ప్రముఖ కవి విమల సారంగ అంతర్జాల పత్రికలో రాసిన కొత్త కవిత ‘కాల యవనికపై నిలిచి..’ ఈ కాలపు విషాదాన్ని గాఢంగా పలికింది. వేలాది, లక్షలాది మంది దు:ఖాన్ని ఆమె తన గొంతులో వినిపించారు. కవిగా విమల లోతైన చూపే ఆమె కవితా శిల్పం. అందులో తీవ్రమైన దు:ఖం, ఆర్తి ఉంటాయి. ఒక రకమైన అంతర్‌ దృష్టి ఉంటుంది. చాలా బరువైన, తాదాత్మ్య భావనలతో ఆమె కవిత్వాన్ని నిర్మిస్తారు. తాను ఏమనుకుంటున్నదీ సూటిగా చెప్పేస్తారు. తన వ్యక్తిత్వంలోంచి తన వైఖరులను కవిత్వం చేస్తారు. వస్తువు, దృక్పథం ప్రధానమైన కవిత్వంలో శిల్పం ఎలా ఉంటుందో విమలలో చూడవచ్చు. అది చాలా సహజమైనది. దాన్ని ఆమె ఎప్పటి నుంచో సాధన చేస్తున్నారు.

నలభై ఏళ్లకు పైబడిన విమల కవితా రచనలో ఇది మూడో దశ కావచ్చు. ఈ దశలో ఆమె కవిత్వ వస్తువే సందిగ్థత, నిరాశ. జీవితాన్ని, విప్లవాన్ని అర్థం చేసుకుంటూ ఆమె ఈ తీరం చేరుకున్నారు. దు:ఖాన్ని సరిగా కవిత్వీకరిస్తే అదొక గొప్ప ఆలంబన అవుతుంది. ఓదార్పు అవుతుంది. దు:ఖం నుంచి తెప్పరిల్లే వ్యూహంతో కవిత నడుస్తున్నదా? లేక దు:ఖంతో కుంగిపోయేలా ఉన్నదా? అనేది చాలా పెద్ద ప్రశ్న. కేవలం శిల్పం వైపు నుంచే ఈ చర్చ ఎంతైనా చేయవచ్చు. నిజానికి అది వస్తువుతో, దృక్పథంతో ముడిపడిన శిల్ప రహస్యం. ఇంత సంక్షుభిత ప్రపంచంలో దు:ఖానుభవం కలగనివారు ఉండరు. వ్యక్తిగత దు:ఖానికన్నా సామాజిక, విప్లవ దు:ఖం చాలా లోతైనది. అది మన అనుభవంలోకి ఎట్లా వస్తున్నది? సకల దు:ఖాలను దాటుకోడానికి మానవులు చేసే ప్రయత్నం చుట్టూ ఎందుకు ఇంత విషాదం ఆవరించి ఉన్నది? ఈ మన:స్థితి మన సృజనాత్మకతను ఎట్లా ప్రేరేపిస్తున్నది? అని ఎంతో ఆలోచించాల్సి ఉంది.

విమల ఒకప్పుడు దేనినైనా ఆశతో, మానవ ఆచరణ ప్రేరణతో, ఆటుపోట్ల మధ్యనే చరిత్రలో ఏది ఎట్లా పురోగమనించగలదో గుర్తించి కవిత్వం రాసేవారు. తన ప్రగాఢమైన విశ్వాసాలను మనుషుల స్పందనల్లో, పెనుగులాటలో వెతికి, అక్కడి నుంచి కవిత్వం చేసేవారు. ఇప్పుడూ విశ్వాసాల మెరుపు తీగలు అక్కడక్కడా కనిపించకపోవు. ఎన్ని అగాధాలనైనా దాటి చరిత్ర ముందుకుపోతుందనే ఆశా రేఖలూ కనిపించకపోవు. కానీ ప్రధానంగా నిరాశ, నిట్టూర్పు, అంతా అయిపోయిందనే వగపాటు, ఈ దారి ఇట్లా ముందుకు పోతుందా? అనే సందిగ్ధత ఆమె కవితా వస్తువు. నిజానికి ఇది వస్తువే కాదు. దృక్పథం కూడా. తన విశ్వాసాల నుంచే ఈ దశ కవితా రచన కూడా సాగుతోందని పాఠకులకు అనిపిస్తుంది. కానీ ఆ విశ్వాసాలను నిత్య పరివర్తనాశీలమైన, సంక్షుభితమైన వాస్తవ జగత్తులోంచి చూస్తున్నారా? అనే సందేహం కూడా పాఠకులకు కలుగుతుంది. సందిగ్థతకంటే లోతైన అంతర్మథనం వల్లనే వాస్తవం బోధపడుతుంది. లోటుపాట్లు తెలుస్తాయి. వాస్తవ పరిస్థితులతో విమర్శనాత్మక ఆశా దృష్టితో వ్యవహరించడం సాధ్యమవుతుంది.

