2025ల్రో ప్రపంచ సైనిక వ్యయం 2,887 బిలియన్ డాలర్లకు పెరిగింది. 2021-25 మధ్యకాలంలో ప్రపంచ దేశాల మధ్య బదిలీ చేయ బడిన ఆయుధాల ప్రపంచ వ్యాప్త పరిమాణం, అంతకు ముందు ఐదేళ్ల కాలం (2016-20)తో పోలిస్తే 9.2 శాతం అధికం. 2011-15 తర్వాత ఇదే అతిపెద్ద పెరుగుదల. ఈ రెండు కాలాల మధ్య యూరప్‌లోని దేశాల ఆయుధ దిగుమతులు మూడింతలకు పైగా పెరిగాయి. అమెరికా ఖండంలోని దేశాల ఆయుధ దిగుమతులు కూడా 12శాతం పెరిగాయి, కాగా ఆఫ్రికా, ఆసియా, ఓషియానియా, మధ్యప్రాచ్య దేశాల దిగుమతులు తగ్గాయి. 2021-25లో యుక్రెయిన్ ప్రపంచంలోనే అతి పెద్ద ఆయుధాల గ్రహీతగా నిలిచింది. మొత్తం ప్రపంచ ఆయుధ దిగుమతులలో 9.7 శాతాన్ని యుక్రెయిన్ అందుకుంది. కాగా.. ప్రపంచంలోనే అతిపెద్ద ఆయుధ సరఫరాదారుగా అమెరికా నిలిచింది.

            స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సిప్రీ) స్వీడన్‌లోని స్టాక్‌హోమ్‌లో ఉన్న ఒక అంతర్జాతీయ సంస్థ. ఇది 1966లో స్థాపించబడింది. సాయుధ సంఘర్షణ, సైనిక వ్యయం, ఆయుధాల వ్యాపార వివరాలను ఈ సంస్థ‌ అందిస్తుంది. అదే సమయంలో  అంతర్జాతీయ సంఘర్షణ, శాంతి భద్రతలకు ముఖ్యమైన  సహకార సమస్యలపై శాస్త్రీయ పరిశోధన చేయడం, అంతర్జాతీయ సంఘర్షణలకు శాంతయుత పరిష్కారం చూప‌టం, సుస్థిర శాంతికి అవసరమైన పరిస్థితులపై అవగాహనకు దోహదపడటం సిప్రి (ఎస్ఐపిఆర్ఐ) సంస్థాగత ఉద్దేశ్యం. యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా లాడర్ ఇన్‌స్టిట్యూట్ వారి ‘గ్లోబల్ టు థింక్ ట్యాంక్స్ రిపోర్ట్’ ప్రకారం.. 2014లో సిప్రి అమెరికా యేతర ప్రపంచవ్యాప్త థింక్ ట్యాంక్‌లలో మొదటి మూడు స్థానాలలో ఒకటిగా నిలిచింది. 2020లో సిప్రీ ప్రపంచవ్యాప్తంగా థింక్ ట్యాంక్‌లలో 34వ స్థానంలో నిలిచింది.

             స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సిప్రి) ఏప్రిల్ 27న ప్రచురించిన కొత్త డేటా ప్రకారం, సైనిక వ్యయంలో అగ్రగామిగా ఉన్న మూడు దేశాలు- అమెరికా, చైనా, రష్యా కలిసి మొత్తం 1480 బిలియన్ డాలర్లు, లేదా ప్రపంచం మొత్తం వ్యయంలో 51 శాతం ఖర్చు చేశాయి. 2026 ఏప్రిల్ 27న ప్రచురించిన నివేదికలో సిప్రి ఆయుధ బదిలీల డేటాబేస్‌లో 1950-2025 మధ్య కాలానికి సంబంధించిన ప్రధాన ఆయుధాల బదిలీలపై నవీకరించిన డేటా ప్ర‌క‌టించింది. ఈ కొత్త డేటా ఆధారంగా, ఈ ఫ్యాక్ట్ షీట్.. ఆయుధాల ఎగుమతులు, దిగుమతుల లోని కీలక ధోరణులను  అందిస్తుంది.

            భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరిగే కొద్దీ అనేక దేశాలు ఆధునిక ఆయుధ వ్యవస్థల కోసం అమెరికా వైపు చూస్తున్నాయి. విశేషమేమంటే.. తగాదా పడే రెండు పక్షాలకూ అమెరికానే ఆయుధాలు సరఫరా చేస్తుంది. ప్రపంచ వ్యాపితంగా ఆయుధాలు అమ్ముకుని బ‌తుకుతున్న ఆయుధ బేహరుల్లో అమెరికా మొదటి స్థానం ఆక్రమిస్తున్నది. 2021-2025 మధ్య ప్రపంచ వ్యాపితంగా అమ్ముడైన ఆయుధాల్లో 42 శాతాన్ని అమెరికానే అమ్మింది. దాని తరువాతి స్థానంలో ఫ్రాన్స్, రష్యా, జర్మనీలు నిలుస్తున్నాయి. ఫ్రాన్స్ 10 శాతం, రష్యా 7 శాతం ఆయుధాలు అమ్ముతున్నాయి. జర్మనీ ఇటీవలనే ఆయుధాల అమ్మకంలో చైనా 6 శాతాన్ని మించిపోయి నాలుగో స్థానంలోకి చేరింది. దక్షిణ కొరియా ప్రపంచ వ్యాపితంగా ఆధునిక ఆయుధ  వ్యవస్థల ఎగుమతుల్లో శీఘ్రంగా అభివృద్ధి చెందుతున్నది. ఇటలీ(5), ఇజ్రాయెల్(4), బ్రిటన్ (3), దక్షిణ కొరియా(3), స్పెయిన్ (2) శాతాలు చొప్పున ఆయుధాలు అమ్ముతున్నాయి. ఇవి కాకుండా ప్రపంచంలోని ఇతర దేశాలన్నీ కలిసి 12 శాతం ఆయుధాలను ఎగుమతి చేస్తున్నాయి.

            ప్రపంచ వ్యాపితంగా ఆయుధాల ఉత్పత్తి, ఎగుమతి, దిగుమతులపై పరిశోధన చేసే సంస్థ ‘సిప్రి’ ప్ర‌కారం.. పశ్చిమార్ధగోళంలో ఆధిపత్యాన్ని కొనసాగించడానికి, ఇండో-పసిఫిక్‌లో చైనాను నిరోధించడానికి, అమెరికా అణు, సంప్రదాయ సైనిక సామర్థ్యాలు రెండింటిలోనూ పెట్టుబడులను పెంచింది. ఇవి కొత్త జాతీయ భద్రతా వ్యూహం యొక్క కీలక లక్ష్యాలు. ‘2026 కోసం అమెరికా కాంగ్రెస్ ఆమోదించిన వ్యయం ఒక‌ ట్రిలియన్ డాలర్లకు పైగా పెరిగింది. ఇది 2025తో పోలిస్తే గణనీయమైన పెరుగుదల. ఒకవేళ అధ్యక్షుడు ట్రంప్ తాజా బడ్జెట్ ప్రతిపాదన ఆమోదం పొందితే, 2027 నాటికి ఇది మరింతగా 1.5 ట్రిలియన్ డాలర్లకు పెరిగే అవకాశం ఉంది.

