కాళ్ళు కడుక్కోవడానికి చెంబుతో నీళ్ళిచ్చి ‘యిదేమీ టౌన్ కాదు, సిటీ అంతకన్నా కాదు, పల్లెటూళ్ళో అడ్రస్ పట్టుకోలేకపోయావంటే నిన్నేమనాలి?’ అన్నాడు మా ఫ్రెండు. నాకొస్తున్న కోపానికి చేతిలోని చెంబుతో వాడి తల పగలగొట్టాలని వొక్కక్షణం అనిపించింది. కాని పక్కనే వాడి పేరెంట్స్ వుండిపోయారు. అందుకని నవ్వుతూ చూశాను.

            ప్రయాణం బాగా జరిగిందా- నుంచి అన్ని కుశల ప్రశ్నలు వేస్తూ ‘అడ్రస్ డెడ్ యీజీ’ అన్నాడు అంకుల్. ‘మీ అంకుల్ పేరు చెప్పి యెవర్ని అడిగినా, చిన్న పిల్లల్ని అడిగినా చెప్పేస్తారు’ అంది ఆంటీ. ‘నన్ను యెందుకు రెచ్చగొడతార్రా?’ అని ఆవేశాన్ని అణచుకొని కూల్ ఫేస్ పెట్టాను.

            మావాడి పేరెంట్స్ అటువెళ్ళగానే ‘యెవర్ని అడిగినా చెప్పేస్తారు అంటావ్…’ తలూపుతూ అడిగాను. ‘ఊ… యా…’ అన్నాడు. ‘మరి మీ యింటిచుట్టూ పొద్దున్న నుంచి యెందుకు తిరిగానంటావ్?’ అడిగాను, బైట పడేయాల్సినదాన్ని లోపల బిగబట్టి. ‘పొద్దున్న మార్నింగ్ వాక్ చెయ్యలేదనేమో?’ అని నవ్వాడు ఫ్రెండు. నన్ను చూసి అర్థం చేసుకున్నట్టు నవ్వు ఆపేసి యేమైందని అడిగాడు.

            ‘మీ పక్కింటి వాళ్ళని అడిగినా తెలీదన్నారు’ గాలి తీసేసినట్టు అన్నానని అనుకున్నాను. ఒక్కక్షణం ఆలోచనల్లో పడ్డట్టు ఆగాడు. తలూపి ‘తెలీదన్నారా? కరెక్టుగానే అన్నారు’ అన్నాడు ఫ్రెండు, యింట్లోకి నడుస్తూ. అనుసరిస్తూన్న నాతో ‘వాళ్ళకీ మాకూ పడదులే’ అన్నాడు. ‘పడకపోతే లేదు, అడ్రాసు చెప్పడానికేం?’ అన్నాను. ‘చెప్పరు’ అని వీడే అన్నాడు, వాళ్ళ తరుపున వకల్తా పుచ్చుకున్నట్టు. నేను విస్తుపోయి చూస్తే, ‘నేనయినా అంతే, వాళ్ళ యింటిగురించి యెవరన్నా అడిగితే చెప్పను’ అన్నాడు. ‘వాట్?’ యెందుకన్నట్టు చూశాను. ‘వాళ్ళకీ మాకూ మాటల్లేవ్’ చెప్పిన సమాధానంతో నేను సంతృప్తిపడలేదు. ‘ఎందుకు?’ అన్నాను. ‘తెలీదు’ అన్నాడు. ‘తెలుసుకోవాలి కదా?’ అన్నాను మళ్ళీ. ‘అదేం కాంపెటేటివ్ బిట్టా?’ అన్నాడు, వదిలేయమన్నట్టు.

            మధ్యాహ్నం భోజనాల దగ్గర ‘తెలీదనకపోతే, యింటికి తోడొచ్చి దిగబెడతారేట్రా?’ అంది ఆంటి. సంభాషణ మధ్యలో మొదలైనా అప్పటికే మా ఫ్రెండు వాళ్ళమ్మతో షేర్ చేసాడని గ్రహించాను. ‘చూశావా?, వాళ్ళెంత పట్టుమీదున్నారో?’ అని మా ఫ్రెండుతో వాళ్ళనాన్న ‘మనం కూడా అలాగే వుండాలి, అర్థమయ్యిందా?’ చాలా సీరియస్సుగా చూస్తూ తలాడిస్తూ చెప్పాడు. మా ఫ్రెండు కూడా తలాడించాడు.

            ఏదో పెద్ద శత్రుత్వమే వున్నట్టు వూహించాను. పక్కపక్కనే వున్నారు… పడదంటున్నారు… యేమైవుంటుందో తెలుసుకోవాలని అనిపించింది.

            ఇంతలో ఆంటీ ‘పోనీ యిల్లు అమ్ముకు పోదాం అంటే, బతకలేక వూరోదిలేశాం అని అంటారు’ అంది. ‘అలా అంటే పరవాలేదు, వాళ్ళకు భయపడి వదిలేశామని ప్రచారం చేస్తే?’ ప్రశ్నించాడు అంకుల్. ‘వాళ్ళే అమ్ముకు పోవాలి, మనం అస్సలు అమ్మొద్దు’ ఖచ్చితంగా అన్నాడు మా ఫ్రెండు. నే ఔటాఫ్ ది బాక్స్ వుండిపోయినట్టు అనిపించింది.

