మానవ సమాజం ఉత్పాదక శక్తులను ఎంతగా అభివృద్ధి చేసినా, ఎన్ని శాస్త్రీయ ఆవిష్కరణలు చేసినా, ఎన్ని సాంకేతిక నైపుణ్యాలు సాధించినా, ఎన్ని అధునాతన పరికరాలను తయారు చేసినా, అది నాగరికత  ప్రాథమిక పాఠాలను కూడా నేర్చుకోలేదని వాస్తవాలు గొంతు చించుకొని చెబుతున్నాయి. సభ్యత అనే ఈ ప్రాథమిక పాఠాన్ని ఆదివాసీ  సమాజం మాత్రమే నేర్పించగలదు.

 ఆదివాసేతర నాగరికత, ఆధునిక సమాజం ఆదివాసీల నుండి నేర్చుకోవలసిన మొదటి పాఠం ఏమిటంటే, మనిషి ప్రకృతిని జయించాడని లేదా జయించగలడు అనే ఆలోచనను ఎప్పటికీ వదిలివేయాలి. ప్రకృతి నియమాలను తెలుసుకోవడం ద్వారా మనిషి ప్రకృతిని జయించగలడు అనేది మనం ఆధునిక యుగం లేదా సైన్స్ యుగం అని పిలుస్తున్న యుగపు ప్రాథమిక ఆలోచన. 

ఈ ఆలోచన మానవాళిని భూమి, భూమితో సహా ఇతర జీవుల ఉనికికి ముప్పుగా మారే స్థాయికి తీసుకువెళ్లింది. ఈ ప్రమాదం సుదూర విషయం కాదు, ప్రపంచం మొత్తం పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పుల భారాన్ని ఎదుర్కొంటోంది. ప్రపంచం ఏకకాలంలో వర్షాలు, కరువు వినాశనాన్ని ఎదుర్కొంటోంది. ఉష్ణోగ్రతల పెరుగుదల కారణంగా సముద్ర మట్టం పెరగడం వల్ల సముద్ర తీరానికి సమీపంలోని కొన్ని నివాస ప్రాంతాలు మునిగిపోయాయి లేదా మునిగిపోయే అంచున ఉన్నాయి. కొన్ని తీరప్రాంత దేశాల ఉనికి ప్రమాదంలో పడింది. ఉత్పత్తి, వినియోగపు ఆధునిక జీవనశైలి చెరువులు, సరస్సులు, నదులు, మహాసముద్రాలను మురికి, వ్యర్థాలతో నింపింది. ప్రపంచంలోని అత్యధిక ప్రాంతాల్లో శ్వాస తీసుకోవడం కష్టంగా మారేంత స్థాయిలో గాలి కలుషితమైంది. ఆహార పదార్థాలు పెద్ద ఎత్తున కలుషితమయ్యాయి.

ఈ పరిస్థితి నుంచి ప్రపంచాన్ని రక్షించాలంటే ఆదివాసీనుల నుంచి పాఠం నేర్చుకోవాలి. ప్రకృతి పట్ల వారి దృక్పథం, దానితో సాంగత్యాన్ని కొనసాగించే మార్గాలను మనం నేర్చుకోవాలి.

ఆదివాసీల నుండి ‘ఆధునిక’, ‘నాగరిక’ అని పిలవబడే ఆదివాసేతరులు ప్రకృతి గురించి నేర్చుకోవలసిన రెండవ పాఠం , మీరు ప్రకృతిలో అంతర్భాగమే తప్ప, దాని యజమాని కాదు. మీరు ప్రకృతిని జయించే విధానాన్ని పూర్తిగా వదిలివేయవలసి ఉంటుంది. ప్రకృతిపై ఆధిపత్యాన్ని స్థాపించగలమనే అహాన్ని వదులుకోవాలి. ఇది ఆధునిక నాగరికత అని పిలవబడే చోదక శక్తిగా ఉంది. ఇప్పటికీ ఉంది. ఆదివాసీ సముదాయం తనను తాను ప్రకృతిలో భాగంగా చూసుకుంటుంది. దానిని జయించడం గురించి ఆలోచించదు. ప్రకృతి సృజనాత్మక, విధ్వంసక శక్తులు రెండింటిపట్ల కూడా గౌరవాన్ని కలిగి ఉంటుంది. అలాగే భక్తిని కూడా కలిగి వుంటుంది.  ఎందుకంటే అది తమని పోషించే, దుస్తులను, ఆశ్రయాన్ని కల్పించే ప్రకృతికి నమస్కరిస్తుంది. ఈ కోణంలో ప్రకృతి ఆరాధకులు.

