చర్చల పరిశీలకులుగా ఉన్న వారిలో సీనియర్ న్యాయ వాదులు కె.జి. కన్నబిరాన్, బొజ్జా తారకం, ఒకరి లేఖ మరొకరి దగ్గర ఉన్నప్పుడు అది చాలు, ఒకవేళ లేదా ప్రత్యర్థుల ఒప్పందానికి సాక్ష్యమని చెప్పడంతో చర్చల కోఆర్డినేటర్ (సమన్వయకర్త) గా ఉన్న ఎస్ ఆర్ శంకరన్ ఇంకా పట్టు పట్టకుండా ముందుకు వెళ్లడానికి సూచించాడు. చర్చల ఎజెండా మర్నాడు చేపడదామని హోం మంత్రి సూచించడంతో లంచ్ కు  వెళ్లారు.

చర్చలలో మీడియాను, ప్రభుత్వం తరఫున చర్చల ప్రతినిధులను తప్ప ఎవరినీ (ఇంటిలిజెన్స్ పోలీసు అధికారులను కూడ) అనుమతించలేదు. రెండవ రోజు మాత్రమే స్టెనోను ఏర్పాటు చేశారు.

ఆ ఇంతలోనే ఇంటిలిజెన్స్ డిజిపి అరవిందరావు జిల్లా ఎస్పిలతో వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి చర్చలలో ప్రతిష్ఠంభన వచ్చింది. బలగాలను సిద్ధం చేయండి (శాంతి భద్రతలకు అనుకోవాలి) అని హెచ్చరించాడు. 

పదవీ విరమణ తర్వాత ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ఇంటర్వ్యూలో మొదటి దఫా చర్చలు అంత సానుకూల వాతావరణంలో జరిగాక రెండవసారి చర్చలకు నక్సలైట్ పార్టీలను ఎందుకు పిలువ లేదంటే మేం పీపుల్స్ వార్ ను  చర్చలకు పిలిచాం. వాళ్లేమో అట్లాగే ఆహ్వానం స్వీకరించి వచ్చారు. చర్చలకు ముందు రోజు మంజీరా గెస్ట్ హౌస్లో తాము (పీపుల్స్ వార్ ) ఎంసిసిఐతో ఐక్యమై మావోయిస్టు పార్టీగా ఏర్పడినామని, కనుక సిపిఐ (మావోయిస్టు) గానే చర్చల్లో పాల్గొంటున్నామని ప్రకటన చేశారు.

సిపిఐ మావోయిస్టును అఖిల భారత స్థాయిలో గుర్తించడం అంటే కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న, కాంగ్రెస్ పార్టీ మరొక విప్లవ పార్టీతో చర్చించడానికి ఆమోదం తెలపడం. ఆ పార్టీతో ఘర్షణ (కాన్ఫ్లిక్ట్)తో ఉన్నట్లు గుర్తించి చర్చించడం అవుతుంది. పిడబ్ల్యుజిగా ఒక నక్సలైట్ గ్రూపుతో చర్చించినట్లు కాదు. అప్పుడు సంఘర్షణ తలంలో (ఏరియాలో) ఏ సమస్య వచ్చినా అంతర్జాతీయ న్యాయ సూత్రాలు, జెనీవా ఒప్పందాలు వర్తిస్తాయి. అందుకే రెండవసారి పిలువ వద్దని ప్రభుత్వం నిర్ణయించింది అన్నాడు.

