2014లో యుక్రెయిన్‌లోని క్రిమియా ద్వీపకల్పాన్ని ఆక్రమించున్నాక కూడ రష్యా దురాక్రమణ దాహం తీరలేదు. 2022 ఫిబ్రవరి 24న యుక్రెయిన్‌పై రష్యా పెద్ద ఎత్తున దాడి చేసింది. దాంతో యుక్రెయిన్ తన శక్తినంతా కూడదీసుకొని ప్రతిఘటించటం ప్రారంభించింది. ఇది 2014 నుండి కొనసాగుతున్న రష్యా ఆధిపత్యానికీ యుక్రెయిన్ ఎదురొడ్డి నిలిచి చేస్తున్న యుద్ధం తీవ్రతను సూచిస్తుంది. ప్రధానంగా 2022 ఫిబ్రవరిలో మొదలైన రష్యా-యుక్రెయిన్ యుద్ధం ఇటీవలి చరిత్రలో సుదీర్ఘ యుద్ధంగా నిలిచింది. రెండో ప్రపంచ యుద్ధంలో నాజీలను ఓడించడానికి సోవియట్ యూనియన్‌కు 14 వందల 18 రోజులు పట్టగా, గత నెలలోనే ఆ సమయాన్ని రష్యా-యుక్రెయిన్ యుద్ధం దాటేసింది. అప్పటి యుద్ధంలో బెర్లిన్ వరకు దూసుకెళ్లిన రష్యా సైన్యం, ఇప్పుడు సరిహద్దుల్లో యుక్రెయిన్‌లోని తూర్పు పారిశ్రామిక ప్రాంతాలను స్వాధీనం చేసుకోవడానికి తీవ్రంగా కష్టపడుతోంది. కీవ్‌ను స్వాధీనం చేసుకుని అనుకూల సర్కారుని నియమించేందుకు మాస్కో చేసిన ప్రయత్నాలు ఫలించడం లేదు. యుక్రెయిన్‌కు అమెరికాతో పాటు పలు ఐరోపా దేశాలు ఆయుధాలు సరఫరా చేసి మద్దతు ఇవ్వడమే అందుకు కారణం.
రష్యా-యుక్రేయిన్ యుద్దం-కారణం:
రష్యాకు వ్యతిరేకంగా నాటో విస్తరణ పేరుతో యుక్రెయిన్‌కు నాటోలో సభ్యత్వమిచ్చి తమ ముంగిట అణ్వాయుధాలను మోహరించాలన్న అమెరికా ఎత్తుగడలను రష్యా ఎదుర్కొంటున్నది. గతంలో తన ప్రాంతంగా ఉన్న క్రిమియా ద్వీపకల్పాన్ని రష్యా విలీనం చేసుకుంది. దాంతో అప్పటి నుంచి యుక్రెయిన్ పాలకులు రష్యన్లు మెజారిటీగా ఉన్న చారిత్రక, సాంస్కృతిక, ఆర్థిక ప్రాంతమైన డాన్‌బాస్‌పై దాడులు చేసింది. యుక్రేయిన్ సైన్యాలను ఎదిరిస్తూ డాన్బాస్ ప్రజలు తిరుగుబాటు చేశారు. యుక్రేయిన్కు వ్యతిరేకంగా ఆ ప్రాంతంలో తలెత్తిన తిరుగుబాటుకు రష్యా మద్దతిచ్చింది. సైనిక చర్య ప్రారంభించిన ప్పటి నుంచి నాలుగేండ్ల కాలంలో 26 శాతం యుక్రెయిన్ ప్రాంతాన్ని తిరిగి తన ఆధీనంలోకి తెచ్చుకుంది. మెల్లమెల్లగా కొత్త ప్రాంతాలకు చొచ్చుకుపోతున్నది. మరో వైపు.. నాటో (ఉత్తర అట్లాంటిక్ ఒప్పంద సంఘము)లో చేరకుండా యుక్రెయిన్‌ను చట్టబద్ధంగా నిషేధించాలని నాటో కూటమి దేశాలను రష్యా డిమాండ్ చేస్తున్నది. ‘డొనెట్స్క్ పీపుల్స్ రిపబ్లిక’, ‘లుహాన్స్క్ పీపుల్స్ రిపబ్లిక’ అనే రెండు స్వయం ప్రకటిత యుక్రెయిన్ రాష్ట్రాలను రష్యా గుర్తించింది.