విమల తొలి దశల కవిత్వం రాసిన రోజులకంటే ఇవాళ చాలా ఆశావహ ప్రపంచం నిర్మాణమవుతున్నది. ఆ రోజుల్లోని అవగాహనలు చాలా విస్తరించాయి. జీవితాన్ని అర్థం చేసుకొనే, మార్చాలనుకొనే ప్రయత్నాలు చాలా గాఢమయ్యాయి. విస్తరించాయి. ఆ రోజుల్లో చాలా సరళంగా, ప్రాథమికంగా, పైపైన సాగుతుండిన ప్రజా ఆచరణ చాలా సంక్లిష్టమైన మార్గంలోకి వెళ్లి విశాలమవుతున్న కాలం ఇది. కాల్పనికంగా కాకుండా గడ్డు వాస్తవికంగా జీవితాన్ని, సమాజాన్ని, విప్లవాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలో తెలుసుకోగల పరిణత దశ కనీసం ఇరవై ఏళ్లుగా సాగుతున్నది. అట్లాగే దీన్నంతా ముంచేసే ప్రతికూల శక్తులు ఎప్పటికంటే విజృంభిస్తున్నాయి. సర్వం ధ్వంసం చేయడానికి అన్ని వైపులా చుట్టుముడుతున్నాయి. నెత్తుటి చిత్తడితో అన్ని రంగాల్లో తీవ్ర సంఘర్షణ కొనసాగుతున్నది. ఇలాంటప్పుడు కదా.. నిజమైన జీవిత పరివర్తనా క్రమాలు రూపొందేదీ, నిలదొక్కుకొనేదీ, ముందుకుసాగేదీ.

ఇలాంటి కాలం సృజనకారులకు, మేధావులకు పెను సవాలు విసురుతుంది. ఈ గడ్డు వాస్తవాన్ని, మనం నడుస్తున్న మార్గాన్ని, అనేక పొరల్లో సాగే విధ్వంస నిర్మాణ క్రమాలను గ్రహించి, ఎత్తిపట్టి, వర్ణించగల, విశ్లేషించగల కాల్పనిక, సిద్ధాంత శక్తి ఉన్నదా? అనే ప్రశ్నలు ఎదురెక్కి వస్తాయి. మన జీవితకాలంలోని ఒకానొక దశలో అలవర్చుకున్న విశ్వాసాలతో ఇంత జటిలమైన వాస్తవాన్ని గ్రహించగలమా? దాని ఆనుపానులు పట్టుకోగలమా? దానికి సరైన అర్థాలు సమకూర్చగలమా?

ఈ పనిలో ఎటు మొగ్గినా మిగిలేది ఎడతెగని సందిగ్ధతే. ఎన్నటికీ తిరిగి తేలని నిరాశే. ముప్పై నలభై ఏళ్ల కింద మనం చాలా అలవోకగా కొన్ని విశ్వాసాలను ప్రకటించుకొని ఉండవచ్చు. దాని కోసం ప్రాణం బలిపెట్టేందుకు కూడా సిద్ధమై రణరంగంలో దూకి ఉండవచ్చు. కానీ ఆ విశ్వాసాల కోణం ఒక్కటే వాస్తవికతను గ్రహించగల విమర్శనాత్మకతను అందిస్తుందన్న భరోసా ఏమీ లేదు.