            2025లో ప్రపంచవ్యాప్తంగా సైనిక వ్యయం పెరగడానికి ప్రధాన కారణం, యూరప్‌లో వ్యయం 14 శాతం పెరిగి 864 బిలియన్ డాలర్లకు చేరడమే. యుక్రెయిన్‌లో యుద్ధం నాలుగో సంవత్సరంలోకి అడుగుపెట్టిన ప‌రిస్థితుల్లో రష్యా, యుక్రెయిన్‌ల వ్యయం పెరుగుతూనే ఉంది. అదే సమయంలో, యూరోపియన్ నాటో సభ్య దేశాలు కొనసాగిస్తున్న పునరాయుధీకరణ ప్రయత్నాల వల్ల, ప్రచ్ఛన్న యుద్ధం ముగిసిన తర్వాత మధ్య, పశ్చిమ యూరప్‌లో వ్యయం వార్షికంగా అత్యంత వేగంగా పెరిగింది. 2025లో రష్యా సైనిక వ్యయం 5.9 శాతం పెరిగి 190 బిలియన్ డాలర్లకు చేరుకుంది. దీంతో దాని సైనిక భారం జిడిపిలో 7.5 శాతానికి చేరింది. సిప్రి అంచనా ప్రకారం,  29 యూరోపియన్ నాటో సభ్య దేశాలు 2025లో  సంయుక్తంగా మొత్తం 559 బిలియన్ డాలర్లు ఖర్చు చేశాయి. వాటిలో 22 దేశాలు తమ జిడిపిలో కనీసం 2.0 శాతం సైనిక వ్యయాన్ని కలిగి ఉన్నాయి. ఈ కూటమిలో జర్మనీ అతిపెద్ద సైనిక వ్యయదారుగా నిలిచింది. దాని వ్యయం ఏటా 24 శాతం పెరిగి 114 బిలియన్ డాలర్లకు చేరుకుంది.

            సాయుధ సంఘర్షణ, సైనికవ్యయం, ఆయుధాల వ్యాపారంతో పాటు నిరాయుధీకరణ, ఆయుధ నియంత్రణ కోసం డేటా, విశ్లేషణ, సిఫార్సులను సిప్రీ అందిస్తుంది. ఈ పరిశోధ‌న బహిరంగ వనరులపై ఆధారపడి ఉంటుంది. ఇది నిర్ణయాధికారులు, పరిశోధకులు, మీడియా ఆసక్తి గల ప్రజల కోసం ఉద్దేశించ బడింది. మార్చి 2026 సిప్రి  నివేదిక ప్రపంచవ్యాప్త ఆయుధ బదిలీలలో సుమారు 10శాతం పెరుగుదలను వెల్లడించింది. ఈ పెరుగుదలకు యూరోపియన్ యూనియన్ డిమాండ్ ప్రధాన కారణం. అమెరికా అగ్రగామి ఎగుమతిదారుగా (43శాతం వాటాతో) తన స్థానాన్ని సుస్థిరం చేసుకోగా, ఫ్రాన్స్ రష్యాను అధిగమించి రెండవ అతిపెద్ద ఎగుమతిదారుగా అవతరించింది. దిగుమతులలో 9.3 శాతం తగ్గుదల ఉన్నప్పటికీ, యుక్రెయిన్ ప్రపంచంలో మొదటి అతిపెద్ద దిగుమతిదారుగా ఉంది. ఆ తర్వాత ఎప్పుడూ శాంతి జపం చేసే భారతదేశం  రెండవ అతిపెద్ద ఆయుధ  దిగుమతిదారుగా నిలువ‌టం గ‌మ‌నార్హం.

            ప్రపంచానికి శాంతి, ప్రజాస్వామ్యం అంటూ ఉపన్యాసాలు ఇస్తూనే, మరోవైపు యుద్ధాలను లాభాల మార్కెట్‌గా మలుచుకుని ఆయుధాల అమ్మకాలతో ఆర్థిక ఆధిపత్యాన్ని కాపాడుకోవడం అమెరికా అసలు వ్యూహం.  ఒకదేశంలో చిచ్చు రాజేస్తే మరో ఖండంలో తన స్టాక్ మార్కెట్ ఎగిసేలా

 ‘ప్రాక్సీ వార్ ‘లను పెట్టుబడిగా మార్చుకుంటున్న అగ్రరాజ్యం, మానవత్వం కంటే మిలిటరీ వ్యాపారానికే పెద్దపీట వేస్తోంది. శాంతి నినాదం వెనుక యుద్ధ వ్యాపార రాజకీయాలు, ప్రాక్సీ వార్ ల‌తో  లాభాల పంట కోస్తున్న అగ్రరాజ్యం అమెరికా. ఈ క్ర‌మంలో ఆయుధాల అమ్మకాలే అమెరికా ఆర్థిక బలంగా మనం గమనిస్తూనే ఉన్నాం.