తీగ లాగితే డొంకంతా కదిలినట్లు డిజిపి ఇంటిలిజెన్స్గా ఆయనకు చర్చలు జరిపితే, జూబ్లీ హాల్లో కరీంనగర్ జిల్లా సిపిఐ ఎంఎల్ జనశక్తి కార్యదర్శి, రాష్ట్ర కమిటీ సభ్యుడు రణధీర్ తన వెంట 40 మంది పార్టీ గెరిళ్లా యూనిఫారాలు, ఆయుధాలతో లొంగిపోయినపుడు (ఆ లొంగుబాటును కరీంనగర్ ఎస్పి ప్రవీణ్కుమార్ సాధ్యం చేశాడు) పీపుల్స్ వార్ గ్రూపులో కూడా చెప్పుకోదగిన సంఖ్యలో లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నారని, ఆ పార్టీలో కెఎస్ తర్వాత రెండవ స్థానంలో ఉన్నవాడు తమ ఇంటిలిజెన్స్ అధికారికి చెప్పాడని ‘అది నమ్మకపోవడానికి కారణం లేదు’ there is no reason not to believe it అని ముఖ్యమంత్రి వైఎస్సార్ అన్నట్లు హిందు పత్రికలో వచ్చింది. అందుకన్నమాట డిజిపి ఇంటిలిజెన్స్ ఆమోదం తెలిపింది. తీరా వచ్చినవాడు మావోయిస్టు అయ్యాడు. కాన్ఫ్లిక్టును, కాన్ఫ్లిక్ట్ ఏరియాను ఒప్పుకున్నట్లు అవుతుంది. పోలీసు అధికారిగా అరవిందరావు ప్రచ్ఛన్న రూపం అది. బ్రాహ్మణీయ హిందూ ఫాసిస్టుగా ఆయనకు మావోయిస్టులు దండకారణ్యంలో రుషులు, బ్రాహ్మణుల యజ్ఞాల మీద, ఆశ్రమాల మీద దాడి చేసే రాక్షసులు ఇంకా ఇప్పుడైతే 2025 జనవరి 22 అయోధ్య రామ జన్మభూమిలో జైశ్రీరామ్ ప్రతిష్ఠతో ప్రధాని మోడీలో ఆయన అంశ ప్రవేశించిందని భావించే మనుధర్మవాది ఆయన.

ఈ ఇద్దరి గురించి చెప్పగలిగినంత సాధికారికంగా నేను దాసరి శ్రీనివాసులు అనే ఐఏఎస్ ఆఫీసర్ గురించి చెప్పలేదు గానీ ఈ చర్చలు వద్దు, మావోయిస్టులను గడువు ప్రకారం అణచివేయండి అని చెప్పడానికి ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన చెప్పిన విషయాలను బట్టి ఆయన ఈశాన్య రాష్ట్రాలలో పనిచేసినప్పుడు ఆర్ఎస్ఎస్ నిర్వహిస్తున్న వనవాసి కళ్యాణ్ ఆశ్రమంలోకి వచ్చినట్లుగా అర్థమవుతున్నది. ఆయనను మంత్రి బాలరాజుతో పాటు బందీగా తీసుకున్నారు లోగడ మావోయిస్టులు. బందీగా తీసుకొని చర్చలలో జరిగిన జాప్యం వల్ల నెల రోజులకు పైగానే పెట్టుకున్నారు. కానీ అప్పుడు వాళ్లు తనను చాలా మర్యాదగానే చూశారని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇపుడేమో తనను నక్సలైట్లు చంపడానికి వస్తే ఆదివాసులే అడ్డుపడి కాపాడుకున్నారని చెప్తున్నాడు. వనవాసీ కళ్యాణ్ ఆశ్రమాలు నిర్వహించే సంఫీుయులకు వాళ్లు అడవి మనుషులుగానే కనిపిస్తారు. గానీ వాళ్లు ఆదివాసులన్నా మూలవాసులన్నా ససేమిరా ఒప్పుకోరు. వాళ్ల దృష్టిలో ఆర్యులు అంటే బ్రాహ్మణులు, క్షత్రియులు మాత్రమే. ఈ దేశీయులు అయినా దయతలచి ఈ అడవి మనుషులను హిందువులలో చేర్చుకోవడానికి ఈ కళ్యాణ ఆశ్రమాలను నడుపుతున్నారన్నమాట. ఇవి బాగా పనిచేస్తున్నాయని శ్రీనివాసులు గారికి అనిపించడం, ఆయనను ఒకసారి నక్సలైట్లు బందీలుగా తీసుకోవడం ఈ సమావేశంలో ఆయన ఒక ప్రముఖ వక్త కావడానికి (ఇద్దరు ఐఏఎస్ లలో ఒకరుగా) అర్హత.

రెండవసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ప్రజల డిమాండ్లలో ఒకటైన (మిగతా రెండు- రెండు రూపాయలకు కిలో బియ్యం, సబ్సిడీల పునరుద్ధరణ, సారాపై నిషేధం)పీపుల్స్ వార్ పై నిషేధాన్ని ఎత్తివేయాలని కన్నాబిరాన్ నాయకత్వంలో గుంటూరు శేషేంద్రశర్మ, గద్దర్ మొదలైన పది మంది మేధావులు, ప్రజాస్వామ్యవాదులు పోయినపుడు – ఆయన ఆమోదించాడు. అపుడు ముఖ్యమంత్రి పి.ఎ.గా ఉన్న జెపి, నిషేధం తొలగింపు మూడు నెలల కాలం కోసమేనని, అది కూడ దళాలు ఆయుధాలతో గ్రామాలలో తిరగవద్దని షరతులు పెట్టించాడు. ఈ షరతులన్నీ ఆయన ఎన్టిఆర్ చెవిలో బహిరంగ రహస్యంగానే చెప్పాడు. ఇక లక్ష్మీ పార్వతితో వివాహం కారణంగా తన విధేయత ఎన్టిఆర్ నుంచి చంద్రబాబువైపు మార్చుకున్న జె.పి. ఇపుడు ఆంధప్రదేశ్లో అధికారంలో ఉన్న చంద్రబాబు, చంద్రబాబు వలెనే ఉద్యోగాలు రాని, డిమాండ్ లేని కోర్సులు (అంటే చరిత్ర, సామాజిక శాస్త్రం, ఇస్లామిక్ స్టడీస్, ఫిలాసఫీ వంటివని భావం) యూనివర్సిటీల నుంచి ఎత్తివేయాలని, అది సెంట్రల్ యూనివర్సిటీ అయినా సరే వాళ్లకిచ్చిన భూములను పట్టాలేదనే పేరుతో ఆక్రమించుకోవడానికి బుల్డోజరు పండుగల రోజుల్లో అడవిపైకి, వన్య జీవుల మీదికి తోలాలని ఆచరించి చూపుతున్న కాంగ్రెస్ ముఖ్యమంత్రి పాలనలో జె.పి. ప్రపంచ మార్కెట్ ప్రతినిధిగా ఎలా మాట్లాడ్తాడో మనం ఊహించలేనిది కాదు.

ఇపుడు ఒక ఏడాది మూడు నెలల కాలంలో ఎన్కౌంటర్లు కాదు జెనోసైడ్  (మారణకాండ) అనదగిన స్థాయిలో ఆదివాసులు, అందులో కొందరైనా మావోయిస్టులు అమరులైన నేపథ్యంలో మావోయిస్టుల సాకుతో ఆదివాసులందరినీ చంపిగానీ, తొలగించిగానీ బస్తర్నంతా కార్పొరేట్లప్పగించడానికేనని, ఈ మారణకాండ నుంచి ఆదివాసులను కాపాడుకోవడానికి, తాము కాల్పుల విరమణకు సిద్ధమని ఇందుకు తమ పార్టీ పనిచేస్తున్న అవి రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం కూడ. ఏకకాలంలో కాల్పుల విరమణ ప్రకటించాలని సిపిఐ మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రకటించింది. కాల్పుల విరమణను స్వాగతిస్తున్నట్లే మాట్లాడుతూ ఛత్తీస్గఢ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి ఆయుధాలు విసర్జించి, లొంగిపోతేనే చర్చలన్నాడు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడ అదే అన్నాడు. ఆయుధాలు వదిలి లొంగిపోయిన వారికి పునరావాసం కావాలి కానీ, ఇంక చర్చలు దేనికోసం. చర్చలు నిజానికి జల్, జంగల్, జమీన్, టెరిటోరియల్ అధికారం ఆదివాసుల కోసం జరగాలి.

చర్చలకు సానుకూల వాతావరణమంటే ప్రభుత్వమూ మావోయిస్టు పార్టీ ఏక కాలంలో నిర్దిష్ట కాలం కొరకు (ఆరు నెలలు అనుకుందాం) కాల్పుల విరమణ ప్రకటించాలి. పాటించాలి. మావోయిస్టు పార్టీపై నిషేధం ఎత్తివేయాలి. తలలపై వెలలు ప్రకటించడం రద్దు చేయాలి. అర్ధ సైనిక బలగాలు, డిఆర్జి, బస్తర్ రైఫిల్స్ వంటి రాష్ట్ర సాయుధ బలగాలు బ్యారక్స్ కు  పరిమితం కావాలి. మావోయిస్టులనుగానీ, ఆ పేరుతో ఆదివాసులను గానీ అరెస్టు చేయరాదు. గాలింపు చర్యలు నిలిపివేయాలి. ఇవన్నీ ఆంధప్రదేశ్ ప్రభుత్వం 2004 చర్చల కాలంలో పాటించింది.

