ప్రొఫెసర్ జి.ఎన్.సాయిబాబా నిమ్స్ లో చికిత్స పొందుతూ మృతి చెందడంపట్ల బాధాతప్త హృదయంతో నిర్బంధ వ్యతిరేక వేదిక జోహార్లు తెలియజేస్తుంది. ప్రముఖ మానవ హక్కుల కార్యకర్తగా, కవిగా, రచయితగా, విద్యావేత్తగా పేరుపొందిన సాయిబాబా రాజ్యం కక్షపూరిత చర్యలకు బలైపోయాడు. .1990 సంవత్సరాల నుండి రిజర్వేషన్ అనుకూల ఉద్యమం, జైలు ఖైదీల హక్కుల సాధన ఉద్యమం, ప్రత్యేక తెలంగాణ సాధన ఉద్యమం, ఆదివాసి హక్కుల ఉద్యమం లాంటి అనేక ప్రజా ఉద్యమాలకు నాయకత్వం వహించాడు. ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించడం సహించలేని రాజ్యం అతనిపై అక్రమ కేసులు బనాయించి పది సంవత్సరాలు జైలులో అండా సెల్ లో బంధించింది.
90% వికలాంగుడైన సాయిబాబా ఆలోచన, మెదడు ప్రమాదకారిగా భావించింది. ప్రభుత్వం,అనేకసార్లు బెయిల్ దరఖాస్తులను తిరస్కరించడమే కాక తన తల్లి మరణించినప్పుడు పెరోల్ కూడా నిరాకరించినారు.
నాగపూర్ జైల్లో తీవ్ర అనారోగ్యానికి గురైనప్పుడు సరైన చికిత్స అందించలేదు, అనేకసార్లు అండా సెల్ లో స్పృహ తప్పి పడిపోయి మృత్యువు అంచుల దాకా వెళ్ళినా కూడా జైలు అధికారులు పట్టించుకోలేదు. పోలీసులు ఎడమ చేయిని పైకి లాగడం వలన కండరాలు దెబ్బతిని ఊపిరితిత్తులు, హార్ట్ పై ప్రభావం పడి దెబ్బతిన్నాయి. ఫలితంగా జైలుకు వెళ్లక ముందు ఎలాంటి వ్యాధులు లేని సాయిబాబా 19 రకాల జబ్బులతో 7 మార్చ్ 2024లో బయటకు వచ్చాడు.
తనపై మోపబడిన అక్రమ కేసులలో రెండుసార్లు నిర్దోషిగా మహారాష్ట్ర హైకోర్టు ద్వారా నిరూపించబడ్డాడు. అయితే తాను కోల్పోయిన పది సంవత్సరాల జీవితాన్ని ఈ ప్రభుత్వం ఇవ్వగలదా! పైగా అతన్ని ఉద్యోగం నుండి తొలగించాక నిర్దోషిగా విడుదలయ్యాక ఢిల్లీ యూనివర్సిటీ లో ప్రొఫెసర్ గా చేస్తున్న ఉద్యోగంలో ఇంకా నియామకం చేయలేదు. తీవ్రంగా అనారోగ్యానికి కారణమైన జైలు జీవితం వల్లనే నేడు సాయిబాబా మరణం పాలయ్యారు. కావున సాయిబాబా మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని మేము భావిస్తున్నాము.
సాయిబాబాకు జరిగిన అన్యాయాన్ని ఖండించాలని, భవిష్యత్తులో ఇలాంటివి జరుగకుండా సమాజం చైతన్యంతో స్పందించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
ప్రొఫెసర్ జి.హరగోపాల్ కన్వీనర్
ప్రొఫెసర్ జి.లక్ష్మణ్, కో-కన్వీనర్
ఏం.రాఘవాచారి, కో-కన్వీనర్
కె.రవిచందర్,కో-కన్వీనర్
13-10-2024.