            యుద్ధం లేకపోతే అమెరికాకు మనుగడ లేదు. అందుకే ఒకవేళ ప్రపంచంలో శత్రువు లేకపోతే, తన ఆయుధాలు అమ్ముకోవడం కోసం ఒక కొత్త శత్రువును తానే సృష్టించి, ప్రపంచానికి విలన్‌గా పరిచయం చేస్తుంది. అమెరికా నేరుగా యుద్ధ రంగంలోకి దిగదు, కానీ యుద్ధం ఆగిపోనివ్వదు. దీనినే ఆ దేశం ‘ప్రాక్సీ వార్’ అని పిలుచుకుంటుంది. రష్యాను దెబ్బకొట్టడానికి యుక్రెయిన్‌ను ఒక పావుగా వాడుకుంటూ, వేలకోట్ల విలువైన ఆయుధాలను సరఫరా చేస్తోంది. దీనివల్ల యుక్రెయిన్ నాశనమవు తున్నా, అమెరికా ఆయుధాల కంపెనీల లాభాలు మాత్రం ఆకాశాన్ని తాకుతున్నాయి. అమెరికా తన యుద్ధోన్మాదంతో ప్రపంచ దేశాలపై రాజకీయ, ఆర్థిక, సాంకేతిక, సాంస్కృతిక, సాయుధ అణచివేతలకు పాల్పడుతున్న‌ది. ప్రపంచ శాంతిని కాపాడాల్సిన ఐక్యరాజ్యసమితి, నేడు అమెరికా చేతిలో ఒక కీలు బొమ్మ అయ్యింది. ఏ తీర్మానాన్ని అయినా అమెరికా తన ‘వీటో’ అధికారంతో తొక్కిపెడుతుంది.

            తనను తాను ‘ప్రజాస్వామ్య రక్షకురాలు’గా, ‘శాంతి కాపాలాదారు’గా చిత్రించుకునే అమెరికా అసలు రంగు యుద్ధం. అగ్రరాజ్యం అమెరికాకి ఆయుధమే ఆహారం. లెనిన్ అన్నట్లు “యుద్ధం లేకుండా సామ్రాజ్యవాదం మనగలుగదు”. అందువల్ల అమెరికా రాజ్యానికి యుద్ధమే పెట్టుబడి. ఆ దేశపు ఆర్థిక వ్యవస్థ చమురుతో కాదు, ఇతర దేశాల్లో చిందే రక్తంపై, ఆయుధాల అమ్మకాలపై ఆధారపడి నడుస్తోంది. శాంతిమంత్రం పైకి జపిస్తూనే, లోపల యుద్ధతంత్రాన్ని నడిపే అమెరికా వైఖరి మానవజాతికే కళంకం. ‘అమెరికా ఆయుధాలు తింటోంది’ అనేది నేడు ఒక చేదు నిజం. అంటే.. అది కేవలం లోహపు ముక్కలను మింగడం కాదు, కోట్లాదిమంది అమాయకుల కలలను, పసిపిల్లల భవిష్యత్‌ను, స్వతంత్ర దేశాల సార్వభౌమత్వాన్ని నమిలి మింగుతోంది.