ఈ దశ విమల కవిత్వంలో ఈ ఛాయలు బలంగా ఉన్నాయి. దానికి సరైన ఉదాహరణ ‘కాలయవనికపై నిలబడి..’ అనే ఈ కవిత. ఈ దశ విప్లవోద్యమ సంక్షోభ సందర్భంలో ఆమె ఈ కవిత రాశారు. వందలాది మంది మరణాల పక్కన నిలబడి దు:ఖితగా విప్లవకారులతో మాట్లాడుతున్నారు. నేను, నా.. అనే స్వరంతో కవిత మొదలై మనం అనే సంభాషణగా మారింది. అందువల్ల కూడా ఈ కవిత తీవ్రమైన భావోద్వేగాలను పలికింది. ఈ మానవ హననం పట్ల అంతులేని ఆర్తి ఉన్నట్లే, విప్లవోద్యమ పంథాపట్ల అనుమానం కూడా ఉన్నది. ఇది అధర్మ యుద్ధమని, శతృవు దారుణమైన హింసకు పాల్పడుతున్నాడని అంటూనే, ‘ఇప్పుడిక మరణ సదృశ దారులు తప్ప మిగలని కారడవులు..’ అని కవిత మొదలవుతుంది. నలభై ఏళ్ల కింద విమల అడవిని కారడవిగా భావించలేదు. ‘అడవి ఉప్పొంగిన రాత్రి’ అని కారు చీకటిలో కూడా అడవి ఉప్పొంగిన సౌందర్యాన్ని, ఉద్విగ్నతను చిత్రించారు. అందులోని భవిష్యత్‌ అశను అద్భుతంగా నిర్మించారు. నిజానికి అప్పుడు కూడా అడవుల్లో నెత్తురుటేరులు పారాయి. ఈ దశ విప్లవోద్యమంతో పోల్చితే అంతక ముందు దశల్లోనే ఇంతకంటే అనేక రెట్లు ఎక్కువ మంది విప్లవకారులు, సాధారణ ప్రజలు క్రూరంగా హత్యకు గురయ్యారు. అప్పటి కంటే చాలా భిన్నమైన దశ ఇప్పుడు నడుస్తున్న మాట నిజమే. శతృవు ప్రకటించినట్లు అంతిమ యుద్ధ తీవ్రతను చూస్తున్నాం. విమల కవిత మీద ఈ ప్రతిస్పందన రాస్తుండగా.. దండకారణ్యంలో మరో ముప్పై మందిని చంపేశారనే వార్తలు వస్తున్నాయి. ఈ విషాద స్థితిని ‘కారడవుల్లోని దారి మరణ సదృశమైంద’ని విమల రాశారు.

ఈ కవితలో చాలా విరివిగా వచ్చిన పదం దారి, లేదా దారిని సూచించే ఇతర పదాలు. అట్లాగే నడక, చలనంలాంటి పదాలు. ఇవన్నీ విప్లవ పంథాను సూచిస్తున్నాయి. విప్లవ ప్రజా యుద్ధాన్ని నిర్మూలించడానికి కార్పొరేట్‌ హిందుత్వ యుద్ధం సాగుతున్న ఈ సందర్భంలోని మానవ విషాదానికి విప్లవ పంథా కారణమా? లేక ప్రతీఘాతుక యుద్ధం కారణమా? విప్లవకారుల ఆచరణ వల్ల ఈ నష్టం జరుగుతున్నదా? లేక విప్లవ మార్గాన్ని ధ్వంసం చేయాలనుకుంటున్న ఫాసిస్టుల వల్ల ఇట్లా జరుగుతున్నదా? ఈ ప్రశ్నలకు ఎవరినో ఒప్పించేందుకు సమాధానాలు వెతకాల్సిన పని లేదు. నొప్పించేలా వాదించాల్సిన అవసరం అసలే లేదు.

‘నొప్పించాలనో, ఒప్పించాలనో కాదు
ఈ విషాద పునరావృతాల
చిక్కుముడులు పడిన దారులను
పరిహరించజాలని ఎడల ఎక్కడా
ఏ సరికొత్త చరిత్రా ప్రారంభ కాదన్న
సత్యాన్ని ఎలా అర్థమయ్యేలా చెప్పను ?
ఎవరికి చెప్పను?
ఎవరికి వినిపిస్తుంది హృదయ ఘోష?’