ఇపుడాయా రాష్ట్రాలలోని ప్రభుత్వాలు, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఇవన్నీ పాటించాలి. కగార్ ఆపరేషన్  ఆఖరి యుద్ధం అనేది కేంద్ర బిజెపి ప్రభుత్వ నిర్ణయమే, ప్రతి మేజర్ ఆపరేషన్ సమయంలో కేంద్ర హోం మంత్రియే ప్రకటన చేస్తున్నాడు గనుక కేంద్ర ప్రభుత్వం తరఫున కేంద్ర హోం మంత్రి మాత్రమే కాకుండా  అంత ర్    రాష్ట్రీయ వ్యవహారాలు చూసే మంత్రిగా అమిత్?షాయే  కాల్పుల విరమణ పాటించి చర్చలకు మావోయిస్టు పార్టీని పిలవాలి. ఆ విషయం శాంతి చర్చలు కోరుత్నన్న ప్రతి ఒక్కరూ అంటున్నారు. ఛత్తీస్ ఘడ్  లో ఉన్నది బిజెపి ప్రభుత్వం కనుక కూడ కేంద్రంలో బిజెపి చర్చల విషయంలో అనుకూల వైఖరి ప్రకటిస్తే అది సహజంగానే ఛత్తీస్ ఘడ్ కు , బస్తర్ కు  వర్తిస్తుంది.

అయితే ఝార్ఖండ్ కైనా , బస్తర్ కైనా,  అంతే తూర్పు మధ్యభారతాల్లో ఆదివాసులు నివసించే అటవీ ప్రాంతాలకు రాజ్యాంగంలోని  ఐదవ షెడ్యూలు, పెసా, అటవీ పరిరక్షణ చట్టాలు, కూడ వర్తిస్తాయి కనుక చర్చల కాలంలో అవి పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఆదివాసులకు హామీ పడాల్సి ఉంటుంది. అంటే కాల్పుల విరమణ అమలులో ఉన్నంతకాలం – షెడ్యూల్డ్ ఏరియాలలో రోడ్డు నిర్మాణాలు, పోలీసు నాకాలు, నిర్మాణాలు, కంపెనీలకు అనుమతులు, నిర్మాణాలు కూడ స్థగితం చేయాలి. ఆ కాలమంతా ఏ కార్పొరేట్ కంపెనీతో కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పందాలు చేసుకోకూడదు. ఆ మేరకు ఇప్పటికే ఉన్న వాటిపై మావోయిస్టు పార్టీ దాడి చేయకూడదు. పోలీసులను, అప్రూవర్లు అని భావించిన వారిని చంపకూడదు. ఒక్క మాటలో ఆంధప్రదేశ్ ప్రభుత్వంతో చర్చల సందర్భంగా పాటించిన సంయమనం పాటించాలి.

*కాల్పుల విరమణ, సంభాషణ (చర్చల) కోసం విజ్ఞప్తి * ఏప్రిల్ 4, 2005 లో కొన్ని మినహాయింపులతో ఏకీభవిస్తూ, స్థూలంగా అవి చర్చించదగిన ప్రతిపాదనలుగా భావిస్తూ అందులోని ఒక అంశాన్ని ప్రస్తావిస్తాను. (ఆ డిమాండ్లలో ఆరింటితో సూత్రబద్దంగా ఏకీభవిస్తూ స్టేట్ ఆదివాసుల ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్న ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించి, ప్రజాస్వామిక హక్కులను దృఢంగా ప్రకటిస్తూ ఉద్యమించిన ఆదివాసులను, యాక్టివిస్టులను (క్రియాశీల కార్యకర్తలను) వెంటనే జైళ్ల నుంచి విడుదల చేయాలి. ఎందుకంటే వాళ్లు కూడ భాగస్వాములుగా (స్టేక్ హోల్డర్స్) గా ఈ చర్చలలో పాల్గొనడానికి వీలుకలగాలి (ఉదాహరణకు మూలవాసీ బచావో మంచ్ యాక్టివిస్టులను విడుదల చేయాలి)

శాంతి చర్చలు జరపాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఏప్రిల్ 4వ తేదీన దేశంలోని 54 ప్రజాసంస్థలు, 148 మంది మేధావులు విడుదల చేసిన ఉమ్మడి ప్రకటనలో ఇలా ఉంది. శాంతి చర్చలకు అవసరమైన ప్రతిపాదనలను ఈ ప్రకటన స్పష్టం చేసింది.