            ‘అంటే, వాళ్ళెవరు?’ అన్నాను.

ముగ్గురూ ముఖాముఖాలు చూసుకున్నారు. ఆపై ‘మా బాగార్లే’ అంది ఆంటీ. అర్థంకానట్టు చూసిన నన్ను చూసి ‘మా తాతల తాతలకు అన్నదమ్ములట’ అది యెప్పటి వ్యవహారమో అన్నట్టు చెప్పాడు అంకుల్. ‘త్రీ జనరేషన్స్‌గా మాటలు లేవు’ అని చాలా గొప్పగా, ఆ గొప్పలో పట్టుదల ధ్వనించేలాగ అన్నాడు మా ఫ్రెండు. ‘అంతకు ముందు నుంచీ’ సరిదిద్దింది ఆంటీ.

            తరాల వైరం అనుకున్నాను. ‘ఏమిటి గొడవ?’ అన్నాను.

            ‘తెలీదు’ తలడ్డంగా వూపాడు మా ఫ్రెండు. నేను ఆంటీ వంక చూశాను. ‘నాకూ తెలీదు, కాపురానికి వచ్చిన కొత్తల్లో మా అత్తయ్య ఆ యింటివాళ్ళతో మాట్లాడకు, కన్నెత్తి కూడా చూడకు అని వార్నింగ్ యిచ్చింది’ చెప్పింది ఆంటీ. ‘ఔను, అప్పుడు నువ్వు యీ అబ్బాయి అడిగినట్టే యేమిటి గొడవ? అని అడిగావు’ అన్నాడు అంకుల్, గుర్తుంది అన్నట్టుగా. ‘డాడీ నీకు చెప్పారా మమ్మీ?’ అన్నాడు ఫ్రెండు.

            నేను చాలా ఆసక్తిగా చూశాను.

            ఆంటీ వడ్డిస్తూ ‘మీ నాన్నకు తెలిస్తే కదా… నాకు చెప్పడానికి?’ అంది. ‘డాడీకి కూడా తెలీదా?’ ఆశ్చర్యపోకుండానే అన్నాడు మా ఫ్రెండు.

            తినడం ఆపేసి చూస్తుంటే ‘తిను బాబూ’ అంది ఆంటీ. నేను కలుపుతూ చూస్తుంటే, ‘నాకే కాదు, మా అత్తకీ తెలీదు’ అని కూడా అంది.

            ‘మా నాన్నకీ తెలీదు’ అన్నాడు అంకుల్.

‘మరి యెవరికి తెలుసు?’ గట్టిగా అరవాలనిపించింది.

            ‘అంటే మీ నాన్నగారిని అడిగారా?’ అన్నాను జుట్టుపీక్కోకుండా అంకుల్ వంక చూస్తూ. ‘అడిగాను’ అన్నట్టు తలూపుతూ చేతిలోని ముద్ద మింగుతూ చూశాడు అంకుల్. ‘చెప్పలేదా?’ అన్నట్టు అంకుల్ వంక చూసింది ఆంటీ.

            ‘మా నాన్న వాళ్ళనాన్నని అడిగారు, ఆయన చిన్నప్పుడు. అడిగినందుకు దెబ్బలు కాశారు. నేను కాయలేదు’ అన్నాడు అంకుల్.‌

            ‘మీరు మీ తాతయ్యని అడగాల్సింది’ అన్నాను, అంకుల్‌తో. అర్థంకానట్టు ముఖం పెట్టాడు అంకుల్. ‘అంటే, యెంతైనా మనవలంటే ముద్దు కదా?’ అన్నాను.

            ‘మా ముత్తాత చనిపోయేముందు మాతాత చెవిలో అన్నీ చెప్పాడట, యీ విషయం కూడా చెప్పేవాడేమో… అంతకన్నా ముందు పాపం ప్రాణం పోయిందట…’ అంకుల్ జరగకూడనిది జరిగినట్టు ముఖం వేళ్ళాడేశాడు.

            తినే పదార్థాలు చల్లగా అయిపోయాయి. అంతకన్నా నేను చల్లగ ఫ్రీజ్ అయిపోయాను.

            ‘ఉప్పూ కారం తినడం లేదా? మన పూర్వీకులు లేకుండా మనం వున్నామా? పండగొస్తే పెద్దలకు ముద్దెయ్యడం గొప్ప కాదు, అసలు తరాలుగా వస్తున్నదాన్ని మార్చడానికి మనమెవరం? ఆస్తిపాస్తులకే మనం వారసులమా? మానాభిమానాలకు వారసులం కామా?’ పమిటతో కళ్ళు తుడుచుకుంది ఆంటీ.

            ఆమె చేతులు తాకి- యింటిల్లిపాది చూపులు సోకి- చల్లారిన భోజన పదార్థాలు వేడెక్కి పొగలు చిమ్మాయి! డైనింగ్ టేబుల్ కాలిపోతుందేమోనని భయమేసింది నాకు!

Leave a Reply