దారుణమైన విషాదాలు పునరావృతమవుతున్న మాట నిజమే. దారి చిక్కుముళ్లు పడటం వల్ల ఇట్లా జరుగుతుందనుకోవాలా? ఎవరికివారు తీర్చుకోదగిన సందేహం ఇది. ఈ ప్రతీఘాతుక యుద్ధాన్ని అధిగమించాల్సిందే. అప్పుడే చరిత్ర ముందుకు సాగుతుంది. అది సరికొత్త ముందంజ అవుతుంది. కానీ దారే సమస్యాత్మకం కావడం వల్ల ఈ నష్టం జరుగుతోందని విమల అనుకుంటున్నారు. దాన్ని ఎలా చెప్పాలో తెలియని సందిగ్ధానికి గురయ్యారు. ఈ కవితలోని ఫోకస్‌ పాయింట్‌ ఇదే. ఈ యుద్ధంలో జరుగుతున్న విషాదాలతోపాటు ఈ సందేహం, సందిగ్థత కూడా ఆమెను తీవ్రమైన వేదనకు గురి చేస్తున్నాయి. అందువల్ల ఇక ముందుకు పోవడం కష్టం అనే నిర్ధారణకు వచ్చారు. చివరికి ‘కరిగిపోని కాసిన్ని జ్ఞాపకాలు కూడా కొన్నాళ్ళకి నిశ్శబ్దంగా మరణిస్తాయి..’ అనే భయానికి లోనయ్యారు. నిజమే. ఫాసిస్టు` విప్లవ శక్తుల మధ్య యుద్ధం తీవ్రదశకు చేరుకున్నాక ప్రజలు చేసే నిర్మాణానికంటే పాలకులు చేసే విధ్వంసానిదే పైచేయి కావచ్చు. అప్పుడు గత జ్ఞాపకాలు కూడా తుడిచిపెట్టుకపోయే మహా విషాదం దాపురించవచ్చు. అయితే ఏం చేయాలి? ఈ ప్రశ్న వేసుకోని ఉద్యమాలేవీ ఉండవు. బహుశా ప్రతి కీలక దశలో ఇది ఎదురవుతుంది. అది పూర్తిగా ఆచరణ సంబంధమైనది. ఊహాత్మకంగా తిరిగి తిరిగి లేస్తుందనే మాట కేవల విశ్వాసమే కావచ్చు. విమల ఆలాంటి విశ్వాసం కోల్పోయినట్లు అనిపించదు. అందుకే..

‘మహా సముద్రాలపై కలల వేటకు
తమ తెప్పతో చెప్పరానంత తెగువతో
ఎగసి దూకి స్వారీ చేసిన వాళ్లే
ఆ అలల చివర సీతాకోకచిలుకలై నిలిచి ఉంటారని
ఎవరూ సంచరించని చోట కొత్త దారులను వేస్తూ
దుర్గమారణ్యాల్లో తిరిగిన వాళ్ళ మాటలే మళ్ళీ మళ్ళీ అక్కడ చిగురిస్తూ ఆకుపచ్చ సముద్రాలై మిగిలి ఉంటాయని విన్నాను..’ అంటారు. బహుశా ఒకప్పుడు విన్న ఇలాంటి మాటను పట్టుకొని ముందుకుపోవడం ఎవ్వరికీ సాధ్యం కాదు. అదొక విశ్వాస పునశ్చరణ మాత్రమే.

‘ఓడిపోతామని తెలిసీ యుద్ధం చేసే వాళ్ళు
ఎవరో ఒకరు ఉండాలన్న నిజాన్ని
ఎవరైనా మనకి చెప్పవచ్చు
నిజంగా అవి ఎంతో అద్భుతమైన మాటలు..’ అంటారు. అలాంటి మాటల వల్ల నిబ్బరం కలుగుతుందేమోగాని, దార్శనికత ఉండదు. అసలు ఓడిపోతామని తెలిసీ ఈ యుద్ధాన్ని ఆరంభించారా? ప్రజలు గెలిచినదానికంటే ఓడిన సందర్భాలే చరిత్రలో ఎక్కువ. కానీ ‘కాలం కాని కాలపు కరకు దారులలో..’ ప్రయాణించారని చెప్పలేం. గెలుస్తామనే ప్రజలు యుద్ధానికి దిగారనడానికి కూడా చరిత్రలో ఆధారాలు కోకొల్లలు.

ఈ చారిత్రక వాస్తవాన్ని నైతిక అర్హతల మీద ఆధారపడి చెప్పాలనుకోవచ్చునా? అట్లా అయితే న్యాయమే గెలుస్తుందనే కనీస విశ్వాస ప్రకటనైనా చేయగలమా? దాన్ని మన వ్యక్తిత్వంలో భాగం చేసుకోగలమా? మనుషులు తమ వ్యక్తిగత పరిమితులను గ్రహించడం చాలా ముఖ్యం. లేకపోతే ఒట్టి బూకరింపులకు దిగే ప్రమాదం ఉంటుంది. అది ఇతరులకు తెలుస్తూ ఉంటుంది. ప్రజలు, వాళ్లకు నాయకత్వం వహిస్తున్న విప్లవకారులు గెలుపు కోసమే యుద్ధంలోకి దిగుతారనే వాస్తవానికి, మన నైతిక పరిమితులకు నేరుగా ఎట్లాంటి సంబంధమూ ఉండదు. ‘మీరు అట్లా పోరాడుతూనే ఉండాల’ని మనం చెప్పినా చెప్పకపోయినా వాళ్లు పోరాడుతూనే ఉంటారు. మన ప్రోత్సాహాలతో, శతృవు కల్పించే అవరోధాలతో నిమిత్తం లేని చారిత్రక సంఘర్షణగా ప్రజా ఆచరణను చూస్తామా? లేదా? అనేదే చాలా ముఖ్యం. నేను పోరాడలేనప్పుడు ప్రజలను పోరాడమని చెప్పే అర్హత లేదనే నైతిక చట్రం దగ్గరికి ఈ కవిత చేరుకున్నది. ఇదే నిజమైతే ప్రాణాంతక పోరాటాలనే కాదు. మరే ఇతర పోరాటాలనూ ఎవ్వరూ కోరుకోడానికి లేదు. ఎన్జీవోల తరహా మినహాయిస్తే ప్రతి పోరాటంలో ఏదో ఒక అసౌకర్యం ఉంటుంది. స్వల్పంగా పొందడానికి కూడా ఎంతో కొంత వదులుకోవాల్సి వస్తుంది. అప్పుడు యథాతధ స్థితిలో సర్దుకపోవాల్సి వస్తుందేమో ఆలోచించాలి.