‘‘శాంతిని నెలకొల్పడానికి తీసుకున్న ప్రతి ముందడుగును మేము స్వాగతిస్తున్నాము. దేశం నలుమూలల నుండి మేము, శాంతి చర్చలు భారత రాజ్యాంగ పరిధిలో ఉండాలని మళ్లీ డిమాండ్ చేస్తున్నాము.

1. కాల్పుల విరమణకు అనుకూల వాతావరణాన్ని కల్పించడానికి ప్రభుత్వం ఆదివాసుల ప్రాంతాల్లో వెంటనే దాడులను ఆపివేయాలి.

2.  కాల్పుల విరమణకు అనుకూల వాతావరణాన్ని కల్పించడానికి మావోయిస్టులు రాజ్యం పట్ల మొత్తంగా శతృత్వ వైఖరిని విడనాడాలి.

3. ప్రభుత్వమూ సిపిఐ (మావోయిస్టు)ల మధ్య చర్చ జరగాలి.

4. ప్రభావిత ప్రాంతాలకు పౌర సంఘాలు, మీడియా స్వేచ్ఛగా వెళ్ళే వీలు కల్పించాలి.                                 

 5. ప్రజల జీవనావసరాలు రాజ్యాంగ హక్కుల గురించి అత్యవసరంగా పట్టించుకోవాలి

6. ఆదివాసీలకు వ్యతిరేకమైన రాజ్య విధానాలతో విభేదించి, తమ ప్రజాస్వామ్య హక్కులను నొక్కి చెప్పినందుకు జైలు శిక్ష అనుభవిస్తున్న ఆదివాసీలను, ఇతర కార్యకర్తలను రాజ్యం వెంటనే విడుదల చేయాలిబీ తద్వారా వారు చర్చలలో పాల్గొని ఈ సంభాషణలో సమాన భాగస్వాములుగా ఉంటారు. (ఉదాహరణకు మూలవాసి బచావో మంచ్ కార్యకర్తలు)

బస్తర్లో ప్రజాస్వామ్య హక్కుల పునరుద్ధరణకు, శాంతి చర్చలకు కాల్పుల విరమణ కేవలం మొదటి అడుగు మాత్రమే అని మేము దృఢంగా విశ్వసిస్తున్నాము. ఆ తరువాత ఆ ప్రాంతంలో శాశ్వతంగా సైనిక మోహరింపును రద్దు చేయడం (అన్ని సెక్యూరిటీ క్యాంపులను కూల్చివేయడంతో సహా)బీ సంబంధిత ఖైదీలందరినీ విడుదల చేయడంబీ అన్ని మానవ హక్కుల ఉల్లంఘనలకు పరిహారం చెల్లించడంబీ పెసా చట్టం, అటవీ హక్కుల చట్టం వంటి సంరక్షక చట్టాలను అమలు చేయడం, కొత్త గనులపై తాత్కాలిక నిషేధం, నిరసన తెలిపే హక్కును గౌరవించడం తదితర స్వేచ్ఛాయుతమైన, ప్రజాస్వామిక జీవనానికి సంబంధించిన ఇతర పరిస్థితులకు నిరంతర ప్రక్రియను అనుసరించాలి. రాజకీయ పార్టీలతో సహా అన్ని ప్రజాస్వామిక, రాజకీయ శక్తులు ఈ ప్రక్రియకు మద్దతు ఇవ్వాలని, రాజ్యం తన రాజ్యాంగపరమైన బాధ్యతలను నెరవేర్చేలా చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. రాజకీయ పార్టీలతో సహా అన్ని ప్రజాస్వామిక, రాజకీయ శక్తులు ఈ ప్రక్రియకు మద్దతు ఇవ్వాలని, రాజ్యం తన రాజ్యాంగపరమైన బాధ్యతలను నెరవేర్చేలా చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము’’

Leave a Reply