            అమెరికాకు శాంతి అంటే ఒక నినాదం మాత్రమే. కానీ యుద్ధం అంటే ఒక భారీ లాభదాయకమైన వ్యాపారం. ప్రపంచ దేశాల మధ్య  చిచ్చు పెట్టడం, ఆ మంటల్లో తన ఆయుధాల ఫ్యాక్టరీలలో లాభాలు పోగేసుకోవ‌టం ఆ దేశానికి వెన్నతో పెట్టిన విద్య. ఒక దేశంపై బాంబులు కురిపించాలన్నా, మరో దేశపు సార్వభౌమత్వాన్ని కాలరాయాలన్నా అమెరికాకు కావాల్సింది ‘ప్రజాస్వామ్య రక్షణ’ అనే ఒక అబద్ధపు సాకు. ఆ దేశపు క్షిపణులపై రాసి ఉండేది శాంతి సందేశం కాదు, రాబోయే వినాశనం తాలూకు ధర. ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా, అది అమెరికా స్టాక్ మార్కెట్‌కు పండుగే. స్మశానాల  సౌధాలు నిర్మించుకునే వికృత ఆర్థిక వ్యవస్థ అమెరికాది. డాలర్ విలువ పెరగాలంటే మరో దేశం రణరంగం కావాల్సిందే. పశ్చిమాసియా నుంచి ఐరోపా వరకు అమెరికా వేసిన ప్రతి అడుగు వెనుక చమురు వేట, ఆయుధాల అమ్మకం తప్ప మ‌రేమీ ఉండ‌దు. అమెరికా ప్ర‌తి అడుగులో మానవత్వం ఎక్కడా కనిపించదు. మందుగుండు సామాగ్రిని అమ్మడం కోసం శత్రువులను సృష్టించడం, ఆపై మధ్యవర్తిగా నటిస్తూ ఇరుపక్షాల రక్తాన్ని పీల్చడం ఇదే వాషింగ్టన్ అనుసరిస్తున్న అసలైన ‘వ్యూహం. అమెరికా ఆర్థిక వ్యవస్థకు యుద్ధం అనేది ఒక  ‘లైఫ్ సపోర్ట్’ లాంటిది. అది ఆగిపోతే ఆ దేశపు జిడిపి వెంటిలేటర్ మీదకు వెళ్తుంది. లాక్ హీడ్ మార్టిన్, బోయింగ్, రేథియాన్ వంటి సంస్థల షేర్లు పెరగాలంటే మరో దేశంలో పసిపిల్లల హాహాకారాలు వినిపించాలి. మ‌నుషులు శ‌వాల గుట్ట‌లుగా మారాలి.

            ఇవాళ ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చితి, ప్రాంతీయ సంఘర్షణలు, అణ్వస్త్ర హుంకరింపులు పెరిగి పోయాయి. అమెరికా రౌడీ ట్రంప్ పెడపోకడలతో  పలు దేశాలు రక్షణ రంగానికే ఎక్కువ‌ ప్రాధాన్యం ఇస్తున్నాయి. భారత్ ‘ఆపరేషన్ సిందూర్‌’ తరువాత రక్షణ రంగ బలోపేతానికి భారత ప్రభుత్వం సైతం గట్టిగా సంకల్పించింది. 2024-25 నాటికి ప్రపంచ రక్షణ వ్యయం రికార్డు స్థాయికి 2718 బిలియన్ డాలర్లకు చేరుకుంది. రష్యా-యుక్రెయిన్, ఇజ్రాయెల్ – గాజా వంటి సంఘర్షణలు దీనికి గణనీయంగా దోహదపడ్డా యి. 2025లో జరిగిన రష్యా-, ఇజ్రాయెల్-ఇరాన్ వంటి కొత్త యుద్ధాలు ఈ వ్యయాన్ని మరింత పెంచుతా యని అంచనా. ప్రచ్ఛన్న యుద్ధం కాలంలో సైనిక వ్యయం గరిష్ట స్థాయికి చేరుకుంది. 1998 నాటికి అది 2.1 శాతం ఉండగా 2015లో 2.3 శాతంగా ఉంది, 2024 నాటికి మళ్లీ 2.5 శాతంకి పెరిగింది.