ఆదివాసేతర సమాజం ఆదివాసీలనుండి ప్రకృతి గురించి నేర్చుకోవాల్సిన మూడవ పాఠం – ప్రకృతి నుండి అత్యంత అవసరమైనంత మాత్రమే తీసుకోవాలి. ప్రకృతిని ఎప్పుడూ అనవసరంగా దోపిడీ చేయవద్దు. ఆదివాసీనులు తమ మనుగడకు అవసరమైనంత మాత్రమే ప్రకృతి నుండి తీసుకుంటారు. పెద్ద ఎత్తున సేకరణ కోసం ప్రకృతిని ఎప్పుడూ దోపిడీ చేయరు. ఆదివాసీలు ప్రకృతి నుండి ఏది వాడినా, వినియోగించినా దానిని ప్రకృతి ప్రసాదించిన వరంగానే స్వీకరిస్తారు. ప్రకృతి నుండి ఏదైనా తీసుకునే ముందు, దాని పట్ల గౌరవం చూపిస్తారు. ఆదివాసీల అనేక పండుగలు, పబ్బాలు ప్రకృతి ఆధారంగానే ఉన్నాయి.

నేటి ఆధునిక పారిశ్రామిక సమాజంలో, ప్రతి సంవత్సరం ఉత్పత్తి చేసే ఉత్పత్తులు, వస్తువులలో ఎక్కువ భాగం అమ్ముడుపోని కారణంగా పాడైపోయి, పారేస్తారని మనందరికీ తెలుసు. ఎందుకంటే ఇక్కడ ఉత్పత్తి ప్రజల అవసరాలకు అనుగుణంగా కాకుండా లాభంకోసం జరుగుతుంది. ప్రపంచానికి ఎంత, ఏది కావాలి, ఎంత ఉత్పత్తి చేయాలి ఇవన్నీ ప్రణాళికాబద్ధంగా జరగవు. ఈ ఉత్పత్తులు సహజ వనరులను ఉపయోగించి తయారు చేస్తారు కాబట్టి, వాటి విధ్వంసం అంటే సహజ వనరులను అనవసరంగా నాశనం చేయడం. అత్యవసరమైనంత మాత్రమే ఉత్పత్తి చేయాలి అనేది ఆధునిక నాగరిక సమాజం ఆదివాసీల నుండి నేర్చుకోవాలి. భవిష్యత్తులో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవడానికి కూడా కొద్దిపాటి సేకరణ అవసరం. సేకరణ, లాభాపేక్ష ఆదివాసీల్లో కనిపించదు. అపారమైన లాభాల కోరిక, అపరిమితమైన సేకరణ భావన నేడు మానవాళికి అతిపెద్ద శత్రువులుగా మారాయి. ఆధునిక నాగరిక సమాజం ఈ సేకరణ, సంరక్షణ పాఠాన్ని ఆదివాసీనుల నుండి నేర్చుకోవాలి. బుద్ధుని అపరిగ్రహ బోధనకు ఆధారమైన జీవన విధానం ఇదే.

ఆదివాసీ ప్రకృతి ఆరాధకుడు. అతను ఎల్లప్పుడూ ప్రకృతిని పవిత్ర భావనతో చూస్తాడని అర్థం. అతను చెరువులు, సరస్సులు, నదులలోకి ప్రవేశించే ముందు, పర్వతం ఎక్కే ముందు లేదా చెట్టు ఎక్కే ముందు కూడా నమస్కరిస్తాడు. ఒక రకంగా అనుమతి తీసుకుంటాడు. పండు తీయడానికి ముందు కూడా ఒక రకమైన అనుమతి తీసుకుంటాడు. ప్రకృతి నుండి తీసుకున్న వాటి పట్ల కృతజ్ఞతా భావాన్ని వ్యక్తం చేస్తాడు. ప్రకృతి నుండి తీసుకోవడం తమ సహజ హక్కుగా లేదా ప్రత్యేక హక్కుగా ఆదివాసీలు పరిగణించరు. ఆధునిక నాగరిక సమాజం ప్రకృతిని ఏకపక్షంగా, మితిమీరిన దోపిడీని తన ప్రత్యేక హక్కుగా పరిగణిస్తుంది. దీనికి అభివృద్ధి అని పేరు పెట్టింది. ప్రకృతి విధ్వంసానికి పర్యాయపదంగా అభివృద్ధి రూపాంతరం చెందింది.

