అరణ్యమిప్పుడు ఒక్కసారిగా
చిన్నబోయింది
అతని కవాతు ధ్వని వినపడక
అతని కోసం ఎదురు చూస్తూ
తెల్ల మద్దె చెట్టు బోసిపోయింది
కాసింత విశ్రాంతి తీసుకునే
చోటును కదా అని
నెత్తురు ముద్దయిన అతని దేహాన్ని చూసి
పక్షులన్నీ రెక్కలు తెగినట్లుగా
గూటిని దాటి రాలేక రోదిస్తున్నాయి
అతని పాఠం వినిపించక
తరగతి గది మూగపోయింది
అతని దేహాన్ని స్పృశిస్తూ
నెత్తురంటిన వెన్నెల ముఖం
రంజాన్ మాసపు దుఃఖపు
ఆజాలో గొంతు కలిపింది
చావు ఎదుట పడినా తన నిబ్బరాన్ని చూసి
నిట్ట నిలువునా కుంగిపోయాయి
బైలదిల్లా పర్వత సానువులు
మనందరి ఆదరువుగా మరలా
అతను రోజూ ఉదయిస్తూనే వుంటాడు
తరాలపల్లి తరతరాల వారసునిగా
(అమరుడు కామ్రేడ్ సారయ్య @ సుధాకర్ స్మృతిలో)
27-3-2025
Related