యుద్ధ నష్టాలు:
రష్యా- యుక్రేయిన్ యుద్ధంలో ఇప్పటివరకు ఇరువైపులా మృతిచెంది, గాయపడిన, కనిపించకుండా పోయిన సైనికుల సంఖ్య సుమారు 20 లక్షలుగా ఉంటుందని అంచనా. అమెరికాకు చెందిన ‘సెంటర్ ఫర్ స్ట్రాటెజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్’ మాత్రం ఈ సంఖ్య 18 లక్షలుగా ఉంటుందని పేర్కొంది. రష్యా సైనికులు 3.25 లక్షల మంది, యుక్రెయిన్ సైనికులు 1.40 లక్షల మంది మృతి చెందినట్లు తెలిపింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఐరోపాలో అత్యంత వినాశకరమైన యుద్ధం ఇదే.
యుద్ధంలో చరిత్రలో తొలిసారి డ్రోన్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఉక్రెయిన్ విద్యుత్ వ్యవస్థలే లక్ష్యంగా రష్యా వందలాది డ్రోన్లను ప్రయోగిస్తోంది. ఎలక్ట్రానిక్ జామింగ్ నుండి తప్పించుకునేందుకు ఫైబర్ ఆప్టిక్ డ్రోన్లను వదులుతోంది. మరోవైపు.. యుక్రెయిన్ సైతం వీటినే నమ్ముకుంది. గతంలో ‘ఆపరేషన్ స్పైడర్‌వెబ్’ పేరిట ప్రత్యర్థి వైమానిక స్థావరాలపై విరుచుకుపడింది. సీ-డ్రోన్లతో అనేక రష్యన్ యుద్ధనౌకలను ముంచేసింది.
యుక్రెయిన్ సార్వభౌమత్వాన్ని కాలరాస్తూ, మౌలిక సదుపాయాలే లక్ష్యంగా రష్యా బాంబులు గుమ్మరిస్తూ న్నది. అక్కడి సాధారణ జనజీవనాన్ని రష్యా నరకప్రాయం చేస్తోంది. మాస్కో విచ్చలవిడి దాడుల మూలంగా ఉక్రెయిన్ పంటభూముల్లో 16 శాతం దెబ్బతిన్నాయి. ధాన్యం, నూనెగింజల దిగుబడులు 18శాతం క్షీణించాయి. కీవ్ నుంచి గోధుమ, పొద్దుతిరుగుడు ఎగుమతులు సన్నగిల్లడంతో చాలా ఆఫ్రికా, ఆసియా దేశాల్లో ఆహార అభద్రత నెలకొంది. అటు రష్యా యుక్రెయిన్‌పై దండయాత్రలోనే సైనిక నష్టాన్ని ఎక్కువగా చవిచూసింది. కీవ్‌పై కయ్యానికి దిగినందుకు అగ్రరాజ్యాలు విధించిన ఆంక్షలను మాస్కో తట్టుకొని నిలిచినా పన్నుల మోత, నిత్యావసర ధరల వాతలతో రష్యన్లు విలవిల్లాడుతున్నారు. యుద్ధంలో కూరుకుపోయిన రష్యా ఇప్పుడు శ్రామికుల కొరతతో అల్లాడుతోంది. సర్వశక్తులనూ పోరుపైనే కేంద్రీకరించడం వల్ల ఆర్థిక వృద్ధి మందగించింది. ఎడతెగని యుద్ధం తమకే చేటు చేస్తున్నా శాంతిచర్చ ల్లో పట్టువిడుపులకు రష్యా అధినేత పుతిన్ ససేమిరా అంటున్నారు.