‘అట్లా నిలబడ లేనప్పుడు,
నన్ను నేను, నా పరిమితుల్ని
నేను అర్థం చేసుకోలేనప్పుడు
వడ్డున నిలిచి, నువ్వు అట్లా నిలబడాల్సిందే
అని నీకు చెప్పేందుకు నేను సిగ్గుపడతాను
నా నైతిక అనర్హత నన్ను చూసి వెక్కిరిస్తుంది

కోల్పోవడం అంటే
ఏమిటో తెలిసిన నేను అమరత్వం రమణీయత గురించి
పెదవుల చివర నుండి ఎన్నడూ
అలవోకగా పాడలేను..’

సామాజిక నష్టాల గురించేగాక, వ్యక్తిగత జీవితంలో కూడా కోల్పోవడం ఎంత తీరని వెలితో తెలిసిన విమల తన కవితా వ్యక్తీకరణకు ఒక నైతిక సరిహద్దును ఎంచుకోవడం గౌరవనీయమే. ఇది ఆమె ఎరుకను తెలియజేస్తుంది. విప్లవంలో అనేక విజయాలున్నా, అందులోని మరణానుభవం ఎల్లప్పుడూ కుదిపివేస్తూనే ఉంటుంది. దాని వల్ల కలిగే చూపులో విప్లవం మరింత గాఢంగా, సమగ్రంగా కనిపిస్తుంది. అమరత్వం రమణీయమనే కాల్పనిక భావన నిజానికి ఒక చారిత్రక శక్తి, ఒక పక్క మరణం వల్ల కలిగే దు:ఖమూ, మరో పక్క చారిత్రక ప్రపంచంలో అది అనివార్యం కావడం అనే రెండు విషాదాలను అధిగమించడానికి, దాన్ని అమరత్వమని, అది రమణీయమని విప్లవ కవి గీతాలాపన చేశారు. దానికి విమలతో సహా ఎందరెందరో తమ తడి గొంతును చేర్చారు. ఇవాళ దాన్ని నైతికత దగ్గరికి తీసుకొచ్చి చూడ్డానికి కారణమేమిటో ఆలోచించాలి. బహుశా ఇంత భీకర యుద్ధంలో ప్రజలు శవాల కుప్పలుగా మారుతోంటే ఏమీ చేయలేని నిస్సహాయత కారణం కావచ్చు. పైగా ఈ దారి చిక్కుముళ్లు పడ్డడనే అభిప్రాయం ఉన్నందు వల్ల ఈ మారణకాండను చూస్తూ నిస్సహాయత ప్రకటించాల్సి వస్తుంది.

అందుకే చాలా ఆర్దృంగా విమల …

‘రెండు చేతులు చాచి
మిమ్మల్ని కౌగిలించుకోవాలని ఉంటుంది
ఇక చాలు వచ్చేయాలని
మరో ప్రారంభ ప్రారంభాన్ని
మరో సరికొత్త ప్రయత్నాన్ని
మరి ఏదైనా ప్రయోగాన్ని
చేద్దామా అని పిలవాలని ఉంటుంది..’ అంటారు.

విప్లవ పంథా తప్పు కాబట్టి, ‘అనేక ఏళ్లుగా అక్కడొక పక్షి ఆకాశంలోకి ఎగురుతుందేమో అని ఎంతో ఆశగా చూస్తే రెక్కలు విరుగుతున్న పక్షి ఈకలు అనేక మార్లు రాలి పడటం’ చూసి తాళలేక..ఇక చాలు వచ్చేయమని పిలవాలనుకుంటారు. విప్లవానికి ఇంకేదైనా ప్రయోగం చేయవచ్చేమో ఆలోచిద్దామని అంటారు.