ఆధునిక నాగరికత ప్రజల నుండి సామూహికత, భాగస్వామ్య భావనను లాగేసుకుంది. ఇక్కడ ప్రతి వ్యక్తి ఇతరులతో పోటీ పడటం కనిపిస్తుంది. వ్యక్తిగత ఆసక్తిని నెరవేర్చుకోవడం అతిపెద్ద లక్ష్యం అయింది. ఒంటరితనం, ఏకాకితనం నేటి నాగరికత అతి పెద్ద లక్షణాలు. ప్రతి వ్యక్తి తన వ్యక్తిగత సుఖ దుఃఖాలలో మునిగిపోతాడు, ఇతరుల గురించి ఆలోచించడానికి, యితరుల కోసం జీవించడానికి సమయం ఉండదు. ఈ పరిస్థితి ప్రజలను మానసిక రోగులను చేసింది.

ఆధునిక నాగరికతలోని వ్యక్తివాద వ్యాధిని అధిగమించే పాఠాన్ని ఆదివాసీలు నేర్పించగలరు, నేర్చుకోవాలి కూడా.  ఆదివాసీలు సామూహిక, భాగస్వామ్య జీవితాన్ని విశ్వసించారు. ఆదివాసీ సమాజంలో ఒక యింట్లో ధాన్యాగారంలో నిండా ధాన్యం వున్నప్పుడు పక్కింటి కుటుంబం ఆకలితో నిద్రపోవడం అనేది ఊహించడం కష్టం. వికలాంగులు, రోగులు, వృద్ధులులాంటి వేటకు వెళ్లలేని కుటుంబాలకు వేటకు వెళ్ళిన  ఆదివాసీలు తాము తెచ్చిన వేటలో కొంత భాగాన్ని ఇవ్వడమనే సాధారణ నియమం ఇప్పటికీ ఉంది. అదే విధంగా, ఒక కుటుంబంలో పురుషుడు మరణించి వేటకు వెళ్లలేని స్త్రీలు మాత్రమే వుంటే వేటలో వేటలో వారికి వాటా ఇస్తారు.

కలిసి తినడం, కలిసి జీవించడం ఆదివాసీ సంస్కృతి ప్రాథమిక లక్షణం. నేటి నాగరిక సమాజం వారి నుండి తిని కలిసి జీవించడం నేర్చుకుంటే, ప్రపంచంలోని దాదాపు అన్ని ప్రాథమిక సమస్యలు, ఘర్షణలు పరిష్కారమవుతాయి. నేడు, ప్రపంచంలోని ప్రతి ఒక్కరి అవసరాలను తీర్చగలిగేంతగా ఉత్పత్తి జరుగుతోంది. ఆకలి, పోషకాహార లోపం, పేదరికం, లేమిని పూర్తిగా నిర్మూలించవచ్చు. ఆదివాసేతర ‘ఆధునిక నాగరిక సమాజం’ ఆదివాసీల నుండి ప్రతి ఒక్కరితో పంచుకునే; భాగస్వామ్య సంస్కృతిని నేర్చుకోవాలి. అప్పుడే ప్రపంచం అందంగా, జీవించడానికి విలువైనదిగా ఉంటుంది. ఆధునిక శాస్త్రం, సాంకేతిక పురోగతి మన శ్రేయస్సును పెంచింది, కానీ అది మానవులకు కలిసి తినడం, సమిష్టిగా జీవించే కళను ఇంకా నేర్పించలేకపోయింది. ఈ ధైర్యాన్ని, ఆ లక్షణాన్ని ఆదివాసీల నుంచి నేర్చుకోవాలి.