రష్యా ప్రతిష్ఠకు పరీక్ష:
గతంలో రష్యాకు సూపర్ పవర్ అమెరికాకు కళ్లెం వేసిన సైనిక శక్తిగా పేరున్నది. ఆ అతి విశ్వాసంతోనే యుక్రేయిన్పై దాడికి దిగుతున్నప్పుడు నాలుగు రోజుల్లో యుక్రెయిన్‌ను జయించగలనని పుతిన్ అనుకున్నాడు. కానీ ఊహించిన దానికి భిన్నంగా యుక్రేయిన్ నుంచి ప్రతిఘటన ఎదురవుతున్నది. పరిస్థితి చూస్తే.., నాలుగేళ్ళు పూర్తి అవుతున్నా యుద్ధం మరో నాలుగేళ్ళకయినా ముగుస్తుందా? అన్నది అనుమానం. ఇప్పటికిప్పుడు యుద్ధం ఆగితే కూడా యుక్రెయిన్ పునర్నిర్మాణానికి 588 బిలియన్ డాలర్లు ఖర్చు అవుతుందట. రష్యాకు కలిగిన నష్టం అంతకంటే అధికం. లెక్కకు అందనిది. అప్పటివరకూ తనకున్న విస్తృత సహజవాయువు మార్కెట్‌ను ఈ యుద్ధం కారణంగా రష్యా కోల్పోయింది. ఒక్క యూరప్‌ను తీసుకున్నా ఏటా నలభై బిలియన్ డాలర్లు నష్టపోతోంది. విదేశాల్లో 335 బిలియన్ డాలర్ల నిధులు ఇరుక్కుపోవడం రష్యాకు మరో దెబ్బ. అమెరికా అధ్యక్షుడు ఏవో హామీలు ఇస్తున్నారు. కానీ, యుద్ధం ఆగినా కూడా అందులో అధికభాగం రష్యాకు దక్కవు. పశ్చిమ దేశాల ఆర్థిక, ఆయుధ అండదం డలు దండిగా ఉన్న యుక్రెయిన్ సరే, రష్యా మాత్రం ఇంకెంతకాలమని యుద్ధం చేయగలదు? అనేదే ఇప్పుడు కీలకంగా మారింది.
అమెరికా అతి విశ్వాసం:
మరో వైపు… రష్యా- యుక్రేయిన్ యుద్ధం విషయంలో నాలుగురోజుల్లో రష్యాను దారికి తేగలనని ట్రంప్ భ్రమపడ్డాడు. కానీ అదంతా సులువైన విషయం కాదని అర్థమవుతున్నది. జో బైడెన్ హయాంలో అమెరికా ప్రాపకంతోనే యూరప్ దేశాలు యుక్రెయిన్‌ను రష్యాపైకి ఉసిగొల్పాయి. కానీ ట్రంప్ వచ్చాక అంతా తలకిందులై యూరప్ దేశాలకు దిక్కుతోచడం లేదు. అంతేకాదు, ఇటీవల జాతీయ భద్రతా వ్యూహం పేరిట అమెరికా విడుదల చేసిన విధాన పత్రం కూడా వాటికి మింగుడుపడటం లేదు. అట్లాస్ మాదిరిగా ఒంటరిగా భూగోళాన్ని మోయటం ఇకపై ఉండబోదనీ, యూరప్ స్వీయరక్షణ బాధ్యత చూసుకోవాలనీ ఆ పత్రం స్పష్టం చేసింది. ప్రపంచాధిపత్యం కోసం పోటీపడటం పర్యవసానంగా అమెరికా బలహీనపడిం దనీ, అందుకే పాత విధానానికి అవసరమైన దిద్దుబాట్లు తప్పనిసరని తేల్చింది. ఇప్పటికి ఎనిమిది యుద్ధాలు ఆపానని తరచు చెప్పే ట్రంప్ జాబితాలో ఇప్పటికైతే యుక్రెయిన్ లేదు. కానీ, ఆయన అధికార పగ్గాలు చేపట్టిననాడే యుక్రెయిన్ యుద్దాన్ని ఆపుతానని శపథం చేశాడు. 2014కు ముందున్న సరిహద్దుల సంగతి యుక్రెయిన్ మరిచిపోవాలని చెబుతూ వచ్చారు. కానీ యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తమ భూభాగాన్ని వదులుకోవటానికి ససేమిరా అంటున్నారు. ప్రాదేశీక సార్వభౌమత్వాన్ని ఏ మాత్రం కోల్పోవటానికి సిద్ధంగా లేమని స్పష్టం చేశాడు.
