అడవితల్లీ
ఇప్పుడు తల్లికోడి నీవేనమ్మా
పచ్చనాకు రెక్కలిప్పి
పిల్లల్ని కాపాడుకునే బాధ్యత నీదేనమ్మా
కార్పొరేట్ డేగ
నీ కాళ్ళకింది మట్టి మణుల మీద కన్నేసింది
పార్లమెంటు
అధికార తట్టలతో ఎత్తి
అంబానీ ఆదానీ
పొట్ట గుంపొట్టలు నింపాలని చూస్తుంది
నీ పిల్లలే కదమ్మా
నేలకు నెత్తురద్ది కాపాడుతుంది
నీ కాళ్ళ కింది మట్టి చెట్టును
చిప్కో అని హత్తుకొని బహుగుణలయ్యింది
అందుకే తల్లీ
వాడు నీ బిడ్డల్ని వేటాడుతుంది
రెక్కలు కత్తిరించి నేలకు విసిరికొడుతుంది
ఇంద్రావతేకాదు
గోదారి నిండా ప్రవహించేది
నీ బిడ్డల రక్తమేనమ్మా
అబూజ్మాడ్ లోనే కాదు
ఇవ్వాల కర్రిగుట్టల నిండా
ఖాకీ తుపాకీ చూపుల డ్రోన్లు
పాపం! బిడ్డలు
ఏం తిన్నారో! ఎప్పుడు తిన్నారో
పిడచగట్టిన నాలుక దగ్గరా ఖాకీ తుపాకీ కాపు కాస్తుందమ్మా
చెట్టూ పుట్టా గుట్టా
వాగూ వంకా వనమూ
శత్రువు కంటపడకుండా
కాయో పండో దాచి కడుపునింపమ్మా
దాచుకున్న చెలిమె చెంబులను
నీ బిడ్డల నోటికందించమ్మా
కంగారు పడకు తల్లీ
వాడి కగార్ ఆపరేషన్ హత్యాకాండ వికటించక తప్పదు
వాడి డెడ్లైన్ డెడ్ బాడీలూ కుళ్ళిపోక తప్పదు
బిడ్డలు రాలిన చోటల్లా
పురుడోసుకుంటున్న తల్లికోళ్లు.