‘వెనక్కి ఒక అడుగు వేయడం
వెన్నుచూపడం కాదనీ
కొన్ని మార్లు అది మన పాదముద్రలని
పదిల పరచటం అనీ
పరుగు పందెంలో ఆగి అలసట తీర్చుకొని
మళ్లీ పరిగెత్తడమనీ చెప్పాలని వుంటుంది

మెల్లిగా మూసుకుపోతున్న దారుల వెంట
మృత్యువును ముద్దు పెట్టుకునేందుకు
ఇప్పుడు నేను అటే వెళ్ళమని చెప్పలేను..’

ఒకడుగు వెనక్కి వేయడం ఎన్నడూ వెన్ను చూపడం కాదు. ఒకడుగే కాదు. చాలా అడుగులు కూడా వెనక్కి వేయాల్సి వస్తుంది. అయితే ఆ ఆడుగు ఏమిటి? ఆ సరికొత్త ప్రయోగం ఏమిటి? విప్లవంలో అలసట కూడా కలుగుతుంది. దానికీ, దారి తప్పనుకోడానికీ తేడా ఉంది. ఏ అర్థంలో అయినా సరే, విప్లవకారులు ఒక అడుగు వెనక్కి వేస్తే, ఒక క్షణం నిలబడితే ఈ యుద్ధం ఆగుతుందా? ఇందులో ప్రజల శక్తి ఎంత తక్కువైనా కావచ్చు, ఒక్క క్షణం వెనకడుగు వేస్తే హింస ఇంకెంత ఎక్కువ జరుగుతుందో ఊహించుకోవచ్చు. ప్రయాణాన్ని ఆపి సమాలోచనకు అవకాశం ఉంటుందా? ఇంకో ప్రయోగం చేద్దామని ఇంటికి వచ్చేస్తే ఈ హింస తీరిపోతుందా? విప్లవాన్ని మొత్తంగా ఆపేయమని చెప్పడం విమల ఉద్దేశం కాకపోవచ్చు, ఈ మార్గంలో కాకుండా ఇంకో సరికొత్త ఆరంభం కావాలని కోరుకోవచ్చు. అదైనా విప్లవ మార్గమైతే శతృవు చూస్తూ ఊరుకుంటాడా? మధ్య భారతదేశంలో విప్లవోద్యమాన్ని అణచివేయడానికి 12 లక్షల సైన్యాన్ని వెచ్చించినట్లు ప్రభుత్వ లెక్కల ప్రకారమే తెలుస్తోంది. ఇంత పెద్ద మోహరింపు మధ్యనే విశ్రాంతి, కొత్త ఆలోచనలు, కొత్త ప్రయోగాలు చేయవలసి వస్తుంది. యుద్ధాన్ని అధిగమించగల ప్రతి వ్యూహాలను పన్నవలసి వస్తుంది. ‘మృత్యువును ముద్దుపెట్టుకోడానికి అటే వెళ్లమని’ చెప్పడంలోని నైతిక సందిగ్ధత కంటే, బైటి నుంచి ‘ఇక చాలు.. వచ్చేమని’ చెప్పడం మరింత నైతిక ప్రశ్నను లేవదీస్తుందనుకుంటా. అక్కడ విప్లవకారులే కాదు. ప్రజలు ఉన్నారు. వాళ్లకు ఏం చెప్పగలం? మూడు తరాల విప్లవ యుద్ధంలో అనేక ఆటుపోట్ల మధ్యనే ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ప్రజలను నడిపిస్తున్న నాయకత్వానికి ఈ యుద్ధం గురించి ఏమి చెప్పగలం? అలసట తీర్చుకోడానికైనా ఆగమని బైటి నుంచి చెప్పగలమా? మైదాన ప్రాంతాల్లోంచి విప్లవంలోకి వెళ్లినవాళ్లకైతే, కొందరికైనా ఇక్కడ ఇళ్లూ వాకిళ్లూ ఉండొచ్చు. కానీ సువిశాల అటవీ ప్రాంతంలోని విప్లవకారులు యుద్ధాన్ని ఆపేసి ఎక్కడికి వస్తారు? ఎక్కడ విశ్రాంతి తీసుకుంటారు? సాధారణ ఆదివాసులందరూ అడవిని వదిలి ఎక్కడికి వచ్చి జీవిస్తారు? కార్పొరేట్ శక్తులు సువిశాల అటవీ ప్రాంతం నుంచి ఆదివాసులను బైటికి తోసేయాలని అనుకుంటున్నారు. అందుకోసమే యుద్ధానికి దిగారు. అక్కడే కాదు , దేశమంతా ఇదే పరిస్థితి . మరి ప్రజలు ఏం చేయాలి ? తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటాన్ని ఆపేశాక జరిగిన హింస ఉద్యమంలో జరిగిన హింసకంటే ఎన్ని రెట్లు ఎక్కువ? మనందరికీ తెలుసు.