అమెరికా మధ్యవర్తిత్వంలో కొంతకాలంగా యుక్రేయిన్- రష్యా మధ్య చర్చలు కొనసాగుతున్న ప్పటికీ.. ఇరుపక్షాలూ పరస్పరం ప్రత్యేకమైన డిమాండ్లను వీడకపోవడంతో పురోగతి ఉండటం లేదు. డాన్‌బాస్‌ను తమకే వదిలేయాలని మాస్కో అంటున్నది. ఈ షరతును ఎప్పటికీ అంగీకరించబోమని కీవ్ స్పష్టం చేస్తోంది. యుద్ధం మొదలై ఫిబ్రవరి 24కు నాలుగేళ్లు పూర్తయింది. మొదట్లో కీవ్‌ను స్వాధీనం చేసుకుని అనుకూల సర్కారును నియమించేందుకు మాస్కో చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. 2014లో ఆక్రమించిన క్రిమియా సహా 20 శాతం యుక్రెయిన్ భూభాగం ప్రస్తుతం రష్యా నియంత్రణలోనే ఉంది. యుక్రేయిన్ భూభాగంలోకి చొచ్చుకెళ్లే విషయంలో మాస్కోకు తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. గత రెండేళ్లలో దొనెట్స్క్ ప్రాంతంలోకి దాదాపు 50 కి.మీ మాత్రమే వెళ్లగలిగింది. పోక్రోవ్స్క్ నగరాన్ని స్వాధీనం చేసుకునేందుకు గత రెండేళ్లుగా రోజుకు సగటున 70 మీటర్ల చొప్పున ముందుకు సాగుతోంది. ఈనేపథ్యంలోనే రష్యా పురోగతి నత్తనడకలా ఉందని నాటో చీఫ్ మార్క్ రుట్టే ఇటీవల వ్యాఖ్యానించటం గమనార్హం.
నాలుగేళ్లుగా సాగుతున్న యుద్ధానికి తెరదించే ప్రయత్నాల్లో భాగంగా అమెరికా మధ్యవర్తిత్వంలో ఇరుదేశాల ప్రతినిధులు ఇప్పటికే రెండుసార్లు సమావేశమయ్యారు. ఈ ఏడాది జూన్‌లోగా యుద్ధం ముగింపుపై ఓ ఒప్పందానికి రావాలంటూ అగ్రరాజ్యం డెడ్‌లైన్ విధించింది. ఒకవేళ గడువులోగా లక్ష్యం నెరవేరకపోతే.. దాన్ని సాధించేందుకు ట్రంప్ యంత్రాంగం ఇరుపక్షాలపై ఏ విధమైన ఒత్తిడి తెస్తాడు? ఎలా ఒప్పిస్తాడు అనేది స్పష్టత అయితే లేదు. ట్రంప్ బెదిరింపు మాటలు ఎవరూ ఖాతరు చేస్తున్న స్థితి కూడా కనిపించటం లేదు.
ఫలించని శాంతి చర్చలు :
అమెరికా మధ్యవర్తిత్వంలో ఎడతెగని చర్చలు జరుగుతున్నా రష్యా-యుక్రెయిన్ యుద్ధానికి తెరపడటం లేదు. ఇరుపక్షాలు తమ డిమాండ్లతో మొండిగా ఉండటమే అందుకు కారణం. యుక్రెయిన్‌లో తాము స్వాధీనం చేసుకున్న నాలుగు ప్రాంతాల నుంచి జెలెన్స్కీ సైన్యాన్ని ఉపసంహరించుకోవాలని, నాటోలో చేరకూడదని రష్యా అధ్యక్షుడు పుతిన్ కోరుతున్నారు. దీన్ని యుక్రెయిన్ తిరస్కరిస్తోంది. అమెరికా వంటి దేశాల నుంచి భద్రతా గ్యారెంటీ ఉండాలని యుక్రెయిన్ కోరుతోంది. కాల్పుల విరమణకు ముందు ఇవి జరగాలని డిమాండ్ చేస్తోంది. ఈ క్రమంలో యుద్ధానికి ముగింపు సమీప భవిష్యత్‌లో కనిపించేలా లేదు.