            ప్రపంచవ్యాప్తంగా ఆయుధ పోటీ నానాటికీ పెరిగిపోతోంది. ప్రత్యేకించి గడచిన 11 సంవత్సరాలుగా ప్రపంచదేశాల్లో రక్షణ వ్యయం భారీగా పెరుగుతూ వస్తోంది. గత ఏడాది ఆయుధ వ్యయం 2.90 ట్రిలియన్ డాలర్లుగా లెక్క తేల్చారు. అభద్రత, పునరాయుధీకరణ వంటి పరిస్థితుల వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఆయుధాల తయారీ, రక్షణ బడ్జెట్ భారీగా పెరుగుతోందని పరిశోధకులు తమ నివేదిక-2025లో తెలియజేశారు. అమెరికా, రష్యా, చైనా మూడు దేశాల ఆయుధ వ్యయాన్ని కలిపిచూస్తే 1.48 ట్రిలియన్ డాలర్లుగా ఉన్న‌ది. ఇది ప్రపంచ వ్యయంలో సగానికి పైగా ఉందని నివేదిక తెలిపింది. “ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తతలు పెరిగాయి, పరస్పర బెదిరింపు చర్యలు, దాడులు పెరిగాయి. గడచిన మూడు సంవత్సరాలుగా ప్రాంతీయ స్థాయిలో ఉద్రిక్తతలు కొనసాగు తున్నాయి. కొత్త సంవత్సరంలో ఈ ఉద్రిక్తతలు మరింతగా పెరిగాయి. 

            2026-27 రక్షణ బడ్జెట్‌ను అనూహ్యంగా పెంచడం, రఫేల్ యుద్ధవిమానాలు, సముద్ర నిఘా విమానాల కొనుగోలుకు పూనుకోవడమే ఇందుకు నిదర్శనం. ఈసారి కేంద్ర బడ్జెట్ లో రక్షణ శాఖకు కేటాయింపులు దాదాపు 15శాతం పెంచ‌టంతో  రూ.1.09 బిలియర్లకు చేరింది. సుమారు రెండు దశాబ్దాల తరువాత రక్షణ పద్దులో రెండంకెల వృద్ధి సాధ్యమైంది. కొత్త ఆయుధాల కొనుగోలుకు ఉద్దేశించిన మూలధన వ్యయం కింద కేటాయింపులనూ పెంచారు. మూలధన వ్యయంలో 75 శాతాన్ని దేశీయ పరిశ్రమల నుంచి కొనుగోళ్లకు ప్రత్యేకించడం విశేషం. ఆపరేషన్ సిందూర్ పరిణామాలు సైనిక ఆధునికీకరణ, స్మార్ట్ ఆయుధాల సేకరణ, మెరుగైన పోరాట సన్నద్ధతలకు మును పెన్నడూ లేని స్థాయిలో ప్రాధాన్యం పెరిగింది. ‘సిప్రి’ అంచనాల ప్రకారం, రక్షణకు ఎక్కువగా ఖర్చు చేస్తున్న దేశాల్లో భారత్ అయిదోది. అయితే ఆ వ్యయం ప్రస్తుత దేశ అవసరాల స్థాయిని ప్రతిబింబించడం లేదన్న విమర్శ కూడా ఉంది. చైనా సైనిక ఆధునికీకరణ వేగం కారణంగా, మన రక్షణ పద్దును గణనీయంగా పెంచుకుంటూ పోతున్నారు.

2025లో పది దేశాలరక్షణ బడ్జెట్లు(బిలియన్‌లో) :