ప్రపంచం, ముఖ్యంగా భారతీయ సమాజం, ఆదివాసీ సమాజం నుండి నేర్చుకోగల అతి పెద్ద విషయం ఏమిటంటే, పుట్టుకతో ఎక్కువ-తక్కువ అనే భావన, ఆలోచనల నుండి స్వేచ్ఛ అనే పాఠం. భారతదేశంలో వర్ణ, కుల వ్యవస్థ భావన నుండి విముక్తి పొందిన ఏకైక వ్యవస్థ ఆదివాసీ సమాజం. ఎవ్వరినీ ఎక్కువ లేదా తక్కువ అని పరిగణించకుండా సోదర భావంతో ఎలా జీవించాలో వారు మిగతా భారతీయులకు నేర్పించగలరు. బుద్ధుడు, అంబేద్కర్‌ల అతి పెద్ద విలువ అయిన సమానత్వం, సౌభ్రాతృత్వం ఆదివాసీల్లో బీజ రూపంలో ఉన్నాయి. భారతీయ సమాజం ఆదివాసీల నుంచి మాత్రమే సమానత్వం, సౌభ్రాతృత్వం అనే పాఠాన్ని నేర్చుకోవచ్చు.

నేటికీ, ఆధునిక నాగరిక సమాజం లైంగిక సమానత్వాన్ని తన సంస్కృతిలో భాగం చేసుకోలేకపోయింది. ఆదివాసీ సమాజంలో, కొన్ని ఆదివాసీ తెగలలో స్త్రీలు పురుషులతో సమానస్థాయి వుంది. కొన్నింటిలో స్త్రీలకే ఎక్కువ మాన్యత వుంది.  వారికి పురుషుల కంటే ఎక్కువ హక్కులు ఉన్నాయి. స్త్రీలను ద్వితీయ శ్రేణిగా పరిగణిస్తూ తమ ఆస్తిగా భావించే భావన, అవగాహన ఆదివాసీల్లో కనిపించడం లేదు. ఆదివాసీ మహిళలు సాధారణంగా గౌరవప్రదమైన జీవితాన్ని గడుపుతారు. వారి గౌరవాన్ని తరచుగా ఆదివాసేతరులు తొక్కేస్తున్నారు. ఆధునిక నాగరిక సమాజంలో సర్వసాధారణంగా మారిన అత్యాచారం, లైంగిక వేధింపులు, అశ్లీలతల నుంచి ఆదివాసీ సమాజాలు దాదాపు ముక్తి చెందాయి. అత్యాచారాలు, లైంగిక, అశ్లీలత లేని సమాజాన్ని ఎలా సృష్టించాలో ఆదివాసేతర సమాజం ఆదివాసీల నుండి నేర్చుకోవచ్చు, తప్పక నేర్చుకోవాలి కూడా.

ఆదివాసీలకు అన్యాయ వ్యతిరేక స్పృహ బలంగా, ఉధృతంగా ఉంది. ప్రతీ అన్యాయాన్ని ఎదిరించి నిలబడతారు. వారు తమ స్వేచ్ఛ, గౌరవాన్ని ఎలాగైనా కాపాడుకుంటారు. ప్రపంచంలోనే అత్యంత అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడే యోధులు ఆదివాసీల్లోనే పుట్టారు. అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడటానికి వారు తమ ధైర్యం, బలం, చురుకుదనాన్ని ఉపయోగిస్తారు. భారతదేశంలోని ఆదివాసీ సమాజం బిర్సా ముండా, తిల్కా మాంఝీ, సిద్ధూ -ఖానూ వంటి అనేకమంది యోధులకు జన్మనిచ్చింది. నేటికీ, దేశంలోని, ప్రపంచంలోని శక్తివంతమైన కార్పొరేట్ సంస్థలు అడవులు, నదులు, పర్వతాలను ఆక్రమించకుండా కొంతవరకు నిరోధించిన సమాజం ఆదివాసీ సమాజం. ఇందుకోసం ఈ సమాజం ఎనలేని త్యాగాలు చేస్తోంది. వారి సాహసమూ, పోరాటమూ ఉదాహరణగా నిలుస్తున్నాయి.

ఆధునిక నాగరికత సైన్స్, టెక్నాలజీ, శాస్త్రీయ పరికరాలను అభివృద్ధి చేయడం ద్వారా మనిషి సామర్థ్యాన్ని బాగా పెంచింది, అయితే ఇది ప్రకృతి, మనిషి, ప్రాణుల ప్రయోజనం కోసం కాదు, అభివృద్ధి అనే పేరుతో వినాశనం కోసం ఉపయోగిస్తున్నారు. ఈ అభివృద్ధి పథం ద్వారా ఆదివాసీ సమాజం ‘ఆధునిక నాగరిక సమాజానికి’ విముక్తి గుణపాఠం నేర్పుతుంది.

(ఫార్వర్డ్ ప్రెస్‌లో ప్రచురితమైంది)

Leave a Reply