మిలిటరీ చర్య ప్రారంభించిన తొలి రోజుల్లో పుతిన్ యంత్రాంగం వేసిన అంచనాలు దెబ్బతిన్నాయి. నాటో కూటమి దేశాలు యుక్రెయిన్‌కు అవసరమైన ఆయుధాలు, ఆర్థిక సాయంతో పాటు రష్యన్ మిలిటరీ కదలికల గురించి కీలకమైన సమాచారాన్ని అందించటంతో రష్యాకు తీవ్రమైన ఎదురుదెబ్బలు తగిలా యి. దాంతో వ్యూహాం మార్చుకోవాల్సి వచ్చింది. కొన్ని వారాల్లో కీవ్ పతనం అవుతుందనుకున్న మాస్కో అంచనాలు తప్పాయి. రష్యా కోరిన విధంగా కొంత ప్రాంతాన్ని కోల్పోయి ఒప్పందం చేసుకుంటే సరే లేకపోతే యుక్రెయిన్ గెలిచే అవకాశాలు లేవని డొనాల్డ్ ట్రంప్ గతేడాది నవంబర్‌లో బహిరంగంగానే చెప్పాడు.
యుద్దాన్ని ఆపేందుకు రష్యా మీద వత్తిడి పెంచుతూ, ఎన్ని ఆంక్షలు విధించినప్పటికీ అవి పనిచేయటం లేదని ట్రంప్‌కు అర్థమైంది. కొన్ని రాయితీలిచ్చి రష్యాతో కాల్పుల విరమణకు అంగీకరింప చేయిస్తే నవంబర్‌లో జరిగే పార్లమెంటు మధ్యంతర ఎన్నికల్లో తన ప్రచారానికి వినియోగించుకోవచ్చని ట్రంప్ యంత్రాంగం ఆలోచించినప్పటికీ పుతిన్ ఏమాత్రం పట్టువీడటం లేదు. ప్రస్తుతం తమ ఆధీనంలో లేని ప్రాంతాలతో సహా మొత్తం తూర్పున ఉన్న డాన్బాస్ మొత్తాన్ని తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నాడు.
యుద్ధంలోకి అడుగుపెట్టిన కొత్తల్లో రష్యా మంచి జోరుగా యుక్రెయిన్ భూభాగాల్లోకి చొరబడగలిగింది. ఆ తరువాత ఎక్కువ వదులుకొని, కొంత నిలబెట్టుకోగలిగింది. యుద్ధంలో అసత్యాలు అర్థసత్యాలే తప్ప నిజం వెలుగుచూడదు. విజయాలు, మరణాల లెక్కలనూ అనుమానించాల్సిందే. రెండుదేశాలు అపార ఆస్తి, ప్రాణనష్టాలు చవిచూశాయి. తన ఆధీనంలో ఉన్న యుక్రెయిన్ భూభాగాలను వదులుకోకపోవడంతో పాటు, వ్యూహాత్మకంగా అవసరమైన ప్రాంతాల నిస్సైనికీకరణను కూడా రష్యా కోరుతున్నందువల్లనే చర్చలు ముందుకు సాగడం లేదు. యుక్రెయిన్‌కు ఇకపై మారణాయుధాలు అందవన్న హామీతో పాటు, ఈ యుద్ధానికి మూలకారణమైన నాటో విస్తరణ విషయంలోనూ నిర్దిష్టమైన హామీ పాశ్చాత్యదేశాల నుంచి దక్కేవరకూ రష్యా వెనక్కు తగ్గదు. లూకాయిల్, రోస్నెప్ట్ వంటి రష్యన్ చమురు కంపెనీల మీద అమెరికా అధ్యక్షుడు ఆంక్షలు విధించడం, దిగుమతులకు భారత్ దూరం కావడం వంటి పరిణామాలు రష్యాను కొంత దెబ్బతీసినమాట నిజం. అయితే, ఆంక్షలు రష్యాను బలహీనపరిచాయే తప్ప, సాగిలబడేట్టు చేయలేకపోయాయి.
యుద్ధం-ప్రజలు:
ప్రపంచంలో ఏ యుద్ధాన్ని తీసుకున్నా నష్టపోయేది ప్రజలే. యుద్ధంలో పాల్గొంటున్న దేశాల ఆర్థిక వ్యవస్థలు నష్టపోతాయి. ప్రపంచ దేశాలను నష్టాల కుంపట్లో పడవేస్తాయి. యుక్రెయిన్-రష్యా యుద్ధం మొదలై నాలుగేళ్లు దాటింది. జెలెన్స్కీ- పుతిన్‌లు ఇరువురు బాగానే ఉన్నారు. కానీ ఇరుదేశాల ప్రజల తీరని సంక్షోభంలో కూరుకుపోయారు. ఇప్పటికే యుక్రెయిన్ సంక్షోభం చరిత్రలో నమోదైంది. అపారమైన మానవ మూలధనం కోల్పోవడం, వ్యవసాయ-వాణిజ్య మౌలిక సదుపాయాలు నాశనం కావడంతో ఉత్పత్తి సామర్థ్యానికి భారీ నష్టం వాటిల్లింది. ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రపంచం మీద యుద్ధ ప్రభావం చూపుతోంది. భౌగోళిక రాజకీయాల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఏ దేశం కూడ ఎదుర్కోని తీవ్రమైన ఆంక్షలను రష్యా మీద నాటో కూటమి దేశాలు అమలు చేశాయి. దీంతో రష్యా యూరోపియన్ దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఏ పోరులోనూ ఏ దేశం ఇంత నష్టం ఎదుర్కోలేదు.