1. యునైటెడ్ స్టేట్స్: 831.5 బిలియన్ డాలర్లు

2. చైనా: 303 బిలియన్ డాలర్లు

3. రష్యా: 212.6 బిలియన్ డాలర్లు

4. జర్మనీ: 127.4 బిలియన్ డాలర్లు

5. భారతదేశం: 109 బిలియన్ డాలర్లు

6. యూకె(బ్రిటన్): 88.5 బిలియన్ డాలర్లు

7. ఫ్రాన్స్: 67.2 బిలియన్ డాలర్లు

8. సౌదీ అరేబియా: 64 బిలియన్ డాలర్లు

9. జపాన్ : 58 బిలియన్ డాలర్లు

10. ఆస్ట్రేలియా: 57.4 బిలియన్ డాలర్లు

            అణ్వాయుధాలు కలిగి ఉన్న తొమ్మిది దేశాలు (అమెరికా, రష్యా, యూకే, ఫ్రాన్స్, చైనా, ఇండియా, పాకిస్తాన్, ఉత్తర కొరియా, ఇజ్రాయెల్) తమ అణ్వాయుధాలను ఆధునికీకరించుకోవడం కొనసాగించాయి. జనవరి 2026 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న మొత్తం అణ్వాయుధాల నిల్వ సుమారుగా 12,121 కాగా, వాటిలో దాదాపు 9,585 సైనిక నిల్వలలో ఉన్నాయి. సుమారు 2,100 వార్‌హెడ్‌లను ప్రధానంగా రష్యా, అమెరికాలు క‌లిగి ఉండ‌గా, తొలిసారిగా చైనా కూడా కొన్ని వార్‌హెడ్‌లను స‌న్న‌ద్ధం చేసుకుంటున్న‌ది.

            రష్యా, అమెరికా కలిసి ప్రపంచంలోని మొత్తం  అణ్వాయుధాలలో దాదాపు 90 శాతాన్ని కలిగి ఉన్నా యి.  జనవరి 2024 నాటికి చైనా తన అణ్వాయుధాలను 410 నుండి 500కు గణనీయంగా పెంచుకుంది. మరే ఇతర దేశం కంటే వేగంగా తన అణ్వాయుధాలను చైనా విస్తరిస్తోంది. ఉత్తరకొరియా వద్ద సుమారు 50 వార్‌హెడ్‌లకు 90 వరకు సరిపోయే సామాగ్రి ఉన్నాయి. ఇజ్రాయెల్ తన ఆయుధాగారాన్ని ఆధునీకరిస్తూ, ఫ్లూటోనియం ఉత్పత్తి సామర్థ్యాలను పెంచుకుంటోంది.  జనవరి 2024 నాటికి భారతదేశం వద్ద 172 అణ్వాయుధాలు ఉన్నాయి. ఈ విషయంలో అది ప్రపంచవ్యాప్తంగా 6వ స్థానంలో ఉంది. పాకిస్తాన్ (170) కంటే ముందుంది. అంతేకాకుండా, చైనాను లక్ష్యంగా చేసుకున్న సుదూర సామర్థ్యపు ఆయుధాలపై  భారతదేశం దృష్టి సారిస్తోంది.

            పపంచ దేశాల సైనిక వ్యయం విపరీతంగా పెరుగుతున్నది. ప్రజలకు కావల్సింది అన్న-వస్త్రాలు, వాతావరణ పరిరక్షణ కాని ఆయుధాలు, అణ్వాస్త్రాలు కాదు. ప్రపంచవ్యాప్తంగా సంక్షేమ వ్యయం అనేది పౌరుల సామాజిక, ఆర్థిక భద్రతను నిర్ధారించడానికి ప్రభుత్వాలు చేసే అత్యంత ముఖ్యమైన వ్యయం. సామాజిక భద్రత, ఆహారం, నివాసం, ఆరోగ్య సంరక్షణ వంటి ప్రాథమిక అవసరాలను తీర్చడం దీని ప్రధాన లక్ష్యం. అయితే రోజు రోజుకు సైనిక వ్యయం పెరిగిపోతుండడంతో ప్రజాసంక్షేమ వ్యయం కుదించు కు పోతుంది. ప్రపంచ సైనిక ఎదుగుదల శాంతికి, ప్రజా సంక్షేమ వ్యయానికి ముప్పు కలిగిస్తున్న‌ది. ప్రపంచ పేదరిక నిర్మూలనకు ఏటా 70 బిలియన్ డాలర్ల నుండి 3,254 బిలియన్ల డాలర్ వరకు అవసరం. ఇది అధిక ఆదాయ దేశాల ఆదాయంలో ఒక చిన్న భాగం మాత్రమే. అయినప్పటికీ, పెరుగుతున్న సైనిక బడ్జెట్లు ఆరోగ్య సంరక్షణ, విద్య వంటి అత్యవసర సేవల నుండి వనరులను మళ్లిస్తుండ‌ట‌మే నేటి దుర్నీతి.

Leave a Reply