నిజానికి ఏ అర్థంలో అయినా, ఈ యుద్ధం నుంచి వచ్చేమని చెప్పాల్సింది విప్లవకారులకు కాదు. దండకారణ్యాన్ని కబళించడానికి చూస్తున్న కార్పొరేట్‌ శక్తులను, దేశ సరిహద్దులో ఉండాల్సిన భారత సైనికులను. ఆధునిక ‘భారతదేశ’ చరిత్రలో కశ్మీర్‌ తర్వాత రాజ్యం నేరుగా తన భూభాగంలోని ప్రజలపై భూ, గగన మార్గాల్లో ఇంత భీకర యుద్ధం చేస్తున్నది ఇప్పుడే కావచ్చు. మనందరం ఈ శక్తులను బైటికి రమ్మని ఒత్తిడి తేవాలి. యుద్ధం ఇంత తీవ్రం కావడానికి కారణం కార్పొరేట్‌, హిందుత్వ ఫాసిజం తీవ్రరూపం ధరించడం. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం పూర్తిస్థాయిలో నియంతృత్వంగా మారడం. యాభై ఏళ్ల కింద విప్లవోద్యమం ఈ వ్యవస్థ గురించి చెప్పిన మాటలు పూర్తి నిజమవుతున్న తరుణంలో ఈ యుద్ధం విరుచుకపడిరది. ఫాసిజంతో సహా ఈ పరిణామాలేవీ అనూహ్యం కాదు. వాటిని ఎదుర్కోగల శక్తి ఇప్పటికిప్పుడు ప్రజలకు, విప్లవోద్యమానికి లేకపోవచ్చు. అందుకే తీవ్ర నష్టం జరుగుతూ ఉండవచ్చు. ఇంకో పక్క నుంచి చూస్తే ఈ సంఘర్షణ ఇంత తీవ్రరూపం దాల్చడం కూడా విప్లవ పంథా సరైనదే అని రుజువు చేస్తున్నది. దశాబ్దాలపాటు అనేక సామాజిక, సాంస్కృతిక ప్రయోగాల వల్ల భిన్న సమూహాలను విప్లవోద్యమం ముట్టుకున్నది. తనలో భాగం చేసుకున్నది. అనేక పోరాట రూపాలను తీర్చిదిద్దింది. ఏ రూపంలో అయినా సరే, ఈ దేశ ప్రజల ధిక్కారం, పోరాటం అనే భావనల వెనుక విప్లవోద్యమ ప్రేరణ సుదూరంగా అయినా ఉన్నది. ఎంత రక్తపాతం జరిగినా లొంగని శక్తిగా రుజువు చేసుకున్నది. ఆధిపత్య దోపిడీ వర్గాల ప్రయోజనాలు కాపాడటానికి సంపూర్ణంగా విప్లవోద్యమాన్ని నిర్మూలించాలని ప్రభుత్వం అనేకోక తప్పని ప్రత్యర్థిగా ఎదిగింది. ఈ కవిత చెప్పినట్లు ‘దారి మూసుకపోలేదు’. అది ఈ దేశ ప్రజల విముక్తి మార్గమని పాలకులకు బాగా తెలుసు. కాబట్టే దాన్ని మూసేద్దామని అనుకుంటున్నారు. అందుకే ఇంత హింసకు పాల్పడుతున్నారు. అంత మాత్రాన విప్లవోద్యమం మార్చుకోవాల్సినవి, నేర్చుకోవలసినవి లేవని కాదు. ఈ కవితలో ఒక చోట..

‘అటువైపు వెళ్లిన వాళ్లకి కూడా
వాళ్ళ దారి అనేకమార్లు
అంచనాలు తప్పి మారిందని
అట్లా మార్చుకోవడం
వాళ్లకి ఎన్నో మార్లు అనివార్యమైందని తెలియనిదేమీ కాదు..’ రాశారు. అంచనాలు తప్పిన సందర్భాలు ఉండవచ్చు. అంత మాత్రాన విప్లవం చేయలేమనే అంచనాకు రావచ్చునా?

‘నడచిన, నడుస్తున్న దారి ఎక్కడ ఆగిపోయిందో
ఏ ఏ బండ రాళ్లు అడ్డం పడి
మూసుకుపోయిందో
ఏ అపసవ్య దారుల్లోకి, ఆత్మాహుతి నిప్పుల లోయలోకి,
ఈ నడక వెళుతుందో అన్న
మీమాంస, స్వీయ పరిశీలన నేరం కానే కాదు ఎన్నడూ’ అన్నారు విమల. ఆమె సుదీర్ఘకాలం విప్లవోద్యమంలో ఉన్నందు వల్ల ‘ఇప్పుడు ఇదంతా ఎట్లా ముగియ నుందో కొంచెం కొంచెం తెలుస్తూనే ఉంటుంది’ అని కూడా అన్నారు. ఇట్లా కవిత చివరి భాగమంతా విప్లవోద్యమానికి ఈ ‘దారి’ సరికాదని చెప్పడానికి చాలా ఆత్మీయ ప్రయత్నం చేశారు.

జంకు ఎందుకు?
గడచిన అనేకానేక పోరాటాలలో
ఒక అడుగు ముందుకు, రెండు అడుగులు వెనక్కు
రెండు అడుగులు ముందుకు,
ఒక అడుగు వెనక్కు వేయడం కూడా ఉందన్న
జ్ఞానానుభవం తెలియనిది ఎవరికి?
ఏమిచేయాలి? అన్న ప్రశ్న
తలఎత్తని పొరాటం ఏది? అన్నారు.

ఇదంతా చివరికి ‘కొండను తవ్వుతూనే ఉన్న ముసలి మూర్ఖుడికి కూడా తెలుసు.. నిజానికి ఎవరి కన్నీటి చుక్కలు.. బొబ్బలెక్కిన అతని అరచేతులకి లేపనం కాజాలవని..సుత్తిని, కొడవలిని మళ్ళీ పదును పెట్టేందు కైనా.. అతడు క్షణకాలం ఆగడం వెన్ను చూపటం కాదు..’ అని చాలా దు:ఖంగా రాశారు. క్షణకాలం ఆగే వ్యవథి లేకపోయినా సుత్తీ కొడవలికి పదును పెట్టుకోవాల్సిందే. సిద్ధాంతాన్ని మరింత సమగ్రం చేసుకోవాల్సిందే. ఈ యుద్ధానికి రక్షణగా చుట్టూ అనేక రూపాల యుద్ధ క్షేత్రాలను నిర్మించుకోవాల్సిందే. కుదింపు, విస్తరణ మధ్య అంతిమంగా విస్తరణకు అనేక జీవన సమూహాలను విప్లవ స్థావరాలుగా మార్చుకోవాల్సిందే. కానీ విప్లవం.. ముసలి మూర్ఖుడు కొండను తవ్వడం వంటి పని కాదు. రోజుకు ఇంత కొండ తొలిచేస్తే దారి పడుతుందనే ఆశావాదం కాదు. అది సృజనాత్మక ఆచరణ. చాలా మంది అనుకుంటున్నట్లు అడవిలో ఉండిపోవాలని విప్లవోద్యమం ఎన్నడూ అనేకోలేదు. అడవిలోకంటే గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోనే వందలాది ప్రయోగాలు చేసింది. అద్భుత విజయాలు కూడా సాధించింది. ఇరవై ఏళ్లుగా సాగుతున్న చుట్టుముట్టు యుద్ధంలో ఎంత నష్టం జరిగినా, అలాంటి నిత్య ప్రయోగాలే విస్తరణకు భరోసా. వైవిధ్యభరితమైన ప్రజా సమూహాలన్నీ చేయగల వివిధ రూపాల పోరాటాలను నిర్మించగల పంథా అని పదే పదే రుజువు అవుతున్నది. ప్రత్యామ్నాయంగా నిలిచింది . దాన్ని దెబ్బతీయడానికే ఈ ఫాసిస్టు యుద్ధం విరుచుకుపడింది. ఇందులో జరుగుతున్న రక్తపాతం వల్ల ఈ కవిత చివర్లో అన్నట్లు అందరికి ‘ఎంతో దుఃఖ దుఃఖంగా ఉంది’. అయితే ఈ దు:ఖం మనకు ఆలంబన అవుతుందా? సందిగ్థంలోకి తోసి వేస్తుందా? అనే ప్రశ్న రేకెత్తించే శక్తివంతమైన కవిత ఇది.

Leave a Reply