ముగింపు :
గడచిన నాలుగేళ్లలో యుక్రెయిన్-రష్యా యుద్ధం ప్రారంభమైన 2022 ఫిబ్రవరి నాటి నుండి ఇప్పటివరకూ యుక్రేయిన్కు యూరోపియన్ కమిషన్ 194.9 బిలియన్ డాలర్ల మేరకు సహాయాన్ని అందించింది. ఇది కాకుండా ఇప్పుడు కొత్తగా మరో 90 బిలియన్ యూరోల రుణాన్ని కూడా యూరప్‌కు ప్రతిపాదించింది. ఈ మేరకు రాబోయే రెండేళ్ళపాటు సహాయం కొనసాగించేందుకు అంగీకారం కుదిరింది. అమెరికా సహాయాన్ని పొందుతున్న దేశాలలో యుక్రెయిన్ అగ్రస్థానంలో నిలిచింది. 2025 డిసెంబర్ 31 నాటికి యుక్రెయిన్‌లో యుద్ధానికి సంబంధించి 188 బిలియన్ డాలర్లు అందుబాటులో ఉంచింది. బలమైన కేంద్రాలను రక్షించుకోవడానికి యుక్రెయిన్ తీవ్ర పోరాటం చేస్తోంది. మరోవైపు యూరప్ దేశాల నుండి ఆయుధాలు సమకూర్చుకుంటున్నారు.
యుక్రెయిన్ యుద్ధాన్ని ముగించడానికి అనేక పర్యాయాలు చర్చలు జరిగాయి. 2022లో టర్కీలోని అంటాల్యలో ఏడు విడతల చర్చలు జరిగాయి, కానీ కొలిక్కి రాలేదు. 2025లో ట్రంప్ అమెరికా అధ్యక్షుడైన తర్వాత చర్చలు తిరిగి ప్రారంభమయ్యాయి. 2026 ప్రారంభం నాటికి ట్రంప్ చొరవతో యుక్రెయిన్- రష్యా మధ్య శాంతి చర్చలు ముమ్మరంగా సాగుతున్నాయి. ట్రంప్ 28 అంశాల శాంతి ప్రణాళిక ముసాయిదాను ట్రంప్ సంధానకర్త స్టీన్ విట్ కాఫ్, క్రెమ్లిన్ అధికారి కిరిల్ డిమిత్రివ్ రూపొందించారని తెలుస్తోంది. ఈ ఒప్పందంలో యుక్రెయిన్ నాటోలో చేరకపోవడం, అక్రమిత భూభాగాలు రష్యాకు వదులుకోవడం వంటివి ఉన్నాయి. మొదట్లో ఈ షరతులు ఒప్పుకోవడమంటే లొంగుబాటుతో సమానమని జెలెన్స్కీ వ్యతిరేకించా డు. అయితే యుద్ధవిరమణను ఒప్పించడానికి ట్రంప్ ఒత్తిడి పెంచినట్లు కొన్ని యూరోపియన్ దేశాలు అంటున్నాయి. ఈ ఒప్పందం మాస్కోకు అనుకూలంగా ఉందని యుక్రెయిన్ భావిస్తోంది. ఏది ఏమైనా యుద్ధానికి త్వరలో ముగింపు పలకాలి. వర్తమాన ప్రపంచంలో అమెరికా ప్రేరిత యుద్ధాలు ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. ఇదిలాగే కొనసాగితే.. ఈ రష్యా-యుక్రేయిన్ యుద్ధం మూడవ ప్రపంచ యుద్ధానికి దారి తీసే ప్రమాదం పొంచి